కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాయే రాజు

యెహోవాయే రాజు

ఇరవయ్యవ అధ్యాయం

యెహోవాయే రాజు

యెషయా 24:​1-23

1, 2. (ఎ) యెహోవా ఎవరిపై తన ఆగ్రహాన్ని వెళ్లగ్రక్కుతాడు? (బి) యూదా శిక్షించబడకుండా మినహాయించబడుతుందా, అది మనకెలా తెలుసు?

 బబులోను, ఫిలిష్తియ, మోయాబు, సిరియా, ఇతియోపియా, ఐగుప్తు, ఎదోము, తూరు, అష్షూరు​—⁠వీటన్నిటిపై యెహోవా తన ఆగ్రహాన్ని వెళ్లగ్రక్కుతాడు. ఈ శత్రు రాజ్యాలకు, నగరాలకు సంభవించే విపత్తుల గురించి యెషయా ప్రవచించాడు. అయితే, యూదా విషయమేమిటి? యూదా నివాసులు తమ పాపభరితమైన మార్గాలను బట్టి శిక్షించబడకుండా మినహాయించబడతారా? మినహాయించబడరని ప్రతిధ్వనించేలా చరిత్ర వృత్తాంతం సమాధానం ఇస్తోంది!

2 ఇశ్రాయేలు పది-గోత్రాల రాజ్యానికి రాజధాని అయిన షోమ్రోనుకు ఏమి జరిగిందో పరిశీలించండి. ఆ రాజ్యం దేవునితో తన నిబంధనకు తగిన విధంగా ఉండలేదు. తన చుట్టూ ఉన్న రాజ్యాల అవాచ్య ఆచారాలకు అది దూరంగా ఉండలేదు. బదులుగా, షోమ్రోను నివాసులు, “చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి[రి.] . . . కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టెను.” బలవంతంగా తమ దేశంలో నుండి వెళ్ళగొట్టబడిన ఇశ్రాయేలు “వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశములోనికి చెరగొని పోబడిరి.” (2 రాజులు 17:9-12, 16-18, 23; హోషేయ 4:​12-14) ఇశ్రాయేలుకు సంభవించినది, దాని తోబుట్టువైన యూదా రాజ్యానికి కీడును సూచిస్తోంది.

యూదా నాశనం గురించి యెషయా ప్రవచిస్తాడు

3. (ఎ) యెహోవా రెండు-గోత్రాల యూదా రాజ్యాన్ని ఎందుకు విడిచిపెడతాడు? (బి) యెహోవా ఏమి చేయడానికి నిశ్చయించుకున్నాడు?

3 యూదా రాజులు కొందరు నమ్మకంగానే ఉన్నారు గానీ వారిలో ఎక్కువమంది నమ్మకంగా ఉండలేదు. యోతాము వంటి నమ్మకమైన రాజు క్రింద కూడా ప్రజలు అబద్ధ ఆరాధనను పూర్తిగా విడిచిపెట్టలేదు. (2 రాజులు 15:​32-35) యూదా దుష్టత్వం, రక్తపిపాసియైన మనష్షే రాజు పరిపాలనా కాలంలో పరాకాష్ఠకు చేరుకుంది, యూదుల సాంప్రదాయం తెలియజేస్తున్నదాని ప్రకారం, ఈ రాజు నమ్మకమైన ప్రవక్త అయిన యెషయాను రంపములతో కోయించాలని ఆజ్ఞాపించి హతమారుస్తాడు. (హెబ్రీయులు 11:37 పోల్చండి.) ఈ దుష్ట రాజు “యూదావారిని యెరూషలేము కాపురస్థులను మోసపుచ్చినవాడై, ఇశ్రాయేలీయులయెదుట ఉండకుండ యెహోవా నశింపజేసిన అన్యజనులకంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించునట్లు చేయుటకు కారకుడాయెను.” (2 దినవృత్తాంతములు 33:9) మనష్షే పరిపాలనా కాలంలో, దేశం కనానీయుల ఆధిపత్యం క్రింద ఉన్నప్పటి కంటే ఎక్కువగా కలుషితమవుతుంది. కాబట్టి, యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “వినువాని రెండు చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు[న్నాను]. . . . ఒకడు పళ్లెమును తుడుచునప్పుడు దాని బోర్లించి తుడుచునట్లు నేను యెరూషలేమును తుడిచి వేసెదను. మరియు నా స్వాస్థ్యములో శేషించినవారిని నేను త్రోసివేసి వారి శత్రువులచేతికి వారిని అప్పగించెదను. వారు . . . నా దృష్టికి కీడుచేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరిచేత దోచబడి నష్టము నొందుదురు.”​—⁠2 రాజులు 21:11-15.

