కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తన సేవకుడైన మెస్సీయను హెచ్చిస్తాడు

యెహోవా తన సేవకుడైన మెస్సీయను హెచ్చిస్తాడు

పద్నాలుగవ అధ్యాయం

యెహోవా తన సేవకుడైన మెస్సీయను హెచ్చిస్తాడు

యెషయా 52:13-53:12

1, 2. (ఎ) సా.శ. మొదటి శతాబ్దపు తొలిభాగంలో అనేకమంది యూదులు ఎదుర్కొన్న పరిస్థితిని సోదాహరణంగా వివరించండి. (బి) నమ్మకమైన యూదులు మెస్సీయను గుర్తించేందుకు సహాయం చేయడానికి యెహోవా ఏ ఏర్పాటు చేశాడు?

 మీరు ఒక ప్రముఖ ఉన్నతాధికారిని కలువబోతున్నారని అనుకోండి. మీరు కలువవలసిన సమయమూ, స్థలమూ నిర్ధారించబడ్డాయి. అయితే ఒక సమస్య ఉంది: ఆయనెలా ఉంటాడో మీకు తెలియదు, ఆయన ఏ ఆర్భాటం లేకుండా అతిసాధారణంగా ప్రయాణిస్తూ ఉంటాడు. మీరు ఆయనను ఎలా గుర్తుపడతారు? ఆయన ఎలా ఉంటాడో తెలియజేసే సవివరమైన వర్ణన మీదగ్గరుంటేనే మీరాయనను గుర్తుపట్టగలరు.

2 సా.శ. మొదటి శతాబ్దపు తొలి భాగంలో, చాలామంది యూదులు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. జీవించేవారిలోకెల్లా అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అయిన మెస్సీయ రాక కోసం వారు ఎదురు చూస్తున్నారు. (దానియేలు 9:24-27; లూకా 3:15) కానీ నమ్మకమైన యూదులు ఆయనను ఎలా గుర్తించాలి? యెహోవా హీబ్రూ ప్రవక్తల ద్వారా, వివేచనగలవారు పొరపాటు పడకుండా మెస్సీయను గుర్తించేందుకు సహాయం చేసే, ఆయనకు సంబంధించిన సంఘటనలను సవివరంగా వర్ణించాడు.

3. యెషయా 52:13-53:12 వచనాల్లో మెస్సీయను గురించిన ఏ వర్ణన ఇవ్వబడింది?

3 మెస్సీయకు సంబంధించిన హీబ్రూ ప్రవచనాల్లో ఏదీ కూడా యెషయా 52:13-53:12 వచనాల్లో వ్రాయబడివున్నదాని కన్నా స్పష్టమైన వివరణను ఇవ్వలేదు. యెషయా 700 కన్నా ఎక్కువ సంవత్సరాల ముందుగానే, మెస్సీయ భౌతిక రూపాన్ని కాదు గానీ మరింత ప్రాముఖ్యమైన వివరాలను అంటే ఆయన బాధననుభవించడానికి గల సంకల్పాన్ని, బాధననుభవించే విధానాన్ని, ఆయన మరణం, సమాధి చేయబడడం, ఉన్నతపర్చబడడం వంటివాటిని గురించిన వివరాలను వర్ణించాడు. ఈ ప్రవచనాన్ని, దాని నెరవేర్పును పరిశీలించడం మన హృదయాలను ఉత్తేజపరిచి, మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.

“నా సేవకుడు”—ఎవరాయన?

4. ‘సేవకుని’ గుర్తింపుకు సంబంధించి కొంతమంది యూదా పండితులు ఏ అభిప్రాయాలను వ్యక్తపరిచారు, కానీ ఇవి యెషయా ప్రవచనంతో ఎందుకు పొసగవు?

4 యెషయా ఇప్పుడే, బబులోనులో బంధీలుగా ఉన్న యూదుల విడుదల గురించి చెప్పాడు. మరింత గొప్ప సంఘటనను ముందుగా చూస్తూ ఆయన యెహోవా మాటలను వ్రాస్తున్నాడు: “ఆలకించుడి! నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును.” (యిషయా 52:13) నిజానికి ఎవరీ “సేవకుడు”? శతాబ్దాల కాలంలో, యూదా పండితులు వివిధ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. బబులోనులో బంధీలుగా ఉన్న మొత్తం ఇశ్రాయేలు జనముకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడని కొందరు అన్నారు. కానీ అలాంటి వివరణ ప్రవచనానికి అనుగుణంగా ఉండదు. దేవుని సేవకుడు ఇష్టపూర్వకంగా బాధననుభవిస్తాడు. ఆయన నిర్దోషియే అయినప్పటికీ ఇతరుల పాపాలను బట్టి ఆయన బాధననుభవిస్తాడు. అది, యూదా జనమును ఎంతమాత్రం వర్ణించదు, ఎందుకంటే వారు తమ సొంత పాపభరితమైన మార్గాలను బట్టి చెరలోకి వెళ్ళారు. (2 రాజులు 21:11-15; యిర్మీయా 25:8-11) సేవకుడు, ఇశ్రాయేలులోని స్వనీతిమంతులైన ఉన్నతవర్గంవారికి ప్రాతినిధ్యం వహిస్తాడనీ, వీరు పాపులైన ఇశ్రాయేలీయుల పక్షాన బాధననుభవించారనీ మరి కొందరు అన్నారు. అయితే, ఇశ్రాయేలుకు ఆపద సంభవించిన కాలాల్లో ఏ నిర్దిష్టమైన గుంపూ మరొకరి కోసం బాధననుభవించలేదు.

5. (ఎ) యెషయా ప్రవచనాన్ని కొంతమంది యూదా పండితులు ఎలా అన్వయించారు? (అధస్సూచి చూడండి.) (బి) సేవకుడిని గురించిన ఏ స్పష్టమైన గుర్తింపు బైబిలులోని అపొస్తలుల కార్యముల పుస్తకంలో ఇవ్వబడింది?

5 క్రైస్తవత్వం ప్రారంభం కాకముందు, సామాన్య శకం తొలి శతాబ్దాల్లో కొంతమేరకు, యూదా పండితులు కొంతమంది ఈ ప్రవచనాన్ని మెస్సీయకు అన్వయించారు. a ఇది సరైన అన్వయింపేనన్నది క్రైస్తవ గ్రీకు లేఖనాల నుండి చూడవచ్చు. యెషయా ప్రవచనంలోని సేవకుడెవరో తాను గుర్తించలేకపోతున్నానని ఐతియొపీయుడైన నపుంసకుడు చెప్పినప్పుడు ఫిలిప్పు, “అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను” అని అపొస్తలుల కార్యముల పుస్తకం తెలియజేస్తోంది. (అపొస్తలుల కార్యములు 8:26-40; యెషయా 53:7, 8) అలాగే ఇతర బైబిలు పుస్తకాలు యేసుక్రీస్తును యెషయా ప్రవచనంలోని మెస్సీయ సేవకునిగా గుర్తిస్తున్నాయి. మనం ఈ ప్రవచనాన్ని చర్చిస్తుండగా, యెహోవా “నా సేవకుడు” అని పిలుస్తున్న వ్యక్తికి, నజరేయుడైన యేసుకు మధ్యనున్న నిర్వివాదమైన సమాంతరాలను మనం చూస్తాము.

6. మెస్సీయ దైవిక చిత్తాన్ని విజయవంతంగా నెరవేరుస్తాడని యెషయా ప్రవచనం ఎలా సూచిస్తోంది?

6 దైవిక చిత్తాన్ని నెరవేర్చడంలో మెస్సీయకు లభించే తుది సఫలతను వర్ణించడంతో ప్రవచనం ప్రారంభమవుతుంది. “సేవకుడు” అనే పదం, ఒక సేవకుడు తన యజమానికి విధేయుడై ఉండేలానే, ఆయన దేవుని చిత్తానికి విధేయుడై ఉంటాడని సూచిస్తోంది. అలా చేయడంలో, ఆయన “వివేకముగా ప్రవర్తించును.” వివేకము అంటే ఒక పరిస్థితిని గ్రహించే సామర్థ్యం. వివేకముతో ప్రవర్తించడం అంటే విచక్షణ కలిగి ప్రవర్తించడం. ఇక్కడ ఉపయోగించబడిన హీబ్రూ క్రియా పదానికి సంబంధించి, ఒక పుస్తకం ఇలా చెబుతోంది: “యుక్తాయుక్త పరిజ్ఞానంకలిగి, జ్ఞానవంతంగా వ్యవహరించడమనే తలంపే దాని ముఖ్యాంశం. జ్ఞానవంతంగా వ్యవహరించే వ్యక్తి విజయం సాధిస్తాడు.” మెస్సీయ నిజంగానే విజయం సాధిస్తాడనే విషయాన్ని, ఆయన “ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును” అని ప్రవచనం చెబుతున్న దానిలో చూడవచ్చు.

7. యేసు ఎలా ‘వివేకముగా ప్రవర్తించాడు,’ ఆయన ఎలా ‘ప్రసిద్ధుడై మహా ఘనుడుగా’ ఎంచబడ్డాడు?

7 యేసు తనకు అన్వయించే బైబిలు ప్రవచనాలపట్ల అవగాహనను చూపిస్తూ, తన తండ్రి చిత్తాన్ని చేయడానికి ఆ ప్రవచనాలచే నడిపించబడుతూ ఆయన నిజంగానే ‘వివేకముగా ప్రవర్తించాడు.’ (యోహాను 17:4; 19:30) దాని ఫలితమేమిటి? యేసు పునరుత్థానం చేయబడి, పరలోకానికి ఆరోహణమైన తర్వాత, “దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.” (ఫిలిప్పీయులు 2:11; అపొస్తలుల కార్యములు 2:34-38) తర్వాత, మహిమపరచబడిన యేసు 1914 లో మరింత ఉన్నతపరచబడ్డాడు. యెహోవా ఆయనను మెస్సీయ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించేంతగా హెచ్చించాడు. (ప్రకటన 12:1-5) అవును, ఆయన “ప్రసిద్ధుడై మహా ఘనుడుగా” ఎంచబడ్డాడు.

‘అతని చూచి విస్మయమొందడం’

8, 9. హెచ్చింపబడిన యేసు తీర్పు అమలు చేయడానికి వచ్చినప్పుడు, భూపరిపాలకులు ఎలా ప్రతిస్పందిస్తారు, ఎందుకు?

8 హెచ్చింపబడిన మెస్సీయకు జనములు, వారి పాలకులు ఎలా ప్రతిస్పందిస్తారు? మనం 14 వ వచనంలోని కొంతభాగాన్ని కాస్త ప్రక్కనపెడితే, ప్రవచనం ఇలా చదువబడుతుంది: “నిన్ను చూచి . . . చాలమంది యేలాగు విస్మయమొందిరో ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును [“జనములకు విస్మయము పుట్టించును,” అధస్సూచి]. రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు, తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము విననిదానిని గ్రహింతురు.” (యెషయా 52:14, 15) యెషయా ఈ మాటలతో మెస్సీయ మొదటిసారి కనిపించడాన్ని కాదుగాని భూపరిపాలకులను ఆయన చివరిసారి ఎదుర్కోవడాన్ని వర్ణిస్తున్నాడు.

9 హెచ్చింపబడిన యేసు దైవభక్తిలేని ఈ విధానానికి విధించబడిన తీర్పును అమలుచేయడానికి వచ్చినప్పుడు, భూపరిపాలకులు ‘అతని చూచి విస్మయమొందుతారు.’ నిజమే, మహిమపరచబడిన యేసును మానవ పరిపాలకులు అక్షరార్థంగా చూడరు. యెహోవా కోసం పోరాడే పరలోక యోధునిగా ఆయనకున్న శక్తికి స్పష్టమైన నిదర్శనాలను వారు చూస్తారు. (మత్తయి 24:30) మతనాయకులు తమకు తెలియజేయని వాటి వైపుకు అంటే యేసు, దేవుని తీర్పులను అమలుచేసేవాడనే విషయం వైపుకు తమ అవధానం మరల్చేలా వారు బలవంతం చేయబడతారు! వారు ఎదుర్కొనే హెచ్చింపబడిన సేవకుడు వారు ఊహించని విధంగా చర్య తీసుకుంటాడు.

10, 11. మొదటి శతాబ్దంలో యేసు వికారంగా చిత్రీకరించబడ్డాడని ఏ విధంగా చెప్పవచ్చు, నేడు అది ఎలా జరుగుతోంది?

10 ఆ 14 వ వచనంలోని మిగిలిన భాగం ప్రకారం, యెషయా ఇలా అంటున్నాడు: ‘యే మనిషి రూపముకంటె అతని ముఖమును, నరరూపముకంటె అతని రూపమును చాల వికారము.’ (యెషయా 52:14) యేసు భౌతిక రూపంలో వికారంగా ఉన్నాడా? లేదు. యేసు ఎలా ఉండేవాడనేదాని గురించి బైబిలు వివరాలు ఇవ్వకపోయినప్పటికీ, దేవుని పరిపూర్ణమైన కుమారునికి నిస్సందేహంగా చక్కని రూపం, ముఖకవళికలు ఉండవచ్చు. యెషయా మాటలు, యేసు అనుభవించిన అవమానాన్ని సూచిస్తున్నాయని స్పష్టమవుతోంది. ఆయన తన కాలంనాటి మతనాయకులు వేషధారులని, అబద్ధికులని, హంతకులని ధైర్యంగా వెల్లడిచేశాడు; దానికి ప్రతిస్పందనగా వారు ఆయనను దూషించారు. (1 పేతురు 2:22, 23) ఆయన చట్టాన్ని ఉల్లంఘించేవాడనీ, దేవుడ్ని దూషించేవాడనీ, మోసగాడనీ, రోముకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాడనీ వారు నిందించారు. అలా, ఈ అబద్ధ ఆరోపకులు యేసును చాలా వికారంగా చిత్రీకరించారు.

11 నేడు కూడా యేసును తప్పుగా చిత్రీకరించడం కొనసాగుతూనే ఉంది. చాలామంది ప్రజలు యేసును పశువులతొట్టిలో ఉన్న పసిబాలునిగానో, ముళ్ళ కిరీటం ధరించి సిలువపై మేకులతో కొట్టబడి విపరీతమైన వేదనవల్ల వికారమైపోయిన ముఖంతో ఉన్న విషాదభరితమైన రూపంగానో ఊహించుకుంటారు. క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు అలాంటి దృక్కోణాలను ప్రోత్సహించారు. అంతేకానీ వారు యేసును, జనములు లెక్క అప్పజెప్పవలసి ఉన్న శక్తివంతమైన పరలోక రాజుగా చూపించడంలో విఫలమయ్యారు. సమీప భవిష్యత్తులో మానవ పరిపాలకులు హెచ్చింపబడిన యేసును ఎదుర్కొన్నప్పుడు, వారు ‘పరలోకమందును భూమిమీదను సర్వాధికారము ఇయ్యబడియున్న’ మెస్సీయతో వ్యవహరించవలసి ఉంటుంది!—మత్తయి 28:18.

