యెహోవా హస్తం ఎత్తబడుతుంది
ఇరవై-ఒకటవ అధ్యాయం
యెహోవా హస్తం ఎత్తబడుతుంది
1. యెషయాకు యెహోవాపట్ల మెప్పుదల ఎందుకు ఉంది?
యెషయాకు యెహోవాపట్ల ప్రగాఢమైన ప్రేమ ఉంది, యెహోవాను స్తుతించడం ఆయనకెంతో సంతోషం కలిగిస్తుంది. ఆయన బిగ్గరగా ఇలా అంటున్నాడు: “యెహోవా, నీవే నా దేవుడవు. నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను.” తన సృష్టికర్తపట్ల అంత చక్కని మెప్పుదలను కలిగి ఉండడానికి ప్రవక్తకు ఏమి సహాయం చేస్తుంది? ఒక ప్రధాన కారణం ఏమిటంటే, యెహోవా గురించి ఆయన కార్యకలాపాల గురించి యెషయాకున్న జ్ఞానమే. యెషయా తర్వాతి మాటలు ఈ జ్ఞానాన్ని బయలుపరుస్తాయి: “నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి.” (యెషయా 25:1) యెహోవా విశ్వసనీయుడనీ, నమ్ముకొనతగినవాడనీ, ఆయన “ఆలోచనలు” అన్నీ అంటే ఆయన సంకల్పించినవన్నీ నెరవేరుతాయనీ, తనకు ముందున్న యెహోషువకులాగే యెషయాకు కూడా తెలుసు.—యెహోషువ 23:14.
2. యెహోవా యొక్క ఏ ఆలోచనను యెషయా ఇప్పుడు ప్రకటిస్తున్నాడు, ఈ ఆలోచన దేనిని ఉద్దేశిస్తుండవచ్చు?
2 యెహోవా ఆలోచనల్లో ఇశ్రాయేలు శత్రువులకు వ్యతిరేకంగా ఆయన చేసే తీర్పు ప్రకటనలు కూడా చేరి ఉన్నాయి. యెషయా ఇప్పుడు వాటిలో ఒకదాన్ని ఇలా ప్రకటిస్తున్నాడు: “నీవు పట్టణము దిబ్బగాను, ప్రాకారముగల పట్టణము పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి, అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి.” (యెషయా 25:2) పేరు తెలుపబడని ఈ పట్టణం ఏది? యెషయా బహుశా ఆర్మోయాబును ఉద్దేశిస్తుండవచ్చు, మోయాబు ఎంతోకాలంగా దేవుని ప్రజలతో శత్రుత్వాన్ని కలిగి ఉంది. * లేదా ఆయన మరో బలమైన పట్టణమైన బబులోనును ఉద్దేశిస్తుండవచ్చు.—యెషయా 15:1; జెఫన్యా 2:8, 9.
3. యెహోవా శత్రువులు ఆయనను ఏ విధంగా ఘనపరుస్తారు?
3 తమ బలమైన పట్టణానికి వ్యతిరేకంగా యెహోవా ఆలోచన నిజమైనప్పుడు ఆయన శత్రువులు ఎలా ప్రతిస్పందిస్తారు? “బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు; భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు.” (యెషయా 25:4) సర్వశక్తిమంతుడైన దేవుని శత్రువులు ఆయనకు భయపడతారన్నది అర్థం చేసుకొనదగినదే. అయితే వారు ఆయనను ఎలా ఘనపరుస్తారు? వారు తమ అబద్ధ దేవుళ్లను విడనాడి, స్వచ్ఛారాధనను చేపడతారా? ఎంతమాత్రం కాదు! బదులుగా, ఫరో, నెబుకద్నెజరులలా వారు యెహోవా యొక్క ఉత్కృష్టమైన సర్వోన్నతత్వాన్ని గుర్తించేలా చేయబడినప్పుడు వారు యెహోవాను ఘనపరుస్తారు.—నిర్గమకాండము 10:16, 17; 12:30-33; దానియేలు 4:37.
4. నేడు ఉనికిలోవున్న ‘భీకరజనముల పట్టణం’ ఏది, అది కూడా యెహోవాను ఎలా ఘనపరచవలసి వస్తుంది?
4 నేడు ‘భీకరజనముల పట్టణం’ అన్నది ‘భూరాజులనేలు మహాపట్టణం,’ అంటే ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహా బబులోను.” (ప్రకటన 17:5, 18) ఈ ప్రపంచ అబద్ధమతంలో క్రైస్తవమత సామ్రాజ్యం ఒక ప్రధాన భాగం. క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు యెహోవాను ఎలా ఘనపరుస్తారు? ఆయన తన సాక్షుల పక్షాన సాధించిన అద్భుతమైన విషయాలను అయిష్టంగా సమ్మతించడం ద్వారా వారలా చేస్తారు. ప్రాముఖ్యంగా 1919 లో యెహోవా తన సేవకులు మహా బబులోను ఆధ్యాత్మిక చెర నుండి విడుదల చేయబడిన తర్వాత శక్తివంతమైన కార్యాన్ని చేపట్టడానికి వారిని పునరుద్ధరించినప్పుడు, ఈ నాయకులు “భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.”—ప్రకటన 11:13. *
5. యెహోవాపై సంపూర్ణ నమ్మకం ఉన్నవారిని ఆయన ఎలా కాపాడతాడు?
5 యెహోవా తన శత్రువులకు భయానకంగానే అనిపించినప్పటికీ ఆయన సేవ చేయాలనుకునే సాత్వికులకు, దీనులకు ఆయన ఆశ్రయదుర్గం వంటి వాడు. సత్యారాధకుల విశ్వాసాన్ని తుంచివేయడానికి మత, రాజకీయ నిరంకుశులు అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ, యెహోవాపై వారికి ఉన్న సంపూర్ణ నమ్మకాన్ని బట్టి వీరు విఫలమవుతారు. చివరికి, ఆయన తన వ్యతిరేకుల నోరు సులభంగా మూయిస్తాడు, నిప్పులు చెరిగే ఎడారిలోని సూర్యుని ఒక మేఘంతో కప్పేస్తున్నట్లుగా లేక గాలివాన తాకిడిని గోడతో అడ్డుకుంటున్నట్లుగా ఆయనలా చేస్తాడు.—యెషయా 25:3-5.
‘సమస్త జనములకు విందు’
6, 7. (ఎ) యెహోవా ఏ విధమైన విందును ఏర్పాటు చేస్తున్నాడు, ఎవరి కోసం? (బి) యెషయా ప్రవచించిన విందు దేనికి పూర్వఛాయగా ఉంది?
6 ఒక ప్రేమగల తండ్రిలా యెహోవా తన పిల్లలను కాపాడడమే గాక, వారిని పోషిస్తాడు కూడా, ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా పోషిస్తాడు. తన ప్రజలను 1919 లో విడుదల చేసిన తర్వాత, ఆయన వారి ఎదుట విజయోత్సాహపు విందును, పుష్కలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని వారికోసం ఏర్పాటు చేశాడు: “ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును, మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును, మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును, మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.”—యెషయా 25:6
7 విందు యెహోవా “పర్వతము” మీద ఏర్పాటు చేయబడింది. ఈ పర్వతం ఏమిటి? అది “అంత్యదినములలో” సమస్త జనములు ప్రవాహము వలె వచ్చే “యెహోవా మందిర పర్వతము.” అది యెహోవా ‘పరిశుద్ధ పర్వతం,’ అక్కడ ఆయన నమ్మకమైన ఆరాధకులు ఏ హాని చేయరు, ఏ నాశము చేయరు. (యెషయా 2:2; 11:9) పైకెత్తబడిన ఈ ఆరాధనా స్థలంలో, యెహోవా బలవర్ధకమైన తన విందును నమ్మకమైన వారి కోసం ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు ఎంతో సమృద్ధిగా అందజేయబడుతున్న ఆధ్యాత్మికమైన మంచి వస్తువులు, దేవుని రాజ్యమే మానవజాతిపై ఏకైక ప్రభుత్వంగా ఉన్నప్పుడు అందజేయబడే భౌతికమైన మంచి వస్తువులకు పూర్వఛాయగా ఉన్నాయి. అప్పుడిక ఆకలి ఉండదు. “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 72:8, 16.
8, 9. (ఎ) మానవజాతికిగల ఏ రెండు గొప్ప శత్రువులు నిర్మూలింపబడతారు? వివరించండి. (బి) దేవుడు తన ప్రజల నిందను తొలగించడానికి ఏమి చేస్తాడు?
8 దేవుడు ఏర్పాటు చేస్తున్న ఆధ్యాత్మిక విందులో ఇప్పుడు పాల్గొనేవారికి మహిమాన్వితమైన ఉత్తరాపేక్షలుంటాయి. యెషయా తర్వాతి మాటలను వినండి. పాపమరణాలను ఊపిరాడకుండా చేసే “ముసుకు”తో లేక “తెర”తో పోలుస్తూ, ఆయనిలా చెబుతున్నాడు: “సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద [యెహోవా] తీసివేయును. మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.”—యెషయా 25:7, 8 ఎ.
9 అవును, పాపమరణాలు ఇక ఉండవు! (ప్రకటన 21:3, 4) అంతేగాక, యెహోవా సేవకులు వేలాది సంవత్సరాలుగా సహించిన అబద్ధ ఆరోపణ కూడా తీసివేయబడుతుంది. “భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.” (యెషయా 25:8 బి) ఇదెలా జరుగుతుంది? యెహోవా ఆ నిందకు మూలకారకుడ్ని అంటే సాతానును, అతని సంతానాన్ని నిర్మూలిస్తాడు. (ప్రకటన 20:1-3) దేవుని ప్రజలు ఆనందంతో ఇలా చెప్పడానికి పురికొల్పబడడంలో ఆశ్చర్యమేమీ లేదు: “ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.”—యెషయా 25:9.
గర్విష్ఠులు అణచివేయబడతారు
10, 11. యెహోవా మోయాబు కోసం ఏ కఠిన విధానం నిర్ణయించాడు?
10 వినయము గల తన ప్రజలను యెహోవా రక్షిస్తాడు. అయితే, ఇశ్రాయేలు పొరుగు రాజ్యమైన మోయాబు గర్వంతోనున్న రాజ్యం, ఆ గర్వాన్ని యెహోవా అసహ్యించుకుంటాడు. (సామెతలు 16:18) కాబట్టి మోయాబు అవమానాన్ని ఎదుర్కోబోతోంది. “యెహోవా హస్తము ఈ పర్వతముమీద నిలుచును, పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు, వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును. మోయాబూ, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన క్రుంగగొట్టును; వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలు చేయును.”—యెషయా 25:10-12.
11 యెహోవా హస్తము మోయాబు పర్వతముపై “నిలుచును.” దాని ఫలితం? గర్వంగల మోయాబు “పెంటకుప్పలో” త్రొక్కబడునట్లు త్రొక్కబడుతుంది. యెషయా కాలంలో, ఎరువును తయారు చేయడానికి పేడ కుప్పలలో వరిగడ్డిని వేసి త్రొక్కేవారు; కాబట్టి యెషయా, మోయాబుకు ఎంతో ఎత్తైనవిగా, ఎంతో సురక్షితమైనవిగా అనిపిస్తున్న ప్రాకారములు ఉన్నప్పటికీ, దానికి అవమానం జరుగుతుందని ప్రవచిస్తున్నాడు.
12. యెహోవా తీర్పు ప్రకటన కోసం మోయాబు మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకోబడింది?
12 యెహోవా మోయాబును మాత్రమే ఎందుకు అలాంటి కఠినమైన తీర్పు కోసం ఎంపిక చేశాడు? మోయాబీయులు అబ్రాహాము అన్న కుమారుడూ యెహోవా ఆరాధకుడూ అయిన లోతు వంశపు వారు. కాబట్టి, వారు దేవుని నిబంధన రాజ్యానికి పొరుగువారే కాదు, సంబంధీకులు కూడా. అంతేగాక, వారు అబద్ధ దేవుళ్లను ఆరాధించారు, ఇశ్రాయేలు పట్ల కఠినమైన శత్రుత్వాన్ని ప్రదర్శించారు. వారికి అలాంటి గతి పట్టాల్సిందే. ఈ విషయంలో మోయాబు, నేడు యెహోవా సేవకుల శత్రువుల్లా ఉంది. ప్రాముఖ్యంగా అది, మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో వేళ్లూని ఉన్నానని చెప్పుకుంటున్నప్పటికీ, మనం మునుపు చూసినట్లుగా, మహా బబులోనులో ప్రధాన భాగమైయున్న క్రైస్తవమత సామ్రాజ్యంలా ఉంది.
ఒక రక్షణ కీర్తన
13, 14. దేవుని ప్రజలకు నేడు ఏ ‘బలమైన పట్టణం’ ఉంది, దానిలోకి ప్రవేశించడానికి ఎవరు అనుమతించబడతారు?
13 దేవుని ప్రజల మాటేమిటి? యెహోవా అనుగ్రహాన్ని, కాపుదలను పొందగలిగినందుకు అత్యానందభరితులై, వారు గొంతెత్తి కీర్తన పాడుతారు. “ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు—బలమైన పట్టణమొకటి మనకున్నది. రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు. సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి.” (యెషయా 26:1, 2) ప్రాచీన కాలాల్లో ఈ మాటలు నెరవేరినప్పటికీ, అవి నేడు కూడా స్పష్టమైన నెరవేర్పును కలిగివున్నాయి. యెహోవా “నీతిగల జనము” అంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలు ఒక బలమైన, పట్టణంవంటి సంస్థతో ఆశీర్వదించబడింది. ఆనందించడానికి, కీర్తన పాడడానికి ఎంత చక్కని కారణం.
14 ఈ ‘పట్టణంలోకి’ ఎటువంటి ప్రజలు వస్తారు? ఆ కీర్తన దీనికి సమాధానం ఇస్తుంది: “ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు [దేవుడు] పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.” (యిషయా 26:3, 4) యెహోవా నీతియుక్తమైన నియమాలకు విధేయులై, ఈ ప్రపంచపు దుర్భరమైన స్థితిలోవున్న వాణిజ్య, రాజకీయ, మత విధానాలపై గాక ఆయనపై నమ్మకం ఉంచాలని కోరుకునే ‘మనస్సు’ గలవారికి ఆయన మద్దతునిస్తాడు. “యెహోవా యెహోవాయే” ఏకైక నమ్ముకొనదగిన ఆశ్రయదుర్గము. యెహోవాపై పూర్తి నమ్మకం గలవారు ఆయన కాపుదలను పొందుతారు, “పూర్ణశాంతి”ని అనుభవిస్తారు.—సామెతలు 3:5, 6; ఫిలిప్పీయులు 4:6, 7.
15. ‘ఎత్తయిన దుర్గము’ నేడు ఎలా అణచివేయబడింది, “బీదలకాళ్లు” దాన్ని ఏ విధంగా త్రొక్కుతాయి?
15 దేవుని ప్రజల శత్రువులకు సంభవించేదానికి ఇది ఎంత భిన్నమో కదా! “ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాని పడగొట్టెను; ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు. కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కుచున్నవి.” (యెషయా 26:5, 6) మళ్లీ, యెషయా ఇక్కడ మోయాబులోని ఒక “ఎత్తయిన దుర్గమును” ఉద్దేశిస్తుండవచ్చు, లేక అహంకారం విషయంలో నిజంగానే హెచ్చుగావున్న బబులోను వంటి మరేదైనా పట్టణాన్ని ఆయన ఉద్దేశిస్తుండవచ్చు. విషయం ఏదైనప్పటికీ, యెహోవా “ఎత్తయిన దుర్గమున”కు సంబంధించి విషయాలను తారుమారు చేశాడు, ఆయనకు సంబంధించిన ‘దీనులు, బీదలు’ దాన్ని త్రొక్కుతారు. నేడు ఈ ప్రవచనం మహా బబులోనుకు, ప్రాముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్యానికి చక్కగా సరిపోతుంది. ఈ “ఎత్తయిన దుర్గము” 1919 లో యెహోవా ప్రజలను విడుదల చేసేందుకు బలవంతపెట్టబడింది—నిజంగా అవమానకరమైన పతనం—తిరిగి వీరు, తమను చెరగా కొనిపోయినవారిని త్రొక్కడం ప్రారంభించారు. (ప్రకటన 14:8) ఎలా? దాని పైకి రానున్న యెహోవా ఉగ్రతను బహిరంగంగా ప్రకటించడం ద్వారా వారలా చేశారు.—ప్రకటన 8:7-12; 9:14-19.
నీతిని, యెహోవా “స్మరణ”ను కోరుకోవడం
16. యెషయా భక్తి విషయంలో ఏ చక్కని మాదిరిని ఉంచాడు?
16 ఈ విజయ కీర్తన తర్వాత, యెషయా తన ప్రగాఢ భక్తిని, నీతిగల దేవుని సేవచేయడం వల్ల లభించే ప్రతిఫలాలను బయలుపరుస్తాడు. (యెషయా 26:7-9 చదవండి.) ప్రవక్త ‘యెహోవా కోసం కనిపెట్టడంలో,’ యెహోవా “నామము”ను, “స్మరణ”ను గాఢంగా కోరుకోవడం విషయంలో చక్కని మాదిరిని ఉంచుతాడు. యెహోవా స్మరణ అంటే ఏమిటి? నిర్గమకాండము 3:15 ఇలా చెబుతోంది: ‘యెహోవాయే నా నిరంతర నామము, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.’ యెషయా యెహోవా నామమును, ఆయన నీతియుక్తమైన ప్రమాణాలు, మార్గాలతో సహా ఆ నామము దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందో దానంతటినీ ప్రేమిస్తున్నాడు. యెహోవా పట్ల అలాంటి ప్రేమను అలవరచుకునే వారికి ఆయన ఆశీర్వాదముంటుందని హామీ ఇవ్వబడుతుంది. (కీర్తన 5:8; 25:4, 5; 135:13; హోషేయ 12:5)
17. దుష్టులకు ఏ ఆధిక్యతలు ఇవ్వబడవు?
17 అయితే, అందరూ యెహోవాను, ఆయన ఉన్నతమైన ప్రమాణాలను ప్రేమించరు. (యెషయా 26:10 చదవండి.) “ధర్మక్షేత్రములో” అంటే నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో నిష్ఠగా ఉండే యెహోవా సేవకులు స్వతంత్రించుకునే ప్రదేశంలోకి ప్రవేశించేందుకు నీతిని నేర్చుకొమ్మని ఆహ్వానించబడినప్పుడు కూడా దుష్టులు మొండిగా నిరాకరిస్తారు. తత్ఫలితంగా, దుష్టులు “యెహోవా మాహాత్మ్యము” చూడరు. యెహోవా నామము పరిశుద్ధపరచబడిన తర్వాత మానవజాతికి లభించే ఆశీర్వాదాలను ఆనందించడానికి వారు జీవించివుండరు. నూతన లోకంలో, భూమి మొత్తం “ధర్మక్షేత్రము”గా మారినప్పుడు కూడా కొందరు యెహోవా కృపకు ప్రతిస్పందించడంలో విఫలమవుతారు. అలాంటి వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడవు.—యెషయా 65:20; ప్రకటన 20:12, 15.
18. యెషయా కాలంలో కొందరు ఇష్టపూర్వకంగా ఎలా అంధులయ్యారు, యెహోవాను ‘చూసేలా’ వారు ఎప్పుడు బలవంతపెట్టబడతారు?
18 “యెహోవా, నీ హస్తమెత్తబడి యున్నదిగాని జనులు దాని చూడనొల్లరు. జనులకొరకైన నీ ఆస్తకిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మ్రింగివేయును.” (యెషయా 26:11) యెషయా కాలంలో, యెహోవా తన ప్రజల శత్రువులకు వ్యతిరేకంగా చర్య తీసుకుని తన ప్రజలను కాపాడినప్పుడు ఆయన హస్తము పైకెత్తబడినట్లు చూపించాడు. కానీ చాలామంది దీన్ని గుర్తించలేదు. ఇష్టపూర్వకంగా ఆధ్యాత్మిక అంధులుగా మారిన అలాంటి వారు, యెహోవా ఆసక్తి అనే అగ్ని మ్రింగివేసినప్పుడు చివరికి ఆయనను ‘చూసేలా,’ లేక గుర్తించేలా బలవంతపెట్టబడతారు. (జెఫన్యా 1:18) దేవుడు యెహెజ్కేలుకు ఆ తర్వాత ఇలా చెబుతాడు: ‘నేను యెహోవానై యున్నానని వారు తెలుసుకోవాలి.’—యెహెజ్కేలు 38:23.
‘యెహోవా తాను ప్రేమించువారిని శిక్షించును’
19, 20. యెహోవా తన ప్రజలను ఎందుకు, ఎలా శిక్షించాడు, అలాంటి శిక్ష నుండి ఎవరు ప్రయోజనం పొందారు?
19 తన స్వదేశస్థులు ఎలాంటి సమాధాన సమృద్ధులను అనుభవించినప్పటికీ అది యెహోవా ఆశీర్వాదమేనని యెషయాకు తెలుసు. “యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముననుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు.” (యెషయా 26:12) అయినప్పటికీ, “యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను” ఉండే అవకాశాన్ని యెహోవా తన ప్రజల ఎదుట ఉంచినప్పటికీ, యూదాకు అంత మంచి చరిత్ర లేదు. (నిర్గమకాండము 19:6) దాని ప్రజలు పదేపదే అబద్ధ దేవుళ్ల ఆరాధన వైపుకు తిరిగారు. ఫలితంగా, వారు పదే పదే శిక్షించబడ్డారు. అయితే అలాంటి శిక్ష యెహోవా ప్రేమకు నిదర్శనం, ఎందుకంటే ‘యెహోవా తాను ప్రేమించువారిని శిక్షించును.’—హెబ్రీయులు 12:6.
20 తరచూ, ఇతర రాజ్యాలు, “వేరే ప్రభువులు” తన ప్రజలపై ఆధిపత్యం వహించేందుకు అనుమతించడం ద్వారా యెహోవా వారిని శిక్షిస్తాడు. (యెషయా 26:13 చదవండి.) సా.శ.పూ. 607 లో, బబులోనీయులు వారిని చెరగా కొనిపోవడానికి ఆయన అనుమతిస్తాడు. ఇది వారికి ప్రయోజనం చేకూరుస్తుందా? బాధ దానంతటదే ఒక వ్యక్తికి ప్రయోజనం చేకూర్చదు. అయితే, బాధపడే వ్యక్తి జరిగే దాని నుండి పాఠం నేర్చుకుని, పశ్చాత్తాపపడి, యెహోవాపై సంపూర్ణ భక్తిని కలిగివుంటే, అప్పుడు అతడు ప్రయోజనం పొందుతాడు. (ద్వితీయోపదేశకాండము 4:25-31) యూదులెవరైనా దైవిక పశ్చాత్తాపాన్ని చూపిస్తారా? చూపిస్తారు! యెషయా ప్రవచనార్థకంగా ఇలా చెబుతున్నాడు: “నిన్నుబట్టియే నీ నామమును స్మరింతుము.” యూదులు సా.శ.పూ. 537 లో చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత, వారి పాపాలను బట్టి వారికి తరచూ శిక్ష అవసరమవుతుంది, కానీ వారు మళ్లీ ఎన్నడూ రాతి దేవుళ్లను ఆరాధించే ఉరిలో చిక్కుకోరు.
21. దేవుని ప్రజలను అణచివేసిన వారికి ఏమి జరుగుతుంది?
21 యూదావారిని చెరగా కొనిపోయినవారి మాటేమిటి? “చచ్చినవారు మరల బ్రదుకరు ప్రేతలు మరలలేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి వారికను స్మరణకు రాకుండ నీవు వారిని తుడిచి వేసితివి.” (యెషయా 26:14) యెహోవా ఎంపిక చేసుకున్న జనాంగంతో క్రూరంగా వ్యవహరించినందుకు బబులోను బాధించబడుతుంది. మాదీయులు, పారసీకుల ద్వారా యెహోవా గర్వంగల బబులోనును కూలదోసి, బంధీలుగా ఉన్న తన ప్రజలను విడుదల చేస్తాడు. ఆ గొప్ప పట్టణమైన బబులోను, చచ్చినదానివలె, శక్తిలేనిదైపోతుంది. చివరికది ఉనికిలో లేకుండా పోతుంది.
22. ఆధునిక కాలాల్లో, దేవుని ప్రజలు ఎలా ఆశీర్వదించబడ్డారు?
22 ఆధునిక నెరవేర్పులో, శిక్షించబడిన ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో శేషించినవారు మహా బబులోను నుండి విడిపించబడి, 1919 లో యెహోవా సేవలో పునఃప్రవేశపెట్టబడ్డారు. అభిషిక్త క్రైస్తవులు తిరిగి శక్తిని పుంజుకుని, ప్రకటనా పనికి ఆసక్తితో తమను తాము అంకితం చేసుకున్నారు. (మత్తయి 24:14) తత్ఫలితంగా, యెహోవా వారికి పెరుగుదలను ఇచ్చి ఆశీర్వదించాడు, అంతేగాక, వారితో కలిసి సేవచేసేందుకు “వేరే గొర్రెల” గొప్ప సమూహమును కూడా తీసుకువచ్చాడు. (యోహాను 10:16) “యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి జనమును వృద్ధిచేసితివి. దేశముయొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి; నీ శిక్ష వారిమీద పడినందున వారు విశేషముగా దీనప్రార్థనలు చేసిరి.”—యెషయా 26:15, 16.
“సజీవములగును”
23. (ఎ) యెహోవా శక్తి సా.శ.పూ. 537 లో ఏ విశేషమైన రీతిలో ప్రదర్శించబడింది? (బి) సా.శ. 1919 లో కూడా అదేరీతిలో ఎలా ప్రదర్శించబడింది?
23 యెషయా ఇప్పుడు మళ్లీ, యూదా ఇంకా బబులోను చెరలోనే ఉన్నప్పుడు అది అనుభవిస్తున్న పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యూదా రాజ్యమును, ప్రసవవేదనపడుతూ, సహాయం లభించనందున ప్రసవించలేకపోతున్న స్త్రీతో పోలుస్తాడు. (యెషయా 26:17, 18 చదవండి.) ఆ సహాయం సా.శ.పూ. 537 లో వస్తుంది, యెహోవా ప్రజలు ఆలయాన్ని పునర్నిర్మించి సత్యారాధనను పునఃస్థాపించాలనే ఆకాంక్షతో తమ స్వదేశానికి తిరిగి వస్తారు. ఒక విధంగా, రాజ్యం మరణస్థితి నుండి తిరిగి లేపబడింది. “మృతులైన నీవారు బ్రదుకుదురు. నావారి శవములు సజీవములగును. మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.” (యెషయా 26:19) యెహోవా శక్తి ఎంత గొప్పగా ప్రదర్శించబడింది! అంతేగాక, 1919 లో ఈ మాటలు ఆధ్యాత్మిక భావంలో నెరవేరినప్పుడు ఇంకా ఎంత గొప్పగా ఆయన శక్తి ప్రదర్శించబడిందో కదా! (ప్రకటన 11:7-11) నూతన లోకంలో ఈ మాటలు అక్షరార్థంగా నెరవేరి, మరణమందు శక్తిహీనులైన వారు ‘యేసు శబ్దము విని బయటికి’ వచ్చే సమయం కోసం మనం ఎంతగా ఎదురుచూస్తామో కదా!—యోహాను 5:28, 29.
24, 25. (ఎ) దాగియుండమని యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు సా.శ.పూ. 539 లోని యూదులు ఎలా విధేయత చూపించివుండవచ్చు? (బి) ఆధునిక కాలాల్లో “అంతఃపురముల”నేవి వేటిని సూచించవచ్చు, వీటిపట్ల మనం ఎటువంటి దృక్పథాన్ని అలవరచుకోవాలి?
24 అయితే, యెషయా ద్వారా వాగ్దానం చేయబడిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను నమ్మకమైనవారు ఆనందించాలంటే, వారు యెహోవా ఇస్తున్న ఈ ఆజ్ఞకు విధేయులవ్వాలి: “నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము. ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.” (యెషయా 26:20, 21; జెఫన్యా 1:14 పోల్చండి.) మాదీయులు, పారసీకులు కోరేషు నాయకత్వం క్రింద సా.శ.పూ. 539 లో బబులోనును జయించినప్పుడు ఇది తొలిసారిగా నెరవేరి ఉండవచ్చు. గ్రీకు చరిత్రకారుడైన క్సెనోఫోన్ ప్రకారం, కోరేషు బబులోనులోకి ప్రవేశించినప్పుడు, ప్రతి ఒక్కరిని ఇండ్లలోనే ఉండమని ఆజ్ఞాపిస్తాడు ఎందుకంటే, “బయట కన్పించేవారందరినీ చంపేయమని ఆయన ఆశ్వికదళానికి ఆజ్ఞలు” ఇవ్వబడ్డాయి. నేడు, ఈ ప్రవచనంలోని “అంతఃపురముల”న్నవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల లక్షలాది సంఘాలతో సన్నిహిత సంబంధం కలిగివున్నాయని చెప్పవచ్చు. అలాంటి సంఘాలు మన జీవితాల్లో, చివరికి “మహాశ్రమల” సమయంలో కూడా, కీలకమైన పాత్రను నిర్వహించడం కొనసాగిస్తాయి. (ప్రకటన 7:14) మనం సంఘం పట్ల ఆరోగ్యదాయకమైన దృక్పథాన్ని కాపాడుకుంటూ, దానితో క్రమంగా సహవసించడం ఎంత ఆవశ్యకమో కదా!—హెబ్రీయులు 10:24, 25.
25 త్వరలోనే సాతాను లోకానికి అంతం వస్తుంది. భయాన్ని కలిగించే ఆ సమయంలో యెహోవా తన ప్రజలను ఎలా కాపాడతాడో మనకు ఇంకా తెలియదు. (జెఫన్యా 2:3) అయితే, మనం మనుగడ సాగించగలగడం అన్నది, యెహోవాపై మన విశ్వాసం మీద, ఆయన పట్ల మన యథార్థత మీద, ఆయనకు మనం చూపే విధేయత మీద ఆధారపడి ఉంటుందని మాత్రం మనకు తెలుసు.
26. “మకరము” యెషయా కాలంలో ఏది, మన కాలంలో ఏది, ఈ “సముద్రము మీదనున్న మకరము”కు ఏమి సంభవిస్తుంది?
26 ఆ కాలంవైపు చూస్తూ, యెషయా ఇలా ప్రవచిస్తున్నాడు: “ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రముమీదనున్న మకరమును సంహరించును.” (యెషయా 27:1) తొలి నెరవేర్పులో, “మకరము” అన్నది, ఇశ్రాయేలు ఏ యే దేశాలకైతే చెదరగొట్టబడిందో ఆదేశాలైన బబులోను, ఐగుప్తు, అష్షూరు వంటి వాటిని సూచిస్తోంది. ఈ దేశాలు, యెహోవా ప్రజలు తమ స్వదేశానికి సరైన సమయానికి తిరిగి రావడాన్ని ఆపలేకపోతాయి. అయితే ఆధునిక-దిన మకరము ఏది? అది “ఆది సర్పమైన” సాతాను ఆధ్యాత్మిక ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి ఉపయోగించే ఉపకరణమైన, ఈ భూమిపైనున్న అతని దుష్టవిధానము అనిపిస్తుంది. (ప్రకటన 12:9, 10; 13:14, 16, 17; 18:24) “మకరము” 1919 లో దేవుని ప్రజలపై తన పట్టును కోల్పోయాడు, యెహోవా “సముద్రము మీదనున్న మకరమును సంహరించు”నప్పుడు వాడు పూర్తిగా అదృశ్యమవుతాడు. ఈలోగా, యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా “మకరము” చేయడానికి ప్రయత్నించేదేదీ నిజంగా విజయవంతం కాదు.—యెషయా 54:17.
“మనోహరమగు ఒక ద్రాక్షవనము”
27, 28. (ఎ) యెహోవా ద్రాక్షవనము మొత్తం భూమిని దేనితో నింపింది? (బి) యెహోవా తన ద్రాక్షవనమును ఎలా కాపాడతాడు?
27 స్వేచ్ఛను పొందిన యెహోవా ప్రజల ఫలభరితమైన స్థితిని యెషయా ఇప్పుడు మరో కీర్తనతో అందంగా వర్ణిస్తున్నాడు: “ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దానిగూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను. ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను.” (యెషయా 27:2, 3) ఆధ్యాత్మిక ఇశ్రాయేలులోని శేషించిన వారు, కష్టపడిపని చేసే వారి సహవాసులు మొత్తం భూమిని నిజంగా ఆధ్యాత్మిక ఫలాలతో నింపేశారు. వేడుక చేసుకోవడానికి, కీర్తన పాడడానికి ఎంత చక్కని కారణం! ఘనత అంతా, ప్రేమపూర్వకంగా తన ద్రాక్షవనాన్ని కాపాడుతున్న యెహోవాకు వెళుతుంది.—యోహాను 15:1-8 పోల్చండి.
28 నిజానికి, యెహోవాకు మునుపు ఉండిన ఆగ్రహం ఆనందంగా మారింది! “నాయందు క్రోధము లేదు. గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన యెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఈలాగున జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధానపడవలెను; వారు నాతో సమాధానపడవలెను.” (యెషయా 27:4, 5) తన ద్రాక్షవనము “మనోహరమగు” ద్రాక్షారసాన్ని సమృద్ధిగా ఉత్పత్తి చేసేలా చూడడానికి యెహోవా తన ద్రాక్షవనాన్ని పాడు చేయగల బలురక్కసి చెట్లవంటి ఏ ప్రభావాన్నైనా నలుగగొట్టి, అగ్నితో కాల్చివేస్తాడు. కాబట్టి, క్రైస్తవ సంఘ సంక్షేమానికి ఎవరూ ప్రమాదం కలిగించకుండా ఉందురుగాక! బదులుగా, అందరూ యెహోవా అనుగ్రహాన్ని, కాపుదలను కోరుతూ, ‘ఆయనను ఆశ్రయించుదురు’ గాక. అలా చేయడంలో, వారు దేవునితో సమాధానపడతారు, అది ఎంతో ప్రాముఖ్యమైనది, అందుకే యెషయా దాన్ని రెండుసార్లు ప్రస్తావిస్తున్నాడు. దాని ఫలితం? “రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.” (యెషయా 27:6) * ఈ వచన నేరవేర్పు యెహోవా శక్తికి ఎంత అద్భుతమైన నిదర్శనం! అభిషిక్త క్రైస్తవులు 1919 నుండి భూమిని ‘ఫలముతో’ అంటే పోషణకరమైన ఆధ్యాత్మిక ఆహారంతో నింపుతున్నారు. ఫలితంగా, లక్షలాదిమంది యథార్థవంతులైన వేరే గొఱ్ఱెలు వారితో కలిశారు, వీరు వారు కలిసి, ‘రాత్రింబగళ్లు దేవుని సేవించుచున్నారు.’ (ప్రకటన 7:15) భ్రష్టుపట్టిన లోకంలో, వీరు ఆనందంగా ఆయన ఉన్నతమైన ప్రమాణాలను కాపాడుకుంటారు. యెహోవా వారిని పెరుగుదలతో ఆశీర్వదించడాన్ని కొనసాగిస్తాడు. ఆ ‘ఫలములో’ భాగం వహిస్తూ, బిగ్గరగా మనం చేసే స్తుతి ద్వారా ఇతరులతో దాన్ని పంచుకొనే గొప్ప ఆధిక్యతను ఎన్నడూ మరచిపోకుండా ఉందాము!
[అధస్సూచీలు]
^ ఆరు అనే పేరుకు భావం “పట్టణం” అని కావచ్చు.
^ యెషయా 27:7-13 వచనాలు 285 వ పేజీలోగల బాక్సులో చర్చించబడ్డాయి.
[అధ్యయన ప్రశ్నలు]
[285 వ పేజీలోని బాక్సు]
“పెద్ద బూర” స్వేచ్ఛను ప్రకటిస్తుంది
సా.శ.పూ. 607 లో, దారితప్పిన తన జనాంగాన్ని చెరగా కొనపోబడనివ్వడం ద్వారా యెహోవా దాన్ని కొట్టి శిక్షించినప్పుడు, యూదా బాధలు అధికమవుతాయి. (యెషయా 27:7-11 చదవండి.) జనాంగపు పాపం జంతు బలులతో ప్రాయశ్చిత్తం చేయలేనంత గొప్పది. కాబట్టి, ఒకరు గొఱ్ఱెలను లేక మేకలను “వెళ్లగొట్టి”నట్లు, లేక బలమైన గాలితో ఆకులను “తొలగించి”నట్లు యెహోవా ఇశ్రాయేలును దాని స్వదేశం నుండి నిర్మూలిస్తాడు. ఆ తర్వాత, స్త్రీలచే సూచించబడిన బలహీనమైన ప్రజలు కూడా దేశంలో మిగిలి ఉండేదాన్ని దోచుకుంటారు.
అయితే, యెహోవా తన ప్రజలను చెర నుండి విడుదల చేసే సమయం వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, చెట్టుమీద ఖైదు చేయబడినట్లుండే ఓలీవపండ్లను ఒక రైతు కోసి విడుదల చేసినట్లు ఆయన వారిని విడుదల చేస్తాడు. “ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలుకొని ఐగుప్తునదివరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు. ఆ దినమున పెద్ద బూర ఊదబడును, అష్షూరు దేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు.” (యెషయా 27:12, 13) కోరేషు సా.శ.పూ. 539 లో విజయం సాధించిన తర్వాత, అష్షూరు ఐగుప్తులు కూడా భాగమైయున్న తన సామ్రాజ్యంలోని యూదులనందరినీ విడుదల చేస్తూ ఆజ్ఞ జారీ చేస్తాడు. (ఎజ్రా 1:1-4) అది ఒక “పెద్ద బూర” ఊదినట్లుగా, దేవుని ప్రజల స్వేచ్ఛా కీర్తన ప్రతిధ్వనింపజేస్తున్నట్లుగా ఉంటుంది.
[275 వ పేజీలోని చిత్రాలు]
“క్రొవ్వినవాటితో విందు”
[277 వ పేజీలోని చిత్రం]
బబులోను ఖైదీలుగా ఉన్నవారి పాదాల క్రింద త్రొక్కబడుతుంది
[278 వ పేజీలోని చిత్రం]
“నీ అంతఃపురములలో ప్రవేశించుము”