దేవుని ప్రజలకు ఓదార్పు
పన్నెండవ అధ్యాయం
దేవుని ప్రజలకు ఓదార్పు
1. యెరూషలేముకు, దాని నివాసులకు ఏ నిస్తేజమైన పరిస్థితులు వేచి ఉన్నాయి, అయినప్పటికీ ఏ నిరీక్షణ ఉంది?
యూదా జనాంగము డెబ్భై సంవత్సరాలపాటు అంటే సగటు మానవ జీవిత కాలంపాటు బబులోనులో బంధీగా ఉంటుంది. (కీర్తన 90:10; యిర్మీయా 25:11; 29:10) బంధీలుగా తీసుకువెళ్ళబడిన ఇశ్రాయేలీయుల్లో అనేకులు బబులోనులోనే వృద్ధులై మరణిస్తారు. తమ శత్రువులు చేసే ఎగతాళి, పరిహాసాలను బట్టి వారు ఎంతగా అవమానింపబడతారో ఆలోచించండి. వారి దేవుడైన యెహోవా తన పేరు పెట్టిన నగరం అంత కాలంపాటు నిర్జనంగా విడువబడితే అది ఆయన పేరుకి ఎంతటి నిందను తీసుకువస్తుందో కూడా ఆలోచించండి. (నెహెమ్యా 1: 9; కీర్తన 132:13; 137:1-3) సొలొమోను ప్రతిష్ఠించినప్పుడు దేవుని తేజస్సుతో నింపబడిన ప్రియమైన ఆలయం, ఇక ఉండదు. (2 దినవృత్తాంతములు 7:1-3) ఎంతటి నిస్తేజమైన పరిస్థితి! కానీ యెహోవా యెషయా ద్వారా ఒక పునఃస్థాపన గురించి ప్రవచిస్తాడు. (యెషయా 43:14; 44:26-28) యెషయా గ్రంథంలోని 51 వ అధ్యాయంలో, ఓదార్పునిచ్చే ధైర్యంచెప్పే ఈ అంశంపై మనం మరితర ప్రవచనాలను కనుగొంటాము.
2. (ఎ) యెహోవా, యెషయా ద్వారా ఎవరిని ఉద్దేశించి తన ఓదార్పు సందేశాన్ని ఇస్తాడు? (బి) నమ్మకమైన యూదులు ఎలా ‘నీతిని అనుసరిస్తారు’?
2 తమ హృదయములను యెహోవావైపు మరల్చుకునే యూదా నివాసులకు ఆయనిలా చెబుతున్నాడు: “నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండువారలారా, నా మాట వినుడి.” (యెషయా 51:1ఎ) ‘నీతిని అనుసరించడం’ చర్య తీసుకోవడాన్ని సూచిస్తుంది. ‘నీతిని అనుసరించేవారు’ కేవలం తాము దేవుని ప్రజలమని మాత్రమే చెప్పుకోరు. వారు నీతిగా ఉండడానికీ, దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడానికీ అత్యాసక్తితో కృషి చేస్తారు. (కీర్తన 34:15; సామెతలు 21:21) నీతికి ఏకైక మూలముగా వారు యెహోవావైపు చూస్తారు, వారు ‘యెహోవాను వెదకుతారు.’ (కీర్తన 11: 7; 145:17) అంటే దాని భావం యెహోవా ఎవరో, ప్రార్థనలో ఆయనను ఎలా సమీపించాలో వారికి తెలియదని కాదుగానీ, వారు ఆయనను ఆరాధిస్తూ, ఆయనకు ప్రార్థిస్తూ, తాము చేసేదానంతటిలోనూ ఆయన నడిపింపును కోరుతూ, ఆయనకు మరింత సన్నిహితం కావడానికి ప్రయత్నిస్తారు.
3, 4. (ఎ) యూదులు ఏ “బండ” నుండి చెక్కబడ్డారు, వారు ఏ “గుంట” నుండి త్రవ్వబడ్డారు? (బి) యూదులు తాము ఏ మూలముల నుండి వచ్చామనేది గుర్తుంచుకోవడం వారికి ఎలా ఓదార్పునిస్తుంది?
3 అయితే, నిజంగా నీతిని అనుసరించేవారు యూదాలో సాపేక్షికంగా చాలా తక్కువమంది ఉన్నారు, ఇది వారు అధైర్యపడేలా, నిరుత్సాహపడేలా చేయవచ్చు. కాబట్టి రాళ్ళగనికి సంబంధించిన ఉపమానాన్ని ఉపయోగిస్తూ, యెహోవా వారినిలా ప్రోత్సహిస్తాడు: “మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి, మీరు ఏ గుంటనుండి త్రవ్వబడితిరో దాని ఆలోచించుడి. మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని.” (యెషయా 51:1బి, 2) యూదులు అబ్రాహాము అనే “బండ” నుండి చెక్కబడ్డారు, ఆయన చారిత్రక ప్రాముఖ్యతగల వ్యక్తి, ఇశ్రాయేలు జనాంగము ఆయనను బట్టి ఎంతో గర్విస్తుంది. (మత్తయి 3:8, 9; యోహాను 8:33, 39) ఆయన ఆ జనాంగముకు మూలకర్త, మానవ తండ్రి. ఇశ్రాయేలు పూర్వీకుడైన ఇస్సాకు ఆ “గుంట” అయిన శారా గర్భమున జన్మించాడు.
4 అబ్రాహాము శారాలకు పిల్లలను కనే వయస్సు దాటిపోయింది, అయినా వారు పిల్లలు లేకుండానే ఉన్నారు. అయినప్పటికీ, అబ్రాహామును ఆశీర్వదించి, “అతనిని పెక్కుమందియగునట్లు” చేస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. (ఆదికాండము 17:1-6, 15-17) దేవుడు అబ్రాహాము శారాల సంతానోత్పత్తి శక్తులను పునరుద్ధరించడంతో, వారు తమ వృద్ధాప్యంలో ఒక కుమారుడ్ని కన్నారు, ఆ కుమారుని ద్వారా దేవుని నిబంధన జనము ఉద్భవించింది. అలా యెహోవా ఒక్క వ్యక్తిని, ఆకాశనక్షత్రాల్లా అసంఖ్యాకంగా ఉన్న ఒక గొప్ప జనముకు తండ్రిని చేశాడు. (ఆదికాండము 15: 5; అపొస్తలుల కార్యములు 7: 5) కాబట్టి యెహోవా అబ్రాహామును అలా దూరదేశం నుండి తీసుకొనివచ్చి ఆయనను గొప్ప జనముగా చేయగలిగితే, నమ్మకమైన ఒక శేషమును బబులోను దాసత్వం నుండి విడుదల చేసి, వారిని తమ స్వదేశానికి తీసుకువచ్చి, వారిని మళ్ళీ గొప్ప జనముగా చేస్తానని తాను చేసిన వాగ్దానాన్ని కూడా ఆయన తప్పక నెరవేర్చగలడు. దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం నెరవేరినట్లే; బంధీలుగా ఉన్న ఆ యూదులకు ఆయన చేసిన వాగ్దానం కూడా తప్పక నెరవేరుతుంది.
5. (ఎ) అబ్రాహాము, శారా ఎవరికి సూచనగా ఉన్నారు? వివరించండి. (బి) తుది నెరవేర్పులో, “బండ” నుండి ఉద్భవించినవారు ఎవరు?
5 యెషయా 51:1, 2 వచనాల్లో చెప్పబడిన సూచనార్థకమైన గనికి సంబంధించిన పనికి బహుశా అదనపు అన్వయింపు కూడా ఉండవచ్చు. ద్వితీయోపదేశకాండము 32: 18, NW యెహోవాను ఇశ్రాయేలుకు జన్మనిచ్చిన “బండ” అనీ, ‘[ఇశ్రాయేలును] కనే’ వాడనీ పిలుస్తోంది. ఈ తదుపరి వ్యక్తీకరణలో, శారా ఇశ్రాయేలుకు జన్మనివ్వడానికి సంబంధించి యెషయా 51:2 లో కనిపించేలాంటి హీబ్రూ క్రియాపదమే ఉపయోగించబడింది. కాబట్టి అబ్రాహాము, గొప్ప అబ్రాహాము అయిన యెహోవాకు ప్రవచనార్థక సారూప్యంగా ఉన్నాడు. అబ్రాహాము భార్యయైన శారా, పరిశుద్ధ లేఖనాల్లో దేవుని భార్యగా లేదా స్త్రీగా పేర్కొనబడిన, ఆత్మప్రాణులతో కూడిన యెహోవా విశ్వ పరలోక సంస్థను సూచిస్తుంది. (ఆదికాండము 3:15; ప్రకటన 12:1, 5) యెషయా ప్రవచనంలోని ఈ మాటల తుది నెరవేర్పులో, “బండ” నుండి ఉద్భవించే జనము “దేవుని ఇశ్రాయేలు,” అంటే సా.శ. 33 పెంతెకొస్తునాడు జనించిన ఆత్మాభిషిక్త క్రైస్తవుల సంఘం. ఈ పుస్తకంలోని మునుపటి అధ్యాయాలలో చర్చించబడినట్లుగా, ఆ జనము 1918 లో బబులోను సంబంధమైన చెరలోకి వెళ్ళింది గానీ 1919 లో మరల ఆధ్యాత్మికంగా సమృద్ధమైన స్థితికి తీసుకురాబడింది.—గలతీయులు 3:26-29; 4:28; 6:16.
6. (ఎ) యూదా దేశం కోసం ఏమి వేచి ఉంది, ఏ పునరుద్ధరణ జరుగవలసి ఉంది? (బి) యెషయా 51:3 ఏ ఆధునిక దిన పునరుద్ధరణను మనకు గుర్తుచేస్తుంది?
6 సీయోనుకు లేక యెరూషలేముకు యెహోవా ఇచ్చిన ఓదార్పులో, జనసాంద్రతగల జనమును ఉత్పన్నం చేయడాన్ని గురించిన వాగ్దానం మాత్రమే ఇమిడి లేదు. మనమిలా చదువుతాము: “యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి, దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు, దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును.” (యెషయా 51: 3) యూదా దేశం డెబ్భై సంవత్సరాలు నిర్జనంగా విడువబడిన సమయంలో, అది ముళ్లపొదలు, కలుపుమొక్కలు, ఇతర అడవి మొక్కలతో నిండిపోయి బీడుభూమిగా మారుతుంది. (యెషయా 64:10; యిర్మీయా 4:26; 9:10-12) కాబట్టి యూదాలో ప్రజలు తిరిగి నివసించేలా చేయడమే గాక, చక్కగా నీరు పెట్టబడిన పంటపొలాలతో, పండ్ల తోటలతో ఏదెను తోటవలె మారేలా భూమిని పునరుద్ధరించవలసి ఉంది. అప్పుడు నేల ఉల్లసిస్తున్నట్లుగా కనిపిస్తుంది. దేశం నిర్జనంగా విడువబడినప్పటి స్థితితో పోలిస్తే, అది పరదైసులా మారుతుంది. దేవుని ఇశ్రాయేలు యొక్క అభిషిక్త శేషము 1919 లో ఆధ్యాత్మిక భావంలో సరిగ్గా అటువంటి పరదైసులోకే ప్రవేశించింది.—యెషయా 11:6-9; 35:1-7.
యెహోవాయందు నమ్మకం ఉంచడానికి కారణాలు
7, 8. (ఎ) తాను చెప్పేది ఆలకించమని యెహోవా చెబుతున్నదాని భావమేమిటి? (బి) యెహోవా చెప్పేదాన్ని యూదా వినడం ఎందుకు ప్రాముఖ్యం?
7 మళ్ళీ అవధానం ఇవ్వమంటూ, యెహోవా ఇలా చెబుతున్నాడు: “నా ప్రజలారా, నా మాట ఆలకించుడి; నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నాయొద్దనుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములకు తీర్పుతీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు.”—యెషయా 51: 4, 5.
8 తాను చెప్పేది ఆలకించమని యెహోవా చెప్పడంలో, ఆయన సందేశాన్ని వినమనడం కంటే ఎక్కువే ఇమిడి ఉంది. విన్నదాని అనుసారంగా చర్య గైకొనేలా అవధానం ఇవ్వడమని దాని భావం. (కీర్తన 49:1, 2; 78: 1) ఉపదేశం, న్యాయం, రక్షణలకు యెహోవాయే మూలమని ఆ జనము తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి ఆయన మాత్రమే మూలం. (2 కొరింథీయులు 4: 5) ఆయనే మానవజాతికి పరమ న్యాయాధిపతి. యెహోవా నుండి వెలువడే నియమాలు, న్యాయనిర్ణయాలు, వాటిచే నడిపించబడడానికి అనుమతించే వారికి వెలుగు వంటివి.—కీర్తన 43: 3; 119:105; సామెతలు 6:23.
9. యెహోవా రక్షణ కార్యాల నుండి దేవుని నిబంధన ప్రజలే గాక ఇంకా ఎవరు ప్రయోజనం పొందుతారు?
9 దేవుని నిబంధన ప్రజల విషయంలోనే కాదు గానీ అన్ని చోట్లా ఉన్న, చివరికి మారుమూల సముద్ర ద్వీపాల్లో ఉన్న యథార్థహృదయులైన ప్రజల విషయంలో కూడా ఇదంతా నిజం. దేవునిమీదా, తన నమ్మకమైన సేవకుల పక్షాన చర్య తీసుకోగల రక్షించగల ఆయన సామర్థ్యంమీదా వారికున్న నమ్మకం వమ్ము చేయబడదు. ఆయన బాహువుచే సూచించబడిన ఆయన బలం లేక శక్తి ఖచ్చితమైనది; దాన్ని ఎవరూ ఆపలేరు. (యెషయా 40:10; లూకా 1:51, 52) అలాగే నేడు, దేవుని ఇశ్రాయేలులోని మిగిలివున్న సభ్యులు అత్యంతాసక్తితో చేసిన ప్రకటనా పని లక్షలాదిమంది యెహోవా వైపు తిరిగి ఆయనపై విశ్వాసం ఉంచడానికి కారణమైంది, వారిలో అనేకులు మారుమూల సముద్ర ద్వీపాలకు చెందినవారే.
10. (ఎ) నెబుకద్నెజరు రాజు ఏ సత్యం తప్పనిసరిగా తెలుసుకోవలసి వస్తుంది? (బి) ఏ “ఆకాశము,” “భూమి” అంతం చేయబడతాయి?
10 తర్వాత యెహోవా, బబులోను రాజైన నెబుకద్నెజరు నేర్చుకోవలసిన ఒక సత్యాన్ని పేర్కొంటున్నాడు. యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చకుండా ఆకాశంలో ఉన్నదే గానీ భూమిపైనున్నదే గానీ ఏదీ ఆయనను ఆపలేదు. (దానియేలు 4:34, 35) మనమిలా చదువుతాము: “ఆకాశమువైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును, భూమి వస్త్రమువలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలె [“దోమలవలె,” అధస్సూచి] చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు.” (యెషయా 51: 6) తమకు బంధీలుగా దొరికినవారిని తిరిగి తమ స్వదేశానికి వెళ్ళడానికి అనుమతించడమన్నది బబులోను సామ్రాట్టుల సాంప్రదాయానికే విరుద్ధమైనప్పటికీ, యెహోవా తన ప్రజలను రక్షించకుండా ఏదీ అడ్డుకోలేదు. (యెషయా 14:16, 17) బబులోను “ఆకాశము” లేదా పరిపాలనా శక్తులు పరాజయం పొంది విరుగగొట్టబడతాయి. బబులోను “భూమి” అంటే ఆ పరిపాలనా శక్తుల క్రిందనున్నవారు మెల్లగా అంతమవుతారు. అవును, ఆనాటి అత్యంత గొప్ప శక్తి సహితం యెహోవా బలం ముందు నిలబడలేదు లేదా ఆయన రక్షణ చర్యలను ఆపలేదు.
11. బబులోను “ఆకాశము,” “భూమి” అంతమొందించబడతాయనే ప్రవచనపు సంపూర్ణ నెరవేర్పు నేటి క్రైస్తవులకు ఎందుకు ప్రోత్సాహకరమైనది?
11 ఈ ప్రవచనార్థక మాటలు సంపూర్ణంగా నెరవేరాయని తెలుసుకోవడం నేటి క్రైస్తవులను ఎంతగా ప్రోత్సహిస్తాయో కదా! ఎందుకు? ఎందుకంటే, భవిష్యత్తులో జరుగబోయే మరో సంఘటన గురించి అపొస్తలుడైన పేతురు అలాంటి వ్యక్తీకరణలనే ఉపయోగించాడు. “ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు” త్వరగా సమీపిస్తున్న యెహోవా దినాన్ని గూర్చి ఆయన మాట్లాడాడు! తర్వాత ఆయనిలా అన్నాడు: “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:12, 13; యెషయా 34: 4; ప్రకటన 6:12-14) శక్తివంతమైన రాజ్యములు, ఉత్కృష్టమైన నక్షత్రాలవంటి వాటి పరిపాలకులు యెహోవాకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ, ఆయన తన నియమిత సమయంలో వారిని, ఒక దోమను నలిపేసినంత సులభంగా నిర్మూలిస్తాడు. (కీర్తన 2:1-9) కేవలం దేవుని నీతియుక్తమైన ప్రభుత్వం మాత్రమే, నీతియుక్తమైన మానవ సమాజంపై నిరంతరం పరిపాలిస్తుంది.—దానియేలు 2:44; ప్రకటన 21:1-4.
12. మానవులైన వ్యతిరేకులు తమను నిందించినప్పుడు దేవుని సేవకులు ఎందుకు భయపడకూడదు?
12 “నీతిని అనుసరించు” వారిని ఉద్దేశించి మాట్లాడుతూ యెహోవా ఇప్పుడు ఇలా చెబుతున్నాడు: “నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులుపడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును.” (యెషయా 51:7, 8) యెహోవాయందు నమ్మకం ఉంచేవారు తాము తీసుకున్న ధైర్యవంతమైన స్థానాన్ని బట్టి నిందించబడతారు, దూషించబడతారు, కాని దాని గురించి భయపడవలసిన అవసరంలేదు. అలాంటి దూషకులు, చిమ్మట ఉన్ని వస్త్రాలను తినివేసినట్లు, ‘కొరికివేయబడే’ మానవమాత్రులు. a ప్రాచీన కాలంనాటి నమ్మకమైన యూదులవలె, నేడు నిజ క్రైస్తవులు తమను వ్యతిరేకించేవారిని బట్టి భయపడవలసిన అవసరం లేదు. నిత్య దేవుడైన యెహోవాయే వారి రక్షణ. (కీర్తన 37:1, 2) దేవుని శత్రువులు చేసే దూషణ, యెహోవా ప్రజలకు ఆయన ఆత్మ ఉందన్నదానికి నిదర్శనంగా నిలుస్తుంది.—మత్తయి 5:11, 12; 10:24-31.
13, 14. “రాహాబు,” “మకరము” అనే పదాలు దేనిని సూచిస్తున్నాయి, అది ఎలా ‘తుత్తునియలుగా నరికివేయబడింది,’ ఎలా ‘పొడవబడింది’?
13 చెరలో ఉన్న తన ప్రజల పక్షాన చర్య తీసుకోమని యెహోవాను పిలుస్తున్నట్లుగా యెషయా ఇలా అంటాడు: “యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము! పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా? అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా?”—యెషయా 51:9, 10.
14 యెషయా వేటి గురించైతే మాట్లాడుతున్నాడో ఆ చారిత్రక ఉదాహరణలు ఎంతో చక్కగా ఎంపిక చేయబడ్డాయి. ఇశ్రాయేలు జనము ఐగుప్తునుండి విడుదల చేయబడి, ఎఱ్ఱసముద్రం గుండా నడిచి వెళ్ళడం గురించి ప్రతి ఇశ్రాయేలీయుడికి తెలుసు. (నిర్గమకాండము 12:24-27; 14:26-31) “రాహాబు,” “మకరము” వంటి పదాలు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి నిర్గమించడాన్ని వ్యతిరేకించిన ఫరో అధికారం క్రిందనున్న ఐగుప్తును సూచిస్తున్నాయి. (కీర్తన 74:13; 87: 4; యెషయా 30: 7) శిరస్సు భాగాన నైలు డెల్టా మొదలుకొని, ఫలవంతమైన నైలు లోయ వెంబడి వందల మైళ్ళ వరకూ విస్తరించి ఉన్న పొడవైన ప్రాచీన ఐగుప్తు పెద్ద మొసలిని పోలి ఉండేది. (యెహెజ్కేలు 29: 3) కానీ యెహోవా ఈ మకరముపైకి పది తెగుళ్ళు తీసుకువచ్చే సరికి అది తుత్తునియలుగా నరికివేయబడింది. దాని సైన్యాలు ఎఱ్ఱసముద్రపు నీటిలో నాశనం చేయబడినప్పుడు, అది పొడవబడింది, తీవ్రంగా గాయపరచబడింది, బలహీనపరచబడింది. అవును, యెహోవా ఐగుప్తుతో తన వ్యవహారాల్లో తన బాహుబలాన్ని చూపించాడు. బబులోనులో చెరలో ఉన్న తన ప్రజల కోసం పోరాడేందుకు ఆయన ఎందుకు సిద్ధంగా ఉండడూ?
15. (ఎ) సీయోను యొక్క దుఃఖము, నిట్టూర్పు ఎప్పుడు, ఎలా తొలగిపోతాయి? (బి) ఆధునిక కాలాల్లో దేవుని ఇశ్రాయేలు యొక్క దుఃఖము, నిట్టూర్పు ఎప్పుడు తొలగిపోయాయి?
15 ఇశ్రాయేలు బబులోను నుండి విడుదల చేయబడడాన్ని ముందుగానే చూస్తూ, ఇప్పుడు ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు, నిత్యసంతోషము వారి తలలమీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.” (యెషయా 51:11) బబులోనులో తమ పరిస్థితి ఎంత దుఃఖకరంగా ఉన్నప్పటికీ, యెహోవా నీతిని వెదకేవారికి అద్భుతమైన ఉత్తరాపేక్షలు ఉంటాయి. దుఃఖము, నిట్టూర్పు ఉండని సమయం వస్తుంది. విడిపించబడినవారి లేదా విమోచించబడినవారి పెదవుల నుండి సంగీతనాదము, సంతోషము, ఆనందము వినిపిస్తాయి. ఆ ప్రవచనార్థక మాటల ఆధునిక నెరవేర్పులో, దేవుని ఇశ్రాయేలు 1919 లో బబులోను చెర నుండి విడుదల చేయబడింది. వారు గొప్ప ఆనందంతో, ఈనాటి వరకూ కొనసాగిన ఆనందంతో, తమ ఆధ్యాత్మిక ఎస్టేటుకు తిరిగి వచ్చారు.
16. యూదులను విడిపించడానికి ఏమి వెలగా చెల్లించబడుతుంది?
16 యూదుల విమోచనా వెల ఏమై ఉంటుంది? యెహోవా “నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును, . . . నీకు బదులుగా కూషును సెబాను” ఇస్తాడని యెషయా ప్రవచనం ఇప్పటికే వెల్లడిచేసింది. (యెషయా 43:1-4) ఇది తర్వాత జరుగుతుంది. పారసీక సామ్రాజ్యం బబులోనును జయించి, బంధీలుగా ఉన్న యూదులను విడుదల చేసిన తర్వాత, ఐగుప్తును, ఇతియోపియాను, సెబాను జయిస్తుంది. అవి ఇశ్రాయేలీయుల ప్రాణాలకు బదులుగా ఇవ్వబడతాయి. ఇది సామెతలు 21:18 లో చెప్పబడిన ఈ సూత్రానికి అనుగుణంగా ఉంది: “నీతిమంతునికొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు; యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు.”
అదనపు హామీ
17. యూదులు బబులోను ఆగ్రహానికి భయపడవలసిన అవసరం ఎందుకు లేదు?
17 యెహోవా తన ప్రజలకు అదనంగా ఇలా హామీ ఇస్తున్నాడు: “నేను నేనే మిమ్ము నోదార్చువాడను. చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?” (యెషయా 51:12, 13) సంవత్సరాల చెర ముందుంది. అయినప్పటికీ బబులోను క్రోధానికి భయపడవలసిన అవసరం ఏ మాత్రమూ లేదు. బైబిలు రికార్డులోని మూడవ ప్రపంచ శక్తియైన ఆ జనము దేవుని ప్రజలను జయించి వారిని ‘నాశనం చేయడానికి’ ప్రయత్నించినప్పటికీ, లేదా వారు తప్పించుకోవడానికి మార్గం లేకుండా అడ్డుకున్నప్పటికీ, కోరెషు చేతుల్లో బబులోను పతనమవుతుందని యెహోవా ముందే తెలియజేశాడని నమ్మకమైన యూదులకు తెలుసు. (యెషయా 44:8, 24-28) సృష్టికర్తకు భిన్నంగా అంటే నిత్యుడగు దేవుడైన యెహోవాకు భిన్నంగా, బబులోను నివాసులు ఎండాకాలంలో సూర్యుని వాడియైన కిరణాలకు ఎండిపోయే గడ్డిలా నాశనమవుతారు. అప్పుడు వారి బెదిరింపులు, క్రోధము ఎక్కడ ఉంటాయి? ఆకాశమును భూమిని సృష్టించిన యెహోవాను మరచిపోయి మనుష్యులకు భయపడడం ఎంత అవివేకం!
18. యెహోవా ప్రజలు కొంతకాలం పాటు ఖైదీలుగా ఉన్నప్పటికీ, యెహోవా వారికి ఏ హామీలు ఇస్తున్నాడు?
18 ఒకవిధంగా చెప్పాలంటే, యెహోవా ప్రజలు ‘క్రుంగిపోతూ’ కొంతకాలంపాటు బంధీలుగా ఉన్నప్పటికీ, వారికి హఠాత్తుగా విడుదల లభిస్తుంది. వారు బబులోనులో సమూలంగా నాశనం చేయబడరు లేదా ఖైదీలలా ఆకలితో మాడి చావరు—పాతాళములో అంటే గోతిలో నిర్జీవంగా విడువబడరు. (కీర్తన 30: 3; 88:3-5) యెహోవా వారికిలా హామీ ఇస్తాడు: “క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు చనిపోడు, అతనికి ఆహారము తప్పదు.”—యెషయా 51:14.
19. నమ్మకమైన యూదులు యెహోవా మాటల్లో ఎందుకు సంపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు?
19 ఇంకా సీయోనును ఓదారుస్తూ, యెహోవా ఇలా కొనసాగిస్తున్నాడు: “నేను నీ దేవుడనైన యెహోవాను, సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించునట్లును, భూమి పునాదులను వేయునట్లును, నా జనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును, నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.” (యిషయా 51:15, 16) సముద్రముపై తన శక్తిని చూపించి దాన్ని అదుపు చేసేందుకు దేవునికున్న సామర్థ్యాన్ని గురించి బైబిలు పదే పదే తెలియజేస్తోంది. (యోబు 26:12; కీర్తన 89: 9; యిర్మీయా 31:35) ఆయన తన ప్రజలను ఐగుప్తు నుండి విడుదల చేసినప్పుడు ప్రదర్శించినట్లుగా, ఆయనకు ప్రకృతి శక్తులపై సంపూర్ణమైన అధికారం ఉంది. చివరికి స్వల్పమైనవైనా, “సైన్యములకధిపతియగు యెహోవా”తో ఎవరిని పోల్చవచ్చు?—కీర్తన 24:10.
20. యెహోవా సీయోనును పునఃస్థాపించినప్పుడు ఏ “ఆకాశము,” ఏ “భూమి” ఉనికిలోకి వస్తాయి, ఆయన ఏ ఓదార్పుకరమైన మాటలు పలుకుతాడు?
20 యూదులు దేవుని నిబంధన ప్రజలుగానే మిగిలి ఉన్నారు, మరోసారి తన ధర్మశాస్త్రము క్రింద జీవించేందుకు వారు తమ స్వదేశానికి తీసుకు వెళ్ళబడతారని యెహోవా వారికి హామీ ఇస్తున్నాడు. అక్కడ వారు యెరూషలేమును, ఆలయాన్ని పునర్నిర్మించి, ఆయన మోషే ద్వారా వారితో చేసిన నిబంధన క్రింద తమ బాధ్యతలను తిరిగి చేపడతారు. తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులతోనూ, వారి పశువులతోనూ దేశం నింపబడడం ప్రారంభమైనప్పుడు, “క్రొత్త భూమి” ఉనికిలోకి వస్తుంది. దానిమీద క్రొత్త ప్రభుత్వ విధానమైన “క్రొత్త ఆకాశము” ఉంటుంది. (యెషయా 65:17-19; హగ్గయి 1:1, 14) “నా జనము నీవేయని” యెహోవా మళ్ళీ సీయోనుతో చెబుతాడు.
చర్యగైకొనడానికి పిలుపు
21. యెహోవా చర్య గైకొనడానికి ఏ పిలుపును ఇస్తాడు?
21 సీయోనును ధైర్యపరచిన తర్వాత, చర్య గైకొనమని యెహోవా పిలుపునిస్తాడు. ఆమె అప్పటికే తన బాధల ముగింపుకు చేరుకుందన్నట్లుగా మాట్లాడుతూ, ఆయనిలా చెబుతాడు: “యెరూషలేమా, లెమ్ము లెమ్ము. యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము.” (యిషయా 51:17) అవును యెరూషలేము తన నాశనకరమైన స్థితినుండి లేచి, తనకు మునుపున్న స్థానాన్ని, మహిమను తిరిగి పొందాలి. అది దైవిక ప్రతీకారం యొక్క సూచనార్థక పాత్రను ఖాళీచేసే సమయం వస్తుంది. దేవునికి దానిపై ఉన్న కోపం పోతుంది.
22, 23. యెరూషలేము యెహోవా క్రోధ పాత్రలోనిది త్రాగినప్పుడు అది ఏమి అనుభవిస్తుంది?
22 ఏదేమైనప్పటికీ, యెరూషలేము శిక్షించబడుతున్నప్పుడు దాని నివాసులెవరూ, అంటే దాని ‘కుమారులు’ ఎవరూ, జరుగుతున్న దాన్ని ఆపలేకపోతారు. (యెషయా 43:5-7; యిర్మీయా 3:14) ప్రవచనం ఇలా చెబుతోంది: “ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడును లేకపోయెను, ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయి పట్టుకొనువాడెవడును లేకపోయెను.” (యెషయా 51:18) బబులోనీయుల చేతుల్లో అది ఎంతగా బాధించబడుతుందో కదా! “ఈ రెండు అపాయములు నీకు సంభవించెను. నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించెను! నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు. దుప్పి వలలో చిక్కుపడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు, యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండియున్నారు.”—యెషయా 51:19, 20.
23 అయ్యో యెరూషలేము! అది “పాడు, నాశనము”లతోపాటు “కరవు, ఖడ్గము”లను అనుభవిస్తుంది. దానికి నడిపింపునివ్వలేక, అది తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేయలేక, దానిపై దాడిచేస్తున్న బబులోనీయులను తరిమివేసేంత శక్తిలేక దాని “కుమారులు” కృశించిపోయి, నిస్సహాయులవుతారు. సుస్పష్టంగా, వీధులన్నిటి చివరలలో అంటే మూలలో వారు మూర్ఛిల్లి, బలహీనంగా, అలసిపోయి పడివుంటారు. (విలాపవాక్యములు 2:19; 4:1, 2) వారు దేవుని క్రోధ పాత్రలోనిది త్రాగి, వలలో చిక్కిన జంతువులంత శక్తిహీనంగా ఉంటారు.
24, 25. (ఎ) యెరూషలేముకు ఏది పునరావృతం కాదు? (బి) యెరూషలేము తర్వాత, ఎవరు యెహోవా క్రోధ పాత్రలోనిది త్రాగుతారు?
24 కానీ ఈ దుఃఖకరమైన పరిస్థితి ముగింపుకు వస్తుంది. ఓదార్పుకరంగా యెషయా ఇలా చెబుతాడు: “ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము. నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ఇదిగో! తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను, నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను, మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.” (యిషయా 51:21-23) యెరూషలేమును క్రమశిక్షణలో పెట్టిన తర్వాత, యెహోవా దాని పట్ల జాలి చూపించి, దానికి క్షమాభిక్ష పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.
25 యెహోవా ఇప్పుడు తన ఆగ్రహాన్ని యెరూషలేము నుండి బబులోను వైపుకు మరలుస్తాడు. బబులోను యెరూషలేమును నాశనం చేసి దాన్ని అవమానపరుస్తుంది. (కీర్తన 137:7-9) యెరూషలేము బబులోనీయుల చేతుల్లో లేక వారి మిత్ర రాజ్యాల చేతుల్లో తిరిగి అలాంటి పాత్రలోనిది త్రాగవలసిన అవసరం ఉండదు. బదులుగా, ఆ పాత్ర యెరూషలేము చేతుల్లో నుండి తీసివేయబడి, దాని అవమానాన్ని చూసి ఆనందించిన వారికి అది ఇవ్వబడుతుంది. (విలాపవాక్యములు 4:21, 22) బబులోను చిత్తుగా త్రాగి పతనమైపోతుంది. (యిర్మీయా 51:6-8) ఈలోగా, సీయోను పైకి లేస్తుంది! పరిస్థితుల్లో ఎంత మార్పు! నిజంగా, అలాంటి ఉత్తరాపేక్షను బట్టి సీయోను ఓదార్పు పొందవచ్చు. యెహోవా రక్షణ చర్యల ద్వారా ఆయన నామము పరిశుద్ధపరచబడుతుందని ఆయన సేవకులు నమ్మకం కలిగి ఉండవచ్చు.
[అధస్సూచి]
a ఇక్కడ పేర్కొనబడిన చిమ్మట, నేత వస్త్రాలను తినివేసే చిమ్మటనీ, ప్రాముఖ్యంగా నాశనకరమైన డింభక దశలో ఉన్న చిమ్మట అనీ స్పష్టమవుతోంది.
[అధ్యయన ప్రశ్నలు]
[167 వ పేజీలోని చిత్రం]
గొప్ప అబ్రాహాము అయిన యెహోవా అనే “బండ” నుండే ఆయన ప్రజలు ‘చెక్కబడ్డారు’
[170 వ పేజీలోని చిత్రం]
దేవుని ప్రజల వ్యతిరేకులు చిమ్మట తినివేసిన వస్త్రములా అదృశ్యమైపోతారు
[176, 177 వ పేజీలోని చిత్రం]
ప్రకృతి శక్తులను అదుపు చేసేందుకు తనకున్న శక్తిని యెహోవా చూపించాడు
[178 వ పేజీలోని చిత్రం]
యెరూషలేము ఏ పాత్ర నుండి త్రాగుతుందో ఆ పాత్ర బబులోనుకు, దాని మిత్రరాజ్యాలకు ఇవ్వబడుతుంది