రాజు, ఆయన అధికారులు
ఇరవై-ఐదవ అధ్యాయం
రాజు, ఆయన అధికారులు
1, 2. మృత సముద్రపు యెషయా గ్రంథపు చుట్టలోని మూలపాఠం గురించి ఏమి చెప్పవచ్చు?
పాలస్తీనాలో, మృతసముద్రం దగ్గరవున్న గుహల్లో, 1940ల చివరిభాగంలో, ఒక విశేషమైన గ్రంథపు చుట్టల సంచయం కనుగొనబడింది. అవి మృత సముద్రపు గ్రంథపు చుట్టలని పేరుపొందాయి, అవి సా.శ.పూ. 200కు సా.శ. 70కి మధ్య కాలంలో వ్రాయబడివుంటాయని విశ్వసించబడుతోంది. వాటిలో బాగా పేరుపొందినది, మన్నికైన తోలుపై హీబ్రూ భాషలో వ్రాయబడిన యెషయా గ్రంథపు చుట్ట. ఈ గ్రంథపు చుట్టలో దాదాపు యెషయా గ్రంథమంతా ఉంది, దానిలోని మూలపాఠానికి, దాదాపు వెయ్యి సంవత్సరాల తర్వాతి కాలానికి చెందిన మసోరటిక్ మూలపాఠంగల వ్రాతప్రతులకు ఎక్కువ తేడా లేదు. కాబట్టి, ఆ గ్రంథపు చుట్ట బైబిలు మూలపాఠం ఖచ్చితంగా అనువదించబడిందని చూపిస్తోంది.
2 మృత సముద్రపు యెషయా గ్రంథపు చుట్టను గురించిన ఒక గమనించదగ్గ విషయమేమిటంటే, నేడు యెషయా 32 వ అధ్యాయంగా పిలువబడుతున్న భాగం, నకళ్లువ్రాసే ఒక వ్యక్తి మార్జిన్ వద్ద అస్పష్టంగా వేసిన “X” అనే గుర్తుతో సూచించబడుతుంది. నకళ్లువ్రాసే ఆ వ్యక్తి ఎందుకా గుర్తు వేశాడో మనకు తెలియదు గానీ పరిశుద్ధ బైబిలులోని ఈ భాగం గురించి ప్రత్యేకమైనదొకటి ఉందని మాత్రం మనకు తెలుసు.
నీతిని, న్యాయమును బట్టి ఏలడం
3. యెషయా, ప్రకటన గ్రంథములలో ఏ ప్రభుత్వం గురించి ప్రవచించబడింది?
3 యెషయా 32 వ అధ్యాయం, మన కాలంలో విశేషమైన విధంగా నెరవేరుతున్న పులకరింపజేసే ఒక ప్రవచనంతో ప్రారంభమవుతుంది. “ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును; అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.” (యెషయా 32:1) అవును, “ఆలకించుడి!” ఆనందాతిశయంతో వేసిన ఈ కేక, బైబిలులోని చివరి ప్రవచనార్థక పుస్తకంలో కనిపించే ఇటువంటి కేకనే మనకు జ్ఞాపకం చేస్తుంది: “సింహాసనాసీనుడైయున్నవాడు—ఇదిగో! సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను.” (ప్రకటన 21:5) దాదాపు 900 సంవత్సరాల కాలవ్యత్యాసంతో వ్రాయబడిన బైబిలు పుస్తకాలైన యెషయా గ్రంథమూ, ప్రకటన గ్రంథమూ రెండు కూడా, ఒక క్రొత్త ప్రభుత్వాన్ని సూచించే “క్రొత్త ఆకాశము”ను గురించిన, భూగోళవ్యాప్త ఐక్య మానవ సమాజపు “క్రొత్తభూమి”ని గురించిన ఉల్లాసకరమైన వివరణను అందజేస్తున్నాయి. ఆ క్రొత్త ప్రభుత్వం, 1914 లో పరలోకంలో సింహాసనాసీనునిగా చేయబడిన రాజు అయిన యేసు క్రీస్తుతో, “మనుష్యులలో నుండి కొనబడిన” 1,44,000 మంది సహపరిపాలకులతో రూపొందుతుంది. * (ప్రకటన 14:1-4; 21:1-4; యెషయా 65:17-25) ఈ మొత్తం ఏర్పాటు క్రీస్తు విమోచనక్రయధన బలి మూలంగా సాధ్యమయ్యింది.
4. క్రొత్త భూమికి కేంద్రకమైనది ఏది ఇప్పుడు ఉనికిలో ఉంది?
4 అపొస్తలుడైన యోహాను, ఒక దర్శనంలో ఈ 1,44,000 మంది సహపరిపాలకులు చివరిగా ముద్రింపబడడాన్ని చూసిన తర్వాత ఇలా నివేదిస్తున్నాడు: “నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము కనబడెను. వారు . . . సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి[యున్నారు].” వీరే అంటే, ఇప్పుడు లక్షలసంఖ్యలో ఉన్న ఒక గొప్ప సమూహమే క్రొత్త భూమికి కేంద్రకం. వీరు, సంఖ్యాపరంగా తగ్గిపోతున్న, ఎక్కువగా పెద్దవయస్కులైన, 1,44,000 మందిలో ఇప్పుడు భూమిపై మిగిలివున్నవారి పక్షంగా సమకూర్చబడుతున్నారు. ఈ గొప్ప సమూహం, త్వరలో రాబోతున్న మహాశ్రమలను తప్పించుకొని మనుగడ సాగిస్తుంది. పరదైసు భూమిపై, పునరుత్థానం చేయబడిన నమ్మకమైనవారు, విశ్వాసం ఉంచేందుకు అవకాశం ఇవ్వబడే కోట్లాదిమంది ఇతరులు వీరితో కలుస్తారు. అలా విశ్వాసం ఉంచేవారందరికీ నిత్యజీవమనే ఆశీర్వాదం లభిస్తుంది.—ప్రకటన 7:4, 9-17.
5-7. ప్రవచింపబడిన “అధికారులు,” దేవుని మందలో ఏ పాత్రను నిర్వహిస్తారు?
5 అయితే, ప్రస్తుత ద్వేషభరిత లోకం ఉనికిలో ఉన్నంతవరకు, గొప్ప సమూహానికి చెందిన సభ్యులకు కాపుదల అవసరం. “న్యాయమునుబట్టి యేలు” “అధికారులు” చాలామేరకు ఆ కాపుదలను అందజేస్తున్నారు. ఎంత గొప్ప ఏర్పాటు! ఈ “అధికారుల” గురించి, యెషయా ప్రవచనంలోని ప్రకాశమానమైన పదాల్లో మరింతగా వర్ణించబడుతుంది: “మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును, ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.”—యెషయా 32:2.
6 ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి ఉన్న ఈ సమయంలో ఇప్పుడే, “అధికారుల” అవసరత ఉంది. అవును, యెహోవా గొఱ్ఱెల గురించి శ్రద్ధ తీసుకుంటూ, యెహోవా నీతియుక్తమైన నియమాల అనుసారంగా న్యాయాన్ని సమకూరుస్తూ, “యావత్తు మందను గూర్చి . . . జాగ్రత్త” వహించే పెద్దల అవసరత ఉంది. (అపొస్తలుల కార్యములు 20:28) అలాంటి “అధికారులు” 1 తిమోతి 3:2-7 మరియు తీతు 1:6-9 వచనాల్లో పేర్కొనబడిన యోగ్యతలను కలిగివుండాలి.
7 సంక్షోభభరితమైన “యుగసమాప్తి” గురించి వర్ణించే తన గొప్ప ప్రవచనంలో యేసు ఇలా చెప్పాడు: “మీరు కలవరపడకుండ చూచుకొనుడి.” (మత్తయి 24:3-8) నేటి ప్రమాదకరమైన ప్రపంచ పరిస్థితులను బట్టి యేసు అనుచరులు ఎందుకు కలవరపడరు? ఒక కారణం ఏమిటంటే, “అధికారులు”—వారు అభిషిక్తుల్లోని వారైనా లేక “వేరే గొఱ్ఱెల”లోని వారైనా—యథార్థంగా మందను కాపాడుతున్నారు. (యోహాను 10:16) వారు జాతి విద్వేషాల యుద్ధాలు, జాతి నిర్మూలన వంటి అకృత్యాలు జరుగుతున్న సమయంలో కూడా నిర్భయంగా తమ సహోదర సహోదరీల గురించి శ్రద్ధ తీసుకుంటారు. ఆధ్యాత్మికంగా ఉడిగిపోయిన లోకంలో, ధైర్యముచెడిన వారికి దేవుని వాక్యమైన బైబిలులోని ప్రోత్సాహకరమైన సత్యాలతో స్వాంతన కలిగేలా వారు చూస్తారు.
8. వేరే గొఱ్ఱెలకు చెందిన “అధికారుల”కు యెహోవా ఎలా శిక్షణనిస్తున్నాడు, వారిని ఎలా ఉపయోగించుకుంటున్నాడు?
8 గడిచిన 50 సంవత్సరాల్లో “అధికారులు” స్పష్టంగా గుర్తించబడ్డారు. వేరే గొఱ్ఱెలకు చెందిన “అధికారులు” వర్ధమాన “అధిపతి” తరగతిగా శిక్షణ పొందుతున్నారు. అలా, వారిలో యోగ్యులైనవారు మహాశ్రమల తర్వాత “క్రొత్త భూమి”లో కార్యనిర్వహణా స్థానంలో సేవచేయడానికి నియుక్తులయ్యేందుకు సిద్ధంగా ఉంటారు. (యెహెజ్కేలు 44:2, 3; 2 పేతురు 3:13) వారు రాజ్య సేవలో నాయకత్వం వహిస్తూ, ఆధ్యాత్మిక నడిపింపునిస్తూ, సేదదీరుస్తూ, మందకు ఆరాధనా విషయంలో ఉపశమనం కలిగిస్తూ, తాము “గొప్పబండ నీడవలె” ఉన్నామని నిరూపించుకుంటున్నారు. *
9. నేడు “అధికారుల” అవసరతను ఏ పరిస్థితులు చూపిస్తున్నాయి?
9 సాతాను దుష్ట లోకపు ఈ అపాయకరమైన అంత్య దినాల్లో, సమర్పిత క్రైస్తవులకు అలాంటి కాపుదల ఎంతో అవసరం. (2 తిమోతి 3:1-5, 13) అబద్ధ సిద్ధాంతపు, వక్రీకరించబడిన ప్రచారపు బలమైన గాలులు వీస్తున్నాయి. దేశాలమధ్యా, దేశాల్లో అంతర్గతంగానూ యుద్ధాల రూపంలో పెనుతుపానులు చెలరేగుతున్నాయి, అలాగే యెహోవా దేవుని నమ్మకమైన ఆరాధకులపై సూటిగా దాడులు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక అనావృష్టితో శుష్కించిపోయిన లోకంలో, క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక దప్పిక తీర్చుకోవడానికి స్వచ్ఛమైన నిర్మలమైన సత్యపు నీటి సెలయేళ్ళు వారికెంతో అవసరం. సంతోషకరంగా, పరిపాలిస్తున్న తన రాజు, తన అభిషిక్త సహోదరుల ద్వారానూ వేరే గొఱ్ఱెలకు చెందిన మద్దతునిచ్చే “అధికారుల” ద్వారానూ, నిరాశా నిరుత్సాహాలకు గురవుతున్న వారికి ఈ అవసర సమయంలో ప్రోత్సాహాన్ని, నడిపింపును అందజేస్తాడని యెహోవా వాగ్దానం చేశాడు. కాబట్టి నీతియుక్తమైనదీ న్యాయమైనదీ విజయం సాధించేలా యెహోవా చూస్తాడు.
చెవులతో, కళ్లతో, హృదయాలతో అవధానం నిలపడం
10. తన ప్రజలు ఆధ్యాత్మిక విషయాలను ‘చూడగలిగేలా,’ ‘వినగలిగేలా’ యెహోవా ఏ ఏర్పాటు చేశాడు?
10 యెహోవా దైవపరిపాలనా ఏర్పాటుకు గొప్ప సమూహం ఎలా ప్రతిస్పందించింది? ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును.” (యెషయా 32:3) గడచిన సంవత్సరాల్లో యెహోవా తన అమూల్యమైన సేవకులకు ఉపదేశాన్ని అనుగ్రహించి, వారు పరిణతి చెందడానికి సహాయం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఘాల్లో జరుగుతున్న దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, ఇతర కూటాలు; జిల్లా, జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు; అలాగే మందతో ప్రేమపూర్వకమైన శ్రద్ధతో వ్యవహరించేందుకు “అధికారుల”కు ఇవ్వబడుతున్న ప్రత్యేకమైన శిక్షణ వంటివన్నీ లక్షలాదిమందితో కూడిన సమైక్య భూగోళవ్యాప్త సహోదరత్వాన్ని పెంపొందింపజేయడానికి దోహదపడ్డాయి. ఈ కాపరులు భూమిపై ఎక్కడ ఉన్నప్పటికీ, పురోగమిస్తున్న సత్యవాక్యాన్ని అర్థం చేసుకోవడంలో వచ్చే సవరణలను విని, స్వీకరించేందుకు వారి చెవులు పూర్తిగా తెరచుకొని ఉన్నాయి. బైబిలు తర్ఫీదు పొందిన మనస్సాక్షులతో, వారు విని విధేయత చూపించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు.—కీర్తన 25:10.
11. దేవుని ప్రజలు ఇప్పుడు అనిశ్చయతతో తడబడకుండా, ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు?
11 ప్రవచనం తర్వాత ఇలా హెచ్చరిస్తోంది: “చంచలుల [“తొందరపడేవారి,” పవిత్ర గ్రంధం, వ్యాఖ్యాన సహితం] మనస్సు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.” (యెషయా 32:4) తప్పొప్పులు నిర్ణయించడంలో ఎవరూ తొందరపడకుండా ఉందురు గాక! బైబిలు ఇలా చెబుతోంది: “ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.” (సామెతలు 29:20; ప్రసంగి 5:2) చివరికి యెహోవా ప్రజలు కూడా, 1919కి ముందు బబులోను సంబంధిత తలంపులతో కొంతమేరకు కళంకితమై ఉన్నారు. కాని ఆ సంవత్సరం మొదలుకొని, యెహోవా తన సంకల్పాల గురించి స్పష్టమైన అవగాహనను వారికి ఇచ్చాడు. ఆయన బయల్పరచిన సత్యాలు, తొందరపాటుతో కాకుండా ఎంతో ఆలోచించి బయలుపరచినవిగా వారు కనుగొన్నారు, వారిప్పుడు అనిశ్చయతతో తడబడకుండా, నమ్మకాల నిశ్చయతతో అనర్ఘళంగా మాట్లాడుతున్నారు.
“మూఢుడు”
12. నేడు “మూఢులు” ఎవరు, వారికి ఉదారత ఎందుకు కొరవడుతుంది?
12 తర్వాత యెషయా ప్రవచనం ఒక వ్యత్యాసాన్ని చూపిస్తోంది: “మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు; కపటి ఉదారుడనబడడు. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు.” (యెషయా 32:5, 6 ఎ) “మూఢుడు” ఎవరు? నొక్కిచెప్పడానికి అన్నట్లుగా, దావీదు రాజు రెండుసార్లు సమాధానాన్ని ఇస్తున్నాడు: “దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.” (కీర్తన 14:1; 53:1) నిజమే, పూర్తిగా నాస్తికులైనవారు యెహోవా లేడని అంటారు. ఇక “మేధావులు” మరితరులు కూడా అదేవిధంగా, తాము ఎవరికీ జవాబుదారులం కాదని భావిస్తూ దేవుడే లేడన్నట్లుగా ప్రవర్తిస్తారు. అలాంటి వారిలో సత్యము లేదు. వారి హృదయాల్లో ఉదారత లేదు. వారి వద్ద ప్రేమ సువార్త లేదు. నిజ క్రైస్తవులకు భిన్నంగా, వారు అవసరంలో ఉన్న దుఃఖితులకు సహాయం చేయడంలో జాప్యం చేస్తారు లేక అసలు సహాయమే చేయరు.
13, 14. (ఎ) ఆధునిక-దిన మతభ్రష్టులు ఎలా పాపము చేస్తారు? (బి) మతభ్రష్టులు ఆకలిగొన్నవారికి, దప్పిగొన్నవారికి ఏమి దొరకకుండా చేస్తారు, అయితే దాని తుది ఫలితం ఎలా ఉంటుంది?
13 అలాంటి మూఢులు అనేకులు, దేవుని సత్యానికి మద్దతునిచ్చేవారిని ద్వేషిస్తారు. వారు “భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు . . . హృదయపూర్వకముగా పాపము చేయుదురు.” (యెషయా 32:6 బి) ఆధునిక-దిన మతభ్రష్టుల విషయంలో ఇది ఎంత నిజం! యూరపు, ఆసియాలలోని అనేక దేశాల్లో, మతభ్రష్టులు సత్యాన్ని వ్యతిరేకించే ఇతర శక్తులతో చేతులు కలిపి, యెహోవాసాక్షులను నిషేధించాలని లేక వారిపై పరిమితులు విధించాలని ఉద్దేశిస్తూ అధికారులకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. వారు ‘దుష్టుడైన దాసుని’ దృక్పథాన్ని చూపిస్తారు, ఆ దాసుని గురించి యేసు ఇలా ప్రవచించాడు: “నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతోకూడ వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.”—మత్తయి 24:48-51.
14 ఈ మధ్యలో, మతభ్రష్టుడు “ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు, దప్పిగొనినవారికి పానీయము లేకుండ” చేస్తాడు. (యెషయా సి) సత్య శత్రువులు, సత్యం కోసం ఆకలిగొనివున్న ప్రజలకు ఆధ్యాత్మిక ఆహారం దొరకకుండా చేయడానికీ, దొప్పిగొన్నవారికి రాజ్య సందేశపు సేదతీర్చే నీళ్లు అందకుండా చేయడానికీ ప్రయత్నిస్తారు. కానీ తుది ఫలితం, యెహోవా తన మరొక ప్రవక్త ద్వారా ప్రకటిస్తున్నట్లుగా ఇలా ఉంటుంది: “వారు నీతో యుద్ధముచేతురు, గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొందజాలరు; ఇదే యెహోవా వాక్కు.”— 32:6యిర్మీయా 1:19; యెషయా 54:17.
15. నేడు, ఎవరు ప్రాముఖ్యంగా ‘మోసకారులు,’ వారు ఏ ‘కల్లమాటలను’ పెంపొందింపజేశారు, దాని ఫలితం ఏమిటి?
15 ఇరవైయవ శతాబ్దపు మధ్య సంవత్సరాల నుండి, క్రైస్తవమత సామ్రాజ్య దేశాల్లో అనైతికత విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఎందుకు? ప్రవచనం ఒక కారణాన్ని తెలియజేస్తుంది: “మోసకారి సాధనములును చెడ్డవి; నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.” (యెషయా 32:7) ఈ మాటల నెరవేర్పుగా, ప్రాముఖ్యంగా మతనాయకుల్లోని అనేకులు, నిజానికి ‘జారత్వంగా, ప్రతి విధమైన అపవిత్రతగా’ పరిగణింపబడగలవాటిని, అంటే వివాహం కాకుండా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, వివాహం కాకుండా కలిసి జీవించడం, స్వలింగ సంయోగం వంటివాటిని అనుమతించే దృక్పథాన్ని అలవర్చుకున్నారు. (ఎఫెసీయులు 5:3) అలా, వారు తమ మందలను కల్లమాటలతో “నాశనము” చేస్తారు.
16. నిజ క్రైస్తవులకు ఏది సంతోషాన్ని కలిగిస్తుంది?
16 దానికి భిన్నంగా, ప్రవక్త తర్వాతి మాటల నెరవేర్పు ఎంత సేదతీర్చే విధంగా ఉన్నాయో కదా! “ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి [“తమ ఉదార కార్యములను బట్టి,” NW] నిలుచుదురు.” (యెషయా 32:8) “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని” చెబుతూ యేసు స్వయంగా ఉదారతను ప్రోత్సహించాడు. (లూకా 6:38) “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెనని” చెప్పినప్పుడు అపొస్తలుడైన పౌలు కూడా ఉదారత వల్ల వచ్చే ఆశీర్వాదాల గురించి పేర్కొన్నాడు. (అపొస్తలుల ) నిజ క్రైస్తవులు వస్తు సంపదలను సమకూర్చుకోవడం లేక సమాజంలో పేరుపొందడం వంటివాటి ద్వారా కాదు గానీ తమ దేవుడైన యెహోవా వలెనే ఉదారంగా ఉండడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. ( కార్యములు 20:35మత్తయి 5:44, 45) దేవుని చిత్తాన్ని చేయడం ద్వారా, ఇతరులకు ‘శ్రీమంతుడగు దేవుని మహిమగల సువార్తను’ తెలియజేయడానికి ఉదారంగా తమను తాము వెచ్చించుకోవడం ద్వారా వారు అతిగొప్ప సంతోషాన్ని పొందుతారు.—1 తిమోతి 1:8.
17. నేడు ఎవరు యెషయా పేర్కొన్న “నిశ్చింతగానున్న కుమార్తెల” వలె ఉన్నారు?
17 యెషయా ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి. నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు. సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి. నిర్విచారిణులారా, తొందరపడుడి.” (యెషయా 32:9-11) ఈ స్త్రీల దృక్పథం, నేడు దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ ఆయన సేవలో అత్యంతాసక్తిని చూపించని వారిని మనకు జ్ఞాపకం చేస్తుండవచ్చు. అలాంటి వారు ‘వేశ్యలకు తల్లియైన మహా బబులోను’ యొక్క మతాల్లో ఉన్నారు. (ప్రకటన 17:5) ఉదాహరణకు, క్రైస్తవమత సామ్రాజ్య మతాల సభ్యులు సరిగ్గా ఈ “స్త్రీల” గురించి యెషయా వర్ణిస్తున్నట్లుగానే ఉన్నారు. త్వరలోనే వారిపైకి రానున్న తీర్పు గురించి, తొందర గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా వారు “సుఖాసక్తి” కలిగివున్నారు.
18. “నడుమున గోనెపట్ట కట్టుకొను”మని ఎవరికి ఆదేశింపబడింది, ఎందుకు?
18 కాబట్టి, అబద్ధ మతానికి ఇలా పిలుపు ఇవ్వబడుతోంది: “మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనెపట్ట కట్టుకొనుడి. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షావల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసిచెట్లును పెరుగును.” (యెషయా 32:11బి-13) “మీ బట్టలు తీసివేసి దిగంబరులై” అనే వ్యక్తీకరణ పూర్తిగా వివస్త్రలు కావడాన్ని సూచిస్తున్నట్లు కాదు. పైవస్త్రాల క్రింద, మోకాళ్ళవరకుండే బిగుతైన లోదుస్తులను ధరించడం ప్రాచీన ఆచారంగా ఉండేది. పైవస్త్రాలు సాధారణంగా గుర్తింపు చిహ్నంగా పనిచేసేవి. (2 రాజులు 10:22, 23; ప్రకటన 7:13, 14) కాబట్టి పైవస్త్రాలను, అంటే దేవుని సేవకులుగా వారి బూటకపు గుర్తింపును తీసివేసి, వారి పైకి త్వరలో రానున్న తీర్పునుబట్టి దుఃఖించడానికి సూచనగావున్న గోనెపట్ట కట్టుకోమని ఆ ప్రవచనం అబద్ధమతాల సభ్యులకు ఆజ్ఞాపిస్తోంది. (ప్రకటన 17:16) దేవుని “ఆనందపురము”నని చెప్పుకుంటున్న క్రైస్తవమత సామ్రాజ్య మత సంస్థల మధ్యన లేక ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యంలోని మిగతా సభ్యుల మధ్యన దైవిక ఫలాలు కనిపించడం లేదు. వారి నిర్వహణలో ఉన్న క్షేత్రంలో, వారి నిర్లక్ష్యం నిరాదరణల మూలంగా ‘ముండ్ల తుప్పలు, బలురక్కసిచెట్లు’ పెరుగుతాయి.
19. యెషయా మతభ్రష్ట “యెరూషలేము” యొక్క ఏ స్థితిని బయల్పరిచాడు?
19 ఈ విషాదభరితమైన స్థితి మతభ్రష్ట “యెరూషలేము”లోని అన్ని భాగాలకు వ్యాపిస్తోంది: “నగరి విడువబడును జనసమూహముగల పట్టణము విడువబడును; కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా [“బీడు భూములుగా,” NW] ఉండును, అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును.” (యెషయా 32:14-15) అవును, “కొండ” (హీబ్రూ మూలపాఠంలో ఓపెలు) కూడా ఇమిడి ఉంది. ఓపెలు అనేది దృఢమైన భద్రతా స్థానంగా ఉండగల, యెరూషలేములోని ఒక ఎత్తైన భాగం. ఓపెలు బీడు భూమిలా అవుతుందని చెప్పడం, నగరం పూర్తిగా నాశనం చేయబడుతుందన్న విషయాన్ని తెలియజేస్తోంది. మతభ్రష్ట “యెరూషలేము” అంటే క్రైస్తవమత సామ్రాజ్యం, దేవుని చిత్తాన్ని చేయడంలో అప్రమత్తంగా లేదని యెషయా మాటలు చూపిస్తున్నాయి. అది ఆధ్యాత్మిక బంజరుభూమిలా ఉండి, సత్యం న్యాయం ఏమాత్రం లేకుండా, జ్ఞానంలేని వట్టి మృగంలా ఉంది.
మహిమాన్వితమైన తారతమ్యం!
20. దేవుని ఆత్మ తన ప్రజలపై కుమ్మరించబడడం యొక్క ఫలితం ఏమిటి?
20 యెషయా ఆ తర్వాత, యెహోవా చిత్తాన్ని చేసేవారి కోసం హృదయోత్తేజకరమైన నిరీక్షణను అందజేస్తున్నాడు. దేవుని స్వంత ప్రజలపైకి వచ్చే ఏ నాశనమైనా, “పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు . . . అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగా నుండు” వరకు నిలుస్తుందంతే. (యెషయా 32:13, 15) ఒకవిధంగా చెప్పాలంటే, సంతోషకరంగా 1919 నుండి యెహోవా ఆత్మ తన ప్రజలపై సమృద్ధిగా కుమ్మరించబడడంతో, అభిషిక్త క్రైస్తవుల ఫలభరితమైన భూమి పునఃస్థాపించబడింది, వెనువెంటగా, విస్తరించే వనంలావున్న వేరే గొఱ్ఱెలు సమకూర్చబడ్డారు. నేడు భూమిపైనున్న ఆయన సంస్థలో సమృద్ధి, పెరుగుదల కీలకాంశాలుగా ఉన్నాయి. పునఃస్థాపిత ఆధ్యాత్మిక పరదైసులో, రానున్న దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడం, “యెహోవా మహిమను మన దేవుని తేజస్సును” ప్రతిఫలింపజేస్తుంది.—యెషయా 35:1, 2.
21. నేడు నీతిని, నిమ్మళమును, నిబ్బరమును ఎక్కడ కనుగొనవచ్చు?
21 ఇప్పుడు యెహోవా మహిమకరమైన వాగ్దానాన్ని వినండి: “న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలుగజేయును; నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును.” (యెషయా 32:16, 17 ఎ) నేడు యెహోవా ప్రజల ఆధ్యాత్మిక స్థితిని ఇది ఎంత చక్కగా వర్ణిస్తుందో కదా! ద్వేషం, దౌర్జన్యం వంటివాటితో విభాగించబడిన, ఘోరమైన ఆధ్యాత్మిక లేమిని అనుభవిస్తున్న మానవజాతిలోని అధికశాతం మందికి భిన్నంగా, నిజ క్రైస్తవులు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు” వచ్చినప్పటికీ భూగోళవ్యాప్తంగా సమైక్యంగా ఉన్నారు. చివరికి, నిజమైన సమాధానమును, నిబ్బరమును నిత్యము ఆనందిస్తామనే నమ్మకంతో, వారు దేవుని నీతికి అనుగుణంగా జీవిస్తారు, పని చేస్తారు, సేవచేస్తారు.—ప్రకటన 7:9, 17.
22. దేవుని ప్రజల స్థితికి, అబద్ధమతంలోని వారి స్థితికి మధ్యనున్న తేడా ఏమిటి?
22 ఆధ్యాత్మిక పరదైసులో, యెషయా 32:17 బి ఇప్పటికే నెరవేరుతోంది. అది ఇలా చెబుతోంది: “నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు.” కానీ నకిలీ క్రైస్తవులకు, “అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును పట్టణము నిశ్చయముగా కూలిపోవును.” (యెషయా 32:18, 19) అవును, భీకరమైన పెనుతుపానులా యెహోవా తీర్పు, అబద్ధమత నకిలీ పట్టణమును కొట్టి, దాని మద్దతుదారుల “అరణ్యము”ను అవమానపరచి, అది ఇక ఎన్నడూ ఉండకుండా వారిని రూపుమాపబోతోంది!
23. భూవ్యాప్తంగా జరుగుతున్న ఏ పని ముగింపుకు వస్తోంది, దానిలో భాగం వహిస్తున్నవారు ఎలా పరిగణింపబడతారు?
23 ప్రవచనంలోని ఈ భాగం ఇలా ముగుస్తుంది: “సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.” (యెషయా 32:20) దేవుని ప్రాచీన ప్రజలు, బరువులు మోసే ఎద్దు గాడిద వంటి జంతువులను పొలాలు దున్నడానికి, విత్తనాలు విత్తడానికి ఉపయోగించుకునేవారు. నేడు, యెహోవా ప్రజలు కోట్లసంఖ్యలో బైబిలు సాహిత్యాలను ముద్రించి పంపిణీ చేయడానికి ముద్రణా సామాగ్రిని, ఎలక్ట్రానిక్ పరికరాలను, ఆధునిక భవనాలను, రవాణాసౌకర్యాలను, అన్నిటికంటే ముఖ్యంగా ఒక సమైక్య, దైవపరిపాలనా సంస్థను ఉపయోగించుకుంటున్నారు. ఇష్టపూర్వకంగా పనిచేసేవారు, భూవ్యాప్తంగా అంటే అక్షరార్థంగా “సమస్త జలములయొద్ద” రాజ్య సత్య విత్తనాలను విత్తడానికి ఈ ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. దైవ-భయంగల లక్షలాదిమంది స్త్రీ పురుషులు ఇప్పటికే సమకూర్చబడ్డారు, బహుళసంఖ్యలో ఇతరులు వారితో కలుస్తున్నారు. (ప్రకటన 14:15, 16) నిజంగా వారంతా “ధన్యులు”గా పరిగణింపబడతారు.
[అధస్సూచీలు]
^ యెషయా 32:1 లోని “రాజు,” మొదటగా హిజ్కియా రాజును సూచించివుండవచ్చు. అయితే, యెషయా 32 వ అధ్యాయపు ముఖ్యమైన నెరవేర్పు రాజైన యేసుక్రీస్తుకు సంబంధించినది.
^ వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన కావలికోట, మార్చి 1, 1999, 13-18 పేజీలను చూడండి.
[అధ్యయన ప్రశ్నలు]
[331 వ పేజీలోని చిత్రాలు]
మృత సముద్రపు గ్రంథపు చుట్టల్లో, యెషయా 32 వ అధ్యాయం “X” అనే గుర్తుతో సూచించబడుతోంది
[333 వ పేజీలోని చిత్రాలు]
ప్రతి ‘అధికారి’ గాలికి మరుగైనచోటు వంటివాడు, వానకు చాటైనచోటు వంటివాడు, ఎడారిలో నీళ్లవంటివాడు, ఎండదాపుకు నీడవంటివాడు
[338 వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులు ఇతరులతో సువార్త పంచుకోవడంలో గొప్ప ఆనందాన్ని పొందుతారు