4. యెహోవా యూదాకు ఏమి చేస్తాడు, ఈ ప్రవచనం ఎలా నెరవేరుతుంది?

4 పళ్లెములో ఉన్నదంతా పడిపోయేలా బోర్లించిన పళ్లెములా, దేశంలో నుండి దాని నివాసులందరూ నిర్మూలించబడతారు. యూదా యెరూషలేములపైకి రానున్న ఈ నాశనం మళ్లీ యెషయా ప్రవచించే అంశం అవుతుంది. ఆయనిలా ప్రారంభిస్తున్నాడు: “ఆలకించుడి! యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.” (యెషయా 24:1) నెబుకద్నెజరు రాజు అధ్వర్యంలో బబులోను సైన్యాలు యెరూషలేముపై దాడిచేసి దాని ఆలయాన్ని నాశనం చేసినప్పుడు, యూదా నివాసులు ఖడ్గం, కరవు, రోగాల మూలంగా అత్యధికసంఖ్యలో నిర్మూలించబడినప్పుడు ఈ ప్రవచనం నెరవేరింది. పై మూడింటిని తప్పించుకున్న యూదుల్లో అత్యధికులు బబులోనుకు బంధీలుగా తీసుకువెళ్లబడతారు, మిగిలిపోయిన కొద్దిమంది ఐగుప్తుకు పారిపోతారు. అలా యూదా దేశం ధ్వంసమైపోయి, పూర్తిగా నిర్జనమైపోతుంది. చివరికి పెంపుడు జంతువులు కూడా మిగలవు. విడిచిపెట్టబడిన దేశం, కేవలం క్రూరమృగాలు, పక్షులు నివసించే పాడుబడిన శిథిలాలతో, ఎడారిగా మారుతుంది.

5. ఎవరైనా యెహోవా తీర్పు నుండి మినహాయించబడతారా? వివరించండి.

5 రానున్న తీర్పు సమయంలో, యూదాలో ఎవరైనా ప్రత్యేకమైన అభిమానాన్ని పొందగలుగుతారా? యెషయా ఇలా సమాధానం ఇస్తున్నాడు: “ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును; దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును; దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును; కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును; అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొనువారికి కలుగును; వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్లసొమ్మగును. యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు.” (యెషయా 24:​2, 3) అందరినీ సమదృష్టితో చూడడం జరుగుతుంది, సంపదలున్నంత మాత్రాన, ఆలయ సేవాధిక్యతలు ఉన్నంత మాత్రాన ఎక్కువ అభిమానం చూపించబడదు. ఏ మినహాయింపులూ చేయబడవు. దేశం ఎంతగా భ్రష్టుపట్టిందంటే, జీవించివున్న ప్రతి ఒక్కరూ అంటే, యాజకులు, సేవకులు, యజమానులు, కొనేవారు, అమ్మేవారు అందరూ చెరలోకి వెళ్లవలసిందే.

6. యెహోవా ఏ పరిస్థితుల్లో దేశాన్ని ఆశీర్వదించకుండా ఉంటాడు?

6 ఎటువంటి అపార్థమూ ఏర్పడకూడదని, యెషయా రానున్న ఈ నాశనపు సంపూర్ణతను వర్ణిస్తూ, దానికి కారణాన్ని ఇలా వివరిస్తున్నాడు: “దేశము వ్యాకులముచేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖముచేత క్షీణించిపోవుచున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించి యున్నారు కట్టడను మార్చి నిత్యనిబంధనను మీరియున్నారు. దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనము చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు.” (యెషయా 24:​4-6) ఇశ్రాయేలీయులకు కనాను దేశం ఇవ్వబడినప్పుడు, అది “పాలు తేనెలు ప్రవహించు దేశము”గా ఉంది. (ద్వితీయోపదేశకాండము 27:3) అయినా, వారు యెహోవా ఆశీర్వాదంపై ఎడతెగక ఆధారపడ్డారు. వారు నమ్మకంగా ఆయన కట్టడలను, ఆజ్ఞలను అనుసరిస్తే, భూమి “పంటలనిచ్చును,” కానీ వారు ఆయనిచ్చిన సూత్రాలను, ఆజ్ఞలను ఉద్దేశపూర్వకంగా మీరితే, భూమిని సాగుచేయడానికి వారు చేసే ప్రయత్నాలు ‘ఉడిగిపోతాయి,’ భూమి ‘ఫలింపదు.’ (లేవీయకాండము 26:3-5, 14, 15, 20) యెహోవా శాపం ‘దేశాన్ని నాశనం చేస్తుంది.’ (ద్వితీయోపదేశకాండము 28:15-20, 38-42, 62, 63) యూదా ఇప్పుడు ఆ శాపం అనుభవించడానికి సిద్ధమవ్వాలి.

7. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్ర నిబంధన ఎలా ఒక ఆశీర్వాదం కాగలదు?

7 యెషయా కాలానికి దాదాపు 800 సంవత్సరాల క్రితం, ఇశ్రాయేలీయులు ఇష్టపూర్వకంగా యెహోవాతో ఒక నిబంధనా సంబంధంలోకి ప్రవేశించి, దానికి కట్టుబడి ఉండడానికి అంగీకరించారు. (నిర్గమకాండము 24:​3-8) ఆ ధర్మశాస్త్ర నిబంధన షరతుల ప్రకారం, వారు యెహోవా ఆజ్ఞలకు విధేయులైతే ఆయన వారిని గొప్పగా ఆశీర్వదిస్తాడు, కానీ ఒకవేళ వారు నిబంధనను మీరితే, వారు ఆయన ఆశీర్వాదాన్ని కోల్పోయి, తమ శత్రువులచే చెరగా కొనిపోబడతారు. (నిర్గమకాండము 19:5, 6; ద్వితీయోపదేశకాండము 28:​1-68) మోషే ద్వారా ఇవ్వబడిన ఈ ధర్మశాస్త్ర నిబంధన, నిరవధికంగా, అనిర్దిష్ట కాలంపాటు అమలులో ఉండవలసి ఉంది. మెస్సీయ వచ్చేవరకు అది ఇశ్రాయేలీయులను కాపాడవలసి ఉంది.​—⁠గలతీయులు 3:19, 24.

8. (ఎ) ప్రజలు ఎలా ‘ధర్మశాసనములను అతిక్రమించారు,’ ‘కట్టడను మార్చారు’? (బి) ఏ యే విధాలుగా “గొప్పవారు” మొదట ‘క్షీణించిపోతారు’?

8 కానీ ప్రజలు “నిత్యనిబంధనను మీరియున్నారు.” వారు దేవుడిచ్చిన ధర్మశాసనములను అలక్ష్యం చేస్తూ వాటిని అతిక్రమించారు. యెహోవా ఇచ్చిన చట్టపరమైన అభ్యాసాలకు భిన్నమైన వాటిని అనుసరిస్తూ వారు ‘కట్టడను మార్చారు.’ (నిర్గమకాండము 22:25; యెహెజ్కేలు 22:​12) కాబట్టి, దేశంలో నుండి ప్రజలు నిర్మూలించబడతారు. రానున్న తీర్పులో ఏ మాత్రం కనికరం చూపించబడదు. యెహోవా తన కాపుదలను, అనుగ్రహాన్ని నిలిపివేసినందుకు, మొదటిగా ‘క్షీణించిపోయేది’ “గొప్పవారు,” అంటే రాజవంశీయులు. దీని నెరవేర్పుగా, యెరూషలేము నాశనం సమీపిస్తుండగా, మొదట ఐగుప్తీయులు ఆతర్వాత బబులోనీయులు యూదా రాజులను తమ సామంత రాజులుగా చేసుకుంటారు. ఆ తర్వాత, యెహోయాకీను రాజు, రాజకుటుంబంలోని ఇతర సభ్యులు మొదటగా బబులోనుకు చెరగా కొనిపోబడతారు.​—⁠2 దినవృత్తాంతములు 36:4, 9, 10.

దేశంలో సంతోషం లేకుండాపోతుంది

9, 10. (ఎ) ఇశ్రాయేలులో వ్యవసాయం ఏ పాత్ర నిర్వహిస్తుంది? (బి) ప్రతి ఒక్కరు ‘తన ద్రాక్షచెట్టు క్రిందను అంజూరపుచెట్టు క్రిందను కూర్చోవడం’ దేన్ని సూచిస్తుంది?

9 ఇశ్రాయేలు రాజ్యం వ్యవసాయం చేసుకునే సమాజం. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పటి నుండి, వారు పంటలు పండించుకుంటూ, పాడిపశువులు పెంచుకుంటూ అక్కడ స్థిరపడ్డారు. కాబట్టి, ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన శాసనంలో వ్యవసాయం ప్రాముఖ్యమైన స్థానం వహించింది. భూమి తిరిగి ఫలసామర్థ్యం పుంజుకునేలా ప్రతి ఏడవ సంవత్సరమున భూమికి తప్పనిసరిగా సబ్బాతు విశ్రాంతినివ్వాలని వారికి ఆజ్ఞాపించబడింది. (నిర్గమకాండము 23:10, 11; లేవీయకాండము 25:​3-7) జనాంగం జరుపుకోవాలని ఆజ్ఞాపించబడిన మూడు వార్షిక పండుగలు వ్యవసాయ సంబంధంగా ప్రాధాన్యతగల కాలాల్లోనే వచ్చేలా నిర్ణయించబడ్డాయి.​—⁠నిర్గమకాండము 23:14-16.

10 దేశమంతటా ద్రాక్షతోటలు విరివిగా ఉంటాయి. ద్రాక్షవల్లి నుండి ఉత్పత్తి చేయబడే ద్రాక్షారసాన్ని, “నరుల హృదయమును సంతోషపెట్టు,” దేవుడిచ్చిన బహుమానంగా లేఖనాలు పేర్కొంటున్నాయి. (కీర్తన 104:​15) ప్రతి ఒక్కరు ‘తన ద్రాక్షచెట్టు క్రిందను అంజూరపుచెట్టు క్రిందను కూర్చోవడం’ దేవుని నీతియుక్తమైన పరిపాలన క్రింద లభించే సమృద్ధిని, సమాధానాన్ని, భద్రతను సూచిస్తుంది. (1 రాజులు 4:25; మీకా 4:4) పుష్కలమైన ద్రాక్షపంట చేతికి రావడం, ఒక ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది, ఆ సమయంలో ప్రజలు ఆనందంతో పాటలు పాడతారు. (న్యాయాధిపతులు 9:27; యిర్మీయా 25:​30) దానికి భిన్నమైనది కూడా నిజమే. ద్రాక్షావల్లులు ఎండిపోయినప్పుడు లేక ద్రాక్షపంట సరిగా పండనప్పుడు, ద్రాక్షతోటలు ముళ్లపొదలు పెరిగే బంజరు భూముల్లా అయిపోతాయి, అది యెహోవా ఆశీర్వదించడం లేదన్న దానికి నిదర్శనం, అది ఎంతో దుఃఖించవలసిన సమయం.

11, 12. (ఎ) యెహోవా తీర్పు ఫలితంగా ఏర్పడే పరిస్థితుల గురించి యెషయా ఎలా వివరిస్తున్నాడు? (బి) ఎలాంటి నిరాశాజనకమైన పరిస్థితులను యెషయా వర్ణిస్తున్నాడు?

11 కాబట్టి, యెహోవా దేశాన్ని ఆశీర్వదించడం మానుకున్నప్పుడు ఏర్పడే పరిస్థితులను ఉదహరించడానికి యెషయా తగినవిధంగానే ద్రాక్షతోటలను, వాటి ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాడు: “క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది, సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను, ఉల్లసించువారి ధ్వని మానిపోయెను, సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు; పానము చేయువారికి మద్యము చేదాయెను. నిరాకారమైనపట్టణము నిర్మూలము చేయబడెను; ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడి యున్నది. ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతయు అస్తమించెను; దేశములో ఆనందము లేదు. పట్టణములో పాడు మాత్రము శేషించెను; గుమ్మములు విరుగగొట్టబడెను.”​—యెషయా 24:7-12.

