కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా—‘నీతిమంతుడైన దేవుడు, రక్షకుడు’

యెహోవా—‘నీతిమంతుడైన దేవుడు, రక్షకుడు’

ఆరవ అధ్యాయం

యెహోవా​—⁠‘నీతిమంతుడైన దేవుడు, రక్షకుడు’

యెషయా 45:​1-25

1, 2. యెషయా 45 వ అధ్యాయంలో ఏ హామీలు ఇవ్వబడ్డాయి, ఏ ప్రశ్నలు పరిశీలించబడతాయి?

 యెహోవా వాగ్దానాలు నమ్మదగినవి. ఆయన బయలుపరిచే దేవుడు, సృష్టించే దేవుడు. ఆయన ఎన్నోసార్లు తనను తాను నీతిమంతుడైన దేవునిగా, అన్ని జనములకు చెందిన ప్రజల రక్షకునిగా నిరూపించుకున్నాడు. యెషయా 45 వ అధ్యాయంలో కనిపించే హృదయాన్ని పులకరింపజేసే హామీలలో ఇవి కొన్ని.

2 అంతేగాక, యెషయా 45 వ అధ్యాయంలో, యెహోవాకున్న ప్రవచించే సామర్థ్యాన్ని గురించిన గమనార్హమైన ఉదాహరణ ఉంది. యెషయా సుదూరానున్న దేశాలను చూడడానికి, రానున్న శతాబ్దాల్లో జరిగే సంఘటనలను పరిశీలించడానికి దేవుని ఆత్మ ఆయనకు సహాయం చేస్తుంది, నిజమైన ప్రవచనానికి దేవుడైన యెహోవా మాత్రమే అంత నిర్దిష్టంగా ప్రవచింపగల్గిన ఒక సంఘటనను వర్ణించడానికి కూడా ఆయనను ప్రేరేపిస్తుంది. ఏమిటా సంఘటన? యెషయా కాలంలో అది దేవుని ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుంది? నేడు మనకు అది ఏ భావాన్ని కలిగివుంది? మనం ప్రవక్త మాటలను పరిశీలిద్దాం.

బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా ప్రకటన

3. కోరెషు విజయాన్ని యెషయా 45:​1, 2, 3బి వచనాలు ఏ స్పష్టమైన వ్యక్తీకరణలతో వర్ణిస్తున్నాయి?

3 “అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను, నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.—⁠నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను. . . . అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను.”​—యెషయా 45:​1, 2, 3బి.

4. (ఎ) యెహోవా కోరెషును తాను “అభిషేకించిన” వాడని ఎందుకు పిలుస్తున్నాడు? (బి) యెహోవా కోరెషుకు విజయాన్ని ఎలా చేకూరుస్తాడు?

4 యెషయా కాలంనాటికి కోరెషు ఇంకా జన్మించకపోయినప్పటికీ అతడు ఉనికిలో ఉన్నట్లే యెహోవా యెషయా ద్వారా అతనితో మాట్లాడతాడు. (రోమీయులు 4:​17) ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించడానికి యెహోవా కోరెషును ముందుగానే నియమిస్తాడు గనుక కోరెషు దేవుడు “అభిషేకించిన” వాడని చెప్పవచ్చు. దేవుని అండదండలతో అతడు రాజులను బలహీనంచేసి, వారిని నిర్వీర్యులుగా చేస్తూ జనములను లోబరచుకుంటాడు. తర్వాత, కోరెషు బబులోనుపై దండెత్తినప్పుడు యెహోవా ఆ నగర ద్వారములు తెరిచివుండేలా చేసి, వాటిని విరిగిపోయిన తలుపుల్లాగా పనికిరాకుండా చేస్తాడు. ఆయన కోరెషు ఎదుటి నుండి అన్ని ఆటంకాలను తొలగిస్తూ అతనికి ముందుగా వెళతాడు. చివరలో, కోరెషు సైన్యాలు నగరాన్ని జయించి, దానిలోవున్న “రహస్యస్థలములలోని మరుగైన ధనమును” అంటే అంధకారమయమైన ఖజానాగదుల్లో దాచబడివున్న సంపదను దోచుకుంటాయి. యెషయా ప్రవచించినదదే. మరి ఆయన మాటలు నిజమయ్యాయా?

5, 6. బబులోను కూలిపోవడం గురించిన ప్రవచనం ఎప్పుడు, ఎలా నెరవేరుతుంది?

5 సా.శ.పూ. 539 వ సంవత్సరంలో అంటే యెషయా ఈ ప్రవచనాన్ని వ్రాసిన దాదాపు 200 సంవత్సరాల తర్వాత, కోరెషు నిజంగానే బబులోనుపై దాడి చేయడానికి ఆ నగరపు గోడల వద్దకు వస్తాడు. (యిర్మీయా 51:​11, 12) అయితే, బబులోనీయులు నిర్లక్ష్యంగా ఉంటారు. తమ నగరం అజేయమైనదని వారు భావిస్తున్నారు. నగర రక్షణ వ్యవస్థలో భాగమైన యూఫ్రటీసు నది నుండి వస్తున్న నీటితో నిండివున్న లోతైన కందకాలకు ఇరువైపులా ఎత్తైన గోడలున్నాయి. వందకన్నా ఎక్కువ సంవత్సరాలుగా శత్రువులెవరూ బబులోనుపై దాడి చేయలేకపోయారు! వాస్తవానికి, బబులోనులో నివసిస్తూ బబులోనును పరిపాలిస్తున్న బెల్షస్సరు ఎంత సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాడంటే, అతడు తన దర్బారు సభ్యులతో విందు చేసుకుంటుంటాడు. (దానియేలు 5:⁠1) కోరెషు తాను పన్నిన, ప్రజ్ఞావంతమైన ఒక సైనిక వ్యూహాన్ని ఆ రాత్రి అంటే అక్టోబరు 5/6 రాత్రి ఆచరణలో పెడతాడు.

6 కోరెషు దగ్గరున్న, కాలువలను నిర్మించే ప్రావీణ్యతగల సుతారులు యూఫ్రటీసు నది బబులోనుకు చేరుకోకుండా మధ్యలోనే దాని ఒడ్డును ఛేదించి, నదీ జలాలు దక్షిణంవైపుగా అంటే బబులోను నగరం వైపుగా ప్రవహించకుండా ప్రక్కకు మళ్ళించారు. త్వరలోనే, బబులోను లోపలా, దాని చుట్టూ ప్రవహిస్తున్న నది నీటిమట్టం ఎంతగా తగ్గిపోతుందంటే, కోరెషు సైన్యాలు నగరం నడిబొడ్డువైపుగా నదీతలంపై నడిచి వెళ్ళగలుగుతారు. (యెషయా 44:​27; యిర్మీయా 50:​38) ఆశ్చర్యకరంగా, యెషయా ప్రవచించినట్లుగానే, నది పొడవునా ఉన్న ద్వారాలు తెరువబడి ఉంటాయి. కోరెషు సైన్యాలు గుంపులు గుంపులుగా బబులోనులోకి ప్రవేశించి, కోటను ఆక్రమించి, బెల్షస్సరు రాజును హతమారుస్తారు. (దానియేలు 5:​30) ఒక్క రాత్రిలో విజయం సాధించబడుతుంది. బబులోను పతనమైంది, ప్రవచనమంతా పొల్లుపోకుండా నెరవేరింది.

7. కోరెషును గురించిన యెషయా ప్రవచనపు గమనార్హమైన నెరవేర్పును బట్టి క్రైస్తవులు ఎలా బలపర్చబడతారు?

7 ఈ ప్రవచనం యొక్క ఖచ్చితమైన నెరవేర్పు నేడు క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇప్పటికి ఇంకా నెరవేరని బైబిలు ప్రవచనాలు కూడా పూర్తిగా నమ్మదగినవని విశ్వసించడానికి ఇది వారికి బలమైన ఆధారాన్నిస్తుంది. (2 పేతురు 1:​20, 21) సా.శ.పూ. 539 లో బబులోను కూలిపోవడమన్న సంఘటన, “మహాబబులోను” పతనానికి పూర్వఛాయగా ఉందనీ, ఆ సంఘటన పూర్వం 1919 లో సంభవించిందనీ నేటి యెహోవా ఆరాధకులకు తెలుసు. అయినప్పటికీ, ఆ ఆధునిక దిన మత సంస్థ నాశనం కోసం, అలాగే సాతాను అధికారం క్రిందనున్న రాజకీయ వ్యవస్థను నిర్మూలించడాన్ని గురించి చేయబడిన వాగ్దానం కోసం, సాతాను అగాధములో బంధించబడడం కోసం, క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి యొక్క ఆగమనం కోసం వారు ఎదురు చూస్తారు. (ప్రకటన 18:​2, 21; 19:​19-21; 20:​1-3, 12, 13; 21:​1-4) యెహోవా ప్రవచనాలు కేవలం వట్టి వాగ్దానాలు కాదు గానీ నిర్దిష్టమైన, భవిష్యద్‌ సంఘటనల వివరణలని వారికి తెలుసు. బబులోను పతనాన్ని గురించిన యెషయా ప్రవచనంలోని వివరాలన్నిటి నెరవేర్పును గుర్తు తెచ్చుకున్నప్పుడు నిజక్రైస్తవుల నమ్మకం బలపర్చబడుతుంది. యెహోవా ఎల్లప్పుడూ తన మాటలు నెరవేరుస్తాడని వారికి తెలుసు.

యెహోవా కోరెషుపట్ల అనుగ్రహం ఎందుకు చూపిస్తాడు?

8. యెహోవా కోరెషుకు బబులోనుపై విజయాన్ని ఇవ్వడానికి గల ఒక కారణం ఏమిటి?

8 బబులోనును ఎవరు జయిస్తారో, అది ఎలా సాధించబడుతుందో తెలియజేసిన తర్వాత, కోరెషుకు విజయం ఇవ్వబడడానికి గల ఒక కారణాన్ని యెహోవా వివరిస్తాడు. యెహోవా కోరెషుతో ప్రవచనార్థకంగా మాట్లాడుతూ, “పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు” అలా విజయం ఇవ్వబడుతుందని చెబుతాడు. (యెషయా 45: 3) బైబిలు చరిత్రలోని నాలుగవ ప్రపంచ ఆధిపత్యపు పరిపాలకుడు, తాను సాధించే అత్యంత గొప్ప విజయం తనకన్నా ఎంతో గొప్పవాడైన, విశ్వ సర్వాధిపతియైన యెహోవా మద్దతు ఫలితమే అని గుర్తించడం సముచితమైనదే. తనను పిలిచేది లేదా తనకు నియామకాన్ని ఇచ్చేది ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అని కోరెషు అంగీకరించాలి. తాను సాధించిన అత్యంత గొప్ప విజయానికి కారణం యెహోవాయేనని కోరెషు అంగీకరించినట్లు బైబిలు వృత్తాంతం చూపిస్తోంది.​—⁠ఎజ్రా 1: 2, 3.

9. బబులోనును జయించేందుకు యెహోవా కోరెషును తీసుకురావడానికి గల రెండవ కారణం ఏమిటి?

