కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1

“తప్పిపోయిన దానిని నేను వెదకుదును”

“తప్పిపోయిన దానిని నేను వెదకుదును”

గొర్రె కంగారుపడుతోంది. ఆ గొర్రె గడ్డిని మేస్తూ మేస్తూ అనుకోకుండా మంద నుండి తప్పిపోయింది. కాపరి గానీ, మిగతా గొర్రెలు గానీ దానికి అస్సలు కనిపించట్లేదు. ఒకవైపు చీకటి పడుతోంది, మరోవైపు క్రూర మృగాలు తిరిగే లోయలో తప్పిపోయి, దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉంది. దూరం నుండి బాగా తెలిసిన ఒక గొంతు దానికి వినిపించింది. ఆ గొంతు ఇంకెవరిదో కాదు, దాని కాపరిదే! గొర్రె కనిపించగానే ఆయన దానివైపు పరిగెత్తుకుంటూ వెళ్లి, దాన్ని ఎత్తుకుని ఒక బట్టను కప్పి ఇంటికి తీసుకెళ్తాడు.

యెహోవా చాలాసార్లు తనను తాను ఒక కాపరితో పోల్చుకున్నాడు. ఆయన వాక్యం ద్వారా “చెదరిపోయిన నా గొర్రెలను నేనే వెదకుతాను. నేను వాటి విషయమై జాగ్రత్త తీసుకుంటాను” అనే అభయాన్ని ఇస్తున్నాడు.—యెహెజ్కేలు 34:11, 12, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

‘నేను మేపు గొర్రెలు’

యెహోవా గొర్రెలు ఎవరు? ఎవరైతే ఆయనను ప్రేమించి, ఆయనను ఆరాధిస్తారో వాళ్లే యెహోవా గొర్రెలు. బైబిలు ఇలా చెప్తుంది: “ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము.” (కీర్తన 95:6, 7) గొర్రెలు కాపరి వెనక నడిచినట్లే, యెహోవా సేవకులు కూడా తమ కాపరిని వెంబడించడాన్ని ఇష్టపడతారు. అయితే, వాళ్లు కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తారు. దేవుని సేవకులు కొన్నిసార్లు ‘చెదరిపోయిన,’ ‘తప్పిపోయిన,’ ‘దారితప్పిన’ గొర్రెల్లాగే ఉంటారు. (యెహెజ్కేలు 34:12, 16; 1 పేతురు 2:25) ఒకవేళ ఎవరైనా అలా తప్పిపోతే, యెహోవా వాళ్లు తిరిగి వస్తారనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు.

ఇప్పటికీ యెహోవానే మీ కాపరి అని మీకనిపిస్తుందా? నేడు యెహోవా ఎలా ఓ కాపరిలా ఉన్నాడు? మూడు విధానాలు చూడండి:

ఆయన మనల్ని ఆధ్యాత్మికంగా పోషిస్తున్నాడు. “నేను మంచి మేతగలచోట వాటిని మేపెదను . . . అవి మంచి దొడ్డిలో పండుకొనును . . . బలమైన మేతగల స్థలమందు అవి మేయును” అని యెహోవా చెప్తున్నాడు. (యెహెజ్కేలు 34:14) మనకు సేదదీర్పును ఇచ్చే రకరకాల ఆధ్యాత్మిక ఆహారాన్ని సరైన సమయానికి ఇవ్వడంలో యెహోవా ఏనాడూ విఫలమవ్వలేదు. సహాయం కోసం మీరు ప్రార్థించినప్పుడు ఓ ఆర్టికల్‌, ప్రసంగం లేదా వీడియో ద్వారా యెహోవా జవాబు ఇవ్వడం మీకు గుర్తుందా? యెహోవా మీ మీద వ్యక్తిగతంగా శ్రద్ధ చూపిస్తున్నాడని అది చూపించడం లేదా?

ఆయన మనల్ని కాపాడతాడు, బలపరుస్తాడు. “తప్పిపోయిన దానిని నేను వెదకుదును . . . గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును” అని యెహోవా మాటిస్తున్నాడు. (యెహెజ్కేలు 34:16) బలహీనంగా ఉన్నవాళ్లను, సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నవాళ్లను యెహోవా బలపరుస్తాడు. ఆయన తన గొర్రెలకు కట్టుకడతాడు, గాయం మానేలా చేస్తాడు, ఒకవేళ ఆ గాయం తోటి విశ్వాసుల వల్ల కలిగిందే అయినా యెహోవా దాన్ని మాన్పుతాడు. దారితప్పిన వాళ్లను, ప్రతికూల ఆలోచనలతో సతమతమౌతున్న వాళ్లను తిరిగి తెస్తాడు.

మన విషయంలో బాధ్యత తీసుకుంటాడు. “ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి . . . తప్పిపోయిన దానిని నేను వెదకుదును” అని యెహోవా చెప్తున్నాడు. (యెహెజ్కేలు 34:12, 16) తప్పిపోయిన గొర్రె ఇక మళ్లీ ఎప్పటికీ రాదు అని యెహోవా అనుకోడు. ఒక గొర్రె తప్పిపోతే ఆయనకు తెలుస్తుంది, ఆయన దాని కోసం వెదుకుతాడు, అది దొరికినప్పుడు చాలా సంతోషిస్తాడు. (మత్తయి 18:11-14) అందుకే, యెహోవా తన సత్యారాధకులను ‘నా గొర్రెలు,’ ‘నేను మేపు గొర్రెలు’ అంటున్నాడు. (యెహెజ్కేలు 34:31) మీరూ ఆ గొర్రెల్లో ఒకరు.

తప్పిపోయిన గొర్రె ఇక మళ్లీ ఎప్పటికీ రాదని యెహోవా అనుకోడు. ఆ గొర్రె దొరికినప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు

“మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము”

యెహోవా మీకోసం ఎందుకు వెదుకుతున్నాడు? ఎందుకు మిమ్మల్ని తిరిగి రమ్మంటున్నాడు? ఎందుకంటే మీరు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. తన గొర్రెలపై ‘దీవెన వర్షములు కురిపిస్తాను’ అని మాటిస్తున్నాడు. (యెహెజ్కేలు 34:26) అది కేవలం వట్టిమాట కాదు. అది మీ జీవితంలో నిజమవ్వడం మీరిప్పటికే కళ్లారా చూశారు.

యెహోవా గురించి నేర్చుకున్నప్పుడు మీకెలా అనిపించిందో ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి. ఉదాహరణకు దేవుని పేరు, ఆయన మనుషుల్ని ఎందుకు సృష్టించాడు లాంటి సత్యాలు మొట్టమొదటిసారి తెలుసుకున్నప్పుడు మీకెలా అనిపించింది? సమావేశాల్లో తోటి క్రైస్తవులతో కలిసి ఉండడం ఎంత ఆహ్లాదంగా ఉండేదో మీకు గుర్తుందా? ఆసక్తి చూపించిన వాళ్లకు సువార్త చెప్పినప్పుడు సంతోషంగా, సంతృప్తిగా ఇంటికి తిరిగి రావడం మీకు గుర్తుందా?

మీరు ఆ సంతోషాలన్నీ మళ్లీ సంపాదించుకోవచ్చు. “యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము” అని దేవుని సేవకులు ప్రార్థించారు. (విలాపవాక్యములు 5:21) యెహోవా వాళ్ల ప్రార్థనలకు జవాబిచ్చాడు, వాళ్లు మళ్లీ కొత్త ఉత్సాహంతో ఆయన్ను సేవించారు. (నెహెమ్యా 8:17) యెహోవా మీకూ అలాగే సహాయం చేస్తాడు.

అయినా, యెహోవా దగ్గరకు తిరిగి రావడం అంత తేలికేమీ కాదు. తిరిగి రావడం కష్టమనిపించే కొన్ని సందర్భాలను పరిశీలించి, వాటిని ఎలా అధిగమించవచ్చో తెలుసుకోండి.