కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు

యెహోవా దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు

ఎనిమిదవ అధ్యాయం

యెహోవా దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు

యెషయా 6:1-13

1, 2. (ఎ) యెషయా ప్రవక్తకు ఆలయ దర్శనం ఎప్పుడు ఇవ్వబడింది? (బి) ఉజ్జియా రాజు యెహోవా అనుగ్రహాన్ని ఎందుకు కోల్పోయాడు?

 “రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.” (యెషయా 6:1) ప్రవక్త చెబుతున్న ఈ మాటలతో యెషయా గ్రంథంలోని ఆరవ అధ్యాయం ప్రారంభమవుతుంది. అది సా.శ.పూ. 778 వ సంవత్సరం.

2 యూదా రాజుగా ఉజ్జియా చేసిన 52 సంవత్సరాల పరిపాలన చాలామేరకు విజయవంతంగా సాగింది. అతడు ‘యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు’ గనుక అతనికి సైనిక, నిర్మాణ, వ్యవసాయ కార్యకలాపాల్లో దేవుని మద్దతు లభించింది. కాని అతని విజయమే అతని నాశనానికి కూడా దారితీసింది. చివరికి, అతని హృదయం అహంకారంతో నిండడంతో, “అతడు ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహము” చేశాడు. ఈ అహంకారపూరిత చర్య మూలంగానూ, తనను గద్దించిన యాజకులపై అతనికి కలిగిన ఆగ్రహం మూలంగానూ ఉజ్జియా కుష్ఠరోగిగా మరణించాడు. (2 దినవృత్తాంతములు 26:​3-22) దాదాపు ఈ సమయంలోనే యెషయా ప్రవక్తగా తన సేవను ప్రారంభించాడు.

3. (ఎ) యెషయా వాస్తవంగా యెహోవాను చూశాడా? వివరించండి. (బి) యెషయా ఏ దృశ్యాన్ని చూశాడు, ఎందుకు చూశాడు?

3 దర్శనాన్ని చూస్తున్నప్పుడు యెషయా ఎక్కడ ఉన్నాడన్నది మనకు చెప్పబడలేదు. కానీ ఆయన తన భౌతిక నేత్రాలతో చూసింది మాత్రం స్పష్టంగా ఒక దర్శనమే గానీ సర్వోన్నతుని ప్రత్యక్షంగా చూడడం మాత్రం కాదు ఎందుకంటే, “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు.” (యోహాను 1:18; నిర్గమకాండము 33:​20) అయితే సృష్టికర్తయైన యెహోవాను దర్శనంలోనే చూసినప్పటికీ ఆ దృశ్యం సంభ్రమాశ్చర్యాలను కలిగించేదిగా ఉంది. నిత్యరాజుగా, న్యాయాధిపతిగా ఆయన పాత్రను సూచించే సమున్నతమైన సింహాసనంపై విశ్వపరిపాలకుడూ, న్యాయమైన ప్రభుత్వానికంతటికీ మూలకారకుడూ కూర్చుని ఉన్నాడు. పొడవైన ఆయన చొక్కాయి అంచులు జాలువారి దేవాలయమంతా నిండుతాయి. యెహోవా సర్వోన్నత అధికారాన్ని, న్యాయాన్ని ఉన్నతపరచే ప్రవచనార్థక సేవ చేసేందుకు యెషయా పిలువబడ్డాడు. దానికి సిద్ధపాటుగా, ఆయనకు దేవుని పరిశుద్ధతను గూర్చిన దర్శనం ఇవ్వబడుతుంది.

4. (ఎ) యెహోవా గురించి దర్శనాల్లో చూసిన, బైబిలునందు వ్రాయబడివున్న వర్ణనలు ఎందుకు సూచనార్థకమైనవై ఉండాలి? (బి) యెషయా దర్శనం నుండి యెహోవా గురించి ఏమి తెలుసుకోవచ్చు?

4 యెహెజ్కేలు, దానియేలు, యోహానులు నివేదించిన దర్శనాలవలెనే యెషయా తన దర్శనంలో యెహోవా రూపాన్ని గూర్చిన వర్ణనను ఇవ్వడం లేదు. అంతేగాక ఆ వృత్తాంతాలన్నీ కూడా పరలోకంలో కనిపించిన దాని విషయంలో విభిన్నంగా ఉన్నాయి. (యెహెజ్కేలు 1:26-28; దానియేలు 7:9, 10; ప్రకటన 4:​2, 3) అయితే, ఈ దర్శనాల నైజాన్ని, ఉద్దేశాన్ని మనం మనస్సులో ఉంచుకోవాలి. అవి యెహోవా సమక్షాన్ని గూర్చిన అక్షరార్థ వివరణలు కావు. భౌతిక నేత్రాలు ఆధ్యాత్మికమైన వాటిని చూడలేవు, అంతేగాక పరిమితులుగల మానవ మెదడు ఆత్మ సామ్రాజ్యాన్ని గ్రహించలేదు. కాబట్టి, అందజేయవలసిన సమాచారాన్ని దర్శనాలు మానవ పరిభాషలో అందజేస్తాయి. (ప్రకటన 1:1 పోల్చండి.) యెషయా దర్శనంలో దేవుని రూపాన్ని గురించిన వర్ణన అవసరం లేదు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడనీ, ఆయన పరిశుద్ధుడనీ ఆయన తీర్పులు న్యాయమైనవనీ ఆ దర్శనం యెషయాకు తెలియజేస్తోంది.

సెరాపులు

5. (ఎ) సెరాపులు ఎవరు, ఆ పద భావమేమిటి? (బి) సెరాపులు తమ ముఖాలను, కాళ్లను ఎందుకు కప్పుకొంటారు?

5 వినండి! యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను.” (యెషయా 6:2) సెరాపులను గురించిన ప్రస్తావనను బైబిలంతటిలో మనం కేవలం యెషయా 6 వ అధ్యాయంలోనే కనుగొంటాము. వారు, యెహోవా సేవలో ఆధిక్యతల విషయంలోనూ ఘనత విషయంలోనూ చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటూ, యెహోవా పరలోక సింహాసనం చుట్టూ నిలిచివున్న దేవదూతలు. గర్విష్ఠి ఉజ్జియా రాజులా కాకుండా వారు తమ స్థానాల్లో అణకువతోనూ, వినయంతోనూ ఉంటారు. పరలోక సర్వోన్నతుని సమక్షంలో ఉన్నందున వారు తమ ముఖాన్ని ఒక జత రెక్కలతో కప్పుకొంటారు; తామున్న పరిశుద్ధమైన స్థలాన్ని బట్టి భక్తితో తమ కాళ్లను మరో జత రెక్కలతో కప్పుకొంటారు. విశ్వసర్వోన్నతునికి సన్నిహితంగా ఉన్న సెరాపులు, దేవుని వ్యక్తిగత మహిమకు భంగం కలిగించకుండా ఉండేందుకు, తమకు తాము ఎంతమాత్రం ప్రాధాన్యతనిచ్చుకోరు. “అగ్నిమయమైన” లేక “మండుచున్న” అనే భావంగల “సెరాపులు” అనే పదం వారు ప్రకాశాన్ని ప్రసరిస్తారని సూచిస్తుంది, అయినప్పటికీ వారు యెహోవా యొక్క అత్యంత తేజోవంతమైన మహిమ నుండి తమ ముఖాలను కప్పుకొంటారు.

6. యెహోవా ఎదుట సెరాపుల స్థానం ఏమిటి?

6 సెరాపులు తమకున్న మూడవ జత రెక్కలను ఎగరటానికీ, నిస్సందేహంగా, తమ స్థానాల్లో ఎగురుతుండడానికి లేదా తమ స్థానాల్లో ‘నిలువడానికి’ ఉపయోగిస్తారు. (ద్వితీయోపదేశకాండము 31:​15 పోల్చండి.) వారి స్థానానికి సంబంధించి, ప్రొఫెసర్‌ ఫ్రాన్జ్‌ డెలిట్ష్‌ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “సెరాపులు నిజానికి సింహాసనాసీనుని తలకుపైగా నిలబడి ఉండరు గానీ ఆలయమంతా నిండుకొని ఉన్న ఆయన చొక్కాయి అంచులకుపైగా తమ స్థానాల్లో ఎగురుతుంటారు.” (కమెంటరీ ఆన్‌ ది ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌) ఇది సహేతుకంగా అనిపిస్తుంది. వారు ‘పైగా నిలిచివున్నది’ యెహోవాకంటే ఉన్నతులైనవారన్నట్లుగా కాదుగానీ, విధేయంగా, సేవచేయడానికి సిద్ధంగా, ఆయన కోసం వేచివున్నట్లుగా నిలబడివున్నారు.

7. (ఎ) సెరాపులు ఏ నియామకాన్ని నెరవేరుస్తారు? (బి) సెరాపులు దేవుని పరిశుద్ధతను మూడుసార్లు ఎందుకు ప్రకటిస్తారు?

7 ఆధిక్యతగల ఆ సెరాపులు చెబుతున్నది ఇప్పుడు వినండి! “వారు​—⁠సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.” (యెషయా 6:3) భూమి కూడా ఒక భాగమైయున్న విశ్వమంతటిలోనూ యెహోవా పరిశుద్ధత ప్రకటించబడేలా, ఆయన మహిమ గుర్తించబడేలా చూడడం వారి నియామకం. ఆయన మహిమ ఆయన సృష్టించిన దానంతటిలోనూ కనిపిస్తుంది, త్వరలోనే భూనివాసులందరూ దాన్ని గ్రహిస్తారు. (సంఖ్యాకాండము 14:21; కీర్తన 19:1-3; హబక్కూకు 2:​14) “పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు” అని మూడుసార్లు ప్రకటించడం త్రిత్వానికి సాక్ష్యాధారమేమీ కాదు గానీ దేవుని పరిశుద్ధతను మూడుసార్లు నొక్కిచెప్పడమే. (ప్రకటన 4:8 పోల్చండి.) యెహోవా సర్వోత్తమ స్థాయిలో పరిశుద్ధుడు.

8. సెరాపులు చేసే ప్రకటనల ఫలితమేమిటి?

8 సెరాపుల సంఖ్య తెలియజేయబడకపోయినప్పటికీ, సెరాపులు సింహాసనం వద్ద గుంపులు గుంపులుగా ఉండవచ్చు. శ్రావ్యమైన గానప్రతిగానములతో వారు ఒకరి తర్వాత మరొకరు దేవుని పరిశుద్ధతను, మహిమను మళ్ళీ మళ్ళీ ప్రకటిస్తూ ఉంటారు. అప్పుడేమి జరిగింది? యెషయా కొనసాగిస్తుండగా మళ్లీ వినండి: “వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిం[డెను].” (యెషయా 6:4) బైబిలులో, తరచూ పొగ లేదా మేఘము దేవుడు అక్కడ ఉన్నాడనడానికి దృశ్యమైన నిదర్శనాన్ని ఇస్తుంది. (నిర్గమకాండము 19:18; 40:​34, 35; 1 రాజులు 8:10, 11; ప్రకటన 15:​5-8) మానవమాత్రులమైన మనం సమీపించలేని మహిమను అది సూచిస్తుంది.

అనర్హుడు, అయినా శుద్ధీకరించబడ్డాడు

9. (ఎ) దర్శనం యెషయాపై ఏ ప్రభావాన్ని చూపించింది? (బి) యెషయాకు, ఉజ్జియా రాజుకు మధ్య ఏ తేడా స్పష్టంగా కనిపిస్తుంది?

9 యెహోవా సింహాసనాన్ని గూర్చిన ఈ దర్శనం యెషయాపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపించింది. ఆయనిలా వ్రాస్తున్నాడు: “నేను​—⁠అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యముల కధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.” (యెషయా 6:​5) యెషయాకు, ఉజ్జియా రాజుకు ఎంత స్పష్టమైన వ్యత్యాసం! ఉజ్జియా అభిషిక్త యాజక స్థానాన్ని చేజిక్కించుకుని ఏమాత్రం గౌరవం లేకుండా ఆలయంలోని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. ఉజ్జియా బంగారు దీపస్తంభములను, బంగారు ధూపార్తులను, “సముఖపు రొట్టెలనుంచు” బల్లను చూసినప్పటికీ యెహోవా అంగీకారాన్ని పొందలేదు లేదా ఆయన నుండి ఏ ప్రత్యేకమైన నియామకాన్ని అందుకోలేదు. (1 రాజులు 7:​48-50) మరోవైపున, యెషయా యాజకత్వాన్ని అలక్ష్యం చేయలేదు లేక ఆలయంలోకి అక్రమంగా ప్రవేశించలేదు. అయినప్పటికీ, ఆయన యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్న దర్శనాన్ని చూశాడు, స్వయంగా దేవుని నుండి నియమకాన్ని అందుకొని ఘనపరచబడ్డాడు. సెరాపులు ఆలయంలో సింహాసనాసీనుడైన ప్రభువును చూసే సాహసం చేయకపోయినప్పటికీ, దర్శనంలో “రాజును సైన్యముల కధిపతియునగు యెహోవాను” చూసేందుకు యెషయా అనుమతించబడ్డాడు.

10. దర్శనాన్ని చూసి యెషయా ఎందుకు భయపడతాడు?

10 దేవుని పరిశుద్ధతకు, తన స్వంత పాపభరిత స్థితికి మధ్యనున్న వ్యత్యాసాన్ని యెషయా గమనించినప్పుడు, ఆయన తానెంతో అపవిత్రుడనని భావిస్తాడు. భయపడిపోయి, ఆయన తాను బ్రతుకననుకుంటాడు. (నిర్గమకాండము 33:​20) సెరాపులు పరిశుభ్రమైన పెదవులతో దేవుడ్ని స్తుతించడాన్ని ఆయన వింటాడు, కానీ ఆయన స్వంత పెదవులు మాత్రం అపవిత్రంగా ఉన్నాయి, అంతేగాక ఆయన ఎవరిమధ్యనైతే నివసిస్తున్నాడో ఎవరి సంభాషణనైతే వింటున్నాడో వారి పెదవుల అపవిత్రతను బట్టి కూడా అవి మలినమయ్యాయి. యెహోవా పరిశుద్ధుడు, ఆయన సేవకులు ఆ లక్షణాన్ని ప్రతిబింబించాలి. (1 పేతురు 1:​14-16) యెషయా ఇప్పటికే దేవుని ప్రతినిధిగా ఉండడానికి ఎన్నుకోబడినప్పటికీ, ఆయన తన పాపభరిత స్థితినీ, మహిమాన్వితమైన పరిశుద్ధ రాజు యొక్క ప్రతినిధిగా ఉండడానికి తగిన పవిత్రమైన పెదవులు తనకు లేవన్న వాస్తవాన్నీ గుర్తించాడు. పరలోకంలో ప్రతిస్పందన ఎలా ఉంటుంది?

11. (ఎ) సెరాపులలో ఒకరు ఏమి చేశారు, ఈ చర్య దేన్ని సూచిస్తుంది? (బి) దేవుని సేవకులుగా మనం అనర్హులమని భావించినప్పుడు, సెరాపు యెషయాకు చెప్పినదాన్ని ధ్యానించడం మనకెలా సహాయం చేయగలదు?

11 యెషయా తక్కువ స్థానంలో ఉన్నవాడైనప్పటికీ ఆయనను యెహోవా సన్నిధి నుండి పంపివేసే బదులు సెరాపులు ఆయనకు సహాయం చేయడానికి వస్తారు. ఇలా వ్రాయబడి ఉంది: “అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి​—⁠ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.” (యెషయా 6:​6, 7) సూచనార్థక భావంలో, అగ్నికి శుద్ధీకరించే శక్తి ఉంది. సెరాపులు బలిపీఠము మీది పరిశుద్ధ అగ్ని నుండి కాలుతున్న నిప్పును యెషయా పెదవులకు అంటించినప్పుడు, దేవుని అనుగ్రహాన్ని, నియామకాన్ని ఆయన పొందగలిగేలా చేసేందుకు అవసరమైనంత మేరకు ఆయన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయబడినట్లు యెషయాకు హామీ ఇస్తారు. ఇది మనకెంత ధైర్యాన్నిచ్చేదిగా ఉంటుందో కదా! మనం కూడా పాపులం, దేవుని సమీపించడానికి అనర్హులం. కానీ మనం యేసు విమోచన క్రయధనబలి ఆధారంగా విమోచింపబడ్డాము గనుక దేవుని అనుగ్రహాన్ని పొందగలం, ప్రార్థనలో ఆయనను సమీపించగలము.​—⁠2 కొరింథీయులు 5:18, 21; 1 యోహాను 4:10.

12. యెషయా ఏ బలిపీఠమును చూశాడు, అగ్ని ఏ ప్రభావాన్ని చూపించింది?

12 “బలిపీఠము”ను గూర్చిన ప్రస్తావన కూడా ఇది కేవలం దర్శనం మాత్రమేనని మనకు జ్ఞాపకం చేస్తుంది. (ప్రకటన 8:3; 9:13 పోల్చండి.) యెరూషలేము ఆలయంలో రెండు బలిపీఠములుండేవి. అతిపరిశుద్ధ స్థలం యొక్కతెరకు ఇవతల చిన్న బలిపీఠం ఉండేది, దానిపై ధూపం వేయబడేది, ఆలయం ద్వారానికి ఎదురుగా పెద్ద బలిపీఠం ఉండేది, దానిపై అగ్ని నిత్యం మండుతుండేది. (లేవీయకాండము 6:​12, 13; 16:​12, 13) కానీ ఈ భూసంబంధమైన బలిపీఠములు మరింత గొప్పవాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న నమూనాలు. (హెబ్రీయులు 8:5; 9:​23; 10:​5-10) సొలొమోను రాజు ఆలయానికి ప్రారంభోత్సవం చేసినప్పుడు బలిపీఠముపైనున్న దహన బలిని దహించినది ఆకాశమునుండి దిగివచ్చిన అగ్నియే. (2 దినవృత్తాంతములు 7:​1-3) ఇప్పుడు యెషయా పెదవుల నుండి అపవిత్రతను తొలగించేది కూడా నిజమైన, పరలోక బలిపీఠము నుండి వచ్చే అగ్నియే.

13. యెహోవా ఏ ప్రశ్న వేశాడు, ఆయన “మా” అని చెప్పినప్పుడు ఎవరిని కలుపుకున్నాడు?

13 యెషయాతోపాటు మనం కూడా విందాము. “నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను​—⁠చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు[మంటిని].” (యెషయా 6:8) యెహోవా వేసిన ప్రశ్న, దర్శనంలో మరే ఇతర మానవ ప్రవక్తా లేడు గనుక యెషయా నుండి ప్రత్యుత్తరం రాబట్టడానికే రూపొందించబడిందని స్పష్టమవుతుంది. నిస్సందేహంగా అది యెహోవా సందేశకునిగా ఉండడానికి యెషయాకు ఇవ్వబడుతున్న ఆహ్వానం. కాని యెహోవా “మా నిమిత్తము ఎవడు పోవునని” ఎందుకు అడుగుతున్నాడు? “నేను” అని ఏకవచన సర్వనామాన్ని ఉపయోగించిన వెంటనే, మళ్ళీ “మా” అనే బహువచన సర్వనామాన్ని ఉపయోగించడం ద్వారా యెహోవా ఇప్పుడు, తనతో పాటు కనీసం మరొక వ్యక్తిని కలుపుకుంటున్నాడు. ఎవరిని? తర్వాత మానవుడైన యేసు క్రీస్తుగా మారిన తన ఏకైక కుమారుడ్నే కాదా? నిజానికి, “మన స్వరూపమందు . . . నరులను చేయుదము” అని దేవుడన్నది కూడా ఈ కుమారునితోనే. (ఆదికాండము 1:26; సామెతలు 8:​30, 31) అవును, పరలోక ఆవరణాల్లో యెహోవాతోపాటు, ఆయన అద్వితీయ కుమారుడు ఉన్నాడు.​—⁠యోహాను 1:14.

14. యెహోవా ఆహ్వానానికి యెషయా ఎలా ప్రతిస్పందించాడు, ఆయన మనకు ఏ మాదిరిని ఉంచాడు?

14 యెషయా ప్రతిస్పందించడానికి ఏ మాత్రం సంకోచించలేదు! సందేశం ఏదైనప్పటికీ ఆయన వెంటనే, “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు”మని సమాధానమిస్తాడు. తాను ఆ నియామకాన్ని స్వీకరిస్తే తనకు లాభమేమిటని ఆయన అడగలేదు. ఆయన చూపించిన సుముఖత, ‘సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను రాజ్య సువార్త’ ప్రకటించమనే నియామకం ఇవ్వబడిన నేటి దేవుని సేవకులకందరికీ చక్కని ఉదాహరణ. (మత్తయి 24:​14) యెషయాలా వారు తమ నియామకానికి నమ్మకంగా కట్టుబడి ఉండి, సర్వత్రా ఉదాసీనత ఉన్నప్పటికీ ‘సకల జనములకు సాక్ష్యమివ్వవలసిన’ నియామకాన్ని నెరవేరుస్తారు. తమకివ్వబడిన నియామకం సర్వోన్నతాధికారి నుండి వచ్చినదని తెలుసుకుని వారు యెషయాలా నమ్మకంతో ముందుకు కొనసాగుతారు.

యెషయా నియామకం

15, 16. (ఎ) యెషయా “ఈ జనుల”కు ఏమి చెప్పాలి, వారు ఎలా ప్రతిస్పందిస్తారు? (బి) ప్రజలు అలా ప్రతిస్పందించడానికి యెషయా తప్పేమైనా ఉందా? వివరించండి.

15 యెహోవా ఇప్పుడు యెషయా ఏమి చెప్పాలో, దానికి ప్రతిస్పందన ఎలా ఉంటుందో సంక్షిప్తంగా తెలియజేస్తూ, “నీవు పోయి యీ జనులతో ఇట్లనుము​—⁠మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని” చెబుతున్నాడు. (యెషయా 6:​9, 10) అంటే దీని భావం యెషయా కఠినంగా యుక్తిలేకుండా మాట్లాడుతూ యూదులు యెహోవాకు వ్యతిరేకంగా ఉండేలా వాళ్ళను ఆయన నుండి వెనక్కి త్రిప్పాలా? ఎంతమాత్రం కాదు! వీరు యెషయా స్వంత ప్రజలు, వారితో తనకు బాంధవ్యం ఉందని ఆయన భావిస్తున్నాడు. కానీ యెషయా తనకివ్వబడిన నియామకాన్ని ఎంత నమ్మకంగా నెరవేర్చినప్పటికీ ప్రజలు ఆయన సందేశానికి ఎలా ప్రతిస్పందిస్తారన్న విషయాన్ని యెహోవా మాటలు సూచిస్తున్నాయి.

16 తప్పు ప్రజలదే. యెషయా వారితో “నిత్యము” మాట్లాడతాడు గానీ వారు సందేశాన్ని అంగీకరించరు లేదా దాన్ని అర్థం చేసుకోరు. అత్యధికులు పూర్తిగా అంధులూ చెవిటివారూ అయినట్లు మొండిగా, ప్రతిస్పందన లేకుండా ఉంటారు. యెషయా వారి దగ్గరికి మళ్ళీ మళ్ళీ వెళ్లడం ద్వారా, ‘ఆ జనులు’ తమకు అర్థం చేసుకోవడం ఇష్టంలేదని చూపించనిస్తాడు. తమకు యెషయా అందించే, అంటే దేవుడు అందించే సందేశానికి తమ మనస్సులను హృదయాలను మూసేసుకుంటున్నామని వారు నిరూపిస్తారు. నేటి ప్రజల విషయంలో ఇదెంత నిజమో! రానున్న దేవుని రాజ్య సువార్తను యెహోవా సాక్షులు ప్రకటిస్తుండగా వారిలో చాలామంది వినడానికి నిరాకరిస్తారు.

17. “ఎన్నాళ్లవరకని” యెషయా అడిగినప్పుడు, ఆయన ఉద్దేశమేమిటి?

17 యెషయా ఇలా వ్యాకులపడుతున్నాడు: “ప్రభువా ఎన్నాళ్ల వరకని నేనడుగగా ఆయన​—⁠నివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును యెహోవా మనుష్యులను దూరముగా తీసికొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగువరకును ఆలాగున జరుగును.” (యెషయా 6:​11, 12) “ఎన్నాళ్లవరకని” అడగడం ద్వారా యెషయా ప్రతిస్పందించని ప్రజలకు ఎంతకాలం పాటు తాను ప్రకటించడం కొనసాగించాలని అడగడంలేదు. కానీ, ఆయన ప్రజల గురించి శ్రద్ధ కలిగివున్నాడు, వారి ఆధ్యాత్మిక దుస్థితి ఎంతకాలం కొనసాగుతుందనీ, యెహోవా నామం ఎంతకాలం పాటు భూమిపై అగౌరవపరచబడుతుందనీ అడుగుతున్నాడు. (కీర్తన 74:​9-11 చూడండి.) కాబట్టి, బుద్ధిహీనమైన పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుంది?

18. ప్రజల ఆధ్యాత్మిక దుస్థితి ఎంతవరకు కొనసాగుతుంది, ప్రవచనపు పూర్తి నెరవేర్పును చూసేందుకు యెషయా జీవించి ఉంటాడా?

18 యెహోవా నిబంధనలో పేర్కొనబడినట్లుగా, దేవునికి అవిధేయత చూపించడం వల్ల వచ్చే పూర్తి పర్యవసానాలను అనుభవించేవరకు ప్రజల ఆధ్యాత్మిక దుస్థితి కొనసాగుతుందని ఆయనిచ్చిన సమాధానం చూపిస్తోంది. (లేవీయకాండము 26:21-33; ద్వితీయోపదేశకాండము 28:​49-68) రాజ్యం నాశనమవుతుంది, ప్రజలు చెరగా కొనిపోబడతారు, దేశం నిర్జనంగా మారుతుంది. యెషయా ఉజ్జియా రాజు మునిమనుమడైన హిజ్కియా పరిపాలనలో కూడా ప్రవచిస్తూ అంటే 40 ఏళ్లకు పైగానే ప్రవచించినప్పటికీ, సా.శ.పూ. 607 లో బబులోను సైన్యం యెరూషలేమును దానిలోని ఆలయాన్ని నాశనం చేయడాన్ని చూసేంతవరకూ జీవించివుండడు. అయినప్పటికీ, యెషయా తాను మరణించే వరకూ, అంటే ఆ జాతీయ విపత్తు సంభవించడానికి 100 కన్నా ఎక్కువ సంవత్సరాల ముందు వరకు, తన నియామకానికి నమ్మకంగా అంటిపెట్టుకొని ఉంటాడు.

19. ఆ రాజ్యం ఒక వృక్షంలా నరికివేయబడినప్పటికీ, దేవుడు యెషయాకు ఏ హామీ ఇస్తున్నాడు?

19 యూదా ‘బొత్తిగా బీడయ్యేలా’ చేసే నాశనం త్వరలో రాబోతోంది, అయినా పరిస్థితి నిరాశాజనకంగా లేదు. (2 రాజులు 25:​1-26) యెహోవా యెషయాకు ఇలా హామీ ఇస్తున్నాడు: “దానిలో పదియవ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సిందూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును; అట్టి మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.” (యెషయా 6:​13) అవును, నరికివేయబడిన మహా వృక్షపు మొద్దులా “పదియవ భాగము . . . పరిశుద్ధమైన చిగురు” మిగిలి ఉంటుంది. నిస్సందేహంగా, ఈ హామీ యెషయాను ఓదారుస్తుంది​—⁠తన ప్రజల్లో ఒక పరిశుద్ధ శేషము మిగిలి ఉంటుంది. వంటచెరకు కోసం నరికివేయబడిన ఒక పెద్ద వృక్షంలా, ఈ రాజ్యం మళ్ళీ కాల్చివేయబడినప్పటికీ సూచనార్థక ఇశ్రాయేలు వృక్షపు ముఖ్యమైన మొద్దు మిగిలి ఉంటుంది. అది యెహోవాకు పరిశుద్ధమైన చిగురుగా, సంతానంగా ఉంటుంది. కొంతకాలానికి, అది మళ్లీ చిగురిస్తుంది, చెట్టు మళ్లీ పెరుగుతుంది.​—⁠యోబు 14:7-9; దానియేలు 4:26 పోల్చండి.

20. యెషయా ప్రవచనపు చివరిభాగం మొదట ఎలా నెరవేరింది?

20 ప్రవచన మాటలు నిజమయ్యాయా? అవును. యూదా దేశం నిర్జనంగా మారిన డెబ్బై సంవత్సరాల తర్వాత, దైవ-భయంగల శేషము బబులోను చెరనుండి తిరిగి వచ్చింది. వారు ఆలయాన్ని, నగరాన్ని పునర్నిర్మించారు, దేశంలో సత్యారాధనను పునఃస్థాపించారు. యూదులు దేవుడిచ్చిన తమ స్వదేశానికి అలా తిరిగి రావడమన్నది, యెహోవా యెషయాకిచ్చిన ఈ ప్రవచన రెండవ నెరవేర్పును సాధ్యం చేసింది. ఏమిటా నెరవేర్పు?​—⁠ఎజ్రా 1:1-4.

ఇతర నెరవేర్పులు

21-23. (ఎ) యెషయా ప్రవచనం మొదటి శతాబ్దంలో ఎవరి విషయంలో నెరవేరింది, ఎలా? (బి) మొదటి శతాబ్దంలో “పరిశుద్ధ చిగురు” ఎవరు, అది ఎలా కాపాడబడింది?

21 దాదాపు 800 సంవత్సరాల తర్వాత మెస్సీయగా యేసు క్రీస్తు చేసే పనికి, యెషయా ప్రవచనార్థక కార్యం పూర్వఛాయగా ఉంది. (యెషయా 8:​18; 61:1, 2; లూకా 4:16-21; హెబ్రీయులు 2:​13, 14) యేసు యెషయా కంటే గొప్పవాడే అయినప్పటికీ, “నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని” చెబుతూ తన పరలోక తండ్రిచేత పంపబడడానికి సుముఖతను చూపించాడు.​—⁠హెబ్రీయులు 10:5-9; కీర్తన 40:6-8.

22 యెషయా వలె యేసు కూడా తనకు ఇవ్వబడిన నియామకాన్ని నమ్మకంగా నిర్వర్తించి, అదే విధమైన ప్రతిస్పందనను ఎదుర్కొన్నాడు. యెషయా ప్రవక్త ప్రకటించిన ప్రజలు ఎలాగైతే సందేశాన్ని అంగీకరించడానికి సుముఖత చూపించలేదో యేసు కాలంనాటి యూదులు కూడా అలాగే సుముఖత చూపించలేదు. (యెషయా 1:4) ఉపమానాలను ఉపయోగించడం యేసు పరిచర్యలో ఒక ముఖ్యాంశం. ఆయనలా ఉపయోగించడం, “నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని” ఆయన శిష్యులు అడిగేలా చేసింది. యేసు ఇలా సమాధానమిచ్చాడు: “పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.”​—⁠మత్తయి 13:10, 11, 13-15; మార్కు 4:10-12; లూకా 8:9, 10.

23 యెషయా గ్రంథము నుండి ఎత్తి చెబుతూ, తన కాలంలో ఈ ప్రవచనం నెరవేరిందని యేసు చూపిస్తున్నాడు. ప్రజలకు యెషయా కాలంనాటి యూదులకు ఉన్నటువంటి హృదయ దృక్పథమే ఉంది. వారు ఆయన సందేశానికి తమను తాము గ్రుడ్డివారిగా, చెవిటివారిగా చేసుకొని నాశనమయ్యారు. (మత్తయి 23:​35-38; 24:​1, 2) ఇది, జనరల్‌ టైటస్‌ నాయకత్వం క్రింద రోమా సైన్యాలు సా.శ. 70 లో యెరూషలేమును చుట్టుముట్టి ఆ నగరాన్ని, ఆలయాన్ని కూలద్రోసినప్పుడు జరిగింది. అయినప్పటికీ, కొందరు యేసు చెప్పేది విని, ఆయన శిష్యులయ్యారు. యేసు వీరిని ‘ధన్యులని’ అన్నాడు. (మత్తయి 13:​16-23, 51) “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట” వారు చూసినప్పుడు “కొండలకు పారిపోవలెను” అని ఆయన వారికి తెలియజేశాడు. (లూకా 21:​20-22) ఆ విధంగా విశ్వాసముంచిన, “దేవుని ఇశ్రాయేలు”గా, ఆధ్యాత్మిక జనాంగముగా రూపొందిన “పరిశుద్ధ చిగురు” రక్షించబడింది. *​—⁠గలతీయులు 6:16.

24. యెషయా ప్రవచనాన్ని పౌలు ఎలా అన్వయించాడు, అది దేన్ని సూచిస్తోంది?

24 దాదాపు సా.శ. 60 లో అపొస్తలుడైన పౌలు రోములో గృహనిర్బంధంలో ఉన్నాడు. అక్కడాయన “యూదులలో ముఖ్యులైనవారిని,” మరితరులను సమకూర్చి, “దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమి[చ్చాడు].” చాలామంది పౌలు ఇచ్చిన సందేశాన్ని అంగీకరించనప్పుడు, ఇది యెషయా ప్రవచన నెరవేర్పు అని ఆయన వివరించాడు. (అపొస్తలుల కార్యములు 28:17-27; యెషయా 6:​9, 10) కాబట్టి యేసు శిష్యులు యెషయా నియామకాన్ని పోలిన నియామకాన్ని నెరవేర్చారు.

25. దేవుని ఆధునిక-దిన సాక్షులు ఏమి గ్రహించారు, వారెలా ప్రతిస్పందిస్తారు?

25 అలాగే, యెహోవా దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడని యెహోవా సాక్షులు నేడు గ్రహిస్తారు. (మలాకీ 3:1) యెషయా వలె వారు, “చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపు”మని అంటారు. సమీపిస్తున్న ఈ దుష్టవిధానాంతాన్ని గూర్చిన హెచ్చరిక సందేశాన్ని వారు అత్యాసక్తితో ప్రకటిస్తారు. కానీ, యేసు సూచించినట్లుగా, సాపేక్షికంగా కొద్దిమంది మాత్రమే చూసి, విని రక్షించబడగలిగేలా తమ కళ్లతో చూస్తారు, చెవులతో వింటారు. (మత్తయి 7:​13, 14) విని “స్వస్థత పొంద” గలిగేలా తమ హృదయములను ప్రేరేపించుకునే వారు నిజంగా ధన్యులు!​—⁠యెషయా 6:8, 10.

[అధస్సూచి]

^ యూదుల తిరుగుబాటుకు ప్రతిస్పందనగా, రోమా సైన్యాలు సా.శ. 66 లో సేస్టియస్‌ గాలస్‌ నాయకత్వం క్రింద యెరూషలేమును చుట్టుముట్టి నగరంలోపలికి దాదాపు ఆలయ గోడల వరకూ చొచ్చుకొనిపోయాయి. ఆ తర్వాత వారు వెనక్కి వెళ్లిపోయి, మళ్లీ సా.శ. 70 లో తిరిగి వచ్చేలోపల యేసు శిష్యులు పెరియ కొండలకు పారిపోడానికి అవకాశం లభించింది.

[అధ్యయన ప్రశ్నలు]

[94 వ పేజీలోని చిత్రం]

‘చిత్తగించుము! నేనున్నాను, నన్ను పంపుము.’

[97 వ పేజీలోని చిత్రం]

“నివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకు”