కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“క్రొత్తపేరు”

“క్రొత్తపేరు”

ఇరవై మూడవ అధ్యాయం

“క్రొత్తపేరు”

యెషయా 62:​1-12

1. యెషయా 62 వ అధ్యాయంలో ఏ హామీ వ్రాయబడి ఉంది?

 బబులోనులో నిరాశా నిస్పృహలతో ఉన్న యూదులకు కావలసినవి ధైర్యవచనాలు, ఓదార్పు, పునఃస్థాపన నిరీక్షణ. యెరూషలేము, దాని ఆలయము నాశనం చేయబడి అనేక దశాబ్దాలు గడిచిపోయాయి. బబులోను నుండి దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో, యూదా పాడుగా విడువబడి ఉంది, యెహోవా యూదులను మరచిపోయినట్లు అనిపిస్తోంది. వారి పరిస్థితిని ఏవి మెరుగుపరచగలవు? వారిని స్వదేశానికి తిరిగి తీసుకువస్తాననీ, వారు స్వచ్ఛారాధనను పునఃస్థాపించడానికి అనుమతిస్తాననీ యెహోవా చేసిన వాగ్దానాలే. అప్పుడు, “విడువబడిన” మరియు “పాడైన” అనే వర్ణనల స్థానే దేవుని ఆమోదాన్ని తెలియజేసే పేర్లు ఇవ్వబడతాయి. (యెషయా 62: 4; జెకర్యా 2:​12) యెషయా 62 వ అధ్యాయం నిండా ఈ వాగ్దానాలే ఉన్నాయి. అయితే, ఇతర పునఃస్థాపన ప్రవచనాల్లాగే ఈ అధ్యాయం కూడా, యూదులు బబులోను చెర నుండి విడుదల చేయబడడం కన్నా ఎంతో గొప్ప వివాదాంశాలను ప్రస్తావిస్తుంది. యెషయా 62 వ అధ్యాయం దాని ప్రధాన నెరవేర్పులో, యెహోవా ఆధ్యాత్మిక జనమైన “దేవుని ఇశ్రాయేలు”కు రక్షణ నిశ్చయమని మనకు హామీ ఇస్తుంది.​—⁠గలతీయులు 6:​16.

యెహోవా ఊరకుండడు

2. యెహోవా సీయోనుపై మరోసారి అనుగ్రహం ఏ విధంగా చూపిస్తాడు?

2 సా.శ.పూ. 539 లో బబులోను పడద్రోయబడింది. ఆ తర్వాత, దైవభయంగల యూదులు యెరూషలేముకు తిరిగి వచ్చి యెహోవా ఆరాధనను పునఃస్థాపించడాన్ని సాధ్యం చేసే ఆజ్ఞను పారసీక రాజైన కోరెషు జారీ చేస్తాడు. (ఎజ్రా 1:​2-4) మొదట తిరిగి వచ్చిన యూదులు, సా.శ.పూ. 537 లో తమ స్వదేశంలో ఉన్నారు. యెహోవా మరోసారి యెరూషలేము పట్ల అనుగ్రహం చూపిస్తాడు, అది ఆయన చేసిన ఈ ప్రవచనార్థక ప్రకటనలోని వాత్సల్యంలో ప్రతిబింబిస్తోంది: “సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను.”​—యెషయా 62: 1.

3. (ఎ) భూసంబంధమైన సీయోను చివరికి యెహోవాచే ఎందుకు తిరస్కరించబడింది, దాని స్థానాన్ని ఎవరు తీసుకుంటారు? (బి) దేనిలో నుండి వైదొలగిపోవడం జరుగుతుంది, అది ఎప్పుడు జరుగుతుంది, నేడు మనం ఏ కాలంలో జీవిస్తున్నాము?

3 యెహోవా సీయోనును లేదా యెరూషలేమును పునఃస్థాపిస్తానని తాను చేసిన వాగ్దానాన్ని సా.శ.పూ. 537 లో నెరవేర్చాడు. దాని నివాసులు ఆయన రక్షణను పొందారు, వారి నీతి తేజోమయంగా ప్రకాశించింది. అయితే ఆ తర్వాత, మళ్ళీ వారు స్వచ్ఛారాధన నుండి వైదొలగిపోయారు. చివరికి, వారు యేసు మెస్సీయ అన్న విషయాన్ని నిరాకరించారు, తుదకు యెహోవా తాను ఎంపిక చేసుకున్న జనముగా ఉండకుండా వారిని విడిచిపెట్టాడు. (మత్తయి 21:​43; 23:​38; యోహాను 1:​9-13) యెహోవా ఒక క్రొత్త జనము, అంటే “దేవుని ఇశ్రాయేలు” ఉద్భవించేలా చేశాడు. ఈ క్రొత్త జనము ఆయన ప్రత్యేక ప్రజలయ్యారు, మొదటి శతాబ్దంలో, దాని సభ్యులు అప్పట్లో తెలిసిన ప్రపంచమంతటికీ అత్యాసక్తితో సువార్త ప్రకటించారు. (గలతీయులు 6:​16; కొలొస్సయులు 1:​23) విచారకరంగా, అపొస్తలుల మరణం తర్వాత, నిజమైన మతం నుండి వైదొలగిపోవడం జరిగింది. ఫలితంగా, నేడు క్రైస్తవమత సామ్రాజ్యంలో కనుగొనబడుతున్నట్లుగా, భ్రష్ట క్రైస్తవత్వం వృద్ధి చెందింది. (మత్తయి 13:​24-30, 36-43; అపొస్తలుల కార్యములు 20:​29, 30) శతాబ్దాలపాటు, క్రైస్తవమత సామ్రాజ్యం యెహోవా నామముపైకి గొప్ప అపనిందను తీసుకువచ్చేందుకు అనుమతించబడింది. అయితే, చివరకు 1914 లో, యెషయా ప్రవచనంలోని ఈ భాగపు ప్రధాన నెరవేర్పుతోపాటు యెహోవా “హితవత్సరము” ప్రారంభమైంది.​—⁠యెషయా 61: 2.

4, 5. (ఎ) సీయోను, ఆమె పిల్లలు నేడు ఎవరిని సూచిస్తున్నారు? (బి) సీయోను ‘రక్షణ దీపమువలె వెలుగుతుండేలా’ చేయడానికి యెహోవా దానిని ఎలా ఉపయోగించుకున్నాడు?

4 సీయోనును పునఃస్థాపిస్తానన్న యెహోవా వాగ్దానం నేడు ఆయన పరలోక సంస్థ అయిన “పైనున్న యెరూషలేము”పై నెరవేరింది, ఆమె పిల్లలైన ఆత్మాభిషిక్త క్రైస్తవులు భూమిపై దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. (గలతీయులు 4:​26) యెహోవా పరలోక సంస్థ ఎంతో అప్రమత్తంగా, ప్రేమపూర్వకంగా, కష్టించి పనిచేసే సమర్పిత సహాయకురాలిగా సేవచేస్తోంది. ఆమె 1914 లో మెస్సీయ రాజ్యానికి జన్మనిచ్చినప్పుడు అదెంతటి పులకరింపజేసే సందర్భమో కదా! (ప్రకటన 12:​1-5) ప్రాముఖ్యంగా 1919 నుండి, ఆమె భూసంబంధమైన పిల్లలు ఆమె నీతి రక్షణల గురించి జనములకు ప్రకటించారు. యెషయా ప్రవచించినట్లుగానే, ఈ పిల్లలు దీపములా తమ వెలుగును ప్రకాశింపజేస్తూ అంధకారాన్ని పారద్రోలారు.​—⁠మత్తయి 5:​15, 16; ఫిలిప్పీయులు 2:​14, 15.

5 యెహోవా తన ఆరాధకులపట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆయన తాను సీయోనుకు ఆమె పిల్లలకు చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చే వరకు విశ్రమించడు లేక ఊరకుండడు. తమ సహవాసులైన “వేరే గొఱ్ఱెల”తోపాటు, అభిషిక్తులలో మిగిలివున్న వారు కూడా మౌనంగా ఉండడానికి నిరాకరిస్తారు. (యోహాను 10:​16) వారు నోరు తెరిచి, ప్రజలకు ఏకైక రక్షణ మార్గాన్ని తెలియజేస్తారు.​—⁠రోమీయులు 10:​10.

యెహోవా పెట్టిన “క్రొత్త పేరు”

6. సీయోను గురించి యెహోవా మనసులో ఏముంది?

6 ప్రాచీన యెరూషలేముచే ప్రాతినిధ్యం వహించబడుతున్న తన పరలోక “స్త్రీ” అయిన సీయోను గురించి యెహోవా మనస్సులో ఏముంది? ఆయనిలా పేర్కొంటున్నాడు: ‘జనములు నీ నీతిని కనుగొనును, [“ఓ స్త్రీ,” NW] రాజులందరు నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్తపేరు నీకు పెట్టబడును.’ (యిషయా 62: 2) ఇశ్రాయేలీయులు నీతిగా ప్రవర్తిస్తున్నప్పుడు, జనములు అవధానమిచ్చి చూడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి రాజులు కూడా, యెహోవా యెరూషలేమును ఉపయోగించుకుంటున్నాడనీ, తమకున్న ఏ అధికారమైనా యెహోవా రాజ్యం ముందు వెలవెలబోతుందనీ అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.​—⁠యెషయా 49:​23.

7. సీయోను క్రొత్త పేరు ఏమి సూచిస్తుంది?

7 యెహోవా ఇప్పుడు, సీయోనుకు ఒక క్రొత్త పేరు పెట్టడం ద్వారా, మారిన ఆమె పరిస్థితిని ధృవీకరిస్తున్నాడు. ఆ క్రొత్త పేరు, సా.శ.పూ. 537 మొదలుకొని సీయోను యొక్క భూసంబంధమైన పిల్లలు అనుభవిస్తున్న ఆశీర్వాదకరమైన స్థితిని, గౌరవనీయమైన స్థానాన్ని సూచిస్తుంది. a సీయోను తనకు చెందుతుందని యెహోవా అంగీకరిస్తున్నాడని అది చూపిస్తుంది. నేడు, దేవుని ఇశ్రాయేలు ఈ విధంగా యెహోవాకు ఆనందం కలిగించేదానిగా ఉండడానికి పులకించిపోతుంది, వేరే గొఱ్ఱెలు వారితోపాటు సంతోషిస్తున్నారు.

8. యెహోవా సీయోనును ఏ యే విధాలుగా ఘనపరిచాడు?

8 సీయోనుకు ఆమె క్రొత్తపేరును ఇచ్చిన తర్వాత, ఇప్పుడు యెహోవా ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను, నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.” (యెషయా 62: 3) అందరూ ప్రశంసించగలిగేలా, యెహోవా తన ఆలంకారిక భార్య అయిన పరలోక సీయోనును ఉన్నతపరుస్తాడు. (కీర్తన 48: 2; 50: 2) భూషణకిరీటము, ‘రాజ మకుటము’ ఆమె గౌరవముతోనూ అధికారముతోనూ అలంకరింపబడిందని సూచిస్తున్నాయి. (జెకర్యా 9:​16) దేవుని చెయ్యి అంటే ఆయన అన్వర్తిత శక్తి చర్య గైకొనడం యొక్క గమనార్హమైన ఫలితమే పరలోక సీయోనుకు లేదా “పైనున్న యెరూషలేము”కు ప్రాతినిధ్యం వహిస్తున్న దేవుని ఇశ్రాయేలు. (గలతీయులు 4:​26) యెహోవా సహాయంతో ఆ ఆధ్యాత్మిక జనము సత్యసంధత, భక్తి కలిగివుండడంలో గమనార్హమైన రికార్డును స్థాపించింది. అభిషిక్తులకు, వేరే గొఱ్ఱెలకు చెందిన లక్షలాదిమంది విశేషమైన విశ్వాసాన్ని, ప్రేమను చూపించేలా బలపర్చబడ్డారు. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో అభిషిక్తులు తమ మహిమాన్వితమైన పరలోక ప్రతిఫలాన్ని పొందినవారై, మూల్గులిడుచున్న సృష్టిని నిత్యజీవానికి నడిపించడంలో యెహోవా చేతిలో ఉపకరణాలుగా ఉంటారు.​—⁠రోమీయులు 8:​20, 22; ప్రకటన 22: 2.

“యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు”

9. సీయోను రూపాంతరాన్ని వర్ణించండి.

9 క్రొత్త పేరు ఇవ్వడమన్నది, తన భూసంబంధమైన పిల్లలచే ప్రాతినిధ్యం వహించబడుతున్న పరలోక సీయోను యొక్క ఆనందకరమైన రూపాంతరంలో ఒక భాగమే. మనమిలా చదువుతాము: “విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు; పాడైనదని ఇకను దేశమునుగూర్చి చెప్పబడదు; హెప్సీబా [“ఇష్టురాలు,” అధస్సూచి] అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును.” (యెషయా 62: 4) భూసంబంధమైన సీయోను సా.శ.పూ. 607 లో నాశనమైనప్పటి నుండీ అలాగే విడువబడింది. అయితే, యెహోవా మాటలు దాని పునఃస్థాపనను గురించి, ఆ దేశంలో ప్రజలు తిరిగి నివసించడాన్ని గురించి హామీ ఇస్తున్నాయి. ఒకప్పుడు నాశనం చేయబడిన సీయోను పూర్తిగా విడువబడిన స్త్రీలా ఇక ఎంతమాత్రం ఉండదు, ఆ దేశము పాడైనదానిగా ఎంతమాత్రం ఉండదు. సా.శ.పూ. 537 లో యెరూషలేము పునఃస్థాపనను అంటే మునుపటి దాని శిధిలావస్థకు పూర్తి భిన్నమైన ఒక క్రొత్త స్థితిని అది పొందుతుంది. సీయోను “ఇష్టురాలు” అనీ, దాని దేశము ‘వివాహితమైనది’ అనీ పిలువబడుతుందని యెహోవా ప్రకటిస్తున్నాడు.​—⁠యెషయా 54:​1, 5, 6; 66: 8; యిర్మీయా 23:​5-8; 30:​17; గలతీయులు 4:​27-31.

10. (ఎ) దేవుని ఇశ్రాయేలు ఎలా రూపాంతరం చెందింది? (బి) దేవుని ఇశ్రాయేలు యొక్క “దేశము” ఏది?

10 దేవుని ఇశ్రాయేలు 1919 మొదలుకొని అటువంటి మార్పునే చవిచూసింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అభిషిక్త క్రైస్తవులు దేవుడు వదిలివేసినవారిలా కనిపించారు. కానీ 1919 లో వారు తమ అనుగ్రహ స్థితిని తిరిగి పొందారు, వారి ఆరాధనా విధానం శుద్ధీకరించబడింది. ఇది వారి బోధలపై, వారి సంస్థపై, వారి కార్యకలాపాలపై ప్రభావాన్ని చూపించింది. దేవుని ఇశ్రాయేలు దాని “దేశము”లోనికి అంటే దాని ఆధ్యాత్మిక ఎస్టేటులోకి లేదా కార్యకలాపాల పరిధిలోకి ప్రవేశించింది.​—⁠యెషయా 66:​7, 8, 20-22.

11. యూదులు తమ తల్లిని వరించి పెండ్లి చేసుకుంటారన్నది ఏ అర్థంలో?

11 యెహోవా తన ప్రజల క్రొత్త, అనుగ్రహ స్థానాన్ని మరింత నొక్కిచెబుతూ, ఇలా ప్రకటిస్తున్నాడు: “యౌవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు, నీ కుమారులు నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు. పెండ్లికుమారుడు పెండ్లికూతురిని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్నుగూర్చి సంతోషించును.” (యెషయా 62: 5) సీయోను “కుమారులు” అయిన యూదులు తమ తల్లిని వరించి పెండ్లిచేసుకుంటారన్నది ఏ భావంలో? బబులోను చెర నుండి విడుదల చేయబడి తిరిగివస్తున్న సీయోను కుమారులు తమ పాత రాజధాని నగరాన్ని స్వాధీనం చేసుకుని, మరోసారి దానిలో నివాసం ఏర్పరచుకుంటారు. అది జరిగినప్పుడు, సీయోను ఇక పాడైనదిగా ఎంతమాత్రం ఉండదు గానీ కుమారులతో నింపబడుతుంది.​—⁠యిర్మీయా 3:​14.

12. (ఎ) అభిషిక్త క్రైస్తవులు వివాహమందు తనతో జతచేయబడిన సంస్థలో భాగమై ఉన్నారని యెహోవా ఏ విధంగా స్పష్టం చేశాడు? (బి) యెహోవా తన ప్రజలతో వ్యవహరించిన విధానం, నేడు వివాహానికి ఒక ఉన్నతమైన మాదిరిని ఎలా అందజేస్తుంది? (342 వ పేజీలోని బాక్సును చూడండి.)

12 దానికి సాదృశ్యంగా, 1919 మొదలుకొని పరలోక సీయోను పిల్లలు, ‘వివాహితమైనది’ అనే ప్రవచనార్థక పేరు గల తమ దేశాన్ని అంటే తమ ఆధ్యాత్మిక ఎస్టేటును స్వాధీనం చేసుకున్నారు. ఆ దేశంలో వారి క్రైస్తవ కార్యకలాపాలు, ఈ అభిషిక్త క్రైస్తవులు ‘[యెహోవా] నామము కొరకైన జనము’ అని స్పష్టం చేశాయి. (అపొస్తలుల కార్యములు 15:​14) వారు రాజ్య ఫలాలను తీసుకురావడమూ, యెహోవా నామమును ప్రకటింపజేయడమూ యెహోవా ఈ క్రైస్తవులను బట్టి ఆనందిస్తున్నాడని విశదమవుతుంది. విడదీయరాని ఐక్యతతో తనతో జతచేయబడి ఉన్న సంస్థలో వారు భాగమని ఆయన స్పష్టీకరించాడు. ఈ క్రైస్తవులను తన పరిశుద్ధాత్మతో అభిషేకించడం ద్వారా, ఆధ్యాత్మిక చెర నుండి వారిని విడిపించడం ద్వారా, మానవజాతికంతటికీ రాజ్య నిరీక్షణను ప్రకటించేందుకు వారిని ఉపయోగించుకోవడం ద్వారా, యెహోవా పెండ్లి కూతురిని చూచి సంతోషించే పెండ్లి కుమారునిలా తాను సంతోషించానని చూపించాడు.​—⁠యిర్మీయా 32:​41.

“విశ్రమింపకుడి”

13, 14. (ఎ) ప్రాచీన కాలాల్లో, యెరూషలేము ఎలా భద్రతనిచ్చే నగరంగా తయారైంది? (బి) ఆధునిక కాలాల్లో, సీయోనుకు ‘లోకమంతట ప్రసిద్ధి’ ఎలా కలిగింది?

13 యెహోవా ఇచ్చిన సూచనార్థకమైన క్రొత్త పేరు, ఆయన ప్రజలు తాము సురక్షితంగా ఉన్నట్లు భావించేలా చేస్తుంది. తాము ఆయనకు చెందినవారమని ఆయన తమను అంగీకరిస్తాడని వారికి తెలుసు. యెహోవా ఇప్పుడు మరో ఉపమానాన్ని ఉపయోగిస్తూ, ప్రాకారములుగల నగరంతో మాట్లాడినట్లుగా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు: “యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలివారిని ఉంచియున్నాను. రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించువరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి.” (యెషయా 62: 6, 7ఎ) నమ్మకమైన శేషము బబులోను నుండి తిరిగి వచ్చిన తర్వాత యెహోవా నిర్ణీత సమయంలో, యెరూషలేముకు నిజంగానే ‘లోకమంతట ప్రసిద్ధి కలిగింది,’ అంటే అది తన నివాసులకు భద్రతనిస్తూ ప్రాకారములుగల నగరం అయ్యింది. ఆ ప్రాకారములపైనున్న కావలివారు నగర భద్రతను నిశ్చయపరచుకోవడానికీ, దాని పౌరులకు హెచ్చరికా సందేశాలను అందజేయడానికీ రాత్రింబగళ్ళు అప్రమత్తంగా ఉన్నారు.​—⁠నెహెమ్యా 6:​15; 7: 3; యెషయా 52: 8.

14 అబద్ధమత శృంఖలాల నుండి విడుదల పొందడానికీ దీనులకు మార్గాన్ని చూపించేందుకూ యెహోవా ఆధునిక కాలాల్లో తన అభిషిక్త కావలివారిని ఉపయోగించుకుంటున్నాడు. వీరు ఆయన సంస్థలోకి రమ్మని ఆహ్వానించబడ్డారు, అక్కడ వారు ఆధ్యాత్మిక కలుషితం నుండి, భక్తిరహితమైన ప్రభావాల నుండి, యెహోవాకు అయిష్టమైన కార్యాల నుండి కాపుదల కనుగొంటారు. (యిర్మీయా 33: 9; జెఫన్యా 3:​19) అలాంటి కాపుదలకు, “తగినవేళ” ఆధ్యాత్మిక “అన్నము” పెట్టే ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అయిన కావలివాని తరగతి నిర్వహించే పాత్ర ఆవశ్యకమైనది. (మత్తయి 24:​45-47) సీయోనుకు ‘లోకమంతట ప్రసిద్ధి’ కలిగేలా చేయడంలో, కావలివాని తరగతితో కలిసి పనిచేస్తూ “గొప్పసమూహము” కూడా గమనార్హమైన పాత్రను నిర్వహిస్తోంది.​—⁠ప్రకటన 7: 9.

15. కావలివాని తరగతి, వారి సహవాసులు ఎలా విడువక యెహోవా సేవ చేస్తారు?

15 కావలివాని తరగతి, వారి సహవాసులు చేస్తున్న సేవ కొనసాగుతోంది! వారు పూర్ణాత్మతో సేవ చేస్తున్నారు. దాన్ని మనం ప్రయాణ పైవిచారణకర్తలు, వారి భార్యలు, వివిధ బేతేలు గృహాల్లోనూ యెహోవాసాక్షుల ముద్రణా సౌకర్యాల్లోనూ ఉన్న స్వచ్ఛంద సేవకులు, మిషనరీలు, ప్రత్యేక పయినీర్లు, క్రమపయినీర్లు, సహాయక పయినీర్లు ఇస్తున్న మద్దతుతో లక్షలాదిమంది నమ్మకమైన వ్యక్తులు అత్యాసక్తితో చేస్తున్న కార్యకలాపాల్లో చూడవచ్చు. అంతేగాక, వారు క్రొత్త రాజ్యమందిరాలను నిర్మించడంలోనూ, రోగులను దర్శించడంలోనూ, సవాలుదాయకమైన వైద్య పరిస్థితులను ఎదుర్కొంటున్న వ్యక్తులకు సహాయం చేయడంలోనూ, ప్రకృతి వైపరీత్యాలకు దుర్ఘటనలకు గురైన వారికి సమయానుకూలమైన ఉపశమనాన్ని ఇవ్వడంలోనూ కష్టించి పనిచేస్తారు. స్వయంత్యాగపూరితులైన వీరిలో అనేకులు తరచూ అక్షరార్థంగా “రాత్రింబగళ్లు” సేవచేస్తారు.​—⁠ప్రకటన 7:​14, 15.

16. యెహోవా సేవకులు ఏ విధంగా ‘ఆయనను విశ్రమింపనియ్యరు’?

16 యెహోవా సేవకులు ఎడతెగక ప్రార్థించమని, దేవుని ‘చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరాలని’ ఆయనను వేడుకోమని ప్రోత్సహించబడుతున్నారు. (మత్తయి 6:​9, 10; 1 థెస్సలొనీకయులు 5:17) సత్యారాధన పునఃస్థాపించబడడానికి సంబంధించిన కోరికలు నిరీక్షణలు నెరవేర్చబడేవరకు ‘[యెహోవాను] విశ్రమింపనియ్య’ వద్దని వారికి ఉద్బోధించబడుతోంది. ‘దివారాత్రులు దేవునికి మొఱ్ఱపెట్టమని’ తన అనుచరులను కోరుతూ యేసు ఎడతెగక ప్రార్థించవలసిన అవసరతను నొక్కి చెప్పాడు.​—⁠లూకా 18:​1-8.

దేవునికి చేసే సేవకు ప్రతిఫలం లభిస్తుంది

17, 18. (ఎ) సీయోను నివాసులు తమ శ్రమ ఫలాన్ని అనుభవించడాన్ని ఏ విధంగా నిరీక్షించవచ్చు? (బి) యెహోవా ప్రజలు నేడు తమ శ్రమ ఫలాలను ఎలా అనుభవిస్తున్నారు?

17 యెహోవా తన ప్రజలకిచ్చే క్రొత్త పేరు, వారి ప్రయాసలు వ్యర్థం కావడం లేదని వారికి హామీ ఇస్తాయి. “తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను​—⁠నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు; పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాని త్రాగుదురు.” (యిషయా 62:7బి-9) యెహోవా దక్షిణ హస్తము, ఆయన బాహుబలము ఆయన శక్తికి, బలానికి చిహ్నాలు. (ద్వితీయోపదేశకాండము 32:42బి; యెహెజ్కేలు 20: 5) ఆయన వీటి తోడని ప్రమాణం చేయడం, సీయోను అవస్థను మార్చాలని ఆయన దృఢనిశ్చయం చేసుకున్నాడని చూపిస్తోంది. సా.శ.పూ. 607 లో, సీయోను శత్రువులు ఆమెను దోచుకుని ఆమె ఆస్తులను కొల్లగొట్టడానికి యెహోవా అనుమతిస్తాడు. (ద్వితీయోపదేశకాండము 28:​33, 51) కానీ ఇప్పుడు, సీయోను సంపదలు కేవలం హక్కుదారులు మాత్రమే అనుభవిస్తారు.​—⁠ద్వితీయోపదేశకాండము 14:​22-27.

18 ఈ వాగ్దానపు ఆధునిక దిన నెరవేర్పులో, యెహోవా యొక్క పునఃస్థాపించబడిన ప్రజలు గొప్ప ఆధ్యాత్మిక సమృద్ధిని అనుభవిస్తారు. వారు తమ శ్రమ ఫలమును పూర్తిగా అనుభవిస్తారు అంటే క్రైస్తవ శిష్యుల సంఖ్యాపరమైన అభివృద్ధిని చూస్తారు, పుష్కలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని పొందుతారు. (యెషయా 55:​1, 2; 65:​14) యెహోవా ప్రజలు నమ్మకంగా ఉన్నందుకు, ఆయన వారి శత్రువులు వారి ఆధ్యాత్మిక సమృద్ధికి ఆటంకంగా ఉండేందుకు లేదా వారు చేస్తున్న పూర్ణాత్మతో కూడిన సేవ యొక్క ఫలితాలను వారినుండి తీసివేసేందుకు అనుమతించడు. యెహోవా సేవలో చేయబడిన ఏ పనీ వ్యర్థం కాదు.​—⁠మలాకీ 3:​10-12; హెబ్రీయులు 6:​10.

19, 20. (ఎ) యూదులు యెరూషలేముకు తిరిగి రావడానికి మార్గం ఎలా సుగమం చేయబడింది? (బి) దీనులు యెహోవా సంస్థలోకి రావడానికి ఆధునిక కాలాల్లో మార్గం ఎలా సుగమం చేయబడింది?

19 క్రొత్త పేరు, యెహోవా సంస్థలోని యథార్థహృదయులకు ఆకర్షణీయమైనదిగా కూడా చేస్తుంది. జనసమూహాలు దాని వద్దకు సమకూడుతారు, వారి కోసం మార్గం తెరువబడి ఉంటుంది. యెషయా ప్రవచనం ఇలా పేర్కొంటోంది: “గుమ్మములద్వారా రండి రండి. జనమునకు త్రోవ సిద్ధపరచుడి. రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి. రాళ్లను ఏరి పారవేయుడి. జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి.” (యెషయా 62:​10) మొదటి సందర్భంలో, ఈ పిలుపు బహుశా, యెరూషలేముకు తిరిగి రావడానికి బబులోను నగర గుమ్మముల నుండి బయటికి రావడాన్ని సూచిస్తుండవచ్చు. తిరిగి వచ్చేవారు ప్రయాణం సులభమయ్యేలా త్రోవలో నుండి రాళ్లను ఏరిపారేసి, మార్గమును చూపించడానికి ధ్వజమెత్తాలి.​—⁠యెషయా 11:​12.

20 అభిషిక్త క్రైస్తవులు 1919 నుండి దైవిక సేవకోసం తమను తాము ప్రత్యేకపరచుకొని ‘పరిశుద్ధ మార్గమున’ ప్రయాణిస్తున్నారు. (యెషయా 35: 8) మహా బబులోనులో నుండి బయటికి రావడానికి ఆధ్యాత్మిక రాజమార్గంపై నడిచిన మొదటివారు వారే. (యెషయా 40: 3; 48:​20) దేవుడు తన శక్తివంతమైన కార్యములను ప్రకటించడంలోనూ, రాజమార్గంపైకి రావడానికి ఇతరులకు మార్గం చూపించడంలోనూ నాయకత్వం వహించే ఆధిక్యతను వారికి ఇచ్చాడు. దానిపై నుండి రాళ్ళు ఏరివేయడం అంటే మార్గంలో నుండి అడ్డంకులను తొలగించడం అన్నది ప్రధానంగా వారి స్వంత ప్రయోజనార్థమే. (యెషయా 57:​14) వారు దేవుని సంకల్పాలను, బోధలను స్పష్టంగా చూడవలసిన అవసరం ఉండినది. అబద్ధ నమ్మకాలు జీవానికి నడిపే మార్గంపై అడ్డుబండలు, కానీ యెహోవా వాక్యము “బండను బద్దలుచేయు సుత్తెవంటిది.” దానితో, అభిషిక్త క్రైస్తవులు, యెహోవా సేవ చేయాలని కోరుకునేవారు తొట్రుపడేలా చేయగల అడ్డుబండలను బద్దలుకొట్టారు.​—⁠యిర్మీయా 23:​29.

21, 22. అబద్ధమతాన్ని విడిచి వచ్చేవారి కోసం యెహోవా ఏ ధ్వజమును స్థాపించాడు, అది మనకెలా తెలుసు?

21 సా.శ.పూ. 537 లో యెరూషలేము, యూదా శేషము తిరిగివచ్చి ఆలయాన్ని పునర్నిర్మించడానికి మార్గం చూపించిన ధ్వజము అయ్యింది. (యెషయా 49:​22) అభిషిక్త శేషము 1919 లో అబద్ధమత దాసత్వం నుండి విడిపించబడినప్పుడు, వారు గమ్యంలేకుండా అటు ఇటు తిరగలేదు. వారికి తమ గమ్యం తెలుసు, ఎందుకంటే యెహోవా వారి కోసం ఒక ధ్వజమును స్థాపించాడు. ఏ ధ్వజము? “ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురు” అని యెషయా 11:10 లో ప్రవచించబడిన ధ్వజమే. అపొస్తలుడైన పౌలు ఈ మాటలను యేసుకు అన్వయిస్తున్నాడు. (రోమీయులు 15:​8, 12) అవును, పరలోక సీయోను కొండపై రాజుగా పరిపాలిస్తున్న క్రీస్తు యేసే ఆ ధ్వజము.​—⁠హెబ్రీయులు 12:​22; ప్రకటన 14: 1.

22 సర్వోన్నతమైన దేవుని, ఐక్యపరిచే ఆరాధనలో భాగం వహించడానికి యేసుక్రీస్తు చుట్టూ అభిషిక్త క్రైస్తవులు, వేరే గొఱ్ఱెలు సమకూడారు. ఆయన పరిపాలన, యెహోవా విశ్వ సర్వాధిపత్యాన్ని నిరూపించడానికి, భూమిపైనున్న అన్ని జనములలోని యథార్థహృదయులను ఆశీర్వదించడానికి దోహదపడుతుంది. ఆయనను స్తుతిస్తూ ఉన్నతపరచడంలో భాగం వహించడానికి ఇది మనలో ప్రతి ఒక్కరికీ కారణం కాదంటారా?

“రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది”!

23, 24. దేవునియందు విశ్వాసం ఉన్న వారికి రక్షణ ఎలా తీసుకురాబడుతోంది?

23 యెహోవా తన భార్యవంటి సంస్థకు ఇచ్చే క్రొత్తపేరుతో, ఆమె పిల్లల నిత్య రక్షణకు సంబంధం ఉంది. యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “ఆలకించుడి! భూదిగంతములవరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు: ఇదిగో! రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో! ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే యున్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియజేయుడి.” (యెషయా 62:​11) బబులోను పడద్రోయబడి, యూదులు తమ స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు వారికి రక్షణ వచ్చింది. కానీ ఈ మాటలు మరింత గొప్పదానిని సూచిస్తున్నాయి. యెహోవా ప్రకటన, యెరూషలేము గురించి జెకర్యా చేసిన ఈ ప్రవచనాన్ని మనస్సుకు తెస్తుంది: “సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.”​—⁠జెకర్యా 9: 9.

24 యేసు నీటిలో బాప్తిస్మం తీసుకుని, దేవుని ఆత్మచే అభిషేకించబడిన మూడున్నర సంవత్సరాల తర్వాత, ఆయన స్వారీచేస్తూ యెరూషలేములోకి వచ్చి దాని ఆలయాన్ని శుద్ధిచేశాడు. (మత్తయి 21:​1-5; యోహాను 12:​14-16) నేడు, దేవునియందు విశ్వాసం ఉన్న వారందరికీ యెహోవా నుండి రక్షణను తీసుకువస్తున్నది యేసుక్రీస్తే. యేసు తాను 1914 లో సింహాసనాసీనుడైనప్పటి నుండి యెహోవా నియమిత న్యాయాధిపతిగా, తీర్పు అమలుచేసేవానిగా కూడా ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడైన మూడున్నర సంవత్సరాల తర్వాత అంటే 1918 లో, భూమిపై అభిషిక్త క్రైస్తవుల సంఘంచే ప్రాతినిధ్యం వహించబడుతున్న యెహోవా ఆధ్యాత్మిక ఆలయాన్ని శుద్ధిచేశాడు. (మలాకీ 3:​1-5) ఆయన ధ్వజముగా ఎత్తబడడమన్నది, మెస్సీయ రాజ్యానికి మద్దతుగా భూమి అంతటా ప్రజల గొప్ప సమకూర్పుపని ప్రారంభాన్ని సూచించింది. ప్రాచీన కాలంలో జరిగిన మాదిరిని అనుసరిస్తూ, దేవుని ఇశ్రాయేలు 1919 లో మహా బబులోను నుండి విడుదల చేయబడినప్పుడు వారికి “రక్షణ” వచ్చింది. స్వయంత్యాగపూరితులైన కోత పనివారి కోసం భద్రపరచబడి ఉన్న “బహుమానము” లేదా “జీతము” పరలోకంలో అమర్త్యమైన జీవం లేదా భూమిపై నిత్యజీవం. నమ్మకంగా ఉండే వారందరూ తమ “ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని” నిశ్చయత కలిగి ఉండవచ్చు.​—⁠1 కొరింథీయులు 15:​58.

25. యెహోవా ప్రజలకు ఏ హామీ ఇవ్వబడుతోంది?

25 యెహోవా పరలోక సంస్థకు, ఇక్కడ భూమిపైనున్న దాని అభిషిక్త ప్రతినిధులకు, వారితో చురుగ్గా సహవసిస్తున్న ప్రతి ఒక్కరికి అదెంత ఆశాజనకమైన దృక్కోణమో కదా! (ద్వితీయోపదేశకాండము 26:​19) యెషయా ఇలా ప్రవచించాడు: “పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును; యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.” (యెషయా 62:​12) ఒక సమయంలో, దేవుని ఇశ్రాయేలుచే ప్రాతినిధ్యం వహించబడుతున్న “పైనున్న యెరూషలేము” వదిలివేయబడినట్లు భావించింది. ఆమె మళ్ళీ ఎన్నడూ ఆ విధంగా భావించదు. యెహోవా ప్రజలు నిరంతరం ఆయనిచ్చే భద్రతతో కూడిన శ్రద్ధను పొందుతూ, ఆయన ఆమోదాన్ని అనుభవిస్తూనే ఉంటారు.

[అధస్సూచి]

a బైబిలు ప్రవచనంలో “క్రొత్త పేరు” క్రొత్త స్థానాన్ని లేక ఆధిక్యతను సూచించగలదు.​—⁠ప్రకటన 2:​17; 3:​12.

[అధ్యయన ప్రశ్నలు]

[342 వ పేజీలోని బాక్సు]

వివాహానికి ఒక ఉన్నతమైన మాదిరి

సాధారణంగా ప్రజలు వివాహం చేసుకున్నప్పుడు, వివాహ బంధం గురించి వారికి ఎన్నో ఊహలు ఉంటాయి. కానీ దేవుడు ఆశించేదేమిటి? వివాహ వ్యవస్థను ఆయనే ప్రారంభించాడు. దాని పట్ల ఆయనకున్న సంకల్పమేమిటి?

వివాహ బంధాన్ని దేవుడు ఎలా దృష్టిస్తాడనే దాన్ని గురించిన ఒక సూచన, ఇశ్రాయేలు జనముతో ఆయనకున్న సంబంధంలో కనిపిస్తుంది. యెషయా ఆ సంబంధాన్ని ఒక వివాహబంధంగా చిత్రీకరిస్తున్నాడు. (యెషయా 62:​1-5) యెహోవా దేవుడు ఒక “భర్త”గా తన “పెండ్లికూతురి” కోసం ఏమేమి చేస్తాడో గమనించండి. ఆయన ఆమెను కాపాడతాడు, పరిశుద్ధపరుస్తాడు. (యెషయా 62:​6, 7, 12) ఆమెను గౌరవిస్తాడు, విలువైనదిగా ఎంచుతాడు. (యెషయా 62:​3, 8, 9) ఆయన ఆమెకిచ్చే క్రొత్త పేర్లు సూచిస్తున్నట్లుగా, ఆయన ఆమెను బట్టి ఆనందిస్తాడు.​—⁠యెషయా 62:​4, 5, 12.

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, పౌలు భార్యాభర్తల మధ్య ఉండే బంధాన్ని క్రీస్తుకూ అభిషిక్త క్రైస్తవుల సంఘానికీ మధ్యనున్న బంధంతో పోల్చినప్పుడు ఆయన, యెహోవాకూ ఇశ్రాయేలుకూ మధ్యనున్న బంధాన్ని గురించిన యెషయా వర్ణనను పునరుద్ఘాటిస్తున్నాడు.​—⁠ఎఫెసీయులు 5:​21-27.

యేసుకూ సంఘానికీ మధ్యనున్న సంబంధాన్ని తమ వైవాహిక జీవితాల్లో అనుకరించమని పౌలు క్రైస్తవులను ప్రోత్సహించాడు. యెహోవా ఇశ్రాయేలు పట్ల చూపించిన ప్రేమకన్నా, క్రీస్తు సంఘం పట్ల చూపించిన ప్రేమ కన్నా గొప్ప ప్రేమ మరొకటి ఉండదు. ఆ సూచనార్థక బంధాలు, క్రైస్తవులు తమ వైవాహిక జీవితాన్ని విజయవంతమైనదిగానూ, ఆనందకరమైనదిగానూ చేసుకోవడానికి ఉన్నతమైన మాదిరిని అందజేస్తాయి.​—⁠ఎఫెసీయులు 5:​28-33.

[339 వ పేజీలోని చిత్రం]

యెహోవా పరలోక సీయోనును క్రొత్త పేరుతో పిలుస్తాడు

[347 వ పేజీలోని చిత్రాలు]

ఆధునిక కాలాల్లో యెహోవా కావలివాని తరగతి మౌనముగా ఉండలేదు