కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అబద్ధ మతం—దాని ఆకస్మిక అంతాన్ని గురించిన పూర్వదర్శనం

అబద్ధ మతం—దాని ఆకస్మిక అంతాన్ని గురించిన పూర్వదర్శనం

ఎనిమిదవ అధ్యాయం

అబద్ధ మతం​—⁠దాని ఆకస్మిక అంతాన్ని గురించిన పూర్వదర్శనం

యెషయా 47:​1-15

1, 2. (ఎ) ప్రపంచ మత వాతావరణంలో త్వరలోనే విపరీతమైన మార్పు వస్తుందన్న విషయాన్ని కొందరు ఎందుకు నమ్మకపోవచ్చు? (బి) యెషయా 47 వ అధ్యాయంలోని మాటలు భవిష్యత్తులో నెరవేరుతాయని మనకెలా తెలుసు? (సి) అబద్ధ మతాలన్నిటికీ “మహా బబులోను” అనే పేరునివ్వడం ఎందుకు సబబు?

 దన్యూయార్క్‌ టైమ్స్‌ మ్యాగజైన్‌లోని ఒక ఆర్టికల్‌ “మత పునరాగమనం” అనే సందేశాన్ని ప్రకటించింది. ఇప్పటికీ మతం కోట్లాదిమంది హృదయాలపై, మనస్సులపై గట్టి పట్టును కలిగివున్నట్లు అనిపిస్తోందని ఆ ఆర్టికల్‌ సూచించింది. కాబట్టి ప్రపంచ మత వాతావరణంలో ఏదైనా విపరీతమైన మార్పు రాబోతోందని విశ్వసించడం కష్టమవ్వచ్చు. కానీ యెషయా గ్రంథం 47 వ అధ్యాయంలో అలాంటి మార్పే సూచించబడింది.

2 యెషయా మాటలు 2,500 సంవత్సరాల క్రితం నెరవేరాయి. అయితే, యెషయా 47:8 లో వ్రాయబడివున్న మాటలు ప్రకటన గ్రంథంలో ఎత్తివ్రాయబడి, అవి మళ్ళీ భవిష్యత్తులో నెరవేరుతాయని తెలియజేయబడింది. అక్కడ, “మహా బబులోను” అని పిలువబడుతున్న వేశ్యవంటి సంస్థ అయిన ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యపు అంతాన్ని గురించి బైబిలు ముందే తెలియజేస్తోంది. (ప్రకటన 16:​19) ప్రాచీన బబులోనులోనే అబద్ధమతం ప్రారంభమైంది గనుక ప్రపంచంలోని అబద్ధ మతాలకు “బబులోను” అనే పేరునివ్వడం సబబే. అక్కడి నుండి అది ప్రపంచ నలుమూలలకూ వ్యాపించింది. (ఆదికాండము 11:​1-9) బబులోనులో ఉత్పన్నమైన ఆత్మ అమర్త్యత, నరకాగ్ని, త్రిత్వదేవ ఆరాధన వంటి మతపరమైన సిద్ధాంతాలను క్రైస్తవమత సామ్రాజ్యంతో సహా దాదాపు అన్ని మతాలూ నమ్ముతున్నాయి. a మత భవిష్యత్తుపై యెషయా ప్రవచనం ఏమైనా వెలుగును ప్రసరింపజేస్తోందా?

బబులోను మంటికి ఈడ్చబడింది

3. బబులోను ప్రపంచాధిపత్య గొప్పతనాన్ని వర్ణించండి.

3 కదిలింపజేసే ఈ దైవిక ప్రకటనను వినండి: “కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము. కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము. నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు.” (యెషయా 47: 1) బబులోను ప్రబలమైన ప్రపంచాధిపత్యంగా సంవత్సరాలపాటు సింహాసనాన్ని అధిష్ఠించింది. అది “రాజ్యములకు భూషణము”గా, ప్రవర్థమానం చెందుతున్న మత, వాణిజ్య, సైనిక కేంద్రంగా ఉంది. (యెషయా 13:​19) బబులోను అత్యుచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు, దాని సామ్రాజ్యం దక్షిణంవైపుగా ఐగుప్తు సరిహద్దు వరకు విస్తరించింది. అది సా.శ.పూ. 607 లో యెరూషలేమును జయించినప్పుడు, దేవుడు సహితం అది సాధిస్తున్న విజయాలను ఆపలేకపోతున్నాడన్నట్లు అన్పించవచ్చు! అందుకే, అది తనను తాను “కన్యక”గా అంటే, ఎన్నడూ విదేశీ దాడిని ఎదుర్కోనిదానిగా దృష్టించుకుంటుంది. b

4. బబులోను ఏమి అనుభవిస్తుంది?

4 అయితే, అహంకారియైన ఈ “కన్యక,” తిరుగులేని ప్రపంచ శక్తిగా తన సింహాసనంపై నుండి పడద్రోయబడి, అవమానకరంగా ‘మంటిలో కూర్చోబెట్టబడుతుంది.’ (యెషయా 26: 5) అది అతిగారాభం చేయబడిన రాణిలా ‘మృదువైనదిగా, సుకుమారిగా’ ఇక ఎంతమాత్రం పరిగణింపబడదు. అందుకే యెహోవా ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు: “తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము. నీ ముసుకు పారవేయుము. కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము. కాలిమీది బట్ట తీసి, నదులు దాటుము.” (యిషయా 47: 2) మొత్తం యూదా జనాంగాన్ని బానిసలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు బబులోనే స్వయంగా బానిసగా వ్యవహరించబడుతోంది! దాన్ని దాని స్థానం నుండి తొలగించివేసే మాదీయులు, పారసీకులు అది తమ కోసం అవమానకరమైన విధంగా కూలిపని చేసేలా బలవంతం చేస్తారు.

5. (ఎ) బబులోను ‘ముసుగు, కాలిమీద జీరాడే వస్త్రము’ ఎలా తీసివేయబడతాయి? (బి) “నదులు దాటుము” అని దానికి ఇవ్వబడిన ఆజ్ఞ దేన్ని సూచిస్తుండవచ్చు?

5 ఆ విధంగా బబులోను తనకు మునుపు ఉండిన గొప్పతనము, ఘనతల ప్రతి ఛాయనూ పోగొట్టుకొని, ‘ముసుగును, కాలిమీద జీరాడు వస్త్రమును’ కోల్పోతుంది. “నదులు దాటుము” అని దాని కార్యనియామకులు దానికి ఆజ్ఞాపిస్తారు. బహుశా కొంతమంది బబులోనీయులు బానిసల్లా కూలిపని చేయమని ఆజ్ఞాపించబడవచ్చు. లేదా చెరకు తీసుకొనిపోతుండగా కొంతమంది అక్షరార్థంగా నదుల వెంబడి లాక్కు వెళ్ళబడతారన్నది ప్రవచన భావం కావచ్చు. ఏదేమైనప్పటికీ, బబులోను ఇక ఎన్నడూ నీటి ప్రవాహాల వెంబడి గుఱ్ఱపు బగ్గీలో ప్రయాణించే లేదా పల్లకీలో మోసుకు వెళ్ళబడే రాణీలా ఘనమైన విధంగా ప్రయాణించదు. బదులుగా, ఆమె నదిని దాటడానికి కాళ్ళు కనిపించేలా తన కాలిమీద జీరాడే వస్త్రాన్ని పైకెత్తి, మంచీ మర్యాదా వదిలివేయవలసిన బానిసలా ఉంటుంది. ఎంత అవమానకరం!

6. (ఎ) బబులోను దిగంబరత్వం ఏ భావంలో బయలుపరచబడుతుంది? (బి) దేవుడు ఎలా ‘నరులను మన్నింపడు’? (అధస్సూచి చూడండి.)

6 యెహోవా ఎత్తిపొడుపును ఇంకా ఇలా కొనసాగింపజేస్తున్నాడు: “నీ కోకయు తీసివేయబడును. నీకు కలిగిన యవమానము వెల్లడియగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను.” (యెషయా 47: 3) c అవును, బబులోను అవమానింపబడుతుంది, అప్రతిష్ఠ పాలవుతుంది. అది దేవుని ప్రజలపట్ల చూపిస్తున్న దుష్టత్వం, క్రూరత్వం బహిరంగంగా వెల్లడిచేయబడతాయి. దేవుని ఉగ్రతను ఏ మానవుడూ ఆపలేడు!

7. (ఎ) బబులోను పతనాన్ని గూర్చిన వార్తకు చెరలో ఉన్న యూదులు ఎలా ప్రతిస్పందిస్తారు? (బి) యెహోవా తన ప్రజలను ఏ విధంగా విమోచిస్తాడు?

7 దేవుని ప్రజలు70 సంవత్సరాలపాటు శక్తివంతమైన బబులోను చెరలో ఉన్న తర్వాత, దాని పతనాన్ని బట్టి ఎంతో ఆనందిస్తారు. వారు ఎలుగెత్తి ఇలా చెబుతారు: “సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు.” (యెషయా 47: 4) మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఒక ఇశ్రాయేలీయుడు తన అప్పులను తీర్చడానికి తనను తాను బానిసగా అమ్ముకుంటే, ఒక విమోచకుడు (రక్త సంబంధి) అతడిని బానిసత్వంలో నుండి తిరిగి కొనగలుగుతాడు, లేదా విమోచించగలుగుతాడు. (లేవీయకాండము 25:​47-54) యూదులు బబులోనుకు బంధీలుగా అమ్మివేయబడతారు గనుక, వారు తిరిగి కొనబడాలి లేదా విడుదల చేయబడాలి. సాధారణంగా ఒక రాజ్యం మరో రాజ్యంపై విజయం పొందిందంటే ఆ రాజ్యంలోని బానిసలకు, యజమానులు మారడం తప్ప మరేమీ కాదు. కానీ విజయం సాధిస్తున్న కోరెషు యూదులను బానిసత్వం నుండి విడుదల చేసేలా యెహోవా ఆయనను ప్రేరేపిస్తాడు. యూదులకు బదులుగా ఐగుప్తు, ఇతియోపియా, సెబాలు కోరెషుకు “ప్రాణరక్షణ క్రయముగా” ఇవ్వబడతాయి. (యెషయా 43: 3) సముచితంగానే, ఇశ్రాయేలు విమోచకుడు ‘సైన్యములకధిపతియగు యెహోవా’ అని పిలువబడుతున్నాడు. బలమైనదిగా కనిపిస్తున్న బబులోను సైనిక శక్తి, యెహోవా అదృశ్య దేవదూతల సమూహములతో పోలిస్తే ఎంతో అల్పమైనది.

క్రూరత్వం ఖరీదు

8. బబులోను ఏ భావంలో ‘చీకటిలోనికి పోతుంది’?

8 బబులోనును గూర్చిన తన ప్రవచనార్థక అధిక్షేపణను యెహోవా ఇలా కొనసాగిస్తున్నాడు: “కల్దీయుల కుమారీ, మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము; రాజ్యములకు దొరసానియని యికమీదట జనులు నిన్నుగూర్చి చెప్పరు.” (యెషయా 47: 5) బబులోనుకు చీకటి, విషాదం తప్ప ఇక ఏమీ మిగలవు. అది ఇక ఎన్నడూ క్రూరమైన దొరసానిలా ఇతర రాజ్యములపై ఆధిపత్యం వహించలేదు.​—⁠యెషయా 14:​3, 4.

9. యెహోవా యూదులపై ఎందుకు కోపగించుకుంటాడు?

9 అసలు, దేవుని ప్రజలకు హాని చేయడానికి బబులోనుకు ఎందుకు అనుమతి ఇవ్వబడింది? యెహోవా ఇలా వివరిస్తున్నాడు: “నా జనులమీద కోపపడి, నా స్వాస్థ్యము నపవిత్రపరచి, వారిని నీ చేతికి అప్పగించితిని.” (యెషయా 47: 6) యెహోవా యూదులపై కోపగించుకోవడానికి తగిన కారణమే ఉంది. తన ధర్మశాస్త్రమునకు అవిధేయత చూపిస్తే వారు దేశంలో నుండి వెళ్ళగొట్టబడతారని ఆయన మునుపు వారిని హెచ్చరించాడు. (ద్వితీయోపదేశకాండము 28:​64) వారు విగ్రహారాధనలో, లైంగిక దుర్నీతిలో పడిపోయినప్పుడు, వారిని తిరిగి స్వచ్ఛారాధనలో పునఃస్థాపించడానికి యెహోవా ప్రేమపూర్వకంగా ప్రవక్తలను పంపించాడు. కానీ “వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.” (2 దినవృత్తాంతములు 36:​16) కాబట్టి బబులోను యూదాను ఆక్రమించి ఆయన పరిశుద్ధ ఆలయాన్ని అపవిత్రపరచినప్పుడు దేవుడు తన స్వాస్థ్యమైన యూదా అపవిత్రపరచబడడానికి అనుమతిస్తాడు.​—⁠కీర్తన 79: 1; యెహెజ్కేలు 24:​21.

10, 11. బబులోను తన ప్రజలను జయించాలన్నది యెహోవా చిత్తమే అయినప్పటికీ, ఆయనకు దానిపై ఎందుకు కోపం వస్తుంది?

10 దాని దృష్ట్యా, మరి బబులోను యూదులను బానిసలుగా చేసుకున్నప్పుడు అది కేవలం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మాత్రమే కాదా? కాదు, ఎందుకంటే దేవుడిలా చెబుతున్నాడు: ‘నీవు వారియందు కనికరపడక, వృద్ధులమీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలమేమవునో [“అంతము ఎట్లుండునో, NW] మనస్సునకు తెచ్చుకొనకపోతివి.’ (యెషయా 47:6బి, 7) “పెద్దలమీద” కూడా దయ చూపించకుండా క్రూరాతి క్రూరంగా వ్యవహరించమని దేవుడు బబులోనుకు ఆజ్ఞాపించలేదు. (విలాపవాక్యములు 4:​16; 5:​12) తమవద్ద బంధీలుగా ఉన్న యూదులను ఎగతాళి చేస్తూ పైశాచికానందాన్ని పొందమనీ ఆయన వారికి చెప్పలేదు.​—⁠కీర్తన 137: 3.

11 యూదులపై తనకున్న ఆధిపత్యం కేవలం తాత్కాలికమైనదని బబులోను గ్రహించదు. తగిన కాలంలో యెహోవా తన ప్రజలను విడుదల చేస్తాడని యెషయా ఇచ్చిన హెచ్చరికలను అది నిర్లక్ష్యం చేసింది. అది తాను యూదులపై శాశ్వత ఆధిపత్యాన్ని వహించే హక్కు, తన సామంత రాజ్యాలపై తాను నిత్యం దొరసానిగా ఉండే హక్కు తనకున్నట్లు ప్రవర్తిస్తుంది. అణచివేసే తన పరిపాలనకు “అంతము” ఉంటుందనే సందేశాన్ని లక్ష్యపెట్టడంలో అది విఫలమవుతుంది!

బబులోను పతనం ప్రవచించబడింది

12. బబులోను ‘సుఖాసక్తురాలు’ అని ఎందుకు పిలువబడుతుంది?

12 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు​—⁠నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరును లేరు, నేను విధవరాలనై కూర్చుండను. పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము.” (యెషయా 47: 8) బబులోను సుఖాసక్తి గలదన్నది సర్వవిధితమే. సా.శ.పూ. ఐదవ శతాబ్దపు చరిత్రకారుడైన హెరొడోటస్‌ బబులోనీయులకున్న “అత్యంత సిగ్గుకరమైన ఆచారాన్ని” గురించి చెబుతున్నాడు, అదేమిటంటే స్త్రీలందరూ తమ ప్రేమ దేవత పట్ల భక్తిపూర్వకంగా వ్యభిచారం చేయాలి. అలాగే ప్రాచీన చరిత్రకారుడైన కర్టియస్‌ కూడా ఇలా అన్నాడు: “నగరంలో అనైతికత అడ్డూ అదుపు లేకుండా విస్తరించి ఉంది; అసహ్యమైన, నీచమైన అలవాట్లను వృద్ధి చేసుకోవడానికి అంతకంటే ఎక్కువ ప్రేరణలు, ఆకర్షణలు అవసరం లేదు.”

13. సుఖాసక్తి పట్ల బబులోనుకున్న మోజు దాని పతనాన్ని ఎలా త్వరపెడుతుంది?

13 సుఖాసక్తి పట్ల బబులోనుకున్న మోజు దాని పతనాన్ని త్వరపెడుతుంది. దాని పతనానికి ముందు, దాని రాజు, అతని అధిపతులు విందు చేసుకుంటూ మత్తెక్కే వరకూ తాగుతుంటారు. కాబట్టి వాళ్ళు నగరంపై దాడి చేయడానికి వస్తున్న మాదీయ-పారసీక సైన్యాలను పట్టించుకోరు. (దానియేలు 5: 1-4) బబులోను ‘నిర్భయముగా నివసిస్తూ,’ దుర్భేధ్యమైనవిగా అనిపిస్తున్న గోడలు, కందకము తనపై దాడి జరుగకుండా కాపాడగలవని అనుకుంటుంది. తానున్న ఉన్నత స్థానాన్ని ఆక్రమించుకోగలవారు తాను “తప్ప మరి ఎవరును లేరు” అని తనకు తాను చెప్పుకుంటుంది. తాను తన ‘పుత్రులను’ లేదా జనాన్ని, అలాగే తన సామ్రాజ్యాధిపతిని పోగొట్టుకుని ‘విధవరాలిని’ కాగలనని అది అనుకోదు. అయినప్పటికీ, ప్రతీకారం చేయబోతున్న యెహోవా దేవుని హస్తము నుండి ఏ గోడా దాన్ని కాపాడలేదు! యెహోవా ఆ తర్వాత ఇలా చెబుతాడు: “బబులోను తన బలమైన ఉన్నతస్థలములను దుర్గములుగా చేసికొని ఆకాశమునకు ఎక్కినను, పాడుచేయువారు నాయొద్దనుండి వచ్చి దానిమీద పడుదురు.”​—⁠యిర్మీయా 51:​53.

14. బబులోను “పుత్రశోకమును వైధవ్యమును” రెండింటినీ ఎలా అనుభవిస్తుంది?

14 బబులోనుకు ఏమవుతుంది? యెహోవా ఇలా కొనసాగిస్తున్నాడు: “ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసికొనినను, ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును.” (యెషయా 47: 9) అవును ప్రపంచ శక్తిగా బబులోను ఆధిపత్యం హఠాత్తుగా ముగింపుకు వస్తుంది. ప్రాచీన తూర్పు దేశాల్లో, విధవరాలు కావడం, పిల్లలను పోగొట్టుకోవడం ఒక స్త్రీకి సంభవించగల అత్యంత విపత్కరమైన అనుభవాలు. బబులోను తాను పతనమైన నాటి రాత్రి ఎంతమంది ‘పుత్రులను’ కోల్పోయిందో మనకు తెలియదు. d అయితే, తగిన సమయంలో, ఆ నగరం పూర్తిగా విడువబడుతుంది. (యిర్మీయా 51:​29) దాని రాజులు సింహాసన భ్రష్టులుగా చేయబడడంతో అది వైధవ్యాన్ని కూడా అనుభవిస్తుంది.

15. బబులోనీయులు యూదుల పట్ల క్రూరంగా వ్యవహరించినందుకే గాక, యెహోవా మరే ఇతర కారణాన్ని బట్టి దానిపట్ల ఆగ్రహంతో ఉన్నాడు?

15 అయితే యెహోవా ఆగ్రహానికి కారణం, బబులోను యూదులతో సరిగ్గా వ్యవహరించకపోవడం మాత్రమే కాదు. దాని ‘అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములు’ కూడా ఆయనకు ఆగ్రహం తెప్పిస్తాయి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం అభిచారసంబంధమైన ఆచారాలను ఖండిస్తుంది; కానీ బబులోను అతీంద్రియ శక్తులనే అత్యధికంగా ఆశ్రయిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 18:​10-12; యెహెజ్కేలు 21:​21) అష్షూరీయుల, బబులోనీయుల సామాజిక జీవనం (ఆంగ్లం) అనే పుస్తకం, బబులోనీయుల జీవితాలు “తమను చుట్టుముట్టి ఉన్నాయని వారు నమ్ముతున్న అసంఖ్యాకమైన దయ్యాలను గురించిన నిరంతర భయంతోనే గడిచిపోయాయి” అని చెబుతోంది.

చెడుతనాన్ని నమ్ముకోవడం

16, 17. (ఎ) బబులోను ఎలా తన ‘చెడుతనమును ఆధారము’ చేసుకొంటుంది? (బి) బబులోను అంతం ఎందుకు ఆపబడలేనిది?

16 బబులోను భవిష్యకారులు దాన్ని రక్షించగలరా? యెహోవా ఇలా సమాధానం ఇస్తున్నాడు: “నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని, యెవడును నన్ను చూడడని అనుకొంటివి​—⁠నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవనుకొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను.” (యెషయా 47:​10) బబులోను తన లౌకికపరమైన, మతపరమైన జ్ఞానమును బట్టి, తన సైనిక శక్తిని బట్టి, కుయుక్తితో కూడిన తన క్రూరత్వాన్ని బట్టి, ప్రపంచాధిపత్యంగా తాను తన స్థానాన్ని కాపాడుకోగలనని అనుకుంటుంది. తనను ఎవరూ ‘చూడలేరని’ అంటే తన దుష్టకార్యాలకు తనను ఎవరూ జవాబు అడగరని అది భావిస్తుంది. దరిదాపుల్లో తనకు పోటీదారులు ఎవరైనా ఉన్నట్లు కూడా అది గ్రహించదు. “నేను తప్ప మరి ఎవరును లేరని” అది తనకు తాను చెప్పుకుంటుంది.

17 అయితే, తన ప్రవక్తల్లో మరొకరి ద్వారా యెహోవా ఇలా హెచ్చరిస్తున్నాడు: “నాకు కనబడకుండ రహస్యస్థలములలో దాగగలవాడెవడైనకలడా?” (యిర్మీయా 23:​24; హెబ్రీయులు 4:​13) కాబట్టి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “కీడు నీమీదికి వచ్చును; నీవు మంత్రించి దాని పోగొట్టజాలవు. ఆ కీడు నీమీద పడును; దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును.” (యెషయా 47:​11) రాబోయే విపత్తును అంటే బబులోను ఇంతకు మునుపెన్నడూ అనుభవించనటువంటి విపత్తును దాని దేవుళ్ళు గానీ, మంత్రగాళ్ళు వేసే ‘మంత్రాలు’ గానీ ఆపలేవు!

బబులోను సలహాదారులు విఫలులవుతారు

18, 19. బబులోను తన సలహాదారులపై ఆధారపడడం ఎలా నాశనకరమైనదిగా పరిణమిస్తుంది?

18 గాయపరిచే ఎత్తిపొడుపుతో యెహోవా ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు: “నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము; ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో.” (యిషయా 47:​12) బబులోను ‘నిలువమని’ లేదా మంత్రతంత్రాలను నమ్ముకోవడంలో మారకుండా అలాగే ఉండమని సవాలు చేయబడుతోంది. ఎంతైనా ఒక జనముగా అది తన “బాల్యము” నుండి తన అతీంద్రియ శక్తులను వృద్ధి చేసుకోవడానికి కృషి చేసింది కదా.

19 కానీ ఇలా అంటూ యెహోవా దాన్ని అపహసిస్తున్నాడు: ‘నీ విస్తారమైన యోచనల [“సలహాదారుల,” ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌] వలన నీవు అలసియున్నావు. జ్యోతిష్కులు [“ఆకాశములను ఆరాధించేవారు,” NW] నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.’ (యెషయా 47:​13) e బబులోను సలహాదారులు ఘోరంగా విఫలమౌతారు. నిజమే, బబులోను జ్యోతిశ్శాస్త్రం వృద్ధి కావడానికి శతాబ్దాల జ్యోతిశ్శాస్త్ర పరిశీలన అవసరమై ఉండవచ్చు. కానీ అది పతనమైన రాత్రి, దాని జ్యోతిష్కుల దయనీయమైన వైఫల్యం, సోదె చెప్పడంగానీ చెప్పించుకోవడంగానీ నిష్ప్రయోజనకరమైనదని బయలుపరుస్తుంది.​—⁠దానియేలు 5: 7, 8.

20. బబులోను సలహాదారులకు ఎలాంటి గతి పడుతుంది?

20 యెహోవా ఇలా చెబుతూ ప్రవచనంలోని ఈ భాగాన్ని ముగిస్తున్నాడు: “వారు కొయ్యకాలువలెనైరి. అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొనలేక యున్నారు. అది కాచుకొనుటకు నిప్పుకాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితివో వారికి ఆలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు. నిన్ను రక్షించువాడొకడైన నుండడు.” (యెషయా 47:​14, 15) అవును, ఈ అబద్ధ సలహాదారులపైకి తీవ్రమైన కాలాలు రాబోతున్నాయి. అది, ప్రజలు దాని చుట్టూ కూర్చుని చలి కాచుకోదగిన వెచ్చని మంట కాదు గాని అబద్ధ సలహాదారులను నిరుపయోగమైన కొయ్యకాలుగా బయలుపరిచే నాశనకరమైన, దహించివేసే అగ్ని. కాబట్టి, బబులోను ఉపదేశకులు భయంతో పారిపోతారంటే అందులో ఆశ్చర్యం లేదు! బబులోను చివరి మద్దతు కూడా పోవడంతో, దాన్ని రక్షించే వారెవరూ ఉండరు. యెరూషలేము మీదికి అది తీసుకువచ్చినటువంటి విపత్తే దానిపైకి కూడా వస్తుంది.​—⁠యిర్మీయా 11:​12.

21. యెషయా ప్రవచనార్థక మాటలు ఎప్పుడు, ఎలా నిజమవుతాయి?

21 సా.శ.పూ. 539 వ సంవత్సరంలో ఈ ప్రేరేపిత మాటలు నెరవేరడం ప్రారంభమవుతుంది. కోరెషు నాయకత్వం క్రింద మాదీయ, పారసీక సైన్యాలు బబులోనులో నివాసముండి దాన్ని పరిపాలిస్తున్న బెల్షస్సరు రాజును చంపి నగరాన్ని ఆక్రమిస్తాయి. (దానియేలు 5:​1-4, 30) బబులోను ఒక్క రాత్రిలోనే తన ప్రపంచాధిపత్యపు స్థితి నుండి పడద్రోయబడుతుంది. అలా, శతాబ్దాలపాటు సాగిన సెమిటిక్‌ ఆధిపత్యం ముగిసి, ఇప్పుడిక ప్రపంచం ఆర్యుల ఆధిపత్యం క్రిందకు వస్తుంది. బబులోను శతాబ్దాల తరబడి క్షీణదశకు దిగజారుతుంది. సా.శ. నాలుగవ శతాబ్దం నాటికల్లా, అది “కసువు దిబ్బలు”గా మిగులుతుంది. (యిర్మీయా 51:​37) అలా యెషయా ప్రవచనం సంపూర్ణంగా నెరవేరుతుంది.

ఆధునిక దిన బబులోను

22. బబులోను పతనం గర్వాన్ని గూర్చి మనకు ఏ పాఠాన్ని బోధిస్తుంది?

22 యెషయా ప్రవచనం మెదడుకు మేత పెడుతుంది. ఒక విషయమేమిటంటే, అది గర్వాహంకారాల ప్రమాదాలను నొక్కి తెలియజేస్తుంది. గర్విష్ఠియైన బబులోను పతనం, “నాశనమునకు ముందు గర్వము నడచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును” అనే బైబిలు సామెతను సోదాహరణంగా చెబుతుంది. (సామెతలు 16:​18) కొన్నిసార్లు గర్వం మన అపరిపూర్ణ నైజాన్ని అదుపు చేస్తుంది, కానీ ‘గర్వాంధులై’ ఉండడం ‘నిందపాలై అపవాది ఉరిలో పడిపోయేలా’ చేయగలదు. (1 తిమోతి 3:​6, 7) కాబట్టి మనం, యాకోబు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని లక్ష్యపెట్టడం మంచిది: “ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును.”​—⁠యాకోబు 4:​10.

23. యెషయా ప్రవచనం మనం ఏ నమ్మకాన్ని కలిగి ఉండడానికి సహాయం చేస్తుంది?

23 తన వ్యతిరేకులందరికంటే ఎంతో శక్తిమంతుడైన యెహోవా యందు నమ్మకం కలిగి ఉండడానికి కూడా ఈ ప్రవచనార్థక మాటలు మనకు సహాయం చేస్తాయి. (కీర్తన 24: 8; 34: 7; 50:​15; 91:​14, 15) ఈ కష్టతరమైన కాలాల్లో ఇది ఓదార్పునిచ్చే జ్ఞాపిక. ‘నిర్దోషుల భవిష్యత్తు సమాధానకరముగా ఉండును’ అని తెలుసుకొని ఆయన దృష్టికి నిర్దోషులమై ఉండాలనే మన నిశ్చయతను యెహోవాయందు మనకున్న నమ్మకం బలపరుస్తుంది. (కీర్తన 37:​37, 38, NW) సాతాను “తంత్రములను” ఎదుర్కునేటప్పుడు మనం మన స్వంత శక్తిపై ఆధారపడకుండా యెహోవా సహాయం కోసం చూడడం ఎల్లప్పుడూ జ్ఞానయుక్తమైనది.​—⁠ఎఫెసీయులు 6:10-13.

24, 25. (ఎ) జ్యోతిశ్శాస్త్రం ఎందుకు అసమంజసమైనది, అయినా అనేకులు దానివైపుకు ఎందుకు తిరుగుతారు? (బి) క్రైస్తవులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండడానికి గల కొన్ని కారణాలు ఏవి?

24 గమనించదగిన విషయమేమిటంటే, అభిచార సంబంధమైన ఆచారాల గురించి ప్రాముఖ్యంగా జ్యోతిష్యం గురించి మనకు హెచ్చరిక ఇవ్వబడుతోంది. (గలతీయులు 5:​20, 21) బబులోను పతనమప్పుడు, జ్యోతిశ్శాస్త్రం ప్రజలపై కలిగి ఉన్న పట్టును కోల్పోలేదు. ఆసక్తిదాయకంగా, బబులోనీయులు ఏర్పరచుకున్న నక్షత్రమండలాలు ప్రాచీన కాలంనాటి వాటి స్థానాన్నుండి “కదిలిపోయి,” ‘మొత్తం [జ్యోతిశ్శాస్త్ర] తలంపునే ఒక మూర్ఖత్వంలా చేశాయి’ అని గ్రేట్‌ సిటీస్‌ ఆఫ్‌ ది యేన్షియంట్‌ వరల్డ్‌ అనే పుస్తకం పేర్కొంటోంది. అయినప్పటికీ, జ్యోతిశ్శాస్త్రం వర్ధిల్లుతూనే ఉంది, చాలా వార్తాపత్రికలు తమ పాఠకులకు జాతకచక్రాలను అందుబాటులో ఉంచుతూనే ఉన్నాయి.

25 చాలామంది ప్రజలు​—⁠వారిలో అనేకులు విద్యావంతులు​—⁠నక్షత్రాలను సంప్రదించడానికి లేదా ఇతర విధాలైన అసమంజసమైన మూఢాచారాలను నమ్ముకొనేలా చేసేదేమిటి? ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “ప్రజలు ఒకరికొకరు భయపడుతూ, భవిష్యత్తు గురించి అనిశ్చయతలు కలిగి ఉన్నంతవరకూ మూఢనమ్మకాలు ప్రజల జీవితాల్లో ఒక భాగంగానే ఉంటాయి.” భయం, అనిశ్చయత ప్రజలు మూఢనమ్మకాలు గలవారయ్యేలా చేస్తాయి. అయితే క్రైస్తవులు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటారు. వాళ్లు మనుష్యులకు భయపడరు​—⁠యెహోవాయే వారి ఆశ్రయం. (కీర్తన 6:​4-10) వారు భవిష్యత్తు గురించి అనిశ్చయంగా లేరు; బయలుపరచబడిన యెహోవా సంకల్పాల గురించి వారికి తెలుసు, “యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును” అన్నదానిలో వారికి ఎటువంటి సందేహమూ లేదు. (కీర్తన 33:​11) మన జీవితాలను యెహోవా ఆలోచనకు అనుగుణంగా మలచుకోవడం ఆనందభరితమైన, ధీర్ఘకాల భవిష్యత్తుకు హామీ ఇస్తుంది.

26. ‘జ్ఞానుల యోచనలు వ్యర్థమైనవని’ ఎలా నిరూపించబడ్డాయి?

26 ఇటీవలి కాలాల్లో కొంతమంది భవిష్యత్తును మరింత “వైజ్ఞానికపరమైన” విధానాల్లో గ్రహించడానికి ప్రయత్నించారు. “ప్రస్తుత ధోరణుల ఆధారంగా భవిష్యద్‌ సాధ్యతలతో వ్యవహరించే ఒక అధ్యయనం” అని నిర్వచించబడిన భవిష్య శాస్త్రమనే ఒక విభాగం కూడా ఉంది. ఉదాహరణకు, 1972 లో క్లబ్‌ ఆఫ్‌ రోమ్‌ అని పిలువబడే, కొంతమంది విద్యావేత్తలు, వ్యాపారస్థుల బృందమొకటి, 1992 నాటికల్లా ప్రపంచంలోని బంగారము, పాదరసము, తుత్తునాగము, పెట్రోలియం నిల్వలు ఖాళీ అయిపోతాయని ప్రవచించింది. అయితే ప్రపంచం 1972 నుండి భయంకరమైన సమస్యలను ఎదుర్కొంది గానీ ఆ ప్రవచనం మాత్రం అన్ని విధాలా తప్పని తేలింది. భూమిలో బంగారము, పాదరసము, తుత్తునాగము, పెట్రోలియం నిల్వలు ఇప్పటికీ ఉన్నాయి. వాస్తవానికి, భవిష్యత్తు గురించి ప్రవచించడానికి ప్రయత్నిస్తూ మానవుడు తనను తాను ఎంతో కష్టపెట్టుకున్నాడు గానీ అతడి అంచనాలు ఎప్పుడూ అవిశ్వసనీయమైనవే. నిజంగా, ‘జ్ఞానుల యోచనలు వ్యర్థమైనవే.’​—⁠1 కొరింథీయులు 3:20.

మహా బబులోనుకు రానున్న అంతం

27. బబులోను సా.శ.పూ. 539 లో ఎదుర్కొన్నటువంటి పతనాన్ని మహా బబులోను ఎప్పుడు, ఏ విధంగా ఎదుర్కొన్నది?

27 ప్రాచీన బబులోనులోని అనేక సిద్ధాంతాలను ఆధునిక దిన మతాలు అంతరించిపోకుండా చేశాయి. అందుకే, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం సరిగ్గానే మహా బబులోను అని పిలువబడుతోంది. (ప్రకటన 17: 5) సా.శ.పూ. 539 లో ప్రాచీన బబులోను ఎదుర్కొన్నటువంటి పతనాన్నే, ఆ అంతర్జాతీయ మతాల కూటమి ఇప్పటికే ఎదుర్కొన్నది. (ప్రకటన 14: 8; 18: 2) క్రీస్తు సహోదరుల శేషము 1919 లో ఆధ్యాత్మిక చెర నుండి బయటికి వచ్చి, మహా బబులోను యొక్క ప్రధాన భాగమైన క్రైస్తవమత సామ్రాజ్య ప్రభావాన్నుండి తెగతెంపులు చేసుకుంది. మునుపు క్రైస్తవమత సామ్రాజ్య ప్రభావం అధికంగా ఉండిన అనేక దేశాల్లో, అప్పటి నుండి దాని ప్రభావం చాలా మేరకు తగ్గిపోయింది.

