కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గొడ్రాలు ఆనందిస్తుంది

గొడ్రాలు ఆనందిస్తుంది

పదిహేనవ అధ్యాయం

గొడ్రాలు ఆనందిస్తుంది

యెషయా 54:​1-17

1. శారా పిల్లలు కావాలని ఎందుకు ఆశించింది, ఈ విషయంలో ఆమె అనుభవమేమిటి?

 పిల్లల కోసం శారా ఎంతో ఆశించింది. విచారకరంగా ఆమెకు పిల్లలు కలుగలేదు, అది ఆమెకు ఎంతో వేదన కలిగించింది. ఆమె జీవించిన కాలంలో, గొడ్రాలుతనం అవమానకరమైన విషయంగా పరిగణించబడేది. కానీ శారాకు అంతకన్నా వేదన కలిగించే విషయం మరొకటుంది. దేవుడు తన భర్తకు చేసిన వాగ్దానం నెరవేరడం చూడాలనే ఆమె ఆకాంక్ష. భూమిపైనున్న కుటుంబాలన్నిటికీ ఆశీర్వాదాన్ని తీసుకురాగల సంతానానికి అబ్రాహాము తండ్రి కావలసి ఉంది. (ఆదికాండము 12:​1-3) అయితే, దేవుడు ఆ వాగ్దానం చేసిన దశాబ్దాల తర్వాత కూడా వారికి సంతానము కలుగలేదు. శారా వృద్ధురాలై, పిల్లలు లేకుండానే ఉంది. కొన్నిసార్లు, బహుశా తన ఆశలన్నీ వ్యర్థమేనా అని కూడా ఆమె అనుకొని ఉండవచ్చు. కానీ ఒకానొక రోజున, ఆమె నిరాశ ఆనందంగా మారింది!

2. యెషయా 54 వ అధ్యాయంలో వ్రాయబడివున్న ప్రవచనం మనకు ఎందుకు ఆసక్తికరమైనదై ఉండాలి?

2 శారా దీనావస్థ యెషయా 54 వ అధ్యాయంలో వ్రాయబడివున్న ప్రవచనాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. అందులో యెరూషలేము, అనేకమంది పిల్లలను కలిగివుండడం వల్ల కలిగే గొప్ప ఆనందాన్ని చవిచూసే గొడ్రాలు అన్నట్లుగా పిలువబడుతోంది. యెహోవా తన ప్రాచీన ప్రజలను సమష్టిగా తన భార్యగా చిత్రీకరించడం ద్వారా వారిపట్ల తనకున్న వాత్సల్యపూరితమైన భావాలను చూపిస్తున్నాడు. అంతేగాక, యెషయా గ్రంథంలోని ఈ అధ్యాయం, బైబిలు “పరిశుద్ధ మర్మము” అని పిలుస్తున్నదానిలోని ఒక ప్రధానాంశపు చిక్కుముడిని విప్పడానికి మనకు సహాయం చేస్తుంది. (రోమీయులు 16:​25, 26, NW) ఈ ప్రవచనంలో తెలియజేయబడిన, ‘స్త్రీని’ గురించిన గుర్తింపు, ఆమె అనుభవాలు నేడు స్వచ్ఛారాధనపై ప్రాముఖ్యమైన వెలుగును ప్రసరింపజేస్తున్నాయి.

‘స్త్రీ’ గుర్తించబడింది

3. గొడ్రాలైన ‘స్త్రీ’ ఆనందించడానికి కారణం ఎందుకు ఉంటుంది?

3 యాభైనాలుగవ అధ్యాయం ఒక సంతోషకరమైన గమనికతో ప్రారంభమవుతుంది: ‘గొడ్రాలా, పిల్లలు కనని స్త్రీ, జయగీతమెత్తుము! ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనందపడుము, సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.’ (యెషయా 54: 1) ఈ మాటలు పలుకడానికి యెషయా ఎంత ఉత్తేజితుడై ఉంటాడో కదా! ఆ మాటల నెరవేర్పు, బబులోనులో బంధీలుగా ఉన్న యూదులకు ఎంత ఓదార్పును తెస్తుందో కదా! ఆ సమయంలో యెరూషలేము ఇంకా నిర్జనంగానే ఉంటుంది. మానవ దృక్కోణం నుండి చూస్తే, గొడ్రాలుకు సాధారణంగా తాను తన వృద్ధాప్యంలో పిల్లలను కంటాననే నిరీక్షణ ఎలా ఉండదో అలాగే, అది మళ్ళీ జనముతో నింపబడుతుందనే నిరీక్షణ ఏదీ ఉన్నట్లు అనిపించదు. కానీ ఈ ‘స్త్రీకి’ భవిష్యత్తులో గొప్ప ఆశీర్వాదం ఉంది​—⁠ఆమె సంతానవంతురాలవుతుంది. యెరూషలేము ఆనందం అవధులు దాటుతుంది. ఆమె మళ్ళీ “పిల్లల”తో లేదా నివాసులతో వర్ధిల్లుతుంది.

4. (ఎ) యెషయా 54 వ అధ్యాయానికి, సా.శ.పూ. 537 లో జరిగిన దానికన్నా మరింత గొప్ప నెరవేర్పు ఉండివుంటుందని తెలుసుకోవడానికి అపొస్తలుడైన పౌలు మనకెలా సహాయం చేస్తాడు? (బి) “పైనున్న యెరూషలేము” అంటే ఏమిటి?

4 యెషయాకు ప్రవచనం ఒకటికన్నా ఎక్కువసార్లు నెరవేరుతుంది, అయితే ఆయనకు ఆ విషయం తెలియకపోవచ్చు. అపొస్తలుడైన పౌలు యెషయా 54 వ అధ్యాయం నుండి ఎత్తివ్రాస్తూ, ‘స్త్రీ’ భూసంబంధమైన యెరూషలేము నగరం కన్నా మరెంతో ప్రాముఖ్యమైన దాన్ని సూచిస్తుందని వివరిస్తాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి.” (గలతీయులు 4:​26) ఈ “పైనున్న యెరూషలేము” అంటే ఏమిటి? వాగ్దాన దేశంలోని యెరూషలేము నగరం కాదని స్పష్టమవుతోంది. ఆ నగరం భూసంబంధమైనది, అది “పైన” పరలోక సామ్రాజ్యంలో ఉన్నది కాదు. “పైనున్న యెరూషలేము” అంటే దేవుని పరలోక సంబంధమైన ‘స్త్రీ,’ ఆయన శక్తివంతమైన ఆత్మ ప్రాణుల సంస్థ.

5. గలతీయులు 4:22-31 వచనాల్లో సంక్షిప్తంగా చిత్రించబడిన సూచనార్థక నాటకంలో వీరు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు: (ఎ) అబ్రాహాము, (బి) శారా, (సి) ఇస్సాకు, (డి) హాగరు, (ఈ) ఇష్మాయేలు.

5 అయితే, యెహోవాకు ఇద్దరు సూచనార్థక స్త్రీలు, అంటే ఒకరు పరలోక సంబంధమైన, మరొకరు భూసంబంధమైన స్త్రీలు ఎలా ఉండగలరు? ఇక్కడేమైనా పరస్పర విరుద్ధత ఉందా? ఎంతమాత్రం లేదు. దానికి సమాధానం, అబ్రాహాము కుటుంబం అందజేసిన ప్రవచనార్థక చిత్రణలో ఉందని అపొస్తలుడైన పౌలు చూపిస్తున్నాడు. (గలతీయులు 4:​22-31; 218 వ పేజీలోని “అబ్రాహాము కుటుంబం​—⁠ఒక ప్రవచనార్థక చిత్రణ” చూడండి.) ‘స్వతంత్రురాలు,’ అబ్రాహాము భార్య అయిన శారా, ఆత్మ ప్రాణులతో కూడిన యెహోవా భార్యవంటి సంస్థను సూచిస్తుంది. దాసురాలు, అబ్రాహాము రెండవ భార్య లేక ఉపపత్ని అయిన హాగరు భూసంబంధమైన యెరూషలేమును సూచిస్తుంది.

6. దేవుని పరలోక సంస్థ ఏ భావంలో సుదీర్ఘకాలంపాటు గొడ్రాలిగా ఉంది?

6 ఆ నేపథ్యంతో, మనం యెషయా 54:1 వ వచనపు ప్రగాఢమైన ప్రాముఖ్యతను చూడడం ప్రారంభిద్దాము. శారా దశాబ్దాలపాటు గొడ్రాలిగా ఉన్న తర్వాత, 90 సంవత్సరాల వయస్సులో ఇస్సాకుకు జన్మనిచ్చింది. అలాగే, యెహోవా పరలోక సంస్థ చాలాకాలం పాటు గొడ్రాలుగా ఉంది. యెహోవా పూర్వం ఏదెనులో, తన ‘స్త్రీ’కి “సంతానము” కలుగుతుందని వాగ్దానం చేశాడు. (ఆదికాండము 3:​15) ఆ తర్వాత 2,000 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత, వాగ్దాన సంతానము గురించి యెహోవా అబ్రాహాముతో నిబంధన చేశాడు. కానీ దేవుని పరలోక ‘స్త్రీ’ తనకు ఆ సంతానం కలగడానికి అనేకానేక శతాబ్దాలపాటు వేచివుండవలసి వచ్చింది. అయినప్పటికీ, ఒకప్పుడు ‘గొడ్రాలిగా’ ఉన్న ఈమె పిల్లలు, శారీరక ఇశ్రాయేలీయుల సంఖ్య కన్నా ఎంతో ఎక్కువమందిగా ఉన్న సమయం వచ్చింది. ప్రవచించబడిన సంతానపు రాకను చూడడానికి దేవదూతలు ఎందుకు అంత ఆతృత కలిగివున్నారో తెలుసుకోవడానికి, గొడ్రాలిని గురించిన ఉపమానం మనకు సహాయం చేస్తుంది. (1 పేతురు 1:​12) చివరికి అది ఎప్పుడు జరిగింది?

7. యెషయా 54:1 లో ప్రవచించబడినట్లుగా, “పైనున్న యెరూషలేము” ఆనందించే సందర్భం ఎప్పుడు వచ్చింది, మీరెందుకలా సమాధానం ఇస్తారు?

7 మానవ శిశువుగా యేసు జననం ఖచ్చితంగా దేవదూతలకు ఆనందభరితమైన సమయమే. (లూకా 2:​9-14) కానీ అది యెషయా 54:1 లో ప్రవచించబడిన సంఘటన కాదు. యేసు సా.శ. 29 లో పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు మాత్రమే “పైనున్న యెరూషలేము” యొక్క ఆధ్యాత్మిక కుమారుడయ్యాడు, అప్పుడు దేవుడే స్వయంగా ఆయనను తన “ప్రియకుమారుడ”ని బహిరంగంగా అంగీకరించాడు. (మార్కు 1:​10, 11; హెబ్రీయులు 1: 5; 5:​4, 5) అప్పుడే యెషయా 54:1 నెరవేర్పుగా దేవుని పరలోక ‘స్త్రీకి’ ఆనందించడానికి కారణం లభించింది. చివరికి, ఆమె వాగ్దాన సంతానమైన మెస్సీయకు జన్మనిచ్చింది! ఆమె గొడ్రాలిగా ఉన్న శతాబ్దాల కాలం ముగింపుకు వచ్చింది. అయితే, ఆమె ఆనందానికి మాత్రం అది ముగింపు కాదు.

గొడ్రాలికి అనేకమంది కుమారులు

8. దేవుని పరలోక ‘స్త్రీ’ వాగ్దాన సంతానానికి జన్మనిచ్చిన తర్వాత ఆమె ఆనందించడానికి కారణం ఎందుకుంది?

8 యేసు మరణ పునరుత్థానాల తర్వాత, దేవుని పరలోక ‘స్త్రీ’ ఈ ప్రియమైన కుమారుడిని, ‘మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడైన’ వానిగా తిరిగి పొందడానికి ఎంతో ఆనందించింది. (కొలొస్సయులు 1:​18) అప్పుడామె ఇంకా ఎక్కువమంది ఆధ్యాత్మిక కుమారులకు జన్మనివ్వడం ప్రారంభించింది. సా.శ. 33 పెంతెకొస్తునాడు యేసు అనుచరులు దాదాపు 120 మంది పరిశుద్ధాత్మతో అభిషేకించబడి, క్రీస్తు తోటి వారసులుగా దత్తత తీసుకోబడ్డారు. తర్వాత అదే రోజున మరో 3,000 మంది చేర్చబడ్డారు. (యోహాను 1:​12; అపొస్తలుల కార్యములు 1:​13-15; 2:1-4, 41; రోమీయులు 8:​14-16) ఈ కుమారుల సంఘం పెరుగుతూనే వెళ్ళింది. క్రైస్తవమత సామ్రాజ్యం భ్రష్టత్వానికి పాల్పడుతున్న తొలి శతాబ్దాల్లో, ఆ పెరుగుదల తగ్గుముఖం పట్టింది. అయితే, అది 20 వ శతాబ్దంలో మారాల్సి ఉంది.

9, 10. ప్రాచీన కాలాల్లో గుడారాల్లో నివసిస్తున్న ఒక స్త్రీకి, “గుడారపు స్థలమును విశాలపరచుము” అనే నిర్దేశ భావం ఏమై ఉంటుంది, అలాంటి స్త్రీకి ఇది ఎందుకు ఆనందించవలసిన సమయం?

9 యెషయా విశేషమైన పెరుగుదల కాలాన్ని గురించి ప్రవచిస్తూనే ఉన్నాడు: “నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగుచేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు; అవమానమును తలంచకుము, నీవు లజ్ఞపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు.”​—యెషయా 54:​2-4.

10 ఇక్కడ యెరూషలేము, శారాలానే గుడారాలలో నివసిస్తున్న భార్యగా, తల్లిగా పిలువబడుతోంది. కుటుంబం పెరిగేలా ఆశీర్వదించబడినప్పుడు అది, అలాంటి తల్లి తన ఇంటిని విస్తరింపజేసుకోవడం గురించి ఆలోచించవలసిన సమయం. ఆమె పొడవైన తెరలను, త్రాళ్ళను సిద్ధం చేసుకుని, మేకులను క్రొత్త స్థానాల్లో దిగగొట్టవలసి ఉంటుంది. ఇది ఆమెకు సంతోషకరమైన పని, అలాంటి పనుల హడావుడిలో, తాను తమ వంశాన్ని కొనసాగించడానికి ఎప్పటికైనా పిల్లలను కనగలనా అన్న వ్యాకులతతో గడిపిన సంవత్సరాలను ఆమె సులభంగా మరచిపోగలదు.

11. (ఎ) దేవుని పరలోక ‘స్త్రీ’ 1914 లో ఎలా ఆశీర్వదించబడింది? (అధస్సూచి చూడండి.) (బి) భూమిపైనున్న అభిషిక్తులు 1919 నుండి ఏ ఆశీర్వాదాన్ని అనుభవించారు?

11 భూసంబంధమైన యెరూషలేము, బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత అలాంటి పునఃస్థాపన సమయంతోనే ఆశీర్వదించబడింది. “పైనున్న యెరూషలేము” అంతకన్నా ఎక్కువగా ఆశీర్వదించబడింది. a ప్రాముఖ్యంగా 1919 నుండి, ఆమె అభిషిక్త “సంతానము” క్రొత్తగా పునఃస్థాపించబడిన తమ ఆధ్యాత్మిక స్థితిలో వర్ధిల్లారు. (యెషయా 61: 4; 66: 8) వారు ‘అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొన్నారు,’ అంటే తమ ఆధ్యాత్మిక కుటుంబంలో చేరే వారందరినీ వెదకడానికి వారు అనేక దేశాల్లోకి విస్తరించారు. ఫలితంగా, అభిషిక్త కుమారులను సమకూర్చడంలో శీఘ్రమైన పెరుగుదల సంభవించింది. 1930 వ దశాబ్దపు మధ్యకాలంలో, వారి తుది సంఖ్య అయిన 1,44,000 ఎప్పుడో పూర్తైనట్లు అనిపించింది. (ప్రకటన 14: 3) ఆ సమయంలో, ప్రకటనా పనిలో అభిషిక్తులను సమకూర్చడానికే ప్రాధాన్యతనివ్వడం ఆగిపోయింది. అలాగని, అభిషిక్తులతోనే విస్తరణ ఆగిపోలేదు.

12. అభిషిక్తులతో పాటు, 1930 వ దశాబ్దం నుండి క్రైస్తవ సంఘంలోకి ఇంకా ఎవరు సమకూర్చబడ్డారు?

12 తన అభిషిక్త సహోదరుల ‘చిన్నమంద’యే గాక, నిజ క్రైస్తవుల మందలోకి తీసుకురాబడవలసిన “వేరే గొఱ్ఱెలు” కూడా తనకు ఉంటాయని యేసు తానే ముందుగా తెలియజేశాడు. (లూకా 12:​32; యోహాను 10:​16) అభిషిక్తుల యొక్క ఈ నమ్మకమైన సహవాసులు “పైనున్న యెరూషలేము” యొక్క అభిషిక్త కుమారులలోని వారు కాకపోయినప్పటికీ, వారు ఒక ప్రాముఖ్యమైన, ఎంతోకాలం క్రితం ప్రవచించబడిన పాత్రను నిర్వహిస్తారు. (జెకర్యా 8:​23) వారితో కూడిన ఒక ‘గొప్ప సమూహము,’ 1930 వ దశాబ్దం నుండి ఇప్పటి వరకు సమకూర్చబడుతోంది, తత్ఫలితంగా క్రైస్తవ సంఘం మునుపెన్నడూ లేనంతగా విస్తరిస్తోంది. (ప్రకటన 7:​9, 10) ఈనాడు ఆ గొప్ప సమూహపు సంఖ్య లక్షల్లో ఉంది. ఈ విస్తృతి అంతా ఇంకా ఎక్కువ రాజ్యమందిరాలు, అసెంబ్లీ హాళ్ళు, బ్రాంచి భవనాల అత్యవసరమైన అవసరతను సృష్టించింది. యెషయా మాటలు ఎంతో సముచితంగా అనిపిస్తున్నాయి. ప్రవచించబడిన ఆ విస్తరణలో భాగం వహించడం ఎంతటి ఆధిక్యత!

తన సంతానం గురించి శ్రద్ధ తీసుకునే ఒక తల్లి

13, 14. (ఎ) దేవుని పరలోక ‘స్త్రీని’ ఉద్దేశించి చెప్పబడిన కొన్ని వ్యక్తీకరణలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నట్లు అనిపిస్తుంది? (బి) దేవుడు కుటుంబ బాంధవ్యాలను సోదాహరణంగా ఉపయోగించడం నుండి మనం ఏ అంతర్దృష్టిని పొందవచ్చు?

13 గొప్ప నెరవేర్పులో, ప్రవచనంలోని ‘స్త్రీ’ యెహోవా పరలోక సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తుందని మనం చూశాము. కానీ యెషయా 54:4 వ వచనం చదివిన తర్వాత, ఆత్మ ప్రాణుల ఆ సంస్థ అవమానాన్ని లేక అపకీర్తిని ఎలా పొందిందా అని మనం ఆశ్చర్యపోవచ్చు. దేవుని ‘స్త్రీ’ నిరాకరింపబడుతుందని, బాధింపబడుతుందని, దాడికి గురవుతుందని తర్వాతి వచనాలు చెబుతున్నాయి. ఆమె దేవునికి ఆగ్రహాన్ని కూడా కలిగిస్తుంది. ఎన్నడూ పాపం చేయని పరిపూర్ణమైన ఆత్మ ప్రాణుల సంస్థకు అలాంటి విషయాలు ఎలా అన్వయించబడగలవు? దానికి సమాధానం, ఆ కుటుంబ నైజంపై ఆధారపడి ఉంటుంది.

14 యెహోవా ప్రగాఢమైన ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేయడానికి భార్యాభర్తలు, తల్లీపిల్లలు వంటి కుటుంబ బాంధవ్యాలను ఉపయోగిస్తాడు ఎందుకంటే, అలాంటివి మానవులకు అర్థవంతమైనవిగా ఉంటాయి. మన సొంత కుటుంబం యొక్క అనుభవాల విస్తృతి లేదా నాణ్యత ఎటువంటిదైనా, మంచి వైవాహిక జీవితం అంటే ఏమిటో లేదా తల్లిదండ్రులు పిల్లల మధ్య మంచి సంబంధాలు ఎలా ఉండాలో బహుశా మనకు తెలిసే ఉండవచ్చు. కాబట్టి, యెహోవా తనకు తన ఆత్మప్రాణులైన సేవకుల విస్తారమైన సమూహములతో వాత్సల్యభరితమైన, సన్నిహితమైన, విశ్వసనీయమైన సంబంధం ఉందని మనకు ఎంత స్పష్టంగా బోధిస్తున్నాడో కదా! తన పరలోక సంస్థ భూమిపైనున్న దాని ఆత్మాభిషిక్త సంతానం గురించి శ్రద్ధ తీసుకుంటుందని ఆయన మనకు ఎంత అద్భుతంగా బోధిస్తున్నాడో కదా! మానవ సేవకులకు బాధ కలిగితే, “పైనున్న యెరూషలేము” అంటే నమ్మకమైన పరలోక సేవకులకు బాధ కలుగుతుంది. అందుకే, యేసు ఇలా చెప్పాడు: ‘మిక్కిలి అల్పులైన యీ నా [ఆత్మాభిషిక్త] సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి.’​—⁠మత్తయి 25:​40.

15, 16. యెషయా 54: 5, 6 వచనాల తొలి నెరవేర్పు ఏమిటి, గొప్ప నెరవేర్పు ఏమిటి?

15 కాబట్టి, యెహోవా పరలోక ‘స్త్రీని’ ఉద్దేశించి చెప్పబడినదానిలో అధికభాగం, భూమిపైనున్న ఆమె పిల్లలు అనుభవించేవాటిని ప్రతిబింబిస్తుందంటే అందులో ఆశ్చర్యం లేదు. ఈ మాటలను పరిశీలించండి: “నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు, సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు; ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు​—⁠విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యౌవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు.”​—యెషయా 54: 5, 6.

16 అక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్పబడుతోందో ఆ భార్య ఎవరు? తొలి నెరవేర్పులో ఆమె దేవుని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యెరూషలేము. వారి 70 ఏళ్ళ బబులోను చెర సమయంలో, వారు యెహోవా తమను నిరాకరించినట్లుగా, తమను పూర్తిగా వదిలేసినట్లుగా భావిస్తారు. గొప్ప నెరవేర్పులో, ఈ మాటలు “పైనున్న యెరూషలేము”ను, ఆదికాండము 3: 15 నెరవేర్పుగా చివరికి “సంతానము”కు జన్మనిచ్చే ఆమె అనుభవాన్ని సూచిస్తాయి.

అల్పకాలిక క్రమశిక్షణ, నిత్య ఆశీర్వాదాలు

17. (ఎ) భూసంబంధమైన యెరూషలేము దైవిక “మహోద్రేకము”ను ఎలా అనుభవిస్తుంది? (బి) “పైనున్న యెరూషలేము” కుమారులు ఏమి అనుభవించారు?

17 ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును, అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా 54:​7, 8) భూసంబంధమైన యెరూషలేముపై బబులోను సైన్యాలు సా.శ.పూ. 607 లో దాడి చేసినప్పుడు ఆ పట్టణం దేవుని “మహోద్రేకము”నకు గురయ్యింది. అది చెరలో ఉన్న 70 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైన కాలంలా అనిపించవచ్చు. అయినప్పటికీ, క్రమశిక్షణకు చక్కగా ప్రతిస్పందించే వారి కోసం భద్రపరచబడి ఉన్న నిత్య ఆశీర్వాదాలతో పోలిస్తే అలాంటి శ్రమలు “నిమిషమాత్రము” ఉంటాయి. అలాగే, మహా బబులోను ప్రోద్భలంతో జరిగిన రాజకీయ శక్తుల దాడికి తాము గురవ్వడాన్ని యెహోవా అనుమతించినప్పుడు, “పైనున్న యెరూషలేము” యొక్క అభిషిక్త కుమారులు తాము దైవిక “మహోద్రేకము”చేత ముంచెత్తబడినట్లు భావించారు. కానీ, 1919 మొదలుకొని వారికి లభించిన ఆధ్యాత్మిక ఆశీర్వాదముల యుగంతో పోలిస్తే మునుపు వారికివ్వబడిన క్రమశిక్షణ ఆ తర్వాత ఎంత అల్పకాలికమైనదిగా కనిపించిందో కదా!

18. యెహోవాకు తన ప్రజలపై కలిగిన మహోద్రేకానికి సంబంధించి ఏ ప్రాముఖ్యమైన సూత్రాన్ని గ్రహించవచ్చు, ఇది మనపై వ్యక్తిగతంగా ఎలా ప్రభావాన్ని చూపించగలదు?

18 ఈ వచనాలు మరో గొప్ప సత్యాన్ని వెల్లడి చేస్తాయి, అదేమిటంటే, దేవుని ఉగ్రత నిమిషమాత్రం ఉంటుంది గానీ ఆయన చూపించే వాత్సల్యము నిరంతరం నిలుస్తుంది. తప్పు చేస్తే ఆయనకు ఆగ్రహం కలుగుతుంది గానీ అది ఎల్లప్పుడూ అదుపులో ఉంటుంది, ఆయన ఆగ్రహానికి ఎల్లప్పుడూ ఒక సంకల్పం ఉంటుంది. మనం యెహోవా ఇచ్చే క్రమశిక్షణను అంగీకరిస్తే, ఆయన ఆగ్రహం “నిమిషమాత్రము” ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఆయన “గొప్ప వాత్సల్యము” అంటే ఆయన క్షమ, ఆయన కృప ఆ స్థానాన్ని తీసుకుంటాయి. ఇవి ‘నిత్యము’ నిలిచివుంటాయి. కాబట్టి మనం ఏదైనా ఒక పాపం చేసినప్పుడు, పశ్చాత్తాపపడి, దేవునితో తిరిగి సత్సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నడూ వెనుకాడకూడదు. పాపం గనుక గంభీరమైనదైతే, మనం వెంటనే సంఘ పెద్దలను సమీపించాలి. (యాకోబు 5:​14) నిజమే, క్రమశిక్షణ అవసరం కావచ్చు, దాన్ని స్వీకరించడం కష్టంగా ఉండవచ్చు. (హెబ్రీయులు 12:​11) యెహోవా దేవుని క్షమను పొందడం నుండి లభించే నిత్యాశీర్వాదాలతో పోలిస్తే అది స్వల్పంగా అనిపిస్తుంది!

19, 20. (ఎ) వర్షధనుస్సు నిబంధన అంటే ఏమిటి, అది బబులోనులో చెరలో ఉన్నవారికి ఎలా సంబంధించినది? (బి) ‘సమాధాన విషయమైన నిబంధన’ నేడు అభిషిక్త క్రైస్తవులకు ఏ హామీని ఇస్తుంది?

19 యెహోవా ఇప్పుడు తన ప్రజలకు ఈ ఓదార్పుకరమైన హామీని ఇస్తున్నాడు: “నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహు కాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టుపెట్టుకొనియున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యిషయా 54:​9, 10) జలప్రళయము తర్వాత దేవుడు నోవహుతోనూ సజీవంగా ఉన్న ప్రతి జీవితోనూ ఒక నిబంధన చేశాడు, అది కొన్నిసార్లు వర్షధనుస్సు నిబంధన అని పిలువబడుతుంది. భూమిపైకి ఇక ఎన్నడూ భూవ్యాప్త జలప్రళయం ద్వారా నాశనం తీసుకురానని యెహోవా వాగ్దానం చేశాడు. (ఆదికాండము 9:​8-17) యెషయాకు, ఆయన ప్రజలకు దాని భావమేమిటి?

20 వారు అనుభవించవలసిన శిక్ష, అంటే బబులోనులో 70 ఏళ్ళ చెర కేవలం ఒకసారి మాత్రమే వస్తుందని తెలుసుకోవడం ఓదార్పునిస్తుంది. ఒకసారి అది జరిగిపోయిన తర్వాత, అదిక మరెన్నడూ జరుగదు. ఆ తర్వాత, దేవుని ‘సమాధానవిషయమైన నిబంధన’ అమలులోకి వస్తుంది. ‘సమాధానం’ అని అనువదించబడిన హీబ్రూ పదం కేవలం యుద్ధం లేకపోవడాన్ని మాత్రమే కాదుగానీ ప్రతివిధమైన సంక్షేమాన్ని కూడా సూచిస్తుంది. దేవుని వైపు నుండి ఈ నిబంధన శాశ్వతమైనది. ఆయన నమ్మకమైన ప్రజలపట్ల ఆయనకున్న కృపకన్నా త్వరగా పర్వతములు, మెట్టలు అంతరించిపోతాయి. విచారకరంగా, ఆయన భూసంబంధమైన జనము చివరికి తమ వైపు నుండి నిబంధనకు అనుగుణంగా జీవించడంలో విఫలమైపోయి, మెస్సీయను నిరాకరించడం ద్వారా తమ సొంత సమాధానమును పోగొట్టుకుంటారు. అయితే “పైనున్న యెరూషలేము” కుమారులు చాలా మంచిగానే వ్యవహరించారు. వారి కష్టభరితమైన క్రమశిక్షణా కాలం ముగిసిన తర్వాత, వారికి దైవిక కాపుదలను గురించిన హామీ ఇవ్వబడింది.

దేవుని ప్రజల ఆధ్యాత్మిక భద్రత

21, 22. (ఎ) “పైనున్న యెరూషలేము” ప్రయాసపడినట్లు, గాలివానచేత కొట్టబడినట్లు ఎందుకు చెప్పబడుతోంది? (బి) దేవుని పరలోక ‘స్త్రీ’ యొక్క ఆశీర్వాదకరమైన స్థితి, భూమిపైనున్న ఆమె “సంతానము”కు సంబంధించి ఏమి సూచిస్తుంది?

21 యెహోవా తన నమ్మకమైన ప్రజలకు లభించే భద్రత గురించి ముందే చెబుతున్నాడు: “ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరాదు. జనులు గుంపుకూడినను వారు నావలన కూడరు. నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగుదురు.”​—యెషయా 54:​11-15.

22 అయితే ఆత్మ సామ్రాజ్యంలో ఉన్న యెహోవా ‘స్త్రీ’ సూటిగా ఎన్నడూ ప్రయాసపడలేదు లేదా గాలివానచేత కొట్టబడలేదు. కానీ భూమిపైనున్న ఆమె అభిషిక్త “సంతానము” బాధననుభవించినప్పుడు, ప్రాముఖ్యంగా 1918-19 కాలంలో వారు ఆధ్యాత్మిక చెరలో ఉన్న సమయంలో ఆమె బాధననుభవించింది. అలాగే, పరలోక “స్త్రీ” ఘనపరచబడినప్పుడు, అది ఆమె సంతానము మధ్య వ్యాపించివున్న అలాంటి స్థితినే ప్రతిబింబిస్తుంది. కాబట్టి “పైనున్న యెరూషలేము”ను గురించిన ప్రకాశమానమైన వర్ణనను పరిశీలించండి. ఒక పుస్తకం పేర్కొంటున్నట్లుగా, గుమ్మములపైనున్న అమూల్యమైన రాళ్ళు, ఖరీదైన ‘నీలాంజనములు,’ పునాదులు, చివరికి సరిహద్దులు, “సౌందర్యాన్ని, దివ్యతను, స్వచ్ఛతను, బలాన్ని, స్థిరత్వాన్ని” సూచిస్తాయి. అభిషిక్త క్రైస్తవులను అలాంటి సురక్షితమైన, ఆశీర్వాదకరమైన స్థితికి ఏది నడిపిస్తుంది?

23. (ఎ) అంత్యదినాల్లో ‘యెహోవాచేత ఉపదేశము నొందడం’ అభిషిక్త క్రైస్తవులపై ఏ ప్రభావాన్ని చూపించింది? (బి) దేవుని ప్రజలు ఏ భావంలో ‘ప్రశస్తమైన రత్నములతో ఏర్పరచబడిన సరిహద్దులతో’ ఆశీర్వదించబడ్డారు?

23 యెషయా 54 వ అధ్యాయం 13 వ వచనం కీలకాన్ని తెలియజేస్తుంది​—⁠అందరూ “యెహోవాచేత ఉపదేశము నొందుదురు.” ఈ వచనంలోని మాటలను యేసే స్వయంగా తన అభిషిక్త అనుచరులకు అన్వయించాడు. (యోహాను 6:​45) ఈ “అంత్యకాలము”లో అభిషిక్తులు నిజమైన తెలివితో, ఆధ్యాత్మిక అంతర్దృష్టితో మెండుగా ఆశీర్వదించబడతారని దానియేలు ప్రవక్త ప్రవచించాడు. (దానియేలు 12:​3, 4) అలాంటి అంతర్దృష్టి, వారు దైవిక బోధను భూమి నలుమూలలా వ్యాప్తిచేస్తూ, చరిత్రలోనే అత్యంత గొప్పదైన విద్యా ప్రచారానికి నాయకత్వం వహించడానికి సహాయం చేసింది. (మత్తయి 24:​14) అదే సమయంలో, అలాంటి అంతర్దృష్టి వారు నిజమైన మతానికి, అబద్ధ మతానికి మధ్యనున్న తేడాను చూడడానికి వారికి సహాయం చేసింది. యెషయా 54:​12, ‘ప్రశస్తమైన రత్నములతో ఏర్పరచబడిన సరిహద్దుల’ గురించి ప్రస్తావిస్తోంది. యెహోవా 1919 మొదలుకొని అభిషిక్తులను అబద్ధమతం నుండి, ఈ లోకంలోని దైవభక్తిలేని ప్రజల నుండి వేరు చేస్తూ, సరిహద్దులను గురించి అంటే ఆధ్యాత్మిక సరిహద్దు రేఖలను గురించి ఎన్నడూ లేనంత సుస్పష్టమైన అవగాహనను ఇచ్చాడు. (యెహెజ్కేలు 44:​23; యోహాను 17:​14; యాకోబు 1:​27) అలా వారు దేవుని సొంత ప్రజలుగా ప్రత్యేకపరచబడ్డారు.​—⁠1 పేతురు 2: 9.

24. మనం యెహోవాచే ఉపదేశించబడుతున్నామని ఎలా నిశ్చయపరచుకోవచ్చు?

24 కాబట్టి, మనలో ప్రతి ఒక్కరం, ‘నేను యెహోవాచేత ఉపదేశింపబడుతున్నానా?’ అని తనను తాను ప్రశ్నించుకోవడం మంచిది. అలాంటి ఉపదేశాన్ని మన తరపున ప్రయత్నాలేమీ లేకుండా పొందలేము. మనం కృషి చేయాలి. మనం దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతూ, దాని గురించి ధ్యానిస్తే, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ ప్రచురిస్తున్న బైబిలు ఆధారిత సాహిత్యాన్ని చదవడం ద్వారా ఉపదేశాన్ని తీసుకుంటే, క్రైస్తవ కూటాల కోసం సిద్ధపడుతూ వాటికి హాజరయితే మనం యెహోవాచే ఉపదేశింపబడతాము. (మత్తయి 24:​45-47) మనం నేర్చుకుంటున్నదాన్ని అన్వయించుకోవడానికి కృషి చేస్తూ ఆధ్యాత్మికంగా మెళకువగా, అప్రమత్తతతో ఉంటే, దేవుడిని విశ్వసించని ఈ లోకస్థుల నుండి దైవిక బోధ మనల్ని భిన్నంగా ఉంచుతుంది. (1 పేతురు 5:​8, 9) మరింత ప్రాముఖ్యంగా, అది మనం ‘దేవుని యొద్దకు వచ్చేందుకు’ మనకు సహాయం చేస్తుంది.​—⁠యాకోబు 1:​22-25; 4: 8.

25. ఆధునిక కాలాల్లో దేవుని ప్రజలకు, సమాధానాన్ని గురించి ఆయన చేసిన వాగ్దాన భావమేమిటి?

25 అభిషిక్తులు సమాధానముతో మెండుగా ఆశీర్వదించబడ్డారని కూడా యెషయా ప్రవచనం చూపిస్తోంది. అంటే దాని భావం వారు ఎన్నడూ దాడికి గురికాలేదనా? కాదు గానీ, అలాంటి దాడులు జరగాలని ఆజ్ఞాపించననీ లేదా అవి సఫలం కావడానికి అనుమతించననీ దేవుడు హామీ ఇస్తున్నాడు. మనమిలా చదువుతాము: “ఆలకించుము! నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే. నాశనము చేయుటకై పాడుచేయువాని సృజించువాడను నేనే. నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు, న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.”​—యెషయా 54:​16, 17.

26. యెహోవా మొత్తం మానవజాతికే సృష్టికర్త అని తెలుసుకోవడం ఎందుకు ధైర్యాన్నిస్తుంది?

26 యెషయా గ్రంథంలోని ఈ అధ్యాయంలో రెండవసారి యెహోవా తన సేవకులకు తాను సృష్టికర్తనని గుర్తుచేస్తున్నాడు. మునుపు, ఆయన తన సూచనార్థక భార్యకు, తాను ఆమెను ‘సృష్టించినవాడనని’ చెబుతాడు. తాను మానవజాతికంతటికీ సృష్టికర్తనని ఇప్పుడాయన చెబుతున్నాడు. ఆయుధాలను తయారుచేస్తూ తన కొలిమిలోని నిప్పులపై ఊదే కమ్మరి గురించీ, “నాశనము చేయుటకై పాడుచేయు” వాడైన యుద్ధయోధుని గురించీ 16 వ వచనం వర్ణిస్తుంది. అలాంటి వ్యక్తులు తమ తోటి మానవులకు భయంగొలిపేవారిగా ఉండవచ్చు, గానీ వారు తమ స్వంత సృష్టికర్తకు వ్యతిరేకంగా మనగలమని ఎలా నిరీక్షించగలరు? కాబట్టి నేడు, ఈ లోకంలోని అత్యంత బలమైన శక్తులు యెహోవాపై దాడి చేసినప్పటికీ, తుది విజయాన్ని సాధించే అవకాశం వారికి లభించదు. అదెలా?

27, 28. ఈ కష్ట సమయాల్లో మనం దేని గురించి నిశ్చయత కలిగి ఉండవచ్చు, సాతాను మనపై చేసే దాడులు నిష్ఫలమైనవిగా నిరూపించబడతాయని మనకెందుకు తెలుసు?

27 దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, ఆత్మతోనూ సత్యముతోనూ వారు చేసే ఆరాధనకు వ్యతిరేకంగా జరిగే నాశనకరమైన దాడి ముగిసిపోయింది. (యోహాను 4:​23, 24) మహా బబులోను, తాత్కాలికంగా విజయవంతమైనదిగా నిరూపించబడిన ఒక దాడిని జరుపడానికి యెహోవా అనుమతించాడు. కొంత సమయంపాటు, భూమిపైన ప్రకటనా పని దాదాపుగా ఆగిపోవడంతో తన సంతానము దాదాపుగా నిశబ్దం చేయబడడాన్ని “పైనున్న యెరూషలేము” చూసింది. మరెన్నడూ అలా జరుగదు! ఇప్పుడు ఆమె తన కుమారులను బట్టి ఉప్పొంగిపోతుంది, ఎందుకంటే ఆధ్యాత్మిక భావంలో వారు అజేయులు. (యోహాను 16:​33; 1 యోహాను 5: 4) వారికి వ్యతిరేకంగా దాడి చేయడానికి ఆయుధాలు రూపించబడ్డాయి, ఇంకా ఎక్కువే జరుగనున్నాయి. (ప్రకటన 12:​17) కానీ ఇవి విజయం సాధించలేదు, సాధించలేవు కూడా. అభిషిక్తుల, వారి సహవాసుల విశ్వాసాన్ని, జ్వలిస్తున్న ఆసక్తిని ఆర్పివేయగల ఆయుధమేదీ సాతాను దగ్గర లేదు. ఈ ఆధ్యాత్మిక సమాధానం ‘యెహోవా సేవకుల యొక్క స్వాస్థ్యము,’ కాబట్టి ఎవరూ దాన్ని వారి నుండి బలవంతంగా తీసివేయలేరు.​—⁠కీర్తన 118: 6; రోమీయులు 8:​38, 39.

28 సాతాను లోకం చేయగలదేదైనా సరే, దేవుని సమర్పిత సేవకులు చేస్తున్న పనిని, కొనసాగుతున్న ఆయన శుద్ధమైన ఆరాధనను ఎన్నడూ ఆపలేవు. “పైనున్న యెరూషలేము” యొక్క అభిషిక్త సంతానము ఆ హామీని బట్టి గొప్ప ఓదార్పును పొందారు. గొప్ప సమూహపు సభ్యులు కూడా అలాగే చేస్తారు. యెహోవా పరలోక సంస్థ గురించి, భూమిపైనున్న ఆయన ఆరాధకులతో దాని వ్యవహారాల గురించి మనం ఎంతగా తెలుసుకుంటే మన విశ్వాసం అంతగా బలపడుతుంది. మన విశ్వాసం బలంగా ఉన్నంతవరకూ, మనకు వ్యతిరేకంగా లేచే సాతాను ఆయుధాలు వ్యర్థమైనవిగా నిరూపించబడతాయి!

[అధస్సూచి]

a ప్రకటన 12:​1-17 వచనాల ప్రకారం, దేవుని ‘స్త్రీ’ అత్యంత ప్రాముఖ్యమైన ఒక “సంతానము”కు అంటే ఒక ఆత్మ కుమారునికి కాదుగానీ పరలోకంలోని మెస్సీయ సంబంధిత రాజ్యానికి జన్మనివ్వడం ద్వారా గొప్పగా ఆశీర్వదించబడింది. ఈ జననం 1914 లో జరిగింది. (ప్రకటన​—⁠దాని దివ్యమైన ముగింపు సమీపించింది!, 177-86 పేజీలు చూడండి.) భూమిపైనున్న తన అభిషిక్త కుమారులను దేవుడు ఆశీర్వదించడం వల్ల ఆమెకు కలిగే ఆనందంపై యెషయా ప్రవచనం దృష్టినిలుపుతోంది.

[అధ్యయన ప్రశ్నలు]

[218, 219 వ పేజీలోని బాక్సు]

[220 వ పేజీలోని చిత్రం]

యేసు బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు, అప్పుడు యెషయా 54:1 వ వచనం అత్యంత ప్రాముఖ్యమైన నెరవేర్పు పొందడం ఆరంభమైంది

[225 వ పేజీలోని చిత్రం]

యెహోవా యెరూషలేము నుండి ‘నిమిషమాత్రము’ తన ముఖమును త్రిప్పుకున్నాడు

[231 వ పేజీలోని చిత్రాలు]

యోధుడు, కమ్మరి తమ సృష్టికర్తకు వ్యతిరేకంగా మనగలరా?