కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

18వ పాఠం

విపత్తులు వచ్చినప్పుడు మా సహోదరులకు ఎలా సహాయం చేస్తాం?

విపత్తులు వచ్చినప్పుడు మా సహోదరులకు ఎలా సహాయం చేస్తాం?

డొమినికన్‌ రిపబ్లిక్‌

జపాన్‌

హయిటీ

విపత్తులు వచ్చినప్పుడు, యెహోవాసాక్షులమైన మేము కష్టాల్లో ఉన్న మా సహోదరుల కోసం వెంటనే సహాయక చర్యలు మొదలుపెడతాం. అలా ఒకరిపట్ల ఒకరికి నిజమైన ప్రేమ ఉందని చూపిస్తాం. (యోహాను 13:34, 35; 1 యోహాను 3:17, 18) మేము ఏయే విధాలుగా సహాయం చేస్తాం?

డబ్బును విరాళంగా ఇస్తాం. మొదటి శతాబ్దంలో యూదయలో పెద్ద కరువు వచ్చినప్పుడు, అంతియొకయలోని క్రైస్తవులు అక్కడి సహోదరులకు సహాయం చేయడానికి డబ్బు పంపించారు. (అపొస్తలుల కార్యాలు 11:27-30) అదేవిధంగా, ప్రపంచంలో ఎక్కడైనా మా సహోదరులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే, మేము స్థానిక సంఘం ద్వారా విరాళాలు పంపిస్తాం. ఆ డబ్బుతో, అత్యవసర పరిస్థితిలో ఉన్న మా సహోదరులకు కావాల్సిన వస్తువులు అందిస్తారు.—2 కొరింథీయులు 8:13-15.

అవసరమైన సహాయం అందిస్తాం. ఏదైనా ఒక ప్రాంతంలో విపత్తు వచ్చినప్పుడు, అక్కడి పెద్దలు తమ సంఘంలోని ప్రతీ ఒక్కరు సురక్షితంగా ఉన్నారో లేదో తెలుసుకుంటారు. వాళ్లకు ఆహారం, మంచినీళ్లు, బట్టలు, వసతి, వైద్య సహాయం అందించే పనిని బహుశా ఒక విపత్తు సహాయక కమిటీ చూసుకుంటుంది. రకరకాల పనులు వచ్చిన చాలామంది యెహోవాసాక్షులు సొంత ఖర్చులతో అక్కడికి వెళ్లి స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటారు, లేదా పాడైన ఇళ్లు, రాజ్యమందిరాలు బాగుచేస్తారు. మా సంస్థలో ఉన్న ఐక్యత వల్ల, కలిసికట్టుగా పనిచేయడంలో మాకున్న అనుభవం వల్ల విపత్తు సమయాల్లో వెంటనే సహాయం అందించగలుగుతాం. మేము “తోటి విశ్వాసులకు” మాత్రమే కాదు, సాధ్యమైనప్పుడు ఇతరులకు కూడా సహాయం చేస్తాం, వాళ్లు ఏ మతం వాళ్లయినా సరే.—గలతీయులు 6:10.

లేఖనాల ద్వారా ఓదారుస్తాం, భావోద్వేగంగా మద్దతిస్తాం. విపత్తు వచ్చినప్పుడు ఓదార్పు ఎంతో అవసరం. ఆ సమయాల్లో మేము, “ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే” యెహోవా దేవుని నుండి బలం పొందుతాం. (2 కొరింథీయులు 1:3, 4) కృంగిపోయిన వాళ్లతో బైబిలు వాగ్దానాల గురించి మాట్లాడతాం, వేదనకు కారణమయ్యే విపత్తులన్నిటినీ దేవుని రాజ్యం త్వరలోనే తీసేస్తుందని చెప్తాం.—ప్రకటన 21:4.

  • విపత్తులు వచ్చినప్పుడు యెహోవాసాక్షులు ఎందుకు వెంటనే సహాయం చేయగలుగుతారు?

  • విపత్తు బాధితుల్ని లేఖనాల ద్వారా ఎలా ఓదార్చవచ్చు?