వారి ఆధునిక క్రమావిర్భవం అభివృద్ధి
వారి ఆధునిక క్రమావిర్భవం అభివృద్ధి
యెహోవాసాక్షుల ఆధునిక చరిత్ర వంద సంవత్సరాల కంటే ముందే ప్రారంభమైంది. అమెరికాలోని పెన్సిల్వేనియాలోనున్న అల్లెగెనీలో (ఇప్పుడిది పిట్స్‌బర్గ్‌లో భాగం) 1870ల ప్రారంభంలో అతి చిన్న బైబిలు అధ్యయన గుంపు ఒకటి ఆవిర్భవించింది. చార్లెస్ తేజ్ రస్సెల్ ఆ గుంపుకు ప్రధాన సూత్రధారి. 1879 జూలైలో జాయన్స్ వాచ్ టవర్ అండ్ హెరాల్డ్ ఆఫ్ క్రైస్ట్స్ ప్రెజెన్స్ పత్రిక మొదటి సంచిక వెలువడింది. ఆ ఒక్క చిన్న బైబిలు అధ్యయన గుంపు నుండి సమీప రాష్ట్రాల్లో 1880కల్లా అనేక సంఘాలు ఏర్పడ్డాయి. రస్సెల్ అధ్యక్షుడిగా, 1881లో జాయన్స్ వాచ్ టవర్ ట్రాక్ట్ సొసైటీ రూపొందించబడి, 1884లో అది చట్టబద్ధం చేయబడింది. సొసైటీ పేరు తర్వాత వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీగా మార్చబడింది. అనేకమంది ఇంటింటికీ సాక్ష్యమిస్తూ బైబిలు సాహిత్యాలను అందించడం మొదలుపెట్టారు. 1888లో యాభైమంది పూర్తికాల సేవకులుగా ఈ పని చేశారు—ఇప్పుడు వారి సగటు సంఖ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,00,000.
1909 నాటికి ఆ పని అంతర్జాతీయ పనిగా మారింది, సొసైటీ ప్రధాన కార్యాలయం ప్రస్తుత స్థలమైన న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌కు మారింది. ప్రసంగాలు వార్తాపత్రిక సంస్థల ద్వారా పంపిణీ చేయబడడంతో వివిధ వార్తాపత్రికల్లో ముద్రించబడ్డాయి, 1913 నాటికి ఇవి నాలుగు భాషల్లో అమెరికా, కెనడా, యూరప్‌లలోని వేలాది వార్తాపత్రికలకు చేరుకున్నాయి. పుస్తకాలు, చిన్న చిన్న పాంప్లెట్లు, కరపత్రాలు వందల మిలియన్ల సంఖ్యలో పంచబడ్డాయి.
1912లో “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్” అనేదానిపై పని ప్రారంభించబడింది. సౌండుతో కూడిన స్లైడ్లు, చలనచిత్రాల ద్వారా, భూమి సృష్టించినప్పటి నుండి క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన ముగింపు వరకు ఉండే ప్రదర్శన అది. 1914లో ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి, ప్రతిరోజు 35,000 మంది వీక్షించేవారు. చలనచిత్రాలకు శబ్దాన్ని జోడించడంలో అది నాంది పలికింది.
1914వ సంవత్సరం
ఒక ప్రాముఖ్యమైన సమయం ఆసన్నమవుతున్న కాలమది. 1876లో బైబిలు విద్యార్థియైన చార్లెస్ తేజ్ రస్సెల్ “అన్యజనముల కాలములు: అవి ఎప్పుడు పూర్తవుతాయి?” అనే ఆర్టికల్‌ను న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ప్రచురించబడుతుండే బైబిల్ ఎగ్జామినర్ అనే పత్రికకు వ్రాశారు. దాని అక్టోబరు సంచిక, 27వ పేజీలో “క్రీ.శ. 1914లో ఏడు కాలములు పూర్తవుతాయి” అని తెలియజేసింది. ఈ అన్యజనముల కాలములు, మరొక బైబిలు అనువాదంలో “అన్యజనముల నియామక కాలములు” అని పిలువబడ్డాయి. (లూకా 21:, NW) 1914లో జరుగుతుందని ఎదురుచూసినదంతా జరగలేదు కానీ అది అన్యజనముల కాలముల ముగింపును సూచించి, ఎంతో ప్రాముఖ్యతగల సంవత్సరమయ్యింది. అనేకమంది చరిత్రకారులు, వ్యాఖ్యాతలు 1914వ సంవత్సరం మానవ చరిత్రలో ఒక మలుపురాయి అని ఒప్పుకుంటున్నారు. ఈ క్రింది ఉదాహరణలు దాన్ని స్పష్టీకరిస్తున్నాయి: 24
“చరిత్రలో పూర్తిగా ‘నెమ్మదైన’ చివరి సంవత్సరం ఏదంటే, మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడానికి ముందటి సంవత్సరమైన 1913.”—టైమ్స్-హెరాల్డ్ సంపాదకీయం, వాషింగ్టన్, డి.సి., మార్చి 13, 1949.
“1914 నుండి 1989 వరకున్న 75 సంవత్సరాల కాలాన్ని—రెండు ప్రపంచ యుద్ధాలు మరియు ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన కాలాన్ని—ఒక్కటిగా, విశిష్టమైన యుగంగా, అసమానమైన కాలంగా చరిత్రకారులు దృష్టించడం రోజురోజుకూ ఎక్కువవుతోంది, ఆ కాలంలో లోకంలోని ఎక్కువ భాగం యుద్ధం చేస్తోంది, యుద్ధం నుండి కోలుకుంటోంది లేదా యుద్ధానికి సిద్ధపడుతోంది.”—ద న్యూయార్క్ టైమ్స్, మే 7, 1995.
“వాస్తవానికి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మొత్తం లోకం కకావికలమైపోయింది, అలా ఎందుకయ్యిందో ఇప్పటికీ మనకు తెలియదు. యుద్ధానికి ముందు, ప్రజలు పరిపూర్ణ సాంఘిక రాజకీయ విధానం కనుచూపుమేరలోనే ఉందన్నట్లు భావించారు. శాంతి, సమృద్ధి ఉండేవి. హఠాత్తుగా అవన్నీ ఆహుతైపోయాయి. అప్పటి నుండి మనం ఒక అనిశ్చితమైన స్థితిలో ఉండిపోయాం . . . ఈ శతాబ్దంలో చరిత్రంతటిలో కంటే అత్యధిక సంఖ్యలో ప్రజలు చంపబడ్డారు.”—డా. వాకర్ పెర్సీ, అమెరికన్ మెడికల్ న్యూస్, నవంబరు 21, 1977.
1914 తర్వాత 50 సంవత్సరాలకు, జర్మన్ రాజనీతిజ్ఞుడు కోన్రాట్ అడెన్యూర్ ఇలా వ్రాశారు: “1914 నుండి ప్రజల జీవితాల్లో నుండి శాంతిభద్రతలు మటుమాయమయ్యాయి.”—ద వెస్ట్ పార్కర్, క్లీవ్‌ల్యాండ్, ఓహాయో, జనవరి 20, 1966.
1916లో సొసైటీ మొదటి అధ్యక్షుడు సి.టి. రస్సెల్ మరణించారు, దాని తర్వాతి సంవత్సరం జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్ ఆ స్థానంలోకి వచ్చారు. అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కావలికోటకు సహపత్రికగా ద గోల్డెన్ ఏజ్ అనే పత్రిక పరిచయం చేయబడింది. (ఇప్పుడు తేజరిల్లు! అని పిలువబడుతోంది, 86 కంటే ఎక్కువ భాషల్లో 2,10,00,000 కంటే ఎక్కువ ప్రతులు పంపిణీ అవుతున్నాయి.) ఇంటింటికీ సాక్ష్యమిచ్చే పనికి అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వబడింది. క్రైస్తవమత సామ్రాజ్యపు మతశాఖల నుండి వేరుగా గుర్తించబడేందుకు ఈ క్రైస్తవులు 1931లో యెహోవాసాక్షులు అనే పేరు పెట్టుకున్నారు. ఈ పేరుకు యెషయా 43:10-12 వచనాలు ఆధారం.
1920, 1930లలో రేడియో విస్తృతంగా ఉపయోగించబడింది. 1933 నాటికి సొసైటీ 403 రేడియో స్టేషన్ల ద్వారా బైబిలు ప్రసంగాలను ప్రసారం చేస్తుండేది. ఆ తర్వాత, పోర్టబుల్ ఫోనోగ్రాఫులతో రికార్డు చేయబడిన బైబిలు ప్రసంగాలతో సాక్షులు ఇంటింటి సందర్శనాలు అత్యధికంగా చేయడంతో రేడియోను ఉపయోగించడం చాలామట్టుకు తగ్గిపోయింది.
బైబిలు సత్యంపై ఎవరు ఆసక్తి చూపిస్తే వారితో గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించేవారు.న్యాయస్థానంలో విజయాలు
ఈ పని చేస్తున్నందుకు 1930, 1940లలో అనేకమంది సాక్షులు అరెస్టు చేయబడ్డారు, వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం, సమావేశమవ్వడానికీ ఆరాధించుకోవడానికీ గల స్వాతంత్ర్యం గురించి న్యాయస్థానంలో పోరాడారు. క్రింది స్థాయిలోని కోర్టుల నుండి అమెరికాలోని సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోవడంతో సాక్షులు 43 కేసులు గెలుపొందారు. అదేవిధంగా, ఇతర దేశాల్లోని ఉన్నత న్యాయస్థానాల నుండి కూడా అనుకూలమైన తీర్పులను పొందారు. ఈ న్యాయస్థాన విజయాలకు సంబంధించి ప్రొఫెసర్ సి. ఎస్. బ్రాడెన్, దీస్ ఆల్సో బిలీవ్ అనే తన పుస్తకంలో సాక్షుల గురించి ఇలా అన్నారు: “తమ పౌర హక్కులను కాపాడుకోవడానికి వారు చేసిన పోరాటం ద్వారా ప్రజాస్వామ్యానికి ఎంతో గమనార్హమైన సేవ చేశారు, ఎందుకంటే వారి పోరాటం ద్వారా అమెరికాలోని ప్రతీ చిన్న మత గుంపు హక్కులకు భద్రత కలిగించేందుకు వారు కృషి చేశారు.”
ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు
1942లో జె. ఎఫ్. రూథర్‌ఫోర్డ్ మరణించారు, ఎన్. హెచ్. నార్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించారు. అందరి ఆమోదం పొందిన ఒక శిక్షణా కార్యక్రమం
ప్రారంభమైంది. మిషనరీల కోసం 1943లో, వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ అని పిలువబడే ఒక ప్రత్యేక శిక్షణా పాఠశాల స్థాపించబడింది. అప్పటి నుండి, ఈ పాఠశాలలో పట్టభద్రులైనవారు భూవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు పంపించబడుతున్నారు. ఒక్క సంఘం కూడా లేని దేశాల్లో క్రొత్త సంఘాలు ఏర్పడ్డాయి, అంతర్జాతీయంగా బ్రాంచీలు స్థాపించబడ్డాయి, అవి ఇప్పుడు 110 కంటే ఎక్కువే ఉన్నాయి. సంఘ పెద్దలకు, బ్రాంచిలోని స్వచ్ఛంద సేవకులకు, సాక్ష్యపు పనిలో పూర్తికాల సేవ (పయినీరు) చేసేవారికి శిక్షణనిచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక కోర్సులు రూపొందించబడ్డాయి. న్యూయార్క్‌లోని పాటర్‌సన్‌లోని ఎడ్యుకేషనల్ సెంటర్‌లో పరిచారకుల కోసం కొన్ని ప్రత్యేక విధానాల శిక్షణలు ఇవ్వబడుతుంటాయి.1977లో ఎన్. హెచ్. నార్ మరణించారు. సంస్థాగతంగా జరిగిన మార్పుల్లో ఆయన మరణించడానికి ముందు పాల్గొన్నవాటిలో చివరిది, బ్రూక్లిన్‌లోని ప్రధాన కార్యాలయంలో ఉండే పరిపాలక సభను విస్తృతపరచడం. 1976లో అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు విభజించబడి, పరిపాలక సభ సభ్యులతో ఏర్పడిన వివిధ కమిటీలకు అప్పగించబడ్డాయి, ఆ సభ్యులందరికీ పరిచారకులుగా అనేక దశాబ్దాల అనుభవం ఉంది.
ప్రచురణా సౌకర్యాల విస్తృతీకరణ
ఆధునిక కాలాల్లో యెహోవాసాక్షుల చరిత్ర ఉత్సాహవంతమైన సంఘటనలతో నిండిపోయింది. 1870లో పెన్సిల్వేనియాలోని ఆ నాటి ఒక చిన్న బైబిలు అధ్యయన గుంపు నుండి, 2001వ సంవత్సరం నాటికి సాక్షులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 93,000 సంఘాలకు పెరిగారు. మొదట్లో ప్రచురణలన్నీ వాణిజ్య సంస్థల ద్వారా ముద్రించబడుతుండేవి, 1920లో సాక్షులు అద్దెకు తీసుకున్న ఫ్యాక్టరీ బిల్డింగుల్లో కొన్ని ప్రచురణలను ముద్రించారు. కానీ 1927 నుండి న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోనున్న వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ వారి ఎనిమిది అంతస్థుల సొంత ఫ్యాక్టరీ బిల్డింగులో మరిన్ని ప్రచురణలు ముద్రించబడ్డాయి. అది ఇప్పుడు ఇతర ఫ్యాక్టరీ బిల్డింగులు, ఒక ఆఫీసుతో ఉన్న కాంప్లెక్స్‌గా విస్తరించింది. దాంతోపాటు, ప్రచురించే పనిని నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవకులకు వసతి కోసం దగ్గర్లోనే బ్రూక్లిన్‌లో మరి కొన్ని బిల్డింగులు ఉన్నాయి. వీటితోపాటు, న్యూయార్క్ ఉత్తర భాగాన ఉన్న వాల్‌కిల్‌కి సమీపాన ఒక ఫామ్‌తో కలిసివున్న ముద్రణాలయం ఉంది. అక్కడ కావలికోట, తేజరిల్లు! పత్రికలను ముద్రించడంతోపాటు వివిధ స్థలాల్లో సేవచేస్తున్న పరిచారకులకు కొంత ఆహారం కూడా తయారుచేయబడుతుంది. ప్రతి స్వచ్ఛంద సేవకునికీ అయ్యే చిన్న చిన్న ఖర్చుల కోసం ప్రతినెలా చిన్న మొత్తం ఇవ్వబడుతుంది.
అంతర్జాతీయ సమావేశాలు
మొట్టమొదటి పెద్ద సమావేశం 1893లో అమెరికాలోని, ఇల్లినాయ్‌లోనున్న చికాగోలో జరిగింది. దానికి 360 మంది హాజరయ్యారు, 70 మంది క్రొత్తగా బాప్తిస్మం పొందారు. చిట్టచివరి ఏకైక పెద్ద అంతర్జాతీయ సమావేశం 1958లో న్యూయార్క్ నగరంలో జరిగింది. దానికి యాంకీ స్టేడియంతోపాటు అప్పుడున్న పోలో గ్రౌండ్స్‌ను కూడా సాక్షులు ఉపయోగించుకున్నారు. హాజరైనవారి శిఖరాగ్ర సంఖ్య 2,53,922. క్రొత్తగా బాప్తిస్మం పొందినవారి సంఖ్య 7,136. అప్పటి నుండి అంతర్జాతీయ సమావేశాలు వరుసగా ఇతర అనేక దేశాల్లో జరిగాయి. భూగోళవ్యాప్తంగా అలా వరుసగా జరిగిన సమావేశాలు అన్నీ కలిపి దాదాపు వెయ్యి ఉండవచ్చు.
[8వ పేజీలోని బ్లర్బ్]
ప్రజాస్వామ్యానికి గమనార్హమైన సేవ
[6వ పేజీలోని చిత్రం]
“కావలికోట,” ఒక్క భాషలో 6,000 కాపీల నుండి, 143 కంటే ఎక్కువ భాషల్లో 2,40,00,000 కంటే ఎక్కువ కాపీల వరకు
[7వ పేజీలోని చిత్రం]
మానవ చరిత్రలో ఒక మలుపురాయి
[10వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]