5
“మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన” దేవుని దగ్గరకు తిరిగి రండి
ఈ బ్రోషుర్‌లో చర్చించిన కొన్ని సమస్యలను మీరూ ఎదుర్కొన్నారా? అయితే మీలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. బైబిలు కాలాల్లో ఉన్న దేవుని సేవకులు, మన కాలంలోని దేవుని సేవకులు చాలామంది అలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నారు. యెహోవా ఆ సమస్యల నుండి బయటపడడానికి వాళ్లకు సహాయం చేసినట్లే మీకూ సహాయం చేస్తాడు.
మీరు ఆయన దగ్గరకు తిరిగి వస్తున్నప్పుడు, యెహోవా మీకోసం ఎదురుచూస్తూ ఉంటాడని గుర్తుంచుకోండి
యెహోవా దగ్గరకు తిరిగి రావడమే మీరు చేయగల అత్యంత మంచి పని. ఎందుకంటే, అలా చేయడం వల్ల మీరు యెహోవా హృదయాన్ని సంతోషపెడతారు. (సామెతలు 27:11) యెహోవాకు మనలాంటి భావాలే ఉన్నాయనే విషయం మీకు తెలుసు, మనం చేసే పనులను బట్టి ఆయన నొచ్చుకుంటాడు లేదా సంతోషిస్తాడు. యెహోవా తనను ప్రేమించమని, సేవించమని మనల్ని బలవంతం చేయడు. (ద్వితీయోపదేశకాండము 30:19, 20) ఒక బైబిలు విద్వాంసుడు ఇలా అంటున్నాడు: “మీ హృదయాన్ని ఎవ్వరూ తెరవలేరు దాన్ని కేవలం మీరే తెరవగలరు.” ప్రేమతో నిండిన హృదయంతో యెహోవాను ఆరాధిస్తే మనం మన హృదయాన్ని తెరవవచ్చు. అలా చేస్తే మనం దేవునికి యథార్థత అనే అత్యంత గొప్ప బహుమానాన్ని ఇస్తాం, ఆయన హృదయాన్ని ఎంతగానో సంతోషపెడతాం. యెహోవాకు చెందాల్సిన ఆరాధనను ఆయనకు ఇచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని దేనితోనూ పోల్చలేం.—అపొస్తలుల కార్యములు 20:35; ప్రకటన 4:10, 11.
అంతేకాదు, మీరు మళ్లీ దేవున్ని ఆరాధించడం మొదలుపెడితే మీ ఆధ్యాత్మిక అవసరాలు తీరుతాయి. (మత్తయి 5:3) ఎలా? మన చుట్టూ ఉన్న ప్రజలు, ‘మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం?’ అనేది తెలియక తికమకపడుతున్నారు. జీవిత సంకల్పానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు తెలియక సతమతమౌతున్నారు. ఎందుకంటే, యెహోవా మనల్ని సృష్టించినప్పుడే అలాంటి ఆలోచనలను మనలో పెట్టాడు. మనం ఆయనను సేవించడంలో పూర్తి ఆనందాన్ని పొందేలా మనల్ని తయారు చేశాడు. యెహోవాను ప్రేమతో సేవించడం వల్ల కలిగే ఆనందం దేనికీ సాటిరాదు.—కీర్తన 63:1-5.
మీరు తన దగ్గరకు తిరిగి రావాలని యెహోవా కోరుకుంటున్నాడని తెలుసుకోండి. మీరు దాన్నెలా నమ్మవచ్చు? మేము ఈ బ్రోషుర్‌ని చాలా జాగ్రత్తగా ఎంతో ప్రార్థించిన తర్వాత తయారుచేశాం. ఈ బ్రోషుర్‌ని మీకు బహుశా ఒక సంఘపెద్ద లేదా తోటి విశ్వాసి ఇచ్చివుంటారు. తర్వాత మీరు దీన్ని చదివి చలించిపోయారు. ఇదంతా యెహోవా మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదనడానికి రుజువు కాదా? యెహోవా ప్రేమగా మిమ్మల్ని తన దగ్గరకు తెచ్చుకోవాలనుకుంటున్నాడు.—యోహాను 6:44.
తనను విడిచి వెళ్లిన సేవకులను యెహోవా ఎన్నడూ మర్చిపోడని తెలుసుకోవడం మీకు ఓదార్పుగా ఉండవచ్చు. డొన్న అనే సహోదరి ఆ విషయాన్ని అర్థంచేసుకుని ఇలా అంది: “నేను మెల్లమెల్లగా సత్యం నుండి తప్పిపోయాను, కానీ నేను తరచూ కీర్తన 139:23, 24 వచనాలను గుర్తుచేసుకునేదాన్ని, అక్కడ ఇలా ఉంది: ‘దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.’ నేను ఈ లోకానికి చెందినదాన్ని కాదు, ఈ లోకంలో ఇమడలేను, నేను ఎప్పటికైనా వెళ్లాల్సింది యెహోవా సంస్థ దగ్గరకే అని నాకు తెలుసు. యెహోవా నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదని, నేను ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లాలని అర్థంచేసుకున్నాను. ఆయన దగ్గరకు వచ్చినందుకు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది!”
“యెహోవా నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదని, నేను ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లాలని అర్థంచేసుకున్నాను”
మీరు కూడా మళ్లీ ‘యెహోవాయందు ఆనందించాలని’ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. (నెహెమ్యా 8:10) యెహోవా దగ్గరకు తిరిగి వచ్చినందుకు మీరు ఎన్నడూ బాధపడరు.