9 బబులోనును జయించేందుకు తాను కోరెషును తీసుకురావడానికిగల రెండవ కారణాన్ని యెహోవా ఇలా చెబుతున్నాడు: “నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని; నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని, నీకు బిరుదులిచ్చితిని.” (యెషయా 45: 4) కోరెషు బబులోనుపై సాధించిన విజయం ఎంతో ప్రాముఖ్యమైనది. అది ఒక ప్రపంచ ఆధిపత్య పతనాన్ని, మరొక ప్రపంచ ఆధిపత్య అధిరోహణాన్ని సూచిస్తుంది, అది చరిత్రపై తరతరాలకు చెరగని ముద్ర వేస్తుంది. అయినప్పటికీ, జరుగుతున్న సంఘటనలను ఆతృతతో గమనిస్తున్న ఇరుగుపొరుగు రాజ్యాలు, ఇదంతా బబులోనులో పరవాసులుగా ఉన్న కేవలం కొన్ని వేలమంది “అత్యల్ప” యూదుల కోసమే, యాకోబు సంతానం కోసమే జరుగుతుందని తెలుసుకున్నప్పుడు బహుశా ఆశ్చర్యపోవచ్చు. అయితే, ప్రాచీన ఇశ్రాయేలు జనాంగంలోని తప్పించుకొన్న ఈ ప్రజలు యెహోవా దృష్టిలో ఎంతమాత్రం అత్యల్పమైనవారు కాదు. వారు ఆయన ‘సేవకులు.’ భూమిపైనున్న జనములన్నిటిలోనూ వారు ఆయన “ఏర్పరచుకొనిన” వారు. అంతకుముందు యెహోవా ఎవరో కోరెషుకు తెలియకపోయినా, పరవాసులుగా ఉన్నవారిని విడుదల చేయడానికి నిరాకరించిన నగరాన్ని కూలదోయడానికి యెహోవా అతడిని తన అభిషిక్తునిగా ఉపయోగించుకున్నాడు. తాను ఏర్పరచుకొనిన ప్రజలు పరాయి గడ్డమీదే నిత్యం కృంగిపోవాలన్నది దేవుని సంకల్పం కాదు.

10. బబులోను ప్రపంచాధిపత్యాన్ని అంతమొందించడానికి యెహోవా కోరెషును ఉపయోగించుకోవడానికి గల అత్యంత ప్రాముఖ్యమైన కారణం ఏమిటి?

10 బబులోనును పడద్రోయడానికి యెహోవా కోరెషును ఉపయోగించుకోవడానికి మూడవ, మరింత ప్రాముఖ్యమైన కారణం ఉంది. యెహోవా ఇలా చెబుతున్నాడు: “నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొనునట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు.” (యెషయా 45:​5, 6) అవును, ప్రపంచాధిపత్యమైన బబులోను పడద్రోయబడడమన్నది యెహోవా దైవత్వాన్ని నిరూపించింది, ఆయన మాత్రమే ఆరాధింపబడటానికి అర్హుడనడానికి ప్రతి ఒక్కరికి రుజువు. దేవుని ప్రజలు విడుదల చేయబడ్డారు గనుక, తూర్పు నుండి పడమటి వరకు అనేక రాజ్యాలకు చెందిన వ్యక్తులు యెహోవా మాత్రమే ఏకైక సత్య దేవుడని అంగీకరిస్తారు.​—⁠మలాకీ 1:​11.

11. బబులోనుకు సంబంధించి తన సంకల్పాన్ని నెరవేర్చే శక్తి తనకుందని యెహోవా సోదాహరణంగా ఎలా చూపిస్తాడు?

11 యెషయా యొక్క ఈ ప్రవచనం ఆ సంఘటన జరుగడానికి దాదాపు 200 సంవత్సరాల ముందే వ్రాయబడిందని గుర్తుంచుకోండి. అది విని కొందరు, ‘దాన్ని నెరవేర్చే శక్తి యెహోవాకు నిజంగా ఉందా?’ అనుకొని ఉండవచ్చు. ఆయనకా శక్తి ఉందని చరిత్ర ధృవీకరిస్తోంది. యెహోవా తాను చెప్పినది సాధించగలడని నమ్మడం ఎందుకు సహేతుకమో ఆయనే వివరిస్తున్నాడు: “నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే, యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయువాడను.” (యెషయా 45: 7) సృష్టిలో ఉన్నదంతా అంటే వెలుగు నుండి అంధకారం వరకు, చరిత్రలో ఉన్నదంతా అంటే సమాధానం నుండి కీడు వరకు, అంతా యెహోవా ఆధీనంలో ఉంది. ఆయన పగటి వెలుగును, రాత్రి అంధకారాన్ని సృష్టించినట్లుగానే, ఇశ్రాయేలుకు సమాధానాన్ని, బబులోనుకు కీడును తీసుకువస్తాడు. యెహోవాకు విశ్వాన్ని సృష్టించే శక్తి ఉంది, అలాగే తాను ప్రవచించిన వాటిని నెరవేర్చే శక్తి కూడా ఆయనకుంది. ఆయన ప్రవచన వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసే నేటి క్రైస్తవులకు అది ధైర్యాన్నిస్తుంది.

12. (ఎ) యెహోవా సూచనార్థక ఆకాశములు, భూమి ఏమి ఉత్పన్నం చేసేలా చేస్తాడు? (బి) నేడు క్రైస్తవుల కోసం యెషయా 45:8 వ వచనంలోనున్న ఓదార్పుకరమైన వాగ్దానం ఏమిటి?

12 తగిన విధంగానే, బంధీలుగా ఉన్న యూదుల కోసం వేచి ఉన్నవాటిని సోదాహరణంగా తెలియజేయడానికి, యెహోవా సృష్టిలో క్రమంగా జరిగే సంఘటనలను ఉపయోగిస్తున్నాడు: ‘ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా [“ఆకాశములారా,” NW], మహావర్షము వర్షించుము. భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక. యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను.’ (యెషయా 45: 8) అక్షరార్థ ఆకాశములు జీవదాయకమైన వర్షాలు కురిసేలా చేసినట్లుగానే, యెహోవా సూచనార్థక ఆకాశముల నుండి నీతియుక్తమైన ప్రభావాలు తన ప్రజలపై కురిసేలా చేస్తాడు. పుష్కలమైన పంటలనిచ్చేందుకు అక్షరార్థమైన భూమి నెరలు విడిచినట్లుగానే, తన నీతియుక్తమైన సంకల్పానికి అనుగుణంగా సంఘటనలను ఉత్పన్నం చేయమని, ప్రాముఖ్యంగా బబులోనులో బంధీలుగా ఉన్న తన ప్రజలకు రక్షణ కలుగజేయమని యెహోవా సూచనార్థక భూమికి ఆజ్ఞాపిస్తాడు. యెహోవా తన ప్రజలను విడుదల చేయడానికి, 1919 లో ‘ఆకాశము’ మరియు “భూమి” అదే విధంగా సంఘటనలు ఉత్పన్నం చేసేలా చేశాడు. నేడు అలాంటి వాటిని చూడడం క్రైస్తవులకు ఆనందాన్నిస్తుంది. ఎందుకు? ఎందుకంటే, సూచనార్థక ఆకాశములైన దేవుని రాజ్యం, నీతియుక్తమైన భూమిపైకి ఆశీర్వాదములను తీసుకువచ్చే సమయం కోసం వారు ఎదురు చూస్తుండగా ఆ సంఘటనలు వారి విశ్వాసాన్ని బలపరుస్తాయి. ఆ సమయంలో సూచనార్థక ఆకాశముల నుండి, భూమి నుండి వస్తున్న నీతి రక్షణలు, ప్రాచీన బబులోను పడద్రోయబడినప్పటి దానికన్నా ఎంతో విస్తృత పరిధిలో ఉంటాయి. అది యెషయా మాటలకు ఎంత మహిమాన్విత తుది నెరవేర్పు అయ్యుంటుందో కదా!​—⁠2 పేతురు 3:​13; ప్రకటన 21: 1.

యెహోవా సర్వాధిపత్యాన్ని గుర్తించడం ద్వారా లభించే ఆశీర్వాదాలు

13. మానవులు యెహోవా సంకల్పాలను సవాలు చేయడం ఎందుకు హాస్యాస్పదమైనది?

13 భవిష్యద్‌ ఆనందభరితమైన ఆశీర్వాదాల గురించిన ఈ వర్ణన తర్వాత, హఠాత్తుగా ప్రవచన శైలి మారుతుంది, యెషయా ద్వంద్వ శ్రమను ప్రకటిస్తాడు: “మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ.” (యెషయా 45:​9, 10) యెహోవా ప్రవచిస్తున్నదానికి ఇశ్రాయేలు కుమారులు అభ్యంతరం చెబుతారని స్పష్టమవుతోంది. యెహోవా తన ప్రజలు చెరలోకి వెళ్ళడానికి అనుమతిస్తాడని బహుశా వారు నమ్మకపోవచ్చు. లేదా ఇశ్రాయేలు దావీదు వంశపు రాజుచే కాక అన్యజనాంగపు రాజుచే విడుదల చేయబడుతుందన్న తలంపులో వాళ్లు లోపం వెదకడానికి చూస్తుండవచ్చు. అలాంటి అభ్యంతరాల్లోని మూర్ఖత్వాన్ని చూపించడానికి, యెషయా అభ్యంతరం చెప్పేవారిని, తమను రూపించినవాని జ్ఞానమునే ప్రశ్నించడానికి తెగించే, పారవేయబడిన మట్టి ముద్దలతోనూ కుండ పెంకులతోనూ పోలుస్తున్నాడు. కుమ్మరి రూపించినదే ఇప్పుడు, కుమ్మరికి చేతులు లేవనీ లేదా రూపించే శక్తి లేదనీ చెబుతోంది. ఎంతటి మూర్ఖత్వం! అభ్యంతరం చెప్పేవారు, తమ తల్లిదండ్రుల అధికారాన్ని విమర్శించడానికి తెగించే చిన్నపిల్లల వంటివారు.

14, 15. ‘పరిశుద్ధ దేవుడు,’ ‘సృష్టికర్త’ అనే పదాలు యెహోవా గురించి ఏమి తెలియజేస్తున్నాయి?

14 అలా అభ్యంతరం చెప్పేవారికి యెషయా యెహోవా సమాధానాన్ని ఇలా తెలియజేస్తున్నాడు: ‘ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు​—⁠రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. నీతినిబట్టి కోరెషును రేపితిని, అతని మార్గములన్నియు సరాళముచేసెదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును [“అని సైన్యముల కధిపతియగు యెహోవా చెప్పుచున్నాడు” NW].’​—యెషయా 45:​11-13.

15 యెహోవాను ‘పరిశుద్ధ దేవునిగా’ వర్ణించడం ఆయన పవిత్రతను నొక్కిచెబుతుంది. ఆయనను “సృష్టికర్త” అని పిలవడం విషయాలు ఎలా వృద్ధికావాలనేది నిర్ణయించేందుకు సృష్టికర్తగా ఆయనకున్న హక్కును నొక్కిచెబుతుంది. యెహోవా ఇశ్రాయేలు కుమారులకు రానున్న విషయాల గురించి తెలియజేయగలడు, తన చేతిపని గురించి అంటే తన ప్రజల గురించి శ్రద్ధ తీసుకోగలడు. ఏమి సృష్టించాలనేది నిశ్చయించుకునే అధికారం యెహోవాకు ఉన్నట్లుగానే, ఏమి బయలుపరచాలనేది నిశ్చయించుకునే అధికారం కూడా ఆయనకు ఉందని మరోసారి మనం చూడవచ్చు. మొత్తం విశ్వానికి సృష్టికర్తగా, సంఘటనలను తాను నిర్ణయించినట్లు నిర్దేశించే హక్కు యెహోవాకు ఉంది. (1 దినవృత్తాంతములు 29:​11, 12) చర్చించబడుతున్న కేసులో, అన్యుడైన కోరెషును ఇశ్రాయేలు విమోచకునిగా ఉపయోగించుకోవడానికి విశ్వపరిపాలకుడు నిర్ణయించుకున్నాడు. కోరెషు ఆగమనం, భవిష్యత్తులో జరుగనున్న సంఘటనే అయినప్పటికీ, అది భూమ్యాకాశములు ఉనికిలో ఉన్నంత నిశ్చయమైనది. కాబట్టి “సైన్యముల కధిపతియగు యెహోవా” అయిన తమ తండ్రిని విమర్శించడానికి ఇశ్రాయేలు యొక్క ఏ కుమారుడు తెగించగలడు?

16. యెహోవా సేవకులు ఎందుకు ఆయనకు విధేయులై ఉండాలి?

16 యెషయా గ్రంథంలోని ఇవే వచనాల్లో, దేవుని సేవకులు ఆయనకు ఎందుకు విధేయులై ఉండాలనేదానికి మరో కారణం ఇవ్వబడింది. ఆయన తీసుకునే నిర్ణయాలు ఎల్లప్పుడూ ఆయన సేవకులకు మేలే చేస్తాయి. (యోబు 36: 3) తన ప్రజలు తమకు తాము ప్రయోజనం చేకూర్చుకునేలా సహాయం చేయడానికి ఆయన నియమాలను రూపొందించాడు. (యెషయా 48:​17) యెహోవా సర్వాధిపత్యాన్ని అంగీకరించే, కోరెషు కాలంనాటి యూదులు ఇది సత్యమని గ్రహిస్తారు. యెహోవా నీతికి అనుగుణంగా ప్రవర్తిస్తూ కోరెషు, ఆలయాన్ని పునర్నిర్మించుకోగలిగేలా వారిని బబులోను నుండి వారి స్వదేశానికి పంపిస్తాడు. (ఎజ్రా 6:​3-5) అలాగే నేడు తమ అనుదిన జీవితాల్లో దేవుని సూత్రాలను అన్వయించుకునేవారు, ఆయన సర్వాధిపత్యానికి విధేయులయ్యేవారు ఆశీర్వాదాలను పొందుతారు.​—⁠కీర్తన 1:​1-3; 19: 7; 119:​105; యోహాను 8:​31, 32.

ఇతర జనములకు ఆశీర్వాదములు

17. యెహోవా రక్షణ కార్యాల నుండి ఇశ్రాయేలువారు గాక ఇంకా ఎవరు ప్రయోజనం పొందుతారు, ఎలా?

17 బబులోను పతనం ద్వారా ప్రయోజనం పొందేది ఇశ్రాయేలు జనము మాత్రమే కాదు. యెషయా ఇలా చెబుతున్నాడు: ‘యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు​—⁠ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును, దీర్ఘదేహులైన సెబాయీయులును [“తమకు తాముగా,” NW] నీయొద్దకు వచ్చి నీవారగుదురు. వారు నీవెంట వచ్చెదరు; సంకెళ్లు కట్టుకొని వచ్చి నీ యెదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు; ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు.’ (యెషయా 45:​14) మోషే కాలంలో, ఇశ్రాయేలీయులు కాని “అనేకులైన అన్యజనుల సమూహము” ఇశ్రాయేలీయులతోపాటు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చింది. (నిర్గమకాండము 12:​37, 38) అదేవిధంగా, బబులోను నుండి స్వదేశానికి తిరిగివస్తున్న పరవాసులైన యూదులతోపాటు విదేశీయులు కూడా వస్తారు. ఈ యూదేతరులు రమ్మని బలవంతం చేయబడరు గానీ వారే ‘తమకు తాముగా వస్తారు.’ “నీ యెదుట సాగిలపడుదురు,” “నీకు విన్నపము చేసెదరు” అని యెహోవా చెబుతున్నప్పుడు, ఆయన ఈ విదేశీయులు ఇశ్రాయేలువారికి చూపించే ఇష్టపూర్వకమైన విధేయతను, భక్తిని సూచిస్తున్నాడు. వారు సంకెళ్ళు కట్టుకుంటే, వారు స్వచ్ఛందంగానే అలా కట్టుకుంటారు, “నీ మధ్య దేవుడున్నాడు” అని దేవుని నిబంధన ప్రజలతో చెబుతూ, దేవుని ప్రజలకు సేవచేసేందుకు వారికున్న సుముఖతను అది సూచిస్తుంది. యెహోవా ఇశ్రాయేలుతో చేసిన నిబంధన ఏర్పాట్ల క్రింద వారు మతప్రవిష్ఠులుగా ఆయనను ఆరాధిస్తారు.​—⁠యెషయా 56: 6.

18. యెహోవా, “దేవుని ఇశ్రాయేలు”ను విడుదల చేయడం వల్ల నేడు ఎవరు ప్రయోజనం పొందారు, ఏ యే విధాలుగా?

