కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ సమాజానికి సువార్త యొక్క ఆచరణాత్మకమైన విలువ

మీ సమాజానికి సువార్త యొక్క ఆచరణాత్మకమైన విలువ

మీ సమాజానికి సువార్త యొక్క ఆచరణాత్మకమైన విలువ

నేటి ప్రపంచంలో మనం తరచూ ఇలాంటి అభిప్రాయం వింటుంటాం: “క్రైస్తవ సూత్రాలు ఆచరణాత్మకమైనవి కావు. నేటి సంక్లిష్ట సమాజానికి అవి పనికిరావు.” అయితే, మోహన్‌దాస్‌ కె. గాంధీకి, మాజీ ఇండియా గవర్నర్‌ అయిన బ్రిటిష్‌ దేశస్థుడు లార్డ్‌ ఇర్విన్‌కి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఒక నివేదికలో పూర్తిగా భిన్నమైన వ్యాఖ్యానం వ్యక్తం చేయబడింది. గ్రేట్‌ బ్రిటన్‌కు ఇండియాకు మధ్యనున్న సమస్యలను పరిష్కరించడం గురించి మీరేమనుకుంటున్నారని లార్డ్‌ ఇర్విన్‌ గాంధీని అడిగారు. గాంధీ ఒక బైబిలు తీసుకొని అందులో మత్తయి ఐదవ అధ్యాయం తెరచి ఇలా అన్నారు: “కొండమీది ప్రసంగంలో క్రీస్తు చెప్పిన బోధలను మీ దేశం, మా దేశం అన్వయించుకుంటే, మనం మన సమస్యలనే కాదు మొత్తం ప్రపంచంలోని సమస్యలనే పరిష్కరించుకొని ఉండేవాళ్లం.”

ఆ ప్రసంగం, ఆధ్యాత్మికతను వెతకడం గురించీ సాత్వికంగా, శాంతంగా, కరుణతో ఉండడం గురించీ నీతిని ప్రేమించడం గురించీ చెబుతుంది. అది హత్యనే కాదుగానీ ఇతరులపై క్రోధంతో ఉండడాన్నీ వ్యభిచారాన్ని మాత్రమే కాదుగానీ కామాభిలాషతో కూడిన ఆలోచనలను కూడా ఖండిస్తుంది. అది కుటుంబాలను విచ్ఛిన్నం చేసి పిల్లలను అనాధలుగా చేసే బాధ్యతారహితమైన విడాకుల చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అది మనకు ఇలా చెబుతోంది: ‘మిమ్మల్ని ఇష్టపడనివారిని కూడా ప్రేమించండి, అవసరంలో ఉన్నవారికి ఇవ్వండి, ఇతరులకు నిర్దయతో తీర్పు తీర్చకండి, ఇతరులు మీతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నారో అలాగే మీరూ ఇతరులతో ప్రవర్తించండి.’ ఈ సలహాలన్నీ అన్వయించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వాటిని మీ సమాజంలో ఎంత ఎక్కువమంది పాటిస్తే, మీ సమాజం అంత చక్కగా మారుతుంది!

ఈ విషయంలో యెహోవాసాక్షులు మంచి ప్రభావాన్ని చూపుతారు. వివాహాన్ని గౌరవించాలని బైబిలు వారికి బోధిస్తోంది. వారి పిల్లలు సరైన సూత్రాలతో శిక్షణ పొందుతారు. కుటుంబ ప్రాముఖ్యత నొక్కిచెప్పబడింది. ఐక్యతగల కుటుంబాలు మీ సమాజానికే గాక మీ దేశానికి కూడా లాభదాయకం. కుటుంబ బాంధవ్యాలు బలహీనమైనప్పుడు, అనైతికత పెచ్చుపెరిగిపోయినప్పుడు ప్రపంచాధిపత్యాలే కుప్పకూలిపోయిన ఉదాహరణలతో చరిత్ర నిండిపోయింది. కుటుంబాలు, వ్యక్తులు క్రైస్తవ సూత్రాలపై ఆధారపడి జీవించే విషయంలో యెహోవాసాక్షుల ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటే మీ సమాజంలో అపరాధ ధోరణి, అవినీతి, నేరము అంత తక్కువగా ఉంటాయి.

సమాజాన్నీ దేశాన్నీ పట్టి పీడిస్తున్న గంభీర సమస్యల్లో జాతి వైషమ్యం ఒకటి. దానికి విరుద్ధంగా, అపొస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు: “దేవుడు పక్షపాతికాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” పౌలు కూడా ఇలా వ్రాశాడు: “ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.” (అపొస్తలుల కార్యములు 10:​34, 35; గలతీయులు 3:​28) యెహోవాసాక్షులు దీన్ని అంగీకరిస్తారు. వారి ప్రపంచ ప్రధాన కార్యాలయాల్లో బ్రాంచీలలో సంఘాల్లో అన్ని వర్గాలు, వర్ణాలు గల ప్రజలు కలిసి జీవిస్తున్నారు, కలిసి పనిచేస్తున్నారు.

ఆఫ్రికాలోని కొన్ని తెగలవారు కలుసుకున్నారంటే ఘర్షణలు తప్పవు. అయినప్పటికీ, అక్కడ జరిగే యెహోవాసాక్షుల సమావేశాల్లో, వివిధ జాతులకు ఎన్నింటికో చెందిన ప్రజలు పూర్తి సమన్వయంతో, స్నేహపూర్వక సహవాసంతో కలిసి తింటారు, కలిసి నిద్రపోతారు, కలిసి ఆరాధిస్తారు. ప్రభుత్వాధికారులు దీన్ని గమనించినప్పుడు ఆశ్చర్యపోయారు. ప్రజలను ఐక్యపరిచే ప్రభావంగల నిజ క్రైస్తవత్వం గురించి 1958, ఆగస్టు 2 నాటి న్యూయార్క్‌ అమ్‌స్టర్‌డమ్‌ న్యూస్‌లో ఒక ఉదాహరణ వ్యాఖ్యానించబడింది. ఇంతకు ముందు పేర్కొన్న అంతర్జాతీయ సమావేశాన్ని పరికించడం ద్వారా ఈ వ్యాఖ్యానం ప్రేరేపించబడింది, ఈ సమావేశానికి రెండున్నర లక్షలకంటే ఎక్కువమంది సాక్షులు న్యూయార్క్‌ నగరంలో సమావేశమయ్యారు.

“ప్రతిచోటా నీగ్రోలు, శ్వేతజాతివారు, తూర్పుదేశీయులు అన్ని రకాల జీవనపద్ధతులు గలవారు, అన్ని ప్రాంతాలనుండి వచ్చినవారు, సంతోషంగా స్వేచ్ఛగా కలిసిపోయారు. . . . 120 దేశాల నుండి ఆరాధించడానికి వచ్చిన సాక్షులు సమాధానంతో కలిసి జీవించడం, ఆరాధించడం ఎంత సులభమో అమెరికా దేశస్థులకు చూపించారు. . . . ప్రజలెలా కలిసి పనిచేయగలరో ఎలా కలిసి జీవించగలరో చూపడానికి ఈ సమావేశం ఒక ఉజ్వలమైన ఉదాహరణ.”

ఈ ఆధునిక ప్రపంచంలో క్రైస్తవత్వపు సూత్రాలు ఆచరణాత్మకమైనవి కావని అనేకమంది అంటుండవచ్చు. అయితే, ఆచరణాత్మకమైనది గానీ ప్రయోజనకరమైనది గానీ వేరే ఏదైనా ఉందా? భవిష్యత్తులో వస్తుందా? క్రైస్తవ సూత్రాలను ఇప్పుడు మీ సమాజంలో అన్వయించుకుంటే అవి నిజమైన విలువగలవిగా ఉండగలవు, అంతేగాక మానవజాతిని పరిపాలించే దేవుని రాజ్యంలో అవి భూవ్యాప్తంగా ‘ప్రతి జనమును, వంశమును, ప్రజలను’ ఐక్యం చేయడానికి ఆధారంగా ఉంటాయి.​—⁠ప్రకటన 7:​9, 10.

[23వ పేజీలోని బ్లర్బ్‌]

అన్ని జాతులు వర్ణాలు కలిసి పనిచేస్తాయి

[24వ పేజీలోని బ్లర్బ్‌]

క్రైస్తవత్వం ఆచరణాత్మకమైనది. ఇప్పటివరకూ అలా ప్రయోజనం చేకూర్చింది వేరే ఏదైనా ఉందా?