యెహోవా మన మేలు కోసమే మనకు బోధిస్తాడు
తొమ్మిదవ అధ్యాయం
యెహోవా మన మేలు కోసమే మనకు బోధిస్తాడు
1. జ్ఞానవంతులు యెహోవా మాటలకు ఎలా ప్రతిస్పందిస్తారు?
యెహోవా మాట్లాడుతున్నప్పుడు, జ్ఞానవంతులు ఎంతో గౌరవంతో విని, ఆయన మాటలకు ప్రతిస్పందిస్తారు. యెహోవా చెప్పేదంతా మన మేలు కోసమే, అంతేగాక ఆయన మన క్షేమంపట్ల ఎంతో ఆసక్తి కలిగివున్నాడు. ఉదాహరణకు, “నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను” అని యెహోవా తన ప్రాచీన నిబంధన ప్రజలను ఉద్దేశించి చెప్పినదాన్ని పరిశీలించడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! (యెషయా 48:18) దేవుని బోధలు విలువైనవని నిరూపించబడ్డాయన్న వాస్తవం, ఆయన చెప్పేది వినేలా, ఆయన నడిపింపును అనుసరించేలా మనల్ని పురికొల్పాలి. నెరవేరిన ప్రవచనాల వృత్తాంతం, యెహోవా తన వాగ్దానాలను నెరవేర్చాలని చేసుకున్న నిశ్చయతను గురించిన ఏ సందేహాన్నైనా నివృత్తి చేస్తుంది.
2. యెషయా 48 వ అధ్యాయంలోని మాటలు ఎవరి కోసం వ్రాయబడ్డాయి, వాటి నుండి ఇంకా ఎవరు కూడా ప్రయోజనం పొందవచ్చు?
2 యెషయా గ్రంథంలోని 48 వ అధ్యాయంలోని మాటలు, బబులోనులో బంధీలుగా ఉండబోయే యూదుల కోసం వ్రాయబడ్డాయని స్పష్టమవుతోంది. అంతేగాక, ఈ మాటల్లో నేటి క్రైస్తవులు నిర్లక్ష్యం చేయలేని సందేశం ఉంది. బబులోను పతనాన్ని గురించి బైబిలు, యెషయా గ్రంథంలోని 47 వ అధ్యాయంలో ముందే తెలియజేసింది. ఆ నగరంలో బంధీలుగా ఉన్న యూదుల కోసం తానేమి ఉద్దేశించాడో యెహోవా ఇప్పుడు వివరిస్తున్నాడు. యెహోవా తాను ఏర్పరచుకొన్న ప్రజల వేషధారణను, ఆయన చేసిన వాగ్దానాల పట్ల మొండి వైఖరితో వారు చూపించిన అవిశ్వాసాన్ని బట్టి ఎంతో బాధపడినప్పటికీ, ఆయన వారి మేలు కోసం వారికి ఉపదేశించాలని కోరుకుంటాడు. నమ్మకమైన ఒక శేషము తమ స్వదేశానికి తిరిగి రావడానికి దారితీసే శుద్ధీకరణ కాలాన్ని ఆయన ముందుగా తెలుసుకుంటాడు.
3. యూదావారు చేసిన ఆరాధనలోని లోపమేమిటి?
3 యెహోవా ప్రజలు స్వచ్ఛారాధన నుండి ఎంత దూరం వెళ్ళిపోయారో కదా! యెషయా ప్రారంభ మాటలు ఎంతో గంభీరమైనవి: “యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి. వారు—మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు, సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.” (యెషయా 48:1, 2) ఎంతటి వేషధారణ! “యెహోవా నామముతోడని ప్రమాణము” చేయడమన్నది దేవుని నామమును యాంత్రికంగా ఉపయోగించడం మాత్రమే కాదని స్పష్టమవుతోంది. (జెఫన్యా 1: 5) యూదులు బబులోనుకు బంధీలుగా వెళ్ళకముందు ‘పరిశుద్ధ పట్టణమైన’ యెరూషలేములో యెహోవాను ఆరాధించారు. కానీ వారి ఆరాధన యథార్థమైనది కాదు. వారి హృదయాలు దేవుని నుండి ఎంతో దూరంగా ఉన్నాయి, వారి ఆరాధనా క్రియలు కూడా ‘నీతిసత్యములతో’ చేసినవి కాదు. వారికి తమ పితరులకున్నటువంటి విశ్వాసం లేదు.—మలాకీ 3: 7.
4. యెహోవాకు ఏ విధమైన ఆరాధన సంతోషాన్నిస్తుంది?
4 ఆరాధన యాంత్రికంగా చేసేదై ఉండకూడదని యెహోవా మాటలు మనకు గుర్తు చేస్తున్నాయి. అది హృదయపూర్వకంగా చేసేదై ఉండాలి. బహుశా ఇతరులను మెప్పించడానికి లేదా ప్రభావితం చేయడానికి చేసే నామమాత్రపు సేవ “భక్తి”పూర్వకమైనది కాదు. (2 పేతురు 3:11) ఒక వ్యక్తి తనను తాను క్రైస్తవుడనని చెప్పుకున్నంత మాత్రాన, అతని ఆరాధన దేవునికి అంగీకృతమైనదైపోదు. (2 తిమోతి 3: 5) యెహోవా ఉనికిలో ఉన్నాడని గుర్తించడం ఆవశ్యకం, అయితే అది కేవలం ప్రారంభం మాత్రమే. యెహోవాకు పూర్ణాత్మతో కూడిన, ప్రగాఢమైన ప్రేమా కృతజ్ఞతలతో పురికొల్పబడిన ఆరాధన కావాలి.—కొలొస్సయులు 3:23.
క్రొత్త విషయాలను ముందే తెలియజేయడం
5. యెహోవా ముందే తెలియజేసిన, ‘పూర్వకాలమున జరిగిన సంగతులు’ కొన్ని ఏవి?
5 బహుశా బబులోనులో ఉన్న ఆ యూదులు తమ గత జ్ఞాపకాలను పునర్వికాసం చేసుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి, యెహోవా తాను నిజమైన ప్రవచన దేవుడనని వారికి మరోసారి గుర్తుచేస్తాడు: “పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాల కాలముక్రిందట తెలియజేసితిని, ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను, నేను వాటిని ప్రకటించితిని. నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను.” (యెషయా 48: 3) ‘పూర్వకాలమున జరిగిన సంగతులు’ అంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడుదలచేసి వారికి వాగ్దాన దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వడం వంటివి అప్పటికే దేవుడు సాధించిన సంగతులు. (ఆదికాండము 13:14, 15; 15:13, 14) అలాంటి ప్రవచనాలు దేవుని నోటి నుండి వెలువడతాయి; అవి దైవిక మూలం నుండి ఉత్పన్నమైనవి. దేవుడు మానవులు తన ఆజ్ఞలను వినేలా చేస్తాడు, వారు విన్న విషయాలు విధేయత చూపేలా వారిని ప్రేరేపించాలి. (ద్వితీయోపదేశకాండము 28:15) ఆయన తాను ముందే తెలియజేసినదాన్ని నెరవేర్చడానికి ఆకస్మికముగా చర్య తీసుకుంటాడు. యెహోవా సర్వశక్తిమంతుడన్న వాస్తవం, ఆయన సంకల్పం తప్పక నెరవేరేలా చేస్తుంది.—యెహోషువ 21:44; 23:14.
6. యూదులు ఎంతమేరకు ‘మూర్ఖులుగా, తిరుగుబాటుదారులుగా’ తయారయ్యారు?
6 యెహోవా ప్రజలు ‘మూర్ఖులుగా, తిరుగుబాటుదారులుగా’ తయారయ్యారు. (కీర్తన 78:7) ఆయన నిర్మొహమాటంగా వారికిలా చెబుతున్నాడు: ‘నీవు మూర్ఖుడవు, నీ మెడ యినుప నరము, నీ నుదురు ఇత్తడిది.’ (యెషయా 48: 4) యూదులు లోహాల్లా వంగనివారు, లోబడనొల్లనివారు. సంఘటనలు జరుగక ముందే యెహోవా వాటిని బయలుపరచడానికి అదొక కారణం. లేకపోతే యెహోవా చేసినవాటి గురించి ఆయన ప్రజలు, “నా విగ్రహము ఈ కార్యములను జరిగించెనని . . . నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించెనని” చెబుతారు. (యెషయా 48: 5) యెహోవా ఇప్పుడు చెబుతున్నది నమ్మకద్రోహులైన యూదులపై ఏమైనా ప్రభావం చూపుతుందా? దేవుడు వారికిలా చెబుతాడు: “నీవు ఆ సంగతి వినియున్నావు. ఇదంతయు ఆలోచించుము. అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా? తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట నీకు తెలియజేయుచున్నాను, అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు. అవి ఇప్పుడు కలుగునవియే, అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు, ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండలేదు.”—యెషయా 48: 6, 7.
7. బంధీలుగావున్న యూదులు ఏమి అంగీకరించాలి, వారు ఏమి ఎదురుచూడవచ్చు?
7 బబులోను పతనాన్ని గురించిన ప్రవచనాన్ని యెషయా ఎంతోకాలం ముందే వ్రాసి ఉంచాడు. యూదులు ఇప్పుడు బబులోనులో బంధీలుగా, ఆ ప్రవచన నెరవేర్పును గురించి తలంచమని ప్రవచనార్థకంగా ఆజ్ఞాపించబడుతున్నారు. యెహోవా, నెరవేరిన ప్రవచనాల దేవుడనే విషయాన్ని వారు నిరాకరించగలరా? యూదా నివాసులు యెహోవా సత్యానికి దేవుడని చూశారు, విన్నారు గనుక, వారు ఈ సత్యాన్ని ఇతరులకు ప్రకటించవద్దా? యెహోవా ప్రకటిత వాక్యం, కోరెషు బబులోనును జయించడం, యూదులను విడుదల చేయడం వంటి ఇంకా జరుగని క్రొత్త విషయాలను గురించి ముందే తెలియజేస్తోంది. (యెషయా 48:14-16) అలాంటి అద్భుతమైన సంఘటనలు హఠాత్తుగా, అనుకోని రీతిగా జరిగినట్లు అనిపిస్తాయి. వృద్ధి చెందుతున్న ప్రపంచ పరిస్థితులను పరిశీలించడం ద్వారా మాత్రమే ఎవరూ వాటిని ముందుగా తెలుసుకోలేరు. అవి స్పష్టమైన కారణం లేకుండానే కలుగుతున్నట్లు జరుగుతాయి. ఈ సంఘటనలను ఎవరు జరిగిస్తారు? యెహోవా వాటిని దాదాపు 200 సంవత్సరాలు ముందుగా తెలియజేస్తున్నాడు గనుక, జవాబు స్పష్టమే.
8. నేడు క్రైస్తవులు ఏ క్రొత్త విషయాల కోసం నిరీక్షిస్తారు, యెహోవా ప్రవచనార్థక వాక్యంలో వారికి ఎందుకు సంపూర్ణ నమ్మకం ఉంది?
8 అంతేగాక, యెహోవా తన వాక్యాన్ని తన స్వంత కాలపట్టిక అనుసారంగా నెరవేరుస్తాడు. నెరవేరిన ప్రవచనాలు, ప్రాచీన కాలంనాటి యూదులకే కాదు గానీ నేటి క్రైస్తవులకు కూడా ఆయన దైవత్వాన్ని నిరూపిస్తాయి. ‘పూర్వకాలమున జరిగిన సంగతులు,’ అంటే గతంలో నెరవేరిన అసంఖ్యాకమైన ప్రవచనాల వృత్తాంతం, యెహోవా వాగ్దానం చేసిన క్రొత్త విషయాలు అంటే రానున్న “మహా శ్రమలు,” ఆ శ్రమలను “యొక గొప్ప సమూహము” తప్పించుకొని జీవించడం, “క్రొత్త భూమి,” ఇంకా ఇతర అనేకం తప్పక నెరవేరుతాయన్నదానికి ఒక హామీ. (ప్రకటన 7:9, 14, 15; 21:4, 5; 2 పేతురు 3:13) ఆ హామీ, ఆయన గురించి అత్యాసక్తితో మాట్లాడడానికి నేడు యథార్థ హృదయులను పురికొల్పుతుంది. వారు, “నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతిసువార్తను నేను ప్రకటించియున్నానని” చెప్పిన కీర్తనకర్త భావాలనే కలిగి ఉంటారు.—కీర్తన 40: 9.
యెహోవా నిగ్రహాన్ని చూపిస్తాడు
9. ఇశ్రాయేలు జనాంగము “తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయు” వారిగా ఎలా ఉన్నారు?
9 యెహోవా ప్రవచనాలకు యూదులు చూపించిన అపనమ్మకంతో కూడిన ప్రతిస్పందన, వారు ఆయన హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా చేసింది. అందుకే ఆయన వారికిలా చెబుతున్నాడు: “అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు. నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియును.” (యెషయా 48: 8) యూదా యెహోవా చెబుతున్న శుభ వర్తమానములు వినకుండా తన చెవులు మూసుకొంది. (యెషయా 29:10) దేవుని నిబంధనా ప్రజలు ప్రవర్తించిన విధానం, ఆ జనాంగము “తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయు” వారని చూపిస్తుంది. ఇశ్రాయేలు జనాంగము తన జననం మొదలుకొని, దాని చరిత్రంతటిలోనూ తిరుగుబాటు చేసేదనే పేరునే తెచ్చుకుంది. తిరుగుబాటు చేయడము, మోసం చేయడము ఆ ప్రజలు ఎప్పుడో ఒకసారి చేసిన పాపాలు కావుగానీ, అలవాటుగా ఎప్పుడూ చేస్తూ ఉండిన పాపాలు.—కీర్తన 95:10; మలాకీ 2:11.
10. యెహోవా తనను తాను ఎందుకు నిగ్రహించుకుంటాడు?
10 మరిక ఏ ఆశా లేనట్లేనా? ఎందుకులేదు, ఉంది. యూదా తిరుగుబాటు చేసి, అపనమ్మకత్వం చూపించినప్పటికీ, యెహోవా ఎల్లప్పుడూ సత్యవంతుడిగా, విశ్వసనీయుడిగా ఉన్నాడు. ఆయన తన గొప్ప నామ ఘనత కోసం, తన ఆగ్రహాన్ని వెళ్ళగ్రక్కకుండా నిగ్రహించుకుంటాడు. ఆయనిలా చెబుతున్నాడు: “నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమునుబట్టి నా కోపము మానుకొనుచున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయములో బిగబట్టు కొనుచున్నాను.” (యెషయా 48: 9) ఎంత వ్యత్యాసం! యెహోవా ప్రజలు అంటే ఇశ్రాయేలువారు, యూదావారు ఆయన పట్ల నమ్మకంగా ఉండలేదు. కానీ యెహోవా తన నామముకు స్తుతి, ఘనత కలిగే విధంగా చర్య తీసుకుంటూ తన నామమును పరిశుద్ధ పరుచుకుంటాడు. ఈ కారణాన్ని బట్టే, ఆయన తాను ఏర్పరచుకొనిన ప్రజలను నిర్మూలము చేయడు.—యోవేలు 2:13, 14.
11. దేవుడు తన ప్రజలు పూర్తిగా నాశనమయ్యేందుకు ఎందుకు అనుమతించడు?
11 బంధీలుగా ఉన్న యూదుల్లోని యథార్థ హృదయులైనవారు దేవుని గద్దింపును బట్టి మేల్కొని, ఆయన చేసే బోధలను లక్ష్యపెట్టాలని నిశ్చయించుకుంటారు. అలాంటి వారికి ఈ ప్రకటన ఎంతో ధైర్యాన్నిస్తుంది: “నేను నిన్ను పుటము వేసితిని, వెండిని వేసినట్లు కాదు. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను, నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.” (యెషయా 48:10, 11) యెహోవా తన ప్రజలపైకి రావడానికి అనుమతించిన కష్టతరమైన శ్రమలు, “ఇబ్బంది కొలిమి”లో చేసినట్లుగా వారిని పరీక్షించి, శుద్ధిచేసి, వారి హృదయాల్లో ఏముందో వెల్లడించాయి. ‘నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించాడు’ అని శతాబ్దాల క్రితం మోషే వారి పూర్వీకులకు చెప్పినప్పుడు అటువంటిదే జరిగింది. (ద్వితీయోపదేశకాండము 8: 2) ఆ జనాంగము తిరుగుబాటు వైఖరి కలిగివున్నప్పటికీ, యెహోవా వారిని ఆ సమయంలో నాశనం చేయలేదు, ఇప్పుడు కూడా ఆయన ఆ జనాంగమును పూర్తిగా నాశనం చేయడు. అలా ఆయన నామము, ఆయన ఘనత ఉన్నతపరచబడతాయి. ఆయన ప్రజలు గనుక బబులోనీయుల చేతుల్లో నశించిపోవలసి వస్తే, ఆయన తన నిబంధనకు కట్టుబడి ఉన్నట్లు కాదు, అంతేగాక ఆయన నామము అపవిత్రపరచబడుతుంది. ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలను రక్షించడానికి శక్తిలేని వాడన్నట్లు కనిపిస్తుంది.—యెహెజ్కేలు 20: 9.
12. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో నిజ క్రైస్తవులు ఎలా శుద్ధీకరించబడ్డారు?
12 ఆధునిక కాలాల్లో కూడా యెహోవా ప్రజలకు శుద్ధీకరణ అవసరమైంది. ఇరవైయవ శతాబ్దపు తొలి దినాల్లో, బైబిలు విద్యార్థుల చిన్న గుంపుకు చెందిన అనేకులు దేవుడి అనుగ్రహాన్ని పొందాలనే హృదయపూర్వక కోరికతో ఆయన సేవచేశారు గానీ కొందరైతే పేరుప్రతిష్ఠలు పొందాలనే కోరిక వంటి తప్పుడు ఉద్దేశాలతో ఆయన సేవచేశారు. అంత్యకాలములో నెరవేరుతుందని ప్రవచించబడిన, సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడమనే పనిలో ఆ చిన్న గుంపు నాయకత్వం వహించడానికి ముందు వారు శుద్ధీకరించబడవలసిన అవసరం ఉంది. (మత్తయి 24:14) యెహోవా తన ఆలయానికి రావడానికి సంబంధించి సరిగ్గా అటువంటి శుద్ధీకరణ పనే జరుగుతుందని మలాకీ ప్రవక్త ప్రవచించాడు. (మలాకీ 3:1-4) ఆయన మాటలు 1918 లో నెరవేరాయి. నిజ క్రైస్తవులు మొదటి ప్రపంచ యుద్ధ వేడిలో అగ్ని పరీక్ష వంటి సమయాన్ని ఎదుర్కొన్నారు. వాచ్‌టవర్ సంస్థ అప్పటి అధ్యక్షుడైన జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫర్డ్, ఇంకా కొంతమంది ప్రధాన అధికారులు ఆ పరీక్ష మూలంగా చెరసాల పాలయ్యారు. యథార్థవంతులైన ఆ క్రైస్తవులు ఆ శుద్ధీకరణ కార్యక్రమం నుండి ప్రయోజనం పొందారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత తమ గొప్ప దేవుడు తమకు ఏ విధంగా సూచిస్తే ఆ విధంగా ఆయన సేవ చేయడానికి మునుపెన్నటికన్నా ఎక్కువగా వారు దృఢనిశ్చయం చేసుకున్నారు.
13. మొదటి ప్రపంచ యుద్ధకాలం మొదలుకొని తర్వాతి సంవత్సరాల్లో యెహోవా ప్రజలు హింసకు ఎలా ప్రతిస్పందించారు?
13 అప్పటినుండీ, యెహోవాసాక్షులు ఎన్నోసార్లు ఎంతో క్రూరాతి క్రూరమైన హింసను ఎదుర్కొన్నారు. అలాంటి హింస వారు తమ సృష్టికర్త మాటను శంకించేలా చేయలేదు. బదులుగా, అపొస్తలుడైన పేతురు తన కాలంలో, హింసింపబడిన క్రైస్తవులకు చెప్పిన ఈ మాటలను మననం చేసుకున్నారు: “అవసరమునుబట్టి నానావిధములైన శోధనలచేత . . . మీకు దుఃఖము కలుగుచున్నది. . . . మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.” (1 పేతురు 1:6, 7) తీవ్రమైన హింస నిజ క్రైస్తవుల యథార్థతను నాశనం చేయదు. బదులుగా, వారి ఉద్దేశాల స్వచ్ఛతను వెల్లడి చేసి, వారి విశ్వాసం పరీక్షలను తట్టుకొని నిలువగలిగేలా చేసి, వారి భక్తి, ప్రేమ ఎంత ప్రగాఢమైనవో బయల్పరుస్తుంది.—సామెతలు 17: 3.
“నేను మొదటివాడను కడపటివాడను”
14. (ఎ) యెహోవా ఏ విధంగా ‘మొదటివాడు, కడపటివాడు’? (బి) యెహోవా తన “హస్తము”తో ఏ శక్తివంతమైన కార్యములు సాధించాడు?
14 ఇప్పుడు యెహోవా తన నిబంధనా ప్రజలకు వాత్సల్యపూరితంగా ఇలా విజ్ఞప్తి చేస్తున్నాడు: “యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను. నేను మొదటివాడను, కడపటివాడను. నా హస్తము భూమి పునాదివేసెను, నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.” (యెషయా 48:12, 13) మానవజాతికి భిన్నంగా, దేవుడు నిత్యుడు, మార్పులేనివాడు. (మలాకీ 3: 6) ప్రకటన గ్రంథంలో యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.” (ప్రకటన 22:13) యెహోవాకు ముందు సర్వశక్తిమంతుడైన దేవుడెవరూ లేరు, ఆయన తర్వాత కూడా ఇక ఎవరూ ఉండరు. ఆయన సర్వోన్నతుడు, నిత్యుడు, సృష్టికర్త. ఆయన “హస్తము” అంటే ఆయన అనువర్తిత శక్తి భూమిని స్థాపించి, నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని విశాలపరచింది. (యోబు 38: 4; కీర్తన 102:25) ఆయన తాను సృష్టించిన వాటిని పిలిచినప్పుడు, అవి ఆయన సేవ చేయడానికి సిద్ధంగా నిలబడతాయి.—కీర్తన 147: 4.
15. యెహోవా కోరెషును ఏ విధంగా, ఎందునిమిత్తం ‘ప్రేమించాడు’?
15 యూదులకు, యూదేతరులకు ఒక ప్రాముఖ్యమైన ఆహ్వానం ఇవ్వబడుతోంది: “మీరందరు కూడివచ్చి, ఆలకించుడి. వాటిలో ఏది యీ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారము బబులోనునకు చేయును, అతని బాహుబలము కల్దీయులమీదికి వచ్చును. నేను, నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను. నేనే అతని పిలిచితిని. నేనే అతనిని రప్పించితిని, అతని మార్గము తేజరిల్లును.” (యెషయా 48:14, 15) యెహోవా మాత్రమే సర్వశక్తిమంతుడు, జరుగబోయే సంఘటనలను ఆయన మాత్రమే ఖచ్చితంగా ముందే తెలియజేయగలడు. “వాటి”లో అంటే విలువలేని ఆ విగ్రహాల్లో ఏదీ ఈ విషయాలను తెలియజేయలేదు. విగ్రహాలు కాదు గానీ యెహోవాయే కోరెషును ‘ప్రేమించాడు,’ అంటే ఒక నిర్దిష్టమైన సంకల్పం కోసం ఆయన అతడిని ఎన్నుకున్నాడు. (యెషయా 41: 2; 44:28; 45:1, 13; 46:11) ప్రపంచ వేదికపైకి కోరెషు రావడాన్ని ఆయన ముందే చూసి, భవిష్యత్తులో బబులోనును జయించేవాడిగా ఆయనను నియమించాడు.
16, 17. (ఎ) దేవుడు రహస్యంగా ప్రవచించలేదని ఎందుకు చెప్పవచ్చు? (బి) యెహోవా నేడు తన సంకల్పాలను ఎలా ప్రకటింపజేస్తున్నాడు?
16 ఆహ్వానిస్తున్న స్వరంతో, యెహోవా ఇలా కొనసాగిస్తున్నాడు: “నాయొద్దకు రండి. యీ మాట ఆలకించుడి. ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను. అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను.” (యెషయా 48:15బి, 16ఎ) యెహోవా రహస్యంగా ఏమీ ప్రవచించలేదు లేదా ఏదో కొద్దిమంది నిపుణులకే తెలియజేయనూలేదు. యెహోవా ప్రవక్తలు నిర్మొహమాటంగా దేవుని పక్షాన మాట్లాడారు. (యెషయా 61: 1) వారు దేవుని చిత్తాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఉదాహరణకు, కోరెషుకు సంబంధించిన సంఘటనలు దేవునికి క్రొత్త విషయాలేమీ కాదు లేదా ఆయనకవి ముందే తెలియని విషయాలేమీ కాదు. దాదాపు 200 సంవత్సరాలు ముందుగా, దేవుడు యెషయా ద్వారా వాటిని బహిరంగంగా ప్రవచించాడు.
17 అదే విధంగా నేడు, యెహోవా తన సంకల్పాలను రహస్యంగా ఉంచడంలేదు. ఈ విధానంపైకి రానున్న అంతాన్ని గురించిన హెచ్చరికను, దేవుని రాజ్యం క్రింద లభించే ఆశీర్వాదాల సువార్తను లక్షలాదిమంది, వందలాది దేశాల్లోనూ ద్వీపాల్లోనూ ఇంటింటా, వీధుల్లోనూ, సాధ్యమైన చోటల్లా ప్రకటిస్తున్నారు. నిజంగా, యెహోవా తన సంకల్పాలను బయలుపరిచే దేవుడు.
‘నా ఆజ్ఞలను ఆలకింపుము!’
18. యెహోవాకు తన ప్రజలపట్ల ఉన్న కోరిక ఏమిటి?
18 యెహోవా ఆత్మతో బలపర్చబడి, ప్రవక్త ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.” (యెషయా 48:16బి, 17) యెహోవా శ్రద్ధను తెలియజేసే ఈ ప్రేమపూర్వకమైన ప్రకటన, దేవుడు తమను బబులోను నుండి విడుదల చేయబోతున్నాడని ఇశ్రాయేలు జనాంగానికి హామీ ఇవ్వాలి. ఆయన వారి విమోచకుడు. (యెషయా 54: 5) ఇశ్రాయేలీయులు తమకు ఆయనతో ఉన్న సంబంధాన్ని పునఃస్థాపించుకొని, ఆయన ఆజ్ఞలకు అవధానం ఇవ్వాలన్నదే యెహోవా హృదయపూర్వక కోరిక. సత్యారాధన దైవిక ఉపదేశాలకు విధేయత చూపడంపై ఆధారపడి ఉంది. ఇశ్రాయేలీయులకు వారు “నడవవలసిన త్రోవను” బోధించకపోతే వారు సరైన మార్గంలో నడవలేరు.
19. యెహోవా ఏ హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాడు?
19 తన ప్రజలు కీడును తప్పించుకొని, జీవితాన్ని ఆనందించాలన్న యెహోవా కోరిక రమ్యంగా ఇలా వ్యక్తపరచబడింది: “నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” (యిషయా 48:18) సర్వశక్తిమంతుడైన సృష్టికర్త చేస్తున్న ఎంతటి హృదయపూర్వకమైన విజ్ఞప్తి! (ద్వితీయోపదేశకాండము 5:29; కీర్తన 81:13) ఇశ్రాయేలీయులు చెరలోకి వెళ్ళేబదులు, నదిలో ప్రవహించే నీళ్ళంత విస్తారంగా సమాధానాన్ని పొందవచ్చు. (కీర్తన 119:165) వారి నీతియుక్తమైన కార్యాలు సముద్ర తరంగములంత అసంఖ్యాకంగా ఉండగలవు. (ఆమోసు 5:24) ఇశ్రాయేలీయులపట్ల నిజంగా ఆసక్తిగలవానిగా యెహోవా వారు నడవవలసిన మార్గమును వారికి ప్రేమపూర్వకంగా చూపిస్తూ, వారికి విజ్ఞప్తి చేస్తున్నాడు. వారు వింటే ఎంత బాగుంటుందో కదా!
20. (ఎ) ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినప్పటికీ వారిపట్ల దేవునికున్న కోరిక ఏమిటి? (బి) యెహోవా తన ప్రజలతో వ్యవహరించినదాని నుండి మనం ఆయన గురించి ఏమి నేర్చుకుంటాము? (133 వ పేజీలోవున్న బాక్సు చూడండి.)
20 ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడితే వారికి ఏ ఆశీర్వాదాలు లభిస్తాయి? యెహోవా ఇలా చెబుతున్నాడు: “నీ సంతానము ఇసుకవలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువులవలె విస్తరించును. వారి నామము నా సన్నిధినుండి కొట్టివేయబడదు, మరువబడదు.” (యిషయా 48:19) అబ్రాహాము సంతానం “ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను” అనేకులవుతారని తాను చేసిన వాగ్దానం గురించి యెహోవా ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. (ఆదికాండము 22:17; 32:12) అయితే, అబ్రాహాము సంతానమైన వీరు తిరుగుబాటుదారులు, కాబట్టి వారికి వాగ్దాన నెరవేర్పును పొందే హక్కు లేదు. నిజంగా, వారి చరిత్ర ఎంత చెడ్డదిగా ఉందంటే, యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం, ఒక జనాంగముగా వారి నామము కొట్టివేయబడడానికి వారు అర్హులు. (ద్వితీయోపదేశకాండము 28:45) అయినప్పటికీ, యెహోవా తన ప్రజలు నిర్మూలించబడాలని కోరుకోవడం లేదు, అలాగని వారిని పూర్తిగా విడిచిపెట్టడం ఆయనకు ఇష్టంలేదు.
21. మనం యెహోవా ఉపదేశాన్ని స్వీకరిస్తే నేడు ఏ ఆశీర్వాదములను పొందగలము?
21 శక్తివంతమైన ఈ భాగంలో నిక్షిప్తమైయున్న సూత్రాలు నేడు యెహోవా ఆరాధకులకు వర్తిస్తాయి. యెహోవా జీవానికి మూలం, కాబట్టి మనం మన జీవితాలను ఎలా ఉపయోగించుకోవాలన్నది మరెవరికన్నా ఎక్కువగా ఆయనకు తెలుసు. (కీర్తన 36: 9) మనకు ఆనందం లేకుండా చేయాలని కాదు గానీ మన ప్రయోజనం నిమిత్తమే ఆయన మనకు నిర్దేశక సూత్రాలు ఇచ్చాడు. నిజ క్రైస్తవులు యెహోవాచే బోధించబడడానికి ప్రయత్నించడం ద్వారా ప్రతిస్పందిస్తారు. (మీకా 4: 2) ఆయనిచ్చే నిర్దేశకాలు మన ఆధ్యాత్మికతను, ఆయనతో మనకున్న సంబంధాన్ని పటిష్ఠపరచి, కలుషితం చేసే సాతాను ప్రభావం నుండి మనల్ని కాపాడతాయి. దేవుని నియమాల వెనుకనున్న సూత్రాలను మనం గ్రహించినప్పుడు, యెహోవా మన మేలు కోసమే మనకు బోధిస్తాడని మనం తెలుసుకుంటాము. “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని మనం గుర్తిస్తాము. కాబట్టి మనం కొట్టివేయబడము.—1 యోహాను 2:17; 5: 3.
“బబులోనునుండి బయలువెళ్లుడి!”
22. నమ్మకమైన యూదులకు ఏమి చేయమని ఉద్బోధించబడింది, వారికి ఏ హామీలు ఇవ్వబడ్డాయి?
22 బబులోను పతనమైనప్పుడు, యూదులెవరైనా సరైన హృదయ స్థితిని ప్రదర్శిస్తారా? వారు దేవుడిచ్చే విడుదల నుండి ప్రయోజనం పొంది, తమ స్వదేశానికి తిరిగి వచ్చి, స్వచ్ఛారాధనను పునఃస్థాపిస్తారా? తప్పకుండా. ఇది జరుగుతుందన్న యెహోవా నమ్మకాన్ని ఆయన తర్వాతి మాటలు చూపిస్తున్నాయి. “బబులోనునుండి బయలువెళ్లుడి! కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగొనలేదు. రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుకజేసెను, ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను.” (యెషయా 48:20, 21) ఆలస్యం చేయకుండా బబులోనును విడిచి వెళ్ళాలని యెహోవా ప్రజలు ప్రవచనార్థకంగా ఉద్బోధించబడ్డారు. (యిర్మీయా 50: 8) వారి విమోచన గురించి భూదిగంతముల వరకు తెలియజేయబడాలి. (యిర్మీయా 31:10) యెహోవా తన ప్రజలు ఐగుప్తు నుండి నిర్గమించిన తర్వాత, వారు ఎడారి ప్రాంతాల గుండా సంచరిస్తుండగా ఆయన వారి అవసరాలను తీర్చాడు. అలాగే, వారు బబులోను నుండి తమ స్వదేశానికి ప్రయాణిస్తుండగా ఆయన తన ప్రజలకు కావలసిన వాటిని ఇస్తాడు.—ద్వితీయోపదేశకాండము 8:15, 16.
23. దేవుడిచ్చే నెమ్మదిని ఎవరు పొందలేరు?
23 యెహోవా రక్షణ కార్యాల గురించి యూదులు మనస్సులో ఉంచుకోవలసిన మరో ఆవశ్యకమైన సూత్రం ఉంది. నీతిమంతులైన వారు తమ పాపాలను బట్టి బాధపడుతుండవచ్చు గానీ వారు నాశనం చేయబడరు. అయితే అనీతిమంతుల విషయం పూర్తిగా వేరు. “దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా 48:22) దేవుడు తనను ప్రేమించేవారి కోసం ఏర్పాటుచేసి ఉంచిన నెమ్మదిని పశ్చాత్తాపపడని పాపులు పొందరు. మొండిగా దుష్టులై ఉండే లేదా అవిశ్వాసులై ఉండే వారికి దేవుని రక్షణ కార్యాలు లభించవు. అవి కేవలం విశ్వాసం ఉన్నవారి కోసం మాత్రమే. (తీతు 1:15, 16; ప్రకటన 22:14, 15) దుష్టులకు దేవుని నుండి వచ్చే నెమ్మది లభించదు.
24. ఆధునిక కాలాల్లో దేవుని ప్రజలకు ఏది గొప్ప ఆనందాన్ని తెచ్చింది?
24 నమ్మకమైన ఇశ్రాయేలీయులకు సా.శ.పూ. 537 లో బబులోనును విడిచి వెళ్ళే అవకాశం గొప్ప ఆనందాన్ని తీసుకువచ్చింది. దేవుని ప్రజలు బబులోను సంబంధిత చెర నుండి 1919 లో విడుదల చేయబడడం వారు ఎంతో ఆనందించడానికి నడిపింది. (ప్రకటన 11:11, 12) వారు నిరీక్షణతో నింపబడ్డారు, తమ కార్యకలాపాన్ని విస్తృతపరచుకునే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. నిజమే, వైరభావంగల ఈ లోకంలో ప్రకటించేందుకు తమకు లభించిన క్రొత్త సాధ్యతలను సద్వినియోగం చేసుకోవడానికి క్రైస్తవుల ఈ చిన్న గుంపుకు ఎంతో ధైర్యం అవసరమైంది. అయితే యెహోవా సహాయంతో, వారు సువార్త ప్రకటించే పనిపై దృష్టిని కేంద్రీకరించారు. యెహోవా వారిని ఆశీర్వదించాడని చరిత్ర ధృవీకరిస్తోంది.