12 తంబుర సితారాలు, యెహోవాను స్తుతించడానికీ ఆనందాన్ని వ్యక్తం చేయడానికీ ఉపయోగించే ఎంతో చక్కని సంగీత వాయిద్యాలు. (2 దినవృత్తాంతములు 29:25; కీర్తన 81:2) దైవిక శిక్ష విధించబడే ఈ సమయంలో వాటి సంగీతం వినిపించదు. ఆనందభరితమైన ద్రాక్షపంట ఉండదు. “గుమ్మములు విరుగగొట్ట”బడి, ఎవరూ ప్రవేశించలేని విధంగా ఇండ్లు “మూయబడి” ఉన్న యెరూషలేము యొక్క నిర్జన శిథిలాల్లో ఏ సంతోషభరితమైన శబ్దమూ వినిపించదు. సహజంగా ఎంతో ఫలప్రదమైన దేశ నివాసులకు ఎంత నిరాశాజనకమైన పరిస్థితులు రాబోతున్నాయి!

శేషించినవారు “బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు”

13, 14. (ఎ) కోత కోయడం గురించి యెహోవా నియమాలు ఏమిటి? (బి) కొంతమంది యెహోవా తీర్పును తప్పించుకొని జీవిస్తారనే విషయాన్ని వివరించడానికి యెషయా కోతకోయడానికి సంబంధించిన నియమాలను ఎలా ఉపయోగించుకున్నాడు? (సి) దుఃఖభరితమైన శ్రమకాలాలు రానున్నప్పటికీ, నమ్మకమైన యూదానివాసులు దేని గురించి నిశ్చయత కలిగి ఉండవచ్చు?

13 ఒలీవ పండ్లను కోసేందుకు, ఇశ్రాయేలీయులు సాధారణంగా చెట్లను కర్రలతో కొట్టి దులుపుతారు, అప్పుడు పండ్లు రాలి క్రిందపడతాయి. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం, మిగిలిపోయిన ఒలీవ పండ్లను కోసేందుకు వారు మళ్లీ చెట్ల కొమ్మల దగ్గరికి వెళ్లడం నిషేధించబడింది. ద్రాక్షపంట కోత ముగిసిన తర్వాత కూడా మిగిలి పోయిన ద్రాక్షాపండ్లను కోసుకునేందుకు వారు మళ్లీ వాటి దగ్గరికి వెళ్లకూడదు. కోత కోసినప్పుడు మిగిలిపోయే వాటిని, బీదలు అంటే ‘పరదేశులు, తండ్రి లేనివారు, విధవరాండ్రు’ ఏరుకోవడానికి విడిచిపెట్టాలి. (ద్వితీయోపదేశకాండము 24:​19-21) సుపరిచితమైన ఈ సూత్రాల ఆధారంగా యెషయా, యెహోవా తీర్పు తీర్చినప్పుడు వదిలిపెట్టబడే వారు ఉంటారనే ఓదార్పుకరమైన వాస్తవాన్ని వివరిస్తున్నాడు: “ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్షఫలములకోత తీరినతరువాత పరిగె పండ్లను ఏరుకొనునప్పుడును జరుగునట్లుగా భూమిమధ్య జనములలో జరుగును. శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా మహాత్మ్యమునుబట్టి సముద్రతీరముననున్న వారు కేకలువేయుదురు. అందునుబట్టి తూర్పుదిశనున్నవారలారా, యెహోవాను ఘనపరచుడి, సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతమునుండి సంగీతములు మనకు వినబడెను.”​—యెషయా 24:13-16ఎ.

14 కోతకోసిన తర్వాత చెట్లపైగానీ ద్రాక్షావల్లులపైగానీ పండ్లు మిగిలి ఉన్నట్లుగానే, “ద్రాక్షఫలములకోత తీరినతరువాత పరిగె పండ్లను ఏరుకొనునప్పుడును జరుగునట్లుగా” అంటే యెహోవా తీర్పు తీర్చిన తర్వాత, మిగిలి ఉండేవారు కొందరు ఉంటారు. ఆరవ వచనంలో వ్రాయబడి ఉన్నట్లుగా, “శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు” అని చెబుతూ ప్రవక్త ఇప్పటికే వీటి గురించి మాట్లాడాడు. ఎంత కొద్దిమంది అయినప్పటికీ, యూదా యెరూషలేముల నాశనాన్ని తప్పించుకొని జీవించే వారు మాత్రం తప్పక ఉంటారు, అలా శేషించినవారు ఆ తర్వాత దేశాన్ని ప్రజలతో నింపేందుకు చెర నుండి తిరిగి వస్తారు. (యెషయా 4:​2, 3; 14:​1-5) యథార్థ హృదయులు దుఃఖభరితమైన శ్రమకాలాలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, మున్ముందు విడుదల, ఆనందం లభిస్తాయని వారు నిశ్చయత కలిగి ఉండవచ్చు. తప్పించుకొని జీవించేవారు యెహోవా ప్రవచనార్థక వాక్యం బయల్పరచబడడం చూస్తారు, యెషయా నిజంగా దేవుని ప్రవక్త అని గుర్తిస్తారు. పునఃస్థాపన ప్రవచనాల నెరవేర్పును చూసి వారు ఆనందభరితులవుతారు. వారు పశ్చిమాన మధ్యధరా సముద్ర ద్వీపాలకైనా, “తూర్పుదిశనున్న” బబులోనుకైనా, లేక మరే సుదూర ప్రాంతానికైనా, వారు ఎక్కడికి చెదరగొట్టబడినప్పటికీ అక్కడి నుండి, తాము కాపాడబడినందుకు వారు దేవుని స్తుతిస్తారు, “నీతిమంతునికి స్తోత్రమని” వారు ఆలపిస్తారు!

యెహోవా తీర్పును తప్పించుకోలేరు

15, 16. (ఎ) తన ప్రజలకు జరుగబోయేదాని గురించి యెషయా ఎలా భావిస్తాడు? (బి) దేశంలోని నమ్మకద్రోహులైన నివాసులకు ఏమి సంభవిస్తుంది?

15 అయితే ఆనందించడానికి సరైన సమయం ఇంకా రాదు. యెషయా ఇలా చెబుతూ, తన సమకాలీనులను ప్రస్తుత కాలానికి తిరిగి తీసుకువస్తున్నాడు: “అప్పుడు నేను​—⁠అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు. మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. భూనివాసీ, నీమీదికి భయము వచ్చెను గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములు పైకి తీయబడియున్నవి. భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలై పోవుచున్నది, భూమి కేవలము తునకలై పోవుచున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది, పాకవలె ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది, అది పడి యికను లేవదు, భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును.”​—యెషయా 24:16-20.

16 తన ప్రజలకు సంభవించబోయే దానిని బట్టి యెషయా దుఃఖితుడయ్యాడు. ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయనకు అనారోగ్య భావాలను, వ్యధను కలిగిస్తాయి. మోసము చేసేవారు ఎక్కువై, దేశ నివాసులకు భయం కలుగజేస్తారు. యెహోవా తన కాపుదలను ఇవ్వకుండా ఉన్నప్పుడు, నమ్మకద్రోహులైన యూదా నివాసులు రాత్రింబగళ్లు భీతిని అనుభవిస్తారు. వారు తమ జీవితాల గురించి అనిశ్చయంగా ఉంటారు. యెహోవా ఆజ్ఞలను విడనాడి, దైవిక జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేసినందుకు వారిపైకి రానున్న నాశనాన్ని వారెంతమాత్రం తప్పించుకోలేరు. (సామెతలు 1:​24-27) అంతా బాగానే ఉంటుందని ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ, నాశనానికి నడిపే మార్గంపైకి వారిని తీసుకువెళ్లేందుకు అబద్ధాన్ని, కుయుక్తిని ఉపయోగించే మోసకారుల ద్వారా కూడా విపత్తు వస్తుంది. (యిర్మీయా 27:​9-15) శత్రువులు బయటి నుండి వచ్చి వారిని దోచుకుని, వారిని బంధీలుగా తీసుకువెళతారు. ఇదంతా యెషయాకు ఎంతో ఆందోళనను కలిగిస్తుంది.

17. (ఎ) తప్పించుకోవడం ఎందుకు సాధ్యం కాదు? (బి) యెహోవా తీర్పు శక్తి పరలోకం నుండి విడుదల చేయబడినప్పుడు, దేశానికి ఏమి సంభవిస్తుంది?

