“ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి”!
పదమూడవ అధ్యాయం
“ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి”!
1. యెషయా 52 వ అధ్యాయంలోని ప్రవచనార్థక వాక్యాలు ఎందుకు ఆనందానికి మూలము, వాటికి ఏ రెండు నెరవేర్పులు ఉన్నాయి?
విడుదల! బంధీలుగా ఉన్న ప్రజలకు ఇంతకన్నా ఆనందభరితమైన నిరీక్షణ ఏదైనా ఉండగలదా? యెషయా గ్రంథంలో ఉన్న ప్రధాన ఇతివృత్తాల్లో ఒకటి విడుదల మరియు పునఃస్థాపన కాబట్టి, కీర్తనలలో కాక బైబిల్లోని మరే ఇతర పుస్తకంలో కన్నా ఈ గ్రంథంలోనే ఆనందం కలిగించే ప్రకటనలు ఎక్కువగా ఉన్నాయంటే దానిలో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు. ప్రాముఖ్యంగా యెషయా 52 వ అధ్యాయం దేవుని ప్రజలు ఆనందించడానికి గల కారణాన్ని తెలియజేస్తుంది. దానిలోని ప్రవచన వాక్యాలు సా.శ.పూ. 537 లో యెరూషలేముపై నెరవేరాయి. ఆ ప్రవచన వాక్యాలు, కొన్నిసార్లు తల్లి అనీ, భార్య అనీ వర్ణించబడిన ఆత్మప్రాణులతో కూడిన యెహోవా పరలోక సంస్థ అయిన “పైనున్న యెరూషలేము” విషయంలో అధికంగా నెరవేరుతాయి.—గలతీయులు 4:26; ప్రకటన 12: 1.
‘సీయోనూ, నీ బలము ధరించుకొనుము!’
2. సీయోను ఎప్పుడు మేల్కొన్నది, అదెలా జరిగింది?
2 యెహోవా యెషయా ద్వారా తన ప్రియ నగరమైన సీయోనును ఉద్దేశించి ఇలా అంటున్నాడు: “సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము! పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము! ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము, యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సీయోను కుమారీ, నీ మెడకట్లు విప్పివేసికొనుము.” (యెషయా 52:1, 2) యెరూషలేము నివాసులు యెహోవాకు కోపం తెప్పించారు గనుక, అది 70 సంవత్సరాలపాటు నిర్జనంగా విడువబడింది. (2 రాజులు 24: 4; 2 దినవృత్తాంతములు 36:15-21; యిర్మీయా 25:8-11; దానియేలు 9: 2) ఇప్పుడది తన సుదీర్ఘమైన అచేతనావస్థ నుండి మేల్కొని, స్వేచ్ఛ అనే సుందరమైన వస్త్రములను ధరించుకోవలసిన సమయం. యెరూషలేము యొక్క మునుపటి నివాసులూ వారి సంతానమూ బబులోనును వదలి, యెరూషలేముకు తిరిగివచ్చి, సత్యారాధనను పునఃస్థాపించగలిగేలా ‘సీయోను కుమారిని’ విడుదల చేసేందుకు యెహోవా కోరెషు హృదయాన్ని ప్రేరేపించాడు. సున్నతి పొందనివారు, అపవిత్రమైన వారు యెరూషలేములో కనిపించకూడదు.—ఎజ్రా 1:1-4.
3. అభిషిక్త క్రైస్తవుల సంఘాన్ని ‘సీయోను కుమారి’ అని ఎందుకు పిలువవచ్చు, వారు ఏ భావంలో విడుదలను పొందారు?
3 యెషయా వ్రాసిన ఆ మాటలు క్రైస్తవ సంఘం విషయంలో కూడా నెరవేరుతున్నాయి. “పైనున్న యెరూషలేము” అభిషిక్త క్రైస్తవులకు తల్లి గనుక వారి సంఘాన్ని ఆధునిక దిన ‘సీయోను కుమారి’ అని వర్ణించవచ్చు. a అభిషిక్తులు అన్యమత బోధల నుండి, మతభ్రష్ట సిద్ధాంతాల నుండి విడుదల పొంది, శరీరమందు సున్నతి పొందడం ద్వారా కాదుగానీ హృదయాల్లో సున్నతి పొందడం ద్వారా యెహోవా ఎదుట పరిశుభ్రమైన స్థానాన్ని కాపాడుకోవాలి. (యిర్మీయా 31:33; రోమీయులు 2:25-29) దీనిలో, యెహోవా ఎదుట ఆధ్యాత్మిక, మానసిక, నైతిక పరిశుభ్రతను కాపాడుకోవడం ఇమిడి ఉంది.—1 కొరింథీయులు 7:19; ఎఫెసీయులు 2: 3.
4. “పైనున్న యెరూషలేము” యెహోవాకు ఎన్నడూ అవిధేయత చూపించకపోయినప్పటికీ, భూమిపైనున్న ఆమె ప్రతినిధులు అనుభవించిన ఏ అనుభవాలు ప్రాచీన యెరూషలేము నివాసుల అనుభవాలను ప్రతిబింబిస్తున్నాయి?
4 నిజమే, “పైనున్న యెరూషలేము” యెహోవాకు ఎన్నడూ అవిధేయత చూపించలేదు. అయితే, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, భూమిపైనున్న ఆమె ప్రతినిధులైన అభిషిక్త క్రైస్తవులు నిజమైన క్రైస్తవ తటస్థతను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినందున యెహోవా నియమాన్ని తెలియక ఉల్లంఘించారు. దైవానుగ్రహాన్ని కోల్పోయి, వారు ఆధ్యాత్మికంగా ప్రపంచ అబద్ధ మతసామ్రాజ్యమైన “మహా బబులోను” యొక్క చెరలోకి వెళ్ళిపోయారు. (ప్రకటన 17: 5) వాచ్‌టవర్ సొసైటి సిబ్బందిలోని ఎనిమిదిమంది సభ్యులు 1918 లో విద్రోహులనే ఆరోపణతో సహా ఇంకా ఇతర అబద్ధ ఆరోపణల మూలంగా జైలులో వేయబడినప్పుడు వారున్న ఈ స్థితి చరమాంకానికి చేరుకుంది. ఆ సమయంలో సంస్థీకృత సువార్త ప్రకటనాపని ఇంచుమించు పూర్తిగా నిలిపివేయబడింది. అయితే 1919 లో, ఆధ్యాత్మికంగా మేలుకొనమనే బూరధ్వనివంటి పిలుపు వెలువడింది. అభిషిక్త క్రైస్తవులు మహా బబులోను యొక్క నైతిక, ఆధ్యాత్మిక అపవిత్రత నుండి తమను తాము పూర్తిగా వేరు చేసుకోవడం మొదలుపెట్టారు. వారు చెర అనే ధూళి నుండి లేచారు, “పైనున్న యెరూషలేము” ఆధ్యాత్మిక అపవిత్రత అనుమతించబడని “పరిశుద్ధ పట్టణ”పు మహిమను పొందింది.
5. తన ప్రజలను బంధీలుగా తీసుకువెళ్ళినవారికి ఏ పరిహారమూ చెల్లించకుండానే వారిని విమోచించే సంపూర్ణ హక్కు యెహోవాకు ఎందుకు ఉంది?
5 యెహోవాకు, సా.శ.పూ. 537 లోనూ, సా.శ. 1919 లోనూ తన ప్రజలను విడుదల చేసేందుకు సంపూర్ణ హక్కు ఉండింది. యెషయా ఇలా వివరిస్తున్నాడు: “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—మీరు ఊరకయే అమ్మబడితిరి గదా, రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.” (యెషయా 52: 3) ప్రాచీన బబులోను గానీ, మహా బబులోను గానీ దేవుని నిబంధన ప్రజలను తమ బానిసలుగా తీసుకువెళ్ళినప్పుడు ఏమీ చెల్లించలేదు. డబ్బుకు సంబంధించిన ఏ లావాదేవీలు జరుగలేదు గనుక, యెహోవా ఇంకా తన ప్రజలకు చట్టబద్ధమైన యజమానియే. ఆయన ఎవరికైనా ఋణపడి ఉన్నట్లు భావించాలా? ఎంతమాత్రం లేదు. రెండు సందర్భాల్లోనూ, యెహోవా తన ఆరాధకులను బంధీలుగా తీసుకువెళ్ళినవారికి ఏ పరిహారమూ చెల్లించకుండానే వారిని న్యాయబద్ధంగా విమోచించగలడు.—యెషయా 45:13.
6. యెహోవా శత్రువులు, చరిత్ర నుండి ఏ పాఠాలు నేర్చుకోవడంలో విఫలమయ్యారు?
6 యెహోవా శత్రువులు, చరిత్ర నుండి ఏ పాఠాలూ నేర్చుకోలేదు. మనమిలా చదువుతాము: “దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచెను.” (యెషయా 52: 4) ఐగుప్తుకు అతిధులుగా ఆహ్వానింపబడిన ఇశ్రాయేలీయులను ఫరో తన బానిసలుగా చేసుకున్నాడు. కానీ యెహోవా ఫరోను, అతని సైన్యాన్ని ఎఱ్ఱ సముద్రములో ముంచివేశాడు. (నిర్గమకాండము 1:11-14; 14:27, 28) అష్షూరు రాజు అయిన సన్హెరీబు యెరూషలేముపై దాడి చేయబోయినప్పుడు, యెహోవా దూత రాజు సైనికుల్లో 1,85,000 మందిని మట్టుబెట్టాడు. (యెషయా 37:33-37) అలాగే, ప్రాచీన బబులోనుగానీ, మహా బబులోనుగానీ దేవుని ప్రజలను అణిచివేసినందుకు వచ్చే పర్యవసానాలను తప్పించుకోలేవు.
“నా జనులు నా నామము తెలిసికొందురు”
7. యెహోవా ప్రజలు బంధీలుగా వెళ్ళడం ఆయన నామముపై ఏ ప్రభావాన్ని చూపించింది?
7 ప్రవచనం చూపిస్తున్నట్లుగా, యెహోవా ప్రజలు చెరలో ఉన్నప్పటి స్థితి, ఆయన నామముపై ప్రభావాన్ని చూపించింది: “నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు. వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు, దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది, కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు, నా జనులు నా నామము తెలిసికొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలిసికొందురు.” (యెషయా 52:5, 6) ఈ పరిస్థితి పట్ల యెహోవాకు ఎలాంటి ఆసక్తి ఉంది? ఇశ్రాయేలు బబులోనులో బానిసగా ఉంటే ఆయన పట్టించుకోవల్సిన అవసరం ఏముంది? బబులోను యెహోవా ప్రజలను బంధీలుగా చేసుకొని, వారిపై విజయం సాధించి గర్జిస్తోంది గనుక యెహోవా చర్య తీసుకోవాల్సిందే. అలా ప్రగల్భాలు పలుకడం బబులోను యెహోవా నామమును అగౌరవపరిచేలా చేసింది. (యెహెజ్కేలు 36:20, 21) యెరూషలేము అలా నిర్జనంగా విడువబడడానికి కారణం యెహోవాకు తన ప్రజలపట్ల కలిగిన కోపమేనని బబులోను గుర్తించలేకపోయింది. బదులుగా, బబులోను యూదుల బానిసత్వాన్ని దేవుని బలహీనతకు నిదర్శనంగా దృష్టించింది. చివరికి బబులోను సహపరిపాలకుడైన బెల్షస్సరు, బబులోను దేవుళ్ళ గౌరవార్థం విందు చేసుకుంటున్నప్పుడు యెహోవా ఆలయంలోని పాత్రలను ఉపయోగించడం ద్వారా ఆయనను అపహసించాడు.—దానియేలు 5:1-4.
8. అపొస్తలులు మరణించినప్పటి నుండి యెహోవా నామముతో ఎలా వ్యవహరించడం జరిగింది?
8 ఇదంతా “పైనున్న యెరూషలేము”కు ఎలా వర్తిస్తుంది? క్రైస్తవులమని చెప్పుకుంటున్నవారిలో మతభ్రష్టత్వం వేళ్ళూనినప్పటి నుండి, వారిని బట్టి “దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది” అని చెప్పవచ్చు. (రోమీయులు 2:24; అపొస్తలుల కార్యములు 20:29, 30) అందును బట్టి, మూఢనమ్మకం మూలంగా యూదులు చివరికి దైవిక నామమును ఉపయోగించడం మానుకున్నారు. అపొస్తలులు మరణించగానే మతభ్రష్ట క్రైస్తవులు అదే మాదిరిని అనుసరించి, దేవుని వ్యక్తిగత నామమును ఉపయోగించడం మానుకున్నారు. మతభ్రష్టత్వం, మహా బబులోనులో ప్రధాన భాగమైన క్రైస్తవమత సామ్రాజ్యం వృద్ధి అవడానికి కారణమైంది. (2 థెస్సలొనీకయులు 2:3, 7; ప్రకటన 17: 5) క్రైస్తవమత సామ్రాజ్యపు విచ్ఛలవిడి అనైతికత, ఘోరమైన రక్తాపరాధం యెహోవా నామముపై చెడు ప్రభావాన్ని చూపించాయి.—2 పేతురు 2: 1, 2.
9, 10. ఆధునిక కాలాలకు చెందిన దేవుని నిబంధన ప్రజలు యెహోవా ప్రమాణాల గురించి, ఆయన నామము గురించి ఎలాంటి లోతైన అవగాహనను పెంచుకున్నారు?
9 గొప్ప కోరెషు అయిన యేసుక్రీస్తు 1919 లో మహా బబులోను చెర నుండి దేవుని నిబంధన ప్రజలను విడుదల చేసినప్పుడు, వారు యెహోవా కోరేవాటిని మరింత స్పష్టంగా అర్థం చేసుకున్నారు. త్రిత్వము, అమర్త్యమైన ఆత్మ, నరకాగ్నిలో నిత్య హింస వంటి, క్రైస్తవత్వం ప్రారంభం కాకమునుపు అన్యమతంలో వేళ్ళూని ఉన్న క్రైస్తవమత సామ్రాజ్యపు అనేక బోధల నుండి వారు అప్పటికే తమను తాము శుద్ధి చేసుకున్నారు. ఇప్పుడు వారు బబులోను సంబంధిత ప్రభావాలన్నిటి నుండి తమను తాము శుద్ధి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. ఈ లోక వ్యవహారాలకు మద్దతునివ్వడానికి సంబంధించి ఖచ్చితమైన తటస్థతను కాపాడుకోవడంలోని ప్రాముఖ్యతను కూడా వారు గ్రహించారు. వారిలో కొంతమంది తమపైకి తెచ్చుకున్న రక్తాపరాధం నుండి తమను తాము శుద్ధి చేసుకోవాలని కూడా వారు కోరుకున్నారు.
10 దేవుని ఆధునిక దిన సేవకులు కూడా యెహోవా నామముకున్న ప్రాముఖ్యత గురించి లోతైన అవగాహనను పెంచుకున్నారు. వారు 1931 లో యెహోవాసాక్షులు అనే పేరును పెట్టుకొని, తాము యెహోవాకు, ఆయన నామముకు మద్దతునిస్తున్నామని బహిరంగంగా ప్రకటించారు. అంతేగాక నూతనలోక అనువాదము ప్రచురించడం ద్వారా 1950 నుండి యెహోవాసాక్షులు దైవిక నామమును బైబిలులో దాని సరైన స్థానంలో పునఃస్థాపించారు. అవును, వారు యెహోవా నామ ప్రాముఖ్యతను గ్రహించి, భూదింగతముల వరకు దాన్ని తెలియజేస్తున్నారు.
‘సువార్త ప్రకటించువాడు’
11. ‘నీ దేవుడు ఏలుచున్నాడు’ అనే ప్రకటన, సా.శ.పూ. 537 లో జరిగిన సంఘటనలకు సంబంధించి ఎందుకు సముచితమైనది?
11 సీయోను ఇంకా నిర్జనంగా విడువబడిన స్థితిలో ఉండగానే మన అవధానం మళ్ళీ ఆమెవైపుకు మరల్చబడుతుంది. సువార్త తీసుకువస్తున్న ఒక సందేశకుడు సమీపిస్తాడు: “సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు, పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.” (యెషయా 52: 7) సా.శ.పూ. 537 లో సీయోనును దేవుడు ఏలుతున్నాడని ఎలా చెప్పవచ్చు? యెహోవా ఎప్పటినుండో ఏలుతూనే లేడా? నిజానికి, ఆయన ‘యుగములకు రాజు!’ (ప్రకటన 15: 3) కానీ ‘నీ దేవుడు ఏలుచున్నాడు’ అనే ప్రకటన సముచితమైనది, ఎందుకంటే బబులోను పతనము, యెరూషలేములో ఆలయాన్ని పునర్నిర్మించి అక్కడ స్వచ్ఛారాధనను పునఃస్థాపించమన్న రాచరిక ప్రకటన యెహోవా రాచరికాన్ని నూతనంగా వ్యక్తీకరిస్తాయి.—కీర్తన 97: 1.
12. ‘సువార్తను ప్రకటించడంలో’ ఎవరు నాయకత్వం వహించారు, ఎలా?
12 యెషయా దినంలో, ఏ వ్యక్తీ లేక వ్యక్తుల ఏ గుంపూ ‘సువార్త ప్రకటించువానిగా’ గుర్తించబడలేదు. అయితే, నేడు సువార్త తీసుకు వచ్చేవాని గుర్తింపు స్పష్టమయ్యింది. యెహోవా యొక్క గొప్ప సమాధాన సందేశకుడు యేసుక్రీస్తు. ఆయన భూమిపైనున్నప్పుడు, రోగ మరణాలతో సహా ఆదాము నుండి వారసత్వంగా వచ్చిన పాపము యొక్క ప్రభావాలన్నిటి నుండి విడుదల లభిస్తుందనే సువార్తను ప్రకటించాడు. (మత్తయి 9:35) ప్రజలకు దేవుని రాజ్యం గురించి బోధించడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యేసు ఈ సువర్తమానమును ప్రకటించడంలో అత్యాసక్తితో కూడిన మాదిరిని ఉంచాడు. (మత్తయి 5:1, 2; మార్కు 6:34; లూకా 19:1-10; యోహాను 4:5-26) ఆయన శిష్యులు ఆయన మాదిరినే అనుసరించారు.
13. (ఎ) ‘సువార్త ప్రకటించువాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి’ అనే వ్యక్తీకరణ యొక్క భావాన్ని అపొస్తలుడైన పౌలు ఎలా విస్తృతపరిచాడు? (బి) సందేశకుల పాదాలు “సుందరమైనవి” అని ఎందుకు చెప్పవచ్చు?
13 అపొస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలో, సువార్త ప్రకటన పని యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికి యెషయా 52:7 ను ఎత్తివ్రాశాడు. ‘ప్రకటించువాడు లేకుండ ప్రజలెట్లు విందురు?’ అనే ప్రశ్నతో సహా ఆయన ఆలోచన రేకెత్తించే పలు ప్రశ్నలు వేశాడు. ఆ తర్వాత ఆయనిలా అన్నాడు: “ఇందు విషయమై—ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది.” (రోమీయులు 10:14-16) అలా పౌలు, యెషయా మూలప్రతిలో కనిపించే “వాని” అనే ఏకవచన సంబోధనను ఉపయోగించే బదులు “వారి” అనే బహువచన సంబోధనను ఉపయోగిస్తూ యెషయా 52:7 యొక్క అన్వయింపును విస్తృతపరిచాడు. యేసుక్రీస్తును అనుకరిస్తారు గనుక క్రైస్తవులందరూ సమాధాన సువార్త సందేశకులే. వారి పాదములు ఏ భావములో “సుందరమైనవి”? దగ్గరలో ఉన్న యూదా పర్వతాల నుండి సందేశకుడు యెరూషలేమును సమీపిస్తున్నట్లుగా యెషయా మాట్లాడుతున్నాడు. దూరం నుండి సందేశకుని పాదాలను చూడడం అసాధ్యం. అయితే, ఇక్కడ సందేశకునిపైనే అవధానం కేంద్రీకృతమై ఉంది, పాదాలు సందేశకుడికి ప్రాతినిధ్యం వహిస్తాయి. యేసు, ఆయన శిష్యులు మొదటి శతాబ్దంలోని వినమ్రులైన వారికి సుందరమైన దృశ్యంగా ఉన్నట్లే, ప్రస్తుత దిన సాక్షులు జీవరక్షక సువార్త సందేశాన్ని వినే అణకువగలవారికి సంతోషం కలిగించే దృశ్యంగా ఉన్నారు.
14. ఆధునిక కాలాల్లో యెహోవా ఎలా ఏలుతున్నాడు, ఇది ఎప్పటి నుండి మానవజాతికి ప్రకటించబడుతోంది?
14 ఆధునిక కాలాల్లో, ‘నీ దేవుడు ఏలుచున్నాడనే’ ప్రకటన ఎప్పటి నుండి ప్రకటించబడుతోంది? 1919 నుండి. ఆ సంవత్సరం ఒహాయో నందలి సీడార్ పాయింట్‌లో జరిగిన సమావేశంలో, వాచ్‌టవర్ సొసైటి ఆనాటి అధ్యక్షుడైన జె. ఎఫ్. రూథర్‌ఫోర్డ్ “తోటి పనివారికి ప్రసంగం” అనే ప్రసంగాంశంతో తన శ్రోతలను ప్రేరేపించాడు. యెషయా 52:7, ప్రకటన 15: 2 వచనాల ఆధారంగా రూపొందించబడిన ఆ ప్రసంగం, ప్రకటనాపనిని చేపట్టమని అక్కడ హాజరై ఉన్నవారినందరినీ ప్రోత్సహించింది. అలా, ‘సుందరమైన పాదములు’ “పర్వతముల” మీద కనిపించనారంభించాయి. మొదట అభిషిక్త క్రైస్తవులు, ఆ తర్వాత వారి సహవాసులైన “వేరే గొఱ్ఱెలు” యెహోవా ఏలుతున్నాడనే సువార్తను అత్యాసక్తితో ప్రకటించడం మొదలుపెట్టారు. (యోహాను 10:16) యెహోవా ఎలా ఏలుతున్నాడు? ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును క్రొత్తగా స్థాపించబడిన పరలోక రాజ్యానికి 1914 లో రాజుగా నియమించినప్పుడు, ఆయన తన రాజరికాన్ని మరోసారి వ్యక్తపరిచాడు. యెహోవా 1919 లో “దేవుని ఇశ్రాయేలు”ను మహా బబులోను నుండి విడుదల చేసినప్పుడు తన రాజరికాన్ని ఇంకోసారి వ్యక్తపరిచాడు.—గలతీయులు 6:16; కీర్తన 47: 8; ప్రకటన 11:15, 17; 19: 6, 7.
“నీ కావలివారు స్వరమెత్తుతున్నారు”
15. సా.శ.పూ. 537 లో స్వరమెత్తే “కావలివారు” ఎవరు?
15 “నీ దేవుడు ఏలుచున్నాడ”నే ప్రకటన ఏమైనా ప్రతిస్పందనను రేకెత్తించిందా? రేకెత్తించింది. యెషయా ఇలా వ్రాస్తున్నాడు: ‘ఆలకించుము! నీ కావలివారు పలుకుచున్నారు [“స్వరమెత్తుతున్నారు,” పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం]. కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు; యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు.’ (యెషయా 52: 8) తిరిగి వస్తున్న మొదటి బంధీలను ఆహ్వానించడానికి సా.శ.పూ. 537 లో యెరూషలేములో అక్షరార్థమైన కావలివారు ఎవరు కూడా తమ స్థానాల్లో నిలబడలేదు. నగరం 70 సంవత్సరాలపాటు నిర్జనంగా విడువబడింది. (యిర్మీయా 25:11, 12) కాబట్టి తమ స్వరములను ఎత్తే “కావలివారు,” సీయోను పునఃస్థాపనను గురించిన వార్త ముందుగా అందుకొని ఆ వార్తను సీయోను కుమారులలో మిగతా వారికి అందజేసే బాధ్యతగల ఇశ్రాయేలీయులు కావచ్చు. యెహోవా బబులోనును సా.శ.పూ. 539 లో కోరెషుకు అప్పగించడాన్ని చూసిన తర్వాత, ఆయన తన ప్రజలను విడుదల చేస్తున్నాడన్న విషయంలో ఈ కావలివారి మనస్సుల్లో ఎటువంటి సందేహమూ ఉండదు. తమ పిలుపుకు ప్రతిస్పందించే వారితో కలిసి ఈ కావలివారు, ఇతరులు సువార్తను వినగలిగేలా, కూడుకొని బిగ్గరగా పాడుతూనే ఉంటారు.
16. కావలివారు ఎవరిని “కన్నులార” చూస్తారు, ఏ భావంలో?
16 అప్రమత్తంగా ఉన్న కావలివారు, ఒక విధంగా చెప్పాలంటే, యెహోవాను “కన్నులార” చూస్తూ లేదా ముఖాముఖిగా చూస్తూ ఆయనతో సన్నిహితమైన, వ్యక్తిగతమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. (సంఖ్యాకాండము 14:14) వారు యెహోవాతోనూ, అలాగే వారు ఒకరితో ఒకరూ కలిగివున్న సన్నిహిత సహవాసము వారి ఐక్యతను, వారి సందేశం ఆనందభరితమైనదన్న విషయాన్ని ఉన్నతపరుస్తుంది.—1 కొరింథీయులు 1:10.
17, 18. (ఎ) ఆధునిక దిన కావలివాని తరగతి ఎలా స్వరమెత్తి పలుకుతోంది? (బి) కావలివాని తరగతి ఏ విధంగా ఐక్యతతో పిలుపునిచ్చింది?
17 ఆధునిక దిన నెరవేర్పులో, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అయినటువంటి కావలివాని తరగతి, ఇప్పటికే దేవుని దృశ్య సంస్థలో భాగమైయున్నవారి కోసమే గాక బయటివారి కోసం కూడా స్వరమెత్తి పలుకుతున్నారు. (మత్తయి 24:45-47) అభిషిక్తులలో మిగిలినవారిని సమకూర్చడానికి 1919 లో ఒక పిలుపు బయలువెళ్ళింది, “రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి” అనే విజ్ఞప్తితో ఒహాయో నందలి సీడార్ పాయింట్‌లో జరిగిన సమావేశంలో ఆ పిలుపు ఉద్ధృతం చేయబడింది. గొఱ్ఱెలవంటివారి గొప్ప సమూహమును సమకూర్చడం వైపుకు 1935 నుండి అవధానం మరల్చబడింది. (ప్రకటన 7:9, 10) ఇటీవలి సంవత్సరాల్లో యెహోవా రాచరికాన్ని గురించిన ప్రకటన ఉద్ధృతం చేయబడింది. ఎలా? యెహోవా రాచరికాన్ని గురించి చెప్పడంలో, 2000 వ సంవత్సరంలో, 230 కన్నా ఎక్కువ దేశాల్లోనూ, ప్రాంతాల్లోనూ దాదాపు అరవై లక్షలమంది పాల్గొన్నారు. అంతేగాక, కావలివాని తరగతి యొక్క ప్రధాన ఉపకరణమైన కావలికోట 130 కన్నా ఎక్కువ భాషల్లో ఆనందకరమైన సందేశాన్ని ప్రకటిస్తోంది.
18 ఐక్యపరిచే అలాంటి పనిలో పాల్గొనడానికి నమ్రత, సహోదర ప్రేమ అవసరం. ఆ పిలుపు ప్రభావవంతంగా ఉండాలంటే, దానిలో ఇమిడి ఉన్న వారందరూ యెహోవా నామాన్ని, ఆయన చేసిన విమోచనక్రయధన ఏర్పాటును, ఆయన జ్ఞానాన్ని, ఆయన ప్రేమను, ఆయన రాజ్యాన్ని ప్రస్తావిస్తూ, ఒకే సందేశాన్ని ప్రకటించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ భుజాలు కలిపి పని చేస్తుండగా, ఐక్యంగా సువర్తమానము ప్రకటించేందుకు యెహోవాతో వారి వ్యక్తిగత సంబంధం బలపరచబడుతుంది.
19. (ఎ) ‘యెరూషలేమునందు పాడైయున్న స్థలములు’ ఎలా సంతోషభరితమైనవిగా మారుతాయి? (బి) యెహోవా ఏ భావంలో “తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు”?
19 దేవుని ప్రజలు ఆనందంతో కేకలు వేస్తుండగా, చివరికి వాళ్ళున్న స్థలం కూడా ఆనందభరితంగా కనిపిస్తుంది. ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి, యెహోవా తన జనులను ఆదరించెను; యెరూషలేమును విమోచించెను. సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు; భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణచూచెదరు.” (యెషయా 52:9, 10) నిర్జనంగా విడువబడిన యెరూషలేములోని విచారపూరితంగా కనిపిస్తున్న స్థలాలు, బబులోను నుండి తిరిగి వచ్చేవారి రాకతో, యెహోవా స్వచ్ఛారాధన ఇప్పుడు పునఃస్థాపించబడగలదు గనుక సంతోషభరితంగా కనిపిస్తాయి. (యెషయా 35:1, 2) స్పష్టంగా దీనిలో యెహోవా హస్తము ఉంది. ఆయన తన ప్రజలను రక్షించడమనే పనిలో పాల్గొనడానికి, తన చొక్కాచేతులు పైకి మడుచుకున్నట్లుగా, ఆయన “తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు.”—ఎజ్రా 1: 2, 3.
20. ఆధునిక కాలాల్లో యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరచడం మూలంగా ఏమి జరిగింది, ఇంకా ఏమి జరుగుతుంది?
20 ఈ ‘అంత్య దినాల్లో,’ ప్రకటన గ్రంథములోని ‘ఇద్దరు సాక్షులు’ అయిన అభిషిక్త శేషమును పునరుజ్జీవింపజేయడానికి యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచాడు. (2 తిమోతి 3: 1; ప్రకటన 11:3, 7-13) వీరు 1919 నుండి ఆధ్యాత్మిక పరదైసులోకి తీసుకురాబడ్డారు, వారు ఈ ఆధ్యాత్మిక ఎస్టేటును తమ సహవాసులైన లక్షలాదిమంది వేరే గొఱ్ఱెలతో పంచుకుంటున్నారు. చివరికి, ‘హార్‌మెగిద్దోనులో’ తన ప్రజలకు రక్షణ కలుగజేయడానికి యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరుస్తాడు. (ప్రకటన 16:14-16) అప్పుడు, “భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.”
అత్యవసర ఆవశ్యకత
21. (ఎ) ‘యెహోవా సేవోపకరణములను మోసేవారు’ అవశ్యంగా చేయవలసినదేమిటి? (బి) బబులోను నుండి బయలుదేరుతున్న యూదులు త్వరపడవలసిన అవసరం ఎందుకు లేదు?
21 యెరూషలేముకు తిరిగి రావడానికి బబులోనులో నుండి బయటికి వచ్చేవారు అవశ్యంగా చేయవలసినది ఒకటి ఉంది. దాని గురించి యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “పోవుడి, పోవుడి, అచ్చటనుండి వెళ్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి; దానియొద్దనుండి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.” (యెషయా 52:11, 12) బబులోను నుండి బయలుదేరుతున్న ఇశ్రాయేలీయులు దాని అబద్ధ ఆరాధన సంబంధిత మాలిన్యం ఉన్న దేనినైనా అక్కడే వదిలేసి రావాలి. వారు యెరూషలేములోని ఆలయం నుండి వచ్చిన యెహోవా సేవోపకరణములను మోయాలి గనుక, వారు కేవలం శారీరకంగా, లాంఛనప్రాయంగానే గాక ప్రధానంగా తమ హృదయాల్లో పవిత్రంగా ఉండాలి. (2 రాజులు 24:11-13; ఎజ్రా 1: 7) అంతేగాక, యెహోవా వారికి ముందుగా వెళుతున్నాడు, కాబట్టి వారు త్వరపడి బయలుదేరవలసిన అవసరం లేదు, అంతేగాక రక్తదాహంగల శత్రువులు తమను తరుముకువస్తుంటే పారిపోతున్నట్లుగా పిచ్చిగా పరుగెత్తవలసిన అవసరం లేదు. ఇశ్రాయేలు దేవుడు వారి వెనుకటి భాగమున కావలికాస్తాడు.—ఎజ్రా 8:21-23.
22. అభిషిక్త క్రైస్తవుల మధ్య పవిత్రత యొక్క అవసరం గురించి పౌలు ఎలా నొక్కిచెబుతున్నాడు?
22 పవిత్రంగా ఉండడాన్ని గురించి యెషయా చెబుతున్న మాటలు “పైనున్న యెరూషలేము” సంతానముపై ప్రధానంగా నెరవేరుతాయి. అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దని పౌలు కొరింథులోని క్రైస్తవులకు ఉద్బోధించినప్పుడు, ఆయన యెషయా 52:11 లోని మాటలను ఎత్తి వ్రాశాడు: “కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.” (2 కొరింథీయులు 6:14-18) బబులోను నుండి స్వదేశానికి తిరిగి వస్తున్న ఇశ్రాయేలీయులవలెనే, క్రైస్తవులు బబులోను అబద్ధ ఆరాధనకు సంబంధించిన వాటినుండి దూరంగా ఉండాలి.
23. యెహోవా సేవకులు నేడు తమను తాము పవిత్రంగా ఉంచుకోవడానికి ఏ యే విధాలుగా కృషి చేస్తారు?
23 మహా బబులోను నుండి 1919 లో బయటికి వచ్చిన యేసుక్రీస్తు అభిషిక్త అనుచరుల విషయంలో ఇది ప్రాముఖ్యంగా నిజమైంది. వారు అబద్ధ ఆరాధనకు సంబంధించిన మాలిన్యమంతటి నుండి క్రమక్రమంగా తమను తాము శుద్ధి చేసుకున్నారు. (యెషయా 8:19, 20; రోమీయులు 15: 4) నైతిక పవిత్రత యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా వారు మరింత అప్రమత్తులయ్యారు. యెహోవాసాక్షులు ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన నైతిక ప్రమాణాలను ఉన్నతపరచినప్పటికీ, సంఘాన్ని పవిత్రంగా ఉంచడానికి లైంగికపరమైన దుష్ప్రవర్తన గలవారిని క్రమశిక్షణలో పెట్టవలసిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆర్టికల్స్ 1952 లో కావలికోటలో వచ్చాయి. అలాంటి క్రమశిక్షణా చర్య, తప్పిదస్థుడు యథార్థంగా పశ్చాత్తాపం చూపించాల్సిన అవసరతను స్వయంగా గుర్తించేందుకు కూడా సహాయం చేస్తుంది.—1 కొరింథీయులు 5:6, 7, 9-13; 2 కొరింథీయులు 7:8-10; 2 యోహాను 10, 11.
24. (ఎ) ఆధునిక కాలాల్లో, ‘యెహోవా సేవోపకరణాలు’ ఏవి? (బి) యెహోవా తమకు ముందుగా నడుస్తాడనీ అలాగే తమ వెనుకటి భాగమున కావలికాస్తాడనీ క్రైస్తవులు నేడు ఎందుకు నమ్మకం కలిగి ఉన్నారు?
24 అభిషిక్త క్రైస్తవులతో పాటు వేరే గొఱ్ఱెల గొప్ప సమూహము ఆధ్యాత్మికంగా అపవిత్రమైన దేన్నీ ముట్టుకోకూడదని నిశ్చయించుకున్నారు. వారి పరిశుద్ధమైన, పవిత్రపరచబడిన స్థితి, “యెహోవా సేవోపకరణములను” మోసేవారిగా ఉండడానికి వారిని అర్హులను చేస్తుంది, ఆ సేవోపకరణములేమిటంటే ఇంటింటా, బైబిలు అధ్యయన పరిచర్యలోనూ ఇతర విధాలైన క్రైస్తవ కార్యకలాపాల్లోనూ పవిత్ర సేవ చేయడానికి దేవుడు చేసే అమూల్యమైన ఏర్పాట్లే. దేవుని ప్రజలు నేడు పవిత్రమైన స్థానాన్ని కాపాడుకోవడం ద్వారా, యెహోవా తమకు ముందుగా నడుస్తాడనీ అలాగే తమ వెనుకటి భాగమున కావలికాస్తాడనీ వారు నమ్మకం కలిగి ఉండవచ్చు. దేవుని పవిత్రమైన ప్రజలుగా, వారు ‘ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయడానికి’ వారికి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి!
[అధస్సూచి]
a “పైనున్న యెరూషలేము”కు, ఆమె భూసంబంధమైన అభిషిక్త పిల్లలకు మధ్యనున్న సంబంధాన్ని గురించి మరింత విస్తృతమైన చర్చ కోసం ఈ పుస్తకంలోని 15 వ అధ్యాయాన్ని చూడండి.
[అధ్యయన ప్రశ్నలు]
[183 వ పేజీలోని చిత్రం]
సీయోను చెర నుండి విడుదల చేయబడుతుంది
[186 వ పేజీలోని చిత్రం]
1919 మొదలుకొని, ‘సుందరమైన పాదములు’ మళ్ళీ “పర్వతముల” మీద కనిపిస్తున్నాయి
[189 వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షులు ఐక్యతతో మాట్లాడతారు
[192 వ పేజీలోని చిత్రం]
‘యెహోవా సేవోపకరణములను మోసేవారు’ నైతికంగా, ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండాలి