కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3

మనసుకు తగిలిన గాయాలు—‘ఎవరైనా మీకు హాని చేసినప్పుడు’

మనసుకు తగిలిన గాయాలు—‘ఎవరైనా మీకు హాని చేసినప్పుడు’

“నేను తన డబ్బు దొంగతనం చేశానని మా సంఘంలో ఓ సహోదరి నన్ను నిందించింది. సంఘంలో మిగతావాళ్లకు ఆ విషయం తెలిసి, అందరూ అదే నిజమని నమ్మారు. కొంతకాలానికి ఆ సహోదరి వచ్చి ఆ డబ్బు తీసింది నేను కాదని చెప్పి క్షమాపణ అడిగింది. నేను అనుభవించిన ఆ మనోవేదనను బట్టి జీవితంలో తనను క్షమించకూడదు అనుకున్నాను.”—లిండా.

తోటి క్రైస్తవులు చేసిన పనుల వల్ల మీకూ ఎప్పుడైనా లిండాలానే అనిపించిందా? విచారకరమైన విషయం ఏంటంటే, కొంతమంది ఇతరుల పనులనుబట్టి ఎంతగా కలతచెందారంటే తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తిగా మానుకున్నారు. మీ విషయంలోనూ అలానే జరిగిందా?

‘దేవుని ప్రేమ నుండి మనల్ని’ ఎవరైనా దూరం చేయగలరా?

మన తోటి క్రైస్తవులు మనల్ని నొప్పించినప్పుడు వాళ్లను క్షమించడం చాలా కష్టంగా ఉంటుందనేది నిజమే. అయినప్పటికీ, క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. (యోహాను 13:34, 35) మన తోటి విశ్వాసి ఎవరైనా మన విషయంలో తప్పు చేస్తే ఆ వేదనను, నిరుత్సాహాన్ని అస్సలు భరించలేం.—కీర్తన 55:12.

క్రైస్తవులు ఒకరినొకరు నొప్పించుకునే సందర్భాలు కూడా ఉంటాయని బైబిలు చెబుతుంది. (కొలొస్సయులు 3:13) అయితే ఆ పరిస్థితి మనకే వస్తే, తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మరి దాన్ని తట్టుకోవడానికి మనకు సహాయం ఎక్కడ దొరుకుతుంది? మూడు బైబిలు సూత్రాలను పరిశీలించండి:

మన పరలోక తండ్రి అన్నీ చూస్తున్నాడు. మనకు జరిగే ప్రతీది యెహోవా గమనిస్తున్నాడు, మనం ఎదుర్కొనే అన్యాయాల్ని, దానివల్ల కలిగే బాధను ఆయన చూస్తున్నాడు. (హెబ్రీయులు 4:13) అంతేకాదు, మన బాధను చూసి యెహోవా కూడా బాధపడతాడు. (యెషయా 63:9) ‘శ్రమలు, బాధలు,’ చివరