కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తూరు గర్వాతిశయమును అపవిత్రపరుస్తాడు

యెహోవా తూరు గర్వాతిశయమును అపవిత్రపరుస్తాడు

పందొమ్మిదవ అధ్యాయం

యెహోవా తూరు గర్వాతిశయమును అపవిత్రపరుస్తాడు

యెషయా 23:1-18

1, 2. (ఎ) ప్రాచీన తూరు ఎటువంటి నగరం? (బి) తూరుకు ఏమి సంభవిస్తుందని యెషయా ప్రవచించాడు?

 అది “సంపూర్ణ సౌందర్యము” గలది, దానిలో “నానా విధమైన సరకులు” సమృద్ధిగా ఉన్నాయి. (యెహెజ్కేలు 27:​4, 12) దాని ఓడలు పెద్ద సమూహంగా సముద్రంపై ప్రయాణించి సుదూర ప్రాంతాలకు వెళతాయి. అది ‘మహాఘనముగా సముద్రముమీద కూర్చుంది,’ అది తన ‘విస్తారమైన పదార్థములతో భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసింది.’ (యెహెజ్కేలు 27:​25, 33) సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో, మధ్యధరా సముద్రానికి తూర్పువైపు చివరన ఉన్న ఫేనీకే నగరం అయిన తూరు స్థితి అలా ఉంది.

2 అయినప్పటికీ, తూరుకు నాశనం సమీపంలో ఉంది. ఫేనీకే ఆశ్రయదుర్గమైన ఆ నగరాన్ని యెహెజ్కేలు వర్ణించడానికి దాదాపు 100 సంవత్సరాలు ముందే, యెషయా ప్రవక్త అది కూలిపోతుందని, దానిపై ఆధారపడేవారికి దుఃఖం కలుగుతుందని ప్రవచించాడు. కొంతకాలం తర్వాత దేవుడు మళ్లీ ఆ నగరం వైపుకు తన అవధానం మళ్ళించి, అది తిరిగి వర్ధిల్లేందుకు అనుమతిస్తాడని కూడ యెషయా ప్రవచించాడు. ప్రవక్త మాటలు ఎలా నెరవేరాయి? తూరుకు సంభవించిన దానంతటి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? దానికి ఏమి సంభవించింది, ఎందుకు అలాంటి సంగతులు జరిగాయి అనే దాని గురించిన స్పష్టమైన అవగాహన, యెహోవాపై ఆయన వాగ్దానాలపై మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.

“తర్షీషు ఓడలారా, అంగలార్చుడి!”

3, 4. (ఎ) తర్షీషు ఎక్కడ ఉండేది, తూరుకు తర్షీషుకు మధ్యనున్న సంబంధం ఏమిటి? (బి) తర్షీషుతో వర్తకం జరిపే నావికులు ‘అంగలార్చడం’ ఎందుకు సహేతుకం?

3 “తూరునుగూర్చిన దేవోక్తి” అనే శీర్షిక క్రింద యెషయా ఇలా ప్రకటిస్తున్నాడు: “తర్షీషు ఓడలారా, అంగలార్చుడి! తూరు పాడైపోయెను. ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు.” (యెషయా 23:1) తర్షీషు స్పెయిన్‌లో ఒక భాగంగా ఉండేదని విశ్వసించబడుతుంది, స్పెయిన్‌ మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్న తూరుకు ఎంతో దూరంలోవుంది. * అయినప్పటికీ, ఫేనీకేవారు నిపుణులైన నావికులు, వారి ఓడలు చాలా పెద్దవి, సముద్రయానం చేయడంలో సమర్థవంతమైనవి. చంద్రునికీ సముద్రపు ఆటుపోట్లకూ సంబంధం ఉందని గమనించిన మొదటివారు, ఖగోళశాస్త్రాన్ని నౌకాయాన సహాయకంగా ఉపయోగించిన మొదటివారు ఫేనీకేవారేనని కొందరు చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. కాబట్టి తూరుకు తర్షీషుకు మధ్యనున్న పెద్ద దూరం వారికి ఒక అడ్డంకి కాదు.

4 యెషయా కాలంలో, సుదూరంలోవున్న తర్షీషు తూరుకు వాణిజ్య కేంద్రంగా ఉండి, బహుశా దాని చరిత్రలో కొంతకాలం పాటు దాని సంపదలకు ముఖ్య నిలయంగా ఉండివుండవచ్చు. స్పెయిన్‌లో వెండి, ఇనుము, తగరము, ఇతర లోహాలు సమృద్ధిగా ఉన్న గనులున్నాయి. (యిర్మీయా 10:9; యెహెజ్కేలు 27:12 పోల్చండి.) ‘తర్షీషు ఓడలు,’ ఇవి బహుశా తూరు నుండి వచ్చి తర్షీషుతో వర్తకం జరిపే ఓడలు కావచ్చు, ‘అంగలార్చడానికి’ అంటే తమ స్వంత ఓడరేవు నాశనం కావడంవల్ల విలపించడానికి మంచి కారణమే ఉంటుంది.

5. తర్షీషు నుండి వస్తున్న నావికులు తూరు పడిపోవడం గురించి ఎక్కడ తెలుసుకొంటారు?

5 తూరు పడిపోవడం గురించి సముద్రంపైనున్న ఓడవారు ఎలా తెలుసుకుంటారు? యెషయా ఇలా సమాధానం ఇస్తున్నాడు: “కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను.” (యిషయా 23:1బి) “కిత్తీయుల దేశము” బహుశా సైప్రస్‌ ద్వీపాన్ని సూచిస్తుండవచ్చు, అది ఫేనీకే తీరానికి పశ్చిమంగా దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్షీషు నుండి తూర్పు వైపుగా ప్రయాణిస్తున్న ఓడలు తూరుకు చేరడానికి ముందు వాటికి ఇదే చివరి మజిలీ. కాబట్టి, నావికులు సైప్రస్‌లో ఆగినప్పుడు, తమ ప్రియమైన స్వంత ఓడరేవు జయింపబడిందనే వార్త తెలుసుకొంటారు. వాళ్లకది ఎంత దిగ్భ్రాంతి కలిగిస్తుందో కదా! దుఃఖితులై వాళ్లు దిగులుతో ‘అంగలారుస్తారు.’

6. తూరు సీదోనుల మధ్యనున్న సంబంధాన్ని వివరించండి.

6 ఫేనీకే సముద్రతీరపు ప్రజలు కూడా దిగులు చెందుతారు. ప్రవక్త ఇలా చెబుతున్నాడు: “సముద్రతీరవాసులారా, అంగలార్చుడి. సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరకులతో నిన్ను నింపిరి. షీహోరు నది ధాన్యము నైలునది పంట సముద్రముమీద నీలోనికి తేబడుచుండెను; తూరువలన జనములకు లాభము వచ్చెను.” (యెషయా 23:​2, 3) ‘సముద్రతీరవాసులు’ అంటే తూరు ఇరుగుపొరుగు వారు, తూరుకు సంభవించిన నాశనకరమైన పతనాన్ని బట్టి అమితాశ్చర్యంతో అంగలారుస్తారు. ఈ సముద్రతీరాన్ని సుసంపన్నం చేస్తూ దాన్ని ‘సరుకులతో నింపిన’ “సీదోను వర్తకులు” ఎవరు? ప్రాథమికంగా తూరు తనకు ఉత్తరాన కేవలం 35 కిలోమీటర్ల దూరంలోవున్న ఓడరేవు నగరమైన సీదోను ఆధిపత్యం క్రింద ఉండేది. సీదోను తన నాణెములపై తనను తాను తూరుకు తల్లిగా వర్ణించుకొంటుంది. తూరు సీదోనుకంటే ఎక్కువ సంపదలను సమకూర్చుకున్నప్పటికీ, అది ‘సీదోను కన్యకనే,’ దాని నివాసులు తమను తాము సీదోనీయులుగానే చెప్పుకుంటారు. (యెషయా 23:​12) కాబట్టి “సీదోను వర్తకులు” అనే వ్యక్తీకరణ బహుశా వాణిజ్యపరంగా తూరుకి వచ్చి నివసిస్తున్నవారిని సూచిస్తుండవచ్చు.

7. సీదోను వర్తకులు తమ సంపదలను ఎలా విస్తరింపజేసుకొన్నారు?

7 సంపన్నులైన సీదోను వర్తకులు వాణిజ్య సంబంధమైన కార్యకలాపాల కోసం మధ్యధరా సముద్రంపై ప్రయాణిస్తారు. వారు, షీహోరునది ధాన్యాన్ని అనేక ప్రాంతాలకు తీసుకువెళ్తారు, ఈ షీహోరు నది ఐగుప్తు నదీముఖప్రాంతంలో ఉన్న నైలు నది యొక్క తూర్పు శాఖ. (యిర్మీయా 2:18 పోల్చండి.) “నైలునది పంట”లో ఐగుప్తు నుండి వచ్చే ఇతర ఉత్పత్తులు కూడా భాగమే. అలాంటి వస్తువుల వర్తకం మరియు వస్తు మార్పిడి ద్వారా చేసే వ్యాపారం, సముద్రయానం చేసే ఈ వర్తకులకు, అలాగే వారు ఏ దేశాలతోనైతే వ్యాపారం చేస్తారో ఆ దేశాలకు ఎంతో లాభదాయకమైనవి. సీదోను వర్తకులు తూరును ఆదాయంతో నింపేస్తారు. నిజంగా, దాని నాశనాన్ని బట్టి వాళ్లు దుఃఖిస్తారు!

8. తూరు నాశనం సీదోనుపై ఏ ప్రభావాన్ని చూపిస్తుంది?

8 తర్వాత యెషయా సీదోనును ఉద్దేశించి ఈ మాటలు చెబుతున్నాడు: “సీదోనూ, సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము మాటలాడుచున్నది​—⁠నేను ప్రసవవేదనపడనిదానను పిల్లలు కననిదానను యౌవనస్థులను పోషింపనిదానను కన్యకలను పెంచనిదానను.” (యెషయా 23:4) తూరు నాశనం తర్వాత, ఇంతకుముందు నగరమున్న తీరరేఖ ఖాళీగా, నిర్జనంగా కనిపిస్తుంది. తన పిల్లలను కోల్పోయి, మిక్కిలి వ్యాకులతతో, అసలు తనకు పిల్లలే కలుగలేదని చెప్పే తల్లిలా సముద్రం తీవ్రబాధతో ఎలుగెత్తి ఏడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. సీదోను తన కుమార్తెకు జరిగేదాన్ని బట్టి సిగ్గుపడుతుంది.

9. తూరు కూలిపోయినప్పుడు ప్రజలకు కలిగే దుఃఖం, మరే ఇతర సంఘటనలు జరిగినప్పుడు కలిగే దిగ్భ్రాంతిని పోలి ఉంటుంది?

9 అవును, తూరు నాశనాన్ని గురించిన వార్త అనేక ప్రాంతాలవారికి దుఃఖాన్ని కలిగిస్తుంది. యెషయా ఇలా చెబుతున్నాడు: “ఆ వర్తమానము ఐగుప్తీయులు విని [“ప్రజలు ఐగుప్తును గూర్చిన వర్తమానమును విని దుఃఖించినట్లు,” NW] తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు.” (యెషయా 23:5) ప్రలాపిస్తున్న వారి బాధ, ఐగుప్తును గూర్చిన వర్తమానము వినడం ద్వారా కలిగే బాధను పోలి ఉంటుంది. ప్రవక్త ఏ వర్తమానమును ఉద్దేశిస్తున్నాడు? బహుశా ఆయన మునుపు చెప్పిన “ఐగుప్తును గూర్చిన దేవోక్తి” యొక్క నెరవేర్పును గురించి అయ్యుండవచ్చు. * (యెషయా 19:​1-25) లేదా బహుశా, మోషే కాలంలో ఫరో సైన్యం నాశనం కావడాన్ని గురించిన వర్తమానం గురించి కావచ్చు. ఆ వర్తమానం అనేక దేశాల్లోని ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. (నిర్గమకాండము 15:4, 5, 14-16; యెహోషువ 2:​9-11) విషయం ఏదైనప్పటికీ, తూరు నాశనాన్ని గురించిన వర్తమానాన్ని వినేవారు తీవ్రమైన బాధను అనుభవిస్తారు. ఆశ్రయం కోసం దూరానున్న తర్షీషుకు పారిపొమ్మని వారు కోరబడుతున్నారు, బిగ్గరగా దుఃఖాన్ని వ్యక్తం చేయమని వారికి ఆజ్ఞాపించబడుతుంది: “తర్షీషునకు వెళ్లుడి; సముద్రతీరవాసులారా, అంగలార్చుడి.”​—యెషయా 23:6.

“ప్రాచీన కాలము” నుండి అది సంతోషిస్తోంది

10-12. తూరు సంపదను, ప్రాచీనతను, ప్రాబల్యాన్ని వివరించండి.

10 “నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలముననుండిన పట్టణమిదేనా?” అని అడిగినప్పుడు యెషయా మనకు గుర్తు చేస్తున్నట్లుగా, తూరు ఒక ప్రాచీన నగరం. (యెషయా 23:7) తూరు యొక్క వర్ధమాన చరిత్ర కనీసం యెహోషువ కాలంనాటి నుండే ఉంది. (యెహోషువ 19:​29) సంవత్సరాలు గడుస్తుండగా, తూరు లోహ వస్తువులు, గాజు వస్తువులు, ధూమ్రవర్ణముగల పొడి తయారీలో పేరుపొందింది. తూరులో తయారయ్యే ధూమ్రవర్ణముగల వస్త్రములు చాలా ఖరీదైనవి, తూరు యొక్క ఖరీదైన వస్త్రాలంటే శ్రీమంతులు మక్కువ చూపేవారు. (యెహెజ్కేలు 27:​7, 24 పోల్చండి.) దూరదేశాల నుండి వచ్చే వ్యాపారస్తులకు తూరు వర్తక కేంద్రంగా ఉండేది, అలాగే అది ఎగుమతి-దిగుమతులకు కేంద్ర స్థానంగా కూడా ఉండేది.

11 అంతేగాక, ఆ నగరం సైనికపరంగా శక్తివంతమైనది. “ఫేనీకేవారు​—⁠వ్యాపారులే గానీ సైనికులు కాదు​—⁠యుద్ధమంటే ప్రత్యేకంగా ఇష్టపడకపోయినప్పటికీ, వారు తమ నగరాలను పిచ్చి ధైర్యంతో, మొండిగాపోరాడి పరిరక్షించుకునేవారు. ఈ లక్షణాలతోపాటు వారికున్న నావిక బలం, ఆ కాలాల్లో అత్యంత శక్తివంతమైనదైన అష్షూరు సైన్యానికి వ్యతిరేకంగా నిలబడ్డానికి తూరువారికి సహాయం చేశాయి” అని ఎల్‌. స్ప్రేగ్‌ డీ కాంప్‌ వ్రాస్తున్నాడు.

12 నిజంగా, తూరు మధ్యధరా ప్రపంచంలో తనదంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకొంటుంది. “పరదేశనివాసముచేయుటకు దూరప్రయాణము చేసినదిదేనా?” (యెషయా 23:7బి) ఫేనీకేవారు దూరదేశాలకు ప్రయాణించి వ్యాపార కేంద్రాలను, విశ్రాంతి రేవులను నెలకొల్పారు, కొన్ని సందర్భాల్లో ఇవే వలస రాజ్యాలుగా అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు, ఆఫ్రికా ఉత్తర తీరప్రాంతానున్న కార్తిజ్‌, తూరు వలస రాజ్యమే. కొంతకాలానికి, ఇది మధ్యధరా ప్రపంచంలో ప్రాబల్యం విషయంలో తూరును, ప్రత్యర్థి అయిన రోమును మించిపోతుంది.

దాని గర్వాతిశయము అపవిత్రపరచబడుతుంది

13. తూరుకు వ్యతిరేకంగా తీర్పు ప్రకటన చేయడానికి ఎవరు సాహసించగలరనే ప్రశ్న ఎందుకు లేవదీయబడింది?

13 తూరుకున్న ప్రాచీనత, సంపద దృష్ట్యా ఈ తర్వాతి ప్రశ్న యుక్తమైనది: “దాని వర్తకులు రాజసమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు. కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయనెవడు ఉద్దేశించెను?” (యెషయా 23:8) తన వలస రాజ్యాల్లోనూ మరితర స్థలాల్లోనూ ఉన్నత అధికారిక స్థానాల్లో శక్తివంతమైన వ్యక్తులను నియమించి, తద్వారా ‘కిరీటముల నిచ్చుచున్న’ నగరానికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఎవరు చేయగలరు? రాజసమానులైన వర్తకులు, భూనివాసులలో ఘనులైన వ్యాపారులు గల రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఎవరు చేయగలరు? లెబనాన్‌లో ఉన్న నేషనల్‌ మ్యూజియమ్‌ ఆఫ్‌ బీరూట్‌లో మునుపు పురావస్తు సంచాలకునిగా పనిచేసిన మొరీస్‌ షేహాబ్‌ ఇలా అన్నాడు: “ఇరవైయవ శతాబ్దారంభంలో లండన్‌కు ఎంత ప్రాధాన్యత ఉండేదో అంతటి ప్రాధాన్యతను తూరు క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్దం నుండి ఆరవ శతాబ్దం వరకు కాపాడుకుంది.” కాబట్టి ఈ నగరానికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఎవరు చేయగలరు?

14. తూరుకు వ్యతిరేకంగా ఎవరు తీర్పును ప్రకటిస్తారు, ఎందుకు?

14 ప్రేరేపిత సమాధానం తూరులో దిగ్భ్రాంతిని కలుగజేస్తుంది. యెషయా ఇలా చెబుతున్నాడు: “సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయనుద్దేశించెను.” (యెషయా 23:9) యెహోవా ఈ సంపన్నమైన ప్రాచీన నగరానికి వ్యతిరేకంగా ఎందుకు తీర్పును ప్రకటిస్తాడు? దాని నివాసులు అబద్ధ దేవుడైన బయలు ఆరాధకులు అయినందుకా? ఇశ్రాయేలీయుడైన ఆహాబును వివాహం చేసుకొని యెహోవా ప్రవక్తలను సామూహిక సంహారం చేయించిన యెజెబెలుతో తూరుకున్న సంబంధం దానికి కారణమా, ఈమె తూరుతో సహా సీదోనుకు రాజు అయిన ఎత్బయలు కుమార్తె. (1 రాజులు 16:​29, 31; 18:​4, 13, 19) ఈ రెండు ప్రశ్నలకూ కాదు అన్నదే సమాధానం. తూరు దానికున్న అహంకారపూరిత గర్వాతిశయమును బట్టి ఖండించబడింది, అది ఇశ్రాయేలీయులతో సహా ఇతర ప్రజలను దోచుకొని తనను తాను సుసంపన్నం చేసుకొంది. సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో, యోవేలు ప్రవక్త ద్వారా, యెహోవా తూరుకు ఇతర నగరాలకు ఇలా చెప్పాడు: “యూదావారిని యెరూషలేము పట్టణపువారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి.” (యోవేలు 3:6) తన నిబంధన ప్రజలతో, కేవలం వర్తకపు సరకులతో వ్యవహరించినట్లు వ్యవహరించడాన్ని దేవుడు క్షమించగలడా?

15. నెబుకద్నెజరు యెరూషలేమును నాశనం చేసినప్పుడు తూరు ఎలా ప్రతిస్పందిస్తుంది?

15 వంద సంవత్సరాలు గడచినా తూరు మారదు. బబులోను రాజు నెబుకద్నెజరు సైన్యం సా.శ.పూ. 607 లో యెరూషలేమును నాశనం చేసినప్పుడు, తూరు ఇలా సంతోషిస్తుంది: “ఆహా! జనములకు ద్వారముగానున్న పట్టణము [యెరూషలేము] పడగొట్టబడెను, అది నా వశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని.” (యెహెజ్కేలు 26:2) యెరూషలేము నాశనం నుండి ప్రయోజనం పొందాలని అనుకుంటూ, తూరు ఉల్లసిస్తుంది. యూదా రాజధాని తనకిక పోటీగా లేకపోవడంతో, తాను మరింత వర్తకం చేయగలనని అనుకుంటుంది. గర్వంతో తన ప్రజల శత్రువుల పక్షం వహించే, “ఘనుల”మని చెప్పుకొనే వారితో యెహోవా తిరస్కారపూర్వకంగా వ్యవహరిస్తాడు.

16, 17. నగరం నాశనం చేయబడినప్పుడు దాని నివాసులకు ఏమి జరుగుతుంది? (అధస్సూచి చూడండి.)

16 యెహోవా తూరును ఖండించడాన్ని ఇలా కొనసాగిస్తున్నాడు: “తర్షీషుకుమారీ, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను, నైలునది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము. ఆయన సముద్రముమీద తన చెయ్యి చాపెను; రాజ్యములను కంపింపజేసెను. కనాను [“ఫేనికే,” NW] కోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. మరియు ఆయన​—⁠సీదోను కన్యకా, చెరపబడినదానా, నీకికను సంతోషముండదు. నీవు లేచి కిత్తీముకు దాటి పొమ్ము. అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు.”​—యెషయా 23:10-12.

17 తూరు ‘తర్షీషుకుమారి’ అని ఎందుకు పిలువబడుతుంది? బహుశా, తూరు ఓడిపోయిన తర్వాత, ఆ రెండింటిలో తర్షీషు అత్యంత శక్తివంతమైన నగరంగా ఉండడం వల్ల కావచ్చు. * నాశనం చేయబడిన తూరు యొక్క నివాసులు, వరదలు వచ్చినప్పుడు కట్టలు తెగి నీరంతా చుట్టుపక్కల మైదానాల్లోకి ప్రవహించే నదిలా చెల్లాచెదరైపోతారు. ‘తర్షీషు కుమారికి’ యెషయా ఇచ్చే సందేశం, తూరుకు జరుగబోయేదాని తీవ్రతను నొక్కి చెబుతోంది. యెహోవా తానే తన చెయ్యి చాపి ఆ ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. పర్యవసానాన్ని ఎవరూ మార్చలేరు.

18. తూరు ‘సీదోను కన్యక’ అని ఎందుకు పిలువబడుతుంది, దాని స్థితి ఎలా మారుతుంది?

18 యెషయా తూరు గురించి ‘సీదోను కన్యక’ అని కూడా అంటూ, మునుపు దాన్ని విదేశీ యోధులెవరూ ముట్టడి వేయలేదనీ, దోచుకోలేదనీ, అది ఎవరి వశంలోనూ లేదనీ సూచిస్తున్నాడు. (2 రాజులు 19:21; యెషయా 47:1; యిర్మీయా 46:11 పోల్చండి.) అయితే ఇప్పుడు అది నిర్మూలించబడవలసి ఉంది, దాని నివాసుల్లో కొందరు శరణార్థుల్లా కిత్తీములోని ఫేనీకే వలసరాజ్యానికి దాటి పోతారు. అయినప్పటికీ, వారు తమ ఆర్థిక శక్తిని కోల్పోయి, అక్కడ కూడా నెమ్మది పొందరు.

కల్దీయులు దాన్ని పాడుచేస్తారు

19, 20. తూరును ఎవరు జయిస్తారని ప్రవచించబడింది, ఆ ప్రవచనం ఎలా నెరవేరింది?

19 తూరుపై యెహోవా తీర్పును ఏ రాజకీయ శక్తి అమలు చేస్తుంది? యెషయా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇదిగో! కల్దీయుల దేశమును చూడుము. వారికను జనముగా ఉండరు, అష్షూరీయులు దానిని అడవిమృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు; తర్షీషు ఓడలారా, అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను.” (యెషయా 23:​13, 14) అష్షూరీయులు కాదుగానీ కల్దీయులు తూరును జయిస్తారు. వారు ముట్టడి వేసేందుకు కోటలు కట్టి, తూరు నగరులను పడగొట్టి, తర్షీషు ఓడలకు దుర్గముగా ఉన్నదాన్ని శిథిలాల కుప్పగా మార్చుతారు.

20 ప్రవచనం తెలియజేసినట్లుగానే, యెరూషలేము కూలిపోయి చాలాకాలం గడవక ముందే, తూరు బబులోనుపై తిరుగుబాటు చేస్తుంది, నెబుకద్నెజరు నగరాన్ని ముట్టడి వేస్తాడు. తూరు తాను అజేయమైనదాన్నని భావిస్తూ ప్రతిఘటిస్తుంది. ముట్టడి సమయంలో, ముట్టడి వేయడానికి అవసరమైన వాటిని నిర్మించేందుకు ఉపయోగించే సామాగ్రిని మోయడం ద్వారా, బబులోను సైనికుల తలలపైనున్న శిరస్త్రాణములు రాసుకుపోయి వారి “తలలు బోడి” అవుతాయి, వారి భుజములు “కొట్టుకొని” పోతాయి. (యెహెజ్కేలు 29:​18) ముట్టడి మూలంగా నెబుకద్నెజరు చాలా నష్టపోవలసి వస్తుంది. తూరు యొక్క ప్రధాన భూభాగం నాశనం చేయబడినప్పటికీ, కొల్లసొమ్ము మాత్రం అతని చేజారిపోతుంది. తూరులోని సంపదలు, తీరం నుండి దాదాపు అరమైలు దూరంలో ఉన్న ఒక చిన్న ద్వీపానికి చేరవేయబడతాయి. నౌకల కొరత మూలంగా కల్దీయుల రాజు ఆ ద్వీపాన్ని జయించలేకపోతాడు. పదమూడు సంవత్సరాల తర్వాత, తూరు లొంగిపోతుంది, కానీ అది మనుగడ సాగించి, మరితర ప్రవచనాల నెరవేర్పును చూస్తుంది.

‘అది వేశ్యాజీతమునకు మరలాలి’

21. తూరు ఏ విధంగా “మరువబడును,” ఎంతకాలం పాటు?

21 యెషయా తన ప్రవచనాన్ని ఇలా కొనసాగిస్తున్నాడు: “ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు, తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరములు మరవబడును.” (యెషయా 23:​15) బబులోనీయులు తూరు ద్వీపంలోని ప్రధాన భూభాగాన్ని నాశనం చేసిన తర్వాత, ఆ ద్వీపనగరం “మరువబడును.” ప్రవచించబడినట్లుగానే, “ఒక రాజు”​—⁠బబులోను సామ్రాజ్యం​—⁠పరిపాలనా కాలం పాటు, తూరు ద్వీపనగరం ప్రాముఖ్యమైన ఆర్థిక శక్తిగా ఉండదు. యెహోవా, యిర్మీయా ప్రవక్త ద్వారా, తన కోపోద్రేకపు ద్రాక్షారసాన్ని త్రాగడానికి ప్రత్యేకపర్చబడిన జనులలో తూరును కూడా చేరుస్తున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోనురాజునకు దాసులుగా ఉందురు.” (యిర్మీయా 25:​8-17, 22, 27) నిజమే, బబులోను సామ్రాజ్యం సా.శ.పూ. 539 లోనే కూలిపోతుంది గనుక తూరు ద్వీపనగరం మొత్తం 70 సంవత్సరాలూ బబులోనుకు లోబడివుండదు. డెబ్బై సంవత్సరముల కాలం, బబులోను అత్యధిక ఆధిపత్యాన్ని కలిగివున్న కాలానికి అంటే బబులోను రాజవంశం తన సింహాసనం “దేవుని నక్షత్రములకు” పైగా ఎత్తబడినట్లు గొప్పలు చెప్పుకొన్న కాలానికి ప్రాతినిధ్యం వహిస్తుందని స్పష్టమవుతోంది. (యెషయా 14:​13) వివిధ రాజ్యాలు వివిధ సమయాల్లో ఆ ఆధిపత్యం క్రిందికి వస్తాయి. కానీ 70 సంవత్సరాల ముగింపులో, ఆ ఆధిపత్యం పడిపోతుంది. అప్పుడు తూరుకు ఏమి జరుగుతుంది?

22, 23. బబులోను ఆధిపత్యం నుండి వైదొలగిన తర్వాత తూరుకు ఏమి జరుగుతుంది?

22 యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును, ఏమనగా మరవబడిన వేశ్యా, సితారా తీసికొని పట్టణములో తిరుగులాడుము. నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయించుము అనేక కీర్తనలు పాడుము. డెబ్బది సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును, అది వేశ్యజీతమునకు మరల భూమిమీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారముచేయును.”​—యెషయా 23:15బి-17.

23 బబులోను సా.శ.పూ. 539 లో కూలిపోయిన తర్వాత, ఫేనీకే మాదీయ-పారసీక సామ్రాజ్యంలో ఒక భాగమవుతుంది. పారసీక చక్రవర్తి కోరెషు విశాలహృదయం గల పరిపాలకుడు. మరువబడి, తన విటులను కోల్పోయిన వేశ్య సితారా వాయిస్తూ, కీర్తనలు పాడుతూ నగరమంతటా తిరుగుతూ క్రొత్త విటులను ఆకర్షించడానికి ప్రయత్నించినట్లుగా, ఈ క్రొత్త పరిపాలన క్రింద, తూరు తన మునుపటి కార్యకలాపాలను పునఃప్రారంభించి, ప్రపంచ వాణిజ్య కేంద్రంగా తిరిగి గుర్తింపును పొందడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. తూరు విజయం సాధిస్తుందా? అవును, అది విజయం సాధించడానికి యెహోవా అనుమతిస్తాడు. కొంతకాలానికి, ఈ ద్వీప-నగరం ఎంతగా సుసంపన్నమవుతుందంటే, సా.శ.పూ. ఆరవ శతాబ్దం ముగింపులో జెకర్యా ప్రవక్త దాని గురించి ఇలా చెబుతాడు: “తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.”​—⁠జెకర్యా 9:3.

‘దాని వర్తకలాభము ప్రతిష్ఠితమైనదగును’

24, 25. (ఎ) తూరు వర్తకలాభము యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎలా అవుతుంది? (బి) తూరు దేవుని ప్రజలకు సహాయం చేసినప్పటికీ, యెహోవా దాని గురించి ఏ ప్రవచనాన్ని ప్రేరేపింపజేస్తాడు?

24 ఈ క్రింది ప్రవచన వాక్యాలు ఎంత విశేషమైనవో కదా! “వేశ్యజీతముగా ఉన్న దాని వర్తకలాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు, యెహోవా సన్నిధిని నివసించువారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును.” (యెషయా 23:​18) తూరు యొక్క వస్తుదాయక లాభం ఎలా ప్రతిష్ఠితమవుతుంది? యెహోవా, అది తన చిత్తానుసారంగా ఉపయోగించబడేలా అంటే, తన ప్రజలు సంతుష్టిగా భోజనం చేయడానికీ వస్త్రాలు కలిగివుండడానికీ ఉపయోగించబడేలా పరిస్థితిని నడిపిస్తాడు. ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది. ఆలయాన్ని పునర్నిర్మించడానికి దేవదారు మ్రానులను సరఫరా చేయడం ద్వారా తూరు ప్రజలు వారికి సహాయం చేస్తారు. వారు యెరూషలేము నగరంతో తమ వర్తకాన్ని కూడా పునఃప్రారంభిస్తారు.​—⁠ఎజ్రా 3:7; నెహెమ్యా 13:16.

25 అయినప్పటికీ, యెహోవా తూరుకు వ్యతిరేకంగా మరొక దేవోక్తిని ప్రేరేపిస్తాడు. ఇప్పుడు సంపన్న ద్వీప-నగరంగా ఉన్న దాని గురించి జెకర్యా ఇలా ప్రవచిస్తున్నాడు: “యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతి కప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.” (జెకర్యా 9:4) గర్విష్ఠి సముద్రపు అధికారిణిని అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ కూలదోసినప్పుడు సా.శ.పూ. 332 జూలైలో ఇది నెరవేరింది.

ఐశ్వర్యాసక్తిని, గర్వాతిశయాన్ని నివారించండి

26. దేవుడు తూరును ఎందుకు ఖండించాడు?

26 యెహోవా తూరు గర్వాతిశయాన్ని బట్టి దాన్ని ఖండించాడు, అది ఆయన అసహ్యించుకునే ఒక లక్షణం. యెహోవా అసహ్యించుకునే ఏడు విషయాల్లో “అహంకారదృష్టి” మొదట పేర్కొనబడింది. (సామెతలు 6:​16-19) పౌలు అహంకారాన్ని అపవాదియగు సాతానుతో ముడిపెట్టాడు, గర్వాతిశయంగల తూరును గురించిన యెహెజ్కేలు వివరణలో సాతానును వర్ణించే లక్షణాలు ఉన్నాయి. (యెహెజ్కేలు 28:13-15; 1 తిమోతి 3:6) తూరు ఎందుకు గర్వాతిశయం కలిగివుండేది? తూరును ఉద్దేశించి, యెహెజ్కేలు ఇలా చెబుతున్నాడు: “నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి.” (యెహెజ్కేలు 28:5) నగరం వర్తకానికి, డబ్బు సమకూర్చుకోవడానికి అంకితమై పోయింది. ఈ విషయంలో తూరు సాధించిన విజయం దాన్ని భరించలేనంత అహంభావిగా చేసింది. యెహెజ్కేలు ద్వారా యెహోవా “తూరు అధిపతి”కి ఇలా చెప్పాడు: “గర్విష్ఠుడవై​—⁠నేనొక దేవతను, దేవతనైనట్టు . . . నేను ఆసీనుడనైయున్నాను అని నీవనుకొనుచున్నావు.”​—⁠యెహెజ్కేలు 28:2.

27, 28. మానవులు ఏ ఉరిలో పడిపోవచ్చు, యేసు దీన్ని ఎలా స్పష్టపరిచాడు?

27 రాజ్యాలే కాదు వ్యక్తులు కూడా గర్వాతిశయాన్ని, సంపదలను గురించిన తప్పు దృక్పథాన్ని అలవరచుకునే అవకాశం ఉంది. ఈ ఉరి ఎంత మోసకరమైనదిగా ఉండగలదనే విషయాన్ని చూపించే ఒక ఉపమానాన్ని యేసు చెప్పాడు. సమృద్ధిగా పంటలు పండే పొలాలున్న ఒక ధనవంతుని గురించి యేసు మాట్లాడాడు. ఆ ధనవంతుడు ఎంతో ఆనందపడి, తన పంటను సమకూర్చుకోవడానికి మరింత పెద్ద కొట్లు కట్టించుకోవడం గురించి ఆలోచించుకుని, సుదీర్ఘమైన సౌఖ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆనందంగా ఎదురు చూస్తున్నాడు. కానీ అలా జరగలేదు. “వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని” దేవుడు అతనితో అన్నాడు. అవును, ఆ వ్యక్తి మరణించాడు, అతని సంపద అతనికి ఏ ప్రయోజనమూ చేకూర్చలేకపోయింది.​—⁠లూకా 12:16-20.

28 “దేవునియెడల ధనవంతుడుకాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని” చెబుతూ యేసు ఆ ఉపమానాన్ని ముగించాడు. (లూకా 12:​21) ధనవంతులై ఉండడం తప్పేమీ కాదు, మంచి పంట పండడం పాపం కాదు. అయితే ఆ వ్యక్తి వీటినే తన జీవితంలో ప్రధానమైన విషయాలుగా చేసుకోవడమే అతను చేసిన తప్పు. ఆయన నమ్మకమంతా సంపదలపైనే ఉంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు, అతడు యెహోవా దేవుడ్ని ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు.

29, 30. మనపై మనం ఆధారపడడాన్ని గురించి యాకోబు ఎలా హెచ్చరించాడు?

29 యాకోబు ఇదే విషయాన్ని చాలా గట్టిగా చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివంటివారే. కనుక​—⁠ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.” (యాకోబు 4:​13-15) తర్వాత, యాకోబు సంపదకు, గర్వాతిశయానికి మధ్యనున్న సంబంధాన్ని చూపిస్తూ, ఇలా చెప్పడం కొనసాగించాడు: “ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.”​—⁠యాకోబు 4:16.

30 అలాగే, వ్యాపారం చేయడం పాపమేమీ కాదు. అయితే పాపమేమిటంటే, సంపద తీసుకు రాగల గర్వాతిశయం, అహంకారం, మితిమీరిన ఆత్మ-ధైర్యమే. జ్ఞానయుక్తంగా, ఒక ప్రాచీన సామెత ఇలా అన్నది: “పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము.” పేదరికం జీవితాన్ని కష్టభరితం చేయగలదు. కానీ ఐశ్వర్యము ఒక వ్యక్తి “[దేవుని] విసర్జించి​—⁠యెహోవా యెవడని” అనేలా చేస్తుంది.​—⁠సామెతలు 30:8, 9.

31. ఒక క్రైస్తవుడు తనకు తాను ఏ ప్రశ్నలు వేసుకోవడం మంచిది?

31 అత్యాశకు, స్వార్థానికి బలైపోయిన అనేకులున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. సర్వత్రా వ్యాపించివున్న వాణిజ్యపరమైన వాతావరణం దృష్ట్యా, సంపదకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. కాబట్టి, వాణిజ్య నగరమైన తూరు చిక్కుకున్నటువంటి ఉరిలోనే తాను చిక్కుకుపోకుండా ఉండేందుకు ఒక క్రైస్తవుడు తనను తాను పరిశీలించుకొంటూ ఉండడం మంచిది. అతడు వాస్తవానికి సిరికి దాసునిలా, వస్తుసంపదలను సమకూర్చుకోవడంలోనే తన సమయాన్ని, శక్తిని ఎక్కువగా వెచ్చిస్తున్నాడా? (మత్తయి 6:​24) తనకంటే ఎక్కువ సంపదలు లేక మంచి వస్తువులు ఉన్న ఎవరినైనా చూసి అసూయపడుతున్నాడా? (గలతీయులు 5:​26) అతడు ధనవంతుడైతే, ఇతరులకన్నా తను ఎక్కువగా అవధానాన్నిగానీ ఆధిక్యతలనుగానీ పొందడానికి అర్హుడనని గర్వంగా భావిస్తున్నాడా? (యాకోబు 2:​1-9 పోల్చండి.) అతడు ధనవంతుడు కాకపోతే, ఏవిధంగానైనా ‘ధనవంతుడగుటకు అపేక్షిస్తున్నాడా?’ (1 తిమోతి 6:9) అతడు వ్యాపార కార్యకలాపాల్లో మునిగిపోయి, దేవుని సేవకు తన జీవితంలో చాలా తక్కువ భాగాన్ని మాత్రమే కేటాయిస్తున్నాడా? (2 తిమోతి 2:4) వ్యాపార వ్యవహారాల్లో క్రైస్తవ సూత్రాలను అలక్ష్యం చేసేంతగా అతడు ధనసంపాదనలో నిమగ్నమైపోతున్నాడా?​—⁠1 తిమోతి 6:10.

32. యోహాను ఏ హెచ్చరికనిచ్చాడు, దాన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు?

32 మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, మన జీవితాల్లో ఎల్లప్పుడూ రాజ్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు” అని చెప్పిన అపొస్తలుడైన యోహాను మాటలను మనం ఎన్నడూ మరచిపోకుండా ఉండడం ఎంతో ప్రాముఖ్యం. (1 యోహాను 2:​15) నిజమే, మనం జీవించడానికి ఈ ప్రపంచపు ఆర్థిక ఏర్పాట్లను ఉపయోగించుకోవలసిందే. (2 థెస్సలొనీకయులు 3:​10) కాబట్టి, మనం ‘ఈ లోకమును’ ఉపయోగించుకుంటాము గానీ దాన్ని “అమితముగా” ఉపయోగించుకోము. (1 కొరింథీయులు 7:​31) వస్తుసంపదల పట్ల అంటే లోకంలో ఉన్నవాటి పట్ల మనకు విపరీతమైన మక్కువ ఉంటే, మనం ఇక యెహోవాను ప్రేమించలేము. ‘శరీరాశ, నేత్రాశ, జీవపుడంబముల’ కోసం ప్రాకులాడడమూ, దేవుని చిత్తాన్ని చేయడమూ పరస్పర విరుద్ధమైనవి. * అయితే దేవుని చిత్తాన్ని చేయడమే నిత్యజీవానికి నడిపిస్తుంది.​—⁠1 యోహాను 2:16, 17.

33. తూరు చిక్కుకున్న ఉరిని క్రైస్తవులు ఎలా నివారించవచ్చు?

33 తూరు, ఇతర అన్ని విషయాల కంటే వస్తు సంపదలను సంపాదించుకోవడానికి ప్రాధాన్యతనివ్వడమనే ఉరిలో చిక్కుకుపోయింది. అది వస్తు సంబంధంగా విజయవంతమై, గర్వాతిశయంతో నిండుకుని, తన గర్వాతిశయాన్ని బట్టి శిక్షించబడింది. దాని ఉదాహరణ నేడు రాజ్యాలకు, వ్యక్తులకు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. అపొస్తలుడైన పౌలు హెచ్చరికను అనుసరించడం ఎంత మేలు! “గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని” ఆయన క్రైస్తవులకు ఉద్బోధిస్తున్నాడు.​—⁠1 తిమోతి 6:17.

[అధస్సూచీలు]

^ కొంతమంది పండితులు, సార్డీనియానే తర్షీషు అని చెబుతున్నారు, ఈ సార్డీనియా అనేది మధ్యధరా సముద్రపు పశ్చిమ భాగంలో ఉన్న ఒక ద్వీపం. సార్డీనియా కూడా తూరుకు ఎంతో దూరంలో ఉంది.

^ ఈ పుస్తకంలోని 15 వ అధ్యాయం, 200-207 పేజీలను చూడండి.

^ ‘తర్షీషు కుమారి’ తర్షీషు నివాసులను కూడా సూచిస్తుండవచ్చు. ఒక పుస్తకం ఇలా చెబుతోంది: “తర్షీషు నివాసులు ఇప్పుడు, నైలు నది అన్ని వైపులకూ ప్రవహించేటప్పుడు ఉన్నంత స్వేచ్ఛగా ప్రయాణించడానికీ, వర్తకం చేయడానికి స్వాతంత్ర్యం కలిగి ఉన్నారు.” అయినప్పటికీ, తూరు కూలిపోవడం వల్ల వచ్చే తీవ్రమైన పరిణామాల గురించే నొక్కిచెప్పబడుతుంది.

^ “డంబము” అని అనువదించబడిన అలజోనీ అనే గ్రీకు మూలపదం, “లోకసంబంధమైన వాటి స్థిరతను నమ్ముకునే భక్తిరహితమైన, అర్థరహితమైన గర్వం” అని వర్ణించబడుతుంది.​—⁠ది న్యూ థేయర్స్‌ గ్రీక్‌-ఇంగ్లీష్‌ లెక్సికాన్‌.

[అధ్యయన ప్రశ్నలు]

[256 వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఫేనీకే ఓడ నమూనా

యూరప్‌

ఆసియా

స్పెయిన్‌

సార్డీనియా

మధ్యధరా సముద్రం

సైప్రస్‌

సీదోను

తూరు

ఐగుప్తు

ఆఫ్రికా

[250 వ పేజీలోని చిత్రం]

తూరు బబులోనుకు కాదుగానీ అష్షూరుకు లొంగిపోతుంది

[256 వ పేజీలోని చిత్రం]

తూరు ప్రధాన దైవమైన మెల్‌కార్ట్‌ చిత్రాన్ని చూపిస్తున్న నాణెం

[256 వ పేజీలోని చిత్రం]

(బహుశా తర్షీషు ఇక్కడ ఉండి ఉండవచ్చు)