25. దేవుని నీతియుక్తమైన ఆజ్ఞలకు అవధానమివ్వడం ఎందుకు ప్రాముఖ్యం?
25 యెషయా ప్రవచనంలోని ఈ భాగం, యెహోవా మన మేలు కోసమే మనకు బోధిస్తాడని నొక్కి చెబుతోంది. దేవుని నీతియుక్తమైన ఆజ్ఞలకు అవధానమివ్వడం ఎంతో ప్రాముఖ్యం. (ప్రకటన 15:2-4) మనం దేవుని జ్ఞానాన్ని, ప్రేమను గుర్తు చేసుకుంటుండడం యెహోవా సరైనదని చెప్పేదానికి అనుగుణంగా జీవించడానికి మనకు సహాయం చేస్తుంది. ఆయన ఆజ్ఞలన్నీ మన మేలుకే.—యెషయా 48:17, 18.
[అధ్యయన ప్రశ్నలు]
[133 వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
సర్వశక్తిమంతుడైన దేవుడు తనను తాను నిగ్రహించుకుంటాడు
“నా కోపము మానుకొనుచున్నాను . . . బిగబట్టు కొనుచున్నాను” అని యెహోవా విశ్వాస భ్రష్టులైన ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (యెషయా 48: 9) తనకున్న బలాన్ని ఎన్నడూ తప్పుగా ఉపయోగించకపోవడంలో దేవుడు పరిపూర్ణమైన మాదిరిని ఉంచుతాడని తెలుసుకోవడానికి అలాంటి వ్యాఖ్యానాలు మనకు సహాయం చేస్తాయి. దేవునికంటే ఎవరికీ ఎక్కువ బలం లేదన్నది నిజమే. అందుకే మనం ఆయనను సర్వబలసంపన్నుడు, అధికశక్తిమంతుడు అంటాము. ఆయన సరిగ్గానే “సర్వశక్తిగల” వాడనే పేరును తనకు తాను అన్వయించుకుంటున్నాడు. (ఆదికాండము 17: 1) ఆయనకు అపరిమితమైన శక్తి ఉండడమే కాదు గానీ, తాను సృష్టించిన విశ్వం యొక్క సర్వోన్నతాధిపతిగా ఆయనకున్న స్థానాన్ని బట్టి ఆయనకు సంపూర్ణ అధికారం ఉంది. అందుకే ఆయన చేయి పట్టుకొని “నీవేమి చేయుచున్నావని” ఆయనను అడిగేంత సాహసం ఎవరూ చేయలేరు.—దానియేలు 4:35.
అయితే దేవుడు తన శత్రువులకు వ్యతిరేకంగా తన బలాన్ని వ్యక్తపరచవలసిన అవసరం ఉన్నప్పుడు కూడా ఆయన దీర్ఘశాంతం వహిస్తాడు. (నహూము 1: 3) యెహోవా ‘తన కోపమును మానుకోగలడు,’ ఆయన సరిగ్గానే “దీర్ఘశాంతుడు” అని వర్ణించబడుతున్నాడు, ఎందుకంటే కోపం ఆయన ప్రధాన లక్షణం కాదుగానీ ప్రేమే ఆయన ప్రధాన లక్షణం. ఆయన కోపం వ్యక్తపరచబడినప్పుడు, అది ఎల్లప్పుడూ నీతియుక్తమైనదీ, ఎల్లప్పుడూ న్యాయవంతమైనదీ, ఎల్లప్పుడూ అదుపులో ఉన్నదీ అయ్యుంటుంది.—నిర్గమకాండము 34: 6; 1 యోహాను 4: 8.
యెహోవా ఎందుకిలా చర్య తీసుకుంటాడు? ఎందుకంటే ఆయన తన సర్వశక్తివంతమైన బలాన్ని, తన ఇతర మూడు ప్రధాన లక్షణాలైన జ్ఞానము, న్యాయము, ప్రేమలతో పరిపూర్ణంగా సమతూకపరుస్తాడు. ఆయన తన బలాన్ని ఎల్లప్పుడూ ఈ ఇతర లక్షణాలతో పొందికగానే ఉపయోగిస్తాడు.
[122 వ పేజీలోని చిత్రం]
పునఃస్థాపనను గురించిన యెషయా సందేశం, చెరలో ఉన్న నమ్మకమైన యూదులకు నిరీక్షణను ఇస్తుంది
[124 వ పేజీలోని చిత్రాలు]
యెహోవా చేసిన కార్యాలు విగ్రహాలు చేశాయని చెప్పుకునే దృక్పథం యూదులకు ఉండేది
1. ఇష్తారు 2. బబులోనులోని ఊరేగింపు మార్గం వద్ద లభించిన మెరిసే ఇటుకల చిత్రం 3. మార్దుక్ యొక్క ఘటసర్పం చిహ్నం.
[127 వ పేజీలోని చిత్రం]
యెహోవా సేవ చేయాలనే మన ఉద్దేశాలు స్వచ్ఛమైనవో కావో “ఇబ్బంది కొలిమి” వెల్లడి చేయగలదు
[128 వ పేజీలోని చిత్రాలు]
నిజ క్రైస్తవులు అత్యంత క్రూరమైన హింసను ఎదుర్కొన్నారు