28. మహా బబులోను ఏమని ప్రగల్భాలు పలుకుతోంది, కానీ దాని కోసం ఏమి వేచి ఉంది?

28 అయితే, ఆ పతనం అబద్ధ మతం అనుభవించనున్న తుది నాశనానికి కేవలం ఆగమనసూచన మాత్రమే. ఆసక్తిదాయకంగా, మహా బబులోను నాశనాన్ని గురించిన ప్రకటన గ్రంథంలోని ప్రవచనం మనకు యెషయా 47:8, 9 లో వ్రాయబడివున్న ప్రవచనార్థక మాటలను గుర్తు చేస్తుంది. ప్రాచీన బబులోనులాగే, ఆధునిక దిన మహా బబులోను “నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని” చెబుతుంది. కానీ “ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును.” కాబట్టి యెషయా 47 వ అధ్యాయంలో వ్రాయబడివున్న ప్రవచనార్థక మాటలు, అబద్ధ మతంతో ఇంకా సంబంధం కలిగివున్న వారికి ఒక హెచ్చరికగా నిలుస్తాయి. వారు దానితోపాటు నాశనం కాకుండా తప్పించుకోవాలనుకుంటే, “దానిని విడిచి రండి” అనే ప్రేరేపిత ఆజ్ఞను పాటించాలి.​—⁠ప్రకటన 18:​4, 7, 8.

[అధస్సూచీలు]

a అబద్ధమత సిద్ధాంతాల వృద్ధిని గూర్చిన సవివరమైన సమాచారం కోసం, వాచ్‌టవర్‌ సంస్థ ప్రచురించిన దేవుని కోసం మానవాళి అన్వేషణ (ఆంగ్లం) అనే పుస్తకాన్ని చూడండి.

b హీబ్రూలో “కన్యకయైన బబులోను” అన్నది బబులోనును లేదా బబులోను నివాసులను సూచించే జాతీయం. అది ప్రపంచాధిపత్యం అయినప్పటి నుండీ ఏ వీరయోధుడూ దాన్ని కొల్లగొట్టలేదు గనుక అది “కన్యక.”

c “నరులను మన్నింపను” అని అనువదించబడిన హీబ్రూ పదబంధాన్ని, అనువదించడానికి “ఎంతో కష్టమైన పదబంధం” అని పండితులు వర్ణించారు. నూతన లోక అనువాదము దాన్ని ‘నేను ఏ మానవుడిపట్ల దయ చూపించను’ అని అనువదించింది. బయటి వారెవరూ బబులోనును కాపాడడానికి అనుమతించబడరనే తలంపును తెలియజేయడానికి “దయ” అనే పదాన్ని అది పొందుపరచింది. జ్యూయిష్‌ పబ్లికేషన్‌ సొసైటీ చేసిన అనువాదం ఇలా ఉంది: “ఏ మానవుడూ మధ్యవర్తిత్వం నెరపడానికి . . . నేను అనుమతించను.”

d బబులోనుపై దాడిచేస్తున్నవారు “యుద్ధం చేయకుండానే” నగరంలోకి ప్రవేశించారని నెబోనీడస్‌ వృత్తాంతం చెబుతుంటే, చాలా రక్తపాతం జరిగి ఉండవచ్చునని గ్రీకు చరిత్రకారుడైన క్సెనోఫోన్‌ సూచిస్తున్నాడని రేమండ్‌ ఫిలిప్‌ డాట్రీ వ్రాసిన నెబోనీడస్‌ అండ్‌ బెల్షాజ్జర్‌ అనే పుస్తకం పేర్కొంటోంది.

e “ఆకాశములను ఆరాధించేవారు” అని అనువదించబడిన హీబ్రూ పదబంధాన్ని కొందరు “ఆకాశములను విభాగించేవారు” అని అనువదిస్తారు. ఇది, జాతకచక్రములను తయారుచేయడానికి వీలుగా ఆకాశములను వివిధ భాగాలుగా విభజించే ఆచారాన్ని సూచిస్తుండవచ్చు.

[అధ్యయన ప్రశ్నలు]

[111 వ పేజీలోని చిత్రాలు]

సుఖాసక్తిగల బబులోను మంటికి ఈడ్చబడుతుంది

[114 వ పేజీలోని చిత్రం]

బబులోను జ్యోతిష్కులు దాని పతనాన్ని ప్రవచించలేకపోతారు

[116 వ పేజీలోని చిత్రం]

బబులోను జ్యోతిశ్శాస్త్ర క్యాలెండరు, సా.శ.పూ. మొదటి సహస్రాబ్ది

[119 వ పేజీలోని చిత్రం]

త్వరలోనే ఆధునిక దిన బబులోను ఇక ఉండదు