కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మానసికంగా కృంగిపోయిన బంధీలకు నిరీక్షణా సందేశం

మానసికంగా కృంగిపోయిన బంధీలకు నిరీక్షణా సందేశం

పదహారవ అధ్యాయం

మానసికంగా కృంగిపోయిన బంధీలకు నిరీక్షణా సందేశం

యెషయా 55:​1-13

1. బబులోనులో బంధీలుగా ఉన్న యూదుల పరిస్థితిని వర్ణించండి.

 అది యూదా చరిత్రలో ప్రకాశహీనమైన కాలము. దేవుని నిబంధన ప్రజలు తమ స్వదేశం నుండి బలవంతంగా తీసుకువెళ్ళబడ్డారు, ఇప్పుడు వారు బబులోను చెరలో బాధననుభవిస్తున్నారు. అయితే తమ అనుదిన వ్యవహారాలను కొనసాగించుకొనేంత స్వేచ్ఛ వారికి ఇవ్వబడిందని అంగీకరించవలసిందే. (యిర్మీయా 29:​4-7) కొంతమంది వృత్తిపరమైన నైపుణ్యాలను సంపాదించుకున్నారు లేదా వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొన్నారు. a (నెహెమ్యా 3:​8, 31, 32) అయినప్పటికీ బంధీలుగా ఉన్న యూదులకు జీవితం అంత సులభంగా లేదు. వారు శారీరకంగా, ఆధ్యాత్మికంగా చెరలో ఉన్నారు. అదెలాగో మనం చూద్దాం.

2, 3. యూదులు యెహోవాను ఆరాధించే విషయంలో, వారి చెర ఎలాంటి ప్రభావం చూపించింది?

2 బబులోను సైన్యాలు సా.శ.పూ. 607 లో యెరూషలేమును నాశనం చేసినప్పుడు, వారు ఒక జనమును విధ్వంసం చేయడం కంటే ఎక్కువే చేశారు; వారు సత్యారాధనపై వేటు వేశారు కూడా. వారు యెహోవా ఆలయంలో ఉన్నవన్నీ దోచుకుని దాన్ని నాశనం చేసి, లేవీ గోత్రంలోని కొందరిని చంపేసి, కొందరిని బంధీలుగా తీసుకువెళ్ళి యాజకత్వ నిర్వహణ కుంటుపడేలా చేశారు. ఆరాధించడానికి ఆలయమూ, బలిపీఠమూ, వ్యవస్థీకృత యాజకత్వమూ లేనందువల్ల, ధర్మశాస్త్రం నిర్దేశించినట్లుగా సత్యదేవునికి బలులు అర్పించడం యూదులకు అసాధ్యమైపోయింది.

3 సున్నతి ఆచరణను పాటించడం ద్వారా, ధర్మశాస్త్రమును సాధ్యమైనంత మేరకు అనుసరించడం ద్వారా నమ్మకమైన యూదులు తమ మతపరమైన గుర్తింపును కాపాడుకోగలిగారు. ఉదాహరణకు, వారు నిషేధించబడిన ఆహారాల నుండి దూరంగా ఉండగలిగేవారు, సబ్బాతును ఆచరించగలిగేవారు. కానీ అలా చేయడంలో, వారు తమను బంధీలుగా తీసుకువెళ్ళినవారి అపహాస్యాన్ని ఎదుర్కోవలసి వచ్చేది, ఎందుకంటే బబులోనీయులు యూదుల మతాచారాలను మూర్ఖమైనవిగా దృష్టించేవారు. కీర్తనకర్త వ్రాసిన ఈ మాటల్లో, బంధీలుగా ఉన్నవారి కృంగిపోయిన మానసిక స్థితిని చూడవచ్చు: “బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చుచుంటిమి. వాటిమధ్యనున్న నిరవంజిచెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు​—⁠ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించినవారు​—⁠సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి.”​—⁠కీర్తన 137:​1-3.

4. యూదులు విడుదల కోసం ఇతర రాజ్యాల వైపు చూడడం ఎందుకు వ్యర్థం, కానీ సహాయం కోసం వారు ఎవరివైపు తిరుగవచ్చు?

4 బంధీలుగా ఉన్న యూదులు ఓదార్పు కోసం ఎవరివైపు తిరుగగలరు? వారికి రక్షణ ఎక్కడి నుండి లభిస్తుంది? ఖచ్చితంగా ఇరుగుపొరుగున ఉన్న ఏ రాజ్యాల నుండీ లభించదు! వారంతా బబులోను సైన్యాల ఎదుట అశక్తులే, చాలామందికి యూదులంటే శత్రుభావం ఉండేది. అంతమాత్రాన పరిస్థితి ఆశారహితంగా ఏమీ లేదు. స్వతంత్ర ప్రజలుగా ఉన్నప్పుడు వారు ఎవరిపై తిరుగుబాటు చేశారో ఆ యెహోవాయే, వారు చెరలో ఉన్నప్పటికీ దయతో వారికి ఒక ప్రోత్సాహకరమైన ఆహ్వానాన్ని ఇచ్చాడు.

