కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారు ఎవరు?

వారు ఎవరు?

వారు ఎవరు?

వారి గురించి మీరు బాగా తెలుసుకోవాలన్నదే యెహోవాసాక్షుల కోరిక. మీ పొరుగువారిగా తోటి పనివారిగా లేదా ఇతర దైనందిన జీవిత కార్యకలాపాల్లో మీరు వారిని కలుసుకొని ఉంటారు. వీధిలో నిలబడి వారి పక్కనుండి వెళ్తున్నవారికి పత్రికల్ని అందిస్తుండగా మీరు వారిని చూసి ఉండవచ్చు. లేదా మీ ఇంటి గుమ్మం వద్దనే మీరు వారితో క్లుప్తంగా మాట్లాడి ఉండవచ్చు.

వాస్తవానికి, యెహోవాసాక్షులకు మీపైనా మీ సంక్షేమంపైనా శ్రద్ధ ఉంది. వారు మీ స్నేహితులవ్వాలనుకుంటున్నారు, వారి గురించీ వారి నమ్మకాల గురించీ వారి సంస్థ గురించీ మీకు తెలియజేయాలనుకుంటున్నారు, అంతేకాక ప్రజల గురించీ మనమందరమూ జీవిస్తున్న ఈ లోకం గురించీ తామేమనుకుంటున్నారో ఆ విషయం మీతో చెప్పాలనుకుంటున్నారు. అందుకే, వారు ఈ బ్రోషుర్‌ను మీ కోసం సిద్ధం చేశారు.

యెహోవాసాక్షులు అనేక విధాలుగా ఇతర ప్రజల్లాంటివారే. వారికీ ఆర్థికపరమైన, శారీరకమైన, మానసికమైన సాధారణ సమస్యలు ఉన్నాయి. అప్పుడప్పుడు వారు కూడా పొరపాట్లు చేస్తుంటారు, ఎందుకంటే వారు పరిపూర్ణులు కాదు, అతీతమైన శక్తిచే నడిపించబడేవారూ కాదు. కానీ వారు తమ అనుభవాలనుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, అవసరమైన దిద్దుబాట్లు చేసుకునేందుకు శ్రద్ధగా బైబిలు అధ్యయనం చేస్తారు. దేవుని చిత్తం చేస్తామని వారు ఆయనకు సమర్పించుకున్నారు, ఆ సమర్పణకు అనుగుణంగా జీవించడానికి వారు కృషి చేస్తారు. వారు తమ కార్యకలాపాలన్నింటిలోనూ దేవుని వాక్యం నుండీ ఆయన పరిశుద్ధాత్మ నుండీ వచ్చే నడిపింపు కోసం ఎదురుచూస్తారు.

వారి నమ్మకాలు మానవాభిప్రాయలపైనో మతపర సిద్ధాంతాల పైనో కాక బైబిలుపై ఆధారపడినవై ఉండాలన్నది వారికి చాలా ప్రాముఖ్యమైన విషయం. “ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు” అని అపొస్తలుడైన పౌలు దైవ ప్రేరేపణతో తెలియజేసినప్పుడు ఆయనెలా భావించాడో వారూ అలాగే భావిస్తారు. (రోమీయులు 3:4 *) సాక్షులు బైబిలు నుండి బోధించబడే సత్యాలకు సంబంధించి, అపొస్తలుడైన పౌలు ప్రకటించిన తర్వాత బెరయ నివాసులు పాటించిన విధానాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు: “వీరు . . . ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.” (అపొస్తలుల కార్యములు 17:11) మతసంబంధమైన అన్ని బోధలూ, అవి వారు బోధించేవైనా ఇతరులు బోధించేవైనా సరే అవి పరీక్షించబడి ప్రేరేపిత లేఖనాలతో ఆమోదం పొందినవైవుండాలని యెహోవాసాక్షులు నమ్ముతారు. వారితో మీరు చేసే చర్చల్లో అలా పరీక్షించమని వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు.

దీన్నిబట్టి యెహోవాసాక్షులు బైబిలును దేవుని వాక్యమని నమ్ముతారన్నది విదితమవుతోంది. దీనిలోని 66 పుస్తకాలను దైవ ప్రేరేపితమైనవిగానూ చారిత్రాత్మకంగా ఖచ్చితమైనవిగానూ పరిగణిస్తారు. మామూలుగా క్రొత్త నిబంధన అని పిలువబడేదాన్ని వారు క్రైస్తవ గ్రీకు లేఖనాలనీ పాత నిబంధన అని పిలువబడేదాన్ని హీబ్రూ లేఖనాలనీ అంటారు. వారు గ్రీకు లేఖనాలను హీబ్రూ లేఖనాలను రెండింటినీ విశ్వసిస్తారు, స్పష్టంగా ఆలంకారికమైనవిగా లేదా సూచనార్థకమైనవిగా కనిపించే కొన్ని మాటలను లేదా భాగాలను తప్ప వారు వాటిని ఉన్నవి ఉన్నట్లుగా తీసుకుంటారు. బైబిలు ప్రవచనాల్లో అనేకం నెరవేరాయనీ కొన్ని నెరవేరుతున్నాయనీ మరికొన్ని నెరవేరతాయనీ వారు అర్థం చేసుకున్నారు.

వారి పేరు

యెహోవాసాక్షులు? అవును, వారు తమను తాము అలాగే పిలుచుకుంటారు. అది వివరణ సహితమైన ఒక పేరు, వారు యెహోవా గురించీ ఆయన దైవత్వం గురించీ ఆయన సంకల్పాల గురించీ సాక్ష్యం చెబుతారని ఆ పేరు సూచిస్తోంది. “దేవుడు,” “ప్రభువు,” “సృష్టికర్త” అనేవి​—“రాష్ట్రపతి” “రాజు” “సైన్యాధ్యక్షుడు” వంటివి​—బిరుదులేగాక అవి విభిన్నమైన ఇతర వ్యక్తులకు వర్తించవచ్చు. కానీ “యెహోవా” అనేది వ్యక్తిగతమైన పేరు, అది సర్వశక్తిమంతుడూ విశ్వ సృష్టికర్తా అయిన దేవునికే వర్తిస్తుంది. పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం బైబిలులో కీర్తన 83:18 వ వచనం ఇలా సూచించబడింది: “యెహోవా అనే పేరుగల నీవు మాత్రమే లోకమంతట్లో సర్వాతీతుడైన దేవుడవని వారు తెలుసుకుంటారు గాక!”

యెహోవా అనే పేరు (లేదా పవిత్రగ్రంథం, క్యాతలిక్‌ అనువాదము ఎంపిక చేసుకునేదీ కొందరు విద్వాంసులు ఎక్కువగా ఇష్టపడేదీ అయిన యావె అనే పేరు) మూల హీబ్రూ లేఖనాల్లో దాదాపు 7,000 సార్లు కనబడుతుంది. అనేక బైబిళ్ళు అలా చూపించవు, కానీ ప్రత్యామ్నాయంగా “దేవుడు” లేదా “ప్రభువు” అని ఉపయోగిస్తాయి. అయితే ఈ బైబిళ్ళలో కూడా యెహోవా అని ఎక్కడ ఉపయోగించబడిందో ఒక వ్యక్తి సాధారణంగా చెప్పగలడు, ఎందుకంటే దాని స్థలంలో ఉపయోగించిన ప్రత్యామ్నాయ పదాలు ఈ విధంగా దేవుడు, ప్రభువు అని ముద్దక్షరాల్లో లేదా పెద్దక్షరాల్లో ఉంటాయి. కొన్ని ఆధునిక అనువాదాలు యెహోవా లేదా యావె అనే పేరును ఉపయోగిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథములో యెషయా 42:8 లో ఇలా చదువుతాం: “యెహోవాను నేనే; ఇదే నా నామము.”

యెహోవాసాక్షులు తమ పేరును ఏ మూలం నుండి తీసుకున్నారో ఆ లేఖనాధారిత వృత్తాంతం యెషయా 43వ అధ్యాయంలో ఉంది. అక్కడ లోకపు దృశ్యం ఒక కోర్టులో జరిగే సన్నివేశంలా కనబడుతుంది: జనాంగాల దేవుళ్ళు తాము నిర్దోషులమని నిరూపించుకోవడానికి తమ సాక్షులను ప్రవేశపెట్టమని ఆహ్వానించబడ్డారు లేదా యెహోవా పక్షపు సాక్షులు చెప్పేది విని నిజమే అని ఒప్పుకోవాలి. అక్కడ యెహోవా తన ప్రజలకు ఇలా ప్రకటిస్తాడు: “యెహోవా చెప్పేదేమిటంటే, ‘మీరు నాకు సాక్షులు, నేను ఎన్నుకొన్న నా సేవకులు. మీరు నన్ను తెలుసుకొని నమ్మి, నేనే ఆయననని గ్రహించాలని నా ఉద్దేశం. నాకు మునుపు ఏ దేవుడూ రూపొందలేదు. నా తరువాత ఏ దేవుడూ ఉండడు. నేను, నేను మాత్రమే యెహోవాను. నేను తప్ప వేరే రక్షకుడు లేడు.’”​—యెషయా 43:​10, 11, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

యేసు భూమ్మీద జన్మించడానికి ముందు యెహోవా దేవునికి వేల సంవత్సరాలుగా సాక్షులు ఉన్నారు. హెబ్రీయులు 11వ అధ్యాయం అలాంటి విశ్వాస పురుషులను కొందరిని పేర్కొన్న తర్వాత, హెబ్రీయులు 12:1, 2 ఇలా చెబుతోంది: “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, . . . మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.” యేసు పొంతి పిలాతు ఎదుట ఇలా అన్నాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.” ఆయన “నమ్మకమైన సత్యసాక్షి” అని పిలువబడ్డాడు. (యోహాను 18:​37, 38; ప్రకటన 3:​14) యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: ‘పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.’​—అపొస్తలుల కార్యములు 1:8.

ఆ కారణంగానే క్రీస్తు యేసు పరిపాలించే యెహోవా రాజ్యం గురించిన సువార్తను, నేడు 235 దేశాల్లో చెబుతున్న 61,00,000 కంటే ఎక్కువమంది తమను తాము యెహోవాసాక్షులని చెప్పుకోవడం సరైనదేనని భావిస్తున్నారు.

[అధస్సూచి]

^ పేరా 5 ఈ బ్రోషుర్‌లో ప్రత్యేకంగా సూచించబడని లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి.

[4వ పేజీలోని బ్లర్బ్‌]

వారు దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయనకు సమర్పించుకున్నారు

[4వ పేజీలోని బ్లర్బ్‌]

వారు బైబిలును దేవుని వాక్యమని నమ్ముతారు

[5వ పేజీలోని బ్లర్బ్‌]

కోర్టు సన్నివేశంలో వారి పేరు వివరించబడింది

[5వ పేజీలోని బ్లర్బ్‌]

235 దేశాల్లో 61,00,000 కంటే ఎక్కువమంది సాక్షులు

[3వ పేజీలోని చిత్రం]

వారికి మీపై శ్రద్ధ ఉంది

[4వ పేజీలోని చిత్రం]

ప్రాచీన హీబ్రూ భాషలో దేవుని పేరు