కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి

యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి

ఇరవై-మూడవ అధ్యాయం

యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి

యెషయా 30:​1-33

1, 2. (ఎ) యెషయా 30 వ అధ్యాయంలో ఏమి ఉంది? (బి) మనం ఇప్పుడు ఏ ప్రశ్నలను పరిశీలిస్తాము?

 యెషయా 30 వ అధ్యాయంలో, దుష్టులకు వ్యతిరేకంగా ఇవ్వబడే మరిన్ని దేవోక్తుల గురించి మనం చదువుతాము. అయితే, యెషయా ప్రవచనంలోని ఈ భాగం, మన హృదయాలను ఉత్తేజపరచే యెహోవా లక్షణాలను కొన్నింటిని ముఖ్యంగా చూపిస్తుంది. వాస్తవానికి, యెహోవా లక్షణాలు ఎంత స్పష్టమైన పదాల్లో వర్ణించబడ్డాయంటే, ఒక విధంగా చెప్పాలంటే, మనం ఓదార్పునిచ్చే ఆయన సన్నిధిని చూడవచ్చు, నడిపింపునిచ్చే ఆయన స్వరాన్ని వినవచ్చు, స్వస్థపరిచే ఆయన స్పర్శను గ్రహించవచ్చు.​—⁠యెషయా 30:20, 21, 26.

2 అయినప్పటికీ, యెషయా స్వదేశస్థులు, మతభ్రష్ట యూదా నివాసులు యెహోవా దగ్గరకు తిరిగిరావడానికి నిరాకరిస్తారు. బదులుగా, వారు మానవునిపై తమ నమ్మకాన్ని ఉంచుతారు. దీని గురించి యెహోవా ఎలా భావిస్తాడు? యెషయా ప్రవచనంలోని ఈ భాగం, నేడు క్రైస్తవులు యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడానికి వారికి ఎలా సహాయం చేస్తుంది? (యెషయా 30:​18) దాన్ని మనం తెలుసుకుందాం.

మూర్ఖత్వం, మృతతుల్యం

3. యెహోవా ఏ పథకాన్ని బయలుపరుస్తాడు?

3 కొంతకాలం నుండి, యూదా నాయకులు అష్షూరు కాడి క్రిందికి వెళ్ళకుండా తప్పించుకునేందుకు ఒక మార్గం కోసం రహస్యంగా పథకం వేస్తున్నారు. అయితే, యెహోవా అది గమనిస్తున్నాడు. ఇప్పుడు ఆయన వారి పథకాన్ని బయలుపరుస్తున్నాడు: “యెహోవా వాక్కు ఇదే​—⁠లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు, వారు నా నోటి మాట విచారణచేయక . . . ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు.”​—యెషయా 30:1, 2ఎ.

4. దేవుని తిరుగుబాటుదారులైన ప్రజలు, ఐగుప్తుకు దేవుని స్థానాన్ని ఎలా ఇచ్చారు?

4 తమ పథకం బయలుపరచబడిందని తెలిసిన ఆ నాయకులకు అది ఎంత దిగ్భ్రాంతి! ఐగుప్తుతో సంధి చేసుకునేందుకు ఐగుప్తుకు ప్రయాణించడం అష్షూరుకు వ్యతిరేకంగా వైరభావంతో చేసిన చర్య కంటే ఎక్కువే; అది యెహోవా దేవునిపై తిరుగుబాటు చేసినట్లే. దావీదు రాజు కాలంలో, ఆ రాజ్యం యెహోవాను తమ ఆశ్రయదుర్గముగా చేసుకొని, ‘ఆయన రెక్కల నీడన’ ఆశ్రయము పొందింది. (కీర్తన 27:1; 36:7) ఇప్పుడు వారు ‘ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొంటూ, ఐగుప్తునీడను శరణుజొచ్చుతున్నారు.’ (యెషయా 30:2బి) వారు ఐగుప్తుకు దేవుని స్థానాన్ని ఇచ్చారు! ఎంత రాజద్రోహం!​—⁠యెషయా 30:3-5 చదవండి.

5, 6. (ఎ) ఐగుప్తుతో సంధి చేసుకోవడం ఎందుకు వినాశకరమైన పొరపాటు? (బి) దేవుని ప్రజలు ఐగుప్తుకు చేసిన ఇప్పటి ప్రయాణం మూర్ఖమైనదని, గతంలో చేసిన ఏ ప్రయాణం చూపిస్తుంది?

5 ఐగుప్తుకు వెళ్లింది కేవలం సందర్శించడానికే అనే సూచన ఏమైనావుంటే దానికి సమాధానంగా, యెషయా మరిన్ని వివరాలను ఇస్తున్నాడు. “దక్షిణ దేశములోనున్న క్రూరమృగములను గూర్చిన దేవోక్తి. సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని . . . వాటిని తీసికొని పోవుదురు.” (యిషయా 30:6) దీన్నిబట్టి చూస్తే వారు చక్కగా పథకం వేసుకునే ప్రయాణించారని స్పష్టమౌతోంది. రాయబారులు ఒంటెలను, గాడిదలను సమకూర్చుకొని, వాటిపై ఖరీదైన వస్తువులను ఎక్కించుకుని, గాండ్రించే సింహాలు, విషపూరితమైన పాములతో నిండివున్న నిర్జన అరణ్యం గుండా ఐగుప్తుకు వెళ్లడానికి ప్రయాణం మొదలుపెడతారు. చివరికి, రాయబారులు తమ గమ్యాన్ని చేరుకొని, తమ సంపదలను ఐగుప్తీయులకు అందజేస్తారు. అలా వారు కాపుదలను కొనుక్కున్నారు, లేదా కనీసం వారలా అనుకుంటారు. అయితే, యెహోవా ఇలా చెబుతున్నాడు: “తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొని పోవుదురు. ఐగుప్తువలని సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజనమైనది అందుచేతను​—⁠ఏమియు చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను.” (యెషయా 30:​6బి, 7) ఐగుప్తు అన్నీ వాగ్దానం చేస్తుంది గానీ ఏమి చేయదు. యూదా దానితో సంధి చేసుకోవడం వినాశకరమైన పొరపాటు.

6 యెషయా రాయబారుల ప్రయాణాన్ని వర్ణిస్తుండగా, ఆయన శ్రోతలకు, మోషే కాలంలో జరిగిన ఇటువంటి ప్రయాణమే గుర్తుకు రావచ్చు. వారి పితరులు అదే ‘భయంకరమైన అరణ్యం’ గుండా వెళ్లారు. (ద్వితీయోపదేశకాండము 8:​14-16) అయితే, మోషే కాలంలో, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి దూరంగా, బానిసత్వం నుండి విడుదలై వెళ్లారు. ఇప్పుడేమో రాయబారులు ఐగుప్తులోకి ప్రయాణిస్తున్నారు, వాస్తవానికి లొంగిపోవడానికి వెళుతున్నారు. ఎంత మూర్ఖత్వం! మనమెన్నడూ అంత మూర్ఖపు నిర్ణయం తీసుకుని మన ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని బానిసత్వానికి అమ్ముకోకుండా ఉందాము!​—⁠గలతీయులు 5:1 పోల్చండి.

ప్రవక్త సందేశానికి వ్యతిరేకత

7. యెహోవా తాను యూదాకు చేసిన హెచ్చరికను యెషయా వ్రాసిపెట్టేలా ఎందుకు చేశాడు?

7 యెహోవా తాను ఇప్పుడే వెలువరించిన సందేశాన్ని, “రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు” వ్రాసిపెట్టమని యెషయాకు చెబుతాడు. (యెషయా 30:8) యెహోవాను నమ్ముకోవడం కంటే మానవులతో చేసుకున్న సంధికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడాన్ని యెహోవా ఖండించాడనే విషయాన్ని, నేటి మన తరంతో సహా భవిష్యద్‌ తరాల ప్రయోజనార్థం రాసివుంచాలి. (2 పేతురు 3:​1-4) కాని వ్రాతపూర్వకమైన నివేదికకు మరింత తక్షణమైన అవసరత ఉంది. “వారు తిరుగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు.” (యెషయా 30:9) ప్రజలు దేవుని ఆలోచనను తిరస్కరించారు. కాబట్టి, తాము తగిన విధంగా హెచ్చరించబడలేదు అని తర్వాత వారు అనకుండా ఉండేందుకు అది వ్రాసిపెట్టబడాలి.​—⁠సామెతలు 28:9; యెషయా 8:1, 2.

8, 9. (ఎ) యూదా నాయకులు యెహోవా ప్రవక్తలను ఏ విధంగా కలుషితం చేయడానికి ప్రయత్నిస్తారు? (బి) తాను ఎంతమాత్రం భయపడనని యెషయా ఎలా చూపిస్తాడు?

8 యెషయా ఇప్పుడు, ప్రజల తిరుగుబాటు దృక్పథాన్ని గురించిన ఉదాహరణను తెలియజేస్తున్నాడు. వారు, “దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును​—⁠యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయా దర్శనములను కనుడి . . . అని భవిష్యద్‌ జ్ఞానులతో పలుకువారునై యున్నారు.” (యెషయా 30:​10, 11) “యుక్త వాక్యములను” లేక సత్యాన్ని చెప్పడం మానేసి అందుకు బదులుగా, “మృదువైన,” “మాయా దర్శనములను” లేక అబద్ధాన్ని చెప్పమని నమ్మకమైన ప్రవక్తలకు ఆజ్ఞాపించడం ద్వారా, యూదా నాయకులు తమ దురద చెవులకు అనుకూలమైన బోధలు కావాలని చూపిస్తారు. వారు పొగడబడాలని కోరుకుంటున్నారు గానీ ఖండించబడాలని కాదు. వారి అభిప్రాయం ప్రకారం, వారి అభిరుచికి తగినవిధంగా ప్రవచించడానికి ఇష్టపడని ఏ ప్రవక్త అయినా, ‘అడ్డము రాకూడదు, త్రోవనుండి తొలగాలి.’ (యెషయా 30:11) అతడు వారి చెవులకు ఇంపైన విషయాలైనా మాట్లాడాలి లేక మొత్తానికి ప్రవచించడమైనా మానుకోవాలి.

9 యెషయా వ్యతిరేకులు ఇలా పట్టుబడతారు: “ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట ఎత్తకుడి.” (యిషయా 30:11బి) “ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని,” అంటే యెహోవా నామమున మాట్లాడడం యెషయా మానుకోవాలి! “ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు” అనే పేరే వారికి చికాకు కలిగిస్తుంది, ఎందుకంటే యెహోవా ఉన్నతమైన ప్రమాణాలు వారి హేయమైన స్థితిని బహిర్గతం చేస్తున్నాయి. యెషయా ఎలా ప్రతిస్పందిస్తాడు? ఆయనిలా ప్రకటిస్తాడు: “ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” (యెషయా 30:12ఎ) యెషయా ఏమాత్రం సంకోచించకుండా, తన వ్యతిరేకులు వినడానికి ఏవగించుకొనే మాటలనే మాట్లాడతాడు. ఆయన ఎంతమాత్రం భయపడడు. అది మనకు ఎంత చక్కని మాదిరి! దేవుని సందేశాన్ని ప్రకటించే విషయంలో, క్రైస్తవులు ఎన్నడూ రాజీపడకూడదు. (అపొస్తలుల కార్యములు 5:​27-29) యెషయా వలె వారు, ‘యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు’ అని ప్రకటిస్తూనే ఉంటారు!

తిరుగుబాటు యొక్క పర్యవసానాలు

10, 11. యూదా తిరుగుబాటు పర్యవసానాలు ఎలా ఉంటాయి?

10 యూదా దేవుని వాక్యము వద్దని త్రోసివేసి, అబద్ధాన్ని నమ్మి, “కృత్రిమము” మీద ఆధారపడింది. పర్యవసానాలు ఎలా ఉంటాయి? యెహోవా, ఆ రాజ్యం కోరుకుంటున్నట్లుగా ఆ సంఘటనా దృశ్యాన్ని విడిచిపెట్టే బదులు, ఆ రాజ్యం ఉనికిలోనే లేకుండా చేస్తాడు! యెషయా ఒక దృష్టాంతముతో నొక్కి చెబుతున్నట్లుగా, అది హఠాత్తుగా, సంపూర్ణంగా జరుగుతుంది. ఆ రాజ్యం తిరుగుబాటు ధోరణి ఇలా ఉంటుంది: “ఎత్తయిన గోడనుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును.” (యెషయా 30:​13) ఒక ఎత్తయిన గోడలో పెరుగుతున్న ఉబుకు, చివరికి గోడ కూలిపోయేలా చేస్తుంది, అలాగే యెషయా సమకాలీనుల్లో అధికమవుతున్న తిరుగుబాటు ధోరణి రాజ్యం కూలిపోవడానికి కారణమవుతుంది.

11 రానున్న నాశనపు సంపూర్ణతను యెషయా మరో దృష్టాంతంతో ఇలా చూపిస్తాడు: “కుమ్మరి కుండ పగులగొట్టబడునట్లు ఆయన ఏమియు విడిచిపెట్టక దాని పగులగొట్టును, పొయిలోనుండి నిప్పు తీయుటకు గాని గుంటలోనుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు.” (యెషయా 30:​14) యూదా నాశనం ఎంతగా జరుగుతుందంటే దాంట్లో విలువైనదేదీ మిగిలి ఉండదు, చివరికి పొయ్యిలోనుండి నిప్పు తీయడానికి లేక గుంటలోనుండి నీళ్లు తోడడానికి కావలసినంత పెద్ద పెంకు కూడా మిగలదు. ఎంత అవమానకరమైన అంతం! నేడు సత్యారాధనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిపైకి రాబోయే నాశనం కూడా అంతే హఠాత్తుగా వస్తుంది, సర్వం నాశనమవుతుంది.​—⁠హెబ్రీయులు 6:4-8; 2 పేతురు 2:1.

యెహోవా ప్రతిపాదన నిరాకరించబడింది

12. యూదా ప్రజలు నాశనాన్ని ఎలా తప్పించుకోవచ్చు?

12 అయితే యెషయా శ్రోతలకు, ఆ వినాశనం అనివార్యం కాదు. వారికి తప్పించుకునే అవకాశం ఉంది. దాన్ని ప్రవక్త ఇలా వివరిస్తున్నాడు: “ప్రభువును ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠మీరు మరలి వచ్చి ఊరకుండుటవలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును.” (యెషయా 30:​15) ఒకవేళ తన ప్రజలు “ఊరకుండుట” ద్వారా లేక మానవులతో సంధి చేసుకొని రక్షణ సంపాదించుకోవడానికి ప్రయత్నించకుండా విశ్వాసాన్ని చూపిస్తే, లేదా “ఊరకుండి” లేదా భయపడకుండా ఉండి దేవుని రక్షణ శక్తియందు నమ్మకం ఉంచితే, యెహోవా వారిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. “అయినను మీరు సమ్మతిం[చలేదు]” అని యెషయా ప్రజలకు చెబుతున్నాడు.​యెషయా 30:16ఎ.

13. యూదా నాయకులు తమ నమ్మకాన్ని దేనిపై ఉంచుతారు, అలాంటి నమ్మకం న్యాయమైనదేనా?

13 తర్వాత యెషయా ఇలా విపులీకరిస్తున్నాడు: “అట్లు కాదు, మేము గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు.” (యెషయా 30:16బి) యెహోవాకు బదులు, వడిగల గుఱ్ఱములే తమను రక్షిస్తాయని యూదావారు అనుకుంటారు. (ద్వితీయోపదేశకాండము 17:16; సామెతలు 21:​31) అయితే, దానికి భిన్నంగా ప్రవక్త ఇలా చెబుతున్నాడు, వారి నమ్మకం భ్రమ మాత్రమే అవుతుంది, ఎందుకంటే వారి శత్రువులు వారిని పట్టుకుంటారు. సంఖ్యాపరంగా అధికులై ఉండడం ఏమీ సహాయం చేయదు. “ఒకని గద్దింపునకు మీలో వెయ్యిమంది పారిపోయెదరు; అయిదుగురి గద్దింపునకు మీరు పారిపోయెదరు.” (యిషయా 30:17బి) యూదా సైన్యాలు భయపడిపోయి, కేవలం కొద్దిమంది శత్రువుల కేకలకే పారిపోతారు. * చివరికి, “పర్వతముమీదనుండు కొయ్యవలెను కొండమీదనుండు జెండావలెను” కేవలం ఒక శేషము మాత్రమే ఒంటరిగా మిగులుతుంది. (యెషయా 30:​17ఎ) ప్రవచింపబడినట్లుగానే, సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం చేయబడినప్పుడు, కేవలం ఒక శేషము మాత్రమే తప్పించుకొంటుంది.​—⁠యిర్మీయా 25:8-11.

అధిక్షేపణ మధ్యన ఓదార్పు

14, 15. ప్రాచీన కాలంనాటి యూదా నివాసులకు, యెషయా 30:18 లోని మాటలు ఎలాంటి ఓదార్పునిచ్చాయి, నేడు నిజ క్రైస్తవులకు ఎలాంటి ఓదార్పునిస్తాయి?

14 యెషయా గంభీరమైన ఆ మాటలు శ్రోతల చెవుల్లో ఇంకా మారుమ్రోగుతుండగానే, ఆయన సందేశపు శైలి మారుతుంది. విపత్తు స్థానంలో ఆశీర్వాదాల వాగ్దానం చోటుచేసుకొంటుంది. “కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు. యెహోవా న్యాయముతీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు.” (యెషయా 30:​18) ఎంత ఉల్లాసకరమైన మాటలవి! యెహోవా తన పిల్లలకు సహాయం చేయాలని ఆకాంక్షిస్తున్న సానుభూతిగల తండ్రి. కరుణ చూపించడం ఆయనకు సంతోషాన్నిస్తుంది.​—⁠కీర్తన 103:13; యెషయా 55:7.

15 ధైర్యాన్నిచ్చే ఈ మాటలు, సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం చేయబడినప్పుడు తప్పించుకోవడానికి కరుణతో అనుమతించబడిన యూదా శేషానికి, సా.శ.పూ. 537 లో వాగ్దాన దేశానికి తిరిగివచ్చిన కొద్దిమందికి వర్తిస్తాయి. అయితే, ప్రవక్త మాటలు నేటి క్రైస్తవులకు కూడా ఓదార్పునిస్తాయి. యెహోవా ఈ దుష్టప్రపంచానికి అంతం తెస్తూ, మన పక్షాన ‘నిలబడతాడని’ మనకు జ్ఞాపకం చేయబడుతోంది. “న్యాయముతీర్చు దేవుడు” అయిన యెహోవా, సాతాను లోకాన్ని తీర్పు తీర్చాల్సిన రోజును దాటి ఒక్కరోజు కూడా దాన్ని ఉనికిలో ఉండనీయడు అని విశ్వసనీయులైన ఆరాధకులు గట్టి నమ్మకంతో ఉండవచ్చు. కాబట్టి, “ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు” ఆనందించడానికి ఎంతో కారణం ఉంది.

ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం ద్వారా యెహోవా తన ప్రజలను ఓదారుస్తాడు

16. నిరుత్సాహం చెందినవారిని యెహోవా ఎలా ఓదారుస్తాడు?

16 అయితే, కొందరు విడుదల తాము ఎదురు చూసినంత త్వరగా రాలేదని నిరుత్సాహపడవచ్చు. (సామెతలు 13:12; 2 పేతురు 3:9) యెహోవా వ్యక్తిత్వంలోని ఒక ప్రత్యేక అంశాన్ని ఉన్నతపరిచే యెషయా తర్వాతి మాటల నుండి వారు ఓదార్పు పొందుదురు గాక. “సీయోనులో యెరూషలేములోనే యొక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరుణించును; ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును.” (యిషయా 30:​19) యెషయా ఈ మాటల్లో, 18 వ వచనంలో “మీ” అనే బహువచనం నుండి 19 వ వచనంలో “నీ” అనే ఏకవచన ప్రయోగానికి మారడం ద్వారా వాత్సల్యాన్ని తెలియజేస్తున్నాడు. బాధపడుతున్నవారిని యెహోవా ఓదార్చేటప్పుడు, ఆయన ప్రతి వ్యక్తిమీద వ్యక్తిగతంగా శ్రద్ధ చూపుతాడు. ఒక తండ్రిగా ఆయన, నిరుత్సాహం చెందిన కుమారుడ్ని, ‘నీవు నీ సహోదరునిలా ఎందుకు దృఢంగా ఉండలేవు?’ అని అడుగడు. (గలతీయులు 6:4) బదులుగా, ఆయన ప్రతి ఒక్కరు చెప్పేదాన్ని శ్రద్ధగా వింటాడు. వాస్తవానికి, ‘ఆయన వినగానే ఉత్తరమిస్తాడు.’ ఎంత ధైర్యాన్నిచ్చే మాటలు! నిరుత్సాహం చెందినవారు యెహోవాకు ప్రార్థిస్తే ఎంతో బలపరచబడతారు.​—⁠కీర్తన 65:2.

దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, నడిపింపునిచ్చే ఆయన స్వరాన్ని వినండి

17, 18. కష్టతరమైన కాలాల్లో సహితం యెహోవా నడిపింపును ఎలా ఇస్తాడు?

17 యెషయా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఆపద్దశ వస్తుందని తన శ్రోతలకు గుర్తు చేస్తున్నాడు. ప్రజలకు ‘క్లేషాన్నపానములు’ ఇవ్వబడతాయి. (యెషయా 30:​20ఎ) ముట్టడించబడుతున్నప్పుడు వారు అనుభవించే మానసిక క్షోభ, అణచివేత అన్నపానములంత సుపరిచితమైనవి అవుతాయి. అయినప్పటికీ, యెహోవా యథార్థహృదయులను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నాడు. “ఇకమీదట నీ బోధకులు [“గొప్ప బోధకుడు,” NW] * దాగియుండరు, నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను​—⁠ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.”​—యెషయా 30:20బి, 21.

18 యెహోవా “గొప్ప బోధకుడు.” బోధకునిగా ఆయనకు సాటిరాగల వారెవరూ లేరు. కానీ, ప్రజలు ఆయనను ఎలా ‘చూడగలరు’ ఆయన స్వరాన్ని ఎలా ‘వినగలరు’? యెహోవా తన ప్రవక్తల ద్వారా తనను తాను బయలుపరచుకుంటాడు, ఆ ప్రవక్తల మాటలు బైబిలులో వ్రాయబడివున్నాయి. (ఆమోసు 3:​6, 7) నేడు నమ్మకమైన ఆరాధకులు బైబిలును చదివినప్పుడు, వారు వెళ్లవలసిన మార్గాన్ని వారికి తెలియజేస్తూ, ఆ మార్గంలో నడవడానికి అనుగుణంగా తమ ప్రవర్తనను సరిచేసుకొమ్మని వారికి దేవుని స్వరం వాత్సల్యంతో చెబుతున్నట్లుగా ఉంటుంది. బైబిలు ద్వారా, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందజేస్తున్న బైబిలు ఆధారిత ప్రచురణల ద్వారా యెహోవా మాట్లాడుతున్నప్పుడు, ప్రతి క్రైస్తవుడు జాగ్రత్తగా వినాలి. (మత్తయి 24:​45-47) ప్రతి ఒక్కరు బైబిలు చదవడానికి తగినంత శ్రద్ధను ఇవ్వాలి, ఎందుకంటే ‘ఇది అతనికి జీవమే.’​—⁠ద్వితీయోపదేశకాండము 32:46, 47; యెషయా 48:17.

భవిష్యత్తులోని ఆశీర్వాదాలను ధ్యానించండి

19, 20. గొప్ప బోధకుని స్వరానికి ప్రతిస్పందించేవారి కోసం ఏ ఆశీర్వాదాలు వేచివున్నాయి?

19 గొప్ప బోధకుని స్వరానికి ప్రతిస్పందించేవారు చెక్కబడిన తమ ప్రతిమలను హేయమైనవిగా దృష్టించి వాటిని పారవేస్తారు. (యెషయా 30:​22 చదవండి.) అప్పుడు మాత్రమే, ప్రతిస్పందించే ఆ వ్యక్తులు, అద్భుతమైన ఆశీర్వాదాలను అనుభవిస్తారు. యెషయా 30:23-26 వచనాల్లో వ్రాయబడి ఉన్నట్లుగా యెషయా వాటిని వర్ణిస్తున్నాడు, నిజంగా అదొక ఆనందకరమైన పునఃస్థాపనా ప్రవచనం, అది సా.శ.పూ. 537 లో యూదాలోని శేషించినవారు చెర నుండి తిరిగి వచ్చినప్పుడు తొలిగా నెరవేరింది. ఆధ్యాత్మిక పరదైసులో ఇప్పుడూ, రానున్న అక్షరార్థమైన పరదైసులోనూ మెస్సీయ తీసుకువచ్చే అద్భుతమైన ఆశీర్వాదాలను చూడడానికి ఈ ప్రవచనం నేడు మనకు సహాయం చేస్తుంది.

20 “నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడియైన ఆహారద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై యుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో మేయును. భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేటతోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును.” (యిషయా 30:​23, 24) “విస్తార సార రసములు” గల ఆహారము మానవులకు అనుదిన ఆహారం అవుతుంది. భూమి ఎంత విస్తారంగా పండుతుందంటే, చివరికి జంతువులు కూడా ప్రయోజనం పొందుతాయి. జంతువులు “ఉప్పుతో కలిసిన మేత” తింటాయి, అంటే అరుదైన సందర్భాల్లో మాత్రమే లభించే రుచిగల మేతను తింటాయి. ఈ మేత “చెరిగి జల్లించి” మరీ సిద్ధం చేయబడుతుంది, సాధారణంగా మానవులు తినే ధాన్యాన్నే అలా సిద్ధం చేసుకుంటారు. నమ్మకమైన మానవజాతిపై యెహోవా కుమ్మరించే ఆశీర్వాదాల సమృద్ధిని వివరించడానికి యెషయా ఎంత ఉల్లాసకరమైన వివరాలను అందజేస్తున్నాడు!

21. రాబోయే ఆశీర్వాదాల సంపూర్ణతను వివరించండి.

