కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా జనముల మీద కోపమును కుమ్మరిస్తాడు

యెహోవా జనముల మీద కోపమును కుమ్మరిస్తాడు

ఇరవై-ఏడవ అధ్యాయం

యెహోవా జనముల మీద కోపమును కుమ్మరిస్తాడు

యెషయా 34:​1-17

1, 2. (ఎ) యెహోవా ప్రతిదండన గురించి మనం ఏమి నిశ్చయత కలిగివుండవచ్చు? (బి) ప్రతిదండన చేయడం ద్వారా దేవుడు ఏమి సాధిస్తాడు?

 యెహోవా దేవుడు తన నమ్మకమైన సేవకుల విషయంలోనే కాదు, తన సంకల్పాన్ని బట్టి అవసరమైనప్పుడు, తన శత్రువుల విషయంలో కూడా దీర్ఘశాంతమును వహిస్తాడు. (1 పేతురు 3:19, 20; 2 పేతురు 3:​15) యెహోవా శత్రువులు ఆయన దీర్ఘశాంతము గుణగ్రహించక, దాన్ని అసమర్థతగానో చర్య తీసుకోవడంలో విముఖతగానో దృష్టించవచ్చు. యెషయా గ్రంథం 34 వ అధ్యాయం చూపిస్తున్నట్లుగా, చివరకు యెహోవా అన్ని సందర్భాల్లోనూ తన శత్రువులను లెక్క అప్పజెప్పమని అడుగుతాడు. (జెఫన్యా 3:8) ఎదోము, ఇతర రాజ్యాలు తన ప్రజలను వ్యతిరేకించేందుకు దేవుడు ఏ అడ్డూ లేకుండా కొంతకాలంపాటు అనుమతించాడు. కానీ ప్రతీకారం చేయడానికి యెహోవాకు తన స్వంత నిర్ణీత సమయం ఉంది. (ద్వితీయోపదేశకాండము 32:​35) అలాగే యెహోవా తన నిర్ణీత సమయంలో, తన సర్వోన్నతాధిపత్యాన్ని ధిక్కరించే ప్రస్తుత దుష్ట విధానంలోని ప్రతి విభాగానికి ప్రతిదండన చేస్తాడు.

2 దేవుడు ప్రతిదండన చేయడంలో ప్రధాన ఉద్దేశం, తన సర్వోన్నతాధిపత్యాన్ని ప్రదర్శించి, ఆయన నామమును మహిమపర్చుకోవడమే. (కీర్తన 83:13-18) ఆయన ప్రతీకారము ఆయన సేవకులు నిజంగా ఆయన ప్రతినిధులని కూడా నిరూపించి, వారిని అవాంఛనీయ పరిస్థితుల నుండి తప్పిస్తుంది. అంతేగాక, యెహోవా ప్రతీకారం ఎల్లప్పుడూ ఆయన న్యాయంతో పూర్తిగా పొందిక కలిగివుంటుంది.​—⁠కీర్తన 58:10, 11.

జనములారా, చెవియొగ్గి ఆలకించండి

3. యెహోవా యెషయా ద్వారా జనములకు ఏ ఆహ్వానాన్ని అందజేస్తున్నాడు?

3 ఎదోముకు చేసే ప్రతీకారంపై అవధానం నిలిపే ముందు, యెహోవా యెషయా ద్వారా అన్ని జనములకు ఒక గంభీరమైన ఆహ్వానాన్ని అందజేస్తున్నాడు: “రాష్ట్రములారా, నాయొద్దకు వచ్చి వినుడి. జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టినదంతయు వినును గాక.” (యెషయా 34:1) ప్రవక్త పదే పదే, దైవభక్తిలేని జనములకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇప్పుడాయన వాటికి వ్యతిరేకంగా దైవిక అధిక్షేపణల సారాంశాన్ని తెలియజేయబోతున్నాడు. ఈ హెచ్చరికలు మన కాలానికి ఏమైనా భావాన్ని కలిగివున్నాయా?

4. (ఎ) యెషయా 34:1 లో వ్రాయబడివున్నట్లుగా, ఏమి చేయడానికి జనములు పిలువబడుతున్నారు? (బి) జనములకు యెహోవా తీర్పుతీర్చడం ఆయన ఒక క్రూరమైన దేవుడని నిరూపిస్తుందా? (363 వ పేజీలోని బాక్సు చూడండి.)

4 అవును, దైవభక్తిలేని ఈ వ్యవస్థలోని అన్ని సంస్థలతో విశ్వ సర్వోన్నతాధిపతికి వివాదం ఉంది. అందుకే యెహోవా ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడేలా చేసిన బైబిలు-ఆధారిత సందేశాన్ని వినడానికి ‘జనములు,’ “భూమి” పిలువబడ్డాయి. కీర్తన 24:1 ని గుర్తుచేసే పదాలతో, భూమి అంతా ఈ సందేశాన్ని వింటుందని యెషయా చెబుతున్నాడు​—⁠యెహోవాసాక్షులు “భూదిగంతముల వరకు” ప్రకటిస్తుండడంతో, మన కాలంలో ఈ ప్రవచనం నెరవేరుతోంది. (అపొస్తలుల కార్యములు 1:8) అయినా, జనములు వినడంలేదు. రానున్న తమ నాశనాన్ని గురించి చేయబడిన హెచ్చరికను వారు గంభీరంగా తీసుకోవడంలేదు. కానీ అది, యెహోవా తన మాటలను నెరవేర్చకుండా ఆపదు.

5, 6. (ఎ) జనములు దేని గురించి లెక్క అప్పజెప్పాలని దేవుడు పిలుస్తున్నాడు? (బి) “వారి రక్తమువలన కొండలు కరగిపోవును” అన్నది ఎలా నిజమవుతుంది?

5 ప్రవచనం ఇప్పుడు, దైవభక్తిలేని జనముల విషాదభరితమైన భవితవ్యాన్ని వర్ణిస్తుంది, ఇది ఆ తర్వాత వర్ణించబడే దేవుని ప్రజల ఉజ్వలమైన నిరీక్షణకు పూర్తి భిన్నమైనది. (యెషయా 35:​1-10) ప్రవక్త ఇలా చెబుతున్నాడు: “యెహోవా కోపము సమస్త జనములమీదికి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యములమీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు; వారి శవములు కంపుకొట్టును; వారి రక్తమువలన కొండలు కరగిపోవును.”​—యెషయా 34:​2, 3.

6 దేశాల రక్తాపరాధం వైపుకు అవధానం మళ్ళించబడుతుంది. నేడు అన్నిటికన్నా ఎక్కువగా క్రైస్తవమత సామ్రాజ్య దేశాలపై రక్తాపరాధం ఉంది. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ, అనేక చిన్న పోరాటాల్లోనూ అవి భూమిని మానవ రక్తంతో తడిపాయి. ఈ రక్తాపరాధానికంతటికీ న్యాయాన్ని కోరడానికి ఎవరు తగినవారు? మరెవరోకాదు, గొప్ప జీవ-దాత అయిన సృష్టికర్తే. (కీర్తన 36:9) యెహోవా ధర్మశాస్త్రం ఈ ప్రమాణాన్ని నిర్ణయించింది: “నీవు ప్రాణమునకు ప్రాణము . . . నియమింపవలెను.” (నిర్గమకాండము 21:23-25; ఆదికాండము 9:​4-6) ఈ సూత్రం ప్రకారం, ఆయన జనముల రక్తము ప్రవహించేలా, అంటే వారు మరణించేలా చేస్తాడు. పాతిపెట్టని వారి మృత కళేబరాల దుర్గంధంతో గాలి నిండిపోతుంది​—⁠నిజంగా అవమానకరమైన మరణం! (యిర్మీయా 25:​33) ఒకవిధంగా చెప్పాలంటే, తిరిగి చెల్లించమని యెహోవా కోరే రక్తం, కొండలను కరిగించడానికి సరిపోయేంత ఉంటుంది. (జెఫన్యా 1:​17) ప్రపంచ దేశాలు, తమ సైనిక శక్తులు పూర్తిగా నాశనం చేయబడడంతో, తమ ప్రభుత్వాలు కూలిపోవడాన్ని చూస్తాయి, బైబిలు ప్రవచనంలో ప్రభుత్వాలు కొన్నిసార్లు కొండలుగా చిత్రించబడ్డాయి.​—⁠దానియేలు 2:35, 44, 45; ప్రకటన 17:9.

