కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు ఎవరు?

యెహోవాసాక్షులు ఎవరు?

యెహోవాసాక్షులు ఎవరు?

యెహోవాసాక్షుల గురించి మీకు ఏమి తెలుసు? కొంతమంది, వాళ్ళను క్రైస్తవమత ప్రచారకులనీ, ఒక క్రొత్త క్రైస్తవ తెగయనీ, యూదా మతం చేత ప్రభావితులైన ఒక క్రైస్తవ విభాగమనీ లేక వైద్య చికిత్సను నిరాకరించే మూఢభక్తులనీ పిలిచారు. వాస్తవానికి, సాక్షులు వీరిలో ఏ కోవకూ చెందరు. కొంతమంది ప్రజలు వాళ్ళ గురించి ఎందుకు అలా అనుకుంటారు? అలా అనుకోవడానికి ఎక్కువ కారణం, వాళ్ళకు తప్పుడు సమాచారం ఇవ్వబడడమే.

యెహోవాసాక్షుల పేరు చూపిస్తున్నట్లే, వాళ్ళు యెహోవాకు సాక్షులు. యెహోవా ఎవరు? యెహోవా అనే పేరు సర్వశక్తిమంతుడైన ఖుదా (దేవుడు), కితాబే ముకద్దస్‌ (బైబిలు) పుటల్లో తనకు తాను ఇచ్చుకున్న పేరు. * అది వ్యక్తిగతమైన పేరు. ఖుదా, ప్రభువు లాగా అది ఒక బిరుదు కాదు. సాధారణ అర్థంలో, చరిత్రంతటిలో ఖుదా మహిమకు సాక్ష్యమిచ్చిన ఎవరినైనా సరే యెహోవాసాక్షి అని అనవచ్చు.—నిర్గమకాండము 3:13, 15; యెషయా 43:10.

కితాబే ముకద్దస్‌, ప్రాచీన కాలపు నమ్మకస్థులైన పురుషుల పట్టికను హాబిల్‌ (హేబెలు)తో మొదలుపెడుతూ, వారిని “మేఘమువలె” ఉన్న “గొప్ప సాక్షి సమూహము” అని పిలుస్తుంది. (హెబ్రీయులు 11:4; 12:1) నూహ్‌, ఇబ్రాహీమ్‌, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌, యూసొఫ్‌, మూసా, దావుద్‌ వంటి గమనార్హులైన వ్యక్తులు ఖుదాకు సాక్షులుగా—యెహోవాకు సాక్షులుగా—పట్టికలో ఉన్నారు. ఈసా మసీహ్‌ (యేసుక్రీస్తు) “నమ్మకమైన సత్యసాక్షి” అని పిలువబడ్డాడు.—ప్రకటన 3:14.

సాక్షులు ఎందుకు అవసరమంటే

మానవుడు పరిపూర్ణంగా సృష్టించబడి, ఒక ఫిర్దౌస్‌ (పరదైసు)లో ఉంచబడ్డాడు అని కితాబే ముకద్దస్‌ చెబుతుంది. అతడికి సదాకాలం జీవించే సామర్థ్యమూ, పిల్లలకు జన్మనిచ్చే సామర్థ్యమూ, తన ఫిర్దౌస్‌ గృహపు సరిహద్దులను ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేసే సామర్థ్యమూ ఉండేలా సృష్టికర్త ఆయనను సృజించాడు. ఆ సమయంలో మానవుడికి ఖుదా తెలుసు. అప్పట్లో సాక్షుల అవసరం ఉండేది కాదు.—ఆదికాండము 1:27, 28.

దేవుడు మానవుడికి స్వేచ్ఛా చిత్తాన్ని అనుగ్రహించాడు. కానీ మన మొదటి తల్లిదండ్రులు ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు. వాళ్ళు ఆయనపై ఆధారపడకుండా ఉండాలని ఎంపిక చేసుకున్నారు. కనుక, ఖుదా పరిపూర్ణుడుగా, న్యాయవంతుడుగా, పరిశుద్ధంగా ఉన్నప్పటికీ, భూమిమీద ఉన్న మానవజాతి పాపభరితమైనదిగా, అవినీతికరమైనదిగా మారింది. అయినప్పటికీ, మన పరిశుద్ధ ఖుదా, కేవలం పరిమితమైన కాలవ్యవధి వరకు మాత్రమే పాపమూ దుష్టత్వమూ కొనసాగడాన్ని అనుమతిస్తాడు. మనం, దైవికంగా అనుమతించబడిన ఆ కాలవ్యవధి యొక్క ముగింపుకు సమీపంలో ఉన్నామని కితాబే ముకద్దస్‌ సూచిస్తుంది. మానవజాతి ఈ విషయాలను తెలుసుకోగల్గేందుకు, ఆయన తన కలామ్‌ను—తోరాను, జబూర్‌ను, ఇంజీల్‌ను—మన కాలం వరకూ భద్రపరిచాడు.