“నీళ్లయొద్దకు రండి”

5. “నీళ్ల యొద్దకు రండి” అనే మాటల ప్రాముఖ్యతేమిటి?

5 బబులోనులో బంధీలుగా ఉన్న యూదులతో యెహోవా యెషయా ద్వారా ప్రవచనార్థకంగా ఇలా మాట్లాడుతున్నాడు: “దప్పిగొనినవారలారా! నీళ్లయొద్దకు రండి. రూకలులేనివారలారా! మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి.” (యిషయా 55: 1) ఈ మాటలు ఎంతో సూచనార్థక భావాన్ని కలిగివున్నాయి. ఉదాహరణకు, “నీళ్లయొద్దకు రండి” అనే ఆహ్వానాన్ని పరిశీలించండి. నీళ్ళు లేకుండా జీవనం అసాధ్యం. ఆ అమూల్యమైన ద్రవం లేకుండా, మానవులమైన మనం దాదాపు ఒక వారం రోజులు మాత్రమే జీవించగలుగుతాం. కాబట్టి, తన మాటలు బంధీలుగా ఉన్న యూదులపై చూపించే ప్రభావాన్ని సూచించడానికి యెహోవా నీళ్ళను సూచనార్థకంగా ఉపయోగించడం సముచితమైనదే. వేడి అధికంగా ఉన్న సమయాన చల్లని నీటిలా, ఆయన సందేశం వారిని సేదదీరుస్తుంది. సత్యం కోసం, నీతి కోసం వారికున్న దాహాన్ని తీరుస్తూ అది వారి మానసిక కృంగుదలను అంతం చేస్తుంది. చెర నుండి స్వేచ్ఛను పొందడమనే నిరీక్షణను అది వారిలో నింపుతుంది. అయినప్పటికీ, బంధీలుగా ఉన్న యూదులు దాని నుండి ప్రయోజనం పొందాలంటే దేవుడిచ్చే సందేశాన్ని త్రాగాలి అంటే, దానికి అవధానం ఇవ్వాలి, దాని అనుసారంగా చర్య తీసుకోవాలి.

6. యూదులు “ద్రాక్షారసమును పాలను” కొంటే వారు ఎలా ప్రయోజనం పొందుతారు?

6 యెహోవా “ద్రాక్షారసమును పాలను” కూడా ఇస్తున్నాడు. పాలు పిల్లల శరీరాలను బలపర్చి, వారు ఎదగడానికి దోహదపడతాయి. అలాగే, యెహోవా వాక్యం ఆయన ప్రజలను ఆధ్యాత్మికంగా బలపరిచి, ఆయనతో తమకున్న సంబంధాన్ని దృఢపరచుకోవడానికి వారికి సహాయం చేస్తుంది. మరి ద్రాక్షారసము మాటేమిటి? ద్రాక్షారసము సాధారణంగా పండుగ సందర్భాల్లో ఉపయోగించబడుతుంది. బైబిల్లో, అది సమృద్ధితోనూ ఆనందంతోనూ జతచేయబడింది. (కీర్తన 104:​15) “ద్రాక్షారసమును . . . కొనుడి” అని యెహోవా తన ప్రజలకు చెప్పడం ద్వారా, పూర్ణ హృదయంతో సత్యారాధన వైపుకు తిరిగితే వారు ‘నిశ్చయముగా సంతోషభరితులు’ అవుతారని హామి ఇస్తున్నాడు.​—⁠ద్వితీయోపదేశకాండము 16:​15; కీర్తన 19: 8; సామెతలు 10:​22.

7. యెహోవా బంధీల పట్ల చూపించిన సానుభూతి ఎందుకు గమనార్హమైనది, అది మనకు ఆయన గురించి ఏమి బోధిస్తుంది?

7 బంధీలుగా ఉన్న యూదులకు యెహోవా అలాంటి ఆధ్యాత్మిక ఉపశమనాన్నిస్తున్నాడంటే ఆయన ఎంత కనికరం గలవాడో కదా! అవిధేయత చూపించిన, తిరుగుబాటు చేసిన యూదా చరిత్రను మనం గుర్తు తెచ్చుకుంటే, ఆయన చూపించిన సానుభూతి ఎంతో గమనార్హమైనదని తెలుస్తుంది. వారు యెహోవా ఆమోదాన్ని పొందడానికి అర్హులేమీ కాదు. అయితే, కీర్తనకర్తయైన దావీదు శతాబ్దాల క్రితం ఇలా వ్రాశాడు: “యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు.” (కీర్తన 103:​8, 9) యెహోవా తన ప్రజలతో తనకున్న సంబంధాన్ని తెంచేసుకునే బదులు, సమాధానపడడం వైపుగా ఆయనే మొదటి అడుగు వేస్తున్నాడు. నిజంగా ఆయన “కనికరము చూపుటయందు సంతోషించు” దేవుడు.​—⁠మీకా 7:​18.

నమ్మకూడనివారిపై నమ్మకం ఉంచడం

8. చాలామంది యూదులు ఎవరి మీద నమ్మకం ఉంచారు, ఏ హెచ్చరిక చేయబడినప్పటికీ వారలా చేశారు?

8 అప్పటి వరకూ చాలామంది యూదులు రక్షణ కోసం యెహోవా మీద పూర్తి నమ్మకాన్ని ఉంచలేదు. ఉదాహరణకు, యెరూషలేము పతనానికి ముందు దాని పరిపాలకులు మద్దతుకోసం శక్తివంతమైన రాజ్యముల వైపు చూస్తూ, ఒక విధంగా చెప్పాలంటే, ఐగుప్తుతోనూ బబులోనుతోనూ వ్యభిచరించారు. (యెహెజ్కేలు 16:​26-29; 23:​15) మంచి కారణంతోనే యిర్మీయా వారినిలా హెచ్చరించాడు: “నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.” (యిర్మీయా 17: 5) అయినా, దేవుని ప్రజలు సరిగ్గా అదే చేశారు!

9. అనేకమంది యూదులు ఎలా ‘ఆహారము కానిదాని కొరకు రూకలు’ ఇస్తారు?

9 ఇప్పుడు వారు తాము ఎవరినైతే నమ్ముకున్నారో ఆ రాజ్యాల్లో ఒకదానికి బానిసలయ్యారు. వారు గుణపాఠం నేర్చుకున్నారా? చాలామంది నేర్చుకుని ఉండకపోవచ్చు, ఎందుకంటే యెహోవా ఇలా అడుగుతున్నాడు: “ఆహారము కానిదానికొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు?” (యెషయా 55:2ఎ) బంధీలుగా ఉన్న యూదులు యెహోవా మీద కాక మరెవరి మీదనైనా నమ్మకం ఉంచితే, వారు ‘ఆహారము కానిదానికొరకు రూకలిచ్చినట్లే’ అవుతుంది. తన వద్ద బంధీలుగా ఉన్నవారిని ఎన్నడూ తిరిగి తమ స్వదేశానికి వెళ్లనివ్వకపోవడమన్నది బబులోను సిద్ధాంతం గనుక, ఖచ్చితంగా వారికి విడుదల లభించదు. నిజానికి, బబులోనుకు చక్రవర్తిపాలన, వాణిజ్యం, అబద్ధ ఆరాధన ఉన్నప్పటికీ బంధీలుగా ఉన్న యూదులకు ఇవ్వడానికి మాత్రం దాని వద్ద ఏమీ లేదు.

10. (ఎ) బంధీలుగా ఉన్న యూదులు యెహోవా చెప్పేది వింటే ఆయన వారికి ఎలా ప్రతిఫలమిస్తాడు? (బి) యెహోవా దావీదుతో ఏ నిబంధన చేశాడు?

10 యెహోవా తన ప్రజలను ఇలా వేడుకుంటున్నాడు: “నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనియ్యుడి. చెవియొగ్గి నాయొద్దకు రండి. మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు, నేను మీతో నిత్యనిబంధన చేసెదను, దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.” (యెషయా 55:​2బి, 3) ఆధ్యాత్మికంగా కుపోషణకు గురైన ఈ ప్రజలకు ఏకైక నిరీక్షణ యెహోవాయే, ఆయనిప్పుడు యెషయా ద్వారా వారితో ప్రవచనార్థకంగా మాట్లాడుతున్నాడు. వారి జీవితాలు దేవుని సందేశాన్ని వినడంపై ఆధారపడి ఉన్నాయి, ఎందుకంటే వారలా చేస్తే వారు “బ్రదుకుదురు” అని ఆయన చెబుతున్నాడు. అయితే, తాను చెప్పేదానికి ప్రతిస్పందించేవారితో యెహోవా చేసే “నిత్య నిబంధన” ఏమిటి? ఆ నిబంధన “దావీదునకు చూపిన శాశ్వతకృప”కు సంబంధించినది. దావీదు సింహాసనం “నిత్యము స్థిరపరచబడును” అని యెహోవా ఆయనకు శతాబ్దాల క్రితం వాగ్దానం చేశాడు. (2 సమూయేలు 7:​16) కాబట్టి, ఇక్కడ ప్రస్తావించబడిన “నిత్య నిబంధన” పరిపాలనకు సంబంధించినది.

నిరంతర రాజ్యానికి శాశ్వత వారసుడు

11. దేవుడు దావీదుతో చేసిన వాగ్దాన నెరవేర్పు, బబులోనులో బంధీలుగా ఉన్నవారికి ఎప్పుడో సుదూర భవిష్యత్తులో జరిగేదిగా ఎందుకు అనిపిస్తుంది?

11 బంధీలుగా ఉన్న ఆ యూదులకు, దావీదు వంశ పరిపాలన అనే తలంపు ఎప్పుడో సుదూర భవిష్యత్తులో జరిగేదానిలా అనిపించి ఉండవచ్చునన్నది అంగీకరించవలసిందే. వారు తమ దేశాన్ని, చివరికి తమ జాతీయతను పోగొట్టుకున్నారు! కానీ అది కేవలం తాత్కాలికంగానే. యెహోవా దావీదుతో తాను చేసిన నిబంధనను మరచిపోలేదు. మానవ దృక్కోణం నుండి అది ఎంత అసాధ్యమైనదిగా అనిపించినా, దావీదు వంశంలో నిరంతర రాజ్యానికి సంబంధించిన దేవుని సంకల్పం మాత్రం తప్పక సఫలమవుతుంది. కాని ఎప్పుడు, ఎలా? యెహోవా సా.శ.పూ. 537 లో తన ప్రజలను బబులోను చెర నుండి విడుదల చేసి వారిని తమ స్వదేశానికి తీసుకు వస్తాడు. ఇది నిరంతరం నిలిచే రాజ్య స్థాపనకు దారితీస్తుందా? లేదు, వారు మరో అన్య సామ్రాజ్యం, అంటే మాదీయ-పారసీక సామ్రాజ్యం ఆధీనంలోకి వెళ్తారు. అన్యజనములు పరిపాలన చేయడానికి నియమించబడిన “కాలములు” అప్పటికి ఇంకా సంపూర్ణము కాలేదు. (లూకా 21:​24) ఇశ్రాయేలులో రాజులేనందున, యెహోవా దావీదుతో చేసిన వాగ్దానం తర్వాతి శతాబ్దాల కాలంపాటు నెరవేరకుండానే ఉండిపోతుంది.

12. దావీదుతో తాను చేసిన రాజ్య నిబంధనను నెరవేర్చడానికి యెహోవా ఏ చర్య తీసుకున్నాడు?

12 ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి విడుదల చేయబడిన 500 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత, యెహోవా తన సృష్టికార్యాల్లో మొదటివాడైన తన జ్యేష్ఠకుమారుని జీవాన్ని పరలోక మహిమ నుండి యూదురాలైన కన్య మరియ గర్భంలోకి మార్చినప్పుడు, రాజ్య నిబంధనను నెరవేర్చడంలో ఆయన ఒక ప్రధానమైన చర్య తీసుకున్నాడు. (కొలొస్సయులు 1:​15-17) ఆ సంఘటనను ప్రకటించేటప్పుడు, యెహోవా దూత మరియతో ఇలా అన్నాడు: ‘ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.’ (లూకా 1:​32, 33) కాబట్టి యేసు దావీదు రాజ వంశంలో జన్మించి, రాచరిక హక్కును వారసత్వంగా పొందాడు. ఒకసారి సింహాసనాసీనుడిగా చేయబడిన తర్వాత యేసు “సర్వకాలము” పరిపాలిస్తాడు. (యెషయా 9: 7; దానియేలు 7:​14) అలా, రాజైన దావీదుకు ఒక శాశ్వత వారసుని ఇస్తానని యెహోవా శతాబ్దాల క్రితం చేసిన వాగ్దాన నెరవేర్పుకు మార్గం సుగమం అయ్యింది.

‘జనములకు అధిపతి’

13. యేసు తన పరిచర్య సమయంలోనూ, అలాగే పరలోకానికి ఆరోహణమైన తర్వాత కూడా “జనములకు సాక్షిగా” ఎలా ఉన్నాడు?

13 ఈ భవిష్యద్‌ రాజు ఏమి చేస్తాడు? యెహోవా ఇలా చెబుతున్నాడు: ‘ఇదిగో! జనములకు సాక్షిగా అతని నియమించితిని, జనములకు రాజుగాను [“నాయకుడుగా,” పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం] అధిపతిగాను అతని నియమించితిని.’ (యెషయా 55: 4) యేసు పెరిగి పెద్దవాడైనప్పుడు, ఆయన భూమిపై యెహోవా ప్రతినిధిగా, జనములకు దేవుని సాక్షిగా ఉన్నాడు. ఆయన మానవుడిగా జీవించిన కాలంలో, ఆయన “ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల” కోసం పరిచర్య చేశాడు. అయితే, ఆయన పరలోకానికి ఆరోహణం కావడానికి కొంతకాలం ముందు, యేసు తన అనుచరులతో, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . ఇదిగో! నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని” చెప్పాడు. (మత్తయి 10:​5, 6; 15:​24; 28:​19, 20) కాబట్టి, కొంతకాలానికి రాజ్య సందేశం యూదేతరుల వద్దకు తీసుకువెళ్ళబడింది, వారిలో కొందరు దావీదుతో చేయబడిన నిబంధన నెరవేర్పులో భాగం వహించారు. (అపొస్తలుల కార్యములు 13:​46) ఈ విధంగా, యేసు తాను మరణించి, పునరుత్థానం చేయబడి, పరలోకానికి ఆరోహణమైన తర్వాత కూడా “జనములకు” యెహోవా యొక్క “సాక్షిగా” కొనసాగాడు.

14, 15. (ఎ) యేసు తనను తాను ‘నాయకునిగా, అధిపతిగా’ ఎలా నిరూపించుకున్నాడు? (బి) యేసు మొదటి శతాబ్దపు అనుచరులకు ఏ ఉత్తరాపేక్ష ఉంది?

14 యేసు ‘నాయకునిగా అధిపతిగా’ కూడా ఉండాలి. ఈ ప్రవచనార్థక వివరణకు అనుగుణంగానే, యేసు భూమిపైనున్నప్పుడు తన శిరసత్వానికి సంబంధించిన బాధ్యతలను పూర్తిగా స్వీకరించి, పెద్ద పెద్ద జనసమూహాలను ఆకర్షిస్తూ వారికి సత్య వాక్యాన్ని బోధిస్తూ తన నాయకత్వాన్ని అనుసరించే వారికి లభించే ప్రయోజనాలను సూచిస్తూ, ప్రతి విషయంలోనూ నాయకత్వం వహించాడు. (మత్తయి 4:​24; 7:​28, 29; 11: 5) ఆయన తన శిష్యులకు ప్రభావవంతంగా తర్ఫీదునిచ్చి, తమ ముందున్న ప్రకటనా కార్యక్రమాన్ని చేపట్టడానికి వారిని సిద్ధం చేశాడు. (లూకా 10:​1-12; అపొస్తలుల కార్యములు 1: 8; కొలొస్సయులు 1:​23) కేవలం మూడున్నర సంవత్సరాల్లో, యేసు అనేక జనముల నుండి వచ్చిన వేలాదిమంది సభ్యులతో ఒక ఐక్య అంతర్జాతీయ సంఘానికి పునాది వేశాడు! ఒక నిజమైన ‘నాయకుడు, అధిపతి’ మాత్రమే అలాంటి బృహత్‌ కార్యాన్ని సాధించగలిగేవాడు. b

15 మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలోకి సమకూర్చబడినవారు దేవుని పరిశుద్ధాత్మచే అభిషేకించబడ్డారు, వారికి యేసు పరలోక రాజ్యంలో ఆయనతోపాటు సహపరిపాలకులుగా ఉండే ఉత్తరాపేక్ష ఉంది. (ప్రకటన 14: 1) అయితే, యెషయా ప్రవచనం క్రైస్తవత్వపు తొలి దినాల్లోనే గాక ఆ తర్వాత కూడా నెరవేరింది. యేసుక్రీస్తు 1914 వరకు దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలించడం ప్రారంభించలేదని సాక్ష్యాధారం చూపిస్తోంది. ఆ తర్వాత కొంతకాలానికి, భూమిపైనున్న అభిషిక్త క్రైస్తవుల మధ్య ఏర్పడిన పరిస్థితి, సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో పరవాసులుగా ఉన్న యూదుల స్థితిని అనేక విధాలుగా పోలి ఉంది. వాస్తవానికి, ఆ క్రైస్తవులకు సంభవించినది యెషయా ప్రవచనం యొక్క గొప్ప నెరవేర్పుగా పరిణమించింది.

ఆధునిక దిన చెర, విడుదల

16. యేసు 1914 లో రాజుగా సింహాసనాసీనుడైన తర్వాత ఏ విపత్తు సంభవించింది?

16 యేసు 1914 లో రాజుగా సింహాసనాసీనుడైనప్పుడు, ప్రపంచంలో మునుపెన్నడూ సంభవించని విపత్తు సంభవించింది. ఎందుకు? ఎందుకంటే యేసు రాజైన వెంటనే సాతానును, ఇతర దుష్ట ఆత్మ ప్రాణులను పరలోకం నుండి వెళ్ళగొట్టాడు. సాతాను భూపరిధికే పరిమితం చేయబడడంతో, మిగిలివున్న పరిశుద్ధులతో అంటే అభిషిక్త క్రైస్తవుల శేషముతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. (ప్రకటన 12:​7-12, 17) బహిరంగ ప్రకటనా పని 1918 లో పూర్తిగా ఆగిపోయి, వాచ్‌టవర్‌ సంస్థకు చెందిన బాధ్యతాయుతులైన అధికారులు తిరుగుబాటు చేస్తున్నారనే అబద్ధ ఆరోపణలతో జైలులో వేయబడినప్పుడు ఆ యుద్ధం చరమాంకాన్ని చేరుకుంది. ఈ విధంగా, యెహోవా ఆధునిక దిన సేవకులు ఆధ్యాత్మిక చెరలోనికి వెళ్ళారు, అది ప్రాచీన యూదుల భౌతికపరమైన చెరను జ్ఞప్తికి తెస్తుంది. వారిపైకి గొప్ప అపనింద వచ్చింది.

17. అభిషిక్తుల పరిస్థితి 1919 లో ఎలా మారింది, ఆ తర్వాత వారెలా బలపర్చబడ్డారు?

17 అయితే, దేవుని అభిషిక్త సేవకులు ఎంతోకాలం చెరలో ఉండవలసిన అవసరం లేకపోయింది. జైలులో వేయబడిన అధికారులు 1919, మార్చి 26న విడుదల చేయబడ్డారు, వారిపై మోపబడిన ఆరోపణలన్నీ ఆ తర్వాత కొట్టివేయబడ్డాయి. విడుదల చేయబడిన తన ప్రజలపై యెహోవా పరిశుద్ధాత్మను కుమ్మరించి, వారి ఎదుట ఉన్న పనిని చేయడానికి వారిని బలపరిచాడు. “జీవజలమును ఉచితముగా పుచ్చుకొన”మని ఇవ్వబడిన ఆహ్వానానికి వారు ఆనందంగా ప్రతిస్పందించారు. (ప్రకటన 22:​17) వారు “రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను” కొన్నారు, అభిషిక్త శేషము ముందుగా చూడనటువంటి, జరుగబోతున్న అద్భుతమైన విస్తరణ కోసం వారు ఆధ్యాత్మికంగా బలపరచబడ్డారు.

ఒక గొప్ప సమూహము దేవుని అభిషిక్తుల వద్దకు పరుగెత్తివస్తుంది

18. యేసుక్రీస్తు శిష్యుల్లో ఏ రెండు గుంపులు ఉన్నాయి, వారు నేడు ఎలా రూపొందుతారు?

18 యేసు శిష్యులు, రెండు నిరీక్షణల్లో ఏదో ఒక నిరీక్షణను కలిగి ఉంటారు. మొదటిగా, 1,44,000 మందితో కూడిన ‘చిన్న మంద’ సమకూర్చబడింది, “దేవుని ఇశ్రాయేలు” అయిన ఈ అభిషిక్త క్రైస్తవులు మునుపు యూదులుగా ఉన్నారు, మరికొందరు అన్యులుగా ఉన్నారు, వీరికి యేసుతోపాటు ఆయన పరలోక రాజ్యంలో పరిపాలించే నిరీక్షణ ఉంది. (లూకా 12:​32; గలతీయులు 6:​16; ప్రకటన 14: 1) రెండవదిగా, అంత్యదినాల్లో “వేరే గొఱ్ఱెల” ఒక “గొప్ప సమూహము” తనను తాను బయలుపరచుకుంది. వీరికి పరదైసు భూమిపై నిరంతరం జీవించే ఉత్తరాపేక్ష ఉంది. మహా శ్రమలు ప్రారంభం కాకముందు, ఈ మహా గొప్ప సమూహానికి చెందినవారు​—⁠వీరి సంఖ్య ఇంత అని ముందుగా నిర్ణయించబడలేదు—​చిన్నమందతో కలిసి సేవచేస్తారు, ఈ రెండు వర్గాలు ‘ఒక్క కాపరి’ క్రింద ‘ఒక్క మందగా’ రూపొందుతారు.​— ప్రకటన 7:​9, 10; యోహాను 10:​16.

19. మునుపు దేవుని ఇశ్రాయేలుకు తెలియని “జనులు” ఆ ఆధ్యాత్మిక జనము ఇచ్చిన పిలుపుకు ఎలా ప్రతిస్పందించారు?

19 ఈ గొప్ప సమూహమును సమకూర్చే పనిని యెషయా ప్రవచనంలోని ఈ క్రింది మాటల ద్వారా గ్రహించవచ్చు: “నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవానుబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిబట్టి నీయొద్దకు పరుగెత్తి వచ్చెదరు.” (యెషయా 55: 5) ఆధ్యాత్మిక చెరనుండి తాము విడుదల చేయబడిన తర్వాతి సంవత్సరాల్లో, అర్మగిద్దోను రాక ముందు బహుళ సంఖ్యలో ఉన్న “జనులను” యెహోవా ఆరాధన కోసం పిలవడంలో తాము సాధనాలుగా ఉపకరిస్తామని అభిషిక్త శేషము మొదట గ్రహించలేదు. అయితే, సమయం గడుస్తుండగా, పరలోక నిరీక్షణలేని యథార్థహృదయులనేకులు అభిషిక్తులతో సహవసిస్తూ, అభిషిక్తులకున్న అదే అత్యాసక్తితో యెహోవా సేవ చేయడం ప్రారంభించారు. క్రొత్తగా వచ్చిన వీరు దేవుని ప్రజల మహిమపరచబడిన స్థితిని గమనించి, యెహోవా వారిమధ్య ఉన్నాడని గుర్తించారు. (జెకర్యా 8:​23) అభిషిక్తులు 1930లలో, తమ మధ్య అంతకంతకూ పెరిగిపోతున్న ఈ గుంపు యొక్క నిజమైన గుర్తింపును అర్థం చేసుకున్నారు. గొప్ప సమకూర్పు పని ఇంకా ముందుందని వారు గ్రహించారు. గొప్ప సమూహము దేవుని నిబంధన ప్రజలతో సహవసించడానికి పరుగెత్తి వస్తోంది, దానికి మంచి కారణమే ఉంది.

20. (ఎ) మన కాలంలో, ‘యెహోవాను వెదకడం’ ఎందుకు అత్యవసరం, ఇది ఎలా జరుగుతోంది? (బి) తనను వెదికే వారి విషయంలో యెహోవా ఎలా ప్రతిస్పందిస్తాడు?

20 యెషయా కాలంలో, పిలుపు ఇలా వెలువడింది: “యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి.” (యెషయా 55: 6) మన కాలంలో, ఈ మాటలు అటు దేవుని ఇశ్రాయేలుగా రూపొందేవారికి, ఇటు పెరుగుతున్న గొప్ప సమూహమునకు సముచితమైనవే. ఏ షరతులూ లేకుండా యెహోవా మనల్ని ఆశీర్వదించడు. ఆయనిచ్చే ఆహ్వానం నిరంతరం కొనసాగుతూ ఉండదు. దేవుని అనుగ్రహం పొందడానికి ప్రయత్నించవలసిన సమయం ఇదే. యెహోవా తీర్పుకు నియమించబడిన సమయం వచ్చిందంటే, అప్పుడిక అవకాశం దొరకదు. అందుకే, యెషయా ఇలా చెబుతున్నాడు: “భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను; వారు యెహోవావైపు తిరిగినయెడల, ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.”​—యెషయా 55: 7.

21. ఇశ్రాయేలు జనము తమ పితరులు తాము చేస్తామని చెప్పిన దానికి కట్టుబడి ఉండలేదని ఎలా నిరూపించబడింది?

21 “వారు యెహోవావైపు తిరిగినయెడల” అనే పదబంధం, పశ్చాత్తాపపడవలసిన వారు మునుపు దేవునితో సంబంధాన్ని కలిగివున్నారని సూచిస్తోంది. యెషయా ప్రవచనంలోని ఈ భాగంలో ఉన్న అనేక అంశాలు బబులోనులో బంధీలుగా ఉన్న యూదులకు మొదట అన్వయించబడతాయని ఈ వ్యక్తీకరణ మనకు జ్ఞాపకం చేస్తుంది. శతాబ్దాల క్రితం, బంధీలుగా ఉన్న వీరి పితరులు, “యెహోవాను విసర్జించి యితరదేవతలను సేవించినయెడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక” అని చెప్పినప్పుడు యెహోవాకు విధేయత చూపిస్తామనే తమ నిశ్చయతను వెల్లడిచేశారు. (యెహోషువ 24:​16) అయితే వారు నిజంగానే ‘యెహోవాను విసర్జించి యితర దేవతలను సేవించారనీ’ అదీ పదే పదే వారలా చేశారనీ చరిత్ర చూపిస్తోంది! దేవుని ప్రజల అవిశ్వాసమే వారు బబులోనుకు బంధీలుగా వెళ్ళడానికి కారణమైంది.

22. తన తలంపులు, మార్గములు మానవుల తలంపులు, మార్గముల కంటే ఉన్నతమైనవని యెహోవా ఎందుకు చెబుతాడు?

22 వారు పశ్చాత్తాపపడితే ఏమి జరుగుతుంది? ‘బహుగా క్షమిస్తానని’ యెహోవా యెషయా ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. ఆయనిలా జతచేస్తున్నాడు: “నా తలంపులు మీ తలంపులవంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలవంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.” (యెషయా 55:​8, 9) యెహోవా పరిపూర్ణుడు, ఆయన తలంపులు, మార్గములు చేరుకోలేనంత ఉన్నతమైనవి. ఆయన కనికరం కూడా ఎంత సర్వోన్నతమైన స్థానంలో ఉందంటే మానవులమైన మనం దాన్ని చేరుకోగలమని ఎన్నడూ అనుకోలేము. దీన్ని పరిశీలించండి: మనం తోటి మానవులను క్షమించినప్పుడు, అది ఒక పాపి మరో పాపిని క్షమించడమే. ఎప్పుడో ఒకసారి మనకు మన తోటి మానవుని క్షమాపణ అవసరమని మనం గుర్తిస్తాము. (మత్తయి 6:​12) కానీ యెహోవా తాను ఎన్నడూ క్షమించబడవలసిన అవసరం లేకపోయినప్పటికీ, మనల్ని “బహుగా” క్షమిస్తాడు! నిజంగా ఆయన గొప్ప కృపగల దేవుడు. పూర్ణ హృదయంతో తనవద్దకు తిరిగి వచ్చేవారిపై ఆశీర్వాదాలు కురిపిస్తూ, యెహోవా తన కనికరంతో ఆకాశపు వాకిండ్లను తెరుస్తాడు.​—⁠మలాకీ 3:​10.

యెహోవా వద్దకు తిరిగి వచ్చేవారికి లభించే ఆశీర్వాదములు

23. యెహోవా తన వచన నెరవేర్పు యొక్క ఖచ్చితత్వాన్ని సోదాహరణంగా ఎలా చెప్పాడు?

23 యెహోవా తన ప్రజలకు ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలముచేయును.” (యెషయా 55:​10, 11) యెహోవా చెప్పేదంతా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆకాశము నుండి కురిసే వర్షము, హిమము భూమిని తడిపి ఫలమును ఉత్పన్నం చేయడమనే తమ సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తాయో అలాగే యెహోవా నోటి నుండి వెలువడే ఆయన వచనము సంపూర్ణంగా నమ్మదగినది. ఆయన తాను వాగ్దానం చేసినదాన్ని, సంపూర్ణ ఖచ్చితత్వంతో నెరవేరుస్తాడు.​—⁠సంఖ్యాకాండము 23:​19.

24, 25. యెహోవా యెషయా ద్వారా ఇచ్చిన సందేశానుసారంగా చర్య తీసుకునే బంధీలైన యూదుల కోసం ఏ ఆశీర్వాదములు నిల్వచేయబడి ఉన్నాయి?

24 కాబట్టి యూదులు, యెషయా ద్వారా తమ కోసం ప్రవచించబడిన మాటలను లక్ష్యపెడితే, వారు యెహోవా వాగ్దానం చేసిన రక్షణను తప్పక పొందుతారు. తత్ఫలితంగా, వారు గొప్ప ఆనందాన్ని పొందుతారు. యెహోవా ఇలా పేర్కొంటున్నాడు: “మీరు సంతోషముగా బయలువెళ్లుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును. ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును. దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును.”​—యెషయా 55:​12, 13.

25 బంధీలుగా ఉన్న యూదులు సా.శ.పూ. 537 లో నిజంగా బబులోను నుండి ఆనందంగా బయలుదేరి వెళ్ళారు. (కీర్తన 126:​1, 2) వారు యెరూషలేముకు తిరిగివచ్చినప్పుడు ఆ ప్రాంతమంతా ముండ్లచెట్లు, దురదగొండి చెట్లతో నిండివుండడాన్ని వారు చూశారు​—⁠దేశం దశాబ్దాలపాటు నిర్జనంగా విడువబడిందని గుర్తుంచుకోండి. కానీ తిరిగివచ్చిన దేవుని ప్రజలు ఇప్పుడు సుందరమైన మార్పును తీసుకురావడానికి దోహదపడగలరు! ముండ్లచెట్లు, దురదగొండి చెట్ల స్థానంలో దేవదారు, గొంజి వంటి ఎత్తైన వృక్షాలు ఉంటాయి. యెహోవా ప్రజలు “సంగీతనాదము”తో ఆయన సేవ చేసినప్పుడు ఆయన ఆశీర్వాదము స్పష్టంగా కనిపిస్తుంది. అది నేల తానే ఉల్లసిస్తున్నట్లుగా ఉంటుంది.

26. దేవుని ప్రజలు నేడు ఏ ఆశీర్వాదకరమైన స్థితిని ఆనందిస్తున్నారు?

26 అభిషిక్త క్రైస్తవుల శేషము 1919 లో ఆధ్యాత్మిక చెర నుండి విడుదల చేయబడింది. (యెషయా 66: 8) వేరే గొఱ్ఱెల గొప్ప సమూహముతోపాటు వారిప్పుడు ఆధ్యాత్మిక పరదైసులో ఆనందంగా దేవుని సేవ చేస్తున్నారు. బబులోనుకు సంబంధించిన సమస్త కల్మషమునూ వదిలించుకుని వారు అనుగ్రహ స్థితిని పొందారు, అది యెహోవాకు “ఖ్యాతిగా” ఉంది. వారి ఆధ్యాత్మిక సమృద్ధి ఆయన నామమును మహిమపరచి, ఆయనను నిజమైన ప్రవచన దేవునిగా ఉన్నతపరుస్తుంది. యెహోవా వారి కోసం సాధించినది ఆయన దేవత్వమును వెల్లడిచేస్తుంది, ఆయన తన వచనము పట్ల చూపించే నమ్మకత్వానికీ, పశ్చాత్తాపపడేవారిపట్ల ఆయన చూపించే కనికరానికీ అది నిదర్శనంగా ఉంటుంది. ‘రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనడంలో’ కొనసాగే వారందరూ ఆయన సేవ చేయడంలో నిరంతరం ఆనందించుదురు గాక!

[అధస్సూచీలు]

a ప్రాచీన బబులోను సంబంధిత వ్యాపార రికార్డుల్లో యూదుల పేర్లు అనేకం కనుగొనబడ్డాయి.

b శిష్యులను చేసే పనిని యేసు పర్యవేక్షిస్తూనే ఉన్నాడు. (ప్రకటన 14:​14-16) నేడు, క్రైస్తవ స్త్రీ పురుషులు యేసును సంఘ శిరస్సుగా దృష్టిస్తారు. (1 కొరింథీయులు 11: 3) దేవుని నియమిత సమయంలో, అర్మగిద్దోను యుద్ధంలో, దేవుని శత్రువులతో చేసే నిర్ణాయకమైన పోరాటానికి నిర్దేశాలనిచ్చేటప్పుడు యేసు మరో విధంగా ‘నాయకునిగా, అధిపతిగా’ చర్య తీసుకుంటాడు.​—⁠ప్రకటన 19:​19-21.

[అధ్యయన ప్రశ్నలు]

[234 వ పేజీలోని చిత్రం]

“నీళ్లయొద్దకు రండి,” “ద్రాక్షారసమును పాలను కొనుడి” అని ఆధ్యాత్మిక దాహం గల యూదులు ఆహ్వానింపబడుతున్నారు

[239 వ పేజీలోని చిత్రం]

యేసు జనములకు తనను తాను ‘నాయకునిగా, అధిపతిగా’ నిరూపించుకున్నాడు

[244, 245 వ పేజీలోని చిత్రాలు]

“భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను”