కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని సంకల్పమిప్పుడు తారస్థాయికి చేరుకుంటున్నది

దేవుని సంకల్పమిప్పుడు తారస్థాయికి చేరుకుంటున్నది

దేవుని సంకల్పమిప్పుడు తారస్థాయికి చేరుకుంటున్నది

నీతియుక్తమైన పరిస్థితులందు నివసించే సంతోషభరిత ప్రజలతో నిండించాలనే సంకల్పముతో దేవుడు భూమిని సృష్టించాడు. అలా జీవిస్తునే వుండాలంటే మానవుడు దేవుని శాసనాలకు విధేయుడై యుండవలసింది, అయితే మొదటి మానవజత అవిధేయులైనందు వలన వారు పాపులై మరణ పాత్రులయ్యారు. ఇందుమూలంగా వారి సంతానమంతటికి పాపమరణములు సంప్రాప్తమయినవి.—ఆదికాండము 1:27, 28; 2:16, 17; 3:1-19; రోమీయులు 5:12.

యెహోవా అను నామముగల దేవుడు లోకం నుండి అవిధేయతను పాప ఫలితాలను తొలగించాలని నిశ్చయించాడు. సకాలంలో ఆయన లోకాన్ని పరిశీలించి, మానవులలో అబ్రాము అనే నమ్మకమైన ఓ మనిషి వున్నట్లు గమనించాడు, ఆయన పేరును అబ్రాహాముగా మార్చాడు. దేవుడు అబ్రాహాముతో, అతని సంతానం బహుగొప్ప జనాంగమవుతుందనియు, ఆ జనాంగము నుండి దేవుడు ఒక సంతానమును అనుగ్రహించుననియు, దానివలన భూలోక జనములన్నియు తమను తాము ఆశీర్వదించుకొందురనియు వాగ్దానం చేశాడు.—ఆదికాండము 12:1-3; 18:18, 19; 22:18; కీర్తన 83:18; హెబ్రీయులు 11:8-16.

సా.శ.పూ. 16వ శతాబ్దాంతానికి అబ్రాహాము మనుమడైన యాకోబు లేక ఇశ్రాయేలుయొక్క సంతానం, 12 గోత్రములవారై ఐగుప్తు నందు దాస్యములో జీవించారు. యెహోవా యీ ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి విడిపించి వారిని ఒక జనాంగముగా ఏర్పరచాడు. ఆయన, వారికి సీనాయి పర్వతం నొద్ద మోషే ద్వారా ధర్మశాస్త్రమును ఒక రాజ్యాంగ చట్టంగా యిచ్చాడు. యెహోవాయే వారికి రాజు, న్యాయాధిపతి మరియు శాసనకర్తయై యుండెను. ఇశ్రాయేలు జనాంగము దేవుడు ఎన్నుకున్న ప్రజలయ్యారు, ఆయన సాక్షులుగా, ఆయన సంకల్పాన్ని నెరవేర్చుటకు సంస్థీకరింపబడ్డారు. సమస్త జనాంగముల ప్రయోజనార్థం ఒక శాశ్వత రాజ్యాన్ని స్థాపించు మెస్సీయ వారిలో నుండే రావలసియుండెను.—నిర్గమకాండము 19:5, 6; 1 దినవృత్తాంతములు 17:7-14; 1 రాజులు 4:20, 25; యెషయా 33:22; 43:10-12; రోమీయులు 9:4, 5.

పిదప 15 శతాబ్దాల తరువాత, లేక 2000 సంవత్సరముల క్రితం యూదా కన్యకయగు మరియ గర్భమందు జన్మించుటకు దేవుడు తన అద్వితీయ కుమారుని పరలోకము నుండి భూలోకానికి పంపాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. మరియు ఆయన తన పితరుడైన దావీదుకు దేవుడు చేసిన వాగ్దాన రాజ్యాన్ని అధిష్ఠించవలసియుండెను. తన 30 ఏట యేసు బాప్తిస్మమిచ్చు యోహానుచేత బాప్తిస్మము తీసుకొని దేవుని రాజ్యాన్ని ప్రకటించుట కారంభించాడు. రోగులను స్వస్థపరచుటద్వారా రాబోవు ఆ రాజ్యమెలా మానవ జాతిని ఆశీర్వదిస్తుందో ఆయన ప్రదర్శించాడు. నిత్యజీవాన్ని కోరిన వారందరు ఏమి చేయవలసివుండెనో ఆయన ఉపమానముల ద్వారా వివరించాడు. పిదప యేసు మ్రానుమీద చంపబడ్డాడు; ఆయన పవిత్ర మానవ ప్రాణం మానవులను విమోచించింది.—మత్తయి 1:18-24; 3:13-16; 4:17-23; 6:9, 10; 13వ అధ్యాయం; 20:28; లూకా 1:26-37; 2:14; 4:43, 44; 8:1; యోహాను 3:16; అపొ. కార్యములు 10:37-39.

సుదూర భవిష్యత్‌లో, ఈ విధానాంతమందు మెస్సీయ రాజ్యం స్థాపించ బడవలసి యున్నదని యేసు వివరించాడు. ఆ సమయంలో ఆయన పాలించే రాజుగా పరలోకమందు అదృశ్యంగా ప్రత్యక్షమగునని భూమివైపు తన దృష్టి సారించుటద్వారా ఆయన తన ప్రత్యక్షతను బయలుపరచును. అయితే 1914 నుండి మనమా కాలంలో జీవిస్తున్నామని లోక సంఘటనలు చూపిస్తున్నవి. యేసు ప్రవచించినరీతిగా యీ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడుతోంది. తత్ఫలితంగా, సకల జనముల నుండి ప్రజలు దేవుని రాజ్యం వైపు సమకూర్చ బడుచున్నారు. వీరు యీ విధానాంతమును తప్పించుకుని, మెస్సీయ రాజ్యం క్రింద యీ భూమిపై నిత్యజీవాన్ని పొందుతారు.—మత్తయి 24, 25 అధ్యాయములు; ప్రకటన 7:9-17.

అనేక చర్చీలు యీనాడు దేవుని చిత్తాన్ని చేస్తున్నట్లు చెప్పుకుంటున్నవి. అయితే నిజమైన క్రైస్తవ సంఘాన్ని నీవెట్లు గుర్తించగలవు? మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాన్ని గూర్చి లేఖనాలను పరిశీలించుట ద్వారాను, ఈనాడెవరు ఆ పద్ధతిని అనుసరిస్తున్నారోనని గమనించుటద్వారాను దాన్ని గుర్తించగలవు.

• దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటలో అబ్రాహాము మరియు ఇశ్రాయేలు ఎటువంటి పాత్ర నిర్వహించారు?

• యేసు తన పరిచర్య ద్వారాను మరణం ద్వారాను దేనిని నెరవేర్చాడు?

• మన కాలమును గుర్తించుటకు ఎటువంటి సంఘటనలు ప్రవచింపబడినవి?