కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు ఆనందించుడి’

‘నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు ఆనందించుడి’

ఇరవై ఆరవ అధ్యాయం

‘నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు ఆనందించుడి’

యెషయా 65:​1-25

1. అపొస్తలుడైన పేతురు ధైర్యాన్నిచ్చే ఏ మాటలను వ్రాశాడు, ఏ ప్రశ్న తలెత్తుతుంది?

 అన్యాయాలు, బాధలు అంతమవ్వడాన్ని ఎప్పటికైనా మనం చూడగలుగుతామా? అపొస్తలుడైన పేతురు 1,900 సంవత్సరాలకంటే ఎక్కువకాలం క్రితం, ధైర్యాన్నిచ్చే ఈ మాటలను వ్రాశాడు: ‘మనం [దేవుని] వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.’ (2 పేతురు 3:​13) శతాబ్దాల కాలమంతటిలో, అనేకమంది ఇతర నమ్మకమైన దేవుని సేవకులతోపాటు పేతురు, అక్రమము, అణచివేత, దౌర్జన్యము అంతరించి సర్వత్రా నీతి వ్యాపించే గొప్ప దినము కోసం ఎదురు చూశాడు. ఈ వాగ్దానం నెరవేరుతుందని మనం నిశ్చయత కలిగి ఉండగలమా?

2. ‘క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి గురించి’ మాట్లాడిన ప్రవక్త ఎవరు, ఆ ప్రాచీన ప్రవచనం ఏ యే విధాలుగా నెరవేరుతుంది?

2 తప్పకుండా మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు! పేతురు ‘క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి’ గురించి మాట్లాడినప్పుడు, ఆయన క్రొత్త తలంపునేమీ ప్రవేశపెట్టడం లేదు. దాదాపు 800 సంవత్సరాల క్రితం, యెహోవా యెషయా ప్రవక్త ద్వారా అలాంటి మాటలనే చెప్పాడు. ఆ మునుపటి ప్రవచనం సా.శ.పూ. 537 లో అంటే యూదులు తమ స్వదేశానికి తిరిగి వచ్చేలా చేస్తూ బబులోను చెర నుండి విడిపించబడినప్పుడు స్వల్ప పరిమాణంలో నెరవేరింది. కానీ యెషయా ప్రవచనం నేడు గొప్పగా నెరవేరుతోంది, దేవుని రానున్న నూతనలోకంలో మరింత పులకరింపజేసే నెరవేర్పు కోసం మనం ఎదురు చూస్తున్నాము. వాస్తవానికి, యెషయా ద్వారా ఇవ్వబడిన హృదయాన్ని రంజింపజేసే ప్రవచనం, దేవుని ప్రేమించేవారి కోసం ఆయన భద్రపరచి ఉంచిన ఆశీర్వాదాల తాత్కాలిక దర్శనాన్ని ఇస్తుంది.

“లోబడనొల్లని ప్రజల”ను యెహోవా బ్రతిమాలుతాడు

3. యెషయా 65 వ అధ్యాయంలో ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వబడుతోంది?

3 బబులోనులో ఉన్న యూదా పరవాసుల తరపున యెషయా చేసిన ప్రవచనార్థక ప్రార్థన యెషయా 63:15-64: 12 వచనాల్లో ఉందని గుర్తు తెచ్చుకోండి. యెషయా మాటలు స్పష్టం చేస్తున్నట్లుగా, చాలామంది యూదులు యెహోవాను పూర్ణాత్మతో ఆరాధించడం లేదు, అయితే కొందరు పశ్చాత్తాపపడి ఆయన వైపుకు తిరిగారు. పశ్చాత్తాపపడుతున్న ఆ శేషము కోసం యెహోవా ఇప్పుడు ఆ జనమును పునఃస్థాపిస్తాడా? యెషయా 65 వ అధ్యాయంలో మనం దానికి సమాధానాన్ని కనుగొంటాము. కానీ, నమ్మకంగా ఉన్న కొంతమందికి విడుదలను వాగ్దానం చేసే ముందు, విశ్వాసం లేని అనేకుల కోసం వేచి ఉన్న తీర్పును యెహోవా వర్ణిస్తాడు.

4. (ఎ) యెహోవా యొక్క లోబడనొల్లని ప్రజలకు భిన్నంగా, ఎవరు ఆయన కోసం వెదకుతారు? (బి) యెషయా 65:​1, 2 వచనాలను అపొస్తలుడైన పౌలు ఎలా అన్వయించాడు?

4 యెహోవా తన ప్రజలు పదేపదే తిరుగుబాటు చేసినా సహించాడు. అయితే, ఆయన వారిని తమ శత్రువులకు విడిచిపెట్టి, తన అనుగ్రహాన్ని పొందమని ఇతరులను దయతో ఆహ్వానించే సమయం వస్తుంది. యెషయా ద్వారా యెహోవా ఇలా చెబుతున్నాడు: “నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకనివారికి నేను దొరికితిని.—⁠నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.” (యెషయా 65: 1) అన్యజనులకు చెందిన వారు యెహోవా వద్దకు వస్తారు, కానీ ఒక జనాంగముగా లోబడనొల్లని యూదా జనము మాత్రం అలా చేయడానికి నిరాకరిస్తుందన్నది యెహోవా నిబంధన ప్రజలపై ఒక విచారకరమైన వ్యాఖ్యానం. మునుపు గుర్తించబడని ప్రజలను దేవుడు చివరకు ఎంపిక చేసుకుంటాడని యెషయా మాత్రమే కాదు ఇతర ప్రవక్తలు కూడా ప్రవచించారు. (హోషేయ 1:​10; 2:​23) “విశ్వాసమూలమైన నీతిని” పొందడానికి సహజ యూదులు నిరాకరించినప్పటికీ, అన్యజనులు దానిని పొందుతారని నిరూపించడానికి అపొస్తలుడైన పౌలు సెప్టాజింట్‌ నుండి యెషయా 65:1, 2 వచనాలను ఎత్తి వ్రాశాడు.​—⁠రోమీయులు 9:​30; 10:​20, 21.

5, 6. (ఎ) యెహోవా ఏ హృదయపూర్వకమైన కోరికను వ్యక్తపరిచాడు, కానీ ఆయన ప్రజలు ఎలా ప్రతిస్పందించారు? (బి) యూదాతో యెహోవా వ్యవహారాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

5 తన సొంత ప్రజలు విపత్తును ఎదుర్కోడానికి తాను ఎందుకు అనుమతిస్తాడనేది యెహోవా ఇలా వివరిస్తున్నాడు: “తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచుకొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను.” (యిషయా 65: 2) ఒకరు తమ చేతులు చాపడం అన్నది ఆహ్వానించడాన్ని లేదా బ్రతిమాలడాన్ని సూచిస్తుంది. యెహోవా ఏదో కొద్దిసేపు కాదు గానీ దినమంతా తన చేతులను చాపి ఉంచాడు. యూదా తన వద్దకు తిరిగి రావాలన్నది ఆయన హృదయపూర్వకమైన కోరిక. అయినప్పటికీ, లోబడనొల్లని ఈ ప్రజలు చలించలేదు.

6 యెహోవా మాటల నుండి మనం ఎంతటి హృదయోత్తేజకరమైన పాఠాన్ని నేర్చుకుంటామో కదా! తాను సమీపించదగిన దేవుడు గనుక మనం ఆయనకు సన్నిహితం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. (యాకోబు 4: 8) యెహోవా నమ్రత గలవాడని కూడా ఈ మాటలు మనకు చూపిస్తున్నాయి. (కీర్తన 113:​5, 6) ఎంతైనా, వారి అవిధేయత ఆయనను “దుఃఖపెట్టి”నప్పటికీ తిరిగి రమ్మని తన ప్రజలను బ్రతిమాలుతూ ఆయన ఆలంకారికంగా తన చేతులు చాపి ఉన్నాడు. (కీర్తన 78:​40, 41) శతాబ్దాలపాటు వారికి విజ్ఞప్తి చేసిన తర్వాతే చివరికి ఆయన వారిని వారి శత్రువులకు విడిచిపెడతాడు. అప్పటికి కూడా ఆయన, వారి మధ్యనున్న నమ్రతగల వ్యక్తులను తిరస్కరించడు.

7, 8. యెహోవా యొక్క లోబడనొల్లని ప్రజలు ఆయనకు ఏ యే విధాలుగా కోపం తెప్పించారు?

7 లోబడనొల్లని యూదులు తమ అవమానకరమైన ప్రవర్తనతో యెహోవాకు మళ్ళీ మళ్ళీ కోపం తెప్పిస్తున్నారు. యెహోవా వారి అసహ్యమైన చర్యలను ఇలా వర్ణిస్తున్నాడు: ‘వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు, నా భయములేక [“నా కళ్ళెదుటే,” పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం] నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు, వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు, అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి; వారు​—⁠మా దాపునకు రావద్దు. ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు.’ (యిషయా 65:​3-5) పైకి భక్తిపరుల్లా కనిపిస్తున్న వీరు యెహోవా “కళ్ళెదుటే” ఆయనకు అభ్యంతరం కలిగించే క్రియలు చేస్తున్నారు, ఈ పదం తృణీకారభావాన్ని, అగౌరవాన్ని సూచిస్తుండవచ్చు. వారు తమ అసహ్య కార్యములను దాచుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించరు. గౌరవించబడడానికి, విధేయత చూపించబడడానికి అర్హుడైనవాని సన్నిధిలోనే పాపాలు చేయడం ప్రాముఖ్యంగా గద్దించవలసిన విషయం కాదా?

8 ఒక విధంగా, స్వనీతిమంతులైన ఈ పాపులు, ఇతర యూదులకు ఇలా చెబుతున్నారు: ‘మేము మీకన్నా పరిశుద్ధులం గనుక దూరంగా ఉండండి.’ ఎంతటి వేషధారణ! ఈ “భక్తిపరులు” అబద్ధ దేవతలకు బలులు అర్పిస్తూ, ధూపము వేస్తున్నారు, దీన్ని దేవుని ధర్మశాస్త్రం ఖండిస్తోంది. (నిర్గమకాండము 20:​2-6) వారు సమాధులలో కూర్చుంటున్నారు, ధర్మశాస్త్రం ప్రకారం ఇది వారిని అపవిత్రులను చేస్తుంది. (సంఖ్యాకాండము 19:​14-16) వారు పంది మాంసము తింటున్నారు, అది అపవిత్రమైన ఆహారం. a (లేవీయకాండము 11: 7) అయినప్పటికీ, వారి మతపరమైన కార్యకలాపాలు వారు తాము ఇతర యూదులకన్నా పరిశుద్ధులమని భావించేలా చేస్తాయి, ఇతర ప్రజలు తమతో సహవసించినంతనే వారు పరిశుద్ధమైపోకుండా లేదా పవిత్రమైపోకుండా అన్నట్లుగా వారు తమ నుండి దూరంగా ఉండాలని కోరుకుంటారు. అయితే “సంపూర్ణభక్తిని” కోరే దేవుడు విషయాలను ఎంతమాత్రం అలా చూడడం లేదు!​—⁠ద్వితీయోపదేశకాండము 4:​24, NW.

9. స్వనీతిమంతులైన పాపులను యెహోవా ఎలా దృష్టిస్తున్నాడు?

9 యెహోవా ఈ స్వనీతిమంతులను పరిశుద్ధులుగా పరిగణించే బదులు, “నా నాసికారంధ్రములకు పొగవలె” ఉన్నారని అంటున్నాడు. “ముక్కు” లేదా “నాసికారంధ్రము” అనే దానికి ఉపయోగించబడే హీబ్రూ పదం తరచూ ఆగ్రహం అనే పదానికి ఆలంకారికంగా ఉపయోగించబడుతుంది. పొగ కూడా యెహోవా కోపాగ్నితో సంబంధం కలిగి ఉంది. (ద్వితీయోపదేశకాండము 29:​20) యెహోవా ప్రజలు ఏ అసహ్యకరమైన విగ్రహారాధనలో పడిపోయారో అది, యెహోవా కోపాగ్నిని రేకెత్తించింది.

10. యూదాలో ఉన్నవారు చేసిన పాపాలకు యెహోవా ఎలా ప్రతిఫలం ఇస్తాడు?

10 యెహోవా తన న్యాయాన్ని బట్టి, ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తున్న వీరిని శిక్షించకుండా విడిచిపెట్టలేడు. యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠నా యెదుట గ్రంథములో అది వ్రాయబడియున్నది. ప్రతికారముచేయక నేను మౌనముగా నుండను; నిశ్చయముగా వారనుభవించునట్లు నేను వారికి ప్రతికారము చేసెదను. నిశ్చయముగా మీ దోషములనుబట్టియు మీ పితరుల దోషములనుబట్టియు అనగా పర్వతములమీద ఈ జనులు ధూపమువేసిన దానినిబట్టియు కొండలమీద నన్ను దూషించినదానినిబట్టియు మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతికారము కొలిచి పోయుదును.” (యెషయా 65:​6, 7) అబద్ధ ఆరాధనలో భాగం వహించడం ద్వారా ఈ యూదులు యెహోవాను దూషించారు. వారు తమ చుట్టూవున్న అన్యజనుల ఆరాధన కంటే సత్య దేవుని ఆరాధన మెరుగైనదేమీ కాదన్నట్లు కనిపించేలా చేశారు. యెహోవా అందుకే విగ్రహారాధన, అభిచారములతో సహా వారి “దోషములనుబట్టి” వారికి ప్రతికారము “వారి ఒడిలోనే” కొలిచి పోస్తాడు. అమ్మేవారు కూడా తమ ఉత్పాదనను “ఒడిలోనే” కొలిచి పోస్తారు. (లూకా 6:​38) స్పష్టంగా దాని భావమేమిటంటే, మతభ్రష్ట యూదులకు యెహోవా “ప్రతికారము” లేదా శిక్ష కొలిచి పోస్తాడు. న్యాయకర్తయైన దేవుడు ప్రతిఫలాన్ని కోరతాడు. (కీర్తన 79:​12; యిర్మీయా 32:​18) యెహోవా మారడు గనుక, ఆయన తన నిర్ణీత సమయంలో ఈ దుష్టవిధానంపైకి కూడా అలాగే శిక్షను కొలిచి పోస్తాడు.​—⁠మలాకీ 3: 6.

‘నా సేవకులను బట్టి’

11. ఒక నమ్మకమైన శేషమును తాను రక్షిస్తానని యెహోవా ఎలా సూచిస్తున్నాడు?

11 యెహోవా తన ప్రజల మధ్యనున్న నమ్మకమైన వారిపట్ల కనికరం చూపిస్తాడా? యెషయా ఇలా వివరిస్తున్నాడు: “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠ద్రాక్షగెలలో క్రొత్తరసము కనబడునప్పుడు జనులు​—⁠అది దీవెనకరమైనది దాని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా? నా సేవకులనందరిని నేను నశింపజేయకుండునట్లు వారినిబట్టి నేనాలాగే చేసెదను. యాకోబునుండి సంతానమును యూదానుండి నా పర్వతములను స్వాధీనపరచుకొనువారిని పుట్టించెదను; నేను ఏర్పరచుకొనినవారు దాని స్వతంత్రించుకొందురు, నా సేవకులు అక్కడ నివసించెదరు.” (యెషయా 65:​8, 9) యెహోవా తన ప్రజలను ద్రాక్షగెలతో పోల్చడంలో, వారు సులభంగా అర్థం చేసుకోగల ఉపమానాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. దేశంలో ద్రాక్షలు సమృద్ధిగా ఉన్నాయి, ద్రాక్షపండ్ల నుండి తయారుచేసిన ద్రాక్షారసము మానవజాతికి ఒక దీవెన. (కీర్తన 104:​15) ఇక్కడ అందజేయబడుతున్న చిత్రం, అన్నీ కాదు గానీ కొన్ని మాత్రమే మంచి ద్రాక్షపండ్లు ఉన్న ద్రాక్షగెలను గురించినదై ఉండవచ్చు. లేదా, దాని ద్వారా తెలియజేయబడుతున్న తలంపు, ఒక గెల మంచిది ఇతర గెలలు పండనివి లేదా పాడైపోయినవి అన్నది కావచ్చు. విషయమేదైనప్పటికీ, ద్రాక్షతోట మాలి మంచి ద్రాక్షలను నాశనం చేయడు. అలాగే తాను ఆ జనమును సంపూర్ణంగా నాశనం చేయను గానీ నమ్మకమైన ఒక శేషమును ఉంచుతానని యెహోవా తన ప్రజలకు ధైర్యం చెబుతున్నాడు. అనుగ్రహం పొందిన ఈ శేషము ఆయన “పర్వతములను” అంటే యెహోవా తనవని చెప్పుకుంటున్న యెరూషలేమును, కొండ ప్రాంతమైన యూదా దేశాన్ని స్వాస్థ్యంగా పొందుతుందని ఆయన పేర్కొంటున్నాడు.

12. నమ్మకమైన శేషము కోసం ఏ ఆశీర్వాదములు వేచి ఉన్నాయి?

12 ఈ నమ్మకమైన శేషము కోసం ఏ ఆశీర్వాదములు వేచి ఉన్నాయి? యెహోవా ఇలా వివరిస్తున్నాడు: “నన్నుగూర్చి విచారణచేసిన నా ప్రజలనిమిత్తము షారోను గొఱ్ఱెల మేతభూమియగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును.” (యెషయా 65:​10) చాలామంది యూదుల జీవితాల్లో పశువుల మందలు ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహిస్తాయి, విస్తారమైన మేతస్థలాలు సమాధానకరమైన కాలాల్లో సమృద్ధి కలగడానికి సహాయం చేస్తాయి. సమాధాన సమృద్దిలను చిత్రీకరించడానికి యెహోవా ఆ దేశం యొక్క రెండు దిశల్లోని ప్రాంతాలను పేర్కొన్నాడు. ఆ దేశపు పశ్చిమ దిశలోవున్న షారోను సమభూమి సౌందర్యానికీ ఫలసమృద్ధికీ పేరుపొందింది, అది మధ్యధరా తీర ప్రాంతం వరకూ వ్యాపించి ఉంది. ఈశాన్య సరిహద్దులోని కొంత భాగంలో ఆకోరు లోయ ఉంది. (యెహోషువ 15: 7) రానున్న చెర సమయంలో, ఈ ప్రాంతం దేశంలోని మిగతా ప్రాంతాలతోపాటు పాడుగా విడువబడుతుంది. అయితే, చెర ముగిసిన తర్వాత, తిరిగి వస్తున్న శేషము కోసం అవి అందమైన పచ్చిక బయళ్ళుగా మారుతాయని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు.​—⁠యెషయా 35: 2; హోషేయ 2:​15.

“అదృష్టము”ను నమ్ముకోవడం

13, 14. దేవుని ప్రజలు ఆయనను విడిచిపెట్టారని ఏ ఆచారాలు చూపిస్తున్నాయి, ఫలితంగా వారికి ఏమి జరుగుతుంది?

13 యెషయా ప్రవచనం ఇప్పుడు, యెహోవాను విడిచిపెట్టి విగ్రహారాధన చేయడంలో కొనసాగుతున్న వారి వైపుకు మరలుతుంది. అదిలా చెబుతుంది: “యెహోవాను విసర్జించి నా పరిశుద్ధపర్వతమును మరచి గాదునకు [“అదృష్టమునకు,” అధస్సూచి] బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా!” (యిషయా 65:​11) దిగజారిపోతున్న ఈ యూదులు, “అదృష్టమునకు,” “అదృష్టదేవికి” ఆహారపానీయాల బల్లను సిద్ధపరచడం ద్వారా అన్యజనుల విగ్రహారాధనా ఆచారాల్లో పడిపోయారు. b ఆ దేవుళ్ళను మూర్ఖంగా నమ్ముకునే వారెవరికైనా ఏమవుతుంది?

14 యెహోవా సూటిగా వారినిలా హెచ్చరిస్తాడు: “నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైనదాని చేసితిరి నాకిష్టము కానిదాని కోరితిరి; నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును; మీరందరు వధకు లోనగుదురు.” (యెషయా 65:​12) ఆదిమ హీబ్రూ భాషలో అదృష్ట దేవి పేరును అపహాస్యం చేస్తూ, ఆ అబద్ధ దేవతను ఆరాధిస్తున్నవారికి ‘ఖడ్గము అదృష్టముగా నియమింపబడుతుంది’ అంటే వారు నాశనం చేయబడతారు అని యెహోవా చెబుతున్నాడు. పశ్చాత్తాపపడమని యెహోవా వీరికి తన ప్రవక్తల ద్వారా పలుమారులు చెప్పాడు గానీ వారు ఆయనను అలక్ష్యం చేసి, ఆయన దృష్టికి చెడు అని తమకు తెలిసిన దాన్ని చేయడానికే మొండిగా ఎంపిక చేసుకున్నారు. వారు దేవుని పట్ల ఎంత తిరస్కారాన్ని చూపిస్తున్నారో కదా! దేవుని హెచ్చరిక నెరవేర్పుగా, సా.శ.పూ. 607 లో బబులోనీయులు యెరూషలేమును, దాని ఆలయాన్ని నాశనం చేయడానికి యెహోవా అనుమతించినప్పుడు ఆ జనము గొప్ప విపత్తును ఎదుర్కొంటుంది. ఆ సమయంలో “అదృష్టము” యూదా, యెరూషలేములలో ఉన్న తన భక్తులను కాపాడలేకపోతుంది.​—⁠2 దినవృత్తాంతములు 36:​17.

15. నిజక్రైస్తవులు నేడు యెషయా 65:11, 12 వచనాల్లో కనిపించే హెచ్చరికను ఏ విధంగా లక్ష్యపెడతారు?

15 నేడు నిజక్రైస్తవులు యెషయా 65:​11, 12 వచనాల్లో కనిపించే హెచ్చరికను లక్ష్యపెడతారు. ఆశీర్వాదాలను కుమ్మరించగల ఒక విధమైన సహజాతీత శక్తి ఉందని గానీ “అదృష్టము” అనేదానిని గానీ వారు నమ్మరు. “అదృష్టము”ను శాంతపరచే ప్రయత్నం చేయడానికి, తమ వస్తుసంపదలను దుబారా చేసుకోరు, వారు అన్ని రకాలైన జూదములకు దూరంగా ఉంటారు. ఈ దేవునికి తమను తాము సమర్పించుకునేవారు చివరికి అంతా పోగొట్టుకుంటారని వారు పూర్తిగా ఒప్పించబడ్డారు, ఎందుకంటే “నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును” అని యెహోవా అలాంటి వారికి చెబుతున్నాడు.

‘ఆలకించుడి! నా సేవకులు సంతోషించెదరు’

16. యెహోవా తన నమ్మకమైన సేవకులను ఏ యే విధాలుగా ఆశీర్వదిస్తాడు, కానీ ఆయనను విడనాడిన వారికి ఏమి జరుగుతుంది?

16 యెహోవాను విడనాడినవారిని గద్దించడంలో భాగంగా ఈ ప్రవచనం, యథార్థతతో దేవుడ్ని ఆరాధించేవారి కోసమూ వేషధారణతో ఆయనను ఆరాధించేవారి కోసమూ వేచి ఉన్న పరస్పర విరుద్ధమైన వాటాలను వర్ణిస్తోంది: “ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠ఆలకించుడి! నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు. నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు, మనో దుఃఖముచేత ప్రలాపించెదరు.” (యెషయా 65:​13, 14) యెహోవా తన నమ్మకమైన సేవకులను ఆశీర్వదిస్తాడు. ఆనందం పొంగిపొరలుతున్న హృదయాలతో వారు కేకలు వేస్తారు. తినడం, త్రాగడం, ఆనందించడం అనే పదాలు, యెహోవా తన ఆరాధకుల అవసరాలను సమృద్ధిగా తీరుస్తాడని సూచిస్తాయి. దానికి భిన్నంగా, యెహోవాను విడనాడడానికి ఎంపిక చేసుకున్నవారు ఆధ్యాత్మికంగా ఆకలి దప్పులను అనుభవిస్తారు. వారి అవసరాలు తీర్చబడవు. వారు తమపైకి వచ్చే బాధావేదనల వలన ఏడుస్తారు, ప్రలాపిస్తారు.

17. దేవుని ప్రజలు నేడు ఆనందముతో కేకలు వేయడానికి ఎందుకు మంచి కారణం ఉంది?

17 నేడు దేవుని సేవ చేస్తున్నామని పేరుకు మాత్రం చెప్పుకునే వారి ఆధ్యాత్మిక స్థితిని యెహోవా మాటలు చక్కగా వర్ణిస్తాయి. అయితే, క్రైస్తవమత సామ్రాజ్యంలోని లక్షలాదిమంది బాధావేదనలను అనుభవిస్తుంటే యెహోవా ఆరాధకులు హృదయానందముచేత కేకలు వేస్తారు. ఆనందించడానికి వారికి మంచి కారణమే ఉంది. ఆధ్యాత్మికంగా వారికి చక్కని ఆహారం ఇవ్వబడుతోంది. బైబిలు ఆధారిత ప్రచురణల ద్వారా, క్రైస్తవ కూటాల ద్వారా యెహోవా వారికి ఆధ్యాత్మిక ఆహారాన్ని పుష్కలంగా అనుగ్రహిస్తున్నాడు. నిజంగా, దేవుని వాక్యంలోని ప్రోత్సాహకరమైన సత్యాలు, ఓదార్పుకరమైన వాగ్దానాలు మనకు “హృదయానందము”ను ఇస్తాయి!

18. యెహోవాను విడనాడిన వారికి కేవలం ఏమి మిగిలి ఉంటుంది, వారి పేరును శాపవచనముగా ఉపయోగించడం ఏమి సూచించవచ్చు?

18 యెహోవా తనను విడనాడిన వారిని ఉద్దేశించి చెప్పడం కొనసాగిస్తాడు: “నేనేర్పరచుకొనినవారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు, ప్రభువగు యెహోవా నిన్ను హతముచేయును, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును; దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును, దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును; పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును.” (యెషయా 65:​15, 16) యెహోవాను విడనాడిన వారికి మిగిలి ఉండేదల్లా వారి పేరు మాత్రమే, అది ఒక ప్రమాణముగా లేదా శాపవచనముగా మాత్రమే ఉపయోగించబడుతుంది. దాని భావమేమిటంటే, ఎవరైనా ఒక ప్రమాణం ద్వారా గంభీరమైన విధంగా తమను తాము కట్టుబడేలా చేసుకోవాలనుకుంటే, ఒక విధంగా వారిలా చెబుతారు: ‘నేను గనుక ఈ వాగ్దానాన్ని నెరవేర్చకపోతే, ఆ మతభ్రష్టులు పొందిన శిక్షను అనుభవించుదును గాక.’ వారి పేరు సొదొమ గొమొర్రా పేర్లలా ఉపమానరీతిగా, దుష్టులకు దేవుడు విధించే శిక్షకు ప్రతీకగా ఉపయోగించబడుతుందని కూడా దాని భావం కావచ్చు.

19. దేవుని సేవకులు వేరొక పేరుతో ఎలా పిలువబడతారు, వారికి నమ్మదగిన దేవునిపై విశ్వాసం ఎందుకు ఉంటుంది? (అధస్సూచి కూడా చూడండి.)

19 దేవుని సొంత సేవకులకు లభించే వాటా ఎంత భిన్నంగా ఉంటుందో కదా! వారు వేరొక పేరుతో పిలువబడతారు. వారు తమ స్వదేశానికి తిరిగి వచ్చి అనుభవించే ఆశీర్వాదకరమైన స్థితిని, గౌరవాన్ని అది సూచిస్తోంది. వారు ఏ అబద్ధ దేవుని నుండి ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రయత్నించరు లేదా ఏ నిర్జీవ విగ్రహం పేరున ప్రమాణం చేయరు. బదులుగా, వారు తమకు ఆశీర్వాదము కలగాలని కోరుకున్నప్పుడు లేదా ప్రమాణం చేసినప్పుడు, వారు నమ్మదగిన దేవుని పేరున అలా చేస్తారు. ఆ దేశవాసులకు దేవునిపై పూర్తి నమ్మకం కలిగి ఉండడానికి కారణం ఉంటుంది, ఎందుకంటే ఆయన తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చేవాడని నిరూపించుకుని ఉంటాడు. c యూదులు తమ స్వదేశంలో సురక్షితంగా ఉండి, త్వరలోనే తమ గత వేదనలను మరచిపోతారు.

“నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను”

20. “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని” గురించిన యెహోవా వాగ్దానం సా.శ.పూ. 537 లో ఎలా నెరవేరింది?

20 పశ్చాత్తాపపడుతున్న శేషము బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత వారిని పునఃస్థాపిస్తాననే తన వాగ్దానం గురించి యెహోవా ఇప్పుడు మరింత వివరంగా తెలియజేస్తున్నాడు. యెషయా ద్వారా యెహోవా ఇలా చెబుతున్నాడు: “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను; మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు.” (యెషయా 65:​17) పునఃస్థాపనను గురించిన యెహోవా వాగ్దానం తప్పక నెరవేరుతుంది, అందుకే ఆయన భవిష్యద్‌ పునఃస్థాపన అప్పటికే జరుగుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఈ ప్రవచనం మొదట, సా.శ.పూ. 537 లో, యూదా శేషము యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు నెరవేరింది. ఆ సమయంలో “క్రొత్త ఆకాశము” ఏమిటి? అది, జెరుబ్బాబెలు పరిపాలన. ఆ పరిపాలనకు ప్రధాన యాజకుడైన యెహోషువ మద్దతు ఉండేది, అది యెరూషలేములో కేంద్రీకృతమై ఉండేది. పునఃస్థాపించబడిన యూదా శేషము “క్రొత్త భూమి”గా అంటే పరిశుభ్రపరచబడిన సమాజంగా రూపొందింది, అది అలాంటి పరిపాలనకు లోబడి ఆ దేశంలో స్వచ్ఛారాధన పునఃస్థాపించబడడానికి సహాయం చేసింది. (ఎజ్రా 5:​1, 2) ఆ పునఃస్థాపన యొక్క ఆనందం గత బాధలన్నిటిని మరిపించింది; మునుపటి వేదనలు మళ్ళీ జ్ఞాపకం రాలేదు.​—⁠కీర్తన 126: 1, 2.

21. ఏ క్రొత్త ఆకాశములు 1914 లో ఉనికిలోకి వచ్చాయి?

21 అయితే, పేతురు యెషయా ప్రవచనాన్ని పునరుద్ఘాటించి, దానికి భవిష్యద్‌ నెరవేర్పు ఉన్నట్లు చూపించాడని గుర్తు తెచ్చుకోండి. అపొస్తలుడు ఇలా వ్రాశాడు: “అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:​13) ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న క్రొత్త ఆకాశములు 1914 లో ఉనికిలోకి వచ్చాయి. ఆ సంవత్సరంలో జన్మించిన మెస్సీయ రాజ్యం పరలోకం నుండే పరిపాలిస్తుంది, యెహోవా దానికి మొత్తం భూమిపైన అధికారాన్ని ఇచ్చాడు. (కీర్తన 2:​6-8) క్రీస్తు క్రింద, ఆయన 1,44,000 సహపరిపాలకుల క్రింద ఉన్న ఈ రాజ్య ప్రభుత్వమే క్రొత్త ఆకాశములు.​—⁠ప్రకటన 14: 1.

22. క్రొత్త భూమిగా ఎవరు రూపొందుతారు, ఆ ఏర్పాటు యొక్క కేంద్రకంగా తయారయ్యేందుకు ఇప్పుడు కూడా ప్రజలు ఎలా సిద్ధం అవుతున్నారు?

22 క్రొత్త భూమి మాటేమిటి? ప్రాచీన నెరవేర్పు మాదిరిగానే క్రొత్త పరలోక ప్రభుత్వ పరిపాలనకు ఆనందంగా లోబడి ఉండే ప్రజలతో క్రొత్త భూమి రూపొందించబడుతుంది. ఇప్పుడు కూడా, నిత్యజీవం పట్ల సరైన మానసిక వైఖరిగల లక్షలాదిమంది ఈ ప్రభుత్వానికి లోబడి ఉంటూ, బైబిలులోని సూత్రాలను అనుసరించడానికి కృషి చేస్తున్నారు. వీరు అన్ని జాతీయతలు, భాషలు, జాతుల నుండి వచ్చారు, రాజుగా పరిపాలిస్తున్న యేసుక్రీస్తు సేవ చేయడానికి వారు కలిసి పనిచేస్తారు. (మీకా 4:​1-4) ప్రస్తుత దుష్ట విధానం గతించిపోయిన తర్వాత, ఈ గుంపు ఒక క్రొత్త భూమి యొక్క కేంద్రకంగా ఏర్పడుతుంది, అది చివరకు దేవుని రాజ్యపు భూలోకాన్ని స్వతంత్రించుకునే దైవభయంగల మానవ భూగోళవ్యాప్త సమాజంగా తయారవుతుంది.​—⁠మత్తయి 25:​34.

23. ‘క్రొత్త ఆకాశము, క్రొత్త భూమికి’ సంబంధించి ప్రకటన గ్రంథంలో మనం ఏ సమాచారాన్ని కనుగొంటాము, ఈ ప్రవచనం ఎలా నెరవేరుతుంది?

23 ఈ విధానం నిర్మూలించబడినప్పుడు రానున్న యెహోవా దినాన్ని గురించి అపొస్తలుడైన యోహాను చూసిన ఒక దర్శనాన్ని ప్రకటన గ్రంథం వర్ణిస్తోంది. దాని తర్వాత సాతాను అగాధంలో పడవేయబడతాడు. (ప్రకటన 19:11-20: 3) ఆ వర్ణన తర్వాత యోహాను ఇలా వ్రాస్తూ యెషయా ప్రవచన మాటలను ప్రతిధ్వనింపజేస్తున్నాడు: “నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని.” ఈ మహిమాన్విత దర్శనాన్ని గురించిన వృత్తాంతంలోని తర్వాతి వచనాలు, యెహోవా దేవుడు ఈ భూమిపై పరిస్థితులు చక్కబడేలా విపరీతమైన మార్పు కలుగజేసే సమయం గురించి చెబుతాయి. (ప్రకటన 21:​1, 3-5) స్పష్టంగా, “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని” గురించిన యెషయా వాగ్దానం దేవుని నూతనలోకంలో అద్భుతంగా నెరవేరుతుంది! క్రొత్త ప్రభుత్వ ఆకాశముల క్రింద, ఒక క్రొత్త భూసంబంధమైన సమాజం ఆధ్యాత్మికమైన భౌతిక పరదైసును ఆనందిస్తుంది. ‘మునుపటివి [రోగాలు, బాధలు, మానవులు ఎదుర్కొనే ఇతర అనేక శ్రమలు] మరువబడును, జ్ఞాపకమునకు రావు’ అనే వాగ్దానం నిజంగా ఎంతో ఓదార్పుకరమైనది. అప్పుడు మనకు ఏదైనా జ్ఞాపకం వచ్చినా అది, ఇప్పుడు అనేకులను మానసికంగా కృంగదీస్తున్నటువంటి తీవ్రమైన బాధను వేదనను మనకు కలిగించదు.

24. యెరూషలేము పునఃస్థాపించబడడాన్ని బట్టి యెహోవా ఎందుకు ఆనందిస్తాడు, ఆ నగర వీధుల్లో ఏది ఇక వినిపించదు?

24 యెషయా ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను, నా జనులనుగూర్చి హర్షించెదను; రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు.” (యెషయా 65:​18, 19) తాము తమ స్వదేశానికి తిరిగి తీసుకురాబడినందుకు యూదులు ఆనందించడమే కాదు దేవుడు కూడా ఆనందిస్తాడు, ఎందుకంటే ఆయన యెరూషలేమును సుందరంగా అంటే భూమిపై మరోసారి సత్యారాధనకు కేంద్రంగా చేస్తాడు. దశాబ్దాల క్రితం ఆ నగర వీధుల్లో వినిపించిన, విపత్తును బట్టి కలిగిన రోదనధ్వని ఇక వినిపించదు.

25, 26. (ఎ) మన కాలంలో, యెహోవా యెరూషలేమును “ఆనందకరమైన స్థలముగా” ఎలా చేస్తాడు? (బి) యెహోవా నూతన యెరూషలేమును ఎలా ఉపయోగించుకుంటాడు, మనం నేడు ఎందుకు హర్షించవచ్చు?

25 నేడు కూడా, యెహోవా యెరూషలేమును “ఆనందకరమైన స్థలముగా” చేస్తాడు. ఎలా? మనం ఇప్పటికే చూసినట్లుగా, 1914 లో ఉనికిలోకి వచ్చిన క్రొత్త ఆకాశములలో చివరికి 1,44,000 మంది సహపరిపాలకులు ఉంటారు, వారు పరలోక ప్రభుత్వంలో భాగం వహిస్తారు. వీరు ప్రవచనార్థకంగా “నూతనమైన యెరూషలేము” అని వర్ణించబడుతున్నారు. (ప్రకటన 21: 2) నూతన యెరూషలేముకు సంబంధించే దేవుడు ఇలా చెబుతున్నాడు: “నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించుచున్నాను.” విధేయులైన మానవజాతిపై చెప్పలేనన్ని ఆశీర్వాదములను కుమ్మరించడానికి దేవుడు నూతన యెరూషలేమును ఉపయోగించుకుంటాడు. యెహోవా ‘[మన] హృదయవాంఛలను’ తీరుస్తాడు గనుక రోదనధ్వని లేదా విలాపధ్వని ఇక వినిపించవు.​—⁠కీర్తన 37: 3, 4.

26 నిజంగా, నేడు మనం ఆనందించడానికి ప్రతి కారణం ఉంది! త్వరలోనే యెహోవా వ్యతిరేకులనందరినీ నాశనం చేయడం ద్వారా తన విశిష్టమైన నామమును పరిశుద్ధపరచుకుంటాడు. (కీర్తన 83:​17, 18) అప్పుడు సమస్తము క్రొత్త ఆకాశముల ఆధీనంలో ఉంటాయి. దేవుడు సృజిస్తున్న దాని గూర్చి ఎల్లప్పుడు హర్షించి ఆనందించడానికి ఎంత అద్భుతమైన కారణాలో కదా!

సురక్షితమైన భవిష్యత్తును గూర్చిన వాగ్దానం

27. తిరిగివస్తున్న యూదులు తమ స్వదేశంలో అనుభవించే భద్రతను యెషయా ఏ విధంగా వర్ణిస్తున్నాడు?

27 మొదటి నెరవేర్పులో, తిరిగి వస్తున్న యూదులకు క్రొత్త ఆకాశముల క్రింద జీవితం ఎలా ఉంటుంది? యెహోవా ఇలా చెబుతున్నాడు: “అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు, కాలమునిండని ముసలివారుండరు; బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చనిపోవుదురు; పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును.” (యెషయా 65:​20) తిరిగి వచ్చే బంధీలు పునఃస్థాపించబడిన తమ స్వదేశంలో అనుభవించే భద్రత యొక్క ఎంత అందమైన చిత్రం అది! కేవలం కొద్ది రోజుల నవజాత శిశువును అకాల మరణం పొట్టనబెట్టుకోదు. అలాంటి మరణం, పూర్తి జీవితాయుష్షును అనుభవించని వయోజనుడ్ని కబళించదు. యూదాకు తిరిగి వచ్చే యూదులకు యెషయా మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయో కదా! వారు తమ స్వదేశంలో సురక్షితంగా ఉండి, శత్రువులు తమ పసిబిడ్డలను ఎత్తుకుపోతారేమో లేదా తమ పురుషులను వధిస్తారేమో అని చింతించవలసిన అవసరం ఉండదు.

28. యెహోవా మాటల నుండి, ఆయన రాజ్యము క్రింద నూతనలోకంలో జీవితాన్ని గురించి మనం ఏమి తెలుసుకుంటాము?

28 రాబోయే నూతనలోకంలో జీవితం గురించి యెహోవా మాటలు మనకు ఏమి చెబుతున్నాయి? దేవుని రాజ్యము క్రింద ప్రతి బిడ్డకు సురక్షితమైన భవిష్యత్తును గురించిన నిరీక్షణ ఉంటుంది. దైవ భయంగల ఏ వ్యక్తినీ అతని యౌవనంలో మృత్యువు కబళించదు. అందుకు భిన్నంగా, విధేయులైన మానవజాతి భద్రంగా, సురక్షితంగా జీవితాన్ని ఆనందించగలుగుతుంది. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఎంపిక చేసుకునే వారి మాటేమిటి? అలాంటి వారు జీవించే ఆధిక్యతను పోగొట్టుకుంటారు. తిరుగుబాటు చేసే పాపి “నూరు సంవత్సరముల వయస్సుగల” వాడైనా, అతడు మరణిస్తాడు. అలాంటి సందర్భంలో, అతడు అయ్యుండగల దానితో అంటే అతడు అనుభవించి ఉండగల అంతంలేని జీవితంతో పోలిస్తే అతడు ‘బాలుడు’ మాత్రమే అయ్యుంటాడు.

29. (ఎ) దేవునికి విధేయులయ్యే ప్రజలకు పునఃస్థాపిత యూదా దేశంలో ఏ ఆనందాలు లభిస్తాయి? (బి) వృక్షాలు దీర్ఘాయుష్షుకు ఎందుకు తగిన ఉపమానాలు? (అధస్సూచి చూడండి.)

29 పునఃస్థాపించబడిన యూదా దేశములో ప్రబలమై ఉండే పరిస్థితులను గురించిన తన వర్ణనను యెహోవా ఇలా కొనసాగిస్తున్నాడు: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు; ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు; వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును; నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.” (యెషయా 65:​21, 22) పాడుగా ఉన్న, ఇండ్లు ద్రాక్షతోటలు లేని యూదా దేశానికి తిరిగి వచ్చిన తర్వాత, దేవుని విధేయులైన ప్రజలకు తమ సొంత ఇండ్లలో నివసించే, తమ సొంత ద్రాక్షతోటల ఫలాలను తినే ఆనందం లభిస్తుంది. దేవుడు వారి పనిని ఆశీర్వదిస్తాడు, వారు వృక్ష్యాయుష్యమంత సుదీర్ఘమైన కాలంపాటు జీవిస్తారు, దానిలో వారు తమ శ్రమ ఫలాన్ని అనుభవిస్తారు. d

30. యెహోవా సేవకులు నేడు సంతోషభరితమైన ఎలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నారు, నూతనలోకంలో ఏమి అనుభవిస్తారు?

30 మన కాలంలో, ఈ ప్రవచనం నెరవేరింది. యెహోవా ప్రజలు 1919 లో ఆధ్యాత్మిక చెర నుండి బయటికి వచ్చి, తమ “దేశము”ను లేదా కార్యకలాపాల పరిధిని, ఆరాధనను పునఃస్థాపించడం ప్రారంభించారు. వారు సంఘాలను స్థాపించి, ఆధ్యాత్మిక పంటను పండించారు. ఫలితంగా, ఇప్పుడు కూడా యెహోవా ప్రజలు ఆధ్యాత్మిక పరదైసును, దేవుడిచ్చే సమాధానమును అనుభవిస్తున్నారు. అలాంటి సమాధానము భౌతిక పరదైసులోకి కొనసాగుతుందని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు. యెహోవా తన ఆరాధకుల ఇష్టపూర్వకమైన హృదయాలతో, హస్తాలతో నూతనలోకంలో ఏమి సాధిస్తాడనేది మనం కనీసం ఊహించనైనా ఊహించలేము. సొంత ఇంటిని నిర్మించుకొని దానిలో నివసించగలగడం ఎంత ఆనందంగా ఉంటుందో కదా! రాజ్య పరిపాలన క్రింద, సంతృప్తికరమైన పనికి కొదువ ఉండదు. మన కష్టార్జితమువలన ఎల్లప్పుడూ “సుఖమనుభవించుట” ఎంత ప్రతిఫలదాయకమో కదా! (ప్రసంగి 3:​13) మనం చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవించడానికి మనకు చాలినంత సమయం ఉంటుందా? తప్పకుండా! నమ్మకమైన మానవుల అంతంలేని జీవితాలు ‘వృక్షాయుష్యంలా’ ఉంటాయి​—⁠వేల సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ!

31, 32. (ఎ) తిరిగివస్తున్న బంధీలు ఏ ఆశీర్వాదాలను అనుభవిస్తారు? (బి) నూతనలోకంలో, నమ్మకమైన మానవులకు ఏ నిరీక్షణ ఉంటుంది?

31 తిరిగివస్తున్న బంధీల కోసం వేచివున్న మరిన్ని ఆశీర్వాదాలను యెహోవా వర్ణిస్తున్నాడు: “వారు వృథాగా ప్రయాసపడరు, ఆకస్మిముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు; వారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురు, వారి సంతానపువారు వారియొద్దనే యుందురు.” (యెషయా 65:​23) పునఃస్థాపించబడిన ఆ యూదులు యెహోవా చేత ఆశీర్వదించబడతారు, కాబట్టి వారు వృథాగా ప్రయాసపడరు. పిల్లలు అకాలమరణానికి గురయ్యేందుకు తల్లిదండ్రులు వారికి జన్మనివ్వరు. పునఃస్థాపన ఆశీర్వాదాలను అనుభవించేది మునుపటి బంధీలు మాత్రమే కాదు; వారి సంతానం కూడా వారితో ఉంటారు. తన ప్రజల అవసరాలను తీర్చాలని దేవుడు ఎంత ఆతృత కలిగి ఉన్నాడంటే, ఆయనిలా వాగ్దానం చేస్తున్నాడు: “వారికీలాగున జరుగును వారు వేడుకొనకమునుపు నేను ఉత్తరమిచ్చెదను; వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను.”​—యెషయా 65:​24.

32 రాబోయే నూతనలోకంలో యెహోవా ఈ వాగ్దానాలను ఎలా నెరవేరుస్తాడు? మనం వేచి చూడవలసిందే. యెహోవా అన్ని వివరాలు ఇవ్వలేదు గానీ నమ్మకమైన మానవులు మరెన్నడు “వృథాగా ప్రయాసపడరు” అని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు. హార్‌మెగిద్దోనును తప్పించుకొని జీవించే గొప్ప సమూహముకు, వారికి జన్మించే పిల్లలెవరికైనా సుదీర్ఘమైన, సంతృప్తిదాయకమైన జీవితాన్ని అంటే నిత్యజీవాన్ని పొందే నిరీక్షణ ఉంటుంది! పునరుత్థానమందు తిరిగి వచ్చేవారు, దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి ఎంపిక చేసుకునేవారు కూడా నూతనలోకంలో ఆనందాన్ని కనుగొంటారు. యెహోవా వారి అవసరాలను విని వాటికి ప్రతిస్పందిస్తాడు, చివరికి వాటిని ముందుగా గ్రహించి తగిన చర్య తీసుకుంటాడు. వాస్తవానికి, యెహోవా తన గుప్పిలి విప్పి “ప్రతి జీవి” యొక్క సరైన “కోరికను” తృప్తిపరుస్తాడు.​—⁠కీర్తన 145:​16.

33. యూదులు తమ స్వదేశానికి తిరిగివచ్చినప్పుడు, జంతువులు ఏ భావంలో సమాధానముగా ఉంటాయి?

33 వాగ్దానం చేయబడిన సమాధానము, భద్రత ఎంత విస్తృతమైన ప్రభావంగలవై ఉంటాయి? ప్రవచనంలోని ఈ భాగాన్ని యెహోవా ఇలా ముగిస్తున్నాడు: “తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును, సింహము ఎద్దువలె గడ్డి తినును; సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా 65:​25) నమ్మకమైన యూదా శేషము తమ స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, వారు యెహోవా కాపుదల క్రింద ఉంటారు. ఫలితంగా, సింహము యూదులకు గానీ వారి పశువులకు గానీ ఏ హాని చేయకుండా ఎద్దులా గడ్డి తింటున్నట్లు ఉంటుంది. ఈ వాగ్దానం “యెహోవా సెలవిచ్చుచున్నాడు” అనే మాటలతో ముగుస్తుంది గనుక అది తప్పక నెరవేరుతుంది. ఆయన మాటలు ఎల్లప్పుడూ నిజమవుతాయి!​—⁠యెషయా 55:​10, 11.

34. యెహోవా మాటలు నేడు, నూతనలోకంలోను అద్భుతంగా ఎలా నెరవేరుతాయి?

34 యెహోవా మాటలు నేడు సత్యారాధకుల మధ్య ఉత్తేజకరమైన విధంగా నెరవేరుతున్నాయి. దేవుడు 1919 నుండి తన ప్రజల ఆధ్యాత్మిక దేశాన్ని ఆధ్యాత్మిక పరదైసుగా మార్చి దాన్ని ఆశీర్వదించాడు. ఈ ఆధ్యాత్మిక పరదైసులోకి వచ్చేవారు తమ జీవితాల్లో గమనార్హమైన మార్పులను చేసుకుంటారు. (ఎఫెసీయులు 4:​22-24) ఒకప్పుడు మృగం వంటి వ్యక్తిత్వాలను కలిగివున్న వ్యక్తులు అంటే బహుశా తమ తోటివారిని తమ స్వలాభం కోసం ఉపయోగించుకున్న లేదా మరే విధంగానైనా బాధించిన వారు దేవుని ఆత్మ సహాయంతో, అవాంఛితమైన లక్షణాలను అధిగమించడంలో అభివృద్ధి సాధిస్తారు. ఫలితంగా, వారు తోటి విశ్వాసులతో సమాధానాన్ని, ఐక్యతను అనుభవిస్తారు. యెహోవా ప్రజలు ఇప్పుడు తమ ఆధ్యాత్మిక పరదైసులో అనుభవించే ఆశీర్వాదాలు భౌతిక పరదైసులోకి కూడా కొనసాగుతాయి, అక్కడ మానవుల మధ్యనే గాక జంతువులకు మానవులకు మధ్యన కూడా సమాధానం సర్వత్రా వ్యాపించి ఉంటుంది. “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని” దేవుడు మానవజాతికి ఇచ్చిన ఆది నియామకం ఆయన నియమిత సమయంలో సరిగ్గా నెరవేర్చబడుతుందని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు.​—⁠ఆదికాండము 1:​28.

35. ‘ఎల్లప్పుడు ఆనందించడానికి’ మనకు ప్రతి కారణం ఎందుకు ఉంది?

35 “క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని” సృజిస్తానని యెహోవా చేసిన వాగ్దానాన్ని బట్టి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామో కదా! ఆ వాగ్దానం సా.శ.పూ. 537 లో నెరవేరింది, నేడు మరింతగా నెరవేరుతోంది. ఈ రెండు నెరవేర్పులు విధేయులైన మానవజాతికి మహిమాన్వితమైన భవిష్యత్తు వైపుకు మార్గాన్ని సూచిస్తున్నాయి. యెషయా ప్రవచనం ద్వారా యెహోవా, తనను ప్రేమించే వారి కోసం వేచి ఉన్నదాన్ని మనలను దయతో ముందుగా రుచి చూడనిచ్చాడు. ‘నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు ఆనందించుడి’ అనే యెహోవా మాటలను లక్ష్యపెట్టడానికి మనకు నిజంగా ప్రతి కారణం ఉంది.​—⁠యెషయా 65:​18.

[అధస్సూచీలు]

a ఈ పాపులు మృతులతో సంభాషించడానికి ప్రయత్నిస్తూ సమాధుల వద్ద ఉన్నారని చాలామంది తలస్తారు. వారు పంది మాంసము తినడమన్నది విగ్రహారాధనతో సంబంధం కలిగి ఉండవచ్చు.

b ఈ వచనంపై వ్యాఖ్యానిస్తూ బైబిలు అనువాదకుడైన (సా.శ. నాలుగవ శతాబ్దంలో జన్మించిన) జెరోమ్‌, విగ్రహారాధకులు సంవత్సరంలోని చివరి నెల చివరి దినాన ఆచరించే ఒక ప్రాచీన ఆచారం గురించి చెబుతున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “వారు అప్పుడు ముగుస్తున్న సంవత్సరపు లేదా రాబోయే సంవత్సరపు ఫలసమృద్ధి విషయంలో అదృష్టం బాగుండేలా నిర్ధారించుకోవడానికి వివిధ రకాల ఆహారాలతోను, తియ్యని ద్రాక్షారసము కలిపిన పానీయార్పణముతోను బల్లను సిద్ధపరుస్తారు.”

c హీబ్రూ మసోరెటిక్‌ మూలపాఠంలోని యెషయా 65:16 వ వచనం ప్రకారం యెహోవా “ఆమెన్‌ దేవుడు.” “ఆమెన్‌” అంటే “అలాగే జరుగు గాక” లేదా “నిశ్చయంగా” అని భావం, ఏదైనా నిజమైనదనడానికి లేదా నిజం అవుతుందనడానికి అది ఒక ధృవీకరణ లేదా హామీ. యెహోవా తాను వాగ్దానం చేసేవాటన్నిటిని నెరవేర్చడం ద్వారా తాను చెప్పేది నిజమని చూపిస్తాడు.

d వృక్షాలు దీర్ఘాయుష్షుకు తగిన ఉపమానాలు ఎందుకంటే ఇంతవరకు మనకు తెలిసిన, దీర్ఘకాలం జీవించగలవాటిలో వృక్షాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఒలీవచెట్టు వందల సంవత్సరాలపాటు ఫలాలిస్తుంది, అది వెయ్యి సంవత్సరాలపాటు జీవించవచ్చు.

[అధ్యయన ప్రశ్నలు]

[389 వ పేజీలోని చిత్రం]

 వుని నూతన లోకంలో, మనం చేసికొనినదాని ఫలమును అనుభవించడానికి మనకు చాలినంత సమయం ఉంటుంది