యెహోవా దేవునికి ఒక శేషముపై కనికరం ఉంది
ఆరవ అధ్యాయం
యెహోవా దేవునికి ఒక శేషముపై కనికరం ఉంది
1, 2. యూదా యెరూషలేముల గురించి యెషయా ప్రవక్త ఏమి ప్రవచిస్తున్నాడు?
జనసాంద్రతగల ఒక ప్రాంతంలో పెనుతుపాను వస్తుంది. ప్రచండమైన గాలులు, వరదలు, కుంభవృష్టి ఇండ్లనూ పంటపొలాలనూ ముంచేస్తూ, ప్రాణాలను కబళిస్తూ భూమిని చీల్చేస్తున్నాయి. కానీ కొద్దిసేపట్లోనే తుపాను సద్దుమణుగుతుంది, తర్వాత సర్వత్రా ప్రశాంతత నెలకొంటుంది. తప్పించుకుని జీవించినవారికి అది పునరుద్ధరణకు, పునఃనిర్మాణానికి సమయం.
2 యూదా యెరూషలేముల గురించి యెషయా ప్రవక్త అటువంటి పరిస్థితినే ప్రవచిస్తున్నాడు. దైవిక తీర్పుకు సంబంధించిన గాఢమైన మేఘాలు భయంకరంగా ఆవరిస్తున్నాయి—దానికి మంచి కారణమే ఉంది! ఆ జనాంగపు అపరాధం భారమైనది. పరిపాలకులు, ప్రజలు దేశాన్ని అన్యాయంతోనూ, రక్తపాతంతోనూ నింపేశారు. యెహోవా యెషయా ప్రవక్త ద్వారా యూదా అపరాధాన్ని బట్టబయలు చేసి, అపరాధియైన ఆ దేశంపై తన తీర్పును అమలుచేస్తానని హెచ్చరిస్తున్నాడు. (యెషయా 3:25) ఈ తుపాను మూలంగా యూదా దేశమంతా పూర్తిగా నిర్జనమవుతుంది. ఆ విషయం యెషయాను ఎంతో దుఃఖపరుస్తుంది.
3. యెషయా 4:2-6 వచనాల్లోని ప్రేరేపిత సందేశంలో ఏ సువార్త ఉంది?
3 కానీ ఒక సువార్త కూడా ఉంది! యెహోవా నీతియుక్తమైన తీర్పుల తుపాను నిమ్మళిస్తుంది, ఒక శేషము తప్పించుకుని జీవిస్తుంది. అవును, యూదాపైకి యెహోవా తీసుకువచ్చే తీర్పు కనికరంతో సమ్మిళితమై ఉంటుంది! యెషయా 4:2-6 వచనాల్లోని యెషయా ప్రేరేపిత సందేశం ఈ ఆశీర్వదించబడిన సమయం కోసం ఎదురుచూస్తోంది. అది, సూర్యుడు మేఘాల మాటునుండి బయటికి వచ్చినట్లుగా ఉంటుంది; తీర్పుకు సంబంధించిన దృశ్యాలు, శబ్దాల స్థానంలో యెషయా 2:6-4:1 లో వర్ణించబడినట్లుగా, ఇప్పుడు అందంగా పునర్నూతనం చేయబడిన దేశమూ ప్రజలూ కనిపిస్తారు.
4. ఒక శేషము పునఃస్థాపించబడటాన్ని గురించిన యెషయా ప్రవచనాన్ని మనమెందుకు చర్చించాలి?
4 ఒక శేషము పునఃస్థాపించబడి, ఆ తర్వాత వారు అనుభవించే భద్రతను గురించిన యెషయా ప్రవచనం మన కాలంలోనూ అంటే ఈ “అంత్యదినములలో” కూడా నెరవేరుతుంది. (యెషయా 2:2-4) మనం ఈ సమయోచితమైన సందేశాన్ని చర్చిద్దాం, ఎందుకంటే దానికి ప్రవచనార్థక ప్రాముఖ్యత ఉండడమే గాక అది మనకు యెహోవా కనికరం గురించీ, వ్యక్తిగతంగా మనం దాన్ని ఎలా పొందవచ్చుననే దాని గురించీ కూడా మనకు బోధిస్తుంది.
‘యెహోవా చిగురింపజేయడం’
5, 6. (ఎ) రానున్న తుపాను తర్వాతి సమాధానకరమైన సమయాన్ని యెషయా ఎలా వర్ణిస్తున్నాడు? (బి) “చిగురు” అనే పదభావమేమిటి, ఇది యూదా దేశాన్ని గురించి ఏమి సూచిస్తుంది?
5 యెషయా రానున్న తుపానునే కాక ఆ తర్వాత రానున్న మరింత సమాధానకరమైన సమయాన్ని గురించి మనకు తెలియజేస్తుండగా ఆయన స్వరం మరింత వాత్సల్యపూరితమవుతుంది. ఆయనిలా వ్రాస్తున్నాడు: “ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును.”—యెషయా 4:2.
6 యెషయా ఇక్కడ పునఃస్థాపన గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ “చిగురు” అని అనువదించబడిన హీబ్రూ నామవాచకం ‘చిగురించేదాన్ని, ఒక రెమ్మను, ఒక కొమ్మను’ సూచిస్తుంది. దానికి అభివృద్ధితోనూ, పెరుగుదలతోనూ, యెహోవా నుండి వచ్చే ఆశీర్వాదంతోనూ సంబంధం ఉంది. ఆ విధంగా యెషయా, నిరీక్షణను గురించిన ఒక దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు, అంటే సమీపిస్తున్న నాశనం నిరంతరం కొనసాగదు. ఒకప్పుడు బాగా వర్ధిల్లిన యూదా దేశం యెహోవా ఆశీర్వాదంతో మళ్లీ పుష్కలమైన ఫలాన్ని ఇస్తుంది. *—లేవీయకాండము 26:3-5.
7. యెహోవా చిగురు ఏవిధంగా “మహిమయు భూషణమును” అవుతుంది?
7 త్వరలో జరుగనున్న మార్పు మహత్వాన్ని వర్ణించేందుకు యెషయా స్పష్టమైన పదాలను ఉపయోగిస్తున్నాడు. యెహోవా చిగురు “మహిమయు భూషణమును” అవుతుంది. “భూషణము” అనే పదం, శతాబ్దాల క్రితం యెహోవా ఇశ్రాయేలుకు వాగ్దానదేశాన్ని ఇచ్చినప్పుడు దానిలో ఉండిన సౌందర్యాన్ని మనకు జ్ఞప్తికి తెస్తుంది. అది ఎంత అందంగా ఉండేదంటే అది ‘సకల దేశములకు ఆభరణంగా’ పరిగణించబడేది. (యెహెజ్కేలు 20:6) కాబట్టి యూదా దేశం దాని పూర్వపు మహిమకు, సౌందర్యానికి తీసుకురాబడుతుందని యెషయా మాటలు ప్రజలకు హామీ ఇస్తున్నాయి. వాస్తవానికి, అది భూమిపై మహిమాన్వితమైన ఆభరణంగా ఉంటుంది.
8. పునఃస్థాపించబడిన భూసౌందర్యాన్ని ఆనందించడానికి అక్కడ ఎవరుంటారు, యెషయా వారి భావాలను ఎలా వర్ణిస్తున్నాడు?
8 అయితే, పునఃస్థాపించబడిన భూసౌందర్యాన్ని ఆనందించడానికి అక్కడ ఎవరుంటారు? “ఇశ్రాయేలులో తప్పించుకొనిన” వారుంటారని యెషయా వ్రాస్తున్నాడు. అవును, మునుపు ప్రవచింపబడిన అవమానకరమైన నాశనాన్ని కొంతమంది తప్పించుకొని జీవిస్తారు. (యెషయా 3:25, 26) తప్పించుకొన్నవారిలో ఒక శేషము యూదాకు తిరిగి వచ్చి, దాని పునఃస్థాపనలో భాగం వహిస్తుంది. తిరిగి వచ్చే వీరికి అంటే “తప్పించుకొనిన” వారికి, తమ పునఃస్థాపిత దేశపు పుష్కలమైన పంట “అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను” ఉంటుంది. (యెషయా 4:2) నిర్జనముగా విడువబడడం వల్ల కలిగిన అవమానం స్థానే, పునర్నూతనం చేయబడిన అతిశయం ఉంటుంది.
9. (ఎ) యెషయా మాటల నెరవేర్పుగా, సా.శ.పూ. 537 లో ఏమి జరిగింది? (బి) “తప్పించుకొనిన” వారిలో, చెరలో ఉన్నప్పుడు జన్మించినవారు కూడా ఉండవచ్చునని ఎందుకు చెప్పవచ్చు? (అధస్సూచి చూడండి.)
9 యెషయా చెప్పినట్లుగానే, సా.శ.పూ. 607 లో బబులోనీయుల చేతుల్లో యెరూషలేము నాశనం చేయబడి, అనేకమంది ఇశ్రాయేలీయులు నశించిపోయినప్పుడు తీర్పు తుపాను వచ్చింది. కొంతమంది తప్పించుకొని జీవించారు, వారు బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు, అయితే దేవుడు కనికరం చూపించి ఉండకపోతే ఎవ్వరూ తప్పించుకొని జీవించగలిగేవారు కాదు. (నెహెమ్యా 9:31) చివరకు యూదా పూర్తిగా నిర్జనంగా విడిచిపెట్టబడింది. (2 దినవృత్తాంతములు 36:17-21) తర్వాత, సత్యారాధనను పునఃస్థాపించేందుకు, “తప్పించుకొనిన” వారు సా.శ.పూ. 537 లో యూదాకు తిరిగి వచ్చేందుకు కనికరంగల దేవుడు అనుమతించాడు. * (ఎజ్రా 1:1-4; 2:1, 2) తిరిగి వచ్చిన ఈ బంధీల హృదయపూర్వకమైన పశ్చాత్తాపం 137 వ కీర్తనలో చాలా చక్కగా వ్యక్తపర్చబడింది, ఈ కీర్తన బహుశా చెరలో ఉన్నప్పుడో లేక తిరిగివచ్చిన కొద్ది కాలానికో వ్రాయబడి ఉండవచ్చు. వారు యూదాకు తిరిగివచ్చి భూమిని దున్ని విత్తనాలు విత్తారు. ఫలవంతమైన “ఏదెను వనమువలె” ఆ భూమిని చిగురింపజేస్తూ తమ ప్రయాసలను దేవుడు ఆశీర్వదిస్తుండటాన్ని చూసినప్పుడు వారు ఎలా భావించి ఉంటారో ఆలోచించండి!—యెహెజ్కేలు 36:34-36.
10, 11. (ఎ) ఇరవైయవ శతాబ్దం తొలికాలంలో బైబిలు విద్యార్థులు ఏ భావంలో “మహా బబులోను” చెరలో ఉన్నారు? (బి) ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయుల శేషమును యెహోవా ఎలా ఆశీర్వదించాడు?
10 మన కాలంలో అదే విధమైన పునఃస్థాపన జరిగింది. ఇరవైయవ శతాబ్ద తొలిభాగంలో, మునుపు బైబిలు విద్యార్థులని పిలువబడిన యెహోవాసాక్షులు ఆధ్యాత్మికంగా, ప్రపంచ అబద్ధమతమైన “మహా బబులోను” చెరలోకి వెళ్లారు. (ప్రకటన 17:5) బైబిలు విద్యార్థులు ఎన్నో అబద్ధమత బోధలను తిరస్కరించినప్పటికీ, వారు కొన్ని బబులోను సంబంధిత తలంపులనూ ఆచారాలనూ ఇంకా అంటిపెట్టుకుని ఉన్నారు. మతనాయకులు పురికొల్పిన వ్యతిరేకత మూలంగా, వారిలో కొంతమంది అక్షరార్థంగా చెరసాలలో వేయబడ్డారు. వారి ఆధ్యాత్మిక దేశం అంటే వారి మతపరమైన లేక ఆధ్యాత్మిక పరదైసు నిర్జనంగా విడువబడింది.
11 కానీ 1919 వసంతకాలంలో, ఈ ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయుల శేషంపై యెహోవాకు కనికరం కలిగింది. (గలతీయులు 6:16) ఆయన వారి పశ్చాత్తాపాన్ని, ఆయనను సత్యంలో ఆరాధించాలనే వారి కోరికను చూశాడు, కాబట్టి ఆయన వారిని అక్షరార్థమైన చెర నుండీ అంతకంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక చెర నుండీ విడుదల చేశాడు. “తప్పించుకొనిన” వీరు తమకు దేవుడిచ్చిన ఆధ్యాత్మిక పరదైసులోకి పునరుద్ధరించబడ్డారు, ఆయన దాన్ని పుష్కలంగా చిగురింపజేశాడు. ఈ ఆధ్యాత్మిక పరదైసు తన ఆకర్షణీయమైన రూపంతో, దేవునికి భయపడే ఇతర లక్షలాదిమంది సత్యారాధనలో శేషముతో కలిసేలా వారిని ఆకర్షించింది.
12. యెహోవాకు తన ప్రజలపట్ల ఉన్న కనికరాన్ని యెషయా మాటలు ఎలా శ్లాఘిస్తున్నాయి?
12 యెషయా మాటలు ఇక్కడ, దేవునికి తన ప్రజలపట్ల ఉన్న కనికరాన్ని శ్లాఘిస్తున్నాయి. ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా యెహోవాపై తిరుగుబాటు చేసినప్పటికీ, పశ్చాత్తాపం చూపిన ఒక శేషముపై ఆయన కనికరం చూపించాడు. ఘోరమైన తప్పులు చేసినవారు సహితం నిరీక్షణతో యెహోవా దగ్గరికి తిరిగివెళ్ళవచ్చునని తెలుసుకుని మనం ఓదార్పును పొందవచ్చు. పశ్చాత్తాపపడే వారు తమకు యెహోవా కనికరం లభించదేమో అనుకోనవసరం లేదు ఎందుకంటే ఆయన పశ్చాత్తాప హృదయాన్ని తిరస్కరించడు. (కీర్తన 51:17) “యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును” అని బైబిలు మనకు హామీ ఇస్తోంది. (కీర్తన 103:8, 13) అలాంటి కనికరంగల దేవుడు మన స్తుతిని పొందడానికి నిశ్చయంగా అర్హుడు!
ఒక శేషము యెహోవాకు పరిశుద్ధమవుతుంది
13. యెషయా 4:3 లో వ్రాయబడివున్నట్లుగా, యెహోవా కనికరాన్ని పొందే శేషమును యెషయా ఎలా వర్ణిస్తున్నాడు?
13 యెహోవా కనికరాన్ని పొందే శేషముతో మనకు ఇప్పటికే పరిచయం ఏర్పడింది, అయితే ఇప్పుడు యెషయా వారిని మరింత విపులంగా వర్ణిస్తున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “సీయోనులో శేషించినవానికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.”—యెషయా 4:3.
14. ‘శేషించినవారు,’ ‘నిలువబడినవారు’ ఎవరు, యెహోవా వారిపై ఎందుకు కనికరం చూపిస్తాడు?
14 ‘శేషించినవారు,’ ‘నిలువబడినవారు’ ఎవరు? వారు ముందటి వచనంలో ప్రస్తావించబడిన తప్పించుకొన్న వారు అంటే, యూదాకు తిరిగి రావడానికి అనుమతించబడే చెరగాపోయిన యూదులు. యెహోవా వారిపై ఎందుకు కనికరం చూపిస్తాడో, వారెందుకు ఆయనకు ‘పరిశుద్ధులై’ ఉంటారో యెషయా ఇప్పుడు చూపిస్తాడు. పరిశుద్ధత అంటే “మతపరమైన పరిశుభ్రత లేక స్వచ్ఛత; పవిత్రత” అని భావం. పరిశుద్ధంగా ఉండడంలో, మాటల్లోనూ చేతల్లోనూ పరిశుభ్రంగా, లేక స్వచ్ఛంగా ఉండి, తప్పొప్పుల విషయంలో యెహోవా ప్రమాణాలకు తగినవిధంగా ఉండడం ఇమిడివుంది. అవును, తనకు ‘పరిశుద్ధులైన’ వారిపట్ల యెహోవా కనికరాన్ని చూపించి, వారు “పరిశుద్ధపట్టణమగు” యెరూషలేముకు తిరిగి వచ్చేందుకు అనుమతిస్తాడు.—నెహెమ్యా 11:1.
15. (ఎ) ‘జీవముపొందుటకై యెరూషలేములో దాఖలు’ చేయబడడం అనే పదబంధం, యూదులకున్న ఏ ఆచారాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది? (బి) యెషయా మాటలు ఏ గంభీరమైన హెచ్చరికను సూచిస్తున్నాయి?
15 ఈ నమ్మకమైన శేషము అక్కడే ఉంటుందా? వారు ‘జీవముపొందుటకై యెరూషలేములో దాఖలు’ చేయబడతారని యెషయా వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలు కుటుంబాలకు, గోత్రాలకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా ఒక పుస్తకంలో వ్రాసివుంచే యూదుల ఆచారాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. (నెహెమ్యా 7:5) ఆ పుస్తకంలో వ్యక్తి పేరు వ్రాయబడి ఉంటే ఆయన సజీవంగా ఉన్నట్లు, ఎందుకంటే ఒక వ్యక్తి మరణించిన వెంటనే ఆయన పేరు ఆ పుస్తకంలో నుండి కొట్టివేయబడుతుంది. బైబిలులోని ఇతర భాగాల్లో, యెహోవా ఎవరికైతే జీవం ఇవ్వబోతున్నాడో వారి పేర్లున్న సూచనార్థకమైన ఒక పుస్తకం గురించి మనం చదువుతాము. అయితే ఈ పుస్తకంలో పేర్లు ఒక షరతు మీదే వ్రాయబడతాయి, ఎందుకంటే యెహోవా ఆ పేర్లను ‘తుడిచివేయగలడు.’ (నిర్గమకాండము 32:32, 33; కీర్తన 69:28) కాబట్టి, యెషయా మాటలు ఒక గంభీరమైన హెచ్చరికను సూచిస్తున్నాయి, అదేమిటంటే తిరిగి వచ్చినవారు దేవుని దృష్టిలో పరిశుద్ధంగా నిలిచివుంటేనే వారు తమ పునఃస్థాపిత దేశంలో జీవనం కొనసాగించగలుగుతారు.
16. (ఎ) యెహోవా తాను సా.శ.పూ. 537 లో యూదాకు తిరిగి రావడానికి అనుమతించిన వారి నుండి ఏమి కోరాడు? (బి) అభిషిక్త శేషముపై, “వేరే గొఱ్ఱెల”పై యెహోవా చూపించిన కనికరం వ్యర్థం కాలేదని ఎందుకు చెప్పవచ్చు?
16 సత్యారాధనను పునఃస్థాపించాలనే ఒక స్వచ్ఛమైన దృక్పథంతోనే సా.శ.పూ. 537 లో ఒక శేషము యెరూషలేముకు తిరిగివచ్చింది. అన్యమత ఆచారాలతో లేక యెషయా ఎంతో శక్తిమంతంగా హెచ్చరించిన చెడు ప్రవర్తనతో కలుషితమైనవారికి తిరిగివచ్చే హక్కు ఇవ్వబడలేదు. (యెషయా 1:15-17) యెహోవా ఎవరినైతే పరిశుద్ధులుగా ఎంచాడో వారే యూదాకు తిరిగి రాగలిగారు. (యెషయా 35:8) అలాగే, 1919 లో తాము ఆధ్యాత్మిక చెర నుండి విడిపించబడినప్పటి నుండి అభిషిక్త శేషము మరియు భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణకలిగి ఇప్పుడు వారితో కలుస్తున్న లక్షలాదిమంది “వేరే గొఱ్ఱెలు” దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నం చేశారు. (యోహాను 10:16) వారు బబులోను సంబంధిత బోధలను, ఆచారాలను వదిలేశారు. వ్యక్తిగతంగా వారు నైతికత విషయంలో దేవుని ఉన్నతమైన ప్రమాణాలను అంటిపెట్టుకొని ఉండేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. (1 పేతురు 1:14-16) వారిపై యెహోవా చూపించిన కనికరం వ్యర్థం కాలేదు.
17. యెహోవా తన ‘జీవగ్రంథంలో’ ఎవరి పేర్లు వ్రాస్తాడు, మనం ఏమి చేయడానికి నిశ్చయించుకోవాలి?
17 ఇశ్రాయేలులో పరిశుద్ధులైయున్న వారిని యెహోవా గమనించాడనీ, ఆయన వారి పేర్లను ‘జీవం పొందుటకై దాఖలు చేశాడనీ’ గుర్తుతెచ్చుకోండి. నేడు కూడా మనం ‘మన శరీరములను పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా ఆయనకు సమర్పిస్తూ’ మానసికంగానూ, శారీరకంగానూ పరిశుభ్రంగా ఉండడానికి చేసే కృషిని యెహోవా గమనిస్తాడు. (రోమీయులు 12:1) అలాంటి జీవన విధానాన్ని అనుసరించే వారందరి పేర్లను దేవుడు తన “జీవగ్రంథమందు” అంటే పరలోకంలోగానీ భూమిపైగానీ నిత్యజీవాన్ని పొందబోయే వారి పేర్లుండే సూచనార్థక గ్రంథమందు వ్రాసి ఉంచుతాడు. (ఫిలిప్పీయులు 4:3; మలాకీ 3:16) కాబట్టి దేవుని దృష్టిలో పరిశుద్ధంగా నిలిచి ఉండడానికి మనం చేయగలిగినదంతా చేద్దాము, అలాగైతేనే మన పేర్లు ఆ విశేషమైన ‘గ్రంథంలో’ నుండి చెరపబడకుండా ఉంటాయి.—ప్రకటన 3:5.
ప్రేమపూర్వక శ్రద్ధను గురించిన వాగ్దానం
18, 19. యెషయా 4:4, 5 ప్రకారం, యెహోవా శుభ్రపరిచే ఏ కార్యాన్ని చేపడతాడు, అదెలా చేయబడుతుంది?
18 పునఃస్థాపిత దేశనివాసులు ఎలా పరిశుద్ధులవుతారో, వారి కోసం ఏ ఆశీర్వాదాలు వేచివున్నాయో తర్వాత యెషయా మనకు ఇలా వర్ణిస్తున్నాడు: “తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటిమీద వితానముండును.”—యెషయా 4:4, 5.
19 ఆడంబరమైన ఆభరణాల క్రింద నైతిక భ్రష్టత్వం దాగివున్న “సీయోను కుమార్తె”లను యెషయా మునుపు మందలించాడు. ప్రజలపైనున్న రక్తాపరాధాన్ని కూడా ఆయన బయలుపరచి, తమను తాము శుద్ధి చేసుకొమ్మని వారిని కోరాడు. (యెషయా 1:15, 16; 3:16-23) అయితే ఇక్కడ దేవుడే స్వయంగా వారి ‘కల్మషమును’ లేదా నైతిక మాలిన్యాన్ని ‘కడిగివేసే,’ ‘రక్తపు మరకలను శుభ్రం చేసే’ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. (యెషయా 4:4, న్యూ ఇంటర్‌నేషనల్ వర్షన్) ఈ శుభ్రం చేసేపని ఎలా చేయబడుతుంది? “తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను” చేయబడుతుంది. రానున్న యెరూషలేము నాశనము, బబులోను చెర దేవుని తీర్పు గాలివిసురులై ఉంటాయి, అపరిశుభ్రమైన జనముపై మండుతున్న ఆగ్రహమై ఉంటుంది. ఈ విపత్తులను తప్పించుకుని ఇంటికి తిరిగివచ్చే శేషము వినయంగలదిగా చేయబడుతుంది, శుద్ధీకరించబడుతుంది. అందుకే వారు యెహోవాకు పరిశుద్ధమైన వారైవుండి, ఆయన కనికరాన్ని పొందుతారు.—మలాకీ 3:2, 3 పోల్చండి.
20. (ఎ) ‘మేఘధూమములు’ మరియు “అగ్నిజ్వాల” అనే పదాలు దేన్ని జ్ఞప్తికి తెస్తాయి? (బి) శుభ్రపరచబడిన బంధీలు భయపడవలసిన అవసరం ఎందుకుండదు?
20 పరిశుభ్రపరచబడిన శేషము గురించి ప్రేమపూర్వకంగా శ్రద్ధ తీసుకుంటానని యెహోవా యెషయా ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. ‘మేఘధూమములు’ మరియు “అగ్నిజ్వాల” అనే పదాలు, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వచ్చిన తర్వాత యెహోవా వారి గురించి ఎలా శ్రద్ధ తీసుకున్నాడో జ్ఞప్తికి తెస్తాయి. “అగ్ని మేఘమయమైన స్తంభము” వారిని వెంబడిస్తున్న ఐగుప్తీయుల నుండి వారిని కాపాడింది; అది వారిని అరణ్యములో నడిపించింది. (నిర్గమకాండము 13:21, 22; 14:19, 20, 24) యెహోవా తనను తాను సీనాయి పర్వతంపై ప్రత్యక్షపరచుకున్నప్పుడు, ఆ పర్వతమంతా ‘ధూమమయమైంది.’ (నిర్గమకాండము 19:18) అప్పుడిక శుభ్రపరచబడిన పరవాసులు భయపడవలసిన అవసరం ఉండదు. యెహోవా వారి రక్షకుడై ఉంటాడు. వారు తమ స్వంత గృహాల్లో కలిసి సమావేశమైనా లేక పరిశుద్ధ సంఘాల్లో సమకూడినా ఆయన వారి మధ్యనుంటాడు.
21, 22. (ఎ) పొలాల్లో పర్ణశాల గానీ లేక పాక గానీ సాధారణంగా దేనికోసం నిర్మించబడేవి? (బి) శుభ్రపరచబడిన శేషము ఎదుట ఏ ఉత్తరాపేక్ష ఉంచబడింది?
21 యెషయా అనుదిన జీవితంపై ధ్యానముంచుతూ దైవిక కాపుదలను గూర్చిన తన వివరణను ముగిస్తున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.” (యెషయా 4:6) ఎండాకాలపు మండే ఎండల నుండీ, వర్షాకాలపు చలి నుండీ గాలివానల నుండీ ఎంతో అవసరమైన కాపుదలను ఇచ్చేందుకు ద్రాక్షతోటల్లో లేదా పొలాల్లో సాధారణంగా ఒక పర్ణశాల లేదా పాక నిర్మించబడేది.—యోనా 4:5 పోల్చండి.
22 హింసలనే కాల్చివేసే వేడి, వ్యతిరేకతలనే గాలివానలు ఎదురైనప్పుడు, పరిశుభ్రపరచబడిన శేషముకు యెహోవా కాపుదలగా, భద్రతగా, ఆశ్రయంగా ఉంటాడు. (కీర్తన 91:1, 2; 121:5) కాబట్టి వారి ఎదుట అందమైన ఉత్తరాపేక్ష ఉంచబడింది, అదేమిటంటే వారు బబులోను యొక్క మలినమైన నమ్మకాలను ఆచారాలను విడిచిపెట్టి యెహోవా తీర్పు యొక్క శుద్ధీకరణకు తమను తాము లోబరచుకుని పరిశుద్ధంగా నిలిచి ఉండడానికి కృషి చేస్తే వారు దైవిక కాపుదలనే “పర్ణశాల”లో ఉన్నట్లుగా సురక్షితంగా ఉంటారు.
23. యెహోవా అభిషిక్త శేషమును, వారి సహవాసులను ఎందుకు ఆశీర్వదించాడు?
23 శుద్ధీకరణ జరిగిన తర్వాతే ఆశీర్వాదాలు వస్తాయని గమనించండి. ఇది మన కాలంలో కూడా నిజమని నిరూపించబడింది. వెనుకటికి 1919 లో అభిషిక్త శేషము శుద్ధీకరించబడడానికి వినయంగా లోబడింది, యెహోవా వారి మాలిన్యాన్ని ‘కడిగివేశాడు.’ ఆ తర్వాత నుండి వేరే గొఱ్ఱెల “ఒక గొప్ప సమూహము” కూడా యెహోవా తమను శుద్ధిచేసేందుకు అనుమతించింది. (ప్రకటన 7:8, 9) అలా శుద్ధిచేయబడిన శేషమూ వారి సహవాసులూ ఆశీర్వదించబడ్డారు—యెహోవా వారిని తన సురక్షితమైన కాపుదల క్రిందికి తీసుకున్నాడు. హింసలనే వేడి లేదా వ్యతిరేకతనే గాలివానలు వారిపైకి రాకుండా ఆయన అద్భుతంగా వాటిని నివారించలేదు. కానీ ‘ఎండకు నీడగాను గాలివానకు చాటుగాను ఉండే ఒక పర్ణశాలను’ వారి కోసం నిర్మించినట్లుగా ఆయన వారిని కాపాడాడు. ఎలా?
24. యెహోవా తన ప్రజలను ఒక సంస్థగా ఆశీర్వదించాడని ఎలా స్పష్టమవుతుంది?
24 దీన్ని ఆలోచించండి: చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన కొన్ని ప్రభుత్వాలు యెహోవాసాక్షుల ప్రకటనా పనిని నిషేధించాయి లేక వారిని మొత్తానికే నిర్మూలించడానికి ప్రయత్నించాయి. అయినప్పటికీ, సాక్షులు దృఢంగా ఉండి, విడువక ప్రకటించడంలో కొనసాగారు! సాపేక్షికంగా చిన్నదైన, ఏ భద్రతా లేదన్నట్లు కనిపిస్తున్న ప్రజల గుంపు యొక్క కార్యకలాపాలను శక్తిమంతమైన దేశాలు సహితం ఎందుకు ఆపలేకపోయాయి? ఎందుకంటే యెహోవా శుభ్రపరచబడిన తన సేవకులను ఏ మానవుడూ తీసివేయలేని “పర్ణశాల” కాపుదల క్రింద ఉంచాడు!
25. యెహోవా మన రక్షకునిగా ఉంటాడంటే వ్యక్తిగతంగా మనకు అది ఎలాంటి భావాన్నిస్తుంది?
25 వ్యక్తిగతంగా మన విషయమేమిటి? యెహోవా మన రక్షకునిగా ఉంటాడంటే దాని భావం మనం ఈ వ్యవస్థలో సమస్యలు లేని జీవితాన్ని గడుపుతామని కాదు. చాలామంది నమ్మకమైన క్రైస్తవులు పేదరికం, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం, అనారోగ్యం, మరణం వంటి తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు, మన దేవుడు మనతో ఉన్నాడని మనమెన్నడూ మరచిపోకుండా ఉందాం. నమ్మకంగా ఉంటూ శ్రమలను సహించేందుకు మనకు కావలసిన దాన్ని, అంటే “బలాధిక్యము”ను ఇస్తూ ఆయన మనల్ని ఆధ్యాత్మికంగా కాపాడతాడు. (2 కొరింథీయులు 4:7) ఆయన సమక్షంలో సురక్షితంగా ఉన్న మనం భయపడవలసిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ, మనల్ని మనం ఆయన దృష్టిలో పరిశుద్ధంగా ఉంచుకునేందుకు మనం చేయగలిగినదంతా చేస్తున్నంత వరకూ ఏదీ ‘దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరదు.’—రోమీయులు 8:38, 39.
[అధస్సూచీలు]
^ ‘యెహోవా చిగురు’ అనే పదబంధం, యెరూషలేము పునఃస్థాపించబడేంత వరకూ కనిపించని మెస్సీయ గురించి చెబుతోందని కొంతమంది పండితులు సూచిస్తారు. అరామయిక్ టర్గమ్‌లలో, ఈ పదం, “యెహోవా యొక్క మెస్సీయ [క్రీస్తు]” అని వివరించబడింది. ఆసక్తికరంగా, ఆ తర్వాత యిర్మీయా మెస్సీయ గురించి మాట్లాడుతూ దావీదుకు పుట్టిన “నీతి చిగురు” అని చెప్పినప్పుడు ఇదే హీబ్రూ నామవాచకాన్ని (ట్సెమాక్) ఉపయోగించాడు.—యిర్మీయా 23:5; 33:15.
^ “తప్పించుకొనిన” వారిలో, చెరలో ఉన్నప్పుడు జన్మించినవారు కూడా ఉండవచ్చు. తమ పితరులు గనుక నాశనాన్ని తప్పించుకొని ఉండకపోతే వీరు జన్మించి ఉండేవారు కాదు గనుక వీరిని “తప్పించుకొనిన” వారిగా పరిగణించవచ్చు.—ఎజ్రా 9:13-15; హెబ్రీయులు 7:9, 10.
[అధ్యయన ప్రశ్నలు]
[63 వ పేజీలోని చిత్రం]
యూదాపైకి దైవిక తీర్పు అనే తుపాను వస్తోంది