18 “దేవుని ఇశ్రాయేలు” 1919 లో ఆధ్యాత్మిక చెర నుండి విడుదల చేయబడినప్పటి నుండి, యెషయా మాటలు కోరెషు కాలంలో కంటే ఎక్కువగా నెరవేరాయి. భూవ్యాప్తంగా లక్షలాదిమంది యెహోవా సేవ చేయడానికి సుముఖత చూపిస్తున్నారు. (గలతీయులు 6:​16; జెకర్యా 8:​23) యెషయా ప్రస్తావించిన “కష్టార్జితము” సంపాదించుకునేవారిలా, ‘వర్తకులలా’ వారు సత్యారాధనకు మద్దతునివ్వడానికి తమ శారీరక బలాన్ని, ఆర్థిక వనరులను ఆనందంగా అర్పిస్తారు. (మత్తయి 25:​34-40; మార్కు 12:​30) వారు తమను తాము దేవునికి సమర్పించుకొని ఆనందంగా ఆయన సేవకులై ఆయన మార్గాల్లో నడుచుకుంటారు. (లూకా 9:​23) వారు యెహోవా దేవునితో ప్రత్యేక నిబంధన సంబంధాన్ని కలిగివున్న ఆయన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునితో’ సహవసించడానికి సంబంధించిన ప్రయోజనాలను అనుభవిస్తూ, యెహోవాను మాత్రమే ఆరాధిస్తారు. (మత్తయి 24:​45-47; 26:​28; హెబ్రీయులు 8:​8-13) ఆ “కష్టార్జితము” సంపాదించుకునేవారు, ‘వర్తకులు’ ఆ నిబంధనలో పాలుపంచుకోరు గానీ దాని నుండి ప్రయోజనం పొందుతూ, దానికి సంబంధించిన నియమాలకు విధేయత చూపిస్తూ, “ఆయన తప్ప ఏ దేవుడును లేడు” అని ధైర్యంగా ప్రకటిస్తారు. సత్యారాధనకు అలా ఇష్టపూర్వకంగా మద్ధతునిచ్చేవారి సంఖ్యలో కలుగుతున్న గొప్ప అభివృద్ధికి నేడు ప్రత్యక్ష సాక్షులమై ఉండడం ఎంత ఉత్తేజాన్నిస్తుందో కదా!​—⁠యెషయా 60:​22.

19. విగ్రహాలను ఆరాధించడాన్ని మానుకోనివారికి ఏమవుతుంది?

19 అన్యజనులు యెహోవాను ఆరాధించడంలో ఐక్యమవుతారని తెలియజేసిన తర్వాత ప్రవక్త ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవైయున్నావు.” (యెషయా 45:​15) ప్రస్తుతం యెహోవా తన శక్తిని ప్రదర్శించకుండా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఆయన అలాగే మరుగై ఉండడు. ఆయన తనను తాను ఇశ్రాయేలు దేవునిగా, తన ప్రజల రక్షకునిగా నిరూపించుకుంటాడు. అయితే, విగ్రహాలను నమ్ముకునే వారికి ఆయన రక్షకునిగా ఉండడు. అలాంటి వారి గురించి యెషయా ఇలా చెబుతున్నాడు: ‘విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి, వారందరు విస్మయము [“అవమానము,” NW] పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు.’ (యెషయా 45:​16) వారికి ఎదురయ్యే అవమానం, తాత్కాలికమైన తలవంపుకంటే, సిగ్గుకంటే ఎక్కువే. అది మరణం అయ్యుంటుంది, అది ఆ తర్వాత ఇశ్రాయేలుకు యెహోవా వాగ్దానం చేస్తున్నదానికి పూర్తి వ్యతిరేకమైనది.

20. ఇశ్రాయేలు “నిత్యమైన రక్షణ”ను ఏ విధంగా అనుభవిస్తుంది?

20 ‘యెహోవావలన [“యెహోవాతో ఐక్యంగా,” NW] ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు.’ (యెషయా 45:​17) యెహోవా ఇశ్రాయేలుకు నిత్య రక్షణను వాగ్దానం చేస్తున్నాడు, కానీ దానికి ఒక షరతు ఉంది. ఇశ్రాయేలు “యెహోవాతో ఐక్యంగా” ఉండాలి. యేసును మెస్సీయగా నిరాకరించడం ద్వారా ఇశ్రాయేలు అలా ఐక్యంగా ఉండనప్పుడు, జనాంగము “నిత్యమైన రక్షణ” అనే నిరీక్షణను పోగొట్టుకుంటుంది. అయితే, ఇశ్రాయేలువారిలో కొందరు యేసుయందు విశ్వాసం ఉంచుతారు, వీరు శారీరక ఇశ్రాయేలు స్థానాన్ని తీసుకునే దేవుని ఇశ్రాయేలుకు కేంద్రకం అవుతారు. (మత్తయి 21:​43; గలతీయులు 3:​28, 29; 1 పేతురు 2: 9) ఆధ్యాత్మిక ఇశ్రాయేలు ఎన్నడూ అవమానింపబడదు. అది “నిత్యమైన నిబంధన”లోకి తీసుకోబడుతుంది.​—⁠హెబ్రీయులు 13:​20.

సృష్టించడంలోను బయలుపరచడంలోను యెహోవా విశ్వసనీయుడు

21. సృష్టించడంలోను బయలుపరచడంలోను తాను పూర్తిగా విశ్వసనీయుడినని యెహోవా ఎలా చూపిస్తాడు?

21 ఇశ్రాయేలుకు నిత్య రక్షణను ఇస్తానని యెహోవా చేసిన వాగ్దానంపై యూదులు ఆధారపడవచ్చా? యెషయా ఇలా సమాధానమిస్తున్నాడు: ‘ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను, నిరాకారముగానుండునట్లు [“ఊరకనే,” NW] ఆయన దాని సృజింపలేదు, నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను. ఆయన సెలవిచ్చునదేమనగా​—⁠యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంధకారదేశములోని మరుగైనచోటున నేను మాటలాడలేదు; మాయాస్వరూపుడనైనట్టు [“ఊరకనే,” NW] నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే.’ (యెషయా 45:​18, 19) ఆదిమ హీబ్రూ లేఖనాల్లో, ఈ అధ్యాయంలో నాలుగవసారి, చివరిసారి ‘యెహోవా సెలవిచ్చునది’ అనే పదబంధంతో యెషయా ఒక గంభీరమైన ప్రవచన భాగాన్ని ప్రారంభిస్తున్నాడు. (యెషయా 45:​1, 11, 14) యెహోవా ఏమి సెలవిస్తున్నాడు? తాను సృష్టించడంలోనూ, బయలుపరచడంలోనూ విశ్వసనీయుడినని సెలవిస్తున్నాడు. ఆయన భూమిని “ఊరకనే” సృజించలేదు. అలాగే, ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలు తనను “ఊరకనే” వెదకాలని కోరడం లేదు. భూమిపట్ల దేవుని సంకల్పం ఎలా నెరవేరుతుందో అలాగే, తాను ఏర్పరచుకొనిన ప్రజలపట్ల ఆయనకున్న సంకల్పం కూడా నెరవేరుతుంది. అబద్ధ దేవుళ్ళను ఆరాధించేవారు పలికే అస్పష్టమైన పలుకులకు భిన్నంగా, యెహోవా మాటలు బహిరంగంగా తెలియజేయబడతాయి. ఆయన మాటలు న్యాయమైనవి, అవి నిజమవుతాయి. ఆయనకు సేవచేసేవారి సేవ వ్యర్థం కాదు.

22. (ఎ) బబులోనులో బంధీలుగా ఉన్న యూదులు దేని గురించి నిశ్చయత కలిగి ఉండవచ్చు? (బి) క్రైస్తవులకు నేడు ఏ హామీ ఉంది?

22 బబులోనులో బంధీలుగా ఉన్న దేవుని ప్రజలకు, ఆ మాటలు, వాగ్దాన దేశం నిర్జనంగా విడువబడదనేదానికి హామీగా ఉన్నాయి. దానిలో మళ్ళీ ప్రజలు నివసిస్తారు. యెహోవా వారికి చేసిన వాగ్దానాలు నిజమవుతాయి. విస్తృతార్థంలో, కొందరు విశ్వసిస్తున్నట్లుగా అగ్నిచే కాల్చివేయబడో లేదా ఇతరులు భయపడుతున్నట్లుగా అణుబాంబులచే నాశనం చేయబడో భూమి నిర్జనంగా విడువబడదు అనేదానికి యెషయా మాటలు దేవుని ప్రజలకు నేడు హామీగా ఉన్నాయి. పరదైసు సౌందర్యంతో అలంకరింపబడి, నీతియుక్తమైన నివాసులతో నింపబడి భూమి నిరంతరం నిలిచి ఉండాలన్నది దేవుని సంకల్పం. (కీర్తన 37:​11, 29; 115:​16; మత్తయి 6:​9, 10; ప్రకటన 21:​3, 4) అవును, ఇశ్రాయేలు విషయంలోలాగే, యెహోవా మాటలు విశ్వసనీయమైనవని నిరూపించబడతాయి.

యెహోవా తన కనికరాన్ని చూపిస్తాడు

23. విగ్రహాలను ఆరాధించేవారికి తుదకు లభించేదేమిటి, యెహోవాను ఆరాధించేవారి పరిస్థితి ఎలా ఉంటుంది?

23 యెహోవా పలికిన ఈ తర్వాతి మాటల్లో ఇశ్రాయేలు రక్షణ నొక్కిచెప్పబడింది: “కూడి రండి. జనములలో తప్పించుకొనినవారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్యవిగ్రహమును మోయుచు, రక్షింపలేని దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు. మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసినవాడెవడు? చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు? యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు; నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు.” (యెషయా 45:​20, 21) తమకు లభించిన రక్షణను, విగ్రహాలను ఆరాధించేవారికి జరిగేదానితో పోల్చి చూడమని ‘తప్పించుకొనినవారికి’ యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. (ద్వితీయోపదేశకాండము 30: 3; యిర్మీయా 29:​14; 50:​28) విగ్రహారాధకులు తమను రక్షించలేని శక్తిహీనులైన దేవుళ్ళకు ప్రార్థిస్తారు, వారి సేవ చేస్తారు గనుక, వారికి “తెలివిలేదు.” వారి ఆరాధన నిష్ప్రయోజనకరమైనది, వ్యర్థమైనది. అయితే, యెహోవాను ఆరాధించేవారు, బబులోనులో బంధీలుగా ఉన్న తన ప్రజల రక్షణతో సహా “పూర్వకాలము”న తాను ప్రవచించిన సంఘటనలను నిజం చేసే శక్తి ఆయనకు ఉందని తెలుసుకుంటారు. అలాంటి శక్తి, ముందు చూపు యెహోవాను ఇతర దేవుళ్ళందరి నుండి ప్రత్యేకపరుస్తాయి. నిజంగా, ఆయన ‘నీతిపరుడైన దేవుడు, రక్షించేవాడు.’

‘మా రక్షణకై దేవునికి స్తోత్రం’

24, 25. (ఎ) యెహోవా ఏ ఆహ్వానాన్ని ఇస్తున్నాడు, ఆయన వాగ్దానం ఎందుకు తప్పక నెరవేరుతుంది? (బి) యెహోవా న్యాయబద్ధంగా ఏమి కోరుతున్నాడు?

24 యెహోవాకున్న కనికరం, ఇలా ఆహ్వానించేలా ఆయనను కదిలిస్తుంది: “భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి; దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.​—⁠నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరు నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు.”​—యెషయా 45:​22-25.

25 తనవైపు తిరిగే, బబులోనులోవున్న వారిని రక్షిస్తానని యెహోవా ఇశ్రాయేలుకు వాగ్దానం చేస్తున్నాడు. యెహోవా ప్రవచనం విఫలమవ్వడమన్నది అసాధ్యం, ఎందుకంటే తన ప్రజలను రక్షించాలన్న కోరికా, సామర్థ్యమూ రెండూ ఆయనకు ఉన్నాయి. (యెషయా 55: 10బి, 11) యెహోవా దేవుని మాటలు వాటంతటవే విశ్వసనీయమైనవి, అయితే వాటిని ధృవీకరించడానికి ఆయన తన ప్రమాణాన్ని చేర్చినప్పుడు అవి మరింత విశ్వసనీయమైనవవుతాయి. (హెబ్రీయులు 6:​13) తన అనుగ్రహం కావాలని కోరుకునే వారు తనకు లోబడి ఉండాలనీ (‘ప్రతి మోకాలు వంగును’), తనకు బద్ధులై ఉండాలనీ (‘ప్రతి నాలుక ప్రమాణము చేయును’) ఆయన న్యాయబద్ధంగానే కోరుతున్నాడు. ఎల్లప్పుడూ యెహోవా సేవలో కొనసాగే ఇశ్రాయేలీయులు రక్షించబడతారు. యెహోవా తమకు చేసినదానిని బట్టి వారు అతిశయించగలుగుతారు.​—⁠2 కొరింథీయులు 10:​17.

26. తన వైపుకు మరలమని యెహోవా ఇస్తున్న ఆహ్వానానికి అన్ని జనముల నుండి వచ్చిన “యొక గొప్ప సమూహము” ఎలా ప్రతిస్పందిస్తోంది?

26 అయితే, తన వైపుకు మరలమని దేవుడు ఇస్తున్న ఆహ్వానం ప్రాచీన బబులోనులోని బంధీలకు మాత్రమే పరిమితం కాదు. (అపొస్తలుల కార్యములు 14:​14, 15; 15:​19; 1 తిమోతి 2:​3, 4) ఈ ఆహ్వానం ఇప్పటికీ అందజేయబడుతోంది, ‘ప్రతి జనములోనుండి వచ్చిన ఒక గొప్పసమూహము’ దానికి ప్రతిస్పందనగా, ‘మా దేవునికిని గొఱ్ఱెపిల్ల[యేసు]కును మా రక్షణకై స్తోత్రమని’ ప్రకటిస్తోంది. (ప్రకటన 7:​9, 10; 15: 3, 4) ప్రతి సంవత్సరం, వందల వేలమంది క్రొత్తవారు దేవుని సర్వాధిపత్యాన్ని సంపూర్ణంగా గుర్తించి, ఆయనకు తమ విధేయతను బహిరంగంగా ప్రకటిస్తూ ఆయన వైపు తిరగడం ద్వారా గొప్ప సమూహపు సంఖ్యను పెంచుతున్నారు. అంతేగాక, వారు ‘అబ్రాహాము సంతానమైన’ ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు యథార్థంగా మద్దతునిస్తారు. (గలతీయులు 3:​29) “యెహోవాయందే నీతి బలములున్నవని” ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ, వారు యెహోవా నీతియుక్తమైన పరిపాలనపట్ల తమకున్న ప్రేమను వ్యక్తం చేస్తారు. a చివరికి సజీవంగా ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని సర్వాధిపత్యాన్ని అంగీకరించి, ఆయన నామమును విడువక స్తుతిస్తారని చూపించడానికి, అపొస్తలుడైన పౌలు తాను రోమీయులకు వ్రాసిన పత్రికలో యెషయా 45: 23 వ వచనాన్ని సెప్టాజింట్‌ నుండి ఎత్తివ్రాశాడు.​—⁠రోమీయులు 14:​11; ఫిలిప్పీయులు 2:​9-11; ప్రకటన 21:​22-27.

27. క్రైస్తవులు నేడు యెహోవా వాగ్దానాల్లో సంపూర్ణ నమ్మకాన్ని ఎందుకు కలిగి ఉండవచ్చు?

27 దేవుని వైపు మరలడం ద్వారా రక్షణ లభిస్తుందని గొప్ప సమూహంలోని సభ్యులు ఎందుకు నమ్మవచ్చు? ఎందుకంటే, యెషయా 45 వ అధ్యాయంలోని ప్రవచన వాక్యాలు స్పష్టంగా చూపిస్తున్నట్లుగా యెహోవా వాగ్దానాలు విశ్వసనీయమైనవి. ఆకాశములను, భూమిని సృష్టించడానికి యెహోవాకు శక్తి, జ్ఞానము ఉన్నట్లుగానే, తన ప్రవచనాలను నిజం చేయగల శక్తి, జ్ఞానము కూడా ఆయనకున్నాయి. కోరెషుకు సంబంధించిన ప్రవచనం ఆయన నెరవేరేలా చేసినట్లుగానే, ఇంకా నెరవేరవలసి ఉన్న బైబిల్లోని ఏ ప్రవచనాన్నైనా ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి, యెహోవా ఆరాధకులు ‘నీతిమంతుడైన దేవునిగా, రక్షకునిగా’ యెహోవా త్వరలోనే మళ్లీ నిరూపించుకుంటాడని నమ్మకం కలిగి ఉండవచ్చు.

[అధస్సూచి]

a హీబ్రూ మూలప్రతిలో “నీతి” అనే పదం బహువచనంలో ఉంది. యెహోవా నీతి యొక్క విస్తృత శ్రేణిని వ్యక్తం చేయడానికి ఇక్కడ బహువచనం ఉపయోగించబడింది.

[అధ్యయన ప్రశ్నలు]

[80, 81 వ పేజీలోని చిత్రాలు]

వెలుగును రూపించి, అంధకారాన్ని సృష్టించే యెహోవా, సమాధానం తీసుకురాగలడు, కీడును కలుగజేయగలడు

[83 వ పేజీలోని చిత్రం]

యెహోవా ‘ఆకాశములు’ ఆశీర్వాదములను కురిపించేలా, “భూమి” రక్షణను ఫలించేలా చేస్తాడు

[84 వ పేజీలోని చిత్రం]

పారవేయబడిన కుండ పెంకులు తమను రూపించినవాని జ్ఞానాన్ని ప్రశ్నించవచ్చా?

[89 వ పేజీలోని చిత్రం]

యెహోవా భూమిని ఊరకనే సృజించలేదు