కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“కరుణించు సమయము”

“కరుణించు సమయము”

పదవ అధ్యాయం

“కరుణించు సమయము”

యెషయా 49:​1-26

1, 2. (ఎ) యెషయా ఏ ఆశీర్వాదమును పొందాడు? (బి) యెషయా 49 వ అధ్యాయంలోని మొదటి అర్ధభాగంలో వ్రాయబడివున్న ప్రవచనార్థక మాటల్లో ఎవరు ఇమిడివున్నారు?

 నమ్మకమైన మానవులందరూ ఎంతోకాలం నుండి దేవుని ఆమోదాన్ని, కాపుదలను అనుభవిస్తున్నారు. కానీ యెహోవా విచక్షణారహితంగా కరుణ చూపించడు. అలాంటి అనుపమానమైన ఆశీర్వాదాన్ని పొందడానికి ఒక వ్యక్తి అర్హుడై ఉండాలి. యెషయా అలాంటి అర్హతగల వాడే. ఆయన దేవుని అనుగ్రహాన్ని పొందాడు, యెహోవా తన చిత్తాన్ని ఇతరులకు తెలియజేయడానికి ఆయనను ఒక ఉపకరణంగా వాడుకున్నాడు. దీన్ని గురించిన ఒక ఉదాహరణ, యెషయా ప్రవచనం యొక్క 49 వ అధ్యాయంలోని మొదటి అర్ధభాగంలో వ్రాయబడి ఉంది.

2 అక్కడ వ్రాయబడివున్న మాటలు ప్రవచనార్థకంగా అబ్రాహాము సంతానమును ఉద్దేశించి చెప్పబడ్డాయి. తొలి నెరవేర్పులో ఆ సంతానం అబ్రాహాము నుండి వచ్చిన ఇశ్రాయేలు జనాంగము. అయితే దీనిలోని శైలి చాలామేరకు, ఎంతోకాలం నుండి నిరీక్షించిన అబ్రాహాము యొక్క సంతానమైన వాగ్దత్త మెస్సీయకు స్పష్టంగా అనువర్తిస్తుంది. ఈ ప్రేరేపిత మాటలు, అబ్రాహాము ఆధ్యాత్మిక సంతానములోనూ, “దేవుని ఇశ్రాయేలు”లోనూ భాగమైన మెస్సీయ ఆధ్యాత్మిక సహోదరులకు కూడా అనువర్తిస్తాయి. (గలతీయులు 3:​7, 16, 29; 6:​16) ప్రాముఖ్యంగా, యెషయా ప్రవచనంలోని ఈ భాగం, యెహోవాకు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుకు మధ్యనున్న ప్రత్యేకమైన సంబంధాన్ని వర్ణిస్తుంది.​—⁠యెషయా 49:​26.

యెహోవాచే నియమించబడి, కాపాడబడినవాడు

3, 4. (ఎ) మెస్సీయకు ఏ మద్దతు ఉంది? (బి) మెస్సీయ ఎవరితో మాట్లాడుతున్నాడు?

3 మెస్సీయ దేవుని కరుణను లేక ఆమోదాన్ని పొందుతాడు. ఆయన తనకు అప్పగించబడిన పనిని నెరవేర్చడానికి కావలసిన అధికారాన్ని, యోగ్యతా పత్రాలను యెహోవా ఆయనకు ఇస్తాడు. కాబట్టి తగినవిధంగానే, భవిష్యద్‌ మెస్సీయ ఇలా చెబుతున్నాడు: “ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను.”​—యెషయా 49: 1.

4 ఇక్కడ మెస్సీయ “దూరముననున్న జనముల”ను ఉద్దేశించి తన వ్యాఖ్యలను చేస్తున్నాడు. మెస్సీయ వాగ్దానం చేయబడింది యూదా ప్రజల కోసమే అయినప్పటికీ, ఆయన పరిచర్య అన్ని జనములకూ ఆశీర్వాదములను తెస్తుంది. (మత్తయి 25:​31-33) ‘ద్వీపములు, జనములు,’ యెహోవాతో నిబంధన సంబంధాన్ని కలిగిలేకపోయినప్పటికీ, ఇశ్రాయేలు యొక్క మెస్సీయ చెప్పేదాన్ని లక్ష్యపెట్టాలి, ఎందుకంటే ఆయన మొత్తం మానవజాతికంతటికీ రక్షణ తీసుకురావడానికి పంపబడ్డాడు.

5. మెస్సీయ మానవుడిగా జన్మించక ముందే ఆయనకు ఎలా పేరు పెట్టబడింది?

5 మెస్సీయ మానవుడిగా జన్మించకముందే యెహోవా ఆయనకు పేరుపెడతాడని ప్రవచనం చెబుతోంది. (మత్తయి 1:​21; లూకా 1:​31) యేసు జన్మించక ముందు చాలాకాలం క్రితమే ఆయనకు, “ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి” అని పేరు పెట్టబడింది. (యెషయా 9: 6) యెషయా కుమారుల్లో బహుశా ఒకరి పేరు అయిన ఇమ్మానుయేలు అనేది కూడా మెస్సీయ ప్రవచనార్థక పేరే అవుతుంది. (యెషయా 7:​14; మత్తయి 1:​21-23) మెస్సీయకు ఇవ్వబడిన పేరూ, ఆయన పిలువబడే పేరూ అయిన యేసు అనేది కూడా ఆయన జననానికి ముందే తెలియజేయబడింది. (లూకా 1:​30, 31) ఈ పేరు “యెహోవాయే రక్షణ” అనే భావంగల హీబ్రూ పదం నుండి వస్తుంది. స్పష్టంగా, యేసు స్వయంనియమిత క్రీస్తు కాదు.

6. మెస్సీయ నోరు ఎలా ఒక వాడిగల ఖడ్గము వలె ఉంది, ఆయన ఎలా దాచిపెట్టబడి లేక మూసిపెట్టబడి ఉన్నాడు?

6 మెస్సీయ ప్రవచనార్థక మాటలు ఇలా కొనసాగుతున్నాయి: “నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు. తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి, తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు.” (యిషయా 49: 2) యెహోవా యొక్క మెస్సీయా అయిన యేసు సా.శ. 29 లో తన భూపరిచర్యను ప్రారంభించే సమయం వచ్చినప్పుడు, ఆయన మాటలు చర్యలు నిజంగానే శ్రోతల హృదయాల్లోకి చొచ్చుకుపోగల వాడియైన, మెరుగుపెట్టిన ఆయుధాలుగా నిరూపించబడతాయి. (లూకా 4:​31, 32) ఆయన మాటలు చర్యలు యెహోవా గొప్ప శత్రువైన సాతాను, అతని ప్రతినిధుల ఉగ్రతను రేకెత్తిస్తాయి. యేసు జనన సమయం నుండి సాతాను ఆయన ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ యేసు యెహోవా స్వంత అంబులపొదిలో మూసిపెట్టబడి ఉన్న అంబు వలె ఉన్నాడు. a ఆయన తన తండ్రి ఇచ్చే కాపుదల కోసం దృఢనమ్మకంతో ఎదురుచూడవచ్చు. (కీర్తన 91: 1; లూకా 1:​35) నియమిత సమయంలో, యేసు మానవజాతి కోసం తన జీవాన్ని ఇస్తాడు. కానీ ఆయన మరో భావంలో సాయుధుడై, తన నోటి నుండి వాడియైన ఖడ్గము బయలు వెడలుతుండగా శక్తివంతుడైన పరలోక యోధునిగా బయలుదేరే సమయం వస్తుంది. ఈసారి, వాడియైన ఖడ్గము, యెహోవా శత్రువులకు వ్యతిరేకంగా తీర్పులు ప్రకటించేందుకు, వాటిని అమలు చేసేందుకు యేసుకున్న అధికారానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.​—⁠ప్రకటన 1:​16.

దేవుని సేవకుని కష్టం వ్యర్థంకాదు

7. యెషయా 49:3 లోని యెహోవా మాటలు ఎవరికి అనువర్తింపజేయబడ్డాయి, ఎందుకు?

7 ఇప్పుడు యెహోవా ఈ ప్రవచనార్థక మాటలు పలుకుతున్నాడు: “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనెదను.” (యెషయా 49: 3) యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని తన సేవకుడిగా సంబోధిస్తున్నాడు. (యెషయా 41: 8) కానీ యేసుక్రీస్తు దేవుని ప్రధాన సేవకుడు. (అపొస్తలుల కార్యములు 3:​13) యేసుకన్నా గొప్పగా యెహోవా “మహిమ”ను ఆయన సృష్టించిన ఏ జీవీ ప్రతిబింబించలేదు. కాబట్టి, ఈ మాటలు అక్షరార్థంగా ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్పబడినవే అయినా, నిజానికి అవి యేసుకు అన్వయిస్తాయి.​—⁠యోహాను 14: 9; కొలొస్సయులు 1:​15.

8. మెస్సీయ సొంత ప్రజలు ఆయనకు ఎలా ప్రతిస్పందిస్తారు, కానీ తన సఫలతను ఎవరు నిర్ణయించాలని ఆయన నిరీక్షిస్తాడు?

8 అయితే యేసు తన సొంత ప్రజలనేకుల చేత ఈసడించుకోబడి, తృణీకరించబడ్డాడన్నది నిజం కాదా? అవును, నిజమే. మొత్తంగా ఇశ్రాయేలు జనాంగం యేసును దేవుని అభిషిక్త సేవకుడిగా అంగీకరించలేదు. (యోహాను 1:​11) యేసు భూమి మీద సాధించేదంతా ఆయన సమకాలీనులకు ఏ మాత్రం విలువలేనిదిగా, చివరికి స్వల్పమైన విషయంగా కనిపించవచ్చు. మెస్సీయ తాను తన పరిచర్యలో పొందిన ఈ స్పష్టమైన వైఫల్యం గురించి తర్వాత ఇలా చెబుతున్నాడు: ‘వ్యర్థముగా నేను కష్టపడితిని. ఫలమేమియు లేకుండ నా బలమును వృథాగా వ్యయపరచి యున్నాను.’ (యెషయా 49:4ఎ) మెస్సీయ ఇలా వ్యాఖ్యానించింది నిరుత్సాహం చెందినందువల్ల కాదు. తర్వాత ఆయన ఏమి చెబుతున్నాడో పరిశీలించండి: “నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది.” (యెషయా 49:4బి) మెస్సీయ సఫలతను నిర్ణయించవలసింది మనుష్యులు కాదు గానీ దేవుడే.

9, 10. (ఎ) యెహోవా నుండి మెస్సీయకు లభించిన నియామకం ఏమిటి, ఆయన ఏ ఫలితాలు సాధించాడు? (బి) మెస్సీయ అనుభవాల ద్వారా క్రైస్తవులు నేడు ఎలా ప్రోత్సహించబడవచ్చు?

9 యేసు ముఖ్యంగా దేవుని ఆమోదాన్ని లేక కరుణను పొందాలని ఆసక్తి కలిగివున్నాడు. ప్రవచనంలో, మెస్సీయ ఇలా చెబుతున్నాడు: ‘యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించెను.’ (యెషయా 49: 5) మెస్సీయ, ఇశ్రాయేలు కుమారుల హృదయాలను తిరిగి వారి పరలోక తండ్రివైపుకు త్రిప్పడానికి వస్తాడు. చాలామంది ప్రతిస్పందించరు, కానీ కొంతమంది ప్రతిస్పందిస్తారు. అయితే, ఆయన నిజమైన బహుమానము యెహోవా దేవుని వద్దనే ఉంది. ఆయన సాధించే సఫలత మానవ పరిభాషలో కాక యెహోవా స్వంత ప్రమాణాల ప్రకారం కొలువబడుతుంది.

10 నేడు, యేసు అనుచరులు కొన్నిసార్లు తాము వ్యర్థంగా ప్రయాసపడుతున్నట్లు భావించవచ్చు. కొన్ని స్థలాల్లో, వారి పరిచర్య ఫలితాలు తాము వెచ్చించిన పనితో ప్రయాసతో పోలిస్తే చాలా తక్కువగానే అనిపించవచ్చు. అయినప్పటికీ, వారు యేసు మాదిరిని బట్టి ప్రోత్సహింపబడి, సహిస్తారు. “కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి” అని వ్రాసిన అపొస్తలుడైన పౌలు మాటలను బట్టి కూడా వారు బలపరచబడతారు.​—⁠1 కొరింథీయులు 15:​58.

‘అన్యజనులకు వెలుగు’

11, 12. మెస్సీయ ఏ విధంగా “అన్యజనులకు వెలుగై” ఉన్నాడు?

11 దేవుని సేవకుడై ఉండడం “స్వల్పవిషయము” కాదని యెహోవా యెషయా ప్రవచనంలో మెస్సీయకు గుర్తుచేయడం ద్వారా ఆయనను ప్రోత్సహిస్తాడు. యేసు ‘యాకోబు గోత్రపువారిని ఉద్ధరించాలి, ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించాలి.’ యెహోవా అదనంగా ఇంకా ఇలా వివరిస్తున్నాడు: “భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించియున్నాను.” (యెషయా 49: 6) యేసు భూ పరిచర్య ఇశ్రాయేలుకు మాత్రమే పరిమితం చేయబడివుండగా, ఆయన “భూదిగంతములవరకు” ప్రజలకు ఎలా జ్ఞానోదయం కలుగజేస్తాడు?

12 యేసు భూదృశ్యం నుండి అంతర్ధానమవ్వడంతో, “అన్యజనులకు” దేవుడు నియమించిన ‘వెలుగు’ ఆరిపోలేదని బైబిలు వృత్తాంతం చూపిస్తోంది. యేసు మరణించిన దాదాపు 15 సంవత్సరాలకు, మిషనరీలైన పౌలు, బర్నబాలు యెషయా 49:6 లోని ప్రవచనాన్ని ఎత్తి వ్రాస్తూ దాన్ని యేసు శిష్యులకు, ఆయన ఆధ్యాత్మిక సహోదరులకు అన్వయించారు. “నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెనని” వారు వివరించారు. (అపొస్తలుల కార్యములు 13:​47) పౌలు తాను మరణించక ముందు, రక్షణ సువార్త కేవలం యూదులకు మాత్రమే కాదుగానీ “ఆకాశముక్రింద ఉన్న సమస్త సృష్టికి” అందుబాటులోకి రావడాన్ని చూశాడు. (కొలొస్సయులు 1:​6, 23) నేడు, క్రీస్తు అభిషిక్త సహోదరులలో మిగిలివున్న వారు ఈ పనిని కొనసాగిస్తున్నారు. లక్షల సంఖ్యలో ఉన్న “గొప్ప సమూహము” యొక్క మద్దతుతో వారు ప్రపంచవ్యాప్తంగా 230 కన్నా ఎక్కువ దేశాల్లో “అన్యజనులకు వెలుగుగా” సేవ చేస్తున్నారు.​—⁠ప్రకటన 7: 9.

13, 14. (ఎ) ప్రకటనా పనికి మెస్సీయ, ఆయన అనుచరులు ఏ విధమైన ప్రతిస్పందనను ఎదుర్కొన్నారు? (బి) పరిస్థితుల్లో ఏ మార్పు జరిగింది?

13 తన సేవకుడైన మెస్సీయకు, ఆయన అభిషిక్త సహోదరులకు, వారితోపాటు సువార్త ప్రకటనాపనిని కొనసాగిస్తున్న గొప్ప సమూహములోని వారికందరికి, బలానికి మూలం యెహోవాయే. నిజమే, యేసు వలె ఆయన శిష్యులు ఏవగింపును, వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. (యోహాను 15:​20) కానీ యెహోవా యథార్థవంతులైన తన సేవకులను రక్షించడానికి, వారికి ప్రతిఫలం ఇవ్వడానికి, ఎల్లప్పుడూ తన నియమిత సమయంలో పరిస్థితులను మారుస్తాడు. “మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును” అయిన మెస్సీయ గురించి యెహోవా ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు.”​—యెషయా 49: 7.

14 ప్రవచించబడిన ఆ మార్పును గురించి అపొస్తలుడైన పౌలు ఆ తర్వాత, ఫిలిప్పీలోని క్రైస్తవులకు వ్రాశాడు. హింసా కొయ్యపై అవమానింపబడి, ఆ తర్వాత దేవునిచే ఉన్నతపరచబడిన వానిగా యేసును ఆయన వర్ణించాడు. “ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లు” యెహోవా తన సేవకుడిని “అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.” (ఫిలిప్పీయులు 2:​8-11) క్రీస్తు నమ్మకమైన అనుచరులు కూడా హింసింపబడతారని వారికి హెచ్చరిక చేయబడింది. కానీ మెస్సీయవలెనే, యెహోవా కరుణ గురించి వారికి హామీ ఇవ్వబడింది.​—⁠మత్తయి 5:​10-12; 24:​9-13; మార్కు 10:​29, 30.

“మిక్కిలి అనుకూలమైన సమయము”

15. యెషయా ప్రవచనంలో ఏ ప్రత్యేకమైన “సమయము” ప్రస్తావించబడింది, ఇది దేన్ని సూచిస్తుంది?

15 యెషయా ప్రవచనం గొప్ప ప్రాముఖ్యతగల వ్యాఖ్యానంతో కొనసాగుతుంది. యెహోవా మెస్సీయకు ఇలా చెబుతాడు: ‘అనుకూలసమయమందు [“కరుణించు సమయము వచ్చినప్పుడు,” పవిత్ర గ్రంథము క్యాతలిక్‌ అనువాదము] నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని . . . నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.’ (యెషయా 49: 8) కీర్తన 69:13-18 వచనాల్లో అటువంటి ప్రవచనమే వ్రాయబడి ఉంది. “అనుకూల సమయము” అనే వ్యక్తీకరణను ఉపయోగిస్తూ కీర్తనకర్త “కరుణించు సమయము” గురించి చెబుతున్నాడు. యెహోవా కరుణ, కాపుదల ఒక ప్రత్యేకమైన విధానంలో అందజేయబడతాయనీ, అయితే అవి కేవలం ఒక నిర్దిష్ట సమయంలో, అల్పకాలంపాటు మాత్రమే అందజేయబడతాయనీ ఈ పదాలు సూచిస్తున్నాయి.

16. ప్రాచీన ఇశ్రాయేలుకు యెహోవా యొక్క కరుణించు సమయము ఏదై ఉండింది?

16 ఆ కరుణించు సమయము ఎప్పుడు వస్తుంది? మూల ఘట్టంలో, ఈ మాటలు పునఃస్థాపన ప్రవచనంలో ఒక భాగం, అవి యూదులు చెర నుండి తిరిగి రావడాన్ని ప్రవచించాయి. ఇశ్రాయేలు జనాంగము “దేశమును చక్కపరచి” తమ “పాడైన స్వాస్థ్యములను” తిరిగి పొందగలిగినప్పుడు కరుణించు సమయాన్ని అనుభవించారు. (యెషయా 49: 8) వారిక బబులోనులో “బంధింపబడినవారి”గా ఎంతమాత్రం లేరు. వారు స్వదేశానికి తిరిగి వస్తున్నప్పుడు, యెహోవా వారికి “ఆకలి” లేదా “దప్పి” కలుగకుండా చూశాడు, అంతేగాక “ఎండమావులైనను ఎండయైనను వారికి తగుల”కుండా చూశాడు. చెదరిపోయిన ఇశ్రాయేలీయులు, “దూరమునుండి . . . ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు” తమ స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. (యెషయా 49:​9-12) ఈ ప్రవచనానికి ఈ తొలి, నాటకీయమైన నెరవేర్పు మాత్రమే గాక, పొడిగింపబడిన అన్వయింపులు కూడా ఉన్నాయని బైబిలు చూపిస్తోంది.

17, 18. మొదటి శతాబ్దంలో యెహోవా ఏ కరుణించు సమయాన్ని నియమించాడు?

17 మొదటిగా యేసు జననమప్పుడు, దేవదూతలు మనుష్యులకు సమాధానమును, దేవుని కరుణను లేక అనుగ్రహమును ప్రకటించారు. (లూకా 2:​13, 14) ఈ కరుణ మనుష్యులందరికీ కాదుగానీ కేవలం యేసుయందు విశ్వాసముంచిన వారికి మాత్రమే చూపించబడింది. తర్వాత యేసు యెషయా 61:​1, 2 వచనాల్లోని ప్రవచనాన్ని బహిరంగంగా చదివి, “ప్రభువు హితవత్సరమును” ప్రకటించేవానిగా దాన్ని తనకు అన్వయింపజేసుకున్నాడు. (లూకా 4:​17-21) క్రీస్తు తాను మానవునిగా ఉన్న కాలంలో యెహోవా ప్రత్యేకమైన కాపుదలను పొందడం గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు. (హెబ్రీయులు 5:​7-9) కాబట్టి ఈ కరుణించు సమయము, మానవునిగా యేసు జీవితకాలంలో దేవుడు ఆయనపై చూపించే అనుగ్రహానికి వర్తిస్తుంది.

18 అయితే, ఈ ప్రవచనం మరో విధంగా కూడా అన్వయింపబడింది. కరుణించు సమయాన్ని గురించిన యెషయా మాటలను ఎత్తివ్రాసిన తర్వాత, పౌలు ఇలా చెబుతున్నాడు: “ఇదిగో! ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో! ఇదే రక్షణ దినము.” (2 కొరింథీయులు 6: 2) యేసు మరణించిన 22 సంవత్సరాల తర్వాత పౌలు ఈ మాటలు వ్రాశాడు. సా.శ. 33 పెంతెకొస్తునాడు క్రైస్తవ సంఘం ఉద్భవించడంతో, క్రీస్తు అభిషిక్త అనుచరులు కూడా దానిలో భాగమయ్యేలా యెహోవా తన హితవత్సరాన్ని పొడిగించాడని స్పష్టమవుతోంది.

19. యెహోవా కరుణించు సమయము నుండి క్రైస్తవులు నేడు ఎలా ప్రయోజనం పొందవచ్చు?

19 దేవుని పరలోక రాజ్య వారసులుగా అభిషేకించబడని నేటి యేసు అనుచరుల మాటేమిటి? భూనిరీక్షణగల వారు ఈ అనుకూల సమయము నుండి ప్రయోజనం పొందగలరా? తప్పకుండా. పరదైసు భూమిపై జీవితాన్ని ఆనందించడానికి “మహా శ్రమలను” తప్పించుకొని వచ్చే గొప్ప సమూహం పట్ల ఇది యెహోవా వైపునుండి కరుణించు సమయము అని బైబిలు పుస్తకమైన ప్రకటన గ్రంథం చూపిస్తోంది. (ప్రకటన 7:​13-17) కాబట్టి, అపరిపూర్ణ మానవులకు యెహోవా తన కరుణను అనుగ్రహించే ఈ పరిమిత సమయము నుండి క్రైస్తవులందరూ ప్రయోజనం పొందవచ్చు.

20. క్రైస్తవులు ఏ విధంగా యెహోవా కృపను వ్యర్థం చేసుకోకుండా ఉండగలరు?

20 అపొస్తలుడైన పౌలు యెహోవా కరుణించు సమయాన్ని గురించి ప్రకటించడానికి ముందు ఒక హెచ్చరికను చేశాడు. తాము “పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని” ఆయన క్రైస్తవులను వేడుకున్నాడు. (2 కొరింథీయులు 6: 1) అలాగే, క్రైస్తవులు దేవుడ్ని ప్రీతిపరచడానికీ, ఆయన చిత్తాన్ని చేయడానికీ ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. (ఎఫెసీయులు 5:​15, 16) “సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. . . . పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు​—⁠నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి” అని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని వారు అనుసరించడం మంచిది.​—⁠హెబ్రీయులు 3:​12, 13.

21. యెషయా 49 వ అధ్యాయంలోని మొదటి భాగం ఏ సంతోషకరమైన వ్యాఖ్యానంతో ముగుస్తుంది?

21 యెహోవాకు ఆయన మెస్సీయకు మధ్యన జరిగిన ప్రవచనార్థక వ్యక్తీకరణలు ముగింపుకు వస్తుండగా, యెషయా ఒక సంతోషభరితమైన వ్యాఖ్యానాన్ని చేస్తున్నాడు: “శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము. భూమీ, సంతోషించుము, పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.” (యెషయా 49:​13) ప్రాచీన కాలంనాటి ఇశ్రాయేలీయులకూ, యెహోవా గొప్ప సేవకుడైన యేసుక్రీస్తుకూ, అలాగే యెహోవా అభిషిక్త సేవకులకూ, నేడు వారి “వేరే గొఱ్ఱెల” సహవాసులకూ ఎంత చక్కని ఓదార్పుకరమైన మాటలో కదా!​—⁠యోహాను 10:​16.

యెహోవా తన ప్రజలను మరచిపోడు

22. యెహోవా తాను తన ప్రజలను ఎన్నడూ మరచిపోనని ఎలా నొక్కిచెబుతున్నాడు?

22 యెషయా ఇప్పుడు యెహోవా ప్రకటనలను తెలియజేయడాన్ని కొనసాగిస్తున్నాడు. చెరలో ఉన్న ఇశ్రాయేలీయులు అలసిపోయి ఆశలు వదులుకునే అవకాశం ఉందని ఆయన ప్రవచిస్తున్నాడు. యెషయా ఇలా చెబుతున్నాడు: “సీయోను​—⁠యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు, ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.” (యిషయా 49:​14) అది నిజమేనా? యెహోవా తన ప్రజలను విడనాడి వారిని మరచిపోయాడా? యెషయా యెహోవా ప్రతినిధిగా, ఇలా కొనసాగిస్తున్నాడు: “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.” (యెషయా 49:​15) యెహోవా నుండి ఎంతటి ప్రేమపూర్వకమైన ప్రతిస్పందన! దేవునికి తన ప్రజలపట్లనున్న ప్రేమ, తల్లికి తన బిడ్డపట్ల ఉండే ప్రేమకన్నా గొప్పది. ఆయన తన యథార్థవంతుల గురించి నిత్యము ఆలోచిస్తుంటాడు. వారి పేర్లు తన చేతుల మీద లిఖించబడి ఉన్నట్లుగా ఆయన వారిని గుర్తుతెచ్చుకుంటాడు: “చూడుము! నా యరచేతులమీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి.”​—యిషయా 49:​16.

23. యెహోవా తమను మరచిపోడని క్రైస్తవులు విశ్వాసం కలిగి ఉండాలని పౌలు వారిని ఎలా ప్రోత్సహించాడు?

23 అపొస్తలుడైన పౌలు గలతీయులకు తాను వ్రాసిన పత్రికలో క్రైస్తవులను ఇలా ఉద్బోధించాడు: “మనము మేలుచేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.” (గలతీయులు 6: 9) హెబ్రీయులకు ఆయన ఈ ప్రోత్సాహకరమైన మాటలు వ్రాశాడు: “మీరు చేసిన కార్యమును, . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.” (హెబ్రీయులు 6:​10) యెహోవా తన ప్రజలను మరచిపోయాడని మనం ఎన్నడూ భావించకూడదు. ప్రాచీన సీయోనులా, ఆనందంగా ఉండడానికీ, యెహోవా కోసం సహనంతో వేచివుండడానికి క్రైస్తవులకు మంచి కారణం ఉంది. ఆయన తన నిబంధన షరతులకు, వాగ్దానాలకు దృఢంగా కట్టుబడి ఉంటాడు.

24. సీయోను ఏ విధంగా పునఃస్థాపించబడుతుంది, అది ఏ ప్రశ్నలు అడుగుతుంది?

24 యెహోవా యెషయా ద్వారా అదనపు ఓదార్పును ఇస్తున్నాడు. ‘[సీయోనును] నాశనము చేసే’ బబులోనీయులేగానీ లేదా మతభ్రష్ట యూదులేగానీ ఇక ఎంతమాత్రం ప్రమాదకరం కాదు. సీయోను “కుమారులు” అంటే యెహోవాపట్ల యథార్థంగా మిగిలి ఉండే చెరలోనున్న యూదులు “త్వరపడుచున్నారు.” వారు ‘కూడుకొంటారు.’ “పెండ్లికుమార్తె” ‘ఆభరణములు’ ధరించినట్లుగా, త్వరపెట్టి యెరూషలేముకు తిరిగి తీసుకురాబడిన యూదులు తమ రాజధాని నగరానికి అలంకారంగా ఉంటారు. (యిషయా 49:​17, 18) సీయోనులోని స్థలములు ఇంతకాలం ‘పాడు’గా ఉన్నాయి. తన నివాస స్థలములు ఇరుకు అనిపించేంతగా అది హఠాత్తుగా అనేకమంది నివాసులతో నిండిపోయినప్పుడు దానికి ఎంత ఆశ్చర్యం కలుగుతుందో ఊహించండి. (యెషయా 49:19, 20 చదవండి.) సహజంగానే, అది ఈ పిల్లలందరూ ఎక్కడి నుండి వచ్చారని అడుగుతుంది: “నేను నా పిల్లలను పోగొట్టుకొని, సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా? వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవాడెవడు? నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి?” (యిషయా 49:​21) ఒకప్పుడు సంతానహీనురాలిగా ఉన్న సీయోనుకు ఎంతటి సంతోషకరమైన పరిస్థితి!

25. ఆధునిక కాలాల్లో, ఆధ్యాత్మిక ఇశ్రాయేలు ఏ పునఃస్థాపనను చవిచూసింది?

25 ఈ మాటలకు ఆధునిక నెరవేర్పు కూడా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం నాటి కష్టతరమైన సంవత్సరాల్లో, ఆధ్యాత్మిక ఇశ్రాయేలు విడువబడింది, చెరలో ఉంచబడింది. కాని అది పునఃస్థాపించబడి, ఆధ్యాత్మిక పరదైసులోనికి వచ్చింది. (యెషయా 35:​1-10) యెషయా వర్ణించిన, ఒకప్పుడు నాశనం చేయబడిన నగరంలా​—⁠ఒకవిధంగా చెప్పాలంటే​—⁠అది తాను సంతోషభరితమైన చురుకైన యెహోవా ఆరాధకులతో నిండివుండడం చూసి ఎంతో ఆనందించింది.

“ప్రజలకు ధ్వజము”

26. స్వతంత్రులైన తన ప్రజలకు యెహోవా ఏ నిర్దేశాన్నిస్తాడు?

26 ప్రవచనార్థక విధానంలో, యెహోవా ఇప్పుడు యెషయాను తన ప్రజలు బబులోను నుండి విడుదల చేయబడే సమయానికి తీసుకువెళుతున్నాడు. వారు ఏమైనా దైవిక నిర్దేశాన్ని పొందుతారా? యెహోవా ఇలా సమాధానం ఇస్తున్నాడు: “నేను జనములతట్టు నా చెయియెత్తుచున్నాను, జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు.” (యెషయా 49:​22) తొలి నెరవేర్పులో, మునుపు పరిపాలనకు కేంద్రస్థానమూ, యెహోవా ఆలయమున్న స్థలమూ అయిన యెరూషలేము యెహోవా “ధ్వజము” అవుతుంది. “రాజులు,” “రాణులు” వంటి, ఇతర జనాంగములకు చెందిన ప్రముఖులు, శక్తివంతులు అయినవారు ఇశ్రాయేలీయులకు వారి తిరుగు ప్రయాణంలో సహాయం చేస్తారు. (యిషయా 49:​23ఎ) ఈ సహాయకులలో, పారసీక రాజులైన కోరెషు, అర్తహషస్త లాంగిమెనస్‌, మరియు వారి కుటుంబాలు ఉంటారు. (ఎజ్రా 5:13; 7:​11-26) యెషయా మాటలు మరో విధంగా కూడా అన్వయింపజేయబడ్డాయి.

27. (ఎ) గొప్ప నెరవేర్పులో, ప్రజలు ఏ “ధ్వజము” వద్దకు సమకూడుతారు? (బి) అన్ని జనాంగముల వారు మెస్సీయ పరిపాలన ఎదుట తలవంచేలా చేయబడినప్పుడు దాని ఫలితం ఏమై ఉంటుంది?

27 “ప్రజలకు ధ్వజము” గురించి యెషయా 11: 10 మాట్లాడుతుంది. అపొస్తలుడైన పౌలు ఈ మాటలను క్రీస్తు యేసుకు అన్వయింపజేశాడు. (రోమీయులు 15:​8-12) కాబట్టి గొప్ప నెరవేర్పులో, ప్రజలు సమకూడే యెహోవా “ధ్వజము” ఎవరంటే యేసు, ఆయన ఆత్మాభిషిక్త సహపరిపాలకులు. (ప్రకటన 14: 1) తగిన సమయంలో భూమిపైనున్న ప్రజలందరూ చివరికి నేటి పరిపాలక తరగతులు కూడా మెస్సీయ పరిపాలన ఎదుట తలవంచాల్సిందే. (కీర్తన 2:​10, 11; దానియేలు 2:​44) దాని ఫలితం? యెహోవా ఇలా చెబుతున్నాడు: “నేను యెహోవాననియు నాకొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.”​—యెషయా 49:23బి.

“ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది”

28. (ఎ) తన ప్రజలు విడుదల చేయబడతారని యెహోవా వారికి మరోసారి ఏ మాటలతో హామీ ఇస్తున్నాడు? (బి) తన ప్రజలకు సంబంధించి యెహోవాకు ఇంకా ఏ వాగ్దానం నిలిచి ఉంది?

28 బబులోను చెరలో ఉన్న కొంతమంది, ‘ఇశ్రాయేలు విడుదల చేయబడడం నిజంగా సాధ్యమేనా?’ అని ఆలోచిస్తుండవచ్చు. ఇలా అడగడం ద్వారా యెహోవా ఆ ప్రశ్నను పరిగణలోకి తీసుకుంటాడు: “బలాఢ్యుని చేతిలోనుండి కొల్లసొమ్ము ఎవడు తీసికొనగలడు? భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురా?” (యిషయా 49:​24) అవును అన్నదే దానికి సమాధానం. యెహోవా వారికిలా హామీ ఇస్తాడు: “బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు.” (యిషయా 49:25ఎ) ఎంత ఓదార్పుకరమైన హామీ! అంతేగాక, యెహోవా తన ప్రజలను కాపాడతానన్న దృఢమైన వాగ్దానంతో వారిపట్ల కరుణ చూపిస్తాడు. ఆయన ఎంతో ఖచ్చితంగా ఇలా చెబుతున్నాడు: “నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను, నీ పిల్లలను నేనే రక్షించెదను.” (యెషయా 49:25బి) ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. జెకర్యా 2:8 లో వ్రాయబడినట్లుగా, “మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని” యెహోవా తన ప్రజలకు చెబుతున్నాడు. నిజమే, భూవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆధ్యాత్మిక సీయోనులో సమకూడే అవకాశంగల కరుణించు సమయాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. అయితే, ఆ కరుణించు సమయము ముగింపుకు వస్తుంది.

29. యెహోవాకు విధేయత చూపించడానికి నిరాకరించేవారి కోసం ఏ భయంకరమైన పరిస్థితి వేచి ఉంది?

29 యెహోవాకు విధేయత చూపించడానికి మొండిగా నిరాకరిస్తూ, ఆయన ఆరాధకులను హింసించే వారికి ఏమి జరుగుతుంది? ఆయనిలా చెబుతున్నాడు: “నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించెదను; క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తముచేత వారు మత్తులగుదురు.” (యిషయా 49:26బి) ఎంతటి భయంకరమైన పరిస్థితి! అలాంటి మొండి వ్యతిరేకులకు ఎలాంటి భవిష్యత్తూ లేదు. వారు నాశనం చేయబడతారు. అలా, యెహోవా తన ప్రజలను రక్షించడం ద్వారా, వారి శత్రువులను నాశనం చేయడం ద్వారా రక్షకుడని గుర్తించబడతాడు. ‘యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరు ఎరుగవలెను.’​—యెషయా 49:​26.

30. యెహోవా తన ప్రజల పక్షాన ఏ రక్షణ కార్యాలు చేశాడు, ఆయన ఇంకా ఏమి చేస్తాడు?

30 యెహోవా తన ప్రజలను బబులోను దాసత్వం నుండి విడిపించడానికి కోరెషును ఉపయోగించుకున్నప్పుడు ఆ మాటలు మొదట అన్వయింపజేయబడ్డాయి. యెహోవా తన ప్రజలను ఆధ్యాత్మిక దాసత్వం నుండి విడుదల చేయడానికి సింహాసనాసీనుడిగావున్న తన కుమారుడైన యేసుక్రీస్తును ఉపయోగించుకున్నప్పుడు 1919 లో కూడా అదే విధంగా అన్వయింపజేయబడ్డాయి. కాబట్టి, బైబిలు యెహోవా, యేసుక్రీస్తు ఇద్దరూ రక్షకులేనని చెబుతోంది. (తీతు 2:​11-13; 3:​4-6) యెహోవా మన రక్షకుడు, మెస్సీయ అయిన యేసు ఆయన “అధిపతి.” (అపొస్తలుల కార్యములు 5:​31) వాస్తవానికి, యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన రక్షణ కార్యాలు అద్భుతమైనవి. సువార్త ద్వారా, యెహోవా యథార్థ హృదయులను అబద్ధమత దాసత్వం నుండి విడుదల చేస్తాడు. విమోచన క్రయధన బలి ద్వారా ఆయన వారిని పాపమరణాల దాసత్వం నుండి విడిపిస్తాడు. ఆయన 1919 లో యేసు సహోదరులను ఆధ్యాత్మిక దాసత్వం నుండి విడుదల చేశాడు. త్వరగా సమీపిస్తున్న అర్మగిద్దోను యుద్ధంలో, పాపులపైకి వచ్చే నాశనం నుండి నమ్మకమైన మానవుల ఒక గొప్ప సమూహమును ఆయన విడుదల చేస్తాడు.

31. దేవుని కరుణను పొందగలిగినందుకు క్రైస్తవులు ఎలా ప్రతిస్పందించాలి?

31 కాబట్టి, దేవుని కరుణను పొందేవారిగా ఉండడం ఎంతటి ఆధిక్యత! మనమందరం ఈ అనుకూలమైన సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకుందాము. “మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరిచేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి” అని పౌలు రోమీయులకు వ్రాసిన ఈ మాటలను మనం లక్ష్యపెడుతూ, మన కాలంలోని అత్యవసర పరిస్థితికి అనుగుణంగా చర్య తీసుకుందాము.​—⁠రోమీయులు 13:​11-14.

32. దేవుని ప్రజలకు ఏ హామీలు ఇవ్వబడ్డాయి?

32 యెహోవా తానిచ్చే ఉపదేశాన్ని లక్ష్యపెట్టేవారిపట్ల కరుణ చూపిస్తూనే ఉంటాడు. సువార్త ప్రకటించడాన్ని కొనసాగించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను ఆయన వారికి అనుగ్రహిస్తాడు. (2 కొరింథీయులు 4: 7) యెహోవా, వారి నాయకుడైన యేసును ఉపయోగించుకున్నట్టే తన సేవకులను ఉపయోగించుకుంటాడు. వారు సువార్త సందేశంతో సాత్వికుల హృదయాలను చేరుకోగలిగేలా ఆయన వారి నోటిని “వాడిగల ఖడ్గము”గా చేస్తాడు. (మత్తయి 28:​19, 20) ఆయన “తన చేతి నీడలో” తన ప్రజలను కాపాడతాడు. “మెరుగుపెట్టిన అంబు”లా వారు ‘ఆయన అంబులపొదిలో’ దాచబడతారు. నిజంగా, యెహోవా తన ప్రజలను విడనాడడు!​—⁠కీర్తన 94:​14; యెషయా 49:​2, 15.

[అధస్సూచి]

a “సాతాను, యేసు తనను తలమీద కొట్టేవాడిగా (ఆది 3:​15) ప్రవచించబడిన, దేవుని కుమారుడని నిస్సందేహంగా గుర్తించి, ఆయనను నిర్మూలించడానికి తాను చేయగలిగినదంతా చేశాడు. కానీ, యేసు మరియ గర్భాన జన్మిస్తాడని ఆమెకు ప్రకటించేటప్పుడు, గాబ్రియేలు దూత ఆమెకు ఇలా చెప్పాడు: ‘పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.’ (లూకా 1:​35) యెహోవా తన కుమారుడిని భద్రంగా కాపాడాడు. యేసు పసివాడిగా ఉన్నప్పుడు ఆయనను నాశనం చేయడానికి జరిగిన ప్రయత్నాలు సఫలం కాలేదు.”​—⁠వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ప్రచురించిన లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం), సంపుటి 2, పేజీ 868.

[అధ్యయన ప్రశ్నలు]

[139 వ పేజీలోని చిత్రం]

మెస్సీయ, యెహోవా అంబులపొదిలో “మెరుగుపెట్టిన అంబు”లా ఉన్నాడు

[141 వ పేజీలోని చిత్రం]

మెస్సీయ “అన్యజనులకు వెలుగై” ఉన్నాడు

[147 వ పేజీలోని చిత్రం]

దేవునికి తన ప్రజలపట్ల ఉన్న ప్రేమ, ఒక తల్లికి తన బిడ్డ పట్ల ఉండే ప్రేమకన్నా గొప్పది