చాలా మంది మానవులకు తను ఎవరో తెలియదు కనుక, తన గురించి సాక్ష్యమివ్వమని తన నమ్మకస్థులైన మానవులకు ఖుదా ఆజ్ఞాపించాడు. ఆయన, అలాంటి నమ్మకస్థులైనవారితో “మీరు . . . నాకు సాక్షులు” అని అంటున్నాడు. (యెషయా 43:10) వాళ్ళు నెరవేర్చే పనిని గురించి చెబుతూ, “ఈ రాజ్య (బాదుషాహద్‌) సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని ఆయన అంటున్నాడు. (ఇటాలిక్కులు మావి.)—మత్తయి 24:14.

మునుపెన్నటికన్నా నేడు, సమస్త జాతుల్లోని, భాషల్లోని, దేశాల్లోని చాలా మంది ప్రజలు ఖుదాకా కలామ్‌ను సత్యసంధంగా పరిశోధిస్తున్నారు. అనేక మతాచారాలు అన్యమతంలో ఉద్భవించినవనీ అవి ఖుదాకు అప్రీతిని కలిగిస్తాయనీ వాళ్ళు కనుగొన్నారు.

మీకు తెలిసినట్లు, కొందరు మతాన్ని వాణిజ్య ఉద్దేశాల కోసం ఉపయోగించుకున్నారు. మరితరులు దాన్ని తమ రాజకీయ లక్ష్యాల పురోభివృద్ధి కోసం లేక, పేదవాళ్ళ ఖర్చుతో తాము ధనికులయ్యేందు కోసం ఉపయోగించుకున్నారు. అలా మతం నుండి లాభాలను ఆర్జిస్తున్నవాళ్ళు, ఖుదాను గురించిన నిజమైన సాక్ష్యమివ్వబడినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తారని మీరనుకుంటున్నారు? తాము బెదిరించబడినట్లు వాళ్ళు భావిస్తారన్నది స్పష్టం. యెహోవాసాక్షులను గురించి కొందరు చెడుగా మాట్లాడుకుంటున్నట్లు మీకు వినపడడానికి ఒక కారణం అదే.

ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా సరే, యెహోవాసాక్షులు కితాబే ముకద్దస్‌ను సన్నిహితంగా అనుసరిస్తారు. వాళ్ళు క్రొత్త మతాన్నేమీ రూపొందించలేదు. నిజమైన మతానికి ఆధారమైన తోరాలో, జబూర్‌లో, ఇంజీల్‌లో ఏమి వ్రాయబడిందో దాన్ని పాటిస్తారంతే. అయితే మరి వాళ్ళు ఏమి నమ్ముతారు? వాళ్ళు నమ్మే బోధల్లో కొన్ని క్రింద పేర్కొనబడ్డాయి. వీటిని చదివి, వీటిలో సత్యం ప్రతిధ్వనిస్తుందో లేదో చూడండి.

త్రిత్వం లేదు

బైబిలు, త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించడం లేదు. బదులుగా, ఒకే ఒక నిత్యుడైన సత్య దేవుడు (ఖుదా) ఉన్నాడని అది చెబుతుంది. “మన దేవుడైన (ఖుదాయైన) యెహోవా అద్వితీయుడగు యెహోవా.” (ద్వితీయోపదేశకాండము 6:4) ఆయనే సృష్టికర్త—నిత్యుడు, సర్వశక్తిమంతుడు, సాటిలేనివాడు. ఈసా (యేసు) సర్వశక్తిమంతుడైన ఖుదా కాడు. ఈసా (యేసు) భూమిమీద పరిపూర్ణుడైన మానవుడిగా జీవించి, అపరిపూర్ణ మానవజాతి కోసం మరణించాడు. ఖుదా దయాపూర్వకంగా, ఈసా (యేసు) జీవితాన్ని విమోచన క్రయధనంగా స్వీకరించాడు, కనుక, నమ్మకస్థులకు రక్షణ ఆయన ద్వారా వస్తుంది. అదే ఖుదా చిత్తం.—లూకా 22:42; రోమీయులు 5:12.

మానవునిలో అమర్త్యమైనది ఏమీ లేదు

ప్రజలు మరణించినప్పుడు ఏమి జరుగుతుంది? “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు అయతే చచ్చినవారు ఏమియు ఎరుగరు.” (ప్రసంగి 9:5) మానవుడిలో అమర్త్యమైనదేమీ లేదు. తాము మృతులతో మాట్లాడుతున్నామని అనుకునేవాళ్ళు నిజానికి దయ్యాలతోనే మాట్లాడుతున్నారు. అదే విధంగా, మృతుల కోసమైన ప్రార్థనల వల్ల ఎవరికీ లాభం లేదు, మతాచార్యులకు తప్ప—ఆ ప్రార్థనలు చేసేందుకు మతాచార్యులకు డబ్బు చెల్లించబడుతుంది.

పునరుత్థానం

మానవుడి నిజమైన నిరీక్షణ పునరుత్థానమే. అంటే ఫిర్దౌస్‌ పరిస్థితుల్లోకి పునస్థాపించబడిన భూమిమీదకు మృతులు తిరిగిలేస్తారు. ఖుదాను సేవించినవాళ్ళు తమ నమ్మకత్వాన్ని బట్టి ఆశీర్వదించబడతారు. ఖుదాను తెలుసుకోకుండా మరణించినవాళ్ళకు అప్పుడు అవకాశం ఇవ్వబడుతుంది. కనుక, “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్న[ది].” (అపొస్తలుల కార్యములు 24:14) ఖుదా ఎవరినైతే, పునరుత్థానానికి తగరు అని నిర్ణయిస్తాడో వాళ్ళు మాత్రం పునరుత్థానాన్ని పొందరు.

జహన్నమ్‌ (నరకాగ్ని) లేదు

ప్రేమామయుడైన ఖుదా, మృతులు సదాకాలం బాధలననుభవించే స్థలాన్ని సృజించడు. మానవులను కాల్చడం హింసించడం ‘నేనాజ్ఞాపించని క్రియ నాకు తోచని క్రియ’ అని స్వయంగా ఖుదాయే వివరిస్తున్నాడు.—యిర్మీయా 7:31.

తక్దీర్‌ (తలరాత) లేదు

దేవుడు ప్రజల నుదుటి మీద ఏమీ వ్రాయడు. మనం జన్మించక ముందే మన భవిష్యత్తును నిర్ణయించే తక్దీర్‌ (తలరాత) ఏమీ లేదు. మనం చేసేదానికీ, మనం తీసుకునే ఎంపికలకూ మనమే బాధ్యులం. “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి (ఖుదాకు) లెక్క యొప్పగింపవలెను.”—రోమీయులు 14:12.

జమాయితే యిమామ్‌ లేదు

దేవునికి సమర్పించుకున్న ప్రతి ఒక్కరూ ఆయన దృష్టిలో సమానులే. సత్యారాధకులందరూ సహోదర సహోదరీలే. ఉన్నతమైన ఒక జమాయితే యిమామ్‌ (మత గురువుల వర్గం)ను ఖుదా నియమించలేదు. “తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు” ఈసా (యేసు) చెప్పాడు. (లూకా 18:14) మతం ముసుగులో తమను ఇతరులపై హెచ్చించుకునేవారికి దేవుడు ప్రతికూలంగా తీర్పు విధిస్తాడు.—మత్తయి 23:4-12.

విగ్రహారాధన లేదు

“దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలె[ను].” (యోహాను 4:24) సత్యారాధకులు విగ్రహాలను ఉపయోగించరు.

రాజకీయాల్లో తాటస్థ్యం

తన శిష్యులు “లోకసంబంధులు కారు” అని ఈసా అన్నాడు. (యోహాను 17:16) కనుక యెహోవాసాక్షులు దేశపు రాజకీయాల్లో లేదా స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. అంతేకాక, వాళ్ళు చట్టాన్ని పాటించే ప్రజలు.—రోమీయులు 13:1, 5-7.

ఉన్నత నైతిక ప్రమాణాలు

“నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకని నొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ” అని ఈసా అన్నప్పుడు సత్యారాధకులను ఎలా గుర్తించాలో ఈసా (యేసు) చూపించాడు. (యోహాను 15:12, 13) బైబిలులోని మరో అధ్యాయం, “ఆత్మ ఫలమేమిటంటే, ప్రేమ, ఆనందం, సమాధానం, ఓర్పుతో కూడిన సహనం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సౌమ్యత, ఆత్మనియంత్రణ” అని చెబుతుంది. (గలతీయులు 5:22, 23, నూతనలోక అనువాదం, ఆంగ్లం) ఈ లక్షణాలను కనబరచేవాళ్ళు అబద్ధాలు చెప్పరు, దొంగిలించరు, జూదమాడరు, మత్తుమందులను దుర్వినియోగం చేయరు, లైంగిక అనైతికతకు పాల్పడరు. (ఎఫెసీయులు 4:25-28) వాళ్ళు ఖుదాను ప్రేమిస్తారు, కనుక వాళ్ళు ఖుదా ద్వేషించేవాటిని నివారిస్తారు. ఈ సూత్రాలు యెహోవాసాక్షుల జీవితాలను శాసిస్తాయి.

సమీపిస్తున్న ఈ లోకాంతం

మన కాలాన్ని ఇతర కాలాల నుండి భిన్నమైనదిగా చేసేదేమిటి? ఈ లోకపు, ఈ విధానపు అంత్య దినాల్లో మనం నివసిస్తున్నాం అని ప్రవచన నెరవేర్పు చూపిస్తుంది. (దానియేలు 2:44) మనం చేస్తున్నవి ఆయనను ప్రీతిపరుస్తాయా? అన్నదే నేటి వివాద విషయం. ఖుదా ఒక్కడే, అలాంటప్పుడు సత్యమైన మతం కూడా ఒక్కటే ఉండగలదు. ఆ మతం తోరాకూ, జబూర్‌కూ, ఇంజీల్‌కూ పొందిక లేకుండా ఉండలేదు. కనుక, మనం ఆ వాక్యాన్ని తప్పకుండా పరిశీలించాలి.

యెహోవాసాక్షులు చేసేదదే. మీ మతం ఏదైనప్పటికీ, మీరు కూడా అదే చేయవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో మీ కోసం మరెవ్వరూ నిర్ణయం తీసుకోలేరు. “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి (ఖుదాకు) లెక్క యొప్పగింపవలెను” అని గుర్తుంచుకోండి.—రోమీయులు 14:12.

ఏ వ్యక్తి కూడా యెహోవాకు సాక్షిగా జన్మించలేదు. సాక్షి అయ్యే ప్రతి వ్యక్తీ, అలా అవ్వాలని వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాన్ని బట్టే సాక్షి అవుతాడు. ఖుదా వాక్యాన్ని సత్యసంధంగా పరిశోధించిన తర్వాత, ఆ వ్యక్తి సత్యాన్ని గ్రహిస్తాడు, దాని ఆధారంగా, యెహోవా అనే పేరు గల నిజమైన ఖుదాకు తనను తాను అంకితం చేసుకుంటాడు. మీరూ అలాంటి పరిశోధన జరపాలని ఇష్టపడుతున్నట్లయితే, ఈ క్రింద ఇవ్వబడిన చిరునామాల్లో ఒకదానికి దయచేసి వ్రాయండి.

ఏ సూచనాలేని బైబిలు ఉటంకణలు పరిశుద్ధ గ్రంథము నుండి తీసుకోబడ్డాయి.

[అధస్సూచీలు]

^ పేరా 3 ముస్లిమ్‌ ప్రపంచంలో, తోరా, జబూర్‌ (కీర్తనలు), ఇంజీల్‌ (సువార్తల)తో రూపొందినదే కితాబే ముకద్దస్‌ (బైబిలు). ఖురాన్‌లోని కనీసం 64 వచనాలు ఈ పుస్తకాలను గురించి ఖుదాకా కలామ్‌ (దేవుని వాక్యం) అన్నట్లుగా మాట్లాడుతున్నాయి, అవి వాటిని చదవవలసిన అవసరాన్నీ, వాటిలోని ఆజ్ఞలను గైకొనవలసిన అవసరాన్నీ నొక్కిచెబుతున్నాయి. తోరా, జబూర్‌, ఇంజీల్‌ మారిపోయాయని కొందరు అంటారు. అయితే, ఇలాగన్నారంటే, వాళ్ళు ఖురాన్‌లోని మాటలను అలక్ష్యం చేస్తున్నారన్నమాట, ఖుదా తన కలామ్‌ను (వాక్యాన్ని) భద్రంగా కాపాడుకోలేడని అంటున్నారన్నమాట.

ఏ సూచనాలేని బైబిలు ఉటంకణలు పరిశుద్ధ గ్రంథము నుండి తీసుకోబడ్డాయి.