ఈ సువార్తను ఎవరు నమ్ముతారు?

12. యెషయా 53:1 వ వచనంలోని మాటలు ఏ ఆసక్తికరమైన ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి?

12 మెస్సీయ యొక్క అద్భుతమైన రూపాంతరాన్ని—‘వికారరూపము’ నుండి ‘ఘనుడుగా ఎంచబడడం’ వరకు—వర్ణించిన తర్వాత యెషయా ఇలా అడుగుతున్నాడు: “మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?” (యెషయా 53:1) యెషయా వ్రాసిన ఈ మాటలు ఆసక్తికరమైన ప్రశ్నలను లేవదీస్తాయి: ఈ ప్రవచనం నెరవేరుతుందా? ఆయనకున్న, శక్తిని వినియోగించుకునే సామర్థ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న “యెహోవా బాహువు” తనను తాను బయలుపరచుకుని, ఈ మాటలు నిజమయ్యేలా చేస్తుందా?

13. యెషయా ప్రవచనం యేసులో నెరవేరిందని పౌలు ఎలా చూపించాడు, దానికి ప్రతిస్పందన ఎలా ఉంది?

13 నిర్వివాదంగా, అవును అన్నదే దానికి సమాధానం! యెషయా వినిన, వ్రాసివుంచిన ప్రవచనం యేసులో నెరవేరిందని చూపించడానికి పౌలు తాను రోమీయులకు వ్రాసిన పత్రికలో యెషయా మాటలను ఎత్తి వ్రాశాడు. యేసు ఈ భూమి మీద బాధలు అనుభవించిన తర్వాత ఆయన మహిమపరచబడడమన్నది సువార్త. అవిశ్వాసులైన యూదులను ఉద్దేశించి పౌలు ఇలా అంటున్నాడు: “అయినను, అందరు సువార్తకు లోబడలేదు—ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.” (రోమీయులు 10:16, 17) అయితే విచారకరంగా పౌలు దినాల్లో, కొంతమందే దేవుని సేవకుడిని గురించిన సువార్తలో విశ్వాసం ఉంచారు. ఎందుకలా?

14, 15. మెస్సీయ ఎలాంటి నేపథ్యంలో, భూదృశ్యంలోకి ప్రవేశిస్తాడు?

14 ప్రవచనం ఆ తర్వాత, మొదటి వచనంలో వ్రాయబడి ఉన్న ప్రశ్నలకు కారణాలను ఇశ్రాయేలీయులకు వివరిస్తోంది, అలా చేయడంలో, మెస్సీయను అనేకులు ఎందుకు అంగీకరించరనేదానిపై వెలుగును ప్రసరింపజేస్తోంది: ‘లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన [పరిశీలకుని] యెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు; మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.’ (యెషయా 53:2) ఇక్కడ మనం, మెస్సీయ భూదృశ్యంపైకి ఏ నేపథ్యంలో ప్రవేశిస్తాడనేదాన్ని చూస్తాము. ఆయన చాలా పేదవానిగా రంగప్రవేశం చేస్తాడు, పరిశీలకులకు ఆయన పెద్దగా గమనించదగిన వ్యక్తిలా కనిపించకపోవచ్చు. అంతేగాక, ఆయన ఒక అల్పమైన మొక్క వలె అంటే చెట్టు మొద్దుపైగానీ కొమ్మపైగానీ పెరిగే లేత మొలక వలె ఉండాలి. ఆయన ఎండిన, ఫలవంతంగా లేని నేలలో, నీటిపై ఆధారపడే వేరులా కూడా ఉండాలి. ఆయన రాచరిక వైభవంతో, మహిమతో రాకూడదు—రాజ వస్త్రాలూ ఉండకూడదు, మెరిసే మకుటాలూ ఉండకూడదు. బదులుగా, ఆయన చాలా పేదవానిగా, నిరాడంబరంగా భూదృశ్యంలోకి ప్రవేశించాలి.

15 మానవునిగా యేసు అల్పమైన ఆరంభాన్ని అదెంత చక్కగా వర్ణిస్తుందో కదా! యూదురాలైన కన్య మరియ బేత్లెహేమని పిలువబడే ఒక చిన్న పట్టణంలోని పశువులపాకలో ఆయనకు జన్మనిచ్చింది. b (లూకా 2:7; యోహాను 7:42) మరియ, ఆమె భర్త యోసేపు పేదవారు. వారు యేసు జన్మించిన దాదాపు 40 రోజుల తర్వాత, పేదవారు అర్పించడానికి అనుమతించబడిన పాపపరిహారార్థబలిని తీసికొని వచ్చారు, పేదవారు “గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను” పాపపరిహారార్థబలిగా అర్పించవచ్చు. (లూకా 2:24; లేవీయకాండము 12:6-8) కొంతకాలానికి, మరియ యోసేపులు నజరేతులో స్థిరపడ్డారు, అక్కడ యేసు చాలా పెద్ద కుటుంబంలో, బహుశా నిరుపేద పరిస్థితుల్లో పెరిగి పెద్దవాడయ్యాడు.—మత్తయి 13:55, 56.

16. యేసుకు “సురూపమైనను సొగసైనను” లేదన్నది ఎలా నిజం?

16 మానవునిగా యేసు సరైన నేలలో వేళ్ళూనలేదన్నట్లు అనిపించింది. (యోహాను 1:46; 7:41, 52) ఆయన పరిపూర్ణ మానవుడూ, దావీదు రాజు సంతానమూ అయినప్పటికీ, ఆయన నిరుపేద పరిస్థితులు ఆయనకు “సురూపమైనను సొగసైనను” ఇవ్వలేదు—మెస్సీయ మరింత ప్రభావవంతమైన నేపథ్యం నుండి వస్తాడని ఎదురుచూస్తున్న వారి దృష్టికి ఎంతమాత్రం అలా అనిపించలేదు. అనేకులు యూదా మతనాయకులచే పురికొల్పబడి ఆయనను అలక్ష్యం చేసేలా, తృణీకరించేలా నడిపించబడ్డారు. చివరికి, దేవుని పరిపూర్ణ కుమారునిలో జనసమూహములకు అపేక్షించదగినదేదీ కనిపించలేదు.—మత్తయి 27:11-26.

‘మనుష్యుల వలన తృణీకరింపబడినవాడు, విసర్జింపబడినవాడు’

17. (ఎ) యెషయా ఏమి వర్ణించడం ప్రారంభిస్తున్నాడు, ఆయన భూతకాలంలో ఎందుకు వ్రాస్తున్నాడు? (బి) యేసును ఎవరు, ఎలా ‘తృణీకరించి, విసర్జించారు’?

17 మెస్సీయను ఎలా దృష్టిస్తారు ఆయనతో ఎలా వ్యవహరిస్తారు అనేది యెషయా ఇప్పుడు సవివరంగా వర్ణించడం ప్రారంభిస్తాడు: “అతడు తృణీకరింపబడినవాడును ఆయెను, మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడుగాను, మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి.” (యెషయా 53:3) యెషయా తన మాటలు తప్పక నెరవేరుతాయనే నిశ్చయతతో, అవి అప్పటికే నెరవేరినట్లుగా భూతకాలంలో వ్రాస్తున్నాడు. యేసుక్రీస్తు నిజంగానే మనుష్యులచే తృణీకరింపబడి, విసర్జించబడ్డాడా? అవును అలాగే జరిగింది! స్వనీతిమంతులైన మతనాయకులు, వారి అనుచరులు ఆయనను మానవుల్లోకెల్లా అత్యంత నికృష్టమైనవాడిగా దృష్టించారు. వారు ఆయనను సుంకరులకు, వేశ్యలకు స్నేహితుడు అని పిలిచారు. (లూకా 7:34, 37-39) వారు ఆయన ముఖం మీద ఉమ్మివేశారు. వారు ఆయనను తమ పిడికిళ్ళతో గుద్ది, ఆయనను దూషించారు. వారు ఆయనను అపహాస్యం చేశారు. (మత్తయి 26:67) సత్యానికి శత్రువులైన వీరిచే ప్రభావితం చేయబడి, యేసు “స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.”—యోహాను 1:10, 11.

18. యేసు ఎన్నడూ అస్వస్థతకు గురికాలేదు గనుక, ఆయన ఎలా “వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడుగాను” ఉన్నాడు?

18 పరిపూర్ణ మానవునిగా యేసు వ్యాధిగ్రస్థుడు కాలేదు. అయినప్పటికీ, ఆయన “వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడుగాను” ఉన్నాడు. అలాంటి వ్యసనాలు, వ్యాధులు ఆయనకు వచ్చినవి కాదు. యేసు పరలోకం నుండి రోగగ్రస్థమైన లోకంలోకి వచ్చాడు. ఆయన బాధావేదనల మధ్య జీవించాడు గానీ శారీరకంగా లేక ఆధ్యాత్మికంగా రోగగ్రస్థులై ఉన్నవారిని దూరంగా ఉంచలేదు. శ్రద్ధగల వైద్యునిలా, ఆయన తన చుట్టూవున్న వారి బాధను గూర్చి ఎంతోబాగా తెలుసుకున్నాడు. అంతేగాక, ఆయన సాధారణ మానవ వైద్యులెవరూ చేయలేని దాన్ని చేయగలిగాడు.—లూకా 5:27-32.

19. ‘చూడనొల్లనివానిగా’ మనుష్యులు ఎవరిని ఎంచారు, తాము ‘అతనిని ఎన్నికచేయలేదని’ యేసు శత్రువులు ఎలా చూపించారు?

19 ఏదేమైనప్పటికీ, యేసు శత్రువులు ఆయనను రోగగ్రస్థునిగా దృష్టించి, ఆయనపట్ల సద్భావాన్ని కలిగి ఉండడానికి నిరాకరించారు. వారు ఆయనను ‘మనుష్యులు చూడనొల్లనివానిగా’ దృష్టించారు. యేసు వ్యతిరేకులు, ఎంత తిరుగుబాటు చేసేవానిగా ఆయనను దృష్టించారంటే, ఆయన చూడడానికి కూడా అసహ్యమైనవాడన్నట్లు ఆయన నుండి తొలగిపోయారు. వారు ఆయన విలువను ఒక దాసుని విలువకంటే ఎక్కువగా పరిగణించలేదు. (నిర్గమకాండము 21:32; మత్తయి 26:14-16) వారు హంతకుడైన బరబ్బాను ఆయనకంటే ఉన్నతుడిగా ఎంచారు. (లూకా 23:18-25) యేసుపట్ల తమకున్న దురభిప్రాయాన్ని చూపించడానికి వారు అంతకన్నా ఇంకేమి చేయగలిగేవారు?

20. యెహోవా ప్రజలకు నేడు యెషయా మాటలు ఏ ఓదార్పును ఇస్తాయి?

20 యెషయా మాటల నుండి యెహోవా సేవకులు నేడు ఎంతో ఓదార్పును పొందవచ్చు. కొన్నిసార్లు, వ్యతిరేకులు యెహోవా నమ్మకమైన ఆరాధకులను ఏవగించుకోవచ్చు లేదా వారు ఎన్నికలేని వారన్నట్లు వారితో వ్యవహరించవచ్చు. అయినప్పటికీ, యేసు విషయంలోలాగే, యెహోవా దేవుడు మనకు ఎంత విలువ ఇస్తాడన్నదే నిజంగా ప్రాముఖ్యమైన విషయం. మనుష్యులు ‘యేసును ఎన్నిక చేయకపోయినప్పటికీ,’ దేవుని దృష్టిలో ఆయనకున్న గొప్ప విలువను అది ఖచ్చితంగా మార్చలేదు!

‘మన అతిక్రమమునుబట్టి గాయపరచబడ్డాడు’

21, 22. (ఎ) మెస్సీయ ఇతరుల కోసం ఏమి మోశాడు, ఏమి భరించాడు? (బి) చాలామంది మెస్సీయను ఎలా పరిగణించారు, ఆయన అనుభవించిన బాధలు దేనితో చరమాంకాన్ని చేరుకున్నాయి?

21 మెస్సీయ ఎందుకు బాధననుభవించి మరణించాలి? యెషయా ఇలా వివరిస్తున్నాడు: “నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను; మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడినవానిగాను, దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను; మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను, అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి; మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను; యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.”—యెషయా 53:4-6.

22 మెస్సీయ ఇతరుల రోగములను భరించి, వారి వ్యసనములను వహించాడు. సూచనార్థకంగా చెప్పాలంటే, ఆయన వారి భారములను తన భుజములపైకి ఎత్తుకుని, వాటిని మోశాడు. రోగము, వ్యసనము మానవజాతి పాపభరితమైన స్థితి యొక్క పర్యవసానాలు గనుక, మెస్సీయ ఇతరుల పాపాలను మోశాడు. చాలామందికి ఆయన బాధలు అనుభవించడానికి గల కారణం అర్థం కాలేదు, దేవుడు ఆయనను శిక్షిస్తున్నాడనీ అందుకే ఆయనను అసహ్యకరమైన రోగంతో మొత్తాడనీ వారు విశ్వసించారు. c మెస్సీయ అనుభవించిన బాధలు ఆయన గాయపరచబడి, నలుగగొట్టబడి, దెబ్బలు తినడంతో చరమాంకాన్ని చేరుకున్నాయి, హింసాత్మకమైన బాధాకరమైన మరణాన్ని సూచించే ఈ పదాలు చాలా శక్తివంతమైనవి. కానీ ఆయన మరణానికి ప్రాయశ్చిత్తం చేసే శక్తి ఉంది; అది తప్పు చేస్తూ పాపం చేస్తూ చెడుమార్గంలో వెళ్ళేవారు దేవునితో సమాధానాన్ని పొందడానికి వారికి సహాయం చేస్తూ వారు తిరిగి కోలుకోవడానికి ఆధారాన్ని ఇస్తుంది.

23. యేసు ఏ విధంగా ఇతరుల బాధలను భరించాడు?

23 యేసు ఎలా ఇతరుల బాధలను భరించాడు? యెషయా 53:4 వ వచనాన్ని ఎత్తివ్రాస్తూ మత్తయి సువార్త ఇలా చెబుతోంది: “జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. ఆయన మాటవలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన—ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పబడినది నెరవేరెను.” (మత్తయి 8:16, 17) వివిధ రోగాలతో తన వద్దకు వచ్చినవారిని స్వస్థపరచడం ద్వారా, యేసు వారి బాధలను తనపైకి తీసుకున్నాడు. అలాంటి స్వస్థతలు చేయడానికి ఆయన తన శక్తిని వెచ్చించవలసి వచ్చింది. (లూకా 8:43-48) అన్నిరకాల రుగ్మతలను, శారీరక, ఆధ్యాత్మిక రోగాలను స్వస్థపరిచేందుకు ఆయనకున్న సామర్థ్యం, ప్రజలను పాపాల నుండి శుద్ధీకరించే శక్తి ఆయనకివ్వబడిందని నిరూపించింది.—మత్తయి 9:2-8.

24. (ఎ) యేసు, దేవునిచే ‘మొత్తబడ్డాడని’ అనేకులకు ఎందుకు అనిపించింది? (బి) యేసు ఎందుకు బాధననుభవించి మరణించాడు?

24 అయినప్పటికీ యేసు, దేవునిచే ‘మొత్తబడ్డాడని’ అనేకులకు అనిపించింది. ఎంతైనా, ఆయన గౌరవనీయులైన మతనాయకుల ప్రోద్భలం మూలంగా బాధను అనుభవించాడు కదా. అయితే, ఆయన బాధననుభవించింది ఆయనేదో పాపాలు చేసినందుకు కాదని గుర్తుంచుకోండి. పేతురు ఇలా చెబుతున్నాడు: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థతనొందితిరి.” (1 పేతురు 2:21, 22, 24) ఒకప్పుడు మనమందరం ‘గొఱ్ఱెలవలె దారితప్పి’ పాపులమైనందుకు దారితప్పిపోయాము. (1 పేతురు 2:25) అయితే, యేసు ద్వారా యెహోవా మన పాపభరితమైన స్థితి నుండి మనకు విమోచనను అనుగ్రహించాడు. ఆయన మన దోషమును యేసు ‘మీద మోపాడు.’ పాపరహితుడైన యేసు మన పాపాలకు పరిహారంగా ఇష్టపూర్వకంగా శిక్షననుభవించాడు. అనుచితంగా మ్రానుపై అవమానకరంగా మరణించడం ద్వారా మనం దేవునితో సమాధానం పొందడాన్ని ఆయన సాధ్యం చేశాడు.

‘అతడు బాధింపబడెను’

25. మెస్సీయ ఇష్టపూర్వకంగా బాధననుభవించి మరణించాడని మనకెలా తెలుసు?

25 మెస్సీయ బాధననుభవించి మరణించడానికి సుముఖంగా ఉన్నాడా? యెషయా ఇలా చెబుతున్నాడు: “అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.” (యెషయా 53:7) యేసు తన జీవితంలోని చివరి రాత్రి తన సహాయార్థం “పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువమంది దూతలను” రప్పించుకొని ఉండగలిగేవాడే. కానీ “నేను వేడుకొనిన యెడల—ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని” ఆయన అన్నాడు. (మత్తయి 26:53, 54) అంతేకానీ, “దేవుని గొఱ్ఱెపిల్ల” ఏ మాత్రం ఎదిరించలేదు. (యోహాను 1:29) ప్రధాన యాజకులు, పెద్దలు పిలాతు ఎదుట ఆయనపై అబద్ధంగా నిందారోపణలు చేసినప్పుడు, యేసు “ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.” (మత్తయి 27:11-14) తన విషయమై దేవుని చిత్తం నెరవేరడాన్ని ఆటంకపరచగల ఒక మాటకూడా అనడానికి ఆయన ఇష్టపడలేదు. తన మరణం విధేయులైన మానవజాతిని పాప, రోగ, మరణాల నుండి విమోచించగలదని గ్రహించినవాడై యేసు బలి అర్పించబడే గొఱ్ఱెపిల్లగా మరణించడానికి సుముఖంగా ఉన్నాడు.

26. యేసు శత్రువులు ఏ విధంగా “నిర్బంధం” పాటించారు?

26 యెషయా ఇప్పుడు మెస్సీయ అనుభవించే బాధలు, అవమానాన్ని గురించి మరిన్ని వివరాలను ఇస్తున్నాడు. ప్రవక్త ఇలా వ్రాస్తున్నాడు: ‘అన్యాయపు తీర్పునొందినవాడై [“నిర్బంధం మూలంగా, తీర్పు మూలంగా,” NW] అతడు కొనిపోబడెను; అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలోచించినవారెవరు [“ఆయన తరాన్ని గురించిన వివరాలపట్ల ఎవరు ఆసక్తి కలిగివుంటారు,” NW]?’ (యిషయా 53:8) చివరికి యేసును ఆయన శత్రువులు తీసుకువెళ్ళినప్పుడు, ఈ మతసంబంధమైన వ్యతిరేకులు ఆయనతో వ్యవహరించిన విధానంలో “నిర్బంధం” పాటించారు. అంటే వారు తమ ద్వేషాన్ని వ్యక్తం చేయడంలో నిర్బంధాన్ని పాటించారని కాదు గానీ వారు న్యాయాన్ని నిర్బంధించారు లేదా బిగబట్టారు. గ్రీకు సెప్టాజింట్‌ యెషయా 53:8 వ వచనాన్ని అనువదించడంలో “నిర్బంధం” అనేదానికి బదులుగా “అవమానం” అనే పదాన్ని ఉపయోగించింది. ఒక సామాన్య నేరస్థుడు సహితం పొందదగిన న్యాయబద్ధమైన వ్యవహారాన్ని కూడా నిర్బంధించడం ద్వారా యేసు శత్రువులు ఆయనను అవమానించారు. యేసుకు జరిగిన విచారణ న్యాయాన్నే వెక్కిరించింది. అదెలా?

27. యూదా మతనాయకులు యేసును విచారణ చేస్తున్నప్పుడు, వారు ఏ నియమాలను అలక్ష్యం చేశారు, వారు ఏ యే విధాలుగా దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు?

27 యేసును వదిలించుకోవాలనే నిశ్చయతను బట్టి యూదా మత నాయకులు తమ సొంత నియమాలనే అతిక్రమించారు. సాంప్రదాయం ప్రకారం, యూదుల న్యాయసభ ఆలయంలోని చెక్కబడిన రాళ్ళ చావడిలోనే, మరణశిక్షకు అర్హమైన నేరాన్ని విచారణ చేయాలి గానీ ప్రధాన యాజకుని ఇంట్లో కాదు. అలాంటి విచారణ పగటి సమయంలోనే జరగాలి గానీ సూర్యాస్తమయం తర్వాత కాదు. మరణశిక్ష విధించబడడానికి అర్హమైన నేరంలో, విచారణ ముగిసిన మరునాడు, దోషి అన్న తీర్పును ప్రకటించాలి. కాబట్టి, సబ్బాతు లేక పండుగ ముందు రోజున ఏ విచారణలు జరుగకూడదు. యేసు విచారణ విషయంలో ఈ నియమాలన్నీ అలక్ష్యం చేయబడ్డాయి. (మత్తయి 26:57-68) అంతకంటే ఘోరమేమిటంటే, మత నాయకులు విచారణ చేస్తున్నప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని బాహాటంగా ఉల్లంఘించారు. ఉదాహరణకు, యేసును చిక్కించుకోవడానికి వారు లంచం ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. (ద్వితీయోపదేశకాండము 16:19; లూకా 22:2-6) వారు అబద్ధ సాక్షులు చెప్పే సాక్ష్యాన్ని విన్నారు. (నిర్గమకాండము 20:16; మార్కు 14:55, 56) వారు ఒక హంతకుడిని విడుదల చేయడానికి కుట్ర పన్నడం ద్వారా తమపైకి, తమ దేశంపైకి రక్తాపరాధాన్ని తెచ్చుకున్నారు. (సంఖ్యాకాండము 35:31-34; ద్వితీయోపదేశకాండము 19:11-13; లూకా 23:16-25) కాబట్టి, “తీర్పు” తీర్చబడలేదు, సరైన నిష్పక్షపాతమైన తీర్పు తీర్చబడేలా న్యాయబద్ధమైన విచారణ జరుగలేదు.

28. యేసు శత్రువులు ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకోవడంలో విఫలమయ్యారు?

28 తమ ఎదుట విచారణ కోసం నిలబడి ఉన్నది ఎవరో తెలుసుకోవడానికి యేసు శత్రువులు ఏమైనా పరిశీలన చేశారా? యెషయా అటువంటి ప్రశ్నే వేస్తున్నాడు: “ఆయన తరాన్ని గురించిన వివరాలపట్ల ఎవరు ఆసక్తి కలిగివుంటారు?” “తరము” అనే పదం ఒకరి వంశాన్ని లేదా నేపథ్యాన్ని సూచించవచ్చు. యేసు యూదుల మహాసభ ఎదుట విచారణ కోసం నిలబడి ఉండగా, దాని సభ్యులు ఆయన నేపథ్యాన్ని అంటే వాగ్దానం చేయబడిన మెస్సీయకు ఉండవలసిన అర్హతలన్నీ ఆయనకు ఉన్నాయన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. బదులుగా, వారు ఆయనపై దైవదూషణ నింద మోపి, ఆయనను మరణానికి పాత్రునిగా పరిగణించారు. (మార్కు 14:64) తర్వాత, ఒత్తిడికి లొంగిపోయిన రోమా గవర్నరైన పొంతి పిలాతు యేసును మ్రానుపై వ్రేలాడదీయమని శిక్షవిధించాడు. (లూకా 23:13-25) అలా యేసు కేవలం 33 1/2 సంవత్సరాల వయస్సులో, తన జీవిత మధ్యకాలంలో ‘కొట్టివేయబడ్డాడు.’

29. యేసు ఎలా “భక్తిహీనులతో” అలాగే ‘ధనవంతులతో’ సమాధి చేయబడ్డాడు?

29 మెస్సీయ మరణ భూస్థాపనల గురించి యెషయా తర్వాత ఇలా వ్రాస్తున్నాడు: “అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు.” (యెషయా 53:9) యేసు తన మరణ భూస్థాపనలలో ఎలా భక్తిహీనులతోనూ, ధనవంతులతోనూ ఉన్నాడు? ఆయన సా.శ. 33 నీసాను 14న యెరూషలేము గోడల వెలుపల హింసా కొయ్యపై మరణించాడు. ఆయన ఇద్దరు దొంగల మధ్యన కొయ్యపై వ్రేలాడదీయబడ్డాడు గనుక, ఒక విధంగా ఆయన భూస్థాపన స్థలం భక్తిహీనుల మధ్య ఉండింది. (లూకా 23:33) అయితే యేసు మరణించిన తర్వాత అరిమతయియకు చెందిన యోసేపు అనే ఒక ధనవంతుడు యేసు దేహాన్ని క్రిందకు దింపి దాన్ని సమాధి చేయడానికి అనుమతి ఇవ్వమని పిలాతును అడగడానికి ధైర్యం కూడగట్టుకున్నాడు. యోసేపు నీకొదేముతో కలిసి, సమాధి చేయడానికి యేసు దేహాన్ని సిద్ధం చేసి, తనకు చెందిన, క్రొత్తగా తొలిపించబడిన సమాధిలో దాన్ని పెట్టాడు. (మత్తయి 27:57-60; యోహాను 19:38-42) కాబట్టి యేసు సమాధి ధనవంతులతోపాటు కూడా ఉంది.

“అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను”

30. యేసును నలుగగొట్టడంలో యెహోవా ఏ భావంలో ఆనందాన్ని పొందాడు?

30 తర్వాత యెషయా చాలా ఆశ్చర్యం కలిగించే విషయం చెబుతున్నాడు: “అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానముచేత అనేకులను నిర్దోషులుగా చేయును.” (యెషయా 53:10, 11) ఈ నమ్మకమైన సేవకుడిని నలుగగొట్టడం యెహోవాకు ఎలా ఇష్టం కాగలదు? స్పష్టంగా, యెహోవా తాను వ్యక్తిగతంగా తన ప్రియకుమారునిపైకి బాధను తీసుకురాలేదు. యేసుకు జరిగిన దానికి ఆయన శత్రువులే పూర్తిగా బాధ్యులు. కానీ వారు క్రూరంగా ప్రవర్తించడానికి యెహోవా అనుమతించాడు. (యోహాను 19:11) ఏ కారణాన్ని బట్టి? సహానుభూతి, ప్రేమా వాత్సల్యములు గల దేవుడు నిర్దోషియైన తన కుమారుడు బాధపడడం చూసి నిజంగా ఎంతో వేదనచెందాడు. (యెషయా 63:9; లూకా 1:76-79) యెహోవాకు యేసుపై ఎటువంటి అయిష్టతా లేదు. అంతేగాక, తన కుమారుడు బాధననుభవిస్తే లభించే ఆశీర్వాదములను బట్టి, బాధననుభవించడానికి తన కుమారుడు చూపించిన ఇష్టతను బట్టి యెహోవా ఎంతో ఆనందించాడు.

31. (ఎ) యెహోవా ఏ విధంగా యేసు ప్రాణాన్ని ‘అపరాధపరిహారార్థబలిగా’ నిర్ణయించాడు? (బి) మానవునిగా యేసు బాధనంతటినీ అనుభవించిన తర్వాత, ప్రాముఖ్యంగా ఆయనకు ఏది సంతృప్తిని ఇచ్చి ఉండవచ్చు?

31 ఆశీర్వాదాల్లో ఒకటేమిటంటే, యెహోవా యేసు ప్రాణమును ‘అపరాధపరిహారార్థబలిగా’ నిర్ణయించాడు. కాబట్టి, యేసు తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళినప్పుడు ఆయన అపరాధపరిహారార్థబలిగా అర్పించబడిన తన మానవ జీవిత విలువతో యెహోవా సమక్షంలోకి ప్రవేశించాడు, మానవజాతి అంతటి పక్షాన దాన్ని అంగీకరించడానికి యెహోవా ఎంతో సంతోషించాడు. (హెబ్రీయులు 9:24; 10:5-14) యేసు తన అపరాధపరిహారార్థ బలి ద్వారా “సంతానము”ను సంపాదించుకున్నాడు. “నిత్యుడగు తండ్రి”గా ఆయన తాను చిందించిన రక్తంలో విశ్వాసం ఉంచే వారికి జీవాన్ని, నిత్యజీవాన్ని ఇవ్వగలడు. (యెషయా 9:6) మానవునిగా యేసు అంత బాధననుభవించిన తర్వాత, మానవజాతిని పాపమరణాల నుండి విమోచించే ఉత్తరాపేక్షను పొందడం ఆయనకు ఎంత సంతృప్తిని ఇచ్చి ఉండవచ్చో కదా! తాను చూపించిన యథార్థత, తన పరలోకపు తండ్రి తన శత్రువైన అపవాదియగు సాతాను నిందలకు సమాధానం ఇచ్చేలా ఆయనకు అవకాశాన్నిచ్చిందని తెలుసుకోవడం యేసుకు మరింత సంతృప్తిని ఇచ్చివుండవచ్చు.—సామెతలు 27:11.

32. యేసు ఏ “అనుభవజ్ఞానము” మూలంగా “అనేకులను నిర్దోషులుగా” చేస్తాడు, ఎవరు అలా చేయబడతారు?

32 యేసు మరణం నుండి లభించే మరో ఆశీర్వాదం ఏమిటంటే, ఇప్పుడు కూడా ఆయన ‘అనేకులను నిర్దోషులుగా చేస్తాడు.’ ఆయన “తనకున్న అనుభవజ్ఞానముచేత” అలా చేస్తాడని యెషయా చెబుతున్నాడు. ఈ అనుభవజ్ఞానము, యేసు మానవుడై దేవునికి విధేయత చూపినందుకు అన్యాయంగా బాధననుభవించడం ద్వారా సంపాదించుకున్నదని స్పష్టమవుతోంది. (హెబ్రీయులు 4:15) యేసు మరణము నొందునంతగా బాధననుభవించి, ఇతరులు నిర్దోషులుగా నిర్ణయించబడడానికి సహాయం చేసేందుకు అవసరమైన బలిని ఇవ్వగలిగాడు. ఈ నిర్దోషత్వపు స్థితి ఎవరికి లభిస్తుంది? మొదటిగా, ఆయన అభిషిక్త అనుచరులకు. ఎందుకంటే వారు యేసు బలియందు విశ్వాసం ఉంచుతారు, యెహోవా వారిని తన కుమారులుగా చేసుకొని, వారిని యేసుతోపాటు సహవారసులుగా చేయాలనే ఉద్దేశంతో వారిని నిర్దోషులుగా తీరుస్తాడు. (రోమీయులు 5:19; 8:16, 17) తర్వాత, “వేరే గొఱ్ఱె”లకు చెందిన “గొప్ప సమూహము” యేసు చిందించిన రక్తంలో విశ్వాసముంచి, దేవుని స్నేహితులయ్యేలా, హార్‌మెగిద్దోనును తప్పించుకొని జీవించేవారయ్యేలా నిర్దోషులుగా తీర్చబడతారు.—ప్రకటన 7:9; 16:14, 16; యోహాను 10:16; యాకోబు 2:23, 25.

33, 34. (ఎ) మన హృదయాలను ఉత్తేజపరిచే, యెహోవాకు సంబంధించిన ఏ విషయాన్ని మనం తెలుసుకుంటాము? (బి) సేవకుడైన మెస్సీయ ఏ “అనేకుల”తోపాటు “పాలు”పొందుతాడు?

33 చివరికి, మెస్సీయ పొందే విజయాలను యెషయా ఇలా వర్ణిస్తున్నాడు: ‘కావున గొప్పవారితో [“అనేకులతో,” NW] నేనతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను.’—యెషయా 53:12.

34 యెషయా ప్రవచనంలోని ఈ భాగంలో ఉన్న ముగింపు మాటలు యెహోవా గురించి హృదయోత్తేజకరమైన ఒక విషయాన్ని బోధిస్తాయి: ఆయనపట్ల యథార్థంగా ఉండేవారిని ఆయన విలువైనవారిగా ఎంచుతాడు. తన సేవకుడైన మెస్సీయకు ‘అనేకులతో పాలుపంచిపెడతానని’ ఆయన చేసిన వాగ్దానం ద్వారా ఇది సూచించబడుతుంది. యుద్ధంలో లభించిన కొల్లసొమ్మును పంచుకోవడమనే ఆచారం నుండి ఈ మాటలు తీసుకోబడ్డాయని స్పష్టమవుతోంది. నోవహు, అబ్రాహాము, యోబు వంటివారితో సహా ప్రాచీన కాలాలకు చెందిన ‘అనేకులైన’ నమ్మకమైన వారి యథార్థతను యెహోవా విలువైనదిగా ఎంచి, రానున్న నూతన లోకంలో ఆయన వారికి “పాలు” ఉంచాడు. (హెబ్రీయులు 11:13-16) అలాగే, ఆయన తన సేవకుడైన మెస్సీయకు కూడా పాలుపంచి పెడతాడు. వాస్తవానికి, యేసు యథార్థతకు తగిన ప్రతిఫలం లభించకుండా పోయేందుకు యెహోవా అనుమతించడు. యెహోవా ‘మనం చేసిన కార్యమును, ఆయన నామమును బట్టి చూపిన ప్రేమను మరువడని’ మనం కూడా నిశ్చయత కలిగి ఉండవచ్చు.—హెబ్రీయులు 6:10.

35. యేసుతో కొల్లసొమ్ము పంచుకునే ‘ఘనులు’ ఎవరు, కొల్లసొమ్ము అంటే ఏమిటి?

35 దేవుని సేవకుడు తన శత్రువులపై విజయం సాధించడం ద్వారా కూడా కొల్లసొమ్ము సంపాదించుకుంటాడు. ఆయన ఈ కొల్లసొమ్మును “ఘనులతో” కలిసి విభాగించుకుంటాడు. నెరవేర్పులో, ‘ఘనులు’ ఎవరు? వారు యేసులా లోకాన్ని జయించే ఆయన మొదటి శిష్యులు, అంటే “దేవుని ఇశ్రాయేలు”కు చెందిన 1,44,000 మంది పౌరులు. (గలతీయులు 6:16; యోహాను 16:33; ప్రకటన 3:21; 14:1) మరి కొల్లసొమ్ము ఏమిటి? వీరిలో ‘మనుష్యులలో ఈవులు’ కూడా ఉన్నారు, ఒక విధంగా చెప్పాలంటే యేసు వీరిని సాతాను ఆధీనంలో నుండి విడిపించి క్రైస్తవ సంఘానికి అప్పగిస్తాడు. (ఎఫెసీయులు 4:8-12) 1,44,000 మంది ‘ఘనులకు’ మరో కొల్లసొమ్ము నుండి కూడా పాలు ఇవ్వబడుతుంది. వారు లోకాన్ని జయించిన కారణంగా దేవుడ్ని నిందించేందుకు సాతానుకు ఆధారం లేకుండా చేస్తారు. యెహోవాపట్ల వారికున్న అచంచలమైన భక్తి ఆయన హృదయానికి ఆనందం కలిగిస్తూ, ఆయనను ఘనపరుస్తుంది.

36. దేవుని సేవకుడిని గురించిన ప్రవచనాన్ని తాను నెరవేరుస్తున్నానని యేసుకు తెలుసా? వివరించండి.

36 దేవుని సేవకుడిని గురించిన ప్రవచనాన్ని తాను నెరవేరుస్తున్నానని యేసుకు తెలుసు. ఆయన తాను నిర్బంధించబడిన నాటి రాత్రి, యెషయా 53:12 వ వచనాన్ని ఎత్తి చెబుతూ, “ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసియున్నది. ఏలయనగా నన్నుగూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని” చెప్పి, వాటిని తనకు అన్వయించుకున్నాడు. (లూకా 22:36, 37) విచారకరంగా, యేసు నిజంగానే అక్రమకారునిగా వ్యవహరించబడ్డాడు. ఆయన చట్టాన్ని ఉల్లంఘించిన వానిగా తీర్పుతీర్చబడి, ఇద్దరు దొంగల మధ్యన మ్రానుపై వ్రేలాడదీయబడ్డాడు. (మార్కు 15:27) అయినప్పటికీ, ఆయన తాను మన పక్షాన మధ్యవర్తిత్వం నెరుపుతున్నాననే పూర్తి గ్రహింపుతో, ఇష్టపూర్వకంగా ఆ నిందను భరించాడు. నిజానికి ఆయన పాపులకూ మరణశిక్ష దాడికీ మధ్య నిలబడి తానే ఆ దెబ్బను పొందాడు.

37. (ఎ) యేసు జీవిత మరణాలను గురించిన చారిత్రక వృత్తాంతం ఏ విషయాన్ని స్పష్టంగా గ్రహించడానికి మనకు సహాయం చేస్తుంది? (బి) మనం యెహోవా దేవునికి, ఉన్నతపరచబడిన ఆయన సేవకుడైన యేసుక్రీస్తుకు ఎందుకు కృతజ్ఞులమై ఉండాలి?

37 యేసు జీవిత మరణాలను గురించిన చారిత్రక వృత్తాంతం, మనం ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహించేలా చేస్తుంది: యేసు క్రీస్తే యెషయా ప్రవచనంలోని మెస్సీయ సేవకుడు. మనం పాపమరణాల నుండి విమోచించబడేలా తన ప్రియకుమారుడు బాధననుభవిస్తూ, మరణిస్తూ, సేవకుడిని గురించిన ప్రవచనార్థక పాత్రను నెరవేర్చడానికి అనుమతించేందుకు యెహోవా ఇష్టపడినందుకు మనమెంత కృతజ్ఞత కలిగివుండాలో కదా! అలా యెహోవా మనపట్ల గొప్ప ప్రేమను చూపించాడు. రోమీయులు 5:8 ఇలా చెబుతోంది: “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” మరణమందు తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా ధారపోసిన హెచ్చింపబడిన సేవకుడైన యేసుక్రీస్తుపట్ల కూడా మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలో కదా!

[అధస్సూచీలు]

a జె. ఎఫ్‌. స్టెన్నింగ్‌ అనువదించినట్లుగా, జోనాతాన్‌ బెన్‌ ఉజెయెల్‌ (సా.శ. మొదటి శతాబ్దం) యొక్క టార్గమ్‌ యెషయా 52:13 వ వచనాన్ని గురించిన వివరణలో ఇలా పేర్కొంటోంది: “చూడండి, నా సేవకుడు, అభిషిక్తుడు (లేక, మెస్సీయ) వర్ధిల్లుతాడు.” అలాగే, బబులోను టాల్ముడ్‌ (ఇంచుమించు సా.శ. మూడవ శతాబ్దం) ఇలా చెబుతోంది: “మెస్సీయ—ఆయన పేరేమిటి? . . . చెప్పబడినట్లుగానే, [రోగియైనవాడు] ‘నిజంగా మన రోగములను భరించాడు’ అని రబ్బీ గృహానికి చెందిన [వారు చెబుతారు].”—సన్హెడ్రిన్‌ 98బి; యెషయా 53:4.

b మీకా ప్రవక్త బేత్లెహేమును ‘యూదావారి కుటుంబములలో స్వల్పగ్రామము’ అని పేర్కొన్నాడు. (మీకా 5:2) అయినప్పటికీ, చిన్నదైన బేత్లెహేము మెస్సీయ జన్మించే పట్టణంగా ఉండే ప్రత్యేకమైన ఘనతను పొందింది.

c ‘మొత్తబడడం’ అని అనువదించబడిన హీబ్రూ పదం కుష్ఠువ్యాధికి సంబంధించి కూడా ఉపయోగించబడింది. (2 రాజులు 15:5) కొంతమంది పండితులు చెబుతున్న దాని ప్రకారం, యెషయా 53:4 వ వచనాన్ని బట్టి, కొంతమంది యూదులకు మెస్సీయ కుష్ఠురోగి అయ్యుంటాడనే తలంపు వచ్చింది. బబులోను టాల్ముడ్‌ మెస్సీయను “కుష్ఠురోగి పండితుడు” అని పిలువడం ద్వారా ఈ వచనాన్ని మెస్సీయకు అన్వయిస్తోంది. లాటిన్‌ వల్గేట్‌ వలెనే క్యాతలిక్‌ డుయే వర్షన్‌, ఆ వచనాన్ని ఇలా అనువదిస్తోంది: “మనం ఆయన కుష్ఠురోగి అన్నట్లు భావించాము.”

[అధ్యయన ప్రశ్నలు]

[212 వ పేజీలోని చార్టు]

యెహోవా సేవకుడు

ఆపాత్రను యేసు నిర్వహించిన విధానం

ప్రవచనం సంఘటన నెరవేర్పు

యెష. 52:13

ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడ్డాడు

అపొ. 2:34-36; ఫిలి. 2:8-11; 1 పేతు. 3:22

యెష. 52:14

తప్పుగా చిత్రీకరించబడ్డాడు, అప్రతిష్ఠపాలయ్యాడు

మత్త. 11:19; 27:39-44, 63, 64; యోహా. 8:48; 10:20

యెష. 52:15

అనేక జనములను విస్మయపరిచాడు

మత్త. 24:30; 2 థెస్స. 1:6-10; ప్రక. 1:7

యెష. 53:1

విశ్వసించబడలేదు

యోహా. 12:37, 38; రోమా. 10:11, 16, 17

యెష. 53:2

మానవునిగా సామాన్యమైన నిరాడంబరమైన ప్రారంభం

లూకా 2:7; యోహా. 1:46

యెష. 53:3

తృణీకరింపబడి, నిరాకరించబడ్డాడు

మత్త. 26:67; లూకా 23:18-25; యోహా. 1:10, 11

యెష. 53:4

మన రోగములను భరించాడు

మత్త. 8:16, 17; లూకా 8:43-48

యెష. 53:5

గాయపరచబడ్డాడు

మత్త. 27:49 అధస్సూచి

యెష. 53:6

ఇతరుల దోషములను బట్టి బాధననుభవించాడు

1 పేతు. 2:21-25

యెష. 53:7

నిందించేవారి ఎదుట మౌనముగా, ఫిర్యాదు చేయకుండావున్నాడు

మత్త. 27:11-14; మార్కు 14:60, 61; అపొ. 8:32, 35

యెష. 53:8

అన్యాయంగా విచారణ చేయబడ్డాడు, నిందించబడ్డాడు

మత్త. 26:57-68; 27:1, 2, 11-26; యోహా. 18:12-14, 19-24, 28-40

యెష. 53:9

ధనికులతో సమాధి చేయబడ్డాడు

మత్త. 27:57-60; యోహా. 19:38-42

యెష. 53:10

ప్రాణము అపరాధపరిహారార్థబలిగా నిర్ణయించబడింది

హెబ్రీ. 9:24; 10:5-14

యెష. 53:11

అనేకులు నిర్దోషులుగా తీర్చబడడానికి మార్గాన్ని తెరిచాడు

రోమా. 5:18, 19; 1 పేతు. 2:24; ప్రక. 7:14

యెష. 53:12

పాపులతో లెక్కించబడ్డాడు

మత్త. 26:55, 56; 27:38; లూకా 22:36, 37

[203 వ పేజీలోని చిత్రం]

‘ఆయన మనుష్యులచే తృణీకరించబడ్డాడు’

[206 వ పేజీలోని చిత్రం]

‘ఆయన తన నోరు తెరువలేదు’

[చిత్రసౌజన్యం]

Detail from “Ecce Homo” by Antonio Ciseri

[211 వ పేజీలోని చిత్రం]

“అతడు తన ప్రాణమును ధారపోసెను”