కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు!”

“నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు!”

మూడవ అధ్యాయం

“నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు!”

యెషయా 42:​1-25

1, 2. యెషయా 42 వ అధ్యాయం నేడు క్రైస్తవులకు ఎందుకు ఆసక్తికరమైనది?

 “మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు . . . ఇదే యెహోవా వాక్కు.” (యెషయా 43:​10, 12) యెహోవా చేసిన ఈ ప్రకటనను యెషయా ప్రవక్త సా.శ.పూ ఎనిమిదవ శతాబ్దంలో వ్రాశాడు, అది యెహోవా ప్రాచీన నిబంధన ప్రజలు ఆయనకు సాక్షులుగా ఉండే ఒక జనమని చూపిస్తోంది. వారు దేవుడు ఏర్పరచుకున్న సేవకులు. దాదాపు 2,600 సంవత్సరాల తర్వాత 1931 లో, ఈ మాటలు తమకు అన్వయిస్తాయని అభిషిక్త క్రైస్తవులు బహిరంగంగా ప్రకటించారు. వారు యెహోవాసాక్షులు అనే పేరును స్వీకరించి, దేవుని భూసంబంధసేవకునిగా ఉండడానికి సంబంధించిన బాధ్యతలను హృదయపూర్వకంగా అంగీకరించారు.

2 యెహోవాసాక్షులు దేవుడ్ని ప్రీతిపర్చాలని హృదయపూర్వకంగా కోరుకుంటారు. ఈ కారణాన్ని బట్టి, యెషయా గ్రంథంలోని 42 వ అధ్యాయం వారిలో ప్రతి ఒక్కరికి ఎంతో ఆసక్తికరమైనది, ఎందుకంటే యెహోవా ఎలాంటి సేవకుడిని ఆమోదిస్తాడో, ఎలాంటి సేవకుడిని నిరాకరిస్తాడో అది తెలియజేస్తుంది. ఈ ప్రవచనాన్ని, దాని నెరవేర్పును పరిశీలించడం, ఏది దేవుని ఆమోదానికి దారితీస్తుంది, ఏది ఆయన అనంగీకారానికి నడిపిస్తుంది అనేదాని గురించి అంతర్దృష్టిని ఇస్తుంది.

“అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను”

3. “నా సేవకుడు” గురించి యెహోవా యెషయా ద్వారా ఏమని ప్రవచిస్తున్నాడు?

3 యెషయా ద్వారా యెహోవా, తాను స్వయంగా ఏర్పరచుకోబోయే సేవకుని ఆగమనాన్ని గురించి ప్రవచిస్తాడు: ‘ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు! నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, [“నేను ఆమోదించినవాడు,” NW]! అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అతడు కేకలు వేయడు అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు. నలిగిన రెల్లును అతడు విరువడు; మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును. భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు; ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును.’​—యెషయా 42:​1-4.

4. ప్రవచనంలోని “ఏర్పరచుకొనినవాడు” ఎవరు, అది మనకెలా తెలుస్తుంది?

4 ఇక్కడ ప్రస్తావించబడిన సేవకుడు ఎవరు? అనిశ్చయతకు కారణమేమీ లేదు. ఈ మాటలు మత్తయి సువార్తలో ఎత్తివ్రాయబడి, యేసుక్రీస్తుకు అన్వయించబడడాన్ని మనం చూడవచ్చు. (మత్తయి 12:​15-21) యేసే ప్రియమైన సేవకుడు, “ఏర్పరచుకొనినవాడు.” యెహోవా తన ఆత్మను యేసుపై ఎప్పుడు ఉంచాడు? సా.శ. 29 లో, యేసు బాప్తిస్మం సమయంలో ఉంచాడు. ప్రేరేపిత వృత్తాంతం ఆ బాప్తిస్మమును వర్ణిస్తూ, యేసు నీళ్ళలోనుండి పైకి లేచిన తర్వాత, ‘ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగివచ్చెను. అప్పుడు​—⁠నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని [“నిన్ను నేను ఆమోదించానని,” NW] యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను’ అని చెబుతోంది. ఆ విధంగా యెహోవా తన ప్రియమైన సేవకుడ్ని స్వయంగా సూచించాడు. ఆ తర్వాత యేసు చేసిన పరిచర్య, ఆయన చేసిన అద్భుత కార్యములు యెహోవా ఆత్మ నిజంగానే ఆయనపై ఉందని నిరూపించాయి.​—⁠లూకా 3:​21, 22; 4:​14-21; మత్తయి 3:​16, 17.

‘ఆయన అన్యజనులకు న్యాయము కనపరచును’

5. సా.శ. మొదటి శతాబ్దంలో న్యాయాన్ని గూర్చిన స్పష్టీకరణ ఎందుకు అవసరమైంది?

5 యెహోవా ఏర్పరచుకొనినవాడు నిజమైన న్యాయమును ‘కనపర్చాలి.’ “ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.” (మత్తయి 12:​18) సా.శ. మొదటి శతాబ్దంలో ఇది ఎంతగా అవసరమయ్యిందో కదా! యూదా మతనాయకులు నీతిన్యాయాల గురించి ఎంతో వక్రీకరింపబడిన దృక్కోణాన్ని బోధించారు. వారు ఒక కఠినమైన నియమావళినిఅనుసరించడం ద్వారా నీతిని సాధించడానికి ప్రయత్నించారు, ఆ నియమావళిలో అనేకం వారు తయారు చేసుకున్నవే. వారి శాసనపరమైన న్యాయంలో కనికరము, దయ కొరవడ్డాయి.

6. యేసు నిజమైన న్యాయాన్ని ఏ యే విధాలుగా బయల్పరిచాడు?

6 దానికి భిన్నంగా, యేసు న్యాయం విషయంలో దేవునికున్న దృక్కోణాన్ని బయల్పరిచాడు. నిజమైన న్యాయం దయాపూర్వకమైనదనీ, కనికరంతో నిండినదనీ యేసు తన బోధల ద్వారా, తాను జీవించిన విధానం ద్వారా చూపించాడు. ఆయన కొండపై ఇచ్చిన పేరుగాంచిన ప్రసంగాన్ని పరిశీలించండి. (మత్తయి 5-7 అధ్యాయాలు) న్యాయాన్ని, నీతిని ఎలా అభ్యసించాలనేదాని గురించిన ఎంతటి నైపుణ్యవంతమైన వివరణ! మనం ఆ సువార్త వృత్తాంతాలను చదువుతుండగా, పేదలపట్ల, పీడితులపట్ల యేసు చూపించిన దయను బట్టి మనం కదిలించబడమా? (మత్తయి 20:​34; మార్కు 1:​41; 6:​34; లూకా 7:​13) వంగిపోయి, క్రిందపడిపోయి, నలిగిన రెల్లులవలె ఉన్న అనేకుల వద్దకు ఆయన తన ఓదార్పుకరమైన సందేశాన్ని తీసుకువెళ్ళాడు. వారు తమ జీవన జ్యోతి దాదాపు ఆరిపోబోతూ రెపరెపలాడుతుండగా, మకమకలాడుతున్న జనుపనార వత్తిలా ఉన్నారు. యేసు “నలిగిన రెల్లును” విరువలేదు, “మకమకలాడుచున్న జనుపనార వత్తిని” ఆర్పలేదు. బదులుగా, ఆయన ప్రేమపూర్వకమైన, దయగల మాటలు, చర్యలు సాత్వికుల హృదయాలను లేవనెత్తాయి.​—⁠మత్తయి 11:​28-30.

7. యేసు ‘కేకలు వేయడు, వీధిలో అరువడు’ అని ప్రవచనం ఎందుకు చెప్పగలిగింది?

7 అయితే యేసు “కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు” అని ప్రవచనం ఎందుకు చెబుతోంది? ఎందుకంటే ఆయన కాలంనాటి అనేకులు చేసినట్లుగా ఆయన తన గురించి తాను గొప్పలు చెప్పుకోలేదు. (మత్తయి 6: 5) ఒక కుష్ఠురోగిని స్వస్థపరిచేటప్పుడు, స్వస్థతపొందిన వ్యక్తికి ఆయనిలా చెప్పాడు: “ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ.” (మార్కు 1:​40-44) యేసు ప్రాచుర్యాన్ని పొందడానికి ప్రయత్నించే బదులు, ప్రజలు ఇతరులు చెప్పినవి విని ఒక ముగింపుకు రావడంకన్నా తాను యెహోవా అభిషిక్త సేవకుడైన క్రీస్తునని పటిష్ఠమైన నిదర్శనం ఆధారంగా గ్రహించాలని కోరుకున్నాడు.

8. (ఎ) యేసు “అన్యజనులకు న్యాయము” ఎలా కనపరిచాడు? (బి) యేసు చెప్పిన స్నేహశీలుడైన సమరయుని గురించిన ఉపమానం న్యాయం గురించి మనకు ఏమి బోధిస్తోంది?

8 ఏర్పరచుకొనబడిన సేవకుడు “అన్యజనులకు న్యాయము” కనపరచాలి. యేసు అదే చేశాడు. యేసు దైవిక న్యాయం యొక్క దయాపూర్వకమైన నైజాన్ని నొక్కిచెప్పడమే గాక, అది ప్రజలందరికీ వర్తించాలని బోధించాడు. దేవుడ్ని, పొరుగువారిని ప్రేమించాలని ధర్మశాస్త్రం బాగా తెలిసిన ఒక వ్యక్తికి యేసు ఒక సందర్భంలో గుర్తుచేశాడు. “నా పొరుగువాడెవడని” ఆ వ్యక్తి యేసును అడిగాడు. “నీ తోటి యూదుడు” అని యేసు సమాధానమిస్తాడని బహుశా అతడు ఎదురుచూసి ఉండవచ్చు. కానీ యేసు, స్నేహశీలుడైన సమరయుని ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానంలో, దొంగల దాడికి గురైన వ్యక్తికి సహాయం చేయడానికి ఒక లేవీయుడు, ఒక యాజకుడు నిరాకరించగా, ఒక సమరయుడు సహాయం చేశాడు. ప్రశ్న వేసిన వ్యక్తి, ఈ సందర్భంలో లేవీయుడు లేదా యాజకుడు కాదు గానీ తృణీకరించబడిన సమరయుడే పొరుగువాడని ఒప్పుకోవలసి వచ్చింది. ‘నీవును ఆలాగు చేయుమనే’ ఉపదేశంతో యేసు తన ఉపమానాన్ని ముగించాడు.​—⁠లూకా 10:​25-37; లేవీయకాండము 19:​18.

“అతడు మందగిలడు నలుగుడుపడడు”

9. నిజమైన న్యాయం యొక్క నైజాన్ని అర్థం చేసుకోవడం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

9 యేసు నిజమైన న్యాయం యొక్క నైజాన్ని స్పష్టం చేశాడు గనుక, ఆయన శిష్యులు ఈ లక్షణాన్ని ప్రదర్శించడం నేర్చుకున్నారు. మనం కూడా నేర్చుకోవాలి. మొదటిగా, మంచి చెడుల విషయంలో మనం దేవుని ప్రమాణాలను అంగీకరించాలి, ఎందుకంటే ఏది నీతి, ఏది న్యాయం అనేది నిర్ణయించే హక్కు ఆయనకుంది. మనం యెహోవా విధానంలో పనులు చేయడానికి కృషి చేసినప్పుడు, నిజమైన న్యాయం అంటే ఏమిటో మన మంచి ప్రవర్తన స్పష్టంగా బయలుపరుస్తుంది.​—⁠1 పేతురు 2:​12.

10. న్యాయాన్ని ప్రదర్శించడంలో, ప్రకటన, బోధన పనిలో పాల్గొనడం కూడా ఎందుకు ఇమిడివుంది?

10 మనం ప్రకటనా, బోధనా కార్యక్రమాల్లో శ్రద్ధగా పాల్గొన్నప్పుడు కూడా మనం నిజమైన న్యాయాన్ని ప్రదర్శిస్తాము. యెహోవా తన గురించి, తన కుమారుని గురించి, తన సంకల్పాల గురించి జీవరక్షక పరిజ్ఞానాన్ని పుష్కలంగా అనుగ్రహించాడు. (యోహాను 17: 3) ఆ పరిజ్ఞానాన్ని మన దగ్గరే ఉంచుకోవడం సరైనది కాదు లేక న్యాయం కాదు. “మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము” అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 3:​27) దేవుని గురించి మనకు తెలిసిన దాన్ని, ప్రజల జాతి, వర్గ, లేక జాతీయ నేపథ్యం ఏదైనప్పటికీ వారందరితో హృదయపూర్వకంగా పంచుకుందాము.​—⁠అపొస్తలుల కార్యములు 10:​34, 35.

11. యేసును అనుకరిస్తూ, మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలి?

11 అంతేగాక, నిజమైన క్రైస్తవులు ఇతరులతో వ్యవహరించడంలో యేసు మాదిరిని అనుసరిస్తారు. అనేకులు నేడు వేదనకరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు గనుక, వారికి దయ, ప్రోత్సాహము అవసరం. చివరికి కొంతమంది సమర్పిత క్రైస్తవులు కూడా పరిస్థితులనుబట్టి ఎంతగా చితికిపోయి ఉంటారంటే వారు నలిగిన రెల్లులను లేదా మకమకలాడుతున్న వత్తులను పోలివుంటారు. వారికి మన మద్దతు అవసరం లేదా? (లూకా 22:​32; అపొస్తలుల కార్యములు 11:​23) న్యాయాన్ని అనుసరించడంలో యేసును అనుకరించడానికి ప్రయత్నించే నిజక్రైస్తవుల సహవాసంలో భాగమై ఉండడం ఎంతగా ఉత్తేజపరుస్తుందో కదా!

12. అందరికీ న్యాయం అన్నది త్వరలోనే వాస్తవం అవుతుందని మనమెందుకు నమ్మకం కలిగివుండవచ్చు?

12 ఎప్పటికైనా అందరికీ న్యాయం జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. యెహోవా ఏర్పరచుకున్నవాడు “భూలోకమున న్యాయము స్థాపించువరకు . . . మందగిలడు, నలుగుడుపడడు.” సింహాసనాసీనుడైన రాజు, పునరుత్థానం చేయబడిన క్రీస్తుయేసు త్వరలోనే ‘దేవుని నెరుగనివారికి ప్రతిదండన చేస్తాడు.’ (2 థెస్సలొనీకయులు 1:​6-9; ప్రకటన 16:​14-16) మానవ పరిపాలన స్థానాన్ని దేవుని రాజ్యం తీసుకుంటుంది. నీతి న్యాయములు సమృద్ధమవుతాయి. (సామెతలు 2:​21, 22; యెషయా 11: 3-5; దానియేలు 2:​44; 2 పేతురు 3:​13) అన్ని చోట్లా ఉన్న యెహోవా సేవకులు, చివరికి సుదూర ప్రాంతాల్లో అంటే “ద్వీపముల”లో ఉన్నవారు సహితం ఆ దినం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తారు.

‘అన్యజనులకు వెలుగుగా ఆయనను నియమించెదను’

13. యెహోవా తాను ఏర్పరచుకొనిన సేవకుని గురించి ఏమి ప్రవచిస్తున్నాడు?

13 యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” (యిషయా 42: 5) సృష్టికర్తయైన యెహోవాను గురించిన ఎంతటి శక్తివంతమైన వర్ణన! యెహోవా శక్తిని గురించిన ఈ జ్ఞాపిక ఆయన మాటల గంభీరతను నొక్కిచెబుతోంది. యెహోవా ఇలా చెబుతున్నాడు: “గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను. నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను.”​—యెషయా 42: 6, 7.

14. (ఎ) యెహోవా తాను ఆమోదించిన సేవకుని చేతిని పట్టుకోవడం అంటే భావమేమిటి? (బి) ఏర్పరచుకొనబడిన సేవకుడు ఏ పాత్ర నిర్వహిస్తాడు?

14 విశ్వ మహా సృష్టికర్త, జీవదాత, జీవ పరిరక్షకుడు, తాను ఏర్పరచుకొనిన సేవకుని చేయి పట్టుకొని, తన పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు. అది ఎంత ధైర్యాన్నిస్తుందో కదా! అంతేగాక, ఆయనను “ప్రజలకొరకు నిబంధనగా” ఇచ్చేందుకు యెహోవా ఆయనను సురక్షితంగా ఉంచుతాడు. నిబంధన అంటే ఒడంబడిక, ఒప్పందం, గంభీరమైన వాగ్దానం. అది ఖచ్చితమైన ఆదేశం. అవును, యెహోవా తన సేవకుడ్ని “ప్రజకు ఒడంబడికగా” చేశాడు.​—⁠పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

15, 16. యేసు ఏ విధంగా “అన్యజనులకు వెలుగుగా” సేవచేశాడు?

15 వాగ్దానం చేయబడిన సేవకుడు “అన్యజనులకు వెలుగుగా,” “గ్రుడ్డివారి కన్నులు” తెరుస్తాడు, “చీకటిలో నివసించువారిని” విడుదల చేస్తాడు. యేసు అదే చేశాడు. సత్యానికి సాక్ష్యం ఇవ్వడం ద్వారా యేసు తన పరలోక తండ్రి నామమును మహిమపరిచాడు. (యోహాను 17:​4, 6) ఆయన మతపరమైన అబద్ధాలను బట్టబయలు చేశాడు, రాజ్య సువార్తను ప్రకటించాడు, మతసంబంధమైన చెరలో ఉన్నవారు ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందడానికి ద్వారం తెరిచాడు. (మత్తయి 15:​3-9; లూకా 4:​43; యోహాను 18:​37) చీకటి క్రియలు చేయడం గురించి ఆయన హెచ్చరించి, సాతాను “అబద్ధమునకు జనకుడు,” “ఈ లోకాధికారి” అని బయల్పరిచాడు.​—⁠యోహాను 3:​19-21; 8:​44; 16:​11.

16 “నేను లోకమునకు వెలుగును” అని యేసు చెప్పాడు. (యోహాను 8:​12) ఆయన తన పరిపూర్ణమైన మానవ జీవమును విమోచన క్రయధనంగా అర్పించినప్పుడు తానే వెలుగునని చాలా విశేషమైన విధంగా నిరూపించుకున్నాడు. అలా, విశ్వసించేవారు తమ పాపాలకు క్షమాపణను, దేవునితో ఆమోదింపబడిన సంబంధాన్ని, నిత్యజీవ నిరీక్షణను పొందడానికి ఆయన మార్గాన్ని తెరిచాడు. (మత్తయి 20:​28; యోహాను 3:​16) యేసు తన జీవితమంతటిలోనూ పరిపూర్ణమైన దైవభక్తిని కలిగివుండడం ద్వారా యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని ఉన్నతపర్చి, అపవాది అబద్ధికుడని నిరూపించాడు. యేసు నిజంగా, గ్రుడ్డివారికి చూపునిచ్చాడు, ఆధ్యాత్మిక అంధకారంలో బంధీలుగా ఉన్నవారిని విడిపించాడు.

17. మనం వెలుగు ప్రకాశకులుగా ఏ యే విధాలుగా సేవచేస్తాము?

17 కొండమీది ప్రసంగంలో, “మీరు లోకమునకు వెలుగైయున్నారు” అని యేసు తన శిష్యులకు చెప్పాడు. (మత్తయి 5:​14) మరి మనం కూడా వెలుగు ప్రకాశకులము కాదా? మన జీవన విధానం ద్వారా, మన ప్రకటన పని ద్వారా, నిజమైన వెలుగుకు మూలమైన యెహోవా వైపుకు ఇతరులను నడిపించే ఆధిక్యత మనకు ఉంది. యేసును అనుకరిస్తూ, మనం యెహోవా నామమును వారికి తెలియజేస్తాము, ఆయన సర్వోన్నతాధిపత్యాన్ని ఉన్నతపరుస్తాము, ఆయన రాజ్యమే మానవజాతి ఏకైక నిరీక్షణ అని ప్రకటిస్తాము. అంతేగాక, వెలుగు ప్రకాశకులముగా మనం మతసంబంధమైన అబద్ధాలను బహిర్గతం చేస్తాము, చీకటికి సంబంధించిన అపరిశుభ్రమైన క్రియల గురించి హెచ్చరిస్తాము, దుష్టుడైన సాతానును బయల్పరుస్తాము.​—⁠అపొస్తలుల కార్యములు 1: 8; 1 యోహాను 5:​19.

“యెహోవాకు క్రొత్త గీతము పాడుడి”

18. యెహోవా తన ప్రజలు ఏమి తెలుసుకునేలా చేస్తాడు?

18 ఇప్పుడు యెహోవా ఇలా అంటూ అవధానాన్ని తన ప్రజల వైపుకు మరలుస్తున్నాడు: “యెహోవాను నేనే. ఇదే నా నామము; మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను.” (యెషయా 42:​8, 9) “నా సేవకుడు” గురించిన ప్రవచనాన్ని పలికింది విలువలేని దేవుళ్ళలో ఒకరు కాదుగానీ, సజీవుడైన ఏకైక సత్య దేవుడే. అది తప్పక నెరవేర వలసిందే, అది నెరవేరింది కూడా. నిజానికి యెహోవా దేవుడే క్రొత్త విషయాలకు మూలకర్త, ఆయన అవి సంభవించక ముందే తన ప్రజలు వాటిని తెలుసుకునేలా చేస్తాడు. అందుకు మనమెలా ప్రతిస్పందించాలి?

19, 20. (ఎ) ఏ గీతం పాడబడాలి? (బి) నేడు ఎవరు యెహోవాకు స్తుతి గీతాన్ని పాడుతున్నారు?

19 యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను. సెల నివాసులు సంతోషించుదురు గాక. పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక. ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక.”​—యెషయా 42:​10-12.

20 అరణ్యములోని పురవాసులు, గ్రామస్థులు, ద్వీపవాసులు, చివరికి కేదారు నివాసులు, లేదా ఎడారులలో గుడారాల్లో నివసించేవారు, సర్వత్రా ఉన్న ప్రజలు యెహోవాకు స్తుతి గీతము పాడడానికి పురికొల్పబడుతున్నారు. మన కాలంలో ఈ ప్రవచనార్థక విజ్ఞప్తికి లక్షలాదిమంది ప్రతిస్పందించడం ఎంత ఉత్తేజాన్నిస్తుందో కదా! వాళ్ళు దేవుని వాక్య సత్యాన్ని హత్తుకొని, యెహోవాను తమ దేవునిగా చేసుకున్నారు. యెహోవా ప్రజలు 230 కన్నా ఎక్కువ దేశాల్లో ఈ క్రొత్త గీతమును పాడుతున్నారు అంటే యెహోవాకు మహిమను ఆపాదిస్తున్నారు. వివిధ సంస్కృతులవారు, వివిధ భాషలవారు, వివిధ జాతులవారు కలిసి పాడే ఈ బృందగానంలో గొంతు కలపడం ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో కదా!

21. యెహోవాకు పాడే స్తుతి గీతాన్ని ఆపడంలో దేవుని ప్రజల శత్రువులు ఎందుకు సఫలులు కాలేరు?

21 వ్యతిరేకులు దేవునికి విరుద్ధంగా నిలబడి ఈ స్తుతి గీతాన్ని ఆపగలరా? అసాధ్యం! “యెహోవా శూరునివలె బయలుదేరును. యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును; వారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును.” (యిషయా 42:​13) యెహోవాకు విరుద్ధంగా ఏ శక్తి నిలబడగలదు? దాదాపు 3,500 సంవత్సరాల క్రితం, ప్రవక్తయైన మోషే, ఇశ్రాయేలు కుమారులు ఇలా పాడారు: “యెహోవా యుద్ధశూరుడు. యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరి.” (నిర్గమకాండము 15:​3, 4) ఆ కాలానికి చెందిన అత్యంత బలమైన సైనికశక్తిపై యెహోవా విజయం సాధించాడు. యెహోవా శక్తివంతమైన యుద్ధశూరునిగా బయలుదేరినప్పుడు దేవుని ప్రజల శత్రువులెవరూ సఫలులు కాలేదు.

“చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని”

22, 23. యెహోవా ‘చిరకాలమునుండి మౌనముగా’ ఎందుకు ఉంటాడు?

22 యెహోవా తన శత్రువులకు విధించిన తీర్పును అమలుచేసేటప్పుడు కూడా నిష్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరిస్తాడు. ఆయనిలా అంటున్నాడు: “చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని. ఊరకొని, నన్ను అణచుకొంటిని. ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంతముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను. పర్వతములను కొండలను పాడుచేయుదును, వాటిమీది చెట్టు చేమలన్నిటిని ఎండిపోచేయుదును. నదులను ద్వీపములుగా చేయుదును, మడుగులను ఆరిపోచేయుదును.”​—యెషయా 42:​14, 15.

23 న్యాయసంబంధమైన చర్య తీసుకునే ముందు, తప్పిదస్థులు తమ చెడు మార్గముల నుండి మరలే అవకాశాన్ని ఇచ్చేందుకు యెహోవా సమయం గడవటానికి అనుమతిస్తాడు. (యిర్మీయా 18:​7-10; 2 పేతురు 3: 9) బబులోనీయుల విషయాన్ని పరిశీలించండి, వీరు ప్రబలమైన ప్రపంచ శక్తిగా సా.శ.పూ. 607 లో యెరూషలేమును నిర్జనంగా చేశారు. ఇశ్రాయేలీయులు చూపించిన అవిశ్వసనీయతను బట్టి వారికి క్రమశిక్షణను ఇచ్చేందుకు యెహోవా దాన్ని అనుమతిస్తాడు. అయితే, బబులోనీయులు తాము నిర్వహిస్తున్న పాత్రను గుర్తించడంలో విఫలమవుతారు. వారు దేవుని ప్రజలతో, దేవుని తీర్పు కోరేదానికన్నా ఎక్కువ కఠినంగా వ్యవహరిస్తారు. (యెషయా 47:​6, 7; జెకర్యా 1:​15) తన ప్రజలు బాధపడడాన్ని చూడడం సత్య దేవుడ్ని ఎంతగా నొప్పిస్తుందో కదా! కానీ ప్రవచించబడినట్లుగా, ఆయన చర్య తీసుకోకుండా ఆగి, ప్రసవించేటప్పుడు బలవంతముగా ఊపిరితీస్తూ, ఒగరుస్తూ, రోజుతూ ఉండే స్త్రీలా నొప్పిని సహిస్తాడు. చివరికి, ఆయన బబులోనును ‘పాడుచేయడానికి,’ ‘ఎండిపోయేలా చేయడానికి’ నియమిత సమయం వస్తుంది. సా.శ.పూ. 539 మొదలుకొని ఆయనలా చేస్తాడు.

24. యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం ఏ నిరీక్షణను ఇస్తాడు?

24 దేవుని ప్రజలు అనేక సంవత్సరాలపాటు చెరలో ఉన్న తర్వాత చివరికి తమ స్వదేశానికి తిరిగి రావడానికి మార్గం తెరవబడినప్పుడు వారు ఎంతగా పులకించిపోయి ఉంటారో కదా! (2 దినవృత్తాంతములు 36:​22, 23) యెహోవా చేసిన ఈ వాగ్దాన నెరవేర్పును అనుభవించడానికి వారు ఎంతో ఆనందిస్తుండవచ్చు: “వారెరుగనిమార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను; వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును.”​—యెషయా 42:​16.

25. (ఎ) యెహోవా ప్రజలు నేడు దేని గురించి నిశ్చయత కలిగివుండవచ్చు? (బి) మన నిశ్చయత ఏమై ఉండాలి?

25 నేడు ఈ మాటలు ఎలా అన్వయిస్తాయి? ఇప్పటికి చాలా కాలం నుండి, శతాబ్దాల నుండి, జనములు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి యెహోవా అనుమతించాడు. అయితే, విషయాలను చక్కబెట్టడానికి ఆయన నియమిత సమయం సమీపించింది. ఆధునిక కాలాల్లో తన నామానికి సాక్షులుగా ఉండడానికి ఆయన ఒక జనమును ఎంపికచేసుకున్నాడు. వారికి ఎదురయ్యే ఏ వ్యతిరేకతనైనా అణచివేస్తూ, వారు ఆయనను “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించడానికి మార్గమును సుగమం చేశాడు. (యోహాను 4:​24) ‘వారిని విడువను’ అని ఆయన వాగ్దానం చేశాడు, ఆయన తన మాట నిలబెట్టుకున్నాడు. అబద్ధ దేవుళ్ళను ఆరాధించడంలో అలాగే కొనసాగేవారి మాటేమిటి? యెహోవా ఇలా చెబుతున్నాడు: “చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోతవిగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు.” (యెషయా 42:​17) యెహోవా ఏర్పరచుకొనిన సేవకుడిలా మనం ఆయనపట్ల నమ్మకంగా ఉండడం ఎంత ఆవశ్యకమో కదా!

‘గ్రుడ్డివాడు, చెవిటివాడు అయిన సేవకుడు’

26, 27. ఇశ్రాయేలు ‘చెవిటి, గ్రుడ్డి సేవకునిగా’ ఎలా నిరూపించబడింది, దాని పర్యవసానాలేమిటి?

26 దేవుడు ఏర్పరచుకొనిన సేవకుడైన యేసుక్రీస్తు మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. అయితే యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆధ్యాత్మిక భావంలో చెవిటి, గ్రుడ్డి వారై అవిశ్వసనీయ సేవకునిగా నిరూపించుకున్నారు. వారిని ఉద్దేశించి యెహోవా ఇలా చెబుతున్నాడు: “చెవిటివారలారా, వినుడి; గ్రుడ్డివారలారా మీరు గ్రహించునట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. వారు చెవి యొగ్గిరిగాని వినకున్నారు. యెహోవా తన నీతినిబట్టి సంతోషముగలవాడై ఉపదేశ క్రమమొకటి ఘనపరచి గొప్పచేసెను.”​—యెషయా 42:​18-21.

27 ఇశ్రాయేలు వైఫల్యం ఎంత విలపించదగినదో కదా! దాని ప్రజలు అన్యజనుల దయ్యపు దేవుళ్ళను ఆరాధించడానికి పదే పదే మళ్ళుతున్నారు. యెహోవా తన సందేశకులను పదే పదే పంపుతూ వచ్చినా, ఆయన ప్రజలు చెవిన బెట్టలేదు. (2 దినవృత్తాంతములు 36:​14-16) పర్యవసానాలను యెషయా ఇలా ప్రవచిస్తున్నాడు: “అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను, ఎవరును తప్పించుకొనకుండ వారందరు గుహలలో చిక్కుపడియున్నారు, వారు బందీగృహములలో దాచబడియున్నారు. దోపుడుపాలైరి విడిపించువాడెవడును లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడును లేడు. మీలో ఎవడు దానికి చెవి యొగ్గును? రాబోవుకాలమునకై ఎవడు ఆలకించి వినును? యెహోవాకు విరోధముగా మనము పాపముచేసితిమి వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి. ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొనువారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా? కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను. అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు.”​—యెషయా 42:​22-25.

28. (ఎ) యూదా నివాసుల ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (బి) మనం యెహోవా ఆమోదాన్ని ఎలా పొందవచ్చు?

28 యూదా నివాసుల అవిశ్వసనీయతను బట్టి యెహోవా సా.శ.పూ. 607 లో ఆ దేశం అపహరింపబడి, దోపుడు సొమ్ముగా అయ్యేందుకు అనుమతిస్తాడు. బబులోనీయులు యెహోవా ఆలయమును కాల్చివేసి, యెరూషలేమును నిర్జనం చేసి, యూదులను బంధీలుగా తీసుకువెళతారు. (2 దినవృత్తాంతములు 36:​17-21) మనమీ హెచ్చరిక ఉదాహరణను మనస్సులో ఉంచుకుని యెహోవా ఉపదేశాలు వినిపించలేనంత చెవిటివారమూ, ఆయన లిఖిత వాక్యం కనిపించలేనంత గ్రుడ్డివారము కాకుండా ఉందాము. బదులుగా, యెహోవా స్వయంగా ఆమోదించిన సేవకుడైన యేసుక్రీస్తును అనుకరించడం ద్వారా యెహోవా ఆమోదాన్ని పొందడానికి కృషి చేద్దాము. యేసులా మనమూ, మనం చెప్పేదాన్ని బట్టి, చేసేదాన్ని బట్టి నిజమైన న్యాయం తెలిసేలా చేద్దాము. ఈ విధంగా, సత్యదేవుడ్ని స్తుతిస్తూ ఆయనకు మహిమను తెచ్చే వెలుగు ప్రకాశకులముగా సేవచేస్తూ మనం యెహోవా ప్రజలలో ఒకరిగా మిగిలి ఉంటాము.

[అధ్యయన ప్రశ్నలు]

[33 వ పేజీలోని చిత్రాలు]

నిజమైన న్యాయం దయాపూర్వకమైనది, కరుణగలది

[34 వ పేజీలోని చిత్రం]

స్నేహశీలుడైన సమరయుని గురించిన ఉపమానంలో యేసు, నిజమైన న్యాయం ప్రజలందరికీ వర్తిస్తుందని చూపించాడు

[36 వ పేజీలోని చిత్రాలు]

మనం ప్రోత్సహించేవారిగా, కరుణగలవారిగా ఉండడం ద్వారా దైవిక న్యాయాన్ని అనుసరిస్తాము

[39 వ పేజీలోని చిత్రాలు]

మనం మన ప్రకటనా కార్యకలాపం ద్వారా దైవిక న్యాయాన్ని ప్రదర్శిస్తాము

[40 వ పేజీలోని చిత్రం]

ఆమోదించబడిన సేవకుడు “అన్యజనులకు వెలుగుగా” ఇవ్వబడ్డాడు