17 అయినప్పటికీ, తప్పించుకునే అవకాశం ఉండదని ప్రవక్త ప్రకటించాలి. ప్రజలు ఎక్కడికి పారిపోడానికి ప్రయత్నించినప్పటికీ, వారు దొరికిపోతారు. కొంతమంది ఒక విపత్తును తప్పించుకోవచ్చు, కాని వారు మరో విపత్తులో చిక్కుకుపోతారు, ఎక్కడా భద్రత లభించదు. ఆ పరిస్థితి, వెంటాడబడుతున్న జంతువు గుంటలో పడకుండా తప్పించుకొని ఉరిలో చిక్కుకున్నట్లు ఉంటుంది. (ఆమోసు 5:​18, 19 పోల్చండి.) యెహోవా తీర్పు శక్తి పరలోకం నుండి విడుదల చేయబడి దేశ పునాదులనే కదిలించి వేస్తుంది. మత్తుడైన వ్యక్తిలా, దేశం దోషభారంతో తూలి పడిపోయి, తిరిగి లేవలేకపోతుంది. (ఆమోసు 5:2) యెహోవా తీర్పుకు తిరుగులేదు. దేశం నాశనమవుతుంది, సర్వనాశనమవుతుంది.

యెహోవా మహిమలో పరిపాలిస్తాడు

18, 19. (ఎ) “ఉన్నత స్థల సమూహము” దేన్ని సూచించవచ్చు, వీరు “చెరసాలలో”కి ఎలా సమకూర్చబడతారు? (బి) “బహుదినములైన తరువాత,” “ఉన్నత స్థల సమూహము”కు ఎలా అవధానం ఇవ్వబడుతుండవచ్చు? (సి) యెహోవా “భూరాజుల” వైపుకు తన అవధానం ఎలా మరలుస్తాడు?

18 యెహోవా సంకల్ప తుది నెరవేర్పు వైపుకు అవధానాన్ని మళ్ళిస్తూ, యెషయా ప్రవచనం ఇప్పుడు మరింత గంభీరమైన విషయాలను తెలియజేస్తోంది: “ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమిమీదనున్న భూరాజులను దండించును. చెరపట్టపడినవారు గోతిలో చేర్చబడునట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును. సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును.”​—యెషయా 24:21-23.

19 “ఉన్నత స్థల సమూహము” అన్నది దయ్యాల సంబంధిత ‘ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములను’ సూచించవచ్చు. (ఎఫెసీయులు 6:​12) వారు ప్రపంచ శక్తులపై చాలా శక్తివంతమైన ప్రభావాన్ని చూపించారు. (దానియేలు 10:13, 20; 1 యోహాను 5:​19) యెహోవా నుండి, ఆయన స్వచ్ఛారాధన నుండి ప్రజలను త్రిప్పి వేయాలన్నదే వారి లక్ష్యం. వారు, తమ చుట్టూ ఉన్న దేశాల భ్రష్ట ఆచారాలను అనుసరించేలా ఇశ్రాయేలీయులను ప్రలోభపెట్టి, వారు దేవుని తీర్పుకు పాత్రులయ్యేలా చేయడంలో ఎంత చక్కగా విజయం సాధించారు! కానీ, దేవుడు చివరికి సాతాను వైపు, అతని దయ్యాల వైపు తన అవధానాన్ని మరల్చినప్పుడు వారు ఆయనకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతేగాక సాతాను, అతని దయ్యాలు దేవుని నుండి దూరమైపోయి ఆయన ఆజ్ఞలు మీరేలా ప్రభావితం చేసిన భూపరిపాలకులైన “భూమిమీదనున్న భూరాజుల” వైపు కూడా దేవుడు తన అవధానం మరలుస్తాడు. (ప్రకటన 16:​13, 14) సూచనార్థకంగా మాట్లాడుతూ, వారు సమకూర్చబడి “చెరసాలలో వేయబడుదురు” అని యెషయా చెబుతున్నాడు. “బహుదినములైన తరువాత,” బహుశా సాతాను, అతని దయ్యాలు (కానీ “భూమిమీదనున్న భూరాజులు” కాదు) యేసు క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన ముగింపులో తాత్కాలికంగా విడుదల చేయబడతారు, తర్వాత వారు పొందడానికి అర్హమైన తుది శిక్షను దేవుడు వారిపైకి తీసుకువస్తాడు.​—⁠ప్రకటన 20:3, 7-10.

20. ప్రాచీన కాలాల్లోనూ, ఆధునిక కాలాల్లోనూ, యెహోవా ఎలా, ఎప్పుడు ‘రాజ్యం చేయడం’ ప్రారంభించాడు?

20 యెషయా ప్రవచనంలోని ఈ భాగం యూదులకు అద్భుతమైన హామీని ఇచ్చింది. యెహోవా నిర్ణీత సమయంలో, ఆయన ప్రాచీన బబులోనును కూలద్రోసి, యూదులను తమ స్వదేశానికి తిరిగితీసుకువస్తాడు. సా.శ.పూ. 537 లో ఆయన తన ప్రజల పక్షాన తన శక్తిని, సర్వాధిపత్యాన్ని ఈ విధంగా ప్రదర్శించినప్పుడు, “నీ దేవుడు ఏలుచున్నాడని” వారితో నిజంగా చెప్పవచ్చు. (యెషయా 52:7) ఆధునిక కాలాల్లో, 1914 లో యేసు క్రీస్తును తన పరలోక రాజ్యానికి రాజుగా నియమించినప్పుడు యెహోవా ‘రాజ్యం చేయడం’ ప్రారంభించాడు. (కీర్తన 96:​10) మహాబబులోను చెరలో నుండి ఆధ్యాత్మిక ఇశ్రాయేలును విడుదల చేయడం ద్వారా తన రాజరిక శక్తిని ప్రదర్శించినప్పుడు, అంటే 1919 లో కూడా ఆయన ‘రాజ్యం చేయడం’ ప్రారంభించాడు.

21. (ఎ) ఏ విధంగా ‘చంద్రుడు వెలవెలబోతాడు, సూర్యుని ముఖము మారును’? (బి) ప్రతిధ్వనించే ఏ పిలుపు అతిగొప్పగా నెరవేరుతుంది?

21 యెహోవా మహా బబులోనును, ఈ దుష్ట విధానపు మిగతా వాటన్నింటినీ అంతం చేసినప్పుడు ఆయన మళ్లీ ‘రాజవుతాడు.’ (జెకర్యా 14:9; ప్రకటన 19:​1, 2, 19-21) ఆ తర్వాత, యెహోవా రాజ్య పరిపాలన ఎంత మహిమాన్వితంగా ఉంటుందంటే, రాత్రిలో కాంతులీనుతున్న చంద్రుడు గానీ మట్టమధ్యాహ్నం ఎర్రగా వెలిగిపోతున్న సూర్యుడు గానీ ఆయన మహిమకు సాటిరాలేవు. (ప్రకటన 22:5 పోల్చండి.) ఒక విధంగా చెప్పాలంటే, మహిమాన్వితుడైన సైన్యములకధిపతియగు యెహోవాతో తమను తాము పోల్చుకోవడానికి కూడా అవి సిగ్గుపడతాయి. యెహోవా సర్వోన్నతంగా పరిపాలిస్తాడు. ఆయన సర్వోన్నతమైన శక్తి, మహిమ అందరికీ స్పష్టమవుతాయి. (ప్రకటన 4:​8-11; 5:​13, 14) ఎంత అద్భుతమైన ఉత్తరాపేక్ష! ఆ సమయంలో, కీర్తన 97:1 లోని ఈ పిలుపు అతిగొప్పగా నెరవేరుతూ, భూవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది: “యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నియు సంతోషించునుగాక.”

[అధ్యయన ప్రశ్నలు]

[262 వ పేజీలోని చిత్రం]

దేశంలో సంగీతం, సంతోషం ఇకపై వినిపించవు

[265 వ పేజీలోని చిత్రం]

కోతకోసిన తర్వాత ఒక చెట్టు మీద మిగిలి ఉండే పండ్లలా, కొందరు యెహోవా తీర్పు తీర్చిన తర్వాత మిగిలివుంటారు

[267 వ పేజీలోని చిత్రం]

తన ప్రజలకు సంభవించబోయేదాన్ని బట్టి యెషయా దుఃఖిస్తున్నాడు

[269 వ పేజీలోని చిత్రం]

మహిమ విషయంలో సూర్య చంద్రులు యెహోవాకు సాటి రాలేవు