కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4

అపరాధ భావాలు—“నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము”

అపరాధ భావాలు—“నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము”

“నా కొత్త ఉద్యోగం వల్ల మా కుటుంబ జీవితం ఆర్థికంగా చాలా మెరుగైంది, కానీ చేయకూడని చాలా పనులు ఆ ఉద్యోగం నాతో చేయించింది. సెలవుదినాలు-పండుగలు జరుపుకోవడం, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం, చివరికి చర్చీకి వెళ్లడం కూడా చేశాను. నేను యెహోవాసాక్షినే, కానీ 40 సంవత్సరాలుగా సంఘంతో సహవసించడం లేదు. కాలం గడుస్తున్న కొద్దీ నేను ఇక యెహోవా క్షమాపణకు అర్హురాలిని కాను అనుకున్నాను. తప్పు చేశాననే వేదనలో మునిగిపోయాను. ఎందుకంటే, తప్పుడు దారిలోకి వెళ్లడానికి ముందే నాకు సత్యం తెలుసు.”—మార్త.

తప్పు చేశామనే బాధ మనిషిని చాలా కృంగదీస్తుంది. “నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి” అని దావీదు రాజు అన్నాడు. (కీర్తన 38:4) యెహోవా వాళ్లను ఎప్పటికీ క్షమించడు అనుకొని కొంతమంది క్రైస్తవులు తీవ్రమైన బాధలో మునిగిపోయారు. (2 కొరింథీయులు 2:7) అలా అనుకోవడం సరైనదేనా? మీరు ఘోరమైన తప్పు చేసినంత మాత్రాన, మీరు ఇక ఎప్పటికీ క్షమాపణ పొందలేనంతగా యెహోవాకు దూరమైనట్టేనా? ఎంత మాత్రం కాదు, మీరు ఆయనకు మళ్లీ దగ్గరవ్వవచ్చు!

“రండి మన వివాదము తీర్చుకొందము”

పశ్చాత్తాపపడిన వాళ్లకు యెహోవా తన చేయి అందిస్తాడు, ఆయన వాళ్లను విడిచిపెట్టడు. తప్పిపోయిన కుమారుని ఉపమానంలో, యేసు యెహోవాను ప్రేమగల తండ్రిగా వర్ణించాడు. ఆ ఉపమానంలో కుమారుడు తండ్రిని, కుటుంబాన్ని వదిలేసి వేశ్యలతో దిగజారిన జీవితం గడిపాడు. కొంతకాలానికి తండ్రి దగ్గరకు తిరిగి రావాలని అనుకున్నాడు. “వాడింక [ఆ కుమారుడు] దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.” (లూకా 15:11-20) యెహోవాకు దగ్గరవ్వాలని కోరుకుంటున్నా, ఆయనకు “దూరముగా” ఉన్నట్లు మీకనిపిస్తుందా? యేసు ఉపమానంలోని తండ్రిలానే మీ పట్ల ప్రేమ, కనికరంతో మిమ్మల్ని తిరిగి ఆహ్వానించడానికి యెహోవా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు.

ఒకవేళ మీరు చేసిన తప్పులు యెహోవా క్షమాపణ పొందలేనంత పెద్దవి అనుకుంటున్నారా? యెషయా 1:18లో యెహోవా ఇస్తున్న ఈ ఆహ్వానం గురించి దయచేసి ఆలోచించండి: “రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును.” తెల్ల దుస్తుల మీద రక్తం మరకల్లా మీ పాపాలు ఎంత కడిగినా పోవు అని మీకనిపించినా యెహోవా మిమ్మల్ని క్షమిస్తాడు.

మీరు ఎప్పటికీ తప్పు చేశామనే బాధలోనే ఉండిపోవాలని యెహోవా కోరుకోవట్లేదు. అయితే, దేవుడు మిమ్మల్ని క్షమించినప్పుడు వచ్చే ప్రశాంతతను, మంచి మనస్సాక్షిని మీరు ఎలా పొందవచ్చు? దావీదు రాజు చేసిన రెండు పనులను పరిశీలించండి. మొదట ఆయన, “యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని” అన్నాడు (కీర్తన 32:5) ప్రార్థనలో తనను సమీపించి, తనతో ‘వివాదము తీర్చుకోమని’ యెహోవా ఇప్పటికే మిమ్మల్ని ఆహ్వానించాడు అని మర్చిపోకండి. ఆ ఆహ్వానాన్ని తీసుకుని మీ పాపాల్ని యెహోవా దగ్గర ఒప్పుకోండి, దావీదులాగే మీ భావాల్ని ఆయనతో పంచుకోండి. తన సొంత అనుభవం నుండి దావీదు ధైర్యంగా ఇలా చెప్తున్నాడు: “నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము . . . విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.”—కీర్తన 51:2, 17.

రెండవదిగా దావీదు, దేవుడు నియమించిన ప్రతినిధి అయిన నాతాను ప్రవక్త సహాయం తీసుకున్నాడు. (2 సమూయేలు 12:13) పశ్చాత్తాపపడిన పాపులు, మళ్లీ తనకు దగ్గరయ్యేలా సహాయం చేయడానికి యెహోవా నేడు సంఘ పెద్దలను ఇచ్చి వాళ్లకు ఆ పనిలో శిక్షణ కూడా ఇచ్చాడు. మీరు పెద్దల దగ్గరకు వెళ్లినప్పుడు, వాళ్లు లేఖనాలను ఉపయోగించి, హృదయపూర్వక ప్రార్థనలు చేసి మీ హృదయాన్ని నిమ్మళపరుస్తారు, మీలో ప్రతికూల భావాల్ని తగ్గిస్తారు లేదా పోగొడతారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బాగుచేస్తారు.—యాకోబు 5:14-16.

స్వచ్ఛమైన మనస్సాక్షి వల్ల వచ్చే మనశ్శాంతిని యెహోవా మీకు ఇవ్వాలనుకుంటున్నాడు

“తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు”

నిజమే, చేసిన పాపాలను యెహోవా దగ్గర ఒప్పుకోవడం, సంఘ పెద్దల సహాయం తీసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. దావీదుకు కూడా అలానే అనిపించింది. చేసిన పాపాల వల్ల ఆయన కొంతకాలం ‘మౌనంగా’ ఉన్నాడు. (కీర్తన 32:3) అయితే పాపాల్ని ఒప్పుకుని, తప్పు దిద్దుకోవడం ఎంత మేలు చేస్తుందో ఆ తర్వాత గ్రహించాడు.

దావీదు పొందిన పెద్ద మేలు ఏంటంటే, సంతోషాన్ని మళ్లీ సొంతం చేసుకోవడం. “తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు” అని దావీదు రాశాడు. (కీర్తన 32:1) “ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము” అని కూడా ప్రార్థించాడు. (కీర్తన 51:15) తప్పు చేశాననే బాధ దావీదుకు తొలగిపోయింది. క్షమించినందుకు యెహోవా మీద కృతజ్ఞతతో ఉత్సాహంగా దేవుని గురించి ఇతరులకు చెప్పాడు.

స్వచ్ఛమైన మనస్సాక్షి వల్ల కలిగే ఊరటను యెహోవా మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు తప్పు చేశామనే బాధతో కాదుగానీ పూర్ణ ఆనందంతో, కృతజ్ఞతతో ఇతరులకు ఆయన గురించి, ఆయన సంకల్పాల గురించి చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. (కీర్తన 65:1-4) “ప్రభువు సముఖమునుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును . . . మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సునొంది తిరుగుడి” అని యెహోవా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడని ఎప్పుడూ మర్చిపోకండి.—అపొస్తలుల కార్యములు 3:19, 20.

మార్త విషయంలో అలానే జరిగింది. ఆమె ఇలా చెప్తుంది: “మా అబ్బాయి కావలికోట, తేజరిల్లు! పత్రికలను నాకు పంపిస్తూ ఉండేవాడు. మెల్లమెల్లగా నేను యెహోవాతో అనుబంధం పెంచుకున్నాను. తిరిగి రావడంలో నాకు బాగా కష్టమనిపించింది ఏంటంటే, నేను చేసిన తప్పులన్నింటికీ క్షమాపణ అడగడం. అయితే, చివరికి యెహోవాకు ప్రార్థన చేసి నన్ను క్షమించమని వేడుకున్నాను. నేను యెహోవా దగ్గరకు తిరిగి రావడానికి 40 సంవత్సరాలు పట్టిందంటే నమ్మలేకపోతున్నాను. ఎన్నో ఏళ్లు గడిచిన తర్వాత కూడా, ఒక వ్యక్తి యెహోవాను మళ్లీ ఆరాధించే అవకాశం పొందవచ్చు, మళ్లీ ఆయన ప్రేమలో నిలిచివుండవచ్చు అనడానికి నా జీవితమే ఒక ఉదాహరణ.”