కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మందిరం పైకెత్తబడింది

యెహోవా మందిరం పైకెత్తబడింది

నాలుగవ అధ్యాయం

యెహోవా మందిరం పైకెత్తబడింది

యెషయా 2:​1-5

1, 2. ఐక్యరాజ్య సమితి భవన సముదాయాల వద్ద ఒక గోడపై ఏ మాటలు చెక్కబడి ఉన్నాయి, అవి ఎక్కడి నుండి తీసుకోబడ్డాయి?

 “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును. యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.” న్యూయార్క్‌ నగరంలో ఐక్యరాజ్య సమితి భవన సముదాయాల వద్ద ఒక గోడపై ఈ మాటలు చెక్కబడి ఉన్నాయి. దశాబ్దాల వరకు, ఆ మాటలు ఎక్కడి నుండి తీసుకున్నారన్నది మరుగున ఉండిపోయింది. భూగోళవ్యాప్త శాంతికోసం పాటుపడడమే ఐక్యరాజ్య సమితి లక్ష్యం కాబట్టి, 1945 లో స్థాపించబడిన ఐక్యరాజ్య సమితి సంస్థాపకులే ఆ మాటలకు మూలకర్తలనే ముగింపుకు రావడం సులభమే.

2 కానీ, 1975 లో, ఆ గోడపైనున్న మాటలకు క్రింద యెషయా అనే పేరు కూడా చెక్కబడింది. అప్పుడు, ఆ మాటలు ఆధునిక మూలానికి చెందినవి కావని స్పష్టమైంది. వాస్తవానికి, అవి 2,700 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం ఒక ప్రవచనంగా వ్రాయబడ్డాయి, వాటిని ఇప్పుడు యెషయా గ్రంథంలోని రెండవ అధ్యాయంలో కనుగొనవచ్చు. శాంతిప్రియులు యెషయా ప్రవచించిన విషయాలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయని సహస్రాబ్దాలుగా ఆలోచించారు. ఇకపై అలా ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ ప్రాచీన ప్రవచనం నేడు మన ఎదుట ఘనంగా నెరవేరడాన్ని మనం చూస్తున్నాము.

3. తమ ఖడ్గములను నాగటినక్కులుగా సాగగొట్టుకునే జనములు ఎవరు?

3 తమ ఖడ్గములను నాగటి నక్కులుగా సాగగొట్టుకునే జనములు ఎవరు? ఆధునిక దిన రాజకీయ దేశాలు, ప్రభుత్వాలు మాత్రం కచ్చితంగా కాదు. ఇప్పటి వరకూ ఈ జనములు యుద్ధం చేయడానికీ, బలాన్ని ఉపయోగించి ‘సమాధానమును’ కాపాడడానికీ ఖడ్గాలను లేక ఆయుధాలను వృద్ధి చేశారు. నిజానికి ఈ జనములు తమ నాగటినక్కులను ఖడ్గములుగా సాగగొట్టుకోవాలనే ఎల్లప్పుడూ వాంఛించారు! అయితే, అన్ని దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్యన అంటే, “సమాధానకర్తయగు దేవుడు” అయిన యెహోవాను ఆరాధించే ప్రజల మధ్యన యెషయా ప్రవచనం నెరవేరుతోంది.​—⁠ఫిలిప్పీయులు 4:9.

స్వచ్ఛారాధనకు ప్రవాహమువలె వచ్చే జనములు

4, 5. యెషయా రెండవ అధ్యాయంలోని ప్రారంభ వచనాలు ఏమి ప్రవచిస్తున్నాయి, ఆ మాటల విశ్వసనీయతను ఏది నొక్కిచెబుతుంది?

4 యెషయా రెండవ అధ్యాయం ఈ మాటలతో ప్రారంభమౌతుంది: “యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు.”​—యెషయా 2:1, 2.

5 యెషయా ప్రవచిస్తున్నది కేవలం ఊహ కాదని గమనించండి. తప్పక జరిగే సంఘటనలను వ్రాసిపెట్టమని యెషయాకు నిర్దేశించబడింది. యెహోవా సంకల్పించేదంతా “సఫలము” అవుతుంది. (యెషయా 55:​11) స్పష్టంగా, దేవుడు తన వాగ్దాన విశ్వసనీయతను నొక్కిచెప్పడానికి, యెషయా 2:2-4 వచనాల్లో ఉన్న అదే ప్రవచనాన్ని యెషయా సమకాలీన ప్రవక్తయైన మీకా తన పుస్తకంలో వ్రాసి ఉంచేందుకు ఆయనను ప్రేరేపించాడు.​—⁠మీకా 4:1-3.

6. యెషయా ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది?

6 యెషయా ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది? “అంత్యదినములలో.” ఈ కాలాన్ని గుర్తించే సూచనలను క్రైస్తవ గ్రీకు లేఖనాలు ముందే ప్రవచించాయి. ఆ సూచనల్లో యుద్ధాలు, భూకంపాలు, వ్యాధులు, కరవులు, “అపాయకరమైన కాలములు” చేరివున్నాయి. * (2 తిమోతి 3:1-5; లూకా 21:​10, 11) అలాంటి వాగ్దానాల నెరవేర్పు, మనం ప్రస్తుత ప్రపంచ విధానపు చివరి దినాల్లో అంటే “అంత్యదినములలో” జీవిస్తున్నామనడానికి ఎంతో సాక్ష్యాధారాన్ని ఇస్తుంది. కాబట్టి, సహేతుకంగానే, యెషయా ప్రవచించిన విషయాలు మన కాలంలో నెరవేరడం చూడవచ్చని మనం ఎదురుచూస్తాం.

ఆరాధన కోసం ఒక పర్వతం

7. యెషయా ఏ ప్రవచనార్థక దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు?

7 యెషయా కేవలం కొన్ని మాటల్లో సుస్పష్టమైన ప్రవచనార్థక దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు. మనం ఎత్తైన ఒక పర్వతాన్ని, దాని శిఖరాన యెహోవా మహిమాన్విత మందిరాన్ని చూస్తాము. ఈ పర్వతం దాని పరిసరాల్లో ఉన్న ఇతర పర్వతాల కన్నా, కొండల కన్నా ఎత్తుగా ఉంటుంది. అయినా అది చూడ్డానికి భయం గొల్పేదిగా ఉండదు; అది ఆకర్షణీయంగా ఉంటుంది. అన్ని దేశాలకు చెందిన ప్రజలూ యెహోవా మందిర పర్వతాన్ని ఎక్కాలని ఆకాంక్షిస్తారు; వారు ప్రవాహమువలె వస్తారు. దీన్ని ఊహించుకోవడం సులభమే, కానీ దీని భావమేమిటి?

8. (ఎ) యెషయా కాలంలో కొండలు, పర్వతాలు దేనితో ముడిపడి ఉండేవి? (బి) జనములు “యెహోవా మందిర పర్వతము”కు ప్రవాహము వలె రావడం దేన్ని సూచిస్తోంది?

8 యెషయా కాలంలో కొండలు, పర్వతాలు సాధారణంగా ఆరాధనతో ముడిపడి ఉండేవి. ఉదాహరణకు, అవి విగ్రహారాధనా స్థలాలుగా, అబద్ధ దేవుళ్ల దేవళాలుగా ఉండేవి. (ద్వితీయోపదేశకాండము 12:2; యిర్మీయా 3:6) అయితే, యెహోవా మందిరం లేక ఆలయం, యెరూషలేములోని మోరీయా పర్వత శిఖరాన్ని అలంకరిస్తుంది. నమ్మకమైన ఇశ్రాయేలీయులు సంవత్సరానికి మూడుసార్లు యెరూషలేముకు ప్రయాణించి, సత్యదేవుడ్ని ఆరాధించడానికి మోరీయా పర్వతాన్ని అధిరోహించేవారు. (ద్వితీయోపదేశకాండము 16:​16) కాబట్టి జనములు “యెహోవా మందిర పర్వతము”కు ప్రవాహమువలే రావడమన్నది, అనేకమంది ప్రజలు సత్యారాధన కోసం సమకూడడాన్ని సూచిస్తోంది.

9. “యెహోవా మందిర పర్వతము” దేన్ని సూచిస్తోంది?

9 అయితే ఈనాడు దేవుని ప్రజలు అక్షరార్థమైన పర్వతంపైనున్న రాతి ఆలయంలో సమకూడరు. సా.శ. 70 లో రోమన్‌ సైన్యాలు యెరూషలేములోని యెహోవా ఆలయాన్ని నాశనం చేశాయి. అంతేగాక, యెరూషలేములోని ఆలయమూ, దానికి మునుపున్న గుడారమూ కేవలం సూచనార్థకమైనవని అపొస్తలుడైన పౌలు స్పష్టం చేశాడు. అవి మరింత గొప్ప, ఆధ్యాత్మిక వాస్తవికతకు, అంటే “మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము”కు ప్రాతినిధ్యం వహించాయి. (హెబ్రీయులు 8:2) ఆ ఆధ్యాత్మిక గుడారం, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి ఆధారంగా యెహోవాను ఆరాధనలో సమీపించేందుకు చేసిన ఏర్పాటు. (హెబ్రీయులు 9:​2-10, 23) దీనికి అనుగుణంగా, యెషయా 2:2 లో ప్రస్తావించబడిన “యెహోవా మందిర పర్వతము,” మన కాలంలో ఉన్నతపర్చబడిన స్వచ్ఛారాధనను సూచిస్తోంది. స్వచ్ఛారాధనను హత్తుకునేవారు భౌగోళికంగా ఏదో ఒక ప్రాంతంలోనే సమకూడరు; వారు ఆరాధన కోసం ఐక్యంగా సమకూడుతారు.

స్వచ్ఛారాధన ఉన్నతపర్చబడడం

10, 11. మన కాలంలో యెహోవా ఆరాధన ఏ భావంలో ఉన్నతపర్చబడింది?

10 “యెహోవా మందిర పర్వతము” లేక స్వచ్ఛారాధన “పర్వత శిఖరమున స్థిరపరచ”బడుతుందని, “కొండలకంటె ఎత్తుగా ఎత్తబడు”తుందని ప్రవక్త చెబుతున్నాడు. యెషయా కాలానికి ఎంతో ముందే, దావీదు రాజు నిబంధన మందసాన్ని సముద్రమట్టానికి 2,500 అడుగుల ఎత్తున ఉన్న యెరూషలేములోని సీయోను కొండపైకి తీసుకువచ్చాడు. ఆ మందసం, మోరీయా పర్వతంపై నిర్మింపబడిన ఆలయంలోకి తరలించబడేంత వరకు అక్కడే ఉంది. (2 సమూయేలు 5:​6, 7; 6:​14-19; 2 దినవృత్తాంతములు 3:1; 5:​1-10) అలా, యెషయా కాలానికల్లా ఆ పరిశుద్ధ మందసం భౌతికంగా పైకెత్తబడి, అబద్ధ ఆరాధన కోసం ఉపయోగించబడే ఆ పరిసరాల్లోని అనేక కొండలకంటే ఉన్నతమైన స్థానంలో, ఆలయంలో ఉంచబడింది.

11 అయితే, అబద్ధ దేవుళ్ల సేవచేసేవారి మతసంబంధమైన ఆచారాలకన్నా యెహోవా ఆరాధన ఆధ్యాత్మిక భావంలో ఎల్లప్పుడూ ఉన్నతమైనదిగానే ఉంది. మన కాలంలో, యెహోవా తన ఆరాధనను ఆకాశమంత ఎత్తుకు, అన్నివిధాలైన అశుద్ధ ఆరాధనలకంటే, అన్ని “కొండల” కంటే “పర్వత శిఖరము”ల కంటే ఎత్తుకు ఎత్తాడు. ఏ విధంగా? ఆయనను “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించాలని కోరుకునే వారిని సమకూర్చడం ద్వారానే.​—⁠యోహాను 4:23.

12. “రాజ్యసంబంధులు” ఎవరు, ఎవరిని సమకూర్చడం జరిగింది?

12 పరలోక మహిమలో తనతోపాటు పరిపాలించే నిరీక్షణగల “రాజ్యసంబంధుల”ను దేవదూతలు సమకూర్చే కాలమైన “యుగసమాప్తి”ని యేసు కోతకాలమని సూచించాడు. (మత్తయి 13:​36-43) దేవదూతలతోపాటు కోతపనిలో భాగం వహించేందుకు యెహోవా 1919 నుండి ఈ రాజ్యసంబంధుల్లోని ‘శేషించినవారిని’ బలపరిచాడు. (ప్రకటన 12:​17) కాబట్టి, మొదట సమకూర్చబడింది, “రాజ్యసంబంధులు” అంటే యేసు అభిషిక్త సహోదరులు. తర్వాత వారు అదనపు సమకూర్చే పనిలో భాగం వహిస్తారు.

13. యెహోవా అభిషిక్త శేషమును ఎలా ఆశీర్వదించాడు?

13 ఈ కోత కాలంలో, యెహోవా తన వాక్యమైన బైబిలును అర్థంచేసుకుని అన్వయించుకోవడానికి అభిషిక్త శేషముకు క్రమానుసారంగా సహాయం చేశాడు. ఇది కూడా స్వచ్ఛారాధనను ఉన్నతపర్చడానికి దోహదపడింది. ‘భూమిని చీకటి కమ్ముచున్నప్పటికీ, కటికచీకటి జనములను కమ్ముచున్నప్పటికీ’ అభిషిక్తులు యెహోవాచే పరిశుభ్రపరచబడి, శుద్ధీకరించబడి మానవజాతి మధ్యన “జ్యోతులవలె” వెలుగుతున్నారు. (యెషయా 60:1-2; ఫిలిప్పీయులు 2:​16) ‘ఆయన చిత్తమును గూర్చిన సంపూర్ణ జ్ఞానముతోను ఆత్మసంబంధమైన వివేకముతోను,’ నిండుకొనిన ఆత్మాభిషిక్తులైన వీరు, “తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు.”​—⁠కొలొస్సయులు 1:9-12; మత్తయి 13:43.

14, 15. “రాజ్యసంబంధుల”తో పాటు ఇంకా ఎవరిని సమకూర్చడం జరిగింది, హగ్గయి దాన్నెలా ప్రవచించాడు?

14 అంతేగాక, ఇతరులు “యెహోవా మందిర పర్వతము”కు ప్రవాహము వలె వచ్చారు. యేసు వీరిని “వేరే గొర్రెలు” అని పిలిచాడు, వీరికి పరదైసు భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణ ఉంది. (యోహాను 10:16; ప్రకటన 21:​3, 4) వారు 1930లు మొదలుకొని, మొదట వేల సంఖ్యలో, ఆతర్వాత ఇప్పుడు లక్షల సంఖ్యలో ఉన్నారు! అపొస్తలుడైన యోహానుకు ఇవ్వబడిన దర్శనంలో వారు, “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము” అని వర్ణించబడ్డారు.​—⁠ప్రకటన 7:9.

15 ప్రవక్తయైన హగ్గయి ఈ గొప్ప సమూహం కనిపించడాన్ని గురించి ముందే తెలియజేశాడు. ఆయనిలా వ్రాశాడు: “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా​—⁠ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు [స్వచ్ఛారాధనలో అభిషిక్త క్రైస్తవులతో కలిసేవారు] తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.” (హగ్గయి 2:​6, 7) ఇప్పటికీ అధికమౌతున్న ఈ “గొప్ప సమూహము,” వారి అభిషిక్త సహవాసుల ఉనికి యెహోవా మందిరంలో స్వచ్ఛారాధనను ఉన్నతపరుస్తుంది, అవును మహిమపరుస్తుంది. సత్యదేవుని ఆరాధనలో మునుపెన్నడూ ఇంతమంది సమకూడినట్లు చెప్పబడలేదు, ఇది యెహోవాకు ఆయన నియమిత రాజైన యేసుక్రీస్తుకు మహిమను తెస్తుంది. రాజైన సొలొమోను ఇలా వ్రాశాడు: “జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనత వచ్చును.”​—⁠సామెతలు 14:28.

ప్రజల జీవితాల్లో ఆరాధన ఉన్నతపర్చబడడం

16-18. యెహోవాకు అంగీకృతమైన విధంగా ఆయనను ఆరాధించడానికి కొందరు ఏ మార్పులు చేసుకున్నారు?

16 మన కాలంలో స్వచ్ఛారాధనను ఉన్నతపర్చిన ఘనత అంతా యెహోవాకే దక్కుతుంది. అయినప్పటికీ, ఆయనను సమీపించేవారు ఆ పనిలో భాగం వహించే ఆధిక్యత కలిగివున్నారు. ఒక పర్వతాన్ని ఎక్కడానికి ఎలాగైతే కృషి అవసరమో అలాగే దేవుని నీతియుక్తమైన ప్రమాణాలను తెలుసుకొని వాటి అనుసారంగా జీవించడానికి ఎంతో కృషి అవసరం. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులలాగే, ఈనాటి దేవుని సేవకులు సత్యారాధనతో పొంతనలేని జీవన విధానాలను, ఆచారాలను విడిచిపెట్టారు. జారులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, దొంగలు, లోభులు, త్రాగుబోతులు, మరితరులు తమ మార్గాలను మార్చుకుని, దేవుని దృష్టిలో ‘కడుగబడిన’ వారయ్యారు.​—⁠1 కొరింథీయులు 6:9-11.

17 ఒక యౌవనస్థురాలి అనుభవం సరిగ్గా అలాగే ఉంది, ఆమె ఇలా వ్రాసింది: “ఒకప్పుడు నేను ఆశలన్నీ వదులుకున్నాను. నేను చెడు ప్రవర్తన కలిగి, బాగా తాగేదాన్ని. నాకు సుఖవ్యాధులు సోకాయి. నేను మత్తుపదార్థాలు అమ్మేదాన్ని, అసలు దేన్నీ పట్టించుకునేదాన్ని కాదు.” బైబిలు అధ్యయనం చేసిన తర్వాత ఆమె దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ఉండేందుకు ఎంతో పెద్ద పెద్ద మార్పులనే చేసుకుంది. ఇప్పుడామె ఇలా అంటోంది: “నాకిప్పుడు మనశ్శాంతి ఉంది, ఆత్మ-గౌరవం ఉంది, భవిష్యత్తు గురించి ఒక నిరీక్షణ ఉంది, నాకొక నిజమైన కుటుంబం కూడా ఉంది, అన్నిటికన్నా ఎక్కువగా నాకు మన తండ్రియైన యెహోవాతో చక్కని సంబంధం ఉంది.”

18 యెహోవా ఎదుట అంగీకృత స్థానాన్ని పొందిన తర్వాత కూడా, తమ జీవితాల్లో స్వచ్ఛారాధనకు ప్రథమస్థానం ఇవ్వడం ద్వారా అందరూ దాన్ని ఉన్నతపర్చడంలో కొనసాగాలి. నేడు తమ జీవితాల్లో తన ఆరాధనను ప్రాముఖ్యమైన విషయంగా చేసుకునేందుకు ఆతురపడేవారు కోట్లాదిమంది ఉంటారనే తన నమ్మకాన్ని యెహోవా వేల సంవత్సరాల క్రితమే యెషయా ద్వారా వ్యక్తపరిచాడు. మీరు వారిలో ఒకరై ఉన్నారా?

యెహోవా మార్గం బోధింపబడిన ప్రజలు

19, 20. దేవుని ప్రజలకు ఏమి బోధించబడుతుంది, ఎక్కడ?

19 నేడు స్వచ్ఛారాధనను హత్తుకునేవారి గురించి యెషయా మనకు ఇంకా తెలియజేస్తున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి​—⁠యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.”​—యెషయా 2:3.

20 యెహోవా తన ప్రజలు దారితప్పిన గొఱ్ఱెల్లా తిరగడానికి అనుమతించడు. వారు తన మార్గాలను తెలుసుకునేలా ఆయన బైబిలు ద్వారా, బైబిలు ఆధారిత ప్రచురణల ద్వారా తన “ధర్మశాస్త్రము”ను, తన “వాక్కు”ను వారికి అనుగ్రహిస్తాడు. ఈ జ్ఞానము, ‘ఆయన మార్గములలో నడుచుకునేందుకు’ వారిని ఆయత్తపరుస్తుంది. మెప్పు నిండిన హృదయాలతోనూ, దైవిక నడిపింపుకు అనుగుణంగానూ, వారు ఒకరితో ఒకరు యెహోవా మార్గముల గురించి మాట్లాడుకుంటారు. దేవుని మార్గముల గురించి వినడానికి, తెలుసుకోవడానికి వారు పెద్ద పెద్ద సమావేశాల్లోనూ అలాగే రాజ్యమందిరాల్లో స్వంత ఇండ్లల్లో చిన్న చిన్న గుంపులుగానూ సమకూడుతారు. (ద్వితీయోపదేశకాండము 31:​12, 13) అలా వారు, “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును” ఒకరినొకరు ప్రోత్సహించుకునేందుకు, పురికొల్పుకునేందుకు సమకూడిన తొలి క్రైస్తవుల మాదిరిని అనుకరిస్తారు.​—⁠హెబ్రీయులు 10:24, 25.

21. యెహోవా సేవకులు ఏ పనిలో భాగం వహిస్తారు?

21 యెహోవా దేవుని ఉన్నతపర్చబడిన ఆరాధనకు “వెళ్లుదము” అని వారు ఇతరులను ఆహ్వానిస్తారు. యేసు తాను పరలోకానికి ఆరోహణం కాకముందు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞతో ఇది ఎంత చక్కగా పొందిక కలిగివుందో కదా! ఆయన వారికిలా చెప్పాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:​19, 20) దానికి విధేయులై యెహోవా సాక్షులు దైవిక మద్దతుతో భూవ్యాప్తంగా వెళ్తూ, బోధిస్తూ, శిష్యులను చేస్తూ, వారికి బాప్తిస్మమిస్తారు.

ఖడ్గములను నాగటి నక్కులుగా

22, 23. యెషయా 2:4 ఏమి ప్రవచిస్తుంది, దాని గురించి ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక అధికారి ఏమన్నాడు?

22 ఇప్పుడు మనం తర్వాతి వచనానికి వస్తున్నాము, దానిలోని కొంతభాగం ఐక్యరాజ్య సమితి భవన సముదాయాల వద్ద ఒక గోడపై చెక్కబడి ఉంది. యెషయా ఇలా చెబుతున్నాడు: “ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”​—యెషయా 2:4.

23 దీన్ని సాధించడం చిన్న విషయమేమీ కాదు. ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ అయిన ఫెడెరీకో మేయోర్‌ ఒకసారిలా అన్నాడు: “దృశ్య-శ్రవణ పరికరాల ద్వారా మనం నేడు చూడగలుగుతున్న యుద్ధ భీభత్సాలన్నీ, అనేక శతాబ్దాల క్రితమే ప్రారంభమై కొనసాగుతున్న యుద్ధ సామగ్రి పురోగమనాన్ని ఆపగలుగుతున్నట్లు అనిపించడం లేదు. ప్రస్తుత తరాల ఎదుట, ‘తమ ఖడ్గములను నాగటినక్కులుగా సాగగొట్టుకుని,’ అనాదికాలం నుండి వృద్ధి చెందిన యుద్ధోన్మాదాన్ని సమాధాన ప్రియత్వానికి మార్చవలసిన, బైబిలు సంబంధితమైన, దాదాపు దుస్సాధ్యమైన కార్యభారం ఉంది. దీన్ని సాధించడం, ‘భౌగోళిక గ్రామం’ సాధించగల సర్వశ్రేష్ఠమైన, అత్యంత మహోన్నతమైన కార్యమై ఉంటుంది, అది మన తర్వాతి తరాలవారికి సర్వోత్తమమైన వారసత్వ సంపదగా ఉంటుంది.”

24, 25. యెషయా మాటలు ఎవరియందు నెరవేరుతున్నాయి, ఏ విధంగా?

24 జనములు తాముగా ఈ ఉత్కృష్ఠమైన లక్ష్యాన్ని ఎన్నటికీ సాధించలేరు. అది పూర్తిగా వారి శక్తికి మించినది. అనేక దేశాలకు చెందిన, స్వచ్ఛారాధనలో ఐక్యమై ఉన్న వ్యక్తులు యెషయా మాటలను నెరవేరుస్తున్నారు. యెహోవా వారితో “వివాదము” తీర్చుకున్నాడు. ఒకరితో ఒకరు సమాధానంగా జీవించడాన్ని ఆయన తన ప్రజలకు బోధించాడు. నిజంగా, విభాగిత వైషమ్యభరిత లోకంలో, వారు సూచనార్థకంగా తమ “ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను” సాగగొట్టుకున్నారు. ఎలా?

25 ఒక విషయం ఏమిటంటే, వారు దేశాల యుద్ధాల్లో పాల్గొనరు. యేసు మరణించడానికి కొంతసమయం ముందు, సాయుధులైన వ్యక్తులు ఆయనను నిర్బంధించడానికి వచ్చారు. తన ప్రభువును రక్షించడానికి పేతురు తన ఖడ్గాన్ని దూసినప్పుడు, యేసు ఆయనతో ఇలా అన్నాడు: “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” (మత్తయి 26:​52) అప్పటి నుండి, యేసు అడుగుజాడలను అనుసరించేవారు తమ ఖడ్గములను నాగటినక్కులుగా సాగగొట్టుకొని తమ తోటి మానవులను చంపడానికి ఆయుధాలను చేతిలోకి తీసుకోవడం గానీ, మరితర మార్గాల్లో యుద్ధ ప్రయత్నాలకు మద్దతునివ్వడం గానీ చేయడం లేదు. వారు ‘అందరితోనూ సమాధానము కలిగి వుండటానికి ప్రయత్నిస్తారు.’​—⁠హెబ్రీయులు 12:14.

సమాధాన మార్గాలను వెంబడించడం

26, 27. దేవుని ప్రజలు ఎలా ‘సమాధానమును వెదకి దాన్ని వెంటాడుతారు’? ఒక ఉదాహరణ ఇవ్వండి.

26 దేవుని ప్రజల మధ్య సమాధానం ఉండటానికి కారణం, వారు యుద్ధంలో పాల్గొనటానికి నిరాకరించడం మాత్రమే కాదు. వారు 230 కన్నా ఎక్కువ దేశాల్లో ఉన్నప్పటికీ, లెక్కలేనన్ని భాషలకూ సంస్కృతులకూ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటారు. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందుర”ని యేసు మొదటి శతాబ్దంలో తన శిష్యులకు చెప్పిన మాటల ఆధునిక నెరవేర్పును వారి మధ్య కనుగొనవచ్చు. (యోహాను 13:​35) క్రైస్తవులు నేడు ‘సమాధానపరచువారిగా’ ఉన్నారు. (మత్తయి 5:9) వారు ‘సమాధానమును వెదకి దాని వెంటాడతారు.’ (1 పేతురు 3:​11) ‘సమాధానకర్తయగు దేవుడైన’ యెహోవా వారిని బలపరుస్తాడు.​—⁠రోమీయులు 15:33.

27 సమాధానపరచువారిగా ఉండడం నేర్చుకున్న వారిని గురించి అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి. ఒక యౌవనస్థుడు తన బాల్యకాల జీవితాన్ని గురించి ఇలా వ్రాస్తున్నాడు: “నన్ను నేను ఎలా కాపాడుకోవాలో కఠినమైన అనుభవం నాకు నేర్పింది. దానితో నాకు జీవితమంటే చాలా కఠినమైన, ఆగ్రహపూరితమైన అభిప్రాయం ఏర్పడింది. నేను ఎప్పుడూ గొడవలు పెట్టుకునేవాడిని. రోజుకొక పొరుగింటి పిల్లవాడితో గొడవపడేవాడిని, కొన్నిసార్లు గుద్దేవాడిని కొన్నిసార్లు రాళ్లతో లేదా సీసాలతో కొట్టేవాడిని. నేను చాలా దౌర్జన్యపూరితంగా తయారయ్యాను.” అయితే చివరికి, “యెహోవా మందిర పర్వతమునకు” వెళ్లుదమనే ఆహ్వానానికి ఆయన ప్రతిస్పందించాడు. ఆయన దేవుని మార్గాలను తెలుసుకుని, సమాధానకరమైన సేవకునిగా తయారయ్యాడు.

28. సమాధానమును వెంటాడటానికి క్రైస్తవులు ఏమి చేయవచ్చు?

28 యెహోవా సేవకుల్లో ఎక్కువమంది అలాంటి పూర్వరంగాల నుండి వచ్చినవారు కాదు. అయినప్పటికీ, దయ, క్షమ, సానుభూతి చూపించడం వంటి చిన్న విషయాలను కూడా చేస్తూ వారు ఇతరులతో సమాధానం కలిగివుండడానికి కృషి చేస్తారు. వారు అపరిపూర్ణులే అయినప్పటికీ, “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి” అని చెబుతున్న బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకోవడానికి కృషి చేస్తారు.​—⁠కొలొస్సయులు 3:13.

సమాధానకరమైన భవిష్యత్తు

29, 30. భూమికి ఏ ఉత్తరాపేక్ష ఉంది?

29 ఈ “అంత్యదినములలో” యెహోవా ఒక అద్భుతాన్ని చేశాడు. తన సేవ చేయాలని కోరుకునే వారిని ఆయన అన్ని దేశాల నుండి సమకూర్చాడు. ఆయన వారికి తన మార్గాల్లో అంటే సమాధాన మార్గాల్లో నడవడం నేర్పించాడు. రానున్న “మహా శ్రమలను” తప్పించుకొని, యుద్ధం ఇక ఎన్నడూ ఉండకుండా నిర్మూలించబడే సమాధానకరమైన నూతన లోకంలోకి ప్రవేశించేవారు వీరే.​—⁠ప్రకటన 7:14.

30 ఖడ్గములు అంటే ఆయుధాలు ఇక ఉండవు. ఆ సమయాన్ని గురించి కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే; యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.” (కీర్తన 46:​8, 9) అలాంటి ఉత్తరాపేక్ష దృష్ట్యా, “యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము” అని యెషయా చేసిన ఉద్బోధ ఆయన వ్రాసినప్పుడు ఎంత సముచితమైనదో నేడూ అంతే సముచితమైనది. (యెషయా 2:5) అవును, యెహోవా వెలుగు మన మార్గాన్ని ఇప్పుడు తేజోమయం చేయడానికి అనుమతిస్తే, మనం ఆయన మార్గంలో నిరంతరం నడుస్తాము.​—⁠మీకా 4:5.

[అధస్సూచి]

^ వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సంస్థ ప్రచురించిన, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని “ఇవి అంత్యదినాలు” అనే 11 వ అధ్యాయాన్ని చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]