21 “ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతికొండమీదను వాగులును నదులును పారును.” (యెషయా 30:25బి) * యెహోవా ఆశీర్వాదాల సంపూర్ణతను నొక్కిచెబుతూ యెషయా సముచితమైన వివరణను ఇస్తున్నాడు. నీటి కొరత ఉండదు​—⁠అత్యంతావశ్యమైన నీళ్లు పల్లపు భూముల్లోనే గాక ప్రతి పర్వతము మీద ప్రవహిస్తాయి, చివరికి “ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతికొండమీదను” ప్రవహిస్తాయి. అవును, ఆకలి ఇక గతించిన విషయం అవుతుంది. (కీర్తన 72:​16) అంతేగాక, ప్రవక్త అవధానం, పర్వతాల కంటే ఎత్తైన విషయాల వైపుకు మరలుతుంది. “యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును.” (యెషయా 30:​26) ఈ విశిష్టమైన ప్రవచనానికి ఎంత ఉత్తేజకరమైన ముగింపు! దేవుని మహిమ మహోజ్వలంగా ప్రకాశిస్తుంది. దేవుని నమ్మకమైన ఆరాధకుల కోసం వేచివున్న ఆశీర్వాదాలు ఎంతో విస్తారంగా ఉంటాయి, ఏడంతలుగా ఉంటాయి, వారు ఇంతకు మునుపు అనుభవించిన దేన్నైనా మించిపోతాయి.

తీర్పు, ఆనందం

22. నమ్మకమైన వారికి వచ్చే ఆశీర్వాదాలకు భిన్నంగా, దుష్టుల కోసం యెహోవా ఏమి సిద్ధంగా ఉంచాడు?

22 యెషయా సందేశపు శైలి మళ్లీ మారుతోంది. తన శ్రోతల అవధానాన్ని ఆకర్షించడానికన్నట్లు, ఆయనిలా అంటాడు: “ఇదిగో! కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి, ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.” (యెషయా 30:​27) ఇంతవరకు, యెహోవా తన ప్రజల శత్రువులు తమ స్వంత గమనాన్ని అనుసరించడానికి అనుమతిస్తూ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడాయన తరుముకు వస్తున్న పెనుతుపానులా, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. “ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహమైన నదివలె ఉన్నది, వ్యర్థమైనవాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును, త్రోవ తప్పించు కళ్లెము జనుల దవడలలో ఉండును.” (యెషయా 30:​28) దేవుని ప్రజల శత్రువులు “ప్రవాహమైన నది”చే చుట్టుముట్టబడతారు, ‘జల్లెడతో గాలించబడతారు’, “కళ్లెము” వేసి బిగించబడతారు. చివరికి నాశనం చేయబడతారు.

23. క్రైస్తవులకు నేడు, ఏది ‘హృదయసంతోషాన్ని’ కలిగిస్తుంది?

23 ఒకనాడు తమ స్వదేశానికి తిరిగి వచ్చే నమ్మకమైన ఆరాధకుల ఆనందభరితమైన స్థితిని వర్ణిస్తుండగా, మళ్లీ యెషయా శైలి మారుతుంది. “రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవాయొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయసంతోషము కలుగును.” (యిషయా 30:​29) నిజక్రైస్తవులు, సాతాను ప్రపంచపు తీర్పు కోసమూ, “రక్షణ దుర్గము” అయిన యెహోవా తమకు ఇచ్చే కాపుదల కోసమూ, రానున్న రాజ్య ఆశీర్వాదాల కోసమూ ఎదురుచూస్తూ నేడు అలాంటి “హృదయసంతోషము”నే అనుభవిస్తున్నారు.​—⁠కీర్తన 95:1.

24, 25. అష్షూరుపైకి రానున్న తీర్పు వాస్తవికతను యెషయా ప్రవచనం ఎలా నొక్కిచెబుతుంది?

24 సంతోషభరితమైన ఈ వ్యక్తీకరణ తర్వాత, యెషయా తీర్పు ఇతివృత్తం వైపుకు మరలుతూ, దేవుని ఉగ్రతకు గురయ్యేదాన్ని చూపిస్తున్నాడు. “యెహోవా తన ప్రభావముగల స్వరమును వినిపించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును. యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినొందును.” (యెషయా 30:​30, 31) ఈ స్పష్టమైన వివరణతో, అష్షూరుపైకి వచ్చే దేవుని తీర్పు యొక్క వాస్తవికతను యెషయా నొక్కి చెబుతున్నాడు. వాస్తవంగా, అష్షూరు దేవుని ఎదుట నిలబడి, ఆయన తీర్పు ‘బాహువు వాలుటను’ చూసి వణికిపోతుంది.

25 ప్రవక్త ఇలా కొనసాగిస్తున్నాడు: “యెహోవా అష్షూరుమీద పడవేయు నియామక దండమువలని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును; ఆయన తన బాహువును వానిమీద ఆడించుచు యుద్ధము చేయును. పూర్వమునుండి తోపెతు సిద్ధపరచబడియున్నది; అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది. లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసియున్నాడు. అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది. గంధకప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.” (యెషయా 30:​32, 33) హిన్నోము లోయలోని తోపెతు ఇక్కడ అగ్నితో మండుతున్న అలంకారిక స్థలంగా ఉపయోగించబడింది. అష్షూరు అక్కడికి చేరుతుందని చూపించడం ద్వారా యెషయా, ఆ రాజ్యంపైకి రానున్న హఠాత్‌, సంపూర్ణ నాశనాన్ని నొక్కి చెబుతున్నాడు.​—⁠2 రాజులు 23:10 పోల్చండి.

26. (ఎ) అష్షూరుకు వ్యతిరేకంగా చెప్పబడిన యెహోవా ప్రకటనలకు ఏ ఆధునిక-దిన అన్వయింపు ఉంది? (బి) క్రైస్తవులు నేడు యెహోవా కోసం ఎలా కనిపెట్టుకొని ఉంటారు?

26 ఈ తీర్పు సందేశం అష్షూరును ఉద్దేశించి చెప్పబడినప్పటికీ, యెషయా ప్రవచన ప్రాముఖ్యత ఇంకా ముందుకు వెళుతుంది. (రోమీయులు 15:4) ఒక విధంగా చెప్పాలంటే, యెహోవా తన ప్రజలను అణచివేసే వారినందరినీ ముంచెత్తడానికి, కదిలించడానికి, కళ్లెము వేసి బిగించడానికి మళ్లీ ఎంతో దూరం నుండి వస్తున్నట్లుగా ఉంటుంది. (యెహెజ్కేలు 38:18-23; 2 పేతురు 3:7; ప్రకటన 19:​11-21) ఆ దినం త్వరగా వచ్చును గాక! ఈలోగా, క్రైస్తవులు విమోచన దినం కోసం ఆతురతతో ఎదురుచూస్తారు. యెషయా 30 వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్న స్పష్టమైన మాటలను ధ్యానించడం ద్వారా వారు బలాన్ని పొందుతారు. ఈ మాటలు దేవుని సేవకులు, ప్రార్థన ఆధిక్యతను విలువైనదిగా ఎంచాలనీ, బైబిలు అధ్యయనం శ్రద్ధతో చేయాలనీ, రానున్న రాజ్య ఆశీర్వాదాలను ధ్యానించాలనీ ప్రోత్సహిస్తాయి. (కీర్తన 42:1, 2; సామెతలు 2:1-6; రోమీయులు 12:​12) అలా యెషయా మాటలు యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడానికి మనకందరికీ సహాయం చేస్తాయి.

[అధస్సూచీలు]

^ యూదా గనుక నమ్మకంగా ఉండి ఉంటే, పూర్తిగా భిన్నమైనది జరిగి ఉండేదని గమనించండి.​—⁠లేవీయకాండము 26:7, 8.

^న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌లో, కేవలం ఇక్కడ మాత్రమే యెహోవా “గొప్ప బోధకుడు” అని పిలువబడ్డాడు. అక్షరార్థంగా, హీబ్రూ మూలపాఠంలో, దాని తర్వాత ఏకవచన క్రియాపదం ఉంది గనుక, శ్రేష్ఠతను సూచిస్తూ ఆయన, ‘బోధకులు’ అని పిలువబడుతున్నాడు.

^ యెషయా 30:​25 ఆరంభంలో “గోపురములు పడు మహా హత్యదినమున” అని చదువుతాం. తొలి నెరవేర్పులో, యెషయా 30:18-26 లో ప్రవచించబడిన ఆశీర్వాదాలను ఇశ్రాయేలీయులు పొందగలిగేలా మార్గం తెరిచిన బబులోను పతనాన్ని ఇది సూచిస్తుండవచ్చు. (19 వ పేరా చూడండి.) ఇది, నూతన లోకంలో ఈ ఆశీర్వాదాల గొప్ప నెరవేర్పును సాధ్యం చేసే అర్మగిద్దోనులో జరిగే నాశనాన్ని కూడా సూచిస్తుండవచ్చు.

[అధ్యయన ప్రశ్నలు]

[305 వ పేజీలోని చిత్రాలు]

మోషే కాలంలో, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి తప్పించుకున్నారు. యెషయా కాలంలో, యూదా ఐగుప్తుకు సహాయం కోసం వెళుతుంది

[311 వ పేజీలోని చిత్రం]

‘ఎత్తయిన ప్రతికొండమీదను వాగులు నదులు పారును’

[312 వ పేజీలోని చిత్రం]

యెహోవా “కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో” వస్తాడు