7. ‘ఆకాశములు’ అంటే ఏమిటి, ‘ఆకాశ సైన్యం’ అంటే ఏమిటి?

7 స్పష్టమైన అలంకారిక దృష్టాంతాన్ని ఉపయోగిస్తూ, యెషయా ఇలా చెబుతున్నాడు: “ఆకాశ సైన్యమంతయు క్షీణించును. కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును.” (యెషయా 34:4) “ఆకాశ సైన్యమంతయు” అనే వ్యక్తీకరణ, అక్షరార్థమైన నక్షత్రాలను, గ్రహాలను సూచించడం లేదు. ఐదు, ఆరు వచనాలు, ఆ ‘ఆకాశములలో’ ఉన్న రక్తమయమైన, వధించే ఖడ్గాన్ని గురించి మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇది, మానవ పరిధిలో ఉన్న దేనికో ప్రతీక అయివుండాలి. (1 కొరింథీయులు 15:​50) మానవజాతి ప్రభుత్వాలు పై అధికారాలుగా వాటికున్న ఉన్నత స్థానాన్ని బట్టి, భూసంబంధమైన మానవ సమాజంపై పరిపాలిస్తున్న ఆకాశములతో పోల్చబడ్డాయి. (రోమీయులు 13:​1-4) కాబట్టి, ‘ఆకాశ సైన్యం’ మానవజాతి యొక్క ఈ ప్రభుత్వాల సమిష్టి సైన్యాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

8. సూచనార్థకమైన ఆకాశము “కాగితపు చుట్టవలె” ఉన్నదని ఎలా నిరూపించబడుతుంది, వారి ‘సైన్యములకు’ ఏమి జరుగుతుంది?

8 ఈ ‘సైన్యం క్షీణిస్తుంది,’ పాడైపోయే వస్తువులా కుళ్ళిపోతుంది. (కీర్తన 102:26; యెషయా 51:6) అక్షరార్థమైన ఆకాశము, తెరచిన ప్రాచీన గ్రంథపు చుట్టలా మనకు కనిపిస్తుంది, సాధారణంగా గ్రంథపు చుట్టల్లో, లోపలి వైపు వ్రాయబడి ఉంటుంది. అలా వ్రాయబడిన భాగం చదవడం ముగిసిన తర్వాత గ్రంథపు చుట్ట, చుట్టబడి ప్రక్కన పడేయబడుతుంది. అలాగే, “కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును,” అంటే మానవ ప్రభుత్వాలు అంతం కావాలి. అవి, తమ చరిత్రలోని చివరి పుటకు చేరుకుని, అర్మగిద్దోనులో అంతమొందించబడతాయి. ప్రభావితం చేసేలా కనిపించే, వారి ‘సైన్యాలు’ ద్రాక్షావల్లి నుండి వాడిన ఆకులు రాలిపడినట్లు లేక అంజూరపు చెట్టునుండి “వాడినది” రాలిపడినట్లు, రాలిపోతాయి. వాటి సమయం ఇక ముగుస్తుంది.​—⁠ప్రకటన 6:12-14 పోల్చండి.

ప్రతీకార దినము

9. (ఎ) ఎదోము వంశమూలం ఏమిటి, ఇశ్రాయేలు ఎదోముల మధ్య ఎటువంటి సంబంధం ఏర్పడింది? (బి) ఎదోము గురించి యెహోవా ఏమని ఆజ్ఞాపించాడు?

9 ఇప్పుడు ప్రవచనం, యెషయా కాలంలో ఉన్న ఒక రాజ్యమైన ఎదోమును మాత్రం ఉద్దేశించి మాట్లాడుతుంది. ఎదోమీయులు, రొట్టె, చిక్కుడుకాయల వంటకము కోసం తన జ్యేష్ఠత్వాన్ని తన కవల సహాదరుడైన యాకోబుకు అమ్ముకున్న ఏశావు (ఎదోము) వంశీయులు. (ఆదికాండము 25:​24-34) ఏశావు జ్యేష్ఠత్వాన్ని యాకోబు చేజిక్కించుకున్నాడు గనుక ఏశావు తన సహోదరుడ్ని ద్వేషించాడు. ఆ తర్వాత ఎదోము జనాంగము, ఇశ్రాయేలు జనాంగము, కవల సహోదరుల నుండి వచ్చినప్పటికీ ఒకరికొకరు శత్రువులయ్యారు. దేవుని ప్రజల పట్ల ఇలా శత్రుభావాన్ని కలిగివున్నందుకు, ఎదోము యెహోవా ఆగ్రహానికి గురయ్యింది, ఆయన ఇప్పుడు ఇలా చెబుతున్నాడు: “నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును. ఎదోముమీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయమగును; అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱెపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తముచేతను పొట్టేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్పబడును. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారముచేయును.”​—యెషయా 34:​5, 6.

10. (ఎ) యెహోవా ‘ఆకాశములో’ ఖడ్గాన్ని త్రిప్పినప్పుడు ఎవరిని క్రిందికి తీసుకువస్తాడు? (బి) బబులోను యూదాపై దాడి చేసినప్పుడు ఎదోము ఏ దృక్పథాన్ని కనబరుస్తుంది?

10 ఎదోము ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉంది. (యిర్మీయా 49:16; ఓబద్యా 8, 9, 19, 21) అయినప్పటికీ, ఎదోము పరిపాలకులను వారి ఉన్నతమైన స్థానం నుండి క్రిందికి పడదోస్తూ, యెహోవా తన తీర్పు ఖడ్గమును ‘ఆకాశములో’ చాకచక్యంగా త్రిప్పినప్పుడు ఈ ప్రకృతి సిద్ధమైన దుర్గములు సహితం సహాయం చేయలేకపోతాయి. ఎదోముకు ఎంతో సైనిక శక్తి ఉంది, దేశాన్ని కాపాడడానికి దాని సాయుధ సైన్యాలు ఎత్తైన పర్వత శ్రేణులపై గస్తీ తిరుగుతాయి. కానీ బబులోను సైన్యాలు యూదాపై దాడి చేసినప్పుడు, శక్తివంతమైన ఎదోము ఏ సహాయాన్ని ఇవ్వదు. బదులుగా, యూదా రాజ్యం కూలదోయబడడాన్ని బట్టి విపరీతంగా సంతోషిస్తూ, విజయం సాధిస్తున్న యోధులను ఇంకా పురికొల్పుతుంది. (కీర్తన 137:7) ఎదోము చివరికి, ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోతున్న యూదులను చిక్కించుకుని, బబులోనీయులకు అప్పగిస్తుంది. (ఓబద్యా 11-14) ఎదోమీయులు, ఇశ్రాయేలీయుల వదిలివేయబడిన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని పథకం వేస్తారు, యెహోవాకు వ్యతిరేకంగా ప్రగల్భాలు పలుకుతారు.​—⁠యెహెజ్కేలు 35:10-15.

11. ఎదోమీయుల మోసకరమైన ప్రవర్తనకు యెహోవా ఎలా తగిన ప్రతిఫలం ఇస్తాడు?

11 సహోదర ప్రేమకొరవడిన ఎదోమీయుల ఈ ప్రవర్తనను యెహోవా చూసీచూడనట్లు వదిలేస్తాడా? లేదు. బదులుగా, ఆయన ఎదోము గురించి ఇలా ప్రవచిస్తున్నాడు: “వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడెలును దిగిపోవుచున్నవి; ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది, వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది.” (యెషయా 34:7) యెహోవా, రాజ్యములోని గొప్పవారు, తక్కువవారు సూచనార్థకమైన వృషభములు, కోడెలు, గురుపోతులు, మేకపోతులు అన్నట్లు మాట్లాడుతున్నాడు. రక్తాపరాధియైన ఈ దేశపు భూమి, యెహోవా తీర్పు అమలుచేసే “ఖడ్గము” ద్వారా ప్రజల రక్తంతో నానాలి.

12. (ఎ) ఎదోమీయులపైకి శిక్ష తీసుకురావడానికి యెహోవా ఎవరిని ఉపయోగించుకుంటాడు? (బి) ఎదోము గురించి ఓబద్యా ప్రవక్త ఏమని ప్రవచిస్తాడు?

