కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమాధానకర్తయగు అధిపతి గురించి వాగ్దానం

సమాధానకర్తయగు అధిపతి గురించి వాగ్దానం

పదవ అధ్యాయం

సమాధానకర్తయగు అధిపతి గురించి వాగ్దానం

యెషయా 8:19–9:7

1. కయీను కాలంనాటి నుండి ఇప్పటి వరకు మానవజాతి ఏమి చూసింది?

 దాదాపు ఆరు వేల సంవత్సరాల క్రితం, మొదటి మానవ శిశువు జన్మించింది. ఆ శిశువు పేరు కయీను, ఆ శిశువు జననం చాలా ప్రత్యేకమైనది. ఆ శిశువు తల్లిదండ్రులుగానీ, దేవదూతలుగానీ చివరికి సృష్టికర్త కూడా మునుపెన్నడూ ఒక మానవ శిశువును చూడలేదు. ఈ నవజాత శిశువు మరణదండన విధించబడిన మానవజాతికి నిరీక్షణను తీసుకురాగలిగేదే. కానీ ఆ శిశువు పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక హంతకునిగా మారినప్పుడు ఎంత నిరాశ కలిగిందో! (1 యోహాను 3:​12) అప్పటి నుండి మానవజాతి లెక్కలేనన్ని హత్యలను చూసింది. తప్పుచేయడానికి మొగ్గుచూపే మానవులు ఒకరితో ఒకరు సమాధానంగా లేరు, దేవునితోనూ సమాధానంగా లేరు.​—⁠ఆదికాండము 6:5; యెషయా 48:22.

2, 3. యేసు క్రీస్తు వేటికి మార్గాన్ని తెరిచాడు, అలాంటి ఆశీర్వాదాలను పొందాలంటే మనమేమి చేయాలి?

2 కయీను జన్మించిన దాదాపు నాలుగు సహస్రాబ్దాల తర్వాత, మరో శిశువు జన్మించింది. ఆ శిశువు పేరు యేసు, ఆ శిశువు జననం కూడా ఎంతో ప్రత్యేకమైనదే. ఆ శిశువు పరిశుద్ధాత్మ శక్తితో కన్యకకు జన్మించాడు​—⁠చరిత్రంతటిలో అలాంటి జననం అది ఒక్కటే. ఆ శిశువు జనన సమయంలో, ఆనందభరితులైన వేవేల దూతల సమూహం దేవునికి ఇలా స్తుతిగీతాలు పాడింది: “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక.” (లూకా 2:​13, 14) యేసు హంతకుడిగా మారలేదుగాని, మానవులు దేవునితో సమాధానంగా ఉండడానికి, నిత్యజీవాన్ని పొందడానికి మార్గం తెరిచాడు.​—⁠యోహాను 3:16; 1 కొరింథీయులు 15:55.

3 యేసు “సమాధానకర్తయగు అధిపతి” అని పిలువబడతాడని యెషయా ప్రవచించాడు. (యెషయా 9:6) ఆయన పాప క్షమాపణను సాధ్యం చేస్తూ మానవజాతికోసం తన జీవాన్ని అర్పిస్తాడు. (యెషయా 53:​11) నేడు, యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా దేవునితో సమాధానం, పాపాలకు క్షమాపణ సాధ్యమవుతాయి. కానీ అలాంటి ఆశీర్వాదాలు వాటంతటవే రావు. (కొలొస్సయులు 1:​21-23) అవి కావాలనుకునేవారు యెహోవా దేవునికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. (1 పేతురు 3:11; హెబ్రీయులు 5:​8, 9 పోల్చండి.) యెషయా కాలంలో ఇశ్రాయేలు, యూదా దీనికి పూర్తిగా విరుద్ధమైనది చేస్తాయి.

దయ్యాలవైపు తిరగడం

4, 5. యెషయా కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కొందరు ఎవరి వైపుకు తిరుగుతారు?

4 యెషయా సమకాలీనులు తమ అవిధేయతను బట్టి నైతికంగా దిగజారిపోయిన స్థితిలో అంటే ఆధ్యాత్మిక అంధకారమనే వాస్తవమైన గుంటలో పడిపోయారు. చివరికి యూదా దక్షిణ రాజ్యంలో అంటే దేవుని ఆలయం ఉన్న స్థలంలో కూడా సమాధానం లేదు. యూదా ప్రజలు తమ అవిశ్వసనీయత కారణంగా అష్షూరీయుల చేతుల్లో దాడికి గురయ్యే ప్రమాదంలో ఉన్నారు, కష్టకాలాలు ముందున్నాయి. వారు సహాయం కోసం ఎవరివైపు తిరుగుతారు? విచారకరంగా చాలామంది యెహోవావైపు కాక సాతాను వైపు తిరుగుతారు. వారు సాతానును నేరుగా ఆయన పేరుతో అర్థించరు. అయితే ప్రాచీన కాలానికి చెందిన సౌలు రాజులా వారు మృతులతో సంభాషించడానికి ప్రయత్నించడం ద్వారా తమ సమస్యలకు సమాధానాలు పొందాలని చూస్తూ అభిచారం చేస్తారు.​—⁠1 సమూయేలు 28:1-20.

5 కొంతమంది ఈ ఆచారాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇలా చెబుతూ యెషయా అలాంటి మతభ్రష్టత్వాన్ని ఎత్తిచూపిస్తున్నాడు: “వారు మిమ్మును చూచి​—⁠కర్ణపిశాచిగలవారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింపవద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్లదగునా?” (యెషయా 8:​19) కర్ణపిశాచిగలవారు “కిచకిచలాడి గొణుగు”తూ ప్రజలను మోసగించగలరు. చనిపోయినవారి ఆత్మలు చేస్తాయని చెబుతూ, అలాంటి శబ్దాలను నిజానికి జీవించివున్న వారే నోరు మెదపకుండా మాట్లాడే, వెంట్రిలాక్విజమ్‌ అనే నైపుణ్యం ద్వారా చేయగలుగుతారు. అయితే కొన్నిసార్లు దెయ్యాలు సూటిగా జోక్యం చేసుకుంటూ చనిపోయినవారిలాగే అభినయిస్తాయి, సౌలు ఏన్దోరులోని ఒక మంత్రగత్తెతో విచారణ చేయించినప్పుడు సరిగ్గా అదే జరిగింది.​—⁠1 సమూయేలు 28:8-19.

6. ప్రత్యేకంగా, అభిచారాన్ని ఆశ్రయించిన ఇశ్రాయేలీయులు ఎందుకు నిందార్హులు?

6 యెహోవా అభిచారాన్ని నిషేధించినప్పటికీ యూదాలో ఇదంతా కొనసాగుతూనే ఉంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అది మరణశిక్షకు అర్హమైన నేరం. (లేవీయకాండము 19:​31; 20:​6, 27; ద్వితీయోపదేశకాండము 18:​9-12) యెహోవాకు ప్రత్యేక సంపాద్యమైన ప్రజలు అంత ఘోరమైన పాపాన్ని ఎందుకు చేస్తారు? ఎందుకంటే వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని, ఉపదేశాన్ని నిరాకరించి ‘పాపమువలన కలుగు భ్రమచేత కఠినపరచబడ్డారు.’ (హెబ్రీయులు 3:​13) “వారి హృదయము క్రొవ్వువలె మందముగా” తయారైంది, వారు తమ దేవుని నుండి దూరమైపోయారు.​—⁠కీర్తన 119:70. *

7. ఈనాడు చాలామంది యెషయా కాలంనాటి ఇశ్రాయేలీయులను ఎలా అనుకరిస్తారు, వారు పశ్చాత్తాపపడకపోతే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది?

7 బహుశా వారిలా తర్కించుకుంటుండవచ్చు, ‘త్వరలోనే అష్షూరీయులు మనపై దాడి చేయబోతుంటే యెహోవా ధర్మశాస్త్రం మనకేమి ప్రయోజనం చేకూరుస్తుంది?’ వారికి తమ ప్రమాదకరమైన పరిస్థితికి వెంటనే సులభమైన పరిష్కారం కావాలి, అంతేగానీ యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చేందుకు వేచి ఉండడానికి వారు సిద్ధంగా లేరు. మన కాలంలో కూడా, చాలామంది యెహోవా ధర్మశాస్త్రాన్ని అలక్ష్యం చేసి కర్ణపిశాచిగలవారి కోసం వెతకుతారు, రాశిచక్రాన్ని చూస్తారు, తమ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇతర విధాల అతీంద్రియ శక్తులను ఆశ్రయిస్తారు. అయితే, జీవించివున్నవారు సమాధానాల కోసం, మరణించినవారి దగ్గరికి వెళ్లడం పూర్వమెంత హాస్యాస్పదమైనదో నేడూ అంతే హాస్యాస్పదమైనది. పశ్చాత్తాపపడకుండా అలాంటివాటిని అనుసరించేవారి భవిష్యత్తు ‘నరహంతకులు, వ్యభిచారులు, విగ్రహారాధకులు, అబద్ధికులు’ వంటి వారితోనే ఉంటుంది. వారికి భావి జీవిత ఉత్తరాపేక్షలేమీ ఉండవు.​—⁠ప్రకటన 21:8.

దేవుని ‘ధర్మశాస్త్రము, ప్రమాణ వాక్యము’

8. మనం నేడు నడిపింపు కోసం వెళ్లవలసిన “ధర్మశాస్త్రము,” “ప్రమాణవాక్యము” ఏది?

8 యెహోవా ఇచ్చిన ఇతర ఆజ్ఞలతోపాటు అభిచారాన్ని నిషేధించే ఆయన ధర్మశాస్త్రం యూదాలో గుప్తంగా ఏమి లేదు. అది వ్రాత రూపంలో భద్రపరచబడింది. ఈనాడు ఆయన వాక్యం లిఖిత రూపంలో సంపూర్ణంగా అందుబాటులో ఉంది. అదే బైబిలు. అది దైవిక సూత్రాలు కట్టడల సంకలనమే గాక దేవుడు తన ప్రజలతో వ్యవహరించిన విధానాల వృత్తాంతం కూడా. యెహోవా వ్యవహారాలను గురించిన ఈ బైబిలు వృత్తాంతం, యెహోవా వ్యక్తిత్వాన్ని, లక్షణాలను మనకు బోధిస్తూ ఒక ప్రమాణవాక్యంగా లేక సాక్ష్యాధారంగా ఉంది. ఇశ్రాయేలీయులు మృతులను సంప్రదించే బదులు, నడిపింపు కోసం ఎక్కడికి వెళ్లాలి? యెషయా ఇలా సమాధానమిస్తున్నాడు: “ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి!” (యెషయా 8:​20) అవును, నిజమైన జ్ఞానోదయం కోసం వెదికేవారు దేవుని లిఖిత వాక్యం దగ్గరికి వెళ్లాలి.

9. పశ్చాత్తాపం చూపించని పాపులు అప్పుడప్పుడూ బైబిలు నుండి ఎత్తిచెప్పడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా?

9 అభిచారాన్ని కొద్ది కొద్దిగా అనుసరిస్తున్న కొంతమంది ఇశ్రాయేలీయులు దేవుని లిఖిత వాక్యంపట్ల గౌరవం ఉన్నట్లు చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు అలా చెప్పుకోవడం అర్థరహితమైనది, వేషధారణతో కూడినది. యెషయా ఇలా చెబుతున్నాడు: “ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.” (యెషయా 8:​20బి) ఇక్కడ యెషయా ఏ వాక్యం గురించి మాట్లాడుతున్నాడు? బహుశా “ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి” అనే వాక్యము గురించే కావచ్చు! నేడు మతభ్రష్టులు మరితరులు లేఖనాలను ఎత్తిచెబుతున్నట్లుగానే కొంతమంది మతభ్రష్ట ఇశ్రాయేలీయులు దేవుని వాక్యాన్ని ఎత్తిచెబుతుండవచ్చు. అయితే ఇవి కేవలం వట్టి మాటలు మాత్రమే. యెహోవా చిత్తాన్ని చేస్తూ, అపరిశుభ్రమైన ఆచారాలను విడనాడనంత వరకూ కేవలం లేఖనాలను ఎత్తిచెప్పడం వల్ల ఏ “అరుణోదయము” కలుగదు లేదా యెహోవా నుండి జ్ఞానోదయమేమీ కలుగదు. *

‘అన్న పానముల క్షామముకాదు’

10. యెహోవాను నిరాకరించినందుకు యూదా ప్రజలు ఎలాంటి బాధను అనుభవిస్తున్నారు?

10 యెహోవాకు అవిధేయత చూపించడం మానసిక అంధకారానికి దారితీస్తుంది. (ఎఫెసీయులు 4:​17, 18) ఆధ్యాత్మిక భావంలో, యూదా ప్రజలు అవగాహన లేని అంధులయ్యారు. (1 కొరింథీయులు 2:​14) యెషయా వారి పరిస్థితినిలా వర్ణిస్తున్నాడు: “అట్టివారు ఇబ్బందిపడుచు ఆకలిగొని దేశసంచారము చేయుదురు.” (యెషయా 8:21) ప్రాముఖ్యంగా ఆహాజు రాజు పరిపాలనా కాలంలోని జనాంగం చూపించిన అవిశ్వాస్యత మూలంగా, ఒక స్వతంత్ర రాజ్యంగా యూదా మనుగడకు ముప్పు వాటిల్లింది. ఆ దేశాన్ని శత్రువులు చుట్టుముట్టారు. అష్షూరీయుల సైన్యం యూదా నగరాలను ఒకదాని తర్వాత మరోదాన్ని లోబరచుకుంటోంది. శత్రువులు పంట భూముల్ని నాశనంచేసి ఆహార కొరత ఏర్పడేలా చేస్తారు. చాలామంది “ఇబ్బందిపడుచు ఆకలి”గొంటారు. అయితే దేశాన్ని మరో రకమైన క్షామం కూడా పట్టి పీడిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం ఆమోసు ఇలా ప్రవచించాడు: “రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.” (ఆమోసు 8:​11) యూదాను ఇప్పుడు అలాంటి ఆధ్యాత్మిక క్షామమే పట్టిపీడిస్తోంది!

11. యూదా తనకు లభించే క్రమశిక్షణ నుండి పాఠం నేర్చుకుంటుందా?

11 యూదా బుద్ధి తెచ్చుకుని యెహోవా వద్దకు తిరిగి వస్తుందా? దాని ప్రజలు అభిచారాన్ని, విగ్రహారాధనను మానుకుని “ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును” గైకొంటారా? యెహోవా వారి ప్రతిస్పందనను ముందుగానే ఇలా చూస్తున్నాడు: “ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజుపేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు.” (యెషయా 8:​21బి) అవును, తమను ఈ స్థితికి తీసుకువచ్చినందుకు చాలామంది తమ మానవ రాజును నిందిస్తారు. కొంతమంది తమపైకి వచ్చిన శ్రమలను బట్టి మూర్ఖంగా చివరికి యెహోవాను కూడా నిందిస్తారు! (యిర్మీయా 44:​15-18 పోల్చండి.) నేడు, చాలామంది అదేవిధంగా ప్రతిస్పందిస్తూ మానవ దుష్టత్వం మూలంగా కలిగిన విషాద సంఘటనలకు దేవుడ్ని నిందిస్తారు.

12. (ఎ) దేవుని నుండి వైదొలగడం యూదాను ఎక్కడికి నడిపించింది? (బి) ఏ ప్రాముఖ్యమైన ప్రశ్నలు లేవదీయబడ్డాయి?

12 దేవుణ్ణి శపించడం, యూదా నివాసులకు సమాధానాన్ని తెస్తుందా? లేదు. యెషయా ఇలా ప్రవచిస్తున్నాడు: “భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.” (యెషయా 8:​22) దేవుడ్ని నిందించడానికి వారు తమ కన్నులను ఆకాశంవైపు ఎత్తిన తర్వాత, మళ్లీ భూమివైపుకు, అంటే తమ నిరాశాజనకమైన పరిస్థితులవైపుకు చూస్తారు. వారు దేవుని నుండి వైదొలగిపోవడం వారి నాశనానికి నడిపింది. (సామెతలు 19:​2, 3) అయితే దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాల విషయమేమిటి? (ఆదికాండము 22:​15-18; 28:​14, 15) యెహోవా తాను వాగ్దానం చేసినదానిలో తప్పిపోతాడా? యూదాకు, దావీదుకు వాగ్దానం చేయబడిన రాజవంశాన్ని అష్షూరీయులుగానీ లేక మరితర సైనిక శక్తులుగానీ అంతం చేస్తాయా? (ఆదికాండము 49:8-10; 2 సమూయేలు 7:​11-16) ఇశ్రాయేలీయులు నిరంతరం అంధకారంలో విడువబడతారా?

‘అవమానపర్చబడిన’ దేశము

13. “అన్యజనుల గలిలయ” అంటే ఏమిటి, అది ఎలా ‘అవమానపరచబడుతుంది’?

13 అబ్రాహాము సంతానంపైకి వచ్చే అత్యంత విపత్కరమైన సంఘటనల్లో ఒకదాన్ని యెషయా ఇప్పుడు సూచిస్తున్నాడు: “అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువలేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.” (యెషయా 9:1) గలిలయ అన్నది ఇశ్రాయేలు ఉత్తర రాజ్యంలోని ఒక ప్రదేశం. యెషయా ప్రవచనంలో, “జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును” మాత్రమేగాక మధ్యధరా సముద్రానికి నడిపిస్తూ గలిలయ సముద్రం వెంబడి వెళ్లే ఒక ప్రాచీన మార్గమైన “సముద్రప్రాంతము” కూడా దానిలో ఉంది. యెషయా కాలంలో ఆ ప్రాంతము “అన్యజనుల గలిలయ” అని పిలువబడేది, దానికి చెందిన అనేక నగరాల్లో ఇశ్రాయేలీయులు కానివారే నివసించడం దానికి కారణం కావచ్చు. * ఈ దేశం ఎలా ‘అవమానపరచబడింది’? అన్యులైన అష్షూరీయులు దాన్ని స్వాధీనం చేసుకుని ఇశ్రాయేలీయులను చెరపట్టుకు పోతారు, ఆ ప్రాంతమంతటిలోనూ అబ్రాహాము సంతానం కాని అన్యులు నివాసం ఏర్పరచుకునేలా చేస్తారు. ఆవిధంగా పది-గోత్రాల ఉత్తర రాజ్యం ఒక ప్రత్యేక రాజ్యంగా చరిత్రలోనుండి కనుమరుగైపోతుంది.​—⁠2 రాజులు 17:5, 6, 18, 23, 24.

14. పది-గోత్రాల రాజ్యంపై ‘మబ్బు నిలవడం’ కన్నా యూదాపై ‘మబ్బు నిలవడం’ ఏ భావంలో తక్కువగా ఉంటుంది?

14 యూదా కూడా అష్షూరీయుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటుంది. పది-గోత్రాల రాజ్యానికి ప్రాతినిధ్యం వహించిన జెబూలూను నఫ్తాలిలపై నిలిచినట్లు యూదాపై శాశ్వతంగా ‘మబ్బు నిలుస్తుందా’? లేదు. యూదా దక్షిణ రాజ్య ప్రాంతానికీ, చివరికి మునుపు ఉత్తర రాజ్యం పరిపాలించిన ప్రాంతానికీ కూడా “అంత్యకాలమున” యెహోవా ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. ఎలా?

15, 16. (ఎ) “జెబూలూను నఫ్తాలి యను దేశముల” పరిస్థితి ఏ “అంత్యకాలమున” మారుతుంది? (బి) అవమానపరచబడిన దేశం ఎలా మహిమపరచబడుతుంది?

15 యేసు భూపరిచర్యను గూర్చిన ప్రేరేపిత వృత్తాంతంలో అపొస్తలుడైన మత్తయి ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. ఆ పరిచర్య తొలి దినాలను వర్ణిస్తూ, మత్తయి ఇలా చెబుతున్నాడు: “[యేసు] నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.​—⁠జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)”​—⁠మత్తయి 4:12-16.

16 అవును, యెషయా ప్రవచించిన “అంత్యకాలము” క్రీస్తు భూపరిచర్య కాలము. యేసు భూజీవితం చాలామేరకు గలిలయలో గడిచింది. ఆయన గలిలయ ప్రాంతంలోనే తన పరిచర్యను ప్రారంభించి, “పరలోకరాజ్యము సమీపించియున్నది” అని ప్రకటించడం మొదలు పెట్టాడు. (మత్తయి 4:​17) గలిలయలో, ఆయన ప్రసిద్ధి గాంచిన కొండమీది ప్రసంగాన్ని ఇచ్చాడు, తన అపొస్తలులను ఎంపిక చేసుకున్నాడు, తన మొదటి అద్భుతాన్ని చేశాడు, తాను పునరుత్థానం చేయబడిన తర్వాత తన అనుచరులైన దాదాపు 500 మందికి కనిపించాడు. (మత్తయి 5:1–7:27; 28:16-20; మార్కు 3:13, 14; యోహాను 2:8-11; 1 కొరింథీయులు 15:6) ఈ విధంగా “జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును” మహిమపరచడం ద్వారా యేసు యెషయా ప్రవచనాన్ని నెరవేర్చాడు. అయితే యేసు తన పరిచర్యను కేవలం గలిలయ ప్రజలకు మాత్రమే పరిమితం చేయలేదు. యేసు దేశమంతటిలోనూ సువార్తను ప్రకటించడం ద్వారా యూదాతో సహా మొత్తం ఇశ్రాయేలు దేశాన్ని “మహిమగలదానిగా” చేశాడు.

“గొప్ప వెలుగు”

17. గలిలయలో ఒక “గొప్ప వెలుగు” ఎలా ప్రకాశించింది?

17 మత్తయి గలిలయలో “గొప్ప వెలుగు” గురించి ప్రస్తావించిన దాని విషయమేమిటి? ఇది కూడా యెషయా ప్రవచనంలో నుండే ఎత్తిచెప్పబడింది. యెషయా ఇలా వ్రాశాడు: “చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.” (యెషయా 9:​2) సా.శ. మొదటి శతాబ్దానికల్లా, సత్యపు వెలుగు అన్యమత అబద్ధాలతో మరుగు చేయబడింది. యూదా మతనాయకులు తమ మతాచారాలను అంటిపెట్టుకుని ఉండి “దేవుని వాక్యమును నిరర్థకము” చేస్తూ సమస్యను మరింత జటిలం చేశారు. (మత్తయి 15:6) వినయంగలవారు “అంధులైన మార్గదర్శకుల”ను అనుసరిస్తూ అణిచివేయబడ్డారు, అయోమయంలో పడిపోయారు. (మత్తయి 23:2-4, 16) మెస్సీయ అయిన యేసు వచ్చినప్పుడు, వినయంగల అనేకమంది కళ్లు అద్భుతరీతిగా తెరువబడ్డాయి. (యోహాను 1:​9, 12) యేసు ఈ భూమిపైనున్నప్పుడు చేసిన పని, ఆయన బలి ఫలితంగా వచ్చే ఆశీర్వాదాలు, యెషయా ప్రవచనంలో “గొప్ప వెలుగు” అని సరిగానే వర్ణించబడ్డాయి.​—⁠యోహాను 8:12.

18, 19. వెలుగుకు ప్రతిస్పందించినవారు ఎంతో సంతోషించడానికి గల కారణమేమిటి?

18 వెలుగుకు ప్రతిస్పందించినవారు ఆనందించడానికి ఎంతో కారణం ఉంది. యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “నీవు జనమును విస్తరింపజేయుచున్నావు; వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.” (యెషయా 9:3) యేసు ఆయన శిష్యులు చేసిన ప్రకటనా పని మూలంగా, యెహోవాను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనే కోరిక ఉందని చూపిస్తూ యథార్థ హృదయులు ముందుకు వచ్చారు. (యోహాను 4:​24) నాలుగు సంవత్సరాలు గడవక ముందే, అనేకులు క్రైస్తవత్వాన్ని హత్తుకున్నారు. సా.శ. 33 పెంతెకొస్తు దినాన మూడు వేలమంది బాప్తిస్మం తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి, వారి “సంఖ్య యించుమించు అయిదు వేలు ఆయెను.” (అపొస్తలుల కార్యములు 2:​41; 4:4) శిష్యులు ఆసక్తితో వెలుగును ప్రతిఫలింపజేస్తుండగా, “శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.”​—⁠అపొస్తలుల కార్యములు 6:7.

19 సమృద్ధికరమైన పంటను చూసి సంతోషించేవారిలా, గొప్ప సైనిక విజయం లభించిన తర్వాత విలువైన దోపుడుసొమ్మును పంచుకొంటూ సంతోషించేవారిలా, పెరుగుదలను బట్టి యేసు అనుచరులు సంతోషించారు. (అపొస్తలుల కార్యములు 2:​46, 47) కొంతకాలానికి, యెహోవా అన్యజనాంగాల మధ్య వెలుగు ప్రకాశించేలా చేశాడు. (అపొస్తలుల కార్యములు 14:​27) తాము యెహోవాను సమీపించేందుకు మార్గం తెరవబడిందని అన్ని జాతులవారు ఆనందించారు.​—⁠అపొస్తలుల కార్యములు 13:48.

“మిద్యాను దినమున జరిగినట్లు”

20. (ఎ) మిద్యానీయులు ఏ యే రీతులుగా ఇశ్రాయేలీయులకు శత్రువులని నిరూపించబడ్డారు, వారి వల్ల కలుగనున్న ప్రమాదాన్ని యెహోవా ఎలా నిర్మూలించాడు? (బి) దేవుని ప్రజల శత్రువుల వల్ల వచ్చే ప్రమాదాన్ని ఒక భవిష్యత్‌ “మిద్యాను దినమున” యేసు ఎలా నిర్మూలిస్తాడు?

20 మెస్సీయ కార్యకలాపాల ప్రభావం శాశ్వతంగా ఉంటుంది, ఆ విషయాన్ని మనం యెషయా చెబుతున్న ఈ తర్వాతి మాటల నుండి చూడవచ్చు: “మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు, వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.” (యెషయా 9:4) యెషయా కాలానికి శతాబ్దాల పూర్వం, ఇశ్రాయేలీయులను పాపంలో పడవేయడానికి మిద్యానీయులు మోయాబీయులతో కలిసి కుట్రపన్నారు. (సంఖ్యాకాండము 25:​1-9, 14-17; 31:​15, 16) తర్వాత, మిద్యానీయులు ఏడు సంవత్సరాలపాటు ఇశ్రాయేలీయుల గ్రామాలపై వారి పొలాలపై దాడి చేస్తూ వారికి మహాభీతి కలిగించారు. (న్యాయాధిపతులు 6:​1-6) కాని తర్వాత యెహోవా తన సేవకుడైన గిద్యోను ద్వారా మిద్యాను సైన్యాలను ఓడించి వారిని తరిమివేశాడు. ఆ “మిద్యాను దినము” తర్వాత, యెహోవా ప్రజలు మళ్లీ మిద్యానీయుల చేతుల్లో బాధలుపడినట్లు సాక్ష్యాధారమేమీ లేదు. (న్యాయాధిపతులు 6:​7-16; 8:​28) సమీప భవిష్యత్తులో గొప్ప గిద్యోను అయిన యేసు క్రీస్తు యెహోవా ప్రజల ఆధునిక దిన శత్రువులను చావుదెబ్బ కొడతాడు. (ప్రకటన 17:​14; 19:​11-21) అప్పుడు, “మిద్యాను దినమున జరిగినట్లు,” మానవ శక్తితో కాదుగానీ యెహోవా శక్తితో సంపూర్ణమైన, శాశ్వత విజయం లభిస్తుంది. (న్యాయాధిపతులు 7:​2-22) దేవుని ప్రజలు ఇక మరెన్నడూ అణచివేత అనే కాడి క్రింద నలిగిపోరు!

21. భవిష్యత్తులో యుద్ధాలను గురించి యెషయా ప్రవచనం ఏమి సూచిస్తోంది?

21 దైవిక శక్తి ప్రదర్శనలు యుద్ధాన్ని మహిమపరుస్తున్నట్లు కాదు. పునరుత్థానం చేయబడిన యేసు సమాధానకర్తయగు అధిపతి, ఆయన తన శత్రువులను నిర్మూలించడం ద్వారా శాశ్వత సమాధానాన్ని నెలకొల్పుతాడు. సైన్యానికి సంబంధించిన సామాగ్రి అంతా అగ్నిచే సంపూర్ణంగా నాశనం చేయబడడాన్ని గురించి యెషయా ఇప్పుడు మాట్లాడుతున్నాడు: “యుద్ధపుసందడిచేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును.” (యెషయా 9:5) కవాతు చేస్తున్న సైనికుల బూట్ల శబ్దానికి ఏర్పడే భూప్రకంపనలు ఇక ఎన్నడూ ఉండవు. యుద్ధంలో రాటుదేలిన యోధుల రక్తభరితమైన వస్త్రాలు ఇక ఎన్నడూ కనిపించవు. యుద్ధం ఇక ఉండదు!​—⁠కీర్తన 46:9.

‘ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త’

22. యెషయా గ్రంథంలో యేసుకు ఏ బహుముఖ ప్రవచనార్థక పేరు ఇవ్వబడింది?

22 మెస్సీయగా ఉండడానికి జన్మించిన వ్యక్తి తన అద్భుతమైన జనన సమయంలో, “యెహోవాయే రక్షణ” అనే భావంగల యేసు అనే పేరును పొందాడు. కానీ ఆయనకు వేరే పేర్లు అంటే ఆయన కీలకమైన పాత్రను, ఉన్నతమైన స్థానాన్ని సూచించే ప్రవచనార్థకమైన పేర్లు కూడా ఉన్నాయి. అలాంటి ఒక పేరు ఇమ్మానుయేలు, దానికి “దేవుడు మనకు తోడైయున్నాడు” అని అర్థం. (యెషయా 7:​14, అధఃసూచి) యెషయా ఇప్పుడు మరో ప్రవచనార్థక పేరును వర్ణిస్తున్నాడు: “మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను; ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.” (యెషయా 9:6) ఈ బహుముఖ ప్రవచనార్థక పేరుకున్న విశేషమైన భావాన్ని పరిశీలించండి.

23, 24. (ఎ) యేసు ఏ విధంగా ఒక ‘ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త’? (బి) క్రైస్తవ ఉపదేశకులు నేడు యేసు మాదిరిని ఎలా అనుకరించగలరు?

23 ఆలోచన లేదా ఉపదేశం చెప్పేవాడు ఆలోచనకర్త. భూమిమీద ఉన్నప్పుడు యేసు క్రీస్తు అద్భుతంగా ఉపదేశించాడు. “జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి” అని మనం బైబిలులో చదువుతాము. (మత్తయి 7:​28) ఆయన మానవ నైజం గురించి విశేషమైన అవగాహనగల జ్ఞానవంతుడైన, సానుభూతిగల ఆలోచనకర్త. ఆయనిచ్చే ఉపదేశం మందలింపులకు, క్రమశిక్షణకు మాత్రమే పరిమితమైనది కాదు. తరచుగా, అది ఆదేశం రూపంలో ఉంటుంది, ప్రేమపూర్వకమైన సలహాలా ఉంటుంది. యేసు ఇచ్చే ఉపదేశం అద్భుతమైనది ఎందుకంటే అది ఎప్పుడూ జ్ఞానయుక్తమైనది, పరిపూర్ణమైనది, పొరపాటులేనిది. దాన్ని అనుసరిస్తే అది నిత్యజీవానికి నడిపిస్తుంది.​—⁠యోహాను 6:68.

24 యేసు ఇచ్చిన ఉపదేశం కేవలం ఆయన విశిష్టమైన మెదడునుండి మాత్రమే ఉత్పన్నమైనది కాదు. బదులుగా, “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే” అని ఆయన చెబుతున్నాడు. (యోహాను 7:​16) సొలొమోను విషయంలోలాగే, యేసు జ్ఞానానికి మూలం యెహోవా దేవుడు. (1 రాజులు 3:7-14; మత్తయి 12:​42) యేసు మాదిరి, క్రైస్తవ సంఘంలోని బోధకులు ఉపదేశకులు తామిచ్చే ఉపదేశాన్ని దేవుని వాక్యం ఆధారంగా ఇచ్చేలా వారిని పురికొల్పాలి.​—⁠సామెతలు 21:30.

“బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి”

25. “బలవంతుడైన దేవుడు” అనే పేరు పరలోక యేసు గురించి మనకేమి తెలియజేస్తుంది?

25 యేసు “బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి” కూడా. ‘మన తండ్రియైన దేవుడైన’ యెహోవా అధికారాన్ని, స్థానాన్ని ఆయన చేజిక్కించుకుంటాడని దీని భావం కాదు. (2 కొరింథీయులు 1:2) ఆయన “దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు.” (ఫిలిప్పీయులు 2:6) ఆయన బలవంతుడైన దేవుడని పిలువబడ్డాడే గానీ సర్వశక్తిమంతుడైన దేవుడని పిలువబడలేదు. యేసు ఎన్నడూ తనను తాను సర్వశక్తిమంతుడైన దేవునిగా భావించుకోలేదు, ఎందుకంటే ఆయన తన తండ్రి గురించి, “అద్వితీయ సత్యదేవుడ”ని, అంటే ఆరాధించబడదగిన ఏకైక దేవుడని చెప్పాడు. (యోహాను 17:3; ప్రకటన 4:​10, 11) లేఖనాల్లో, “దేవుడు” అనే పదం “శక్తిమంతుడు” లేక “బలవంతుడు” అనే భావాన్ని ఇవ్వగలదు. (నిర్గమకాండము 12:12; కీర్తన 8:5; 2 కొరింథీయులు 4:4) యేసు భూమి మీదికి రాకముందు ఒక “దేవుడై” ఉండెను, “దేవుని స్వరూపము కలిగినవాడై” ఉండెను. ఆయన తాను పునరుత్థానం చేయబడిన తర్వాత పరలోకంలో అంతకంటే ఉన్నతమైన స్థానానికి తిరిగి వెళ్లాడు. (యోహాను 1:1; ఫిలిప్పీయులు 2:​6-11) అంతేగాక, “దేవుడు” అనే బిరుదు అదనపు సూచితార్థాన్ని కలిగివుంది. ఇశ్రాయేలులోని న్యాయాధిపతులు “దైవములని” పిలువబడ్డారు, ఒకసారి యేసే స్వయంగా వారినలా పిలిచాడు. (కీర్తన 82:6; యోహాను 10:​35) యేసు, “సజీవులకును మృతులకును తీర్పుతీర్చు”టకు యెహోవా నియమించిన న్యాయాధిపతి. (2 తిమోతి 4:1; యోహాను 5:​30) ఆయన బలవంతుడైన దేవుడని పిలువబడడం ఎంతో సమంజసమని స్పష్టమవుతోంది.

26. యేసును “నిత్యుడగు తండ్రి” అని ఎందుకు పిలువవచ్చు?

26 “నిత్యుడగు తండ్రి” అనే బిరుదు, మానవులకు భూమిపై నిరంతరం జీవించే ఉత్తరాపేక్షను ఇచ్చేందుకు మెస్సీయ రాజుకున్న శక్తిని, అధికారాన్ని సూచిస్తుంది. (యోహాను 11:​25, 26) మన ఆది తండ్రియైన ఆదాము ఇచ్చిన వారసత్వం మరణం. కడపటి ఆదాము అయిన యేసు “జీవింపచేయు ఆత్మ ఆయెను.” (1 కొరింథీయులు 15:22, 45; రోమీయులు 5:​12, 18) నిత్యుడగు తండ్రియైన యేసు నిరంతరం జీవించేలానే, విధేయత చూపే మానవజాతి ఆయన పితృత్వపు ప్రయోజనాలను నిరంతరం ఆనందిస్తుంది.​—⁠రోమీయులు 6:​8, 9.

“సమాధానకర్తయగు అధిపతి”

27, 28. “సమాధానకర్తయగు అధిపతి” పరిపాలనకు లోబడి ఉండేవారికి ఇప్పుడూ భవిష్యత్తులోనూ ఏ అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి?

27 మనిషికి నిత్యజీవమే గాక దేవునితోనూ, తోటి మానవునితోనూ సమాధానం కూడా అవసరం. ఈనాడు కూడా “సమాధానకర్తయగు అధిపతి” పరిపాలనకు లోబడేవారు ‘తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుకున్నారు.’ (యెషయా 2:​2-4) వారు రాజకీయ, ప్రాంతీయ, జాతిపరమైన లేక ఆర్థికపరమైన తేడాల మూలంగా ద్వేషాన్ని పెంచుకోరు. వారు అద్వితీయ సత్యదేవుడైన యెహోవా ఆరాధనలో ఐక్యమైవున్నారు, వారు సంఘం లోపలా వెలుపలా తమ పొరుగువారితో సమాధానకరమైన సంబంధాలు కలిగివుండడానికి కృషి చేస్తారు.​—⁠గలతీయులు 6:10; ఎఫెసీయులు 4:2, 3; 2 తిమోతి 2:24.

28 దేవుని నియమిత కాలంలో, క్రీస్తు భూమిపై ప్రపంచవ్యాప్త, సుస్థాపిత, శాశ్వత సమాధానాన్ని నెలకొల్పుతాడు. (అపొస్తలుల కార్యములు 1:7) “ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును.” (యెషయా 9:7ఎ) సమాధానకర్తయగు అధిపతిగా యేసు తన అధికారాన్ని ఉపయోగించేటప్పుడు క్రూర విధానాలు చేపట్టడు. ఆయన పరిపాలన క్రింద ఉండేవారి నుండి వారి స్వేచ్ఛా చిత్తం తీసివేయబడదు, వారు బలవంతంగా లోబరచుకోబడరు. బదులుగా, ఆయన తాను సాధించేదంతా “న్యాయమువలనను నీతివలనను” సాధిస్తాడు. ఎంత ఉత్తేజకరమైన మార్పు!

29. మనం నిత్య సమాధాన ఆశీర్వాదాన్ని పొందాలంటే ఏమి చేయాలి?

29 యేసు ప్రవచనార్థక పేరుకున్న అద్భుతమైన సూచితార్థాల దృష్ట్యా, యెషయా తన ప్రవచనంలోని ఈ భాగాన్ని ముగించే విధానం నిజంగా అద్భుతంగా ఉంది. ఆయనిలా వ్రాస్తున్నాడు: “యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.” (యెషయా 9:7బి) అవును, యెహోవా అసక్తికలిగి చర్య తీసుకుంటాడు. ఆయనేదీ అర్ధహృదయంతో చేయడు. ఆయనేం వాగ్దానం చేసినా దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాడని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. కాబట్టి ఎవరైనా నిత్య సమాధానాన్ని పొందాలని కోరుకుంటే, వారు పూర్ణహృదయంతో యెహోవా సేవ చేయాలి. యెహోవా దేవునిలా, సమాధానకర్తయగు అధిపతియైన యేసులా, దేవుని సేవకులందరూ “సత్‌క్రియలయందాసక్తిగల”వారై ఉండాలి.​—⁠తీతు 2:14.

[అధస్సూచీలు]

^ హిజ్కియా రాజు కాకముందు 119 కీర్తనను వ్రాసివుంటాడని అనేకులు విశ్వసిస్తారు. అలాగైతే, అది యెషయా ప్రవచిస్తున్న కాలంలో వ్రాయబడి ఉండవచ్చు.

^ యెషయా 8:20 వ వచనంలోని ‘ఈ వాక్యము’ అనేది, యెషయా 8:19 వ వచనంలో వ్రాయబడివున్న అభిచారానికి సంబంధించిన వాక్యాన్ని సూచిస్తుండవచ్చు. అలాగైతే, యూదాలో అభిచారాన్ని పెంపొందింపజేస్తున్నవారు కర్ణపిశాచిగలవారి వద్దకు వెళ్లి విచారించమని ఇతరులను ప్రోత్సహిస్తారు గనుక వారు యెహోవా నుండి ఏ జ్ఞానోదయాన్ని పొందరని యెషయా చెబుతున్నాడు.

^ సొలొమోను రాజు, తూరు రాజైన హీరాముకు ఇస్తానన్న 20 గలిలయ నగరాల్లోనూ బహుశా ఇశ్రాయేలీయులు కాని వారే నివసిస్తుండవచ్చునని కొందరు సూచించారు.​—⁠1 రాజులు 9:10-13.

[అధ్యయన ప్రశ్నలు]

[122 వ పేజీలోని మ్యాపు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

కొరాజీను

కపెర్నహూము

బేత్సయిదా

గెన్నేసరెతు లోయ

గలిలయ సముద్రం

మగదాను

తిబెరియ

యొర్దాను

నది

గదర

గదర

[119 వ పేజీలోని చిత్రాలు]

కయీను, యేసు ఇద్దరి జననాలు ఎంతో విశేషమైనవే. కానీ యేసు జననమే సంతోషకరమైన ఫలితాన్ని తెచ్చింది

[121 వ పేజీలోని చిత్రం]

అన్నపానముల క్షామము కంటే ఘోరమైన క్షామము కలుగుతుంది

[127 వ పేజీలోని చిత్రం]

యేసు దేశంలో వెలుగుగా ఉన్నాడు