కంటెంట్‌కు వెళ్లు

యెహోవా—ఆయన ఎవరు?

యెహోవా—ఆయన ఎవరు?

యెహోవా—ఆయన ఎవరు?

కంబోడియాలోని అడవిలో అడ్డువచ్చిన కొమ్మల్ని నరుక్కుంటూ ముందుకు సాగుతున్న 19వ శతాబ్దపు అన్వేషకుడైన హెన్రీ మూవో అనే ఫ్రాన్స్‌ దేశస్థుడు, ఒక ఆలయం చుట్టూ ఉన్న వెడల్పైన కందకాన్ని చేరుకున్నాడు. అది భూమిపైనున్న అతిపెద్ద మతసంబంధమైన కట్టడమైన ఆంకర్‌వాట్‌. నాచుపట్టివున్న ఆ కట్టడం మానవ నిర్మితమైనదేనని మూవో ఒక్క చూపులోనే చెప్పగల్గాడు. “ప్రాచీనకాలానికి చెందిన ఎవరో ఒక నిర్మాణకుడు నిర్మించిన ఆ కట్టడం, గ్రీకులు లేదా రోమన్లు నిర్మించిన ఏ కట్టడాలకన్నా కూడా ఎంతో పెద్ద కట్టడం” అని రాశాడాయన. ఆ అద్భుతమైన కట్టడం శతాబ్దాలపాటు ఆలనాపాలనలకు నోచుకోకుండా విడిచిపెట్టబడినప్పటికీ, దాని వెనుక ఒక రూపనిర్మాణకుడు ఉన్నాడన్న విషయంలో ఆయనకు ఇసుమంతైనా సందేహం కలుగలేదు.

“ప్రతి యల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే” అని తెలియజేస్తూ శతాబ్దాల క్రిందట రాయబడ్డ ఒక జ్ఞాన గ్రంథం అదే విధమైన తర్కాన్ని ఉపయోగించడం ఆసక్తికరమైన విషయం. (హెబ్రీయులు 3:3) కానీ, ‘ప్రకృతి పని చేసే విధానానికీ మానవ నిర్మిత కట్టడాలకూ తేడా ఉంది’ అని కొందరనవచ్చు. అయినప్పటికీ, ఆ అభ్యంతరాన్ని శాస్త్రవేత్తలందరూ ఒప్పుకోరు.

అమెరికాలోని పెన్సిల్వేనియానందున్న లెహై విశ్వవిద్యాలయంలో జీవరసాయనశాస్త్ర సహ అధ్యాపకుడైన మైఖేల్‌ బేహీ, “జీవ రసాయన వ్యవస్థలు నిర్జీవమైన వస్తువులుకావు” అని అంగీకరించిన తర్వాత, “సజీవ జీవరసాయన వ్యవస్థలను జ్ఞానవంతంగా రూపించవచ్చా?” అని అడుగుతున్నాడు. జన్యుకణ ఇంజనీరింగ్‌ వంటి పద్ధతుల ద్వారా శాస్త్రవేత్తలు ఇప్పుడు జీవుల్లో మౌలిక మార్పులను రూపనిర్మాణం (డిజైనింగ్‌) చేస్తున్నారని ఆయన తెలియజేస్తున్నాడు. అవును, సజీవమైనవాటినీ, నిర్జీవమైనవాటినీ ‘నిర్మించవచ్చు’! బేహీ, సూక్ష్మాతి సూక్ష్మమైన జీవ కణాల జగత్తును పరిశీలిస్తూ, పని చేయడానికి ఒకదానిపై మరొకటి ఆధారపడే కాంపోనెంట్లతో రూపొందించబడిన అద్భుతమైన సంకీర్ణ వ్యవస్థల గురించి చర్చిస్తున్నాడు. ఆయన ఏ ముగింపుకు వచ్చాడు? “జీవ కణాన్ని పరిశోధించడానికి, అంటే జీవాన్ని సూక్ష్మాణువు స్థాయిలో పరిశోధించడానికి చేసిన ఈ సమష్టి ప్రయత్నాల ఫలితం, [జీవకణమనేది] ‘రూపనిర్మాణ’ [ఉత్పాదనేనని] దృఢంగానూ, స్పష్టంగానూ ఎలుగెత్తి చాటుతోంది!”

అయితే, ఈ సంక్లిష్టమైన విధానాలన్నింటి వెనుకా ఉన్న రూపకర్త ఎవరు?

రూపకర్త ఎవరు?

ముందు ప్రస్తావించిన ప్రాచీన జ్ఞాన గ్రంథమైన బైబిల్లో దానికి జవాబు దొరుకుతుంది. సమస్తాన్ని ఎవరు రూపించారనే ప్రశ్నకు, ఎంతో సరళంగానూ, స్పష్టంగానూ బైబిలు దాని ప్రారంభ మాటల్లో ఇలా జవాబిస్తోంది: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.”—ఆదికాండము 1:1.

అయినా, దేవుళ్లని పిలువబడుతున్న ఇతరుల నుండి తననుతాను ప్రత్యేకంగా ఉంచుకోవడానికి, సృష్టికర్త తననుతాను ఎవరితోనూ సరిపోల్చలేని ఒక నామంతో గుర్తింపచేసుకుంటున్నాడు: “ఆకాశములను సృజించి . . . భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును . . . ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” (ఇటాలిక్కులు మావి.) (యెషయా 42:5) విశ్వాన్ని రూపించి, భూమిపైనున్న స్త్రీ పురుషులను సృష్టించిన దేవుని పేరు యెహోవా. అయితే యెహోవా ఎవరు? ఆయన ఎలాంటి దేవుడు? ఆయన చెప్పే వాటిని మీరు ఎందుకు వినాలి?

ఆయన పేరుకున్న విశిష్టత

అన్నింటికంటే ముందుగా, అసలు సృష్టికర్త పేరైన యెహోవా అంటే అర్థం ఏమిటి? హెబ్రీభాషలో దేవుని పేరు (יהוה) అనే నాలుగక్షరాల్లో రాయబడివుంది. బైబిలులో హెబ్రీ భాషలో రాసిన భాగమందు దాదాపు 7,000 సార్లు ఆ పేరు కనిపిస్తోంది. దాన్ని హెబ్రీ క్రియాపదమైన హవాకు ఉన్న (“అవుతాడు”) హేత్వర్థక (కాజుయేటివ్‌) రూపంగా పరిగణించేవారు. ఆ విధంగా ఆ పేరు “తానే కర్త అవుతాడు” అనే అర్థాన్నిస్తుంది. మరో మాటల్లో చెప్పాలంటే, తన సంకల్పాల్ని నెరవేర్చుకోవడానికి యెహోవా తాను ఏం అవ్వాల్సి ఉంటే అలా జ్ఞానయుక్తంగా అవుతాడని అర్థం. ఆయన తన వాగ్దానాలను నెరవేర్చేందుకు సృష్టికర్తగానూ, న్యాయాధిపతిగానూ, రక్షకునిగానూ, జీవపోషకునిగానూ అవుతాడు. అంతేగాక, ఆ హెబ్రీ క్రియాపదానికి నెరవేరే ప్రక్రియలో ఉన్న ఒక చర్యను సూచించే వ్యాకరణ రూపముంది. అది, యెహోవా తనకుగా తాను తన వాగ్దానాలను నెరవేర్చేవానిగా ఇప్పటికీ అవుతున్నాడని సూచిస్తోంది. అవును, ఆయన జీవంగల దేవుడు!

యెహోవా దేవుని మహోన్నత లక్షణాలు

సృష్టికర్తా, తాను చేసిన వాగ్దానాల్ని నెరవేర్చువాడూ అయిన యెహోవా దేవుడు ఎంతగానో ఆకట్టుకునే వ్యక్తియై ఉన్నాడని బైబిలు చూపిస్తోంది. యెహోవాయే స్వయంగా తనకున్న విశిష్టమైన లక్షణాలను బయల్పర్చుకున్నాడు, ఆయనిలా తెలియజేశాడు: “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా [“ప్రేమపూర్వక కనికరం,” NW] సత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును.” (నిర్గమకాండము 34:6, 7) ప్రేమపూర్వక కనికరంగల దేవునిగా యెహోవా వర్ణించబడ్డాడు. ఇక్కడ ఉపయోగించబడిన హెబ్రీ పదాన్ని “యథార్థతగల ప్రేమ” అని కూడా అనువదించవచ్చు. తన నిత్య సంకల్పాల్ని నెరవేర్చడంలో, తన ప్రాణులపట్ల ప్రేమను చూపించడంలో యెహోవా యథార్థంగా కొనసాగుతాడు. అలాంటి ప్రేమ అమూల్యమైనదని మీరు ఎంచరా?

యెహోవా ఊరకనే కోపపడువాడు కాడు, మనం చేసిన తప్పుల్ని వెంటనే క్షమించడానికి సంసిద్ధంగా ఉంటాడు. మనలో తప్పుల్ని వెదకక మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి సాన్నిద్ధ్యంలో ఉండడం ఉల్లాసవంతంగా ఉంటుంది. అయినప్పటికీ, ఆయన తప్పిదాన్ని చూసీ చూడనట్లు ఊరుకుంటాడని దాని భావం కాదు. ఆయనిలా ప్రకటించాడు: “న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము.” (యెషయా 61:8) న్యాయానికి దేవుడైన యెహోవా, చెడుపనులను అలాగే చేసుకుంటూపోయే సిగ్గులేని పాపాత్ములను ఎల్లకాలం సహిస్తూ ఉండే వాడుకాడు గనుక, ఆయన తన నియమిత సమయంలో లోకంలోని అన్యాయాలను అంతంచేస్తాడని మనం నిశ్చింతగా ఉండవచ్చు.

ప్రేమా న్యాయాల నడుమ పరిపూర్ణమైన సంయమనాన్ని పాటించడానికి జ్ఞానం అవసరం. మనతో వ్యవహరించేటప్పుడు యెహోవా, ఈ రెండు లక్షణాల్నీ అద్భుతమైన రీతిలో సమన్వయ పరుస్తున్నాడు. (రోమీయులు 11:33-36) నిజం చెప్పాలంటే, అంతటా ఆయన జ్ఞానం కనబడుతోంది. మన చుట్టూవున్న సృష్టి అద్భుతాలు ఆ విషయాన్ని రుజువుచేస్తున్నాయి.—కీర్తన 104:24; సామెతలు 3:19.

అయితే దానికి, జ్ఞానియై ఉండడం మాత్రమే సరిపోదు. ఆయన మనస్సులోనికి వచ్చే దాన్ని పూర్తిగా నెరవేర్చడానికి సృష్టికర్తకు శక్తి కూడా ఉండాలి. ఆయన శక్తిమంతుడైన దేవుడని బైబిలు బయల్పరుస్తోంది: “మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.” (యెషయా 40:26) తన ఆజ్ఞ చొప్పున తన చిత్తమంతటినీ నెరవేర్చడానికి కావాల్సిన “అధికశక్తి” యెహోవాకు ఉంది. అలాంటి లక్షణాలు ఆయనవైపుకు మిమ్మల్ని ఆకర్షించవా?

యెహోవా గురించి తెలుసుకోవడంలోగల ప్రయోజనాలు

యెహోవా భూమిని “నిరాకారముగానుండునట్లు . . . సృజింపలేదు” కానీ, తనతో అర్థవంతమైన సంబంధాన్ని కల్గివుండే మానవులకు “నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను” అని బైబిలు చెబుతుంది. (యెషయా 45:18; ఆదికాండము 1:28) ఆయన తన భూసంబంధమైన ప్రాణులపట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. ఉద్యానవనంలాంటి ఒక పరదైసులో ఆయన మానవజాతికి ఒక పరిపూర్ణమైన ప్రారంభాన్ని ఇచ్చాడు. మానవులు యెహోవాకు ఎంతో మనస్తాపాన్ని కలుగజేస్తూ భూమిని నాశనం చేస్తున్నారు. అయినప్పటికీ, యెహోవా తన పేరుకు తగ్గట్టుగా, మానవునిపట్లా భూమిపట్లా తనకుగల తన ఆది సంకల్పాన్ని నెరవేరుస్తాడు. (కీర్తన 115:16; ప్రకటన 11:18) తన పిల్లలుగా ఆయనకు విధేయత చూపించడానికి ఇష్టపడే వారి కోసం ఆయన భూమిపై ఉద్యానవనంలాంటి పరదైసును పునరుద్ధరిస్తాడు.—సామెతలు 8:17; మత్తయి 5:5.

ఆ పరదైసులో మీరు అనుభవించగల జీవితాన్ని గురించి బైబిల్లోని చివరి పుస్తకం ఇలా వర్ణిస్తోంది: “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె[ను].” (ప్రకటన 21:3, 4) మీరు అనుభవించాలని యెహోవా అభిలషిస్తున్న అసలైన జీవితం అదే. ఆయన ఎంతటి దయాళువైన తండ్రో కదా! ఆయన గురించీ, పరదైసులో జీవించడానికి మీరు చేరుకోవాల్సిన ప్రమాణాలను గురించీ ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా?

ప్రత్యేకంగా సూచించబడని లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఎత్తివ్రాయబడినవి, లేఖనము ఎత్తివ్రాయబడినచోట NW అని ఉంటే అది ఆధునిక ఆంగ్ల భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము నుండి అనువదించబడిందని సూచిస్తుంది.