12 సీయోను అని పిలువబడే తన భూసంస్థతో ఎదోము క్రూరంగా వ్యవహరించినందున దేవుడు దాన్ని శిక్షించడానికి సంకల్పిస్తాడు. ప్రవచనం ఇలా చెబుతుంది: “అది యెహోవా ప్రతిదండనచేయు దినము, సీయోను వ్యాజ్యెమునుగూర్చిన ప్రతికారసంవత్సరము.” (యెషయా 34:8) సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం చేయబడిన కొంతకాలానికి, బబులోను రాజు నెబుకద్నెజరు ద్వారా యెహోవా ఎదోమీయులపై తన నీతియుక్తమైన ప్రతీకారాన్ని వ్యక్తం చేయడం ప్రారంభిస్తాడు. (యిర్మీయా 25:​15-17, 21) బబులోను సైన్యాలు ఎదోముపైకి వచ్చినప్పుడు, ఎదోమీయులను ఏదీ కాపాడలేదు! ఆ పర్వత ప్రాంతంపై అది “ప్రతికారసంవత్సరము.” ఓబద్యా ప్రవక్త ద్వారా యెహోవా ముందుగా ఇలా తెలియజేస్తున్నాడు: “నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమునుబట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నెన్నటికిని లేకుండ నీవు నిర్మూలమగుదువు. . . . నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును.”​—⁠ఓబద్యా 10, 15; యెహెజ్కేలు 25:12-14.

క్రైస్తవమత సామ్రాజ్యపు నిస్తేజమైన భవితవ్యం

13. నేడు ఎదోములా ఏది ఉంది, ఎందుకు?

13 ఆధునిక కాలాల్లో, ఎదోము వంటి చరిత్రే గల ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఏది? ఆధునిక కాలాల్లో యెహోవా సేవకులను దూషించడంలో, హింసించడంలో ఎవరు నాయకత్వం వహించారు? తన మత నాయక తరగతి ద్వారా అలా చేసింది క్రైస్తవమత సామ్రాజ్యం కాదా? అవును! ఈ లోక వ్యవహారాల్లో క్రైస్తవమత సామ్రాజ్యం తనను తాను పర్వతాలంత ఎత్తుకి ఉన్నతపరచుకొంది. మానవజాతి విధానాల్లో అది తనకు ఉన్నతమైన స్థానం ఉందని చెప్పుకుంటోంది, దాని మతాలు మహా బబులోనులో ప్రధాన భాగంగా ఉన్నాయి. కానీ తన ప్రజల పట్ల, తన సాక్షుల పట్ల ఈ ఆధునిక-దిన ఎదోము యొక్క మితిమీరిన దుష్ప్రవర్తనకు యెహోవా “ప్రతికారసంవత్సరము”ను ప్రకటించాడు.

14, 15. (ఎ) ఎదోము దేశానికి, క్రైస్తవమత సామ్రాజ్యానికి ఏమి జరుగుతుంది? (బి) దహించు గంధకము, నిత్యము లేస్తూ ఉండే పొగ ఏమి సూచిస్తాయి, ఏమి సూచించవు?

14 కాబట్టి, యెషయా ప్రవచనంలోని ఈ మిగతా భాగాన్ని మనం పరిశీలిస్తుండగా, మనం ప్రాచీన ఎదోము గురించే కాదు క్రైస్తవమత సామ్రాజ్యం గురించి కూడా ఆలోచిద్దాము: “ఎదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును; దాని భూమి దహించు గంధకముగా ఉండును. అది రేయింబగళ్లు ఆరక యుండును; దాని పొగ నిత్యము లేచును.” (యెషయా 34:9, 10) ఎదోము దేశం ఎంతగా ఎండిపోతుందంటే, దాని మన్ను గంధకములాగాను, దాని కాలువలు నీటితో కాక కీలుతో నిండివున్నట్లుగాను ఉంటుంది. అప్పుడు, సులభంగా కాలే గుణమున్న ఈ పదార్థాలకు నిప్పంటించబడుతుంది!​—⁠ప్రకటన 17:16 పోల్చండి.

15 మంట, కీలు, గంధకముల ప్రస్తావన, కాలుతున్న నరకం ఉందనడానికి నిదర్శనమని కొందరు భావించారు. కానీ ఎదోము ఎల్లప్పుడూ కాలుతూ ఉండడానికి అవాస్తవిక నరకాగ్నిలోకి పడద్రోయబడలేదు. బదులుగా, అగ్ని గంధకాలకు పూర్తిగా ఆహుతి అయినట్లు అది ప్రపంచ దృశ్యం నుండి అంతర్దానమవుతూ నాశనం చేయబడింది. ప్రవచనం ఇంకా తెలియజేస్తున్నట్లుగా, తుది ఫలితం నిత్యం హింసించబడడం కాదు గానీ అది ‘తారుమారు అవుతుంది, శూన్యమైపోతుంది, గతమైపోతుంది.’ (యెషయా 34:​11, 12) ‘నిత్యము లేచే’ పొగ దీన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఒక ఇల్లు కాలిపోయినప్పుడు, మంటలు ఆరిపోయిన కొంతసేపటి వరకూ బూడిదలో నుండి పొగ పైకి లేస్తూనే ఉంటుంది, ఇల్లు కాలిందని అది చూసేవారికి నిదర్శనాన్ని ఇస్తుంది. క్రైస్తవులు నేడు ఎదోము నాశనం నుండి పాఠాలు నేర్చుకుంటున్నారు గనుక, ఒక విధంగా, ఎదోము కాలుతున్న పొగ ఇంకా పైకిలేస్తూనే ఉంది.

16, 17. ఎదోము ఏమి అవుతుంది, అది ఆ స్థితిలో ఎంత కాలంపాటు కొనసాగుతుంది?

16 ఎదోము మానవ జనాభా స్థానంలో క్రూర జంతువులు ఉంటాయని చెబుతూ, రానున్న నాశనాన్ని సూచిస్తూ యెషయా ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “అది తరతరములు పాడుగా నుండును, ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు. గూడబాతులును ఏదుపందులును దాని ఆక్రమించుకొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును; ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును. రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు, దాని అధిపతులందరు గతమైపోయిరి. ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును, దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును; అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును. అడవిపిల్లులును నక్కలును అచ్చట కలిసికొనును అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును. అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును చిత్తగూబ గూడు కట్టుకొనును. అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును.”​—యెషయా 34:10-15. *

17 అవును, ఎదోము దేశం నిర్జనమవుతుంది. అది కేవలం క్రూరమృగాలు, పక్షులు, పాములు ఉన్న బంజరు భూమిలా తయారవుతుంది. దేశం యొక్క ఈ బీడుబారిన స్థితి, 10 వ వచనం చెబుతున్నట్లుగా “తరతరములు” కొనసాగుతుంది. పునఃస్థాపన జరుగదు.​—⁠ఓబద్యా 18.

యెహోవా మాటల ఖచ్చితమైన నెరవేర్పు

18, 19. “యెహోవా గ్రంథము” అంటే ఏమిటి, ఈ “గ్రంథము”లో క్రైస్తవమత సామ్రాజ్యం కోసం ఏమి నిర్ణయించబడి ఉంది?

18 ఎదోము ఆధునిక-దిన సమానమైన క్రైస్తవమత సామ్రాజ్యానికి ఇదెంత నిరాశాపూరిత భవితవ్యాన్ని చూపిస్తుందోకదా! అది తాను యెహోవా దేవుని బద్ధ శత్రువుగా నిరూపించుకుంది, ఆయన సాక్షులను అది క్రూరంగా హింసిస్తోంది. యెహోవా తన మాటను నెరవేరుస్తాడన్న దానిలో ఎటువంటి సందేహము లేదు. నాశనం చేయబడిన ఎదోములో నివసించే జీవుల్లో ప్రతి దానికి ‘తమ జతది’ ఉన్నంత ఖచ్చితంగా, ఎవరైనా ప్రవచనాన్ని నెరవేర్పుతో పోల్చినప్పుడల్లా, ఆ రెండు ఒకదానితో ఒకటి సరిపడుతున్నట్లుగా ఉంటాయి. యెషయా, భవిష్యద్‌ బైబిలు ప్రవచన విద్యార్థులను ఉద్దేశించి ఇలా చెబుతున్నాడు: “యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి: ఆ జంతువులలో ఏదియు లేక యుండదు; దేని జతపక్షి దానియొద్ద ఉండక మానదు, నా నోటనుండి వచ్చిన ఆజ్ఞ యిదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగుచేయును. అవి రావలెనని ఆయన చీట్లువేసెను, ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును. అవి నిత్యము దాని ఆక్రమించుకొనును; యుగయుగములు దానిలో నివసించును.”​—యెషయా 34:16, 17.

19 త్వరలో రానున్న, క్రైస్తవమత సామ్రాజ్య నాశనం గురించి “యెహోవా గ్రంథము”లో ప్రవచించబడింది. క్రూరులైన తన శత్రువులతోను, పశ్చాత్తాపం లేకుండా తన ప్రజలను అణచివేస్తున్నవారితోను యెహోవా సరిచూసుకునే లెక్కల గురించి ఈ “యెహోవా గ్రంథము” వివరిస్తుంది. ప్రాచీన ఎదోము గురించి వ్రాయబడినది నిజమైంది, ఎదోముకు ఆధునిక-దిన సమానమైన క్రైస్తవమత సామ్రాజ్యానికి అన్వయించే ప్రవచనం కూడా అలాగే నిజమవుతుందన్న మన నమ్మకాన్ని ఇది బలపరుస్తుంది. యెహోవా చర్య తీసుకోవడానికి ప్రమాణం అయిన “కొలనూలు,” ఆధ్యాత్మికంగా మరణశయ్యపై ఉన్న ఈ సంస్థ నిర్జనమైన బంజరు భూమి అవుతుందని హామీ ఇస్తోంది.

20. ప్రాచీన ఎదోము వలె, క్రైస్తవమత సామ్రాజ్యం ఏమి అనుభవిస్తుంది?

20 క్రైస్తవమత సామ్రాజ్యం తన రాజకీయ స్నేహితులను ప్రీతిపరచడానికి తాను చేయగలిగినదంతా చేస్తుంది కానీ ఏమాత్రం ప్రయోజనం చేకూరదు! ప్రకటన 17, 18 అధ్యాయాల ప్రకారం, సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు, క్రైస్తవమత సామ్రాజ్యంతో సహా మహాబబులోను అంతటికీ వ్యతిరేకంగా చర్య తీసుకునేలా వారి హృదయాల్లో తలంపు కలిగిస్తాడు. ఇది భూమి అంతటి నుండి నకిలీ క్రైస్తవత్వాన్ని నిర్మూలిస్తుంది. క్రైస్తవమత సామ్రాజ్య స్థితి యెషయా 34 వ అధ్యాయంలో వర్ణించబడిన నిస్తేజమైన స్థితిలా అవుతుంది. “సర్వాధికారియైన దేవుని మహాదినమున” జరిగే తుది “యుద్ధము” సమయంలో అది ఉండనే ఉండదు! (ప్రకటన 16:​14) ప్రాచీన ఎదోము వలె, క్రైస్తవమత సామ్రాజ్యం “తరతరముల”కు భూమిపైనుండి పూర్తిగా నిర్మూలించబడుతుంది.

[అధస్సూచి]

^ మలాకీ కాలానికల్లా ఈ ప్రవచనం నెరవేరింది. (మలాకీ 1:3) నాశనం చేయబడిన తమ దేశాన్ని తిరిగిపొందాలని ఎదోమీయులు నిరీక్షించారని మలాకీ నివేదిస్తున్నాడు. (మలాకీ 1:4) అయితే, యెహోవా చిత్తం అది కాదు, తర్వాత వేరే ప్రజలు అంటే నబటీయులు ఒకప్పటి ఎదోము దేశాన్ని ఆక్రమించుకున్నారు.

[అధ్యయన ప్రశ్నలు]

[363 వ పేజీలోని బాక్సు]

ఆగ్రహంగల దేవుడా?

యెషయా 34:2-7 వచనాల్లో కనిపించేలాంటి వ్యక్తీకరణలు, హీబ్రూ లేఖనాల్లో వర్ణించబడినట్లుగా యెహోవా క్రూరమైన, ఆగ్రహంగల దేవుడని అనేకులు అనుకునేలా చేశాయి. అది నిజమేనా?

లేదు. దేవుడు కొన్నిసార్లు తన ఆగ్రహాన్ని వ్యక్తపరచినప్పటికీ, అలాంటి ఆగ్రహం ఎల్లవేళలా న్యాయబద్దమైనదే. ఎప్పుడూ సూత్రాధారితమైనదే, అది అదుపుచేసుకోలేని భావోద్వేగాలపై ఆధారపడినది కాదు. అంతేగాక, అది అన్ని సందర్భాల్లో అనితర భక్తిని పొందడానికి సృష్టికర్తకు ఉన్న హక్కుతో, అలాగే సత్యాన్ని ఉన్నతపరచడంలో ఆయన స్థిరత్వంతో ఆదేశించబడుతుంది. దైవిక ఆగ్రహం, నీతిపట్ల దేవునికున్న ప్రేమతోనూ, నీతిని అవలంభించేవారిపట్ల ఆయనకున్న ప్రేమతోనూ నియంత్రించబడుతుంది. ఒక విషయంలో చేరివున్న అన్ని అంశాలను యెహోవా చూస్తాడు, పరిస్థితిని గురించిన సంపూర్ణ, అపరిమితమైన జ్ఞానం ఆయనకు ఉంది. (హెబ్రీయులు 4:​13) ఆయన హృదయాలను చదువుతాడు; అజ్ఞానం, నిర్లక్ష్యం, లేక ఉద్దేశపూర్వకమైన పాపం ఎంత మేరకు ఉందన్నది ఆయన గమనిస్తాడు; ఆయన నిష్పక్షపాతంగా చర్య తీసుకుంటాడు.​—⁠ద్వితీయోపదేశకాండము 10:17, 18; 1 సమూయేలు 16:7; అపొస్తలుల కార్యములు 10:​34, 35.

అయితే, యెహోవా దేవుడు “దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల”వాడు. (నిర్గమకాండము 34:6) ఆయనకు భయపడి, నీతిని అనుసరించడానికి కృషి చేసేవారు కనికరాన్ని పొందుతారు ఎందుకంటే, సర్వశక్తిమంతుడు మానవుని వారసత్వ అపరిపూర్ణతను గుర్తించి, ఈ విషయాన్ని బట్టి అతనిపై కనికరం చూపిస్తాడు. దేవుడు నేడు, యేసు బలి ఆధారంగా దీన్ని చేస్తున్నాడు. (కీర్తన 103:​13, 14) తమ పాపాన్ని అంగీకరించి, పశ్చాత్తాపపడి, నిజంగా ఆయన సేవ చేసేవారిపై నుండి సరైన సమయంలో యెహోవా కోపము చల్లారుతుంది. (యెషయా 12:1) ప్రాథమికంగా, యెహోవా ఆగ్రహం గల దేవుడు కాదు గాని సంతోషంగల దేవుడు, సమీపించనసాధ్యమైన దేవుడు కాదుగానీ సాదరంగా ఆహ్వానించే దేవుడు, సమాధానపరుడు, సరైన విధంగా తనను సమీపించేవారి ఎడల శాంతంగా ఉంటాడు. (1 తిమోతి 1:​11) అన్యుల అబద్ధ దేవుళ్ళకు ఆపాదించబడే, ఆ దేవుళ్ల విగ్రహాల్లో చూపించబడే నిర్దాక్షిణ్యమైన, క్రూరమైన లక్షణాలకు ఇది పూర్తి భిన్నం.

[362 వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

దాను

గలిలయ సముద్రం

మెగిద్దో

యొర్దాను నది

రామోత్గిలాదు

షోమ్రోను

యెరూషలేము

బెయేర్షెబా

కిర్హరెశెతు

కాదేషుబర్నేయ

మహాసముద్రము

మోయాబు

ఎదోము

ఉప్పు సముద్రం

తూరు

రబ్బా

అమ్మోను

లాకీషు

యూదా

బొస్రా

తేమాను

ఫిలిష్తియ

ఇశ్రాయేలు

సీదోను

దమస్కు

లిబ్నా

[359 వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవమత సామ్రాజ్యం భూమిని రక్తంతో తడిపింది

[360 వ పేజీలోని చిత్రం]

“కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును”