కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనములకు వెలుగు

జనములకు వెలుగు

ఇరవై ఎనిమిదవ అధ్యాయం

జనములకు వెలుగు

యెషయా 66:​15-24

1, 2. వెలుగు ఎందుకు ఆవశ్యకమైనది, నేడు భూమిని ఏ విధమైన చీకటి ఆవరిస్తోంది?

 యెహోవా వెలుగునకు మూలము, “పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడు.” (యిర్మీయా 31:​35) కేవలం దీని ఆధారంగానే ఆయన జీవానికి మూలమని అంగీకరించబడాలి, ఎందుకంటే వెలుగు జీవానికి ఆధారము. భూమికి గనుక సూర్యుని వెచ్చదనము, వెలుగు తగినంతగా ఎప్పుడూ అందుతూ ఉండకపోతే, జీవం అసాధ్యమవుతుందని మనకు తెలుసు. మన గ్రహం నివాసయోగ్యంగా ఉండదు.

2 కాబట్టి, యెహోవా మన దినాన్ని ముందుగా చూస్తూ, వెలుగు ఉండే సమయాన్ని కాదు గానీ చీకటి ఉండే సమయాన్ని గురించి ప్రవచించాడన్నది మనల్ని ఎంతో కలవరపరిచే విషయం. యెషయా ప్రేరేపించబడి ఇలా వ్రాశాడు: “చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటికచీకటి జనములను కమ్ముచున్నది.” (యెషయా 60: 2) నిజమే ఈ మాటలు భౌతిక చీకటిని కాదు గానీ ఆధ్యాత్మిక చీకటిని సూచిస్తున్నాయి, అయితే ఆ మాటల గంభీరతను తక్కువ అంచనా వేయకూడదు. సూర్యుని నుండి వెలుగు లభించకపోతే ఎలాగైతే జీవంతో ఉండడం అసాధ్యమో అలాగే ఆధ్యాత్మిక వెలుగు లేని వారికి చివరికి జీవంతో ఉండడం అసాధ్యం.

3. ఈ చీకటి కాలాల్లో, వెలుగు కోసం మనం ఎటు తిరుగవచ్చు?

3 ఈ చీకటి కాలాల్లో, యెహోవా మనకు అందుబాటులో ఉంచుతున్న ఆధ్యాత్మిక వెలుగును అలక్ష్యం చేయలేము. మన త్రోవను వెలుగుమయం చేసుకునేందుకు మనం సాధ్యమైతే ప్రతిరోజు బైబిలు చదువుతూ, దేవుని వాక్యమువైపు చూడడం ఆవశ్యకం. (కీర్తన 119:​105) “నీతిమంతుల మార్గము”పై నిలిచి ఉండడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి క్రైస్తవ కూటాలు మనకు అవకాశాలను ఇస్తాయి. (సామెతలు 4:​18; హెబ్రీయులు 10:​23-25) శ్రద్ధగా చేసే బైబిలు అధ్యయనం నుండి, ఆరోగ్యదాయకమైన క్రైస్తవ సహవాసం నుండి మనం పొందే బలం, యెహోవా యొక్క గొప్ప “ఉగ్రత దినమున” ముగిసే ఈ “అంత్యదినముల” యొక్క చీకటిచే కబళించబడడాన్ని నివారించేందుకు మనకు సహాయం చేస్తుంది. (2 తిమోతి 3: 1; జెఫన్యా 2: 3) ఆ దినము శీఘ్రంగా వస్తోంది! ప్రాచీన యెరూషలేము నివాసులపైకి అటువంటి దినము ఎంత ఖచ్చితంగా వచ్చిందో, ఇదీ అంత ఖచ్చితంగానే వస్తుంది.

యెహోవా “వ్యాజ్యెమాడును”

4, 5. (ఎ) యెహోవా ఏ విధంగా యెరూషలేముకు వ్యతిరేకంగా వస్తాడు? (బి) సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం సమయంలో తప్పించుకొని జీవించేవారు సాపేక్షికంగా చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారనే ముగింపుకు మనం ఎందుకు రావచ్చు? (అధస్సూచి చూడండి.)

4 ఉత్తేజకరమైన యెషయా ప్రవచనంలోని చివరి వచనాల్లో, యెహోవా తన ఉగ్రత దినానికి నడిపించే సంఘటనలను విశదంగా వర్ణిస్తున్నాడు. మనమిలా చదువుతాము: “ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడును; యెహోవాచేత అనేకులు హతులవుదురు.”​—యెషయా 66:​15, 16.

5 ఆ మాటలు తమ పరిస్థితి యొక్క గంభీరతను గుర్తించడానికి యెషయా సమకాలీనులకు సహాయం చేయాలి. బబులోనీయులు యెహోవా విధించిన శిక్షను అమలు చేసేవారిగా, యెరూషలేముపైకి వచ్చే సమయం త్వరగా సమీపిస్తోంది. అప్పుడు బబులోనీయుల రథాలు తుపానుగాలిలా దుమ్మురేపుతూ వస్తాయి. అది ఎంత భయంగొలిపే దృశ్యమై ఉంటుందో కదా! నమ్మకద్రోహులైన యూదా “శరీరులందరి”పైకి యెహోవా అగ్నివంటి తన తీర్పులను అమలు చేసేందుకు ఆ ఆక్రమణదారులను ఉపయోగించుకుంటాడు. అది యెహోవాయే తన ప్రజలకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లుగా ఉంటుంది. ఆయన “మహాకోపము” తగ్గించబడదు. “యెహోవాచేత” చాలామంది యూదులు ‘హతులవుతారు.’ సా.శ.పూ. 607 లో ఈ ప్రవచనం నెరవేరింది. a

6. యూదాలో ఆక్షేపణీయమైన ఏ ఆచారాలు జరుగుతున్నాయి?

6 యెహోవా తన ప్రజలకు వ్యతిరేకంగా ‘వ్యాజ్యెమాడడం’ న్యాయమేనా? ఖచ్చితంగా న్యాయమే! యూదులు యెహోవాకు సమర్పించుకోవలసిన వారే అయినప్పటికీ అబద్ధ ఆరాధనలో లోతుగా కూరుకుపోయారని యెషయా గ్రంథం యొక్క చర్చలో అనేకసార్లు మనం చూశాము, యెహోవా వారి చర్యలను చూడకుండా ఉండలేదు. ఈ విషయాన్ని మనం ప్రవచనం యొక్క ఈ మాటల్లో మళ్ళీ చూస్తాము: “తోటలోనికి వెళ్లవలెనని మధ్య నిలుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు కొనుచున్నవారై పందిమాంసమును హేయవస్తువును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండ నశించెదరు, ఇదే యెహోవా వాక్కు.” (యిషయా 66:​17) ఆ యూదులు ‘తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు కొనుచు’ ఉన్నది తమను తాము స్వచ్ఛారాధన కోసం సిద్ధం చేసుకోవడానికేనా? ఎంతమాత్రం కాదు. బదులుగా, వారు ప్రత్యేకమైన తోటల్లో అన్యమత శుద్ధీకరణ ఆచారాలను ఆచరిస్తున్నారు. ఆ తర్వాత వారు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైనవిగా పరిగణించబడే పంది మాంసమును, ఇతర జీవుల మాంసమును అత్యాశతో తింటారు.​—⁠లేవీయకాండము 11: 7, 21-23.

7. క్రైస్తవమత సామ్రాజ్యం విగ్రహారాధన చేసే యూదాను ఎలా పోలి ఉంది?

7 ఏకైక సత్య దేవునితో నిబంధన సంబంధాన్ని కలిగి ఉన్న జనముకు ఎంతటి హేయమైన పరిస్థితి! కానీ దీన్ని పరిశీలించండి: క్రైస్తవమత సామ్రాజ్య మతాల మధ్యన నేడు అటువంటి హేయమైన పరిస్థితే ఉంది. వీరు కూడా అలాగే దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటారు, వారి నాయకులు అనేకులు దైవభక్తిగలవారన్నట్లు నటిస్తారు. అయినప్పటికీ, వారు తాము ఆధ్యాత్మిక చీకటిలో ఉన్నామని నిరూపించుకుంటూ, అన్యమత బోధలతోనూ, సాంప్రదాయాలతోనూ తమను తాము మలినం చేసుకుంటారు. ఆ చీకటి ఎంత గాఢమైనదో కదా!​—⁠మత్తయి 6:​23; యోహాను 3:​19, 20.

‘వారు నా మహిమను చూచెదరు’

8. (ఎ) యూదాకు, క్రైస్తవమత సామ్రాజ్యానికి ఏమి సంభవిస్తుంది? (బి) జనములు ఏ భావంలో ‘యెహోవా మహిమను చూస్తారు’?

8 యెహోవా క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క ఆక్షేపణీయమైన చర్యలను, అబద్ధ బోధలను గమనిస్తాడా? యెషయా వ్రాసిన, యెహోవా యొక్క ఈ మాటలను చదివి, మీరు ఏ ముగింపుకు వస్తారో చూడండి: “వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి, అప్పుడు సమస్త జనములను ఆ యా భాషలు మాటలాడువారిని సమకూర్చెదను; వారు వచ్చి నా మహిమను చూచెదరు.” (యిషయా 66:​18) యెహోవా సేవకులమని చెప్పుకునేవారి క్రియలే కాదు వారి తలంపులు సహితం ఆయనకు తెలుసు, ఆయన వారి క్రియలకే కాదు వారి తలంపులకు కూడా తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. యూదా యెహోవాను నమ్ముతున్నానని చెప్పుకుంటోంది, కానీ దాని విగ్రహారాధనా చర్యలు, అన్యమత ఆచారాలు అది చెప్పుకునేది అబద్ధమని నిరూపిస్తున్నాయి. దాని పౌరులు అన్యమత ఆచారాల ప్రకారం తమను తాము “శుద్ధి చేసుకోవడం” వల్ల ప్రయోజనమేమీ లేదు. ఆ దేశము నాశనం చేయబడుతుంది, అది జరిగినప్పుడు, విగ్రహారాధన చేసే దాని పొరుగువారికి అంతా స్పష్టంగా కనిపించేలానే జరుగుతుంది. వీరు ‘యెహోవా మహిమను చూస్తారు’ అంటే వారు జరుగుతున్న సంఘటనలను చూసి, యెహోవా మాట నిజమయ్యిందని అంగీకరించేలా బలవంతం చేయబడతారు. ఇదంతా క్రైస్తవమత సామ్రాజ్యానికి ఎలా అన్వయిస్తుంది? దానికి అంతం వచ్చినప్పుడు, దాని మాజీ స్నేహితులు, భాగస్వాములు అనేకులు ప్రక్కన నిలబడి యెహోవా మాట నెరవేరుతుండగా నిస్సహాయంగా గమనిస్తారు.​—⁠యిర్మీయా 25:​31-33; ప్రకటన 17:​15-18; ప్రకటన 18:​9-19.

9. యెహోవా ఏ సువార్తను ప్రకటిస్తున్నాడు?

9 సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం చేయబడింది గనుక యెహోవాకు ఇక భూమిపై సాక్షులే ఉండరా? అలాగని కాదు. దానియేలు, ఆయన ముగ్గురు సహచరులు, వంటి విశేషమైన యథార్థవంతులు బబులోనులో బంధీలుగా ఉన్నప్పుడు కూడా యెహోవా సేవ చేస్తుంటారు. (దానియేలు 1:​6, 7) అవును, యెహోవా నమ్మకమైన సాక్షుల గొలుసు పటిష్టంగా ఉంటుంది, 70 సంవత్సరాల ముగింపులో, నమ్మకమైన స్త్రీ పురుషులు యూదాలో స్వచ్ఛారాధనను పునఃస్థాపించడానికి బబులోనును విడిచి యూదాకు తిరిగి వస్తారు. తర్వాత యెహోవా అదే పరోక్షంగా సూచిస్తున్నాడు: “నేను వారియెదుట ఒక సూచకక్రియను జరిగించెదను, వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల యొద్దకును తుబాలు, యావాను నివాసులయొద్దకును నేను పంపెదను, నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదను; వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.”​—యెషయా 66:​19.

10. (ఎ) బబులోను నుండి విడుదల చేయబడిన నమ్మకమైన యూదులు ఏ భావంలో సూచనగా పనిచేస్తారు? (బి) నేడు ఎవరు సూచనగా పనిచేస్తున్నారు?

10 సా.శ.పూ. 537 లో యెరూషలేముకు తిరిగి వచ్చే నమ్మకమైన స్త్రీ పురుషుల పెద్ద గుంపు, యెహోవా తన ప్రజలను విడుదల చేస్తాడు అనేదానికి రుజువుగా, ఆశ్చర్యకరమైన సూచనగా పనిచేస్తుంది. బంధీలుగా ఉన్న యూదులు యెహోవా ఆలయంలో స్వచ్ఛారాధనను చేపట్టడానికి ఏదో ఒక రోజున విడుదల చేయబడతారని ఎవరు ఊహించి ఉంటారు? అదే విధంగా మొదటి శతాబ్దంలో, అభిషిక్త క్రైస్తవులు “సూచనలుగాను, మహత్కార్యములుగాను” పనిచేస్తున్నారు, యెహోవా సేవ చేయాలని కోరుకునే దీనులు వారి వద్దకు సమకూడుతున్నారు. (యెషయా 8:​18; హెబ్రీయులు 2:​13) నేడు అభిషిక్త క్రైస్తవులు, తమ పునఃస్థాపిత దేశంలో వర్ధిల్లుతూ, భూమి మీద ఆశ్చర్యకరమైన సూచనగా పనిచేస్తున్నారు. (యెషయా 66: 8) వారు యెహోవా ఆత్మ శక్తికి నిదర్శనంగా జీవిస్తూ, యెహోవా సేవ చేయాలని తమ హృదయాలచే పురికొల్పబడుతున్న దీనులను ఆకర్షిస్తున్నారు.

11. (ఎ) పునఃస్థాపన తర్వాత, అన్యజనములకు చెందినవారు యెహోవా గురించి ఎలా తెలుసుకుంటారు? (బి) జెకర్యా 8: 23 తొలిసారిగా ఎలా నెరవేరింది?

11 అయితే, సా.శ.పూ. 537 లో పునఃస్థాపన జరిగిన తర్వాత, యెహోవాను గూర్చిన సమాచారము విననట్టి జనులు ఆయన గురించి ఎలా తెలుసుకుంటారు? అయితే నమ్మకమైన యూదులందరూ బబులోను చెర ముగింపులో యెరూషలేముకు తిరిగిరారు. దానియేలు వలె, కొందరు బబులోనులోనే ఉండిపోతారు. ఇతరులు భూమి నలుమూలలకూ చెదరి పోతారు. సా.శ.పూ. ఐదవ శతాబ్దానికల్లా, పారసీక సామ్రాజ్యమంతటిలోనూ యూదులు నివసిస్తున్నారు. (ఎస్తేరు 1: 1; 3: 8) వారిలో కొందరు అన్యులైన తమ పొరుగువారికి యెహోవా గురించి చెప్పారనడంలో సందేహం లేదు, ఎందుకంటే ఆ రాజ్యాలకు చెందిన అనేకులు యూదా మతప్రవిష్టులయ్యారు. క్రైస్తవ శిష్యుడైన ఫిలిప్పు మొదటి శతాబ్దంలో ఎవరికైతే ప్రకటించాడో ఆ ఐతియోపీయుడైన నపుంసకుడి విషయం కూడా అదేనని స్పష్టమవుతోంది. (అపొస్తలుల కార్యములు 8:​26-40) ఇదంతా, జెకర్యా ప్రవక్త వ్రాసిన ఈ మాటల తొలి నెరవేర్పుగా జరిగింది: “ఆ దినములలో ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని​—⁠దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.” (జెకర్యా 8:​23) వాస్తవంగా, యెహోవా జనములకు వెలుగును బయలుదేరజేశాడు.​—⁠కీర్తన 43: 3.

“యెహోవాకు నైవేద్యము” తీసుకురావడం

12, 13. సా.శ.పూ. 537 మొదలుకొని ‘స్వదేశీయులు’ యెరూషలేముకు ఎలా తీసుకురాబడ్డారు?

12 తమ స్వదేశానికి దూరంగా ఎక్కడికెక్కడికో చెదరిపోయిన యూదులు, యెరూషలేము పునర్నిర్మించబడిన తర్వాత, పునఃస్థాపించబడిన యాజకత్వంతోపాటు ఆ నగరాన్ని స్వచ్ఛారాధనకు కేంద్రంగా దృష్టిస్తారు. అక్కడ వార్షిక పండుగలకు హాజరు కావడానికి వారిలో చాలామంది ఎంతో దూర ప్రాంతాల నుండి ప్రయాణించి వస్తారు. ప్రేరేపించబడి యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.”​—యెషయా 66:​20, 21.

13 “సర్వజనములలో నుండి” వచ్చిన “స్వదేశీయుల”లో కొందరు, పెంతెకొస్తు దినాన యేసు శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు అక్కడ ఉన్నారు. ఆ వృత్తాంతం ఇలా తెలియజేస్తోంది: “ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.” (అపొస్తలుల కార్యములు 2: 5) యూదా ఆచారం ప్రకారం ఆరాధించడానికి వారు యెరూషలేముకు వచ్చారు గానీ యేసుక్రీస్తును గూర్చిన సువార్తను విన్నప్పుడు వారిలో చాలామంది ఆయనపై విశ్వాసం ఉంచి, బాప్తిస్మం తీసుకున్నారు.

14, 15. (ఎ) అభిషిక్త క్రైస్తవులు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత తమ ఆధ్యాత్మిక ‘స్వదేశీయులను’ ఇంకా ఎక్కువమందిని ఎలా సమకూర్చారు, వీరు యెహోవాకు “పవిత్రమైన పాత్రలో నైవేద్యము”గా ఎలా తీసుకురాబడ్డారు? (బి) యెహోవా ఏ విధంగా ‘కొందరిని యాజకులుగా ఏర్పరచుకున్నాడు’? (సి) తమ ఆధ్యాత్మిక సహోదరులను సమకూర్చడంలో నిమగ్నమైన కొంతమంది అభిషిక్త క్రైస్తవులు ఎవరు? (ఈ పేజీలోని బాక్సును చూడండి.)

14 ఈ ప్రవచనానికి ఆధునిక దిన నెరవేర్పు ఉందా? ఖచ్చితంగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, 1914 లో పరలోకంలో దేవుని రాజ్యం స్థాపించబడిందని యెహోవా అభిషిక్త సేవకులు లేఖనాలనుండి గ్రహించారు. జాగ్రత్తగా బైబిలు అధ్యయనం చేయడం ద్వారా, రాజ్యపు ఇతర వారసులు లేదా ‘స్వదేశీయులు’ సమకూర్చబడవలసి ఉందని వారు తెలుసుకున్నారు. ధైర్యంగల ఈ పరిచారకులు, అభిషిక్త శేషము యొక్క భవిష్యత్‌ సభ్యులను వెదికేందుకు అన్ని రకాలైన ప్రయాణ సౌకర్యాలను ఉపయోగించుకుంటూ “భూదిగంతముల వరకు” ప్రయాణించారు, అభిషిక్త శేషముకు చెందిన అనేకులు క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలలో నుండి బయటకు వచ్చారు. వీరిని కనుగొన్న తర్వాత వీరిని యెహోవాకు నైవేద్యముగా తీసుకురావడం జరిగింది.​—⁠అపొస్తలుల కార్యములు 1: 8.

15 తొలి సంవత్సరాల్లో సమకూర్చబడిన అభిషిక్తులు, తాము బైబిలు జ్ఞానము పొందక ముందు ఎలా ఉన్నారో అలాగే యెహోవా తమను స్వీకరిస్తాడని ఎదురు చూడలేదు. తాము “పవిత్రమైన పాత్రలో నైవేద్యము” వలె లేదా అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ‘క్రీస్తుకు పవిత్రురాలైన కన్యకగా’ అందజేయబడగలిగేలా తమను తాము ఆధ్యాత్మిక, నైతిక కల్మషము నుండి శుద్ధి చేసుకోవడానికి చర్యలు తీసుకున్నారు. (2 కొరింథీయులు 11: 2) అభిషిక్తులు సైద్ధాంతిక తప్పులను తిరస్కరించడమే గాక ఈ లోకపు రాజకీయ వ్యవహారాల్లో ఖచ్చితంగా తటస్థంగా ఎలా ఉండాలో నేర్చుకోవలసి వచ్చింది. తన సేవకులు సముచితమైన స్థాయి మేరకు శుద్ధీకరించబడిన తర్వాత, 1931 లో యెహోవాసాక్షులుగా వారు తన పేరును ధరించే ఆధిక్యతను యెహోవా దయతో వారికి అనుగ్రహించాడు. (యెషయా 43:​10-12) అయితే ఏ విధంగా యెహోవా ‘కొందరిని యాజకులుగా ఏర్పరచుకున్నాడు’? ఒక గుంపుగా ఈ అభిషిక్తులు దేవునికి స్తుతియాగములు చెల్లిస్తూ ‘రాజులైన యాజకసమూహములో, పరిశుద్ధజనములో’ భాగమయ్యారు.​—⁠1 పేతురు 2: 9; యెషయా 54: 1; హెబ్రీయులు 13:​15.

సమకూర్పు కొనసాగుతోంది

16, 17. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత “నీ సంతతి” ఎవరు?

16 ఆ “రాజులైన యాజకసమూహము” యొక్క మొత్తం సంఖ్య 1,44,000, కొంతకాలానికి వారిని సమకూర్చే పని ముగిసింది. (ప్రకటన 7:​1-8; 14: 1) అదే సమకూర్చే పని యొక్క ముగింపా? కాదు. యెషయా ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.” (యిషయా 66:​22) ఆ మాటల తొలి నెరవేర్పులో, బబులోను చెర నుండి తిరిగి వచ్చిన యూదులు పిల్లలకు జన్మనిచ్చి పెంచడం ప్రారంభిస్తారు. అలా, “క్రొత్త భూమి” అంటే, పునఃస్థాపించబడిన యూదా శేషము, “క్రొత్త ఆకాశము” క్రింద అంటే, యూదా క్రొత్త కార్యనిర్వహణ క్రింద స్థిరంగా స్థాపించబడుతుంది. అయితే, ఆ ప్రవచనం మన కాలంలో మరింత గమనార్హమైన విధంగా నెరవేరింది.

17 ఆధ్యాత్మిక సహోదరుల జనము ఉత్పన్నం చేసే “సంతతి” ఎవరంటే, భూమిపై నిత్యజీవమును పొందే నిరీక్షణ గల “గొప్ప సమూహము.” వారు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు” వచ్చి, “సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను” నిలబడతారు. వీరు “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.” (ప్రకటన 7:​9-14; 22:​17) ఈనాడు “గొప్ప సమూహము” ఆధ్యాత్మిక చీకటి నుండి యెహోవా అందజేసే వెలుగు వైపుకు మరలుతున్నారు. వారు తమ అభిషిక్త సహోదర సహోదరీల వలె యేసుక్రీస్తుయందు విశ్వాసం కలిగి ఉండి, ఆధ్యాత్మికంగానూ నైతికంగానూ నిర్మలంగా ఉండడానికి కృషి చేస్తారు. ఒక గుంపుగా వారు క్రీస్తు నిర్దేశం క్రింద సేవ చేయడం కొనసాగిస్తూ, నిరంతరం ‘నిలిచివుంటారు.’​—⁠కీర్తన 37:​11, 29.

18. (ఎ) గొప్ప సమూహానికి చెందినవారు తమ అభిషిక్త సహోదరులతో ఎలా వ్యవహరించారు? (బి) అభిషిక్తులు, వారి సహవాసులు “ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను” ఎలా యెహోవాను ఆరాధిస్తారు?

18 నైతికంగా, ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉండడం ఆవశ్యకమే అయినప్పటికీ యెహోవాకు ప్రీతికరమైన విధంగా ఉండడంలో ఇంకా ఎక్కువే ఇమిడి ఉందని, భూ నిరీక్షణ గల, కష్టించి పనిచేసే ఆ స్త్రీ పురుషులకు తెలుసు. సమకూర్చే పని ఇప్పుడు ముమ్మరంగా సాగుతోంది, దానిలో భాగం వహించాలని వారు కోరుకుంటున్నారు. ప్రకటన గ్రంథము వారి గురించి ఇలా ప్రవచిస్తోంది: “వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు.” (ప్రకటన 7:​15) ఆ మాటలు మనకు యెషయా ప్రవచనంలోని చివరి అధ్యాయపు 23 వ వచనాన్ని గుర్తు చేస్తాయి: “ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా 66:​23) ఇది నేడు జరుగుతోంది. ‘ప్రతి అమావాస్యదినమున, ప్రతి విశ్రాంతిదినమున’ అంటే క్రమంగా, ప్రతి నెలలోని ప్రతి వారంలోనూ అభిషిక్త క్రైస్తవులు, వారి సహవాసులైన గొప్ప సమూహము యెహోవాను ఆరాధించడానికి సమకూడతారు. ఇతర విషయాలతో పాటు, క్రైస్తవకూటాలకు హాజరు కావడం ద్వారా, బహిరంగ పరిచర్యలో పాల్గొనడం ద్వారా వారు అలా చేస్తారు. ‘యెహోవా సన్నిధిని మ్రొక్కడానికి’ క్రమంగా ‘వచ్చే’ వారిలో మీరు ఒకరా? యెహోవా ప్రజలు అలా చేయడంలో గొప్ప ఆనందాన్ని పొందుతారు, “సమస్త శరీరులు” అంటే సజీవులైన మానవులందరు అనంతకాలం “ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను” యెహోవా సేవచేసే సమయం కోసం గొప్ప సమూహానికి చెందినవారు ఎదురుచూస్తారు.

దేవుని శత్రువుల తుది అంతం

19, 20. బైబిలు కాలాల్లో గెహెన్నా దేనికి ఉపయోగపడేది, అది దేన్ని సూచిస్తుంది?

19 యెషయా ప్రవచనపు మన అధ్యయనంలో ఒక వచనం మిగిలింది. ఆ గ్రంథం ఈ మాటలతో ముగుస్తుంది: “వారు పోయి నామీద తిరుగుబాటుచేసినవారి కళేబరములను తేరి చూచెదరు; వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.” (యెషయా 66:​24) జీవితాలను సరళం చేసుకుని, రాజ్య ఆసక్తులకు మొదటిస్థానం ఇవ్వమని తన శిష్యులను ప్రోత్సహించినప్పుడు యేసుక్రీస్తు మనస్సులో ఈ ప్రవచనమే ఉండి ఉండవచ్చు. ఆయనిలా అన్నాడు: ‘నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపారవేయుము; రెండు కన్నులు కలిగి నరకములో [“గెహెన్నాలో,” NW] పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు, నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు.’​—⁠మార్కు 9:​47, 48; మత్తయి 5:​29, 30; 6: 33.

20 గెహెన్నా అని పిలువబడే ఈ స్థలం ఏది? దానిని గూర్చి శతాబ్దాల క్రితం, యూదా పండితుడైన డేవిడ్‌ కిమ్‌కీ ఇలా వ్రాశాడు: “అది యెరూషలేము ప్రక్కనే ఉన్న ఒక స్థలం, అది చాలా అసహ్యమైన స్థలం, అక్కడ వారు అశుభ్రమైనవాటిని, మృత కళేబరాలను పడేసేవారు. అశుభ్రమైనవాటిని, మృత కళేబరాల ఎముకలను కాల్చడానికి అక్కడ ఎప్పుడూ అగ్ని ఆరకుండా ఉంటుంది. కాబట్టి, దుష్టులకు విధించబడే తీర్పు గెహెన్నా అని ఉపమానరీతిగా పిలువబడుతోంది.” ఒకవేళ, ఈ యూదా పండితుడు సూచిస్తున్నట్లుగా, గెహెన్నా అనేది చెత్తను, సమాధి చేయడానికి అనర్హమైనవారిగా పరిగణించబడినవారి మృతకళేబరాలను పడేయడానికి ఉపయోగించబడితే, అలాంటి చెత్తను నిర్మూలించడానికి అగ్ని తగినదిగా ఉండేది. అగ్ని హరించి వేయలేనిదాన్ని, పురుగులు హరించి వేస్తాయి. దేవుని శత్రువులందరి యొక్క తుది అంతానికి ఎంత సముచితమైన చిత్రణ! b

21. యెషయా గ్రంథం ఎవరికి ప్రోత్సాహకరమైన సందేశంతో ముగుస్తుంది, ఎందుకు?

21 యెషయా యొక్క ఉత్తేజకరమైన ప్రవచనం కళేబరాలు, అగ్ని, పురుగుల ప్రస్తావనతో భయంకరమైన సందేశంతో ముగుస్తుందన్నది నిజం కాదా? తాము దేవునికి శత్రువులమని చెప్పుకునేవారు నిస్సందేహంగా అలాగే తలస్తారు. కానీ దేవుని స్నేహితులకు, దుష్టుల నిత్య నాశనాన్ని గురించిన యెషయా వర్ణన ఎంతో ప్రోత్సాహకరమైనది. మళ్ళీ ఎన్నడూ తమ శత్రువులది పైచేయి కాలేదన్న ఈ హామీ యెహోవా ప్రజలకు అవసరం. దేవుని ఆరాధకులకు ఎంతో వేదన కలిగించి, ఆయన నామముపైకి ఎంతో నిందను తీసుకువచ్చిన ఆ శత్రువులు, ఇక ఎన్నడూ ఉండకుండా నాశనం చేయబడతారు. అప్పుడు, ‘బాధ రెండవమారు రాదు.’​—⁠నహూము 1: 9.

22, 23. (ఎ) యెషయా గ్రంథం యొక్క మీ అధ్యయనం నుండి మీరు ప్రయోజనం పొందిన కొన్ని విధాలను తెలియజేయండి. (బి) యెషయా గ్రంథాన్ని అధ్యయనం చేశాక, మీ తీర్మానం ఏమిటి, మీ నిరీక్షణ ఏమిటి?

22 మనం యెషయా గ్రంథపు మన అధ్యయనాన్ని ముగిస్తుండగా, ఈ బైబిలు పుస్తకం మృత చరిత్ర కాదని మనం ఖచ్చితంగా గ్రహిస్తాము. బదులుగా, దానిలో నేడు మనకు ఒక సందేశం ఉంది. యెషయా జీవించిన నిరాశాపూరితమైన కాలాల గురించి మనం తలంచినప్పుడు, ఆ కాలానికి మన కాలానికి మధ్యన ఉన్న సారూప్యతలను మనం చూడవచ్చు. రాజకీయ అస్థిరత, మత వేషధారణ, న్యాయవ్యవస్థలో భ్రష్టత్వం, నమ్మకమైనవారినీ పేదవారినీ అణచివేయడం, ఇవన్నీ యెషయా కాలానికీ మన కాలాలకూ చిహ్నాలుగా ఉన్నాయి. సా.శ.పూ. ఆరవ శతాబ్దంలోని నమ్మకమైన యూదులు యెషయా ప్రవచనాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండివుంటారు, నేడు మనం దాన్ని అధ్యయనం చేస్తుండగా ఓదార్పును పొందుతున్నాము.

23 భూమిని చీకటి, జనములను కటికచీకటి కమ్ముకుంటున్న ఈ క్లిష్ట కాలాల్లో, యెహోవా యెషయా ద్వారా సర్వమానవాళికి వెలుగును ప్రసాదించినందుకు మనమందరం ఎంతో కృతజ్ఞత కలిగివున్నాము! తాము ఏ జాతీయ లేదా జాతి నేపథ్యం నుండి వచ్చినప్పటికీ ఆ ఆధ్యాత్మిక వెలుగును హృదయపూర్వకంగా అంగీకరించే వారందరికీ అది నిత్యజీవాన్ని ఇస్తుంది. (అపొస్తలుల కార్యములు 10:​34, 35) కాబట్టి, మనం దేవుని వాక్యాన్ని అనుదినం చదువుతూ, ధ్యానిస్తూ, దాని సందేశాన్ని విలువైనదిగా ఎంచుతూ దాని వెలుగులో నడుస్తూనే ఉందాము. ఇది మనకు నిత్య ఆశీర్వాదాన్ని, యెహోవా పరిశుద్ధ నామానికి స్తుతిని తీసుకువస్తుంది.

[అధస్సూచీలు]

a యెరూషలేము బబులోనీయుల చేతికి చిక్కిన తర్వాతి పరిస్థితి గురించి చెబుతూ, యిర్మీయా 52: 15 “ప్రజలలో కడుబీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను” గురించి మాట్లాడుతోంది. (ఇటాలిక్కులు మావి.) దీనిపై వ్యాఖ్యానిస్తూ, లేఖనములపై అంతర్దృష్టి, సంపుటి I, 415 వ పేజీ ఇలా పేర్కొంటోంది: “‘పట్టణములో శేషించిన కొదువ ప్రజలు’ అనే పదబంధం, చాలామంది కరువు, రోగము, లేదా అగ్ని మూలంగా చనిపోయారనీ, లేదా యుద్ధంలో వధించబడ్డారనీ సూచిస్తుందని స్పష్టమవుతోంది.”

b సజీవమైన వ్యక్తులు కాదుగానీ మృత కళేబరాలు గెహెన్నాలో కాల్చబడేవి గనుక, ఈ స్థలం నిత్య హింసకు చిహ్నమేమీ కాదు.

[అధ్యయన ప్రశ్నలు]

[409 వ పేజీలోని బాక్సు]

అన్ని జనముల నుండి యెహోవాకు అభిషిక్త నైవేద్యములు

క్వాన్‌ మూన్యీస్‌ 1920 లో, అమెరికా నుండి బయలుదేరి స్పెయిన్‌కు వెళ్లి, అక్కడి నుండి అర్జెంటీనాకు ప్రయాణించాడు, అక్కడ ఆయన అభిషిక్తుల సంఘాలను సంస్థీకరించాడు. విలియమ్‌ ఆర్‌. బ్రౌన్‌ అనే మిషనరీ, (తరచూ “బైబిల్‌ బ్రౌన్‌” అని పిలువబడేవాడు) 1923 నుండి, సియర్రాలియోన్‌, ఘానా, లైబీరియా, గాంబియా, నైజీరియా వంటి స్థలాల్లో రాజ్య సందేశాన్ని ప్రకటించడానికి బయలుదేరినప్పుడు పశ్చిమాఫ్రికాలోని యథార్థహృదయులపై సత్యపు వెలుగు ప్రసరించింది. అదే సంవత్సరంలో జార్జ్‌ యంగ్‌ అనే కెనడా దేశస్థుడు బ్రెజిల్‌కు వెళ్లి, అక్కడి నుండి అర్జెంటీనా, కోస్టరికా, పనామా, వెనిజ్యులాలకు, చివరికి రష్యాకు ప్రయాణించాడు. దాదాపు అదే సమయంలో, ఎడ్విన్‌ స్కిన్నర్‌ ఇంగ్లాండు నుండి ఇండియాకు ఓడలో ప్రయాణించి, అక్కడ ఆయన కోతపనిలో అనేక సంవత్సరాలపాటు శ్రమించాడు.

[411 వ పేజీలోని చిత్రం]

పెంతెకొస్తు దినాన హాజరైయున్న యూదుల్లో కొందరు ‘సర్వజనములలో నుండి సమకూర్చబడిన స్వదేశీయులు’

[413 వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]