కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘రాజులను నమ్ముకొనకుడి’

‘రాజులను నమ్ముకొనకుడి’

పదకొండవ అధ్యాయం

‘రాజులను నమ్ముకొనకుడి’

యెషయా 50:​1-11

1, 2. (ఎ) యూదులు ఏ ప్రేరేపిత ఉపదేశాన్ని లక్ష్యపెట్టడంలో విఫలులయ్యారు, దాని ఫలితమేమిటి? (బి) ‘పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది’ అని యెహోవా ఎందుకు అడిగాడు?

 ‘రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు, ఆయన ఆకాశమును భూమిని సృజించినవాడు.’ (కీర్తన 146:​3-6) యెషయా కాలంలో జీవించిన యూదులు కీర్తనకర్త చెప్పినట్లు చేసివుంటే ఎంత బాగుండేదో కదా! వారు ఐగుప్తునో లేదా మరితర ఏ అన్య జనాంగమునో నమ్ముకోకుండా ‘యాకోబు దేవుడిని’ నమ్ముకొని ఉంటే ఎంత బాగుండేదో కదా! అలా చేస్తే, యూదా శత్రువులు దానిపైకి వచ్చినప్పుడు, యెహోవా దాన్ని కాపాడడానికి చర్య తీసుకుంటాడు. అయితే యూదా, సహాయం కోసం యెహోవా వైపు తిరగడానికి నిరాకరించింది. ఫలితంగా, యెరూషలేము నాశనం చేయబడి, యూదా నివాసులు బబులోనుకు చెరగా తీసుకుపోయేలా యెహోవా అనుమతిస్తాడు.

2 దీనికంతటికీ నిందార్హురాలు యూదాయే. యెహోవా తనతో మోసంగా వ్యవహరించినందుకో లేదా ఆయన ఆ జనాంగంతో చేసిన నిబంధనను నిర్లక్ష్యం చేసినందుకో తనకు నాశనం వచ్చిందని అది న్యాయబద్ధంగా ఆరోపించలేదు. సృష్టికర్త నిబంధనను భంగము చేసేవాడేమీ కాదు. (యిర్మీయా 31:​32; దానియేలు 9:​27; ప్రకటన 15: 3, 4) ఈ వాస్తవాన్ని నొక్కిచెబుతూ, యెహోవా యూదులను ఇలా అడుగుతున్నాడు: “నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది?” (యెషయా 50:1) మోషే ధర్మశాస్త్రం క్రింద, తన భార్యకు విడాకులిచ్చే ఒక వ్యక్తి ఆమెకు పరిత్యాగ పత్రికను ఇవ్వాలి. అప్పుడామె మరొకరి భార్య అయ్యే స్వేచ్ఛను పొందుతుంది. (ద్వితీయోపదేశకాండము 24:​1, 2) సూచనార్థక భావంలో, యెహోవా అలాంటి పరిత్యాగ పత్రికను యూదా సహోదరి రాజ్యమైన ఇశ్రాయేలుకు ఇచ్చాడు గానీ యూదాకు అలా ఇవ్వలేదు. a ఇప్పటికీ ఆయన దానికి ‘యజమానియే.’ (యిర్మీయా 3:​8, 14) యూదా అన్య జనాంగాలతో జతకట్టడానికి ఖచ్చితంగా దానికి స్వేచ్ఛ లేదు. ‘షిలోహు [మెస్సీయ] వచ్చువరకు’ యెహోవాకు దానితో సంబంధం కొనసాగుతుంది.​—⁠ఆదికాండము 49:​10.

3. యెహోవా ఏ కారణంగా తన ప్రజలను ‘అమ్ముతాడు’?

3 యెహోవా యూదాను ఇలా కూడా అడుగుతున్నాడు: “నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని?” (యెషయా 50: 1బి) ఏదో యెహోవా అప్పు చేస్తే దాన్ని తీర్చడానికి యూదులు బబులోనీయుల చెరలోకి పంపబడినట్లుకాదు. యెహోవా, తన జమా లెక్కలు సరి చేసుకోవడానికి ఋణదాతకు తన పిల్లలను అమ్ముకోవలసిన పేద ఇశ్రాయేలీయుని వంటి వాడు కాదు. (నిర్గమకాండము 21: 7) బదులుగా, తన ప్రజలు బానిసలుగా వెళ్ళడానికి గల అసలైన కారణాన్ని యెహోవా ఇలా చెబుతున్నాడు: “మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను.” (యెషయా 50:1సి) యూదులే యెహోవాను విడనాడారు గానీ యెహోవా యూదుల్ని విడనాడలేదు.

4, 5. యెహోవా తనకు తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను ఎలా చూపిస్తాడు, కానీ దానికి యూదా ఎలా ప్రతిస్పందిస్తుంది?

4 యెహోవా అడుగుతున్న ఈ తర్వాతి ప్రశ్న, ఆయనకు తన ప్రజలపట్ల ఉన్న ప్రేమను స్పష్టంగా ఉన్నతపరుస్తుంది: “నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల?” (యిషయా 50: 2) ఒక విధంగా చెప్పాలంటే, యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా, హృదయపూర్వకంగా తిరిగి రమ్మని తన ప్రజలను పిలవడానికి వారి ఇండ్లకు వెళ్ళాడు. కానీ వారు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. మద్దతు కోసం యూదులు అల్ప మానవునిపై ఆధారపడడానికి ఇష్టపడతారు, కొన్నిసార్లు చివరికి ఐగుప్తు వైపు కూడా మరలుతారు.​—⁠యెషయా 30: 2; 31: 1-3; యిర్మీయా 37:​5-7.

5 ఐగుప్తు యెహోవా కన్నా ఎక్కువ విశ్వసనీయమైన రక్షకుడా? అపనమ్మకస్థులైన ఆ యూదులు, శతాబ్దాల క్రితం తమ జనాంగం ఉద్భవించడానికి కారణమైన సంఘటనలను మరచిపోయారని స్పష్టమవుతోంది. యెహోవా వారినిలా అడుగుతున్నాడు: “నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా? విడిపించుటకు నాకు శక్తిలేదా? నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును; నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి, దాహముచేత చచ్చిపోవును. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను.”​—యెషయా 50:2బి, 3.

6, 7. ఐగుప్తీయుల నుండి ప్రమాదం ముంచుకువచ్చినప్పుడు యెహోవా తన రక్షణ శక్తిని ఎలా చూపించాడు?

6 ఐగుప్తు సా.శ.పూ. 1513 లో దేవుని ప్రజలను అణిచివేసేదిగా ఉందిగానీ వారు నిరీక్షిస్తున్న విమోచకుడిగా కాదు. ఇశ్రాయేలీయులు ఆ అన్య దేశంలో బానిసలుగా ఉన్నారు. కానీ యెహోవా వారిని విడుదల చేశాడు, అది ఎంతటి పులకరింపజేసే విడుదల! మొదట ఆయన ఆ దేశంపైకి పది తెగుళ్ళను రప్పించాడు. ప్రాముఖ్యంగా ఎంతో నాశనకరమైన పదియవ తెగులు తర్వాత, ఐగుప్తు ఫరో ఇశ్రాయేలీయులను దేశం వదిలి వెళ్ళమని చెప్పాడు. (నిర్గమకాండము 7: 14-12:​31) అయితే, వారు అలా వెళ్ళిపోగానే, ఫరో తన మనస్సు మార్చుకున్నాడు. అతడు తన సేనలను సమకూర్చుకొని, ఇశ్రాయేలీయులను బలవంతంగా ఐగుప్తుకు తిరిగి తీసుకురావడానికి బయలుదేరాడు. (నిర్గమకాండము 14:​5-9) ఇశ్రాయేలీయులు, ముందు ఎఱ్ఱసముద్రం వెనుక ఐగుప్తు సైనికుల దండ్ల మధ్యలో ఇరుక్కుపోయారు! కానీ వారి పక్షాన యుద్ధం చేయడానికి యెహోవా ఉన్నాడు.

7 యెహోవా ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీయులకు మధ్యన మేఘస్తంభమును ఉంచడం ద్వారా ఐగుప్తీయులను మార్గమధ్యంలో అపేసాడు. మేఘస్తంభానికి, ఐగుప్తీయులున్న వైపున చీకటి కమ్ముకుంది; కానీ ఇశ్రాయేలీయులున్నవైపున వెలుగు ఉంది. (నిర్గమకాండము 14:​20) ఐగుప్తు సైన్యాలు అక్కడే ఆగిపోగా, యెహోవా “ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.” (నిర్గమకాండము 14:​21) నీళ్ళు రెండు భాగాలుగా చీలిన తర్వాత, ప్రజలందరూ అంటే పురుషులు, స్త్రీలు, పిల్లలు సురక్షితంగా ఎఱ్ఱసముద్రాన్ని దాటి వెళ్ళగలిగారు. తన ప్రజలు అవతలి ఒడ్డుకు చేరుకోగానే యెహోవా మేఘస్తంభాన్ని తొలగించాడు. వారిని చిక్కించుకోవాలనే ఆతృతతో ఐగుప్తీయులు సముద్రంలోకి దూసుకువెళ్ళారు. యెహోవా తన ప్రజలు సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నప్పుడు నీళ్ళను తిరిగి ప్రవహింపజేయడంతో ఫరో అతని సైన్యాలు మునిగిపోయారు. అలా యెహోవా తన ప్రజల పక్షాన యుద్ధం చేశాడు. నేడు క్రైస్తవులను అదెంతగా ప్రోత్సహిస్తుందో కదా!​—⁠నిర్గమకాండము 14:​23-28.

8. యూదా నివాసులు ఏ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసినందుకు చివరికి చెరలోకి వెళతారు?

8 యెషయా కాలానికల్లా, ఆ దైవిక విజయం లభించి ఏడు వందల సంవత్సరాలు గడిచిపోయాయి. యూదా ఇప్పుడు తనకున్న అర్హతలను బట్టి ఒక రాజ్యం అయ్యింది. కొన్నిసార్లు, అది అష్షూరు, ఐగుప్తు వంటి విదేశీ ప్రభుత్వాలతో దౌత్య ఒప్పందాలు కుదుర్చుకొంటుంది. కానీ ఈ అన్య రాజ్యాల నాయకులు విశ్వసనీయులు కాదు. ఆ రాజులు తమ సొంత ఆసక్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, కానీ తాము యూదాతో చేసిన ఏ నిబంధనకూ అంత ప్రాధాన్యతనివ్వరు. ప్రవక్తలు యెహోవా నామమున మాట్లాడుతూ అలాంటి వ్యక్తులను నమ్ముకోవద్దని ప్రజలను హెచ్చరిస్తారు, కానీ వారి మాటలు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అవుతాయి. చివరికి, యూదులు బబులోనులో 70 సంవత్సరాలు దాసులుగా గడపడానికి చెరలోకి తీసుకువెళ్ళబడతారు. (యిర్మీయా 25:​11) అయితే, యెహోవా తన ప్రజలను మరిచిపోడు, అంతేకాదు వారిని శాశ్వతంగా విడనాడడు. నియమిత సమయంలో, ఆయన వారిని జ్ఞాపకం చేసుకుంటాడు, స్వచ్ఛారాధనను పునఃస్థాపించడానికి వారు తమ స్వదేశానికి తిరిగి రావడానికి ఆయన మార్గం తెరుస్తాడు. దేని కోసం? ప్రజలందరి విధేయత ఎవరికైతే చెందుతుందో ఆ షిలోహు రాక కోసం సిద్ధపడేందుకే!

షిలోహు వస్తాడు

9. షిలోహు ఎవరు, ఆయన ఎటువంటి బోధకుడు?

9 శతాబ్దాలు గడుస్తాయి. ‘కాలము పరిపూర్ణమవుతుంది,’ షిలోహు అని పిలువబడే యేసుక్రీస్తు ప్రభువు భూమిపై ప్రత్యక్షమవుతాడు. (గలతీయులు 4: 4; హెబ్రీయులు 1:​1, 2) యెహోవా తన సన్నిహిత సహచరుడ్ని యూదులకు తన ప్రతినిధిగా నియమించాడన్న వాస్తవం, యెహోవా తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపిస్తుంది. యేసు ఏ విధమైన ప్రతినిధిగా నిరూపించబడతాడు? ఆయన అత్యున్నత శ్రేణికి చెందిన ప్రతినిధి! యేసు ప్రతినిధి మాత్రమే కాదు, ఆయన ఒక బోధకుడు, ప్రవీణుడైన బోధకుడు. అందులో ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆయనకు అద్భుతమైన ఉపదేశకుడు ఉన్నాడు, అది మరెవరో కాదు యెహోవా దేవుడే. (యోహాను 5:​30; 6:​45; 7:​15, 16, 46; 8:​26) యేసు యెషయా ద్వారా ప్రవచనార్థకంగా చెప్పేదాని నుండి ఇది ధృవీకరించబడుతుంది: “అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.”​—యెషయా 50: 4. b

10. యెహోవాకు తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను యేసు ఎలా ప్రతిబింబించాడు, యేసుకు ఎటువంటి ప్రతిస్పందన లభించింది?

10 యేసు భూమి మీదికి రాక ముందు పరలోకంలో తన తండ్రి ప్రక్కన పనిచేశాడు. తండ్రీ కుమారుల మధ్యనున్న వాత్సల్యపూరితమైన సంబంధం సామెతలు 8:30 లో గేయరూపంలో వర్ణించబడింది: ‘నేను ఆయన [యెహోవా] యొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.’ తన తండ్రి చెప్పేది వినడం యేసుకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. యేసు తన తండ్రిలానే “నరుల” పట్ల ప్రేమకలిగి ఉన్నాడు. (సామెతలు 8:​31) యేసు భూమి మీదికి వచ్చినప్పుడు, ‘అలసినవానిని మాటలచేత ఊరడిస్తాడు.’ యెషయా ప్రవచనం నుండి ఓదార్పుకరమైన ఒక భాగాన్ని చదివి ఆయన తన పరిచర్యను ప్రారంభిస్తాడు: ‘యెహోవా ఆత్మ నామీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకు, నలిగినవారిని విడిపించుటకు ఆయన నన్ను అభిషేకించెను.’ (లూకా 4:​18; యెషయా 61: 1) బీదలకు సువార్త! అలసినవారికి ఉపశమనం! ఆ ప్రకటన ప్రజలకు ఎంత ఆనందాన్ని కలిగించాలో కదా! కొందరు ఆనందిస్తారు, కానీ అందరూ కాదు. చివరలో అనేకులు యెహోవా యేసుకు బోధించాడన్న దానికి రుజువులను అంగీకరించడానికి నిరాకరిస్తారు.

11. యేసుతో పాటు ఎవరు ఆయన కాడి క్రిందకు వెళతారు, వారు ఏమి అనుభవిస్తారు?

11 అయితే, కొందరు ఇంకా వినాలని కోరుకుంటారు. వారు యేసు ఇస్తున్న ఈ వాత్సల్యపూరితమైన ఆహ్వానానికి ఆనందంగా ప్రతిస్పందిస్తారు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.” (మత్తయి 11:​28, 29) యేసు వద్దకు వచ్చేవారిలో, ఆయన అపొస్తలులుగా మారే వారు ఉన్నారు. యేసుతో పాటు కాడి క్రిందకు వెళ్ళడమంటే వారు ఎంతో కష్టపడవలసి ఉంటుందని వారికి తెలుసు. ఈ పనిలో ఇతర విషయాలతోపాటు భూమి నలుదిక్కులకూ రాజ్య సువార్తను ప్రకటించడం కూడా ఇమిడి ఉంది. (మత్తయి 24:​14) అపొస్తలులు, ఇతర శిష్యులు ఈ పనిలో నిమగ్నమై వాస్తవంగా అది తమ ప్రాణములకు ఉపశమనం కలిగిస్తోందని కనుగొంటారు. నేడు నమ్మకమైన క్రైస్తవులు అదే పనిని చేస్తున్నారు, దానిలో భాగం వహించడం వారికి అలాంటి ఆనందాలనే తీసుకువస్తుంది.

ఆయన తిరుగుబాటు చేసేవాడు కాదు

12. యేసు తన పరలోక తండ్రికి ఏ యే విధాలుగా విధేయత చూపిస్తాడు?

12 యేసు తాను భూమి మీదికి రావడానికి గల సంకల్పాన్ని, అంటే దేవుని చిత్తాన్ని చేయాలనే సంకల్పాన్ని ఎన్నడూ మరచిపోడు. ఆయన దృక్కోణం గురించి ఇలా ప్రవచించబడింది: “ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు. వినకుండ నేను తొలగిపోలేదు.” (యిషయా 50: 5) యేసు ఎల్లప్పుడూ దేవునికి విధేయునిగా ఉన్నాడు. వాస్తవానికి ఆయన ఇలా కూడా అంటాడు: “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు.” (యోహాను 5:​19) యేసు తాను మానవుడిగా భూమిపైకి రాకమునుపు లక్షల సంవత్సరాలపాటు, చివరికి కోట్ల సంవత్సరాలపాటు తన తండ్రితో కలిసి పనిచేసి ఉండవచ్చు. ఆయన భూమిపైకి వచ్చిన తర్వాత కూడా యెహోవా ఉపదేశాలను అనుసరిస్తాడు. క్రీస్తు అపరిపూర్ణ అనుచరులమైన మనం యెహోవా నిర్దేశిస్తున్నట్లు నడుచుకోవడానికి ఇంకా ఎంతగా శ్రద్ధ తీసుకోవాలో కదా!

13. యేసు కోసం ఏమి వేచి ఉంది, అయినప్పటికీ తాను ధైర్యవంతుడనని ఆయన ఎలా నిరూపించుకుంటాడు?

13 యెహోవా అద్వితీయ కుమారుడ్ని నిరాకరించే కొందరు ఆయనను హింసిస్తారు, అది కూడా ముందే తెలియజేయబడింది: “కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని. ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు.” (యెషయా 50: 6) ప్రవచనం ప్రకారం, వ్యతిరేకుల చేతుల్లో మెస్సీయ బాధను, అవమానాన్ని అనుభవిస్తాడు. యేసుకు ఇది తెలుసు. ఈ హింస ఎంతవరకూ వెళుతుందో కూడా ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఆయన తాను ఈ భూమిపై ఉండే కాలం ముగింపుకు వస్తుండగా, ఎంతమాత్రం భయపడడు. చెకుముకిరాయి వంటి నిశ్చయతతో ఆయన యెరూషలేముకు బయలుదేరుతాడు, అక్కడే ఆయన మానవజీవితం ముగిసిపోతుంది. అక్కడికి వెళుతుండగా దారిలో యేసు తన శిష్యులకు ఇలా చెబుతాడు: ‘ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు. వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచును.’ (మార్కు 10:​33, 34) యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని ప్రవచనాలను బట్టి ఎరిగి ఉండవలసిన ప్రధాన యాజకుల, శాస్త్రుల ప్రేరణ మూలంగానే ఈ దుష్ట దుర్వ్యవహారమంతా జరుగుతుంది.

14, 15. యేసును కొడతారని, అవమానిస్తారని యెషయా పలికిన మాటలు ఎలా నెరవేరాయి?

14 యేసు సా.శ. 33, నీసాను 14 రాత్రి తన అనుచరుల్లో కొంతమందితో గెత్సేమనే తోటలో ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తున్నాడు. హఠాత్తుగా ఒక మూక అక్కడికి వచ్చి ఆయనను నిర్బంధిస్తుంది. కానీ ఆయన భయపడడు. యెహోవా తనతో ఉన్నాడని ఆయనకు తెలుసు. తనకు కావాలంటే తనను రక్షించడానికి తాను తన తండ్రిని పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువమంది దూతలను పంపించమని అడుగగలనని భయవిహ్వలులైన తన అపొస్తలులకు ధైర్యం చెబుతాడు, కానీ “నేను వేడుకొనిన యెడల . . . లేఖనము ఏలాగు నెరవేరునని” ఆయన అంటాడు.​—⁠మత్తయి 26:​36, 47, 53, 54.

15 మెస్సీయ అనుభవించే శ్రమల గురించి, ఆయన పొందే మరణం గురించి ప్రవచించబడినదంతా నెరవేరుతుంది. సమాజమందిరం ఎదుట మోసకరమైన విచారణ పూర్తైన తర్వాత పొంతి పిలాతు యేసును మళ్ళీ విచారణ చేస్తాడు, అతడు యేసును కొరడాలతో కొట్టిస్తాడు. రోమా సైనికులు “రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమ్మి” వేస్తారు. అలా యెషయా మాటలు నెరవేరాయి. (మార్కు 14:​65; 15:​19; మత్తయి 26:​67, 68) యేసు గడ్డములో నుండి కొన్ని వెంట్రుకలు అక్షరార్థంగా పెరికి వేయబడ్డాయని బైబిలు చెప్పకపోయినప్పటికీ, యెషయా ప్రవచించినట్లుగానే ఇది నిస్సందేహంగా జరుగుతుంది, అలా గడ్డములో నుండి వెంట్రుకలు పెరికి వేయడమన్నది ఘోరమైన తృణీకారాన్ని సూచించే చర్య. c​—⁠నెహెమ్యా 13:​25.

16. తీవ్రమైన ఒత్తిడి సమయంలో యేసు ఎలా ప్రవర్తించాడు, ఆయనెందుకు సిగ్గుపడలేదు?

16 యేసు పిలాతు ఎదుట నిలబడినప్పుడు, ఆయన తన ప్రాణాన్ని నిలబెట్టమని వేడుకోడు గానీ, లేఖనాలు నెరవేరడానికి తాను మరణించవలసి ఉందని తెలుసుకుని ఆయన ప్రశాంతంగా ఉంటాడు. ఆయనకు మరణశిక్ష విధించే లేక ఆయనను విడుదల చేసే అధికారం తనకు ఉందని రోమా అధిపతి అన్నప్పుడు, యేసు నిర్భయంగా ఇలా సమాధానం ఇస్తాడు: “పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు.” (యోహాను 19:​11) పిలాతు సైనికులు యేసుతో అమానుషంగా వ్యవహరిస్తారు, కానీ వారు ఆయన సిగ్గుపడేలా చేయలేకపోతారు. ఆయనెందుకు సిగ్గుపడాలి? ఆయన ఏదైనా తప్పు చేసినందుకు న్యాయబద్ధంగా ఏమీ శిక్షించబడడం లేదు. బదులుగా, ఆయన నీతి నిమిత్తం హింసించబడుతున్నాడు. ఈ విషయంలో, యెషయా తర్వాతి ప్రవచనార్థక మాటలు నెరవేరాయి: “ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు, గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని.”​—యెషయా 50: 7.

17. యేసు పరిచర్య అంతటిలో యెహోవా ఏ యే విధాలుగా ఆయన ప్రక్కన ఉన్నాడు?

17 యేసు ధైర్యం, ఆయనకు యెహోవాపై ఉన్న సంపూర్ణ నమ్మకం నుండి ఉద్భవించింది. ఆయన ప్రవర్తన, యెషయా యొక్క ఈ మాటలతో ఆయన పూర్తిగా పొందిక కలిగి ఉన్నాడని చూపిస్తుంది: “నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు. నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదుము. నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును. నామీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు. చిమ్మెట వారిని తినివేయును.” (యెషయా 50:​8, 9) యేసు బాప్తిస్మం తీసుకున్న రోజున, యెహోవా ఆయనను తన ఆధ్యాత్మిక కుమారునిగా నీతిమంతుడని ప్రకటిస్తాడు. వాస్తవానికి, ఆ సందర్భంలో “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని” చెబుతూ స్వయంగా దేవుని స్వరం వినిపిస్తుంది. (మత్తయి 3:​17) యేసు తన భూజీవితం ముగింపులో గెత్సేమనే తోటలో ప్రార్థించడానికి మోకాళ్ళూనినప్పుడు, “పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.” (లూకా 22:​41-43) కాబట్టి తండ్రి తన జీవిత విధానాన్ని ఆమోదించాడని యేసుకు తెలుసు. దేవుని పరిపూర్ణ కుమారుడైన ఈయన ఏ పాపము చేయలేదు. (1 పేతురు 2:​22) విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించేవాడనీ, త్రాగుబోతనీ, దయ్యముపట్టిన వాడనీ యేసు శత్రువులు ఆయనను నిందిస్తారు గానీ ఆయన వారి అబద్ధాలను బట్టి అవమానింపబడడు. దేవుడు ఆయన పక్షమున ఉండగా, ఎవరు ఆయనకు విరోధి కాగలరు?​—⁠లూకా 7:​34; యోహాను 5:​18; 7:​20; రోమీయులు 8:​31; హెబ్రీయులు 12: 3.

18, 19. అభిషిక్త క్రైస్తవులు కూడా యేసు అనుభవించినటువంటి ఏ అనుభవాలను పొందారు?

18 యేసు తన శిష్యులను ఇలా హెచ్చరిస్తున్నాడు: “లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు.” (యోహాను 15:​20) ఇది నిజమని సంఘటనలు త్వరలోనే నిరూపిస్తాయి. సా.శ. 33 పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ యేసు నమ్మకమైన శిష్యులపైకి వచ్చినప్పుడు క్రైస్తవ సంఘం ఉద్భవించింది. దాదాపు వెంటనే, ‘అబ్రాహాము యొక్క సంతానము’లో భాగంగా ఇప్పుడు యేసుతో సహవసిస్తున్న, దేవుని ఆధ్యాత్మిక కుమారులుగా దత్తత చేసుకోబడిన ఈ నమ్మకమైన స్త్రీ పురుషుల ప్రకటనా పనిని ఆపడానికి మతనాయకులు ప్రయత్నిస్తారు. (గలతీయులు 3:​26, 29; 4:​4-6) మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు అభిషిక్త క్రైస్తవులు నీతి కోసం దృఢంగా నిలబడుతూ, యేసు శత్రువుల నుండి అబద్ధ ప్రచారాన్ని, తీవ్రమైన హింసను ఎదుర్కోవలసి వస్తోంది.

19 అయినప్పటికీ, వారు యేసు పలికిన ఈ ప్రోత్సాహకరమైన మాటలను గుర్తుంచుకుంటారు: “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.” (మత్తయి 5:​11, 12) కాబట్టి, ఎంతో తీవ్రమైన దాడుల సమయంలో కూడా అభిషిక్త క్రైస్తవులు తమ తలలు నిటారుగా ఉంచుతారు. వారి వ్యతిరేకులు ఏమి చెప్పినప్పటికీ, దేవుడు తమను నీతిమంతులుగా తీర్చాడని వారికి తెలుసు. ఆయన దృష్టిలో వారు ‘నిర్దోషులు, నిరపరాధులు.’​—⁠కొలొస్సయులు 1:​21, 22.

20. (ఎ) అభిషిక్త క్రైస్తవులకు ఎవరు మద్దతు ఇస్తారు, వారు ఏమి అనుభవించారు? (బి) అభిషిక్త క్రైస్తవులు, “వేరే గొఱ్ఱెలు” శిష్యునికి తగిన నోటిని ఎలా పొందుతారు?

20 ఆధునిక కాలాల్లో అభిషిక్త క్రైస్తవులకు “వేరే గొఱ్ఱెల” “గొప్ప సమూహము” యొక్క మద్దతు లభిస్తోంది. వారు కూడా నీతి పక్షం వహిస్తారు. తత్ఫలితంగా వారు తమ అభిషిక్త సహోదరులతోపాటు ఎన్నో బాధలుపడి, “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.” “మహాశ్రమల” నుండి తప్పించుకునే విధంగా యెహోవా వారిని నీతిమంతులుగా తీర్చాడు. (ప్రకటన 7:​9, 14, 15; యోహాను 10:​16; యాకోబు 2:​23) ఇప్పుడు వారి వ్యతిరేకులు చాలా బలంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, దేవుని నియమిత సమయంలో ఆ వ్యతిరేకులు కేవలం పడవేయడానికి మాత్రమే తగినట్లుండే చిమ్మెట తినివేసిన వస్త్రముగా నిరూపించబడతారని యెషయా ప్రవచనం చెబుతోంది. ఈలోగా, అభిషిక్త క్రైస్తవులు, “వేరేగొఱ్ఱెలు” క్రమంగా ప్రార్థించడం ద్వారా, దేవునివాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా, ఆరాధన కోసం కూటాలకు హాజరవడం ద్వారా బలంగా ఉంటారు. అలా వారు యెహోవాచే బోధించబడి, శిష్యునికి తగిన నోటితో మాట్లాడడం నేర్చుకుంటారు.

యెహోవా నామమును ఆశ్రయించండి

21. (ఎ) వెలుగులో నడిచేవారు ఎవరు, వారి కోసం ఏమి వేచివుంది? (బి) అంధకారంలో నడిచేవారికి ఏమవుతుంది?

21 ఇప్పుడు ఒక స్పష్టమైన తేడాను గమనించండి: “మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.” (యెషయా 50:​10) దేవుని సేవకుడైన యేసుక్రీస్తు స్వరాన్ని వినేవారు వెలుగులో నడుస్తారు. (యోహాను 3:​21) వారు యెహోవా అనే దైవిక నామమును ఉపయోగించడమేగాక, ఆ నామము ధరించిన ఆయనపై నమ్మకం ఉంచుతారు. ఒకప్పుడు వారు అంధకారంలో నడిచినప్పటికీ, ఇప్పుడు వారు మనుష్యులకు భయపడరు. వారు దేవునిపైనే ఆధారపడతారు. అయితే, అంధకారంలోనే నడుస్తూ ఉండేవారు, మనుష్యుల భయానికి లొంగిపోతారు. పొంతి పిలాతు విషయంలో అలాగే జరిగింది. యేసుపై వేయబడిన అపనిందలు నిజం కాదని ఆ రోమా అధికారికి తెలిసినప్పటికీ, యేసును విడుదల చేయకుండా భయం అతడిని ఆపుతుంది. రోమా సైనికులు దేవుని కుమారుడ్ని చంపుతారు కానీ యెహోవా ఆయనను పునరుత్థానం చేసి, ఆయనకు మహిమ ఘనతలను అనుగ్రహిస్తాడు. పిలాతుకు ఏమి జరుగుతుంది? యూదా చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసీఫస్‌ చెబుతున్నదాని ప్రకారం, యేసు మరణించిన కేవలం నాలుగు సంవత్సరాలకు, పిలాతు రోమా గవర్నరుగా తొలగించబడి, అతడు చేశాడని ఆరోపించబడుతున్న గంభీరమైన తప్పుకు జవాబు చెప్పడానికి రోముకు రమ్మని పిలిపించబడ్డాడు. యేసు మరణానికి కారణమైన యూదుల మాటేమిటి? నాలుగు దశాబ్దాలు గడవకముందే, రోమా సైన్యాలు యెరూషలేమును నాశనం చేయడంతో, దాని నివాసులు వధించబడ్డారు లేదా బానిసలుగా తీసుకువెళ్లబడ్డారు. అంధకారాన్ని కోరుకునేవారికి ప్రకాశమానమైన వెలుగు లభించదు!​—⁠యోహాను 3: 19.

22. రక్షణ కోసం మానవుల వైపు చూడడం ఎందుకు ఘోరమైన బుద్ధిహీనత?

22 రక్షణ కోసం మానవులవైపు చూడడమన్నది ఘోరమైన బుద్ధిహీనత. దానికి కారణాన్ని యెషయా ప్రవచనం వివరిస్తోంది: “ఇదిగో! అగ్ని రాజబెట్టి అగ్నికొరవులను మీచుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది: మీరు వేదనగలవారై పండుకొనెదరు.” (యెషయా 50:​11) మానవ నాయకులు వస్తారు, పోతారు. ఆకర్షణాశక్తిగల వ్యక్తి ప్రజలను కొంతకాలంపాటు ఆకట్టుకోవచ్చు. కానీ ఎంతో యథార్థవంతుడైన మానవుడు సాధించగలదానికి కూడా పరిమితి ఉంది. అతని మద్దతుదారులు ఆశిస్తున్నట్లుగా అతడు భగభగమండే మంటను రేపే బదులు, కొద్దిగా వెలుగును, వేడిని ఇచ్చి వెంటనే ఆరిపోయే కొన్ని “అగ్ని కొరవుల”ను మాత్రం రేపుతుండవచ్చు. మరో వైపున, దేవుడు వాగ్దానం చేసిన మెస్సీయ అయిన షిలోహుపై విశ్వాసం ఉంచేవారు ఎన్నడూ నిరాశపరచబడరు.

[అధస్సూచీలు]

a యెషయా 50 వ అధ్యాయంలోని మొదటి మూడు వచనాల్లో, యెహోవా యూదా జనాంగాన్ని మొత్తంగా తన భార్యగానూ, దాని నివాసులను ఆమె పిల్లలుగానూ వర్ణిస్తున్నాడు.

b నాలుగవ వచనం నుండి అధ్యాయం చివరి వరకు, రచయిత తన గురించి తాను మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. యెషయా తాను ఈ వచనాల్లో ప్రస్తావిస్తున్న శ్రమల్లో కొన్నింటిని అనుభవించి ఉండవచ్చు. అయితే, పూర్తి భావంలో, ఈ ప్రవచనం యేసుక్రీస్తుయందు నెరవేరింది.

c ఆసక్తికరంగా, యెషయా 50:6 సెప్టాజింట్‌లో ఇలా ఉంది: “నా వీపును కొరడాలకు, నా చెంపలను దెబ్బలకు అప్పగించితిని.”

[అధ్యయన ప్రశ్నలు]

[155 వ పేజీలోని చిత్రం]

యూదులు యెహోవా వైపు చూసే బదులు మానవ పరిపాలకుల వైపు చూస్తారు

[156, 157 వ పేజీలోని చిత్రం]

ఎఱ్ఱసముద్రం వద్ద, ఐగుప్తీయులకు తన ప్రజలకు మధ్య మేఘస్తంభాన్ని ఉంచడం ద్వారా యెహోవా తన ప్రజలను కాపాడాడు