సత్యారాధన ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది
ఇరవై ఒకటవ అధ్యాయం
సత్యారాధన ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది
1. యెషయా 60 వ అధ్యాయంలో ఏ ప్రోత్సాహకరమైన సందేశం ఉంది?
యెషయా గ్రంథంలోని 60 వ అధ్యాయం హృదయోత్తేజకరమైన నాటకంలా వ్రాయబడింది. ప్రారంభ వచనాల్లో, ఒక కదిలించివేసే దృశ్యం మన అవధానాన్ని చూరగొంటుంది. కొన్ని సంఘటనలు ఒక పరంపరలా వెనువెంటనే జరిగి, ప్రేరణాత్మకమైన ముగింపు వైపుకు మనల్ని నడిపిస్తాయి. ఆ అధ్యాయం, ప్రాచీన యెరూషలేములో సత్యారాధన పునఃస్థాపించబడడాన్ని గురించి, నేడు సత్యారాధన ప్రపంచవ్యాప్తంగా విస్తరించడాన్ని గురించి వర్ణభరితమైన పదచిత్రణలతో వివరిస్తుంది. అంతేగాక అది, దేవుని యథార్థమైన ఆరాధకులందరి కోసం భద్రపరచబడి ఉన్న నిత్య ఆశీర్వాదాలను సూచిస్తుంది. మనలో ప్రతి ఒక్కరం, యెషయా ప్రవచనంలోని ఈ అద్భుతమైన భాగపు నెరవేర్పులో ఒక పాత్ర నిర్వహించవచ్చు. కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాము.
అంధకారంలో వెలుగు ప్రకాశిస్తుంది
2. అంధకారంలో పడివున్న స్త్రీకి ఏ ఆజ్ఞ ఇవ్వబడింది, ఆమె దానికి విధేయత చూపించడం ఎందుకు అత్యవసరం?
2 యెషయా గ్రంథంలోని ఈ అధ్యాయపు ప్రారంభ మాటలు, దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్న ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పబడ్డాయి. ఆమె అంధకారంలో నేలమీద పడివుందని స్పష్టమవుతోంది. యెహోవా యెషయా ద్వారా ఇలా అన్నప్పుడు, అంధకారంలోకి హఠాత్తుగా వెలుగు చొచ్చుకువస్తుంది: ‘[“ఓ స్త్రీ,” NW] నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.’ (యిషయా 60: 1) అవును, ఆ “స్త్రీ” లేచి నిలబడి, దేవుని మహిమను ప్రతిబింబింపజేయాలి! ఇది ఎందుకు అత్యవసరమైన విషయమై ఉంది? ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “చూడుము! భూమిని చీకటి కమ్ముచున్నది, కటికచీకటి జనములను కమ్ముచున్నది; యెహోవా నీమీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీమీద కనబడుచున్నది.” (యిషయా 60: 2) ఇప్పటికీ అంధకారంలో తడవులాడుతున్న తన చుట్టూవున్న వారి ప్రయోజనార్థం ఆ ‘స్త్రీ తేజరిల్లాలి.’ దాని ఫలితమేమై ఉంటుంది? “జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.” (యిషయా 60: 3) ఈ ప్రారంభ మాటలు తర్వాతి వచనాల్లో ఎంతో సవివరంగా వర్ణించబడేదాని సారాంశాన్ని అంటే సత్యారాధన ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే విషయాన్ని తెలియజేస్తున్నాయి!
3. (ఎ) ఈ “స్త్రీ” ఎవరు? (బి) ఆ “స్త్రీ” అంధకారంలో ఎందుకు పడివుంది?
3 యెహోవా భవిష్యద్ సంఘటనల గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఆమె “వెలుగు వచ్చియున్నది” అని ఆ “స్త్రీ”కి చెబుతాడు. ప్రవచనం తప్పక నెరవేరుతుందన్న దాని ఖచ్చితత్వాన్ని అది నొక్కి చెబుతోంది. ఇక్కడ సూచించబడుతున్న “స్త్రీ” యూదా రాజధానియైన సీయోను లేదా యెరూషలేము. (యెషయా 52:1, 2; 60:14) ఆ నగరం మొత్తం జనాంగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ ప్రవచనం యొక్క తొలి నెరవేర్పు సమయంలో, ఆ “స్త్రీ” అంధకారంలో పడివున్నట్లు కనుగొనబడింది, సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం చేయబడినప్పటి నుండి అది అక్కడే పడివుంది. అయితే, బంధీలుగా ఉన్న యూదుల నమ్మకమైన శేషము సా.శ.పూ. 537 లో యెరూషలేముకు తిరిగి వచ్చి సత్యారాధనను పునఃస్థాపిస్తుంది. చివరికి యెహోవా తన “స్త్రీ”పై వెలుగు ప్రకాశించేలా చేస్తాడు, పునఃస్థాపించబడిన ఆయన ప్రజలు ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉన్న జనములకు వెలుగునిచ్చే మూలమవుతారు.
మరింత గొప్ప నెరవేర్పు
4. “స్త్రీ”కి ఈనాడు భూమిపై ఎవరు ప్రతినిధిగా ఉన్నారు, ప్రవచనార్థక మాటలు ఇంకా ఎవరికి అన్వయిస్తాయి?
4 ఈ ప్రవచనార్థక మాటలు ప్రాచీన యెరూషలేముపై నెరవేరడంలోనే గాక అవి భవిష్యత్తులో నెరవేరడంపై కూడా మనం ఆసక్తి కలిగి ఉన్నాము. నేడు యెహోవా పరలోక “స్త్రీ”కి భూమి మీద “దేవుని ఇశ్రాయేలు” ప్రాతినిధ్యం వహిస్తోంది. (గలతీయులు 6:16) ఈ ఆధ్యాత్మిక జనాంగము తాను ఉనికిలో ఉన్న కాలమంతటిలోనూ అంటే సా.శ. 33 పెంతెకొస్తు దినం నుండి నేటి వరకు, దానిలో మొత్తం 1,44,000 మంది ఆత్మాభిషిక్త సభ్యులు ఉన్నారు, వీరు పరలోకంలో క్రీస్తుతోపాటు పరిపాలించే ఉత్తరాపేక్షతో “భూలోకములోనుండి కొనబడిన”వారు. (ప్రకటన 14:1, 3) యెషయా గ్రంథం 60 వ అధ్యాయపు ఆధునిక దిన నెరవేర్పు, “అంత్యదినములలో” 1,44,000 మందిలో భూమిపై సజీవంగా మిగిలివున్న వారిపై కేంద్రీకృతమై ఉంది. (2 తిమోతి 3: 1) ఈ ప్రవచనానికి ఈ అభిషిక్త క్రైస్తవుల సహవాసులైన “వేరే గొఱ్ఱెల” “గొప్పసమూహము”తో కూడా సంబంధం ఉంది.—ప్రకటన 7: 9; యోహాను 10:11, 16.
5. దేవుని ఇశ్రాయేలులోని మిగిలివున్న సభ్యులు తాము అంధకారంలో పడివున్నట్లు ఎప్పుడు కనుగొన్నారు, యెహోవా వెలుగు వారిపై ఎప్పుడు ప్రసరింపజేయబడింది?
5 ఒక విధంగా చెప్పాలంటే, ఇంకా భూమిపైనున్న దేవుని ఇశ్రాయేలుకు చెందినవారు 1900ల తొలిభాగంలో కొంతకాలంపాటు తాము అంధకారంలో పడివున్నట్లు కనుగొన్నారు. వారు ప్రకటన గ్రంథంలో సూచనార్థకంగా వర్ణించబడిన స్థితిలో ఉండగా అంటే వారి శవములు ‘ఆత్మరూపకముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరుగల ఆ మహాపట్టణపు సంతవీధిలో పడియుండగా’ మొదటి ప్రపంచ యుద్ధం ముగింపుకు వచ్చింది. (ప్రకటన 11:8, అధస్సూచి) అయితే, 1919 లో యెహోవా వారిపై తన వెలుగును ప్రసరింపజేశాడు. దానికి ప్రతిస్పందనగా, వారు లేచి నిలువబడి, దేవుని రాజ్య సువార్తను నిర్భయంగా ప్రకటిస్తూ, దేవుని వెలుగును ప్రతిబింబింపజేశారు.—మత్తయి 5:14-16; 24:14.
6. యేసు రాచరిక ప్రత్యక్షతను గూర్చిన ప్రకటనకు మానవజాతిలో అధికభాగం ఎలా ప్రతిస్పందించింది, కానీ యెహోవా వెలుగువైపుకు ఎవరు ఆకర్షించబడ్డారు?
6 మానవజాతిలో అధికభాగం “ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథుల” ప్రధాన నాయకుడైన సాతానుచే ప్రభావితం చేయబడి, “లోకమునకు వెలుగు” అయిన యేసుక్రీస్తు రాచరిక ప్రత్యక్షతను గూర్చిన ప్రకటనను నిరాకరించింది. (ఎఫెసీయులు 6:12; యోహాను 8:12; 2 కొరింథీయులు 4:3, 4) ఏదేమైనప్పటికీ “రాజులు” (పరలోక రాజ్యానికి అభిషిక్త వారసులయ్యేవారు), “జనముల”తో (వేరే గొఱ్ఱెలకు చెందిన గొప్ప సమూహము) సహా లక్షలాదిమంది యెహోవా వెలుగు వైపుకు ఆకర్షించబడ్డారు.
విస్తరణ హృదయపూర్వకమైన ఆనందాన్ని కలిగిస్తుంది
7. హృదయోత్తేజకరమైన ఏ దృశ్యం “స్త్రీ”కి కనిపిస్తుంది?
7 యెషయా 60:3 లో వెల్లడించబడిన ముఖ్యాంశాన్ని వృద్ధి చేస్తూ, యెహోవా “స్త్రీ”కి మరో ఆజ్ఞ ఇస్తున్నాడు: “కన్నులెత్తి చుట్టు చూడుము!” దానికి ఆ “స్త్రీ” విధేయత చూపిస్తే హృదయోత్తేజకరమైన దృశ్యం ఆమెకు కనిపిస్తుంది—ఆమె పిల్లలు ఇంటికి తిరిగి వస్తున్నారు! “వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.” (యెషయా 60: 4) 1919 లో ప్రారంభమైన అంతర్జాతీయ రాజ్య ప్రకటనా పని ఫలితంగా, వేలాదిమంది అభిషిక్త “కుమారులు” మరియు “కుమార్తెలు” అదనంగా దేవుని ఇశ్రాయేలుతో కలవడం జరిగింది. ఈ విధంగా, ముందుగా తెలియజేయబడిన, క్రీస్తుతోపాటు పరిపాలించే 1,44,000 మంది సంఖ్యను పూర్తి చేసేందుకు యెహోవా చర్యలు తీసుకున్నాడు.—ప్రకటన 5:9, 10.
8. దేవుని ఇశ్రాయేలుకు 1919 నుండి ఆనందించడానికి ఏ కారణం ఉంది?
8 ఈ పెరుగుదల ఆనందాన్ని కలిగించింది. “నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును; జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.” (యెషయా 60: 5) 1920లలోనూ, 1930లలోనూ జరిగిన అభిషిక్తుల సమకూర్పు పని దేవుని ఇశ్రాయేలుకు గొప్ప ఆనందాన్ని తీసుకువచ్చింది. అయితే, వారు ఆనందించడానికి మరో కారణం కూడా ఉంది. ప్రాముఖ్యంగా, దేవునికి దూరమైన మానవజాతి అనే “సముద్రము”లో ఒకప్పుడు భాగంగావున్న ప్రజలు 1930ల మధ్యకాలం మొదలుకొని, దేవుని ఇశ్రాయేలుతో కలిసి ఆరాధించడానికి అన్ని జనములలో నుండి బయటికి వచ్చారు. (యెషయా 57:20; హగ్గయి 2: 7) వీరు తమకు ఇష్టం వచ్చిన రీతిగా దేవుని సేవ చేయరు గానీ, వారు దేవుని “స్త్రీ” వద్దకు వచ్చి దేవుని ఐక్య మందలో భాగమవుతారు. తత్ఫలితంగా, దేవుని సేవకులందరూ సత్యారాధన విస్తరణలో భాగం వహిస్తారు.
జనములు యెరూషలేములో సమకూడతారు
9, 10. యెరూషలేములో ఎవరు సమకూడుతున్నారు, యెహోవా వారిని ఎలా స్వీకరిస్తాడు?
9 యెషయా సమకాలీనులకు బాగా పరిచయమున్న ఉపమానాలను ఉపయోగిస్తూ, యెహోవా విస్తరణ గురించి వర్ణిస్తున్నాడు. ఆ “స్త్రీ” సీయోను పర్వతంపై నుండి, తనకు ప్రయోజనం చేకూర్చే స్థలం మీదుగా చూస్తూ, ముందుగా ప్రాచ్య దిశను పరిశీలిస్తుంది. ఆమెకేమి కనిపిస్తుంది? “ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలును నీ దేశముమీద వ్యాపించును. వారందరు షేబనుండి వచ్చెదరు. బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.” (యెషయా 60: 6) వివిధ తెగలకు చెందిన సంచార వర్తకులు ఉపయోగించే ఒంటెల సమూహాలు యెరూషలేముకు దారితీసే మార్గాల గుండా ప్రయాణిస్తాయి. (ఆదికాండము 37:25, 28; న్యాయాధిపతులు 6:1, 5; 1 రాజులు 10:1, 2) దేశాన్ని ముంచెత్తే వరదలా ఎక్కడ చూసినా ఒంటెలే! వర్తకులు సమాధానకరమైన ఉద్దేశాలతోనే వస్తున్నారనడానికి నిదర్శనంగా వారు ఒంటెలపై విలువైన బహుమానాలు తీసుకువస్తారు. వారు యెహోవాను ఆరాధిస్తూ, ఆయనకు తాము ఇవ్వగల శ్రేష్ఠమైనది ఇవ్వాలని కోరుకుంటున్నారు.
10 ప్రయాణించి వస్తున్నది కేవలం ఈ వర్తకులు మాత్రమే కాదు. “నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును. నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును.” అవును, పశువుల కాపరులు కూడా యెరూషలేము వైపుకు ప్రయాణిస్తున్నారు. వారు తమవద్ద ఉన్న అత్యంత విలువైన సంపదలను అంటే గొఱ్ఱెలమందలను బహుమానాలుగా తీసుకువచ్చి, తమను తాము సేవకులుగా అర్పించుకుంటారు. యెహోవా వారిని ఎలా స్వీకరిస్తాడు? ఆయనిలా చెబుతున్నాడు: “అవి నా బలిపీఠముమీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.” (యెషయా 60: 7) యెహోవా వారి బహుమానాలను స్వీకరిస్తాడు, అవి స్వచ్ఛారాధనలో ఉపయోగించబడతాయి.—యెషయా 56: 7; యిర్మీయా 49:28, 29.
11, 12. (ఎ) “స్త్రీ” పశ్చిమంగా చూసినప్పుడు ఆమెకు ఏ దృశ్యం కనిపిస్తుంది? (బి) యెరూషలేముకు చాలామంది ఆత్రంగా ఎందుకు తరలివెళ్తున్నారు?
11 యెహోవా ఇప్పుడు పశ్చిమంగా చూడమని ఆ “స్త్రీ”కి నిర్దేశించి, ఆయనిలా అడుగుతాడు: “మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?” యెహోవా తానే ఇలా సమాధానం ఇస్తున్నాడు: “నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.”—యెషయా 60: 8, 9.
12 మీరు ఆ “స్త్రీ”తోపాటు నిలబడి మహా సముద్రం మీదుగా పశ్చిమదిశకు చూస్తున్నట్లు ఊహించుకోండి. మీకేమి కనిపిస్తోంది? దూరాన తెల్లని చుక్కలతో ఉన్న మేఘం నీటి ఉపరితలంపై అల్లలాడుతోంది. అవి పక్షుల్లా కనిపిస్తున్నాయి గానీ దగ్గరవుతుండగా, అవి తెరచాపలు విప్పబడి ఉన్న ఓడలని మీరు గుర్తిస్తారు. అవి “దూరమునుండి” వచ్చాయి. a (యెషయా 49:12) సీయోనువైపుగా ఎన్ని ఓడలు వస్తున్నాయంటే, అవి గూళ్ళకు ఎగసి వస్తున్న గువ్వల్లా కనిపిస్తాయి. ఆ నౌకాదళం ఎందుకంత త్వరగా ప్రయాణిస్తోంది? సుదూరానున్న ఓడరేవుల నుండి వస్తున్న యెహోవా ఆరాధకులనే తన సరుకును దించడానికి అది ఆత్రపడుతోంది. వాస్తవానికి, తూర్పు నుండి లేదా పశ్చిమదిశ నుండి, సమీపం నుండి లేదా సుదూర దేశాల నుండి వచ్చిన ఇశ్రాయేలీయులు, విదేశీయులు అంటే క్రొత్తగా వచ్చే వారందరూ తమ దేవుడైన యెహోవా నామముకు తమ సమస్తాన్నీ సమర్పించుకోవడానికి యెరూషలేముకు ఆత్రంగా తరలి వెళ్తున్నారు.—యెషయా 55: 5.
13. ఆధునిక కాలాల్లో, “కుమారులు” మరియు “కుమార్తెలు” ఎవరు, “జనముల ఐశ్వర్యము” ఎవరు?
13 ఈ లోకపు అంధకారం మధ్యన యెహోవా “స్త్రీ” వెలుగు ప్రసరింపజేయడం ప్రారంభించినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విస్తరణ గురించి యెషయా 60:4-9 వచనాలు ఎంత చక్కని చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాయో కదా! అభిషిక్త క్రైస్తవులైన, పరలోక సీయోను “కుమారులు” మరియు “కుమార్తెలు” మొదట వచ్చారు. వీరు 1931 లో తమను తాము బహిరంగంగా యెహోవాసాక్షులుగా గుర్తింపజేసుకున్నారు. తర్వాత, “జనముల ఐశ్వర్యము” మరియు “సముద్రవ్యాపారము” అయిన దీనులైనవారి ఒక మేఘము, క్రీస్తు సహోదరుల్లో మిగిలిన వారిని కలుసుకోవడానికి ఆత్రంగా తరళివెళ్ళింది. b భూమి నలుమూలల నుండి, అన్ని రంగాల నుండి వస్తున్న ఈ యెహోవా సేవకులందరూ నేడు తమ సర్వాధిపతి అయిన యెహోవాను స్తుతించడంలోనూ, ఆయన నామమును విశ్వమంతటిలోకి అతిగొప్ప నామముగా ఉన్నతపరచడంలోనూ దేవుని ఇశ్రాయేలుతో కలుస్తారు.
14. క్రొత్తగా వచ్చినవారు ‘దేవుని బలిపీఠము మీదకు’ ఎలా వస్తారు?
14 అయితే, జనముల నుండి క్రొత్తగా వచ్చిన వీరు ‘దేవుని బలిపీఠము మీదకు’ వస్తారంటే దాని భావమేమిటి? ఒక యాగము బలిపీఠము మీద ఉంచబడుతుంది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాసినప్పుడు, యాగము ఇమిడి ఉన్న ఒక పదాన్ని ఉపయోగించాడు: “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని . . . మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.” (రోమీయులు 12: 1) నిజమైన క్రైస్తవులు తమ శక్తిమేరకు కృషి చేయడానికి ఇష్టపడతారు. (లూకా 9:23, 24) వారు స్వచ్ఛారాధనను పెంపొందింపజేయడానికి తమ సమయాన్ని, శక్తిని, నైపుణ్యాలను వెచ్చిస్తారు. (రోమీయులు 6:13) అలా చేయడంలో, వారు దేవునికి అంగీకారమైన స్తుతి యాగములను అర్పిస్తారు. (హెబ్రీయులు 13:15) నేడు లక్షలాదిమంది యెహోవా ఆరాధకులు, వృద్ధులు యౌవనులు తమ వ్యక్తిగత కోరికల కంటే దేవుని రాజ్యాసక్తులకు ప్రథమ స్థానాన్ని ఇవ్వడమన్నది హృదయాన్ని ఎంతగా ఉత్తేజితం చేస్తుందో కదా! వారు నిజంగా స్వయంత్యాగ స్ఫూర్తిని చూపిస్తారు.—మత్తయి 6:33; 2 కొరింథీయులు 5: 15.
క్రొత్తగా వచ్చేవారు విస్తరణలో భాగంవహిస్తారు
15. (ఎ) ప్రాచీన కాలాల్లో అన్యులకు సంబంధించి యెహోవా జాలి ఎలా వ్యక్తపరచబడింది? (బి) ఆధునిక కాలాల్లో సత్యారాధనను పెంపొందింపజేయడంలో “అన్యులు” ఎలా భాగం వహించారు?
15 క్రొత్తగా వచ్చేవారు యెహోవా “స్త్రీ”కి మద్దతుగా తమ సంపదలను, తమ వ్యక్తిగత సేవలను సమర్పిస్తారు. “అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు; ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని, గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.” (యెషయా 60:10) సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో అన్యులు యెరూషలేములో నిర్మాణపనిలో సహాయం చేసినప్పుడు యెహోవా జాలి వ్యక్తపరచబడింది. (ఎజ్రా 3: 7; నెహెమ్యా 3:26) నేటి విస్తృత నెరవేర్పులో, “అన్యులు” అంటే గొప్ప సమూహము వారు సత్యారాధనను పెంపొందింపజేయడంలో అభిషిక్త శేషముకు మద్దతునిస్తున్నారు. వారు తమ బైబిలు విద్యార్థులు క్రైస్తవ లక్షణాలను పెంపొందింపజేసుకోవడానికి సహాయం చేసి, తద్వారా క్రైస్తవ సంఘాలను నిర్మించి, యెహోవా సంస్థ యొక్క నగరంవంటి “ప్రాకారములను” బలపరుస్తారు. (1 కొరింథీయులు 3:10-15) వారు రాజ్యమందిరాలను, సమావేశ హాళ్ళను, బేతేలు భవనాలను నిర్మించడానికి కృషి చేయడం ద్వారా అక్షరార్థంగా కూడా నిర్మాణపనిలో పాల్గొంటారు. అలా వారు, విస్తరిస్తున్న యెహోవా సంస్థ అవసరాల గురించి శ్రద్ధ తీసుకోవడంలో తమ అభిషిక్త సహోదరులతో కలుస్తారు.—యెషయా 61: 5.
16, 17. (ఎ) దేవుని సంస్థ “ద్వారములు” ఎలా తెరిచి ఉంచబడ్డాయి? (బి) “రాజులు” సీయోనుకు ఎలా ఉపకారము చేశారు? (సి) తెరిచి ఉండాలని యెహోవా కోరుకునే “ద్వారముల”ను మూయడానికి ప్రయత్నించేవారికి ఏమి జరుగుతుంది?
16 ఆధ్యాత్మిక నిర్మాణ కార్యక్రమం ఫలితంగా ప్రతి సంవత్సరం వందల వేలమంది “అన్యులు” యెహోవా సంస్థతో సహవసించడం ప్రారంభిస్తున్నారు, ఇంకా అనేకుల కోసం ద్వారం తెరచివుంది. యెహోవా ఇలా చెబుతున్నాడు: “నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.” (యిషయా 60:11) అయితే, జనముల ఐశ్వర్యమును సీయోనుకు తీసుకొని రావడంలో నాయకత్వం వహించే “రాజులు” ఎవరు? ప్రాచీన కాలాల్లో సీయోనుకు “ఉపచారము” చేయడానికి యెహోవా కొంతమంది పాలకుల హృదయాలను కదిలించాడు. ఉదాహరణకు, ఆలయాన్ని పునర్నిర్మించడానికి యూదులను యెరూషలేముకు తిరిగి పంపడంలో కోరెషు చొరవ తీసుకున్నాడు. ఆ తర్వాత, రాజైన అర్తహషస్తయెరూషలేము గోడలను పునర్నిర్మించడానికి వనరులను ఇచ్చి నెహెమ్యాను పంపించాడు. (ఎజ్రా 1:2, 3; నెహెమ్యా 2:1-8) నిజంగా, “యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది” అన్నది వాస్తవం. (సామెతలు 21: 1) మన దేవుడు తన చిత్తానికి అనుగుణంగా చర్య తీసుకునేలా శక్తివంతమైన పాలకులను సహితం కదిలించగలడు.
17 ఆధునిక కాలాల్లో అనేకమంది “రాజులు” లేదా లౌకిక అధికారులు యెహోవా సంస్థ యొక్క “ద్వారముల”ను మూయడానికి ప్రయత్నించారు. అయితే, ఆ “ద్వారములు” తెరిచి ఉండేందుకు సహాయపడిన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ఇతరులు సీయోనుకు ఉపకారము చేశారు. (రోమీయులు 13:3) 1919 లో, లౌకిక అధికారులు జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్‌ను ఆయన సహచరులను అన్యాయపు చెర నుండి విడుదల చేశారు. (ప్రకటన 11:13) సాతాను పరలోకం నుండి పడద్రోయబడిన తర్వాత వెలువరించిన హింసా వెల్లువను మానవ ప్రభుత్వాలు ‘మ్రింగివేశాయి.’ (ప్రకటన 12:16) కొన్ని ప్రభుత్వాలు, కొన్నిసార్లు ప్రత్యేకంగా యెహోవాసాక్షుల పక్షాన మతసహనాన్ని పెంపొందింపజేశాయి. ఈ విధమైన ఉపకారము, తెరచివున్న “ద్వారముల” గుండా దీనులు యెహోవా సంస్థలోకి ప్రవేశించడాన్ని సులభతరం చేసింది. ఆ “ద్వారముల”ను మూయడానికి ప్రయత్నించే వ్యతిరేకుల మాటేమిటి? వారు ఎన్నడూ సఫలం కాలేరు. వారి గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు: “నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు; అట్టి జనములు నిర్మూలము చేయబడును.” (యెషయా 60:12) దేవుని “స్త్రీ”కి వ్యతిరేకంగా పోరాడేవారందరికీ—వ్యక్తులైనా లేదా సంస్థలైనా—రానున్న హార్‌మెగిద్దోను యుద్ధానికి ముందో లేదా కనీసం ఆ యుద్ధంలోనైనా తప్పక నాశనం సంభవిస్తుంది.—ప్రకటన 16:14, 16.
18. (ఎ) ఇశ్రాయేలులో చెట్లు వర్ధిల్లుతాయంటే దాని భావమేమిటి? (బి) నేడు ‘యెహోవా పాదస్థలము’ ఏది?
18 తీర్పును గురించిన ఈ హెచ్చరిక తర్వాత, ఉద్ధరణకు సమృద్ధికి సంబంధించిన వాగ్దానాల వైపుకు ప్రవచనం మరలుతుంది. యెహోవా తన “స్త్రీ”తో మాట్లాడుతూ ఇలా పేర్కొంటున్నాడు: “నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షములును సరళవృక్షములును గొంజిచెట్లును నీయొద్దకు తేబడును; నేను నా పాదస్థలమును మహిమపరచెదను.” (యెషయా 60:13) పచ్చని చెట్లు సౌందర్యానికి, ఫలసమృద్ధికి ప్రతీకలు. (యెషయా 41:19; 55:13) ఈ వచనంలోని ‘పరిశుద్ధాలయము,’ “పాదస్థలము” అనే పదబంధాలు యెరూషలేము ఆలయాన్ని సూచిస్తాయి. (1 దినవృత్తాంతములు 28: 2; కీర్తన 99: 5) అయితే, యెరూషలేములోని ఆలయం, క్రీస్తు బలి ఆధారంగా యెహోవాను ఆరాధించడానికి ఆయనను సమీపించడం కోసం ఏర్పాటు అయిన గొప్ప ఆధ్యాత్మిక ఆలయానికి పూర్వఛాయగా ఉందని అపొస్తలుడైన పౌలు వివరించాడు. (హెబ్రీయులు 8:1-5; 9:2-10, 23) నేడు యెహోవా తన “పాదస్థలము”ను అంటే ఈ గొప్ప ఆధ్యాత్మిక ఆలయపు భూసంబంధమైన ఆవరణములను మహిమపరుస్తాడు. ఇవి ఎంత ఆకర్షణీయమైనవిగా తయారవుతాయంటే, అక్కడ సత్యారాధనలో భాగం వహించడానికి అన్ని జనముల నుండి వచ్చే ప్రజలను అవి ఆకర్షిస్తాయి.—యెషయా 2:1-4; హగ్గయి 2: 7.
19. వ్యతిరేకులు ఏమి అంగీకరించవలసి వస్తుంది, వారు కనీసం ఎప్పుడు అలా అంగీకరించవలసి వస్తుంది?
19 యెహోవా ఇప్పుడు తన అవధానాన్ని వ్యతిరేకుల వైపుకు మళ్ళిస్తూ, ఇలా చెబుతున్నాడు: “నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు; నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద పడెదరు, యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు.” (యిషయా 60:14) అవును, దేవుని ఆశీర్వాదం వల్ల తన ప్రజలకు వచ్చే పుష్కలమైన అభివృద్ధినీ, ఉన్నతమైన జీవన విధానాన్నీ చూడడం, కొంతమంది వ్యతిరేకులు సాగిలపడి, “స్త్రీ”ని పేరుపెట్టి పిలిచేలా చేస్తుంది. అంటే దాని భావం, వారు అభిషిక్త శేషమూ వారి సహవాసులూ నిజంగానే దేవుని పరలోక సంస్థ అయిన ‘యెహోవా పట్టణమునకు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోనుకు’ ప్రాతినిధ్యం వహిస్తారని రానున్న హార్‌మెగిద్దోను యుద్ధానికి ముందో లేదా కనీసం ఆ యుద్ధంలోనైనా తప్పక అంగీకరించవలసి వస్తుంది.
అందుబాటులోవున్న వనరులను ఉపయోగించుకోవడం
20. “స్త్రీ” పరిస్థితుల్లో ఎంత గొప్ప మార్పును అనుభవిస్తుంది?
20 యెహోవా “స్త్రీ” పరిస్థితుల్లో ఎంత గొప్ప మార్పును అనుభవిస్తుందో కదా! యెహోవా ఇలా చెబుతున్నాడు: “నీవు విసర్జింపబడుటనుబట్టియు ద్వేషింపబడుటనుబట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు.”—యెషయా 60:15, 16.
21. (ఎ) ప్రాచీన యెరూషలేము ఎలా “శోభాతిశయము” అయ్యింది? (బి) యెహోవా అభిషిక్త సేవకులు 1919 నుండి ఏ ఆశీర్వాదములను అనుభవించారు, వారు “జనముల పాలు” ఎలా కుడిచారు?
21 ఒక విధంగా చెప్పాలంటే, ‘ఎవడును తన మార్గమున దాటిపోనందున’ ప్రాచీన ఇశ్రాయేలు 70 సంవత్సరాలపాటు ఉనికిలో లేకుండా పోయింది. కానీ సా.శ.పూ. 537 మొదలుకొని యెహోవా ఆ నగరంలో మళ్ళీ ప్రజలు నివసించేలా చేసి, దాన్ని “శోభాతిశయముగా” చేస్తాడు. అలాగే, మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు కాలంలో, దేవుని ఇశ్రాయేలు నిర్జనంగా విడువబడిన కాలాన్ని అనుభవించింది, అప్పుడు వారు “విసర్జింప”బడినట్లు భావించారు. కానీ 1919 లో యెహోవా తన అభిషిక్త సేవకులను చెర నుండి విమోచించాడు, అప్పటి నుండి ఆయన వారికి మునుపెన్నడూ ఎరుగని విస్తరణను, ఆధ్యాత్మిక సమృద్ధిని ఇచ్చి ఆశీర్వదించాడు. ఆయన ప్రజలు సత్యారాధనను పెంపొందింపజేయడానికి జనముల వనరులను ఉపయోగించుకొంటూ “జనముల పాలు” కుడిచారు. ఉదాహరణకు, ఆధునిక సాంకేతికతను జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవడం వందలాది భాషల్లోకి బైబిళ్లను, బైబిలు సాహిత్యాలను అనువదించడాన్ని, ప్రచురించడాన్ని సాధ్యపరచింది. ఫలితంగా, వందల వేలమంది ప్రతి సంవత్సరం యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసి, క్రీస్తు ద్వారా యెహోవాయే తమ రక్షకుడు, విమోచకుడు అని తెలుసుకుంటున్నారు.—అపొస్తలుల కార్యములు 5:31; 1 యోహాను 4:14.
సంస్థాగత అభివృద్ధి
22. యెహోవా ఏ ప్రత్యేక విధమైన అభివృద్ధిని వాగ్దానం చేశాడు?
22 యెహోవా ప్రజల సంఖ్యలో పెరుగుదలతో పాటు సంస్థాగతమైన అభివృద్ధి కూడా జరిగింది. యెహోవా ఇలా పేర్కొంటున్నాడు: “నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను; సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.” (యెషయా 60:17) ఇత్తడికి బదులుగా బంగారమును ఉపయోగించడం పరిస్థితి మెరుగు పడిందని సూచిస్తుంది, ఇక్కడ ప్రస్తావించబడిన ఇతర పదార్థాలు కూడా అలాగే సూచిస్తున్నాయి. దీనికి అనుగుణంగా, యెహోవా ప్రజలు అంత్యదినాలన్నిటిలోనూ మెరుగైన సంస్థాగత ఏర్పాట్లను అనుభవిస్తున్నారు.
23, 24. యెహోవా ప్రజలు 1919 నుండి అభివృద్ధి చెందిన ఏ సంస్థాగత ఏర్పాట్లను అనుభవిస్తున్నారు?
23 సంఘాల్లో 1919 నాటికల్లా, ప్రజాస్వామ్య విధానంలో ఎన్నుకోబడిన పెద్దలు, డీకన్లు ఉన్నారు. ఆ సంవత్సరం మొదలుకొని, సంఘంలోని ప్రాంతీయ సేవా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒక సేవా నిర్దేశకుడు దైవపరిపాలనా పద్ధతిలో నియమింపబడేవాడు, అయితే ఎన్నుకోబడిన పెద్దలు కొంతమంది, సేవా నిర్దేశకుడిని ఎదిరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే 1932 లో పరిస్థితులు మారాయి. పెద్దలను, డీకన్‌లను ఎన్నుకోవడాన్ని నిలిపివేయమని కావలికోట పత్రిక ద్వారా సంఘాలకు నిర్దేశించడం జరిగింది. బదులుగా, సేవా నిర్దేశకుడితో పాటు పని చేయడానికి సంఘాలు ఒక సేవా కమిటీని ఎన్నుకుంటాయి. అది ఒక గొప్ప అభివృద్ధి.
24 సంఘంలోని సేవకులందరూ దైవపరిపాలనా పద్ధతిలో నియమింపబడాలని 1938 లో గుర్తించబడినప్పుడు మరింత “బంగారము” తీసుకురాబడింది. సంఘ నిర్వహణ కంపెనీ సేవకుడి (ఆ తర్వాత, సంఘ సేవకుడి) చేతుల్లోకి, ఆయనకు సహాయపడే వివిధ సేవకుల చేతుల్లోకి వెళ్ళింది, వీరంతా కూడా ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ పర్యవేక్షణ క్రిందనే నియమింపబడతారు. c (మత్తయి 24:45-47) అయితే, సంఘ పర్యవేక్షణ కేవలం ఒక వ్యక్తి ద్వారా కంటే పెద్దల సభ ద్వారా జరగడమన్నది లేఖనాధార పద్ధతి అని 1972 లో తెలుసుకోవడం జరిగింది. (ఫిలిప్పీయులు 1: 1) సంఘ స్థాయిలోనూ, పరిపాలక సభ స్థాయిలోనూ ఇతర మార్పులు జరిగాయి. పరిపాలక సభ స్థాయిలో జరిగిన మార్పులకు, వాచ్‌టవర్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా మరియు అనుబంధ సంస్థల్లో నిర్దేశకులుగా సేవ చేస్తున్న పరిపాలక సభ సభ్యులు స్వచ్ఛందంగా తమ స్థానాల్లో నుండి వైదొలిగారని 2000, అక్టోబరు 7న చేయబడిన ప్రకటన ఒక ఉదాహరణ. ఈ విధంగా, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిపాలక సభ ‘దేవుని సంఘ’ ఆధ్యాత్మిక పర్యవేక్షణ గురించి దాని సహవాసులైన వేరే గొఱ్ఱెల ఆధ్యాత్మిక పర్యవేక్షణ గురించి శ్రద్ధ వహించడానికి మరింత అవధానాన్నివ్వగలిగింది. (అపొస్తలుల కార్యములు 20:28) అలాంటి ఏర్పాట్లన్నీ అభివృద్ధులే. అవి యెహోవా సంస్థను బలపర్చి, ఆయన ఆరాధకులను ఆశీర్వదించాయి.
25. యెహోవా ప్రజల సంస్థాగత అభివృద్ధి వెనుక ఎవరున్నారు, వారు ఏ ప్రయోజనాలను పొందుతున్నారు?
25 ఈ అభివృద్ధుల వెనుకనున్నది ఎవరు? కొంతమంది మానవులకున్న సంస్థాగత సామర్థ్యం మూలంగానో ప్రజ్ఞావంతమైన ఆలోచనా విధానం మూలంగానో ఆ అభివృద్ధులు జరిగాయా? లేదు, ఎందుకంటే “నేను . . . బంగారమును తెచ్చుచున్నాను” అని యెహోవా పేర్కొన్నాడు. కాబట్టి, ఈ అభివృద్ధి అంతా దైవిక నడిపింపు ఫలితమే. యెహోవా ప్రజలు ఆయన నడిపింపుకు విధేయులై సవరింపులు చేసుకున్నప్పుడు వారు ప్రయోజనాలు పొందుతారు. వారి మధ్యన సమాధానం నెలకొంటుంది, నీతిపట్ల వారికున్న ప్రేమ ఆయన సేవ చేసేలా వారిని పురికొల్పుతుంది.
26. నిజ క్రైస్తవులకు గుర్తింపు చిహ్నంగా ఉన్న దేన్ని వ్యతిరేకులు కూడా గమనిస్తారు?
26 దేవుడనుగ్రహించే సమాధానమునకు మార్పు కలుగజేసే శక్తి ఉంది. యెహోవా ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.” (యిషయా 60:18) ఎంత నిజం! సమాధానకరంగా ఉండడం నిజ క్రైస్తవుల గమనార్హమైన చిహ్నమని వ్యతిరేకులు కూడా అంగీకరిస్తారు. (మీకా 4: 3) యెహోవాసాక్షులు దేవునితోనూ ఒకరితో ఒకరూ కలిగి ఉన్న ఈ సమాధానం, ఈ దౌర్జన్యపూరితమైన లోకంలో, క్రైస్తవ కూటాలు జరిగే ప్రతి స్థలాన్ని ఉపశమనాన్నిచ్చే ఒక ఆశ్రయంగా చేస్తుంది. (1 పేతురు 2:17) ఇది, భూనివాసులందరూ “యెహోవాచేత ఉపదేశము” పొందినవారైనప్పుడు నెలకొనే సమృద్ధికరమైన సమాధానాన్ని ముందుగా చవి చూడడమే.—యెషయా 11: 9; 54:13.
దైవిక ఆమోదపు మహిమాన్వితమైన వెలుగు
27. యెహోవా “స్త్రీ”పై ఏ వెలుగు ఎడతెగక ప్రకాశిస్తుంది?
27 ఇలా పేర్కొంటూ, యెరూషలేముపై ప్రకాశించే వెలుగు యొక్క ఉద్ధృతిని యెహోవా వర్ణిస్తున్నాడు: “ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు; యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును.” (యెషయా 60:19, 20) యెహోవా తన “స్త్రీ”కి ‘నిత్యమైన వెలుగుగా’ ఉండడంలో కొనసాగుతాడు. ఆయన సూర్యునిలా ఎన్నడూ “అస్తమింపడు” లేదా చంద్రునిలా ఎన్నడూ “క్షీణింపడు.” d ఆయన ఆమోదపు వెలుగు ఎడతెగక అభిషిక్తులపై అంటే దేవుని “స్త్రీ” యొక్క మానవ ప్రతినిధులపై ప్రకాశిస్తుంది. వారు గొప్ప సమూహముతో కలిసి, ఈ లోకపు రాజకీయ లేక ఆర్థిక దృశ్యంపై కమ్ముకున్న ఏ అంధకారమూ నాశనం చేయలేని ఆధ్యాత్మిక వెలుగు ప్రకాశాన్ని అనుభవిస్తారు. యెహోవా తమ ఎదుట ఉంచిన ఉజ్వలమైన భవిష్యత్తులో వారికి విశ్వాసం ఉంది.—రోమీయులు 2: 7; ప్రకటన 21:3-5.
28. (ఎ) తిరిగి వచ్చే యెరూషలేము నివాసుల గురించి ఏమి వాగ్దానం చేయబడింది? (బి) అభిషిక్త క్రైస్తవులు 1919 లో దేన్ని స్వతంత్రించుకున్నారు? (సి) నీతిమంతులు ఎంతకాలంపాటు దేశమును స్వతంత్రించుకుంటారు?
28 యెరూషలేము నివాసుల గురించి యెహోవా ఇంకా ఇలా చెబుతున్నాడు: ‘నీ జనులందరు నీతిమంతులై యుందురు; నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి, దేశమును శాశ్వతముగా [“అనిర్దిష్ట కాలం వరకు,” NW] స్వతంత్రించుకొందురు.’ (యెషయా 60:21) సహజ ఇశ్రాయేలీయులు బబులోను నుండి తిరిగి వచ్చినప్పుడు, వారు ‘దేశమును స్వతంత్రించుకున్నారు.’ కానీ ఆ సందర్భంలో “అనిర్దిష్ట కాలం వరకు” అన్నది, రోమా సైన్యాలు యెరూషలేమునూ యూదా దేశాన్నీ నాశనం చేసిన సా.శ. మొదటి శతాబ్దం వరకు అని తేలింది. అభిషిక్త క్రైస్తవుల శేషము 1919 లో ఆధ్యాత్మిక చెర నుండి బయటికి వచ్చి, ఆధ్యాత్మిక దేశాన్ని స్వతంత్రించుకుంది. (యెషయా ) ఈ దేశము లేదా కార్యకలాపాల పరిధి, ఎన్నడూ సమసిపోని పరదైసు సంబంధిత ఆధ్యాత్మిక సమృద్ధితచే గుర్తించబడుతోంది. ప్రాచీన ఇశ్రాయేలు వలె గాక, ఒక గుంపుగా ఆధ్యాత్మిక ఇశ్రాయేలు ఎన్నడూ నమ్మకద్రోహిగా నిరూపించబడదు. అంతేగాక, భూమి “బహు క్షేమము” కలిగివుండే అక్షరార్థమైన పరదైసుగా మారినప్పుడు యెషయా ప్రవచనం భౌతికపరంగా కూడా నెరవేరుతుంది. అప్పుడు భూనిరీక్షణగల నీతిమంతులు దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు.— 66: 8కీర్తన 37:11, 29.
29, 30. ‘ఒంటరియైనవాడు’ ఎలా “వేయిమంది” అయ్యారు?
29 యెషయా 60 వ అధ్యాయం ముగింపులో ఒక గంభీరమైన వాగ్దానాన్ని మనం చూడవచ్చు, దానికి యెహోవా తన సొంత నామము ద్వారా హామి ఇస్తున్నాడు. ఆయనిలా పేర్కొంటున్నాడు: “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును, ఎన్నికలేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.” (యెషయా 60:22) చెదిరిపోయిన అభిషిక్తులు 1919 లో తిరిగి కార్యోన్ముఖులు అయినప్పుడు వారు ‘ఒంటరియైనవాడిగా’ ఉన్నారు. e అయితే మిగతా ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు కూడా తీసుకు రాబడినప్పుడు వారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది. గొప్ప సమూహం సమకూర్చబడడం ప్రారంభమవ్వడంతో ఆ అభివృద్ధి అసాధారణమైనదిగా పరిణమించింది.
30 ఎంతోకాలం గడవక ముందే, దేవుని ప్రజల మధ్యన ఉన్న సమాధానము, నీతి ఎంతమంది యథార్థ హృదయులను ఆకర్షించాయంటే, ‘ఎన్నికలేనివాడిగా’ ఉన్నవారు అక్షరార్థంగా ‘బలమైన జనముగా’ తయారయ్యారు. ప్రస్తుతం దాని జనసంఖ్య, ఈ ప్రపంచంలోని అనేక స్వతంత్ర దేశాల జనసంఖ్య కంటే కూడా ఎక్కువగా ఉంది. యెహోవా యేసుక్రీస్తు ద్వారా రాజ్య పనికి నిర్దేశాన్నిచ్చి దాన్ని త్వరపెట్టాడని స్పష్టమవుతోంది. సత్యారాధన యొక్క ప్రపంచవ్యాప్త విస్తృతిని చూడడమూ, దానిలో భాగమై ఉండడమూ ఎంత ఉత్తేజాన్ని కలిగిస్తుందో కదా! అవును, ఈ విషయాలను ఎంతోకాలం క్రితమే ప్రవచించిన యెహోవాకు ఈ అభివృద్ధి మహిమను తెస్తుందని మనం గ్రహించడం ఆనందకరమైన విషయం.
[అధస్సూచీలు]
a తర్షీషు ఇప్పుడు స్పెయిన్‌గా పిలువబడుతున్న ప్రాంతంలో ఉండి ఉండవచ్చు. అయితే కొన్ని రిఫరెన్సు పుస్తకాలు చెబుతున్నదాని ప్రకారం, “తర్షీషు ఓడలు” అనే పదబంధం, ఓడల రకాన్ని అంటే “తర్షీషుకు వెళ్ళి వచ్చేందుకు తగిన ఓడలు” అయినటువంటి “ఎత్తైన తెరచాపలు గల, మహాసముద్రాల్లో ప్రయాణించే ఓడలను” సూచిస్తుంది. వేరే మాటల్లో చెప్పాలంటే, సుదూరానున్న ఓడరేవులకు సుదీర్ఘమైన ప్రయాణాలు చేసేందుకు అనుకూలమైనవిగా పరిగణించబడే ఓడలను సూచిస్తుంది.—1 రాజులు 22:48.
b భూనిరీక్షణ కలిగి అత్యంత ఆసక్తిగల చురుకైన క్రైస్తవులు 1930కి ముందు దేవుని ఇశ్రాయేలుతో సహవసించినప్పటికీ వారి సంఖ్య 1930లలోనే గమనార్హమైన విధంగా పెరగనారంభించింది.
c ఆ రోజుల్లో, స్థానిక సంఘాలు కంపెనీలు అని పిలువబడేవి.
d అపొస్తలుడైన యోహాను ‘నూతనమైన యెరూషలేమును’ అంటే తమ పరలోక మహిమలో ఉన్న 1,44,000 మందిని వర్ణించడానికి అలాంటి భాషనే ఉపయోగిస్తున్నాడు. (ప్రకటన 3:12; 21:10, 22-26) ఇది తగినదే, ఎందుకంటే ‘నూతనమైన యెరూషలేము’ యేసుక్రీస్తుతో పాటు దేవుని “స్త్రీ” యొక్క అంటే “పైనున్న యెరూషలేము” యొక్క ప్రధాన భాగమై, తమ పరలోక ప్రతిఫలాన్ని పొందిన, దేవుని ఇశ్రాయేలు సభ్యులందరికీ ప్రాతినిధ్యం వహిస్తుంది.—గలతీయులు 4:26.
e 1918 లో, ప్రతి నెల ప్రకటనాపనిలో భాగం వహించేవారి సగటు సంఖ్య 4,000 కన్నా తక్కువగా ఉంది.
[అధ్యయన ప్రశ్నలు]
[305 వ పేజీలోని చిత్రం]
“లెమ్ము” అని “స్త్రీ”కి ఆజ్ఞాపించబడింది
[312, 313 వ పేజీలోని చిత్రం]
“తర్షీషు ఓడలు” యెహోవా ఆరాధకులనే సరుకును మోసుకువెళతాయి