కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆసక్తిగలవారు తరచూ అడిగే ప్రశ్నలు

ఆసక్తిగలవారు తరచూ అడిగే ప్రశ్నలు

ఆసక్తిగలవారు తరచూ అడిగే ప్రశ్నలు

దేవుడు ప్రేమ స్వరూపి అయితే, ఆయన దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు?

దేవుడు దుష్టత్వాన్ని అనుమతిస్తున్నాడు, భూమిపై లక్షలాదిమంది దాన్ని మనస్ఫూర్తిగా అలవాటు చేసుకుంటున్నారు. ఉదాహరణకు, వారు యుద్ధాలను ప్రకటిస్తారు, పిల్లలపై బాంబులు వేస్తారు, భూమిని నాశనం చేస్తారు, కరవులను సృష్టిస్తారు. లక్షలాదిమంది పొగత్రాగి ఊపిరితిత్తుల క్యాన్సరు కొనితెచ్చుకుంటారు, వ్యభిచారంచేసి సుఖవ్యాధుల్ని తెచ్చుకుంటారు, మద్యం అతిగా త్రాగి కాలేయ జబ్బులకు, ఇతర ఎన్నో వ్యాధులకు గురవుతారు. అలాంటి వ్యక్తులు దుష్టత్వం అంతమొందాలని నిజంగా ఆశించరు. వారు కేవలం వాటికి విధించే జరిమానాలు తీసివేయాలని కోరతారు. వారు చేసినదానికి శిక్ష పడితే, “నాకే ఎందుకు?” అంటూ గగ్గోలుపెడతారు. అంతేకాదు వారు సామెతలు 19:3 లో చెప్పినట్లు దేవుణ్ణి నిందిస్తారు: “ఒక మనిషి యొక్క బుద్ధిహీనత అతని జీవితాన్ని పాడు చేస్తుంది. కానీ అతడు యెహోవాను నిందిస్తాడు.” (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) దేవుడు వారి చెడుపనులను అడ్డగిస్తే, వారు తమకు స్వేచ్ఛ లేకుండా పోతోందని నిందిస్తారు!

సాతాను సవాలుకు సమాధానం చెప్పడానికే యెహోవా దుష్టత్వాన్ని అనుమతించడానికి గల ముఖ్యకారణం. కష్టాలొచ్చినప్పుడు కూడా ఆయనకు యథార్థంగా ఉండే మనుష్యులు భూమిపై లేరని అపవాదియైన సాతాను దేవునితో అన్నాడు. (యోబు 1:​6-12; 2:​1-10) సాతానుకు తన సవాలును నిరూపించుకొనే అవకాశాన్నిస్తూ యెహోవా అతడ్ని బ్రతకనిస్తున్నాడు. (నిర్గమకాండము 9:​16) సాతాను తన సవాలును నిరూపించుకొనే ప్రయత్నంలో, మనుష్యుల్ని దేవునిపై తిరుగుబాటు చేసేలా చేయడంలో, వారిమీదికి ఇప్పుడు శ్రమలను తేవడంలో కొనసాగుతున్నాడు. (ప్రకటన 12:12) అయినప్పటికీ, యోబు తన యథార్థతను కాపాడుకున్నాడు. యేసు కూడా అలాగే కాపాడుకున్నాడు. ఇప్పుడు నిజక్రైస్తవులు కూడా అలాగే కాపాడుకుంటున్నారు.​—⁠యోబు 27:⁠5; 31:⁠6; మత్తయి 4:​1-11; 1 పేతురు 1:⁠6, 7.

ప్రజలు నిరంతరం జీవించే భూపరదైసును విశ్వసించడానికి నేను ఇష్టపడతాను, కానీ అది అసంభవంగా లేదూ?

బైబిలు ప్రకారం అది అసంభవం కాదు. ఎందుకంటే మానవజాతికి అనేక శతాబ్దాలుగా చెడు మాత్రమే తెలుసు కాబట్టి అది నమ్మశక్యంగా లేనట్లే ఉంటుంది. యెహోవా భూమిని సృష్టించి, దానిలోని వృక్షాలను, జంతువులను నాశనం చేసే బదులు దాని సౌందర్యాన్ని కాపాడుతూ శ్రద్ధగా చూసుకునే నీతిమంతులైన స్త్రీపురుషులతో దానిని నింపమని మానవజాతికి చెప్పాడు. (12, 17 పేజీలను చూడండి.) ఆ వాగ్దాన పరదైసు నమ్మశక్యంగా లేనిదానికంటే, ప్రస్తుత విషాదస్థితి ఇక ఏమాత్రం సహించలేనంత చెడ్డగా ఉంది. దాని స్థానంలోకి పరదైసు రాబోతోంది.

బైబిలు ఒక కల్పితమని, అది వైజ్ఞానికమైంది కాదని ఎగతాళి చేసే ప్రజలకు నేనెలా సమాధానమివ్వగలను?

ఈ వాగ్దానాలను విశ్వసించడమంటే ఏదో గ్రుడ్డిగా నమ్మడమని కాదు. “వినుట వలన విశ్వాసము కలుగును.” దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా దాని జ్ఞానం విశదమవుతుంది, విశ్వాసం పెరుగుతుంది.​—⁠రోమీయులు 10:​17; హెబ్రీయులు 11:⁠1.

బైబిలు సంబంధిత పురావస్తుశాస్త్రం బైబిలు యొక్క చారిత్రాత్మక ప్రామాణికతను చాలామట్టుకు ధృవీకరిస్తుంది. నిజమైన విజ్ఞానశాస్త్రానికి బైబిలుతో పొందిక ఉంది. ఈ క్రింది వాస్తవాలు లోక విద్వాంసుల ద్వారా కనుగొనబడక పూర్వమే బైబిలులో ఉన్నాయి: భూమి ఏర్పడిన దశల క్రమము, భూమి గుండ్రంగా ఉన్న విషయం, అది శూన్యంలో వ్రేలాడుతోందన్న విషయం, పక్షులు వలసవెళతాయన్న విషయం.​—⁠ఆదికాండము 1వ అధ్యాయం; యోబు 26:⁠7; యెషయా 40:​22; యిర్మీయా 8:⁠7.

బైబిలు దేవునిచే ప్రేరేపించబడి వ్రాయబడిందని దాని ప్రవచనాల నెరవేర్పు ద్వారా వ్యక్తం చేయబడింది. ప్రపంచాధిపత్యాల ఉత్థానపతనాలతోపాటు మెస్సీయ వచ్చే సమయం, చంపబడే సమయం గురించి కూడా దానియేలు ముందుగానే ప్రవచించాడు. (దానియేలు 2, 8 అధ్యాయాలు 9:​24-27) నేడు, మన కాలాన్ని ‘అంత్యదినములుగా’ గుర్తిస్తూ ఇతర ప్రవచనాలు ఇంకా నెరవేరుతున్నాయి. (2 తిమోతి 3:​1-5; మత్తయి 24వ అధ్యాయం) అలాంటి భవిష్యత్‌ జ్ఞానం మానవ సామర్థ్యానికి అతీతమైనది. (యెషయా 41:23) మరిన్ని రుజువుల కోసం, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన బైబిలు​—⁠దేవుని వాక్యమా లేక మానవుని వాక్యమా? (ఆంగ్లం), మీపట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? అనే పుస్తకాలను చూడండి.

బైబిలు ప్రశ్నలకు సమాధానం చెప్పడాన్ని నేనెలా నేర్చుకోగలను?

మీరు బైబిలును చదివి దానిని ధ్యానించాలి, దానితోపాటు మిమ్మల్ని నడిపించడానికి దేవుని ఆత్మ కోసం అడగాలి. (సామెతలు 15:​28; లూకా 11:​9-13) “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు” అని బైబిలు చెబుతోంది. (యాకోబు 1:⁠5) అంతేగాక, సంప్రదించదగిన బైబిలు అధ్యయన సహాయకాలు కూడా ఉన్నాయి. ఫిలిప్పు ఐతియొపీయునితో అధ్యయనం చేసినప్పటివలెనే, సాధారణంగా అధ్యయనం చేయడానికి ఇతరుల సహాయం అవసరం ఉంటుంది. (అపొస్తలుల కార్యములు 8:​26-35) ఆసక్తిగల వ్యక్తుల గృహాల్లో యెహోవాసాక్షులు ఉచితంగా బైబిలు అధ్యనాలను నిర్వహిస్తారు. ఈ ఏర్పాటు నుండి ప్రయోజనం పొందడానికి సంకోచించకండి.

చాలామంది యెహోవాసాక్షులను ఎందుకు తిరస్కరిస్తారు, వారితో అధ్యయనం చేయవద్దు అని నాతో ఎందుకు చెబుతారు?

యేసు సువార్త ప్రకటించేటప్పడు వ్యతిరేకత ఉండేది, తన అనుచరులు కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటారని ఆయన చెప్పాడు. యేసు బోధలకు కొందరు ముగ్ధులైనప్పుడు మత విరోధులు వారిని ఇలా నిందించారు: “మీరు కూడ మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా?” (యోహాను 7:​46-48; 15:​20) సాక్షులతో అధ్యయనం చేయవద్దని మీకు సలహా ఇచ్చే అనేకమంది, సాక్షుల గురించి సరిగ్గా తెలియని వారు కావచ్చు, లేదా వారిపై దురభిప్రాయమున్నవారే కావచ్చు. సాక్షులతో అధ్యయనం చేసినప్పుడు మీ బైబిలు అవగాహన పెరుగుతుందో లేదో మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి.​—⁠మత్తయి 7:​17-20.

తమ సొంత మతమున్న వారిని కూడా సాక్షులు ఎందుకు సందర్శిస్తారు?

దీన్ని చేయడంలో వారు యేసు మాదిరిని అనుసరిస్తారు. ఆయన యూదుల వద్దకు వెళ్లాడు. యూదులకు తమ సొంత మతముంది, కానీ చాలా విషయాల్లో అది దేవుని వాక్యానికి దూరమయ్యింది. (మత్తయి 15:​1-9) ప్రతి దేశానికీ ఏదో ఒక మతముంది, అది నామకార్థ క్రైస్తవమతమే కావచ్చు క్రైస్తవేతర మతమే కావచ్చు. దేవుని సొంత వాక్యం ధృవీకరించే నమ్మకాలను కలిగివుండడం ప్రజలకు చాలా ముఖ్యం, అందుకు వారికి సహాయమందించడానికి సాక్షులు చేసే కృషిలో పొరుగువారి మీద ప్రేమ కనబర్చడం ఉంది.

సాక్షులు కేవలం తమ మతమే సరైనదని నమ్ముతారా?

తన మతాన్ని గంభీరంగా తీసుకునే వారెవరైనా అది సరైనదేనా అని ఆలోచించాలి. అలా ఆలోచించనట్లయితే, అతడు లేక ఆమె ఆ మతాన్ని అవలంబించడం దేనికి మరి? క్రైస్తవులు ఇలా ఉద్బోధించబడ్డారు: “సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.” (1 థెస్సలొనీకయులు 5:​19-21) ఒక వ్యక్తి తన నమ్మకాలను లేఖనాలు బలపరుస్తున్నాయో లేదో పరీక్షించుకోవాలి, ఎందుకంటే నిజమైన విశ్వాసం కేవలం ఒక్కటే ఉంది. “ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే” అని చెబుతూ ఎఫెసీయులు 4:5 దీన్ని దృఢపరుస్తుంది. రక్షణకు నడిపించే మార్గాలు, మతాలు అనేకం ఉన్నాయనే ఆధునికకాలపు, నిర్నిబంధమైన దృక్పథాన్ని యేసు సమ్మతించలేదు. బదులుగా ఆయనిలా అన్నాడు: “జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” ఆ మార్గాన్ని కనుగొన్నామని యెహోవాసాక్షులు నమ్ముతారు. లేకపోతే, వారు మరొక మతాన్ని వెతికేవారు.​—⁠మత్తయి 7:​13, 14.

వారు తాము మాత్రమే రక్షింపబడతామని నమ్ముతారా?

లేదు. శతాబ్దాల క్రితం జీవించిన యెహోవాసాక్షులు కాని లక్షలాదిమంది పునరుత్థానంలో తిరిగివచ్చి మళ్ళీ జీవించే సదవకాశాన్ని పొందుతారు. ప్రస్తుతం జీవిస్తున్న అనేకమంది ‘మహాశ్రమ’ రాకముందు నీతి సత్యాలను తమ సొంతం చేసుకుంటారు, తద్వారా రక్షణ పొందుతారు. అంతేకాదు, మనం ఒకరినొకరు తీర్పు తీర్చుకోకూడదని యేసు చెప్పాడు. మనం బాహ్యరూపాన్నే చూస్తాం; కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆయన చాలా జాగ్రత్తగా చూస్తాడు, కరుణతో తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే పనిని ఆయన యేసుకు అప్పగించాడు, మనకు కాదు.​—⁠మత్తయి 7:​1-5; 24:​21; 25:⁠31.

యెహోవాసాక్షుల కూటాలకు హాజరయ్యే వారినుండి ఎలాంటి చందాలు వసూలు చేయబడతాయి?

డబ్బు విరాళాల గురించి అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” (2 కొరింథీయులు 9:⁠7) యెహోవాసాక్షుల రాజ్యమందిరాల్లోను, సమావేశ హాళ్ళలోను, చందాలు ఎన్నడూ వసూలు చేయబడవు. అక్కడ చందా పెట్టెలు ఉంచబడతాయి, విరాళాలు వేయదలచిన వారెవరికైనా అవి అనుకూలంగా ఉంటాయి. ఎవరు ఎంత ఇచ్చారనేది, ఇచ్చారా లేదా అనేది ఎవరికీ తెలియదు. కొందరు ఇతరులకంటే ఎక్కువ ఇవ్వగలరు; కొందరైతే ఏమీ ఇవ్వలేకపోవచ్చు. యెరూషలేములోని దేవాలయం దగ్గరున్న కానుక పెట్టె గురించి, కానుకలు వేసే వారి గురించి వ్యాఖ్యానించేటప్పుడు యేసు సరైన దృక్పథాన్ని చూపించాడు: ఇవ్వడానికి ఒకరికున్న సామర్థ్యం, ఇచ్చే స్ఫూర్తి అనేవే పరిగణలోకి తీసుకోబడతాయి కానీ ఎంత డబ్బు ఇచ్చారన్నది కాదు.​—⁠లూకా 21:​1-4.

ఒకవేళ నేను యెహోవాసాక్షిగా మారితే వారిలాగే నేను కూడా సువార్త ప్రకటించాల్సి ఉంటుందా?

ఒక వ్యక్తి క్రీస్తు రాజ్యపరిపాలనలోని వాగ్దానం చేయబడిన భూపరదైసు గురించిన పరిజ్ఞానంతో నిండినప్పుడు, దాన్ని ఇతరులతో పంచుకోవాలని కోరుకుంటాడు. మీరు కూడా అంతే. ఇది సువార్తండీ!​—⁠అపొస్తలుల కార్యములు 5:​41, 42.

మీరు యేసుక్రీస్తు శిష్యులని తెలియజేసుకోవడానికి దీనిని చేయడం ఒక ప్రాముఖ్యమైన పద్ధతి. బైబిలులో, “నమ్మకమైన సత్యసాక్షి” అని యేసు పిలువబడ్డాడు. ఆయన భూమిపైనున్నప్పుడు, “పరలోకరాజ్యము సమీపించియున్నది” అని ప్రకటించాడు, అలాగే చేయడానికి ఆయన తన శిష్యులను పంపాడు. (ప్రకటన 3:​14; మత్తయి 4:​17; 10:⁠7) ఆ తర్వాత, తన అనుచరులకు ఇలా ఆజ్ఞాపించాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . వారికి బోధించుడి.” అంతము రాకముందు, “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడు”నని కూడా ఆయన ప్రవచించాడు.​—⁠మత్తయి 24:​14; 28:​19, 20.

ఈ రాజ్యసువార్తను ప్రకటించే పద్ధతులు చాలా ఉన్నాయి. స్నేహితులతో, పరిచయమున్న వారితో చేసే సంభాషణలు అలా ప్రకటించడానికి మార్గాన్ని తెరుస్తాయి. కొందరు ఉత్తరాలు వ్రాయడంద్వారా, ఫోన్‌ చేయడం ద్వారా దీన్ని చేస్తారు. మరికొందరు తమకు పరిచయమున్న వారికి ప్రత్యేక ఆసక్తి ఉందని తలంచిన విషయాలు గల సాహిత్యాన్ని పోస్టు చేస్తారు. ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరికీ అందించాలన్న కోరికతో సాక్షులు ఈ సువార్తతో ఇంటింటికీ వెళ్తారు.

బైబిలులో ఉత్సాహవంతమైన ఈ ఆహ్వానం ఉంది: “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” (ప్రకటన 22:​17) భూపరదైసు గురించీ దాని ఆశీర్వాదాల గురించీ ఇతరులకు మనస్ఫూర్తిగా చెప్పాలి, ఈ సువార్తను పంచుకోవాలనే కోరికతో నిండిన హృదయం నుండి అది పెల్లుబకాలి.

యెహోవాసాక్షుల గురించీ వారి నమ్మకాల గురించీ మీకు వేరే ప్రశ్నలు కూడా ఉంటాయని మేము విశ్వసిస్తున్నాం. బహుశా వాటిలో కొన్ని సహజంగా వివాదాస్పదమైనవి కావచ్చు. మేము మీ ప్రశ్నలకు జవాబు చెప్పాలని కోరుకుంటున్నాం. ఈ బ్రోషుర్‌లో స్థలం పరిమితంగా ఉంది; కాబట్టి మీ ప్రాంతంలో ఉన్న సాక్షులను అడగాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వారి రాజ్యమందిరాల్లో గానీ వారు మీ ఇంటిని సందర్శించినప్పుడైనా గానీ మీరు వారిని అడగవచ్చు. లేదా ఈ క్రింద ఇవ్వబడిన పట్టికలో నుండి మీకు సముచితమైన అడ్రసుపై మీ ప్రశ్నలను యెహోవాసాక్షులకు పంపించవచ్చు.