కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ప్రవక్త మానవాళికి వెలుగు తీసుకువస్తాడు

దేవుని ప్రవక్త మానవాళికి వెలుగు తీసుకువస్తాడు

మొదటి అధ్యాయం

దేవుని ప్రవక్త మానవాళికి వెలుగు తీసుకువస్తాడు

1, 2. ఎలాంటి పరిస్థితులు అనేకులను నేడు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి?

 మానవునికి దాదాపు ఏది కావాలంటే అది అందుబాటులో ఉన్నట్లుగా అనిపిస్తున్న యుగంలో మనం జీవిస్తున్నాం. అంతరిక్ష ప్రయాణం, కంప్యూటర్‌ సాంకేతిక విజ్ఞానం, జెనెటిక్‌ ఇంజనీరింగ్‌, ఇతర వైజ్ఞానిక ఆవిష్కరణలు, మానవజాతి ఎదుట క్రొత్త సాధ్యతలను తెరచి, మేలైన జీవితం గురించి, బహుశా ఇంకా సుదీర్ఘమైన జీవితం గురించి, వారికి నిరీక్షణను ఇచ్చాయి.

2 అలాంటి అభివృద్ధులు మీరు మీ ఇంటికి తాళం వేసుకోకుండా ఉండేలా చేశాయా? యుద్ధ భీతిని నిర్మూలించాయా? రోగాలను తగ్గించాయా లేక మనకు ప్రియమైనవారెవరైనా మరణిస్తే కలిగే దుఃఖాన్ని తొలగించాయా? అలాంటివేమీ చేయలేకపోయాయి! మానవుడు సాధించిన అభివృద్ధి ఎంత గమనార్హమైనదైనా అది పరిమితమైనది. వరల్డ్‌వాచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇచ్చిన ఒక నివేదిక ఇలా పేర్కొంది: “చంద్రునిపైకి ఎలా వెళ్ళాలో, అత్యంత శక్తివంతమైన సిలికాన్‌ చిప్స్‌ ఎలా తయారు చేయాలో, మానవ జన్యువులను ఎలా ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాలో మనం తెలుసుకున్నాం. కానీ మనం ఇప్పటికీ ఒక వందకోట్లమందికి పరిశుభ్రమైన నీటిని అందజేయలేకపోతున్నాం, వేలాది జాతులు అంతరించిపోవడాన్ని ఆపలేకపోతున్నాం, లేదా వాతావరణాన్ని పాడుచేయకుండా మనకు అవసరమైనంత శక్తిని ఉత్పన్నం చేసుకోలేకపోతున్నాం.” చాలామంది ఓదార్పు కోసం, నిరీక్షణ కోసం ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియక భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారంటే అది అర్థం చేసుకోదగినదే.

3. సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో యూదాలో పరిస్థితి ఎలా ఉంది?

3 నేడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి, సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో దేవుని ప్రజలు ఎదుర్కొన్నటువంటిదే. ఆ కాలంలో, యూదానివాసులకు ఓదార్పునిచ్చే సందేశాన్ని తీసుకువెళ్ళే నియామకాన్ని దేవుడు తన సేవకుడైన యెషయాకు ఇచ్చాడు, వాళ్లకు కావలసింది కూడా సరిగ్గా అదే. కల్లోలభరితమైన సంఘటనలు ఆ రాజ్యాన్ని అతలాకుతలం చేసేశాయి. క్రూరమైన అష్షూరు సామ్రాజ్యం త్వరలోనే ఆ రాజ్యాన్ని ప్రమాదంలో పడవేసి, అనేకులను భయవిహ్వలులను చేస్తుంది. రక్షణ కోసం దేవుని ప్రజలు ఎవరివైపు తిరుగగలరు? యెహోవా నామము వారి పెదవులపైనైతే ఉంది గానీ వారు మానవులను నమ్ముకోవడానికే ఇష్టపడ్డారు.​—⁠2 రాజులు 16: 7; 18:​21.

అంధకారంలో ప్రకాశిస్తున్న వెలుగు

4. ఏ రెండు సందేశాలను ప్రకటించే నియామకం యెషయాకు ఇవ్వబడింది?

4 యూదా తిరుగుబాటు ఫలితంగా, యెరూషలేము నాశనం చేయబడుతుంది, యూదా నివాసులు బబులోనుకు చెరగా కొనిపోబడతారు. అవును, అంధకార కాలాలు రాబోతున్నాయి. యెహోవా తన ప్రవక్త అయిన యెషయాకు ఈ నాశనకరమైన సమయాన్ని గురించి ప్రవచించే నియామకాన్ని ఇవ్వడమే గాక, సువార్తను ప్రకటించమని కూడా ఆజ్ఞాపించాడు. డెబ్బై సంవత్సరాల చెర తర్వాత, యూదులు బబులోను నుండి విడుదల చేయబడతారు! ఆనందభరితమైన ఒక శేషము సీయోనుకు తిరిగి వచ్చి, అక్కడ సత్యారాధనను పునఃస్థాపించే ఆధిక్యతను పొందుతుంది. ఈ సంతోషకరమైన సందేశంతో, యెహోవా తన ప్రవక్త ద్వారా అంధకారంలో వెలుగు ప్రకాశించేలా చేశాడు.

5. యెహోవా తన సంకల్పాలను అంత ముందుగా ఎందుకు వెల్లడించాడు?

5 యెషయా తన ప్రవచనాలను వ్రాసిన తర్వాత ఒక శతాబ్దంకంటే ఎక్కువ కాలం వరకు యూదా నిర్జనంగా విడువబడలేదు. మరి యెహోవా తన సంకల్పాలను అంత ముందుగా ఎందుకు వెల్లడించాడు? యెషయా ప్రవచనాలను స్వయంగా విన్నవారు ఆ ప్రవచనాలు నెరవేరడానికి ఎంతో ముందే మరణించివుండరా? అది నిజమే. అయినా, యెహోవా యెషయాకు వెల్లడించిన విషయాల మూలంగా, సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం చేయబడే సమయంలో జీవిస్తున్నవారికి యెషయా ప్రవచనార్థక సందేశాలు లిఖిత రూపంలో అందుబాటులో ఉంటాయి. ఇది, ‘ఆదినుండి కలుగబోవువాటిని, పూర్వకాలమునుండి యింకా జరుగనివాటిని తెలియజేయుచున్నది’ యెహోవాయే అనడానికి తిరుగులేని సాక్ష్యాధారాన్ని ఇస్తుంది.​—⁠యెషయా 46:​10; 55:​10, 11.

6. మానవ భవిష్యకారులందరి కన్నా యెహోవా ఏ యే విధాల్లో ఉన్నతుడు?

6 కేవలం యెహోవా మాత్రమే న్యాయబద్ధంగా అలా చెప్పుకోగలడు. ఒక వ్యక్తి తన కాలంనాటి రాజకీయ లేక సామాజిక స్థితిగతులను తాను అర్థం చేసుకున్న దాని ఆధారంగా, సమీప భవిష్యత్తును గురించి ముందుగా తెలియజేయవచ్చు. కానీ కాలక్రమంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో, చివరికి సుదూర భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కూడా కేవలం యెహోవా మాత్రమే సంపూర్ణమైన ఖచ్చితత్వంతో తెలుసుకోగలడు. సంఘటనలు సంభవించడానికి ఎంతోకాలం ముందే వాటిని గురించి తెలియజేయడానికి ఆయన తన సేవకులను కూడా శక్తివంతులను చేయగలడు. “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు” అని బైబిలు పేర్కొంటోంది.​—⁠ఆమోసు 3: 7.

ఎంతమంది “యెషయాలు”?

7. యెషయా గ్రంథాన్ని యెషయా వ్రాశాడనే విషయాన్ని చాలామంది పండితులు ఎలా ప్రశ్నించారు, ఎందుకు?

7 యెషయా గ్రంథాన్ని యెషయా వ్రాశాడనే విషయాన్ని అనేకమంది పండితులు ప్రశ్నించేలా చేసిన వాటిలో ఒకటి ప్రవచనాన్ని గురించిన వివాదాంశం. యెషయా గ్రంథపు రెండో భాగాన్ని సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో జీవించినవారెవరైనా, బబులోను చెర సమయంలో లేదా చెరనుండి విడుదలైన తర్వాత వ్రాసివుంటారని ఈ విమర్శకులు నొక్కిచెబుతారు. యూదా నిర్జనంగా విడువబడడాన్ని గురించిన ప్రవచనాలు, ఆ సంఘటనలు జరిగిన తర్వాతే వ్రాయబడ్డాయి గనుక అవి అసలు ప్రవచనాలే కావని వారి అభిప్రాయం. యెషయా గ్రంథం, 40 వ అధ్యాయం తర్వాతి నుండి, బబులోను ప్రపంచ శక్తి అయినట్లు, ఇశ్రాయేలీయులు అక్కడ చెరలో ఉన్నట్లు మాట్లాడుతుందని కూడా ఆ విమర్శకులు పేర్కొంటారు. కాబట్టి యెషయా గ్రంథం రెండో భాగాన్ని ఎవరు వ్రాసినప్పటికీ ఆ వ్యక్తి ఆ కాలంలోనే, అంటే సా.శ.పూ. ఆరవ శతాబ్దంలోనే వ్రాసి ఉండవచ్చునని వారు తర్కిస్తారు. అలాంటి తర్కానికి గట్టి ఆధారం ఏమైనా ఉందా? ఎంతమాత్రం లేదు!

8. యెషయా గ్రంథాన్ని యెషయా వ్రాశాడా లేదా అన్న సంశయవాదం ఎప్పుడు ప్రారంభమైంది, అది ఎలా వ్యాప్తి చెందింది?

8 యెషయా గ్రంథాన్ని యెషయా వ్రాశాడా లేదా అనే వివాదం సా.శ. 12 వ శతాబ్దం వరకు తలెత్తలేదు. యూదా వ్యాఖ్యాత ఏబ్రహామ్‌ ఇబ్న్‌ ఎజ్ర మొదట దీన్ని లేవనెత్తాడు. “యెషయా గ్రంథం రెండవ అర్థభాగం అంటే 40 వ అధ్యాయం నుండి ఉన్న భాగం, బబులోను చెరలోనూ సీయోనుకు తిరిగివస్తున్న తొలికాలంలోనూ జీవించిన ఒక ప్రవక్త వ్రాసినదని [ఏబ్రహామ్‌ ఇబ్న్‌ ఎజ్ర] యెషయా గ్రంథంపై తాను వ్రాసిన వ్యాఖ్యానంలో పేర్కొన్నాడు” అని ఎన్‌సైక్లోపీడియా జుడైకా చెబుతోంది. ఇబ్న్‌ ఎజ్ర దృక్కోణాలను 18 వ, 19 వ శతాబ్దాల్లో జర్మన్‌ దైవశాస్త్ర పండితుడైన యోహాన్‌ క్రిస్టోఫర్‌ డియోడర్‌లీన్‌తో సహా అనేకమంది పండితులు ఆమోదించారు, డియోడర్‌లీన్‌ యెషయా గ్రంథంపై తన వివరణాత్మక గ్రంథాన్ని 1775 లో ప్రచురించాడు, అది 1789 లో రెండవసారి ముద్రించబడింది. న్యూ సెంచురీ బైబిల్‌ కమెంటరీ ఇలా పేర్కొంటోంది: “యెషయా గ్రంథంలోని 40-66 అధ్యాయాల్లో ఉన్న ప్రవచనాలు ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ప్రవక్త వ్రాసినవి కావుగానీ ఆ తర్వాతి కాలానికి చెందినవారు వ్రాసినవని . . . డియోడర్‌లీన్‌ ప్రవేశపెట్టిన తలంపును ఎంతో సంప్రదాయవాదులైన పండితులు తప్ప ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు.”

9. (ఎ) యెషయా గ్రంథాన్ని ఎలా ముక్కలు ముక్కలుగా విభజించడం జరిగింది? (బి) యెషయా గ్రంథాన్ని వ్రాసింది యెషయానా కాదా అనే వివాదాన్ని ఒక బైబిలు వ్యాఖ్యాత సంక్షిప్తంగా ఎలా తెలియజేశాడు?

9 అయితే, యెషయా గ్రంథాన్ని ఎవరు వ్రాశారనే దాని గురించిన ప్రశ్నలు అక్కడితో ఆగిపోలేదు. రెండవ యెషయాను, లేక ద్వితీయ యెషయాను గురించిన సిద్ధాంతం, యెషయా గ్రంథాన్ని మూడో వ్యక్తి కూడా వ్రాసి ఉండవచ్చుననే తలంపును ఉత్పన్నం చేసింది. a ఆ తర్వాత యెషయా గ్రంథం ఇంకా ముక్కలు ముక్కలుగా విభజించబడి, 15, 16 అధ్యాయాలను ఎవరో తెలియని ప్రవక్త వ్రాశాడని ఒక పండితుడు అంటుంటే, 23 నుండి 27 అధ్యాయాల రచయిత గురించి మరో పండితుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక మరో పండితుడు, 34, 35 అధ్యాయాలను యెషయా వ్రాసి ఉండకపోవచ్చునని అంటున్నాడు. ఆయనలా అనడానికి కారణమేమిటి? ఆ అధ్యాయాల్లోని సమాచారం, ఎనిమిదవ శతాబ్దానికి చెందిన యెషయా గాక మరెవరో వ్రాశారని పరిగణించబడుతున్న 40 నుండి 66 అధ్యాయాల్లో ఉన్న సమాచారాన్ని దగ్గరగా పోలి ఉందన్నదే ఆ కారణం! బైబిలు వ్యాఖ్యాత చార్లెస్‌ సి. టోరీ ఈ తర్కవిధాన ఫలితం యొక్క సారాంశాన్ని సంక్షిప్తంగా చెబుతున్నాడు. “ఒకప్పుడు ‘చెరలోనున్న ప్రజల [గొప్ప] ప్రవక్తగా’ ఉన్నవాడు, అత్యల్పుడుగా తగ్గించబడి, చిందరవందరగా వేయబడిన అతిచిన్న ముక్కల కుప్పలో సమాధి చేయబడ్డాడు” అని ఆయన అంటున్నాడు. అయితే, యెషయా గ్రంథాన్ని అలా ముక్కలు ముక్కలుగా విభజించడంతో పండితులందరూ ఏకీభవించడం లేదు.

రచయిత ఒక్కడే అనడానికి సాక్ష్యాధారం

10. ఏకరీతిగా ఉపయోగించబడిన ఒక వ్యక్తీకరణ, యెషయా గ్రంథాన్ని ఒకే వ్యక్తి వ్రాశాడన్నదానికి ఎలా సాక్ష్యాధారాన్ని ఇస్తుందో ఒక ఉదాహరణ ఇవ్వండి.

10 యెషయా గ్రంథాన్ని కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే వ్రాశాడనటానికి బలమైన కారణం ఉంది. ఒక సాక్ష్యాధారం ఏమిటంటే, వ్యక్తీకరించబడిన ఒకే విధానం. ఉదాహరణకు, ‘ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు’ అనే పదబంధం, యెషయా 1 నుండి 39 అధ్యాయాల్లో 12 సార్లు కనిపిస్తే, యెషయా 40 నుండి 66 అధ్యాయాల్లో 13 సార్లు కనిపిస్తుంది, అయితే యెహోవాను గురించిన ఈ వర్ణన మిగతా హీబ్రూ లేఖనాల్లో కేవలం 6 సార్లు మాత్రమే కనిపిస్తుంది. అంత తరచుగా ఉపయోగించబడని ఈ పదబంధం యెషయా గ్రంథంలో పదే పదే ఉపయోగించబడడం, మొత్తం యెషయా గ్రంథాన్ని ఒకే వ్యక్తి వ్రాశాడన్న వాదనను బలపరుస్తుంది.

11. యెషయా 1 నుండి 39 అధ్యాయాలకు, 40 నుండి 66 అధ్యాయాలకు మధ్య ఏ సారూప్యాలు ఉన్నాయి?

11 యెషయా 1 నుండి 39 అధ్యాయాలకు, 40 నుండి 66 అధ్యాయాలకు మధ్య ఇతర సారూప్యాలు కూడా ఉన్నాయి. రెండు భాగాల్లోనూ, ప్రసవ వేదనపడుతున్న స్త్రీ, “త్రోవ,” “రాజమార్గము” వంటి ఒకేవిధమైన విశిష్టమైన ఆలంకారిక భాష తరచుగా ఉపయోగించబడింది. b “సీయోను” అనే పదం కూడా చాలా తరచుగా కనిపిస్తుంది, అది 1 నుండి 39 అధ్యాయాల్లో 29 సార్లు, 40 నుండి 66 అధ్యాయాల్లో 18 సార్లు ఉపయోగించబడింది. వాస్తవానికి, సీయోను బైబిలులోని మరే పుస్తకంలో కంటే కూడా యెషయా గ్రంథంలోనే ఎక్కువగా ప్రస్తావించబడింది! అలాంటి సాక్ష్యాధారాలు, “యెషయా గ్రంథానికి ప్రత్యేక విశిష్టతను ఆపాదిస్తున్నాయి.” ఒకవేళ దాన్ని ఇద్దరు, ముగ్గురు లేక ఇంకా ఎక్కువమంది వ్రాసివుంటే “అలాంటి విశ్లేషణ సాధ్యమై ఉండేదికాదు” అని ది ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా పేర్కొంటోంది.

12, 13. యెషయా గ్రంథాన్ని కేవలం ఒకే వ్యక్తి వ్రాశాడని క్రైస్తవ గ్రీకు లేఖనాలు ఎలా సూచిస్తున్నాయి?

12 యెషయా గ్రంథాన్ని ఒకే వ్యక్తి వ్రాశాడనే దానికి అత్యంత బలమైన సాక్ష్యాధారాన్ని ప్రేరేపిత క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో కనుగొనవచ్చు. ఇవి, యెషయా గ్రంథాన్ని ఒకే వ్యక్తి వ్రాశాడని మొదటి శతాబ్దపు క్రైస్తవులు విశ్వసించారని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఉదాహరణకు, ఇప్పుడు యెషయా 53 వ అధ్యాయంలో మనం కనుగొనగల సమాచారాన్ని అంటే ద్వితీయ యెషయా వ్రాశాడని ఆధునిక దిన విమర్శకులు చెప్పే భాగాన్ని చదువుతున్న ఒక ఐతియొపీయుడైన అధికారి గురించి లూకా తెలియజేస్తున్నాడు. అయితే, ఆ ఐతియొపీయుడు “ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను” అని లూకా చెబుతున్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 8:​26-28.

13 తర్వాత, బాప్తిస్మమిచ్చే యోహాను యొక్క పరిచర్య, ఇప్పుడు మనకు యెషయా 40:3 లో కనిపించే ప్రవచనార్థక మాటలను ఎలా నెరవేర్చిందో వివరించే మత్తయి సువార్త రచయితను పరిశీలించండి. మత్తయి ఆ ప్రవచనాన్ని ఎవరు వ్రాశారని అంటున్నాడు? ఎవరో తెలియని ద్వితీయ యెషయా వ్రాశాడనా? కాదు, ఆయన “ప్రవక్తయైన యెషయా” వ్రాశాడని మాత్రమే పేర్కొంటున్నాడు. c (మత్తయి 3:​1-3) మరో సందర్భంలో, నేడు మనకు యెషయా 61:1, 2 వచనాల్లో కనిపించే మాటలను, యేసు ఒక గ్రంథపు చుట్టలో నుండి చదివాడు. ఆ వృత్తాంతాన్ని చెబుతూ, లూకా ఇలా పేర్కొంటున్నాడు: “ప్రవక్తయైన యెషయాగ్రంథము ఆయన చేతి కియ్యబడెను.” (లూకా 4:​17) రోమీయులకు తాను వ్రాసిన పత్రికలో పౌలు యెషయా గ్రంథం యొక్క మొదటి, తర్వాతి భాగాల్లో నుండి యెత్తి వ్రాసినప్పటికీ, దాని రచయిత యెషయా కాక మరెవరో అన్నట్లు ఒక చిన్న సూచన కూడా ఎక్కడా ఇవ్వలేదు. (రోమీయులు 10:​16, 20, 21; 15:​12) యెషయా గ్రంథాన్ని ఇద్దరు, ముగ్గురు, లేక ఇంకా ఎక్కువమంది వ్రాశారని మొదటి శతాబ్దపు క్రైస్తవులు విశ్వసించలేదని స్పష్టమవుతోంది.

14. యెషయా గ్రంథాన్ని యెషయా వ్రాశాడనే విషయాన్ని మృత సముద్రపు గ్రంథపు చుట్టలు ఎలా స్పష్టం చేస్తున్నాయి?

14 మృత సముద్రపు గ్రంథపు చుట్టల, అంటే ప్రాచీన వ్రాతప్రతుల సాక్ష్యాధారాన్ని కూడా పరిశీలించండి, వీటిలో అనేకం యేసు కాలానికంటే ముందు వ్రాయబడినవి. యెషయా గ్రంథపు చుట్ట అని పిలువబడే, సా.శ.పూ. రెండవ శతాబ్దం నాటి ఒక యెషయా వ్రాతప్రతి, యెషయా గ్రంథం 40 వ అధ్యాయం నుండి ద్వితీయ యెషయా వ్రాశాడనే విమర్శకుల ఆరోపణ తప్పని నిరూపిస్తుంది. ఎలా నిరూపిస్తుంది? ఈ ప్రాచీన వ్రాతప్రతిలో, మనకు ఇప్పుడు 40 వ అధ్యాయంగా తెలిసినదాని మొదటి వాక్యం, ఒక కాలమ్‌లోని చివరి పంక్తిలో ప్రారంభమై తర్వాతి కాలమ్‌లోని మొదటి పంక్తిలో ముగుస్తుంది. అనేకులు అనుకుంటున్నట్లుగా, సరిగ్గా అక్కడ రచయిత మారాడనో లేక గ్రంథం విభాగించబడుతోందనో లేఖికునికి ఏమాత్రం తెలియదని స్పష్టమవుతోంది.

15. మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసీఫస్‌, కోరెషును గురించిన యెషయా ప్రవచనాల గురించి ఏమి చెబుతున్నాడు?

15 చివరగా, మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసీఫస్‌ ఇస్తున్న సాక్ష్యాధారాన్ని పరిశీలించండి. ఆయన యెషయా గ్రంథంలోని, కోరెషును గురించిన ప్రవచనాలు సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో వ్రాయబడ్డాయని సూచించడమేగాక, కోరెషుకు ఈ ప్రవచనాల గురించి తెలుసని కూడా చెబుతున్నాడు. “యెషయా రెండు వందల పది సంవత్సరాల క్రితమే వ్రాసిపెట్టిన ప్రవచన గ్రంథాన్ని చదవడం ద్వారా కోరెషుకు ఈ విషయాలు తెలుసు” అని జోసీఫస్‌ వ్రాస్తున్నాడు. యూదులను వారి స్వదేశానికి పంపే విషయంలో కోరెషుకున్న సుముఖతకు ఈ ప్రవచనాలను గురించిన పరిజ్ఞానం దోహదపడి ఉంటుందని జోసీఫస్‌ అభిప్రాయం, ఎందుకంటే కోరెషు “వ్రాయబడివున్న దాని ప్రకారం చేయాలనే బలమైన కోరికచే, ఆకాంక్షచే వశపరచుకోబడ్డాడని” జోసీఫస్‌ వ్రాస్తున్నాడు.​—⁠యూదా ప్రాచీనతలు (ఆంగ్లం), XIవ పుస్తకం, 1 వ అధ్యాయం, 2 వ పేరా.

16. యెషయా గ్రంథంలోని తర్వాతి భాగంలో బబులోను ప్రబలమైన శక్తిగా వర్ణించబడిందని విమర్శకులు నొక్కిచెబుతున్నదాన్ని గురించి ఏమి చెప్పవచ్చు?

16 మునుపు పేర్కొన్నట్లుగా, యెషయా 40 వ అధ్యాయం నుండి బబులోను ప్రబలమైన శక్తిగా వర్ణించబడిందనీ, ఇశ్రాయేలీయులు అప్పటికే చెరలో ఉన్నట్లు చెప్పబడిందనీ చాలామంది విమర్శకులు పేర్కొంటారు. మరి ఇది, ఆ రచయిత సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో జీవించాడని సూచించదా? అలా సూచించనవసరం లేదు. వాస్తవమేమిటంటే, యెషయా 40 వ అధ్యాయానికి ముందు కూడా బబులోను కొన్నిసార్లు ప్రబలమైన ప్రపంచశక్తిగా వర్ణించబడింది. ఉదాహరణకు, యెషయా 13: 19 లో, బబులోను “రాజ్యములకు భూషణము” అని, లేదా ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌ అనువదించినట్లుగా, ‘రాజ్యములన్నింటిలో చాలా అందమయింది’ అని పిలువబడింది. ఈ మాటలు స్పష్టంగా ప్రవచనార్థకమైనవి, ఎందుకంటే బబులోను ఆ తర్వాత ఒక శతాబ్దంకంటే ఎక్కువకాలం వరకు ప్రపంచ శక్తి కాలేదు. ఒక విమర్శకుడు, 13 వ అధ్యాయాన్ని మరో రచయిత వ్రాశాడని చెప్పేస్తూ, సమస్యగా అనిపిస్తున్న దీన్ని “పరిష్కరించేశాడు.” అయితే, భవిష్యత్తులోని సంఘటనలు అప్పటికే జరిగిపోయినట్లుగా మాట్లాడడం బైబిలు ప్రవచనాల్లో వాస్తవంగా చాలా సర్వసాధారణమైన విషయం. ఈ సాహితీ శైలి ప్రవచన నెరవేర్పు యొక్క ఖచ్చితత్వాన్ని ప్రభావవంతంగా నొక్కిచెబుతోంది. (ప్రకటన 21:​5, 6) వాస్తవానికి, కేవలం నిజమైన ప్రవచనాలు చెప్పగల దేవుడు మాత్రమే ఈ వ్యాఖ్యానం చేయగలడు: “క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను.”​—⁠యెషయా 42: 9.

విశ్వసనీయమైన ప్రవచన పుస్తకం

17. యెషయా 40 వ అధ్యాయం నుండి శైలిలో ఉన్న మార్పును ఎలా వివరించవచ్చు?

17 కాబట్టి సాక్ష్యాధారం ఏ ముగింపుకు తీసుకువస్తుంది? యెషయా గ్రంథాన్ని ఒకే ప్రేరేపిత రచయిత వ్రాశాడనే ముగింపుకు తీసుకువస్తుంది. ఈ గ్రంథమంతా శతాబ్దాల నుండి ఒకే గ్రంథంగా మన వరకు అందజేయబడింది గానీ రెండుగానో అంతకంటే ఎక్కువగానో కాదు. నిజమే, యెషయా గ్రంథం 40 వ అధ్యాయం నుండి శైలి కాస్త మారినట్లుగా ఉందని కొందరు అనవచ్చు. అయితే, యెషయా 46 సంవత్సరాలకు తక్కువకాకుండా, దేవుని ప్రవక్తగా సేవచేశాడని గుర్తుంచుకోండి. ఆ కాలంలో, ఆయన సందేశంలోని విషయము, దానితోపాటు ఆయన తన సందేశాన్ని వ్యక్తపర్చే విధానము మారుతాయని అంగీకరించవలసిందే. వాస్తవానికి, యెషయాకు దేవుడిచ్చిన నియామకం కేవలం తీవ్రమైన తీర్పు హెచ్చరికలు ప్రకటించడం మాత్రమే కాదు. “నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి” అనే యెహోవా మాటలను కూడా ఆయన అందజేయాలి. (యెషయా 40:​1-2) యూదులు 70 సంవత్సరాల చెర తర్వాత తమ స్వదేశానికి తిరిగి వస్తారనే ఆయన వాగ్దానాన్ని బట్టి దేవుని నిబంధన ప్రజలు నిజంగా ఓదార్పు పొందుతారు.

18. ఈ ప్రచురణలో చర్చించబడబోయే యెషయా గ్రంథంలోని ఒక ముఖ్యాంశం ఏమిటి?

18 ఈ పుస్తకంలో చర్చించబడిన యెషయా గ్రంథంలోని అనేక అధ్యాయాల్లో ఉన్న ముఖ్యాంశం ఏమిటంటే, యూదులను బబులోను చెర నుండి విడుదల చేయడం. d మనం చూడబోతున్నట్లుగా, ఈ ప్రవచనాల్లో ఎక్కువవాటికి ఆధునిక దిన నెరవేర్పు ఉంది. అంతేగాక, దేవుని అద్వితీయ కుమారుని జీవితంలోనూ, మరణంలోనూ నెరవేరిన భావావేశం కలిగించే ప్రవచనాలను మనం యెషయా గ్రంథంలో కనుగొంటాము. యెషయా గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన ప్రవచనాల అధ్యయనం భూవ్యాప్తంగా ఉన్న దేవుని సేవకులకు, ఇతరులకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. నిజంగా ఈ ప్రవచనాలు సర్వమానవాళికీ వెలుగు.

[అధస్సూచీలు]

a పరికల్పన చేయడిన మూడో గ్రంథకర్త, అంటే 56 నుండి 66 అధ్యాయాలను వ్రాసినవాడని ఎంచబడుతున్న వ్యక్తిని పండితులు తృతీయ యెషయా అని పేర్కొంటారు.

b ప్రసవ వేదనపడుతున్న స్త్రీ: యెషయా 13: 8; 21: 3; 26:​17, 18; 42:​14; 45:​10; 54: 1; 66: 7. ఒక “త్రోవ” లేక ఒక “రాజమార్గము”: యెషయా 11:​16; 19:​23; 35: 8; 40: 3; 43:​19; 49:​11; 57:​14; 62:​10.

c సమాంతర వృత్తాంతాల్లో, మార్కు, లూకా, యోహాను అదే పదబంధాన్ని ఉపయోగించారు.​—⁠మార్కు 1:​2, 3; లూకా 3:​3-6; యోహాను 1:​23.

d యెషయా గ్రంథంలోని మొదటి 40 అధ్యాయాలు, వాచ్‌టవర్‌ సంస్థ ప్రచురించిన యెషయా ప్రవచనం​—⁠సర్వమానవాళికి వెలుగు I అనే పుస్తకంలో చర్చించబడ్డాయి.

[అధ్యయన ప్రశ్నలు]

[9 వ పేజీలోని బాక్సు]

భాషాపరమైన విశ్లేషణా సాక్ష్యాధారం

అనేక సంవత్సరాలు గడుస్తుండగా భాషలో ఏర్పడే సూక్ష్మ మార్పులను పసిగట్టే భాషాపరమైన అధ్యయనాలు, యెషయా గ్రంథాన్ని ఒకే వ్యక్తి వ్రాశాడనేదానికి మరింత సాక్ష్యాధారాన్ని ఇస్తున్నాయి. యెషయా గ్రంథంలోని కొంతభాగం సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో వ్రాయబడి, మరో భాగం 200 సంవత్సరాల తర్వాత వ్రాయబడి ఉంటే, ప్రతి భాగంలోనూ ఉపయోగించబడిన హీబ్రూ భాషలో తేడాలు ఉండాలి. కాని వెస్ట్‌మినిస్టర్‌ థియొలాజికల్‌ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, “భాషాపరమైన విశ్లేషణలో లభించిన సాక్ష్యాధారం, యెషయా 40 నుండి 66 అధ్యాయాలు చెరగా కొనిపోబడక ముందు వ్రాయబడినవనే దానికి విస్తృతమైన మద్దతునిస్తుంది.” ఆ అధ్యయన మూలకర్త ఇలా ముగిస్తున్నాడు: “యెషయా గ్రంథం చెరలో ఉన్న సమయంలో లేదా చెరనుండి విడుదల అయిన తర్వాతి కాలంలో వ్రాయబడిందని విమర్శకులైన పండితులు నొక్కి చెప్పాలనుకుంటే, వారు భాషాపరమైన విశ్లేషణ నుండి లభించిన సాక్ష్యాధారానికి విరుద్ధంగా అలా చెప్పవలసి ఉంటుంది.”

[11 వ పేజీలోని చిత్రం]

మృత సముద్రపు యెషయా గ్రంథపు చుట్టలోని భాగం. 39 వ అధ్యాయం ముగింపు బాణం గుర్తుతో సూచించబడింది

[12, 13 వ పేజీలోని చిత్రాలు]

యెషయా దాదాపు 200 సంవత్సరాలు ముందుగా యూదుల విడుదల గురించి ప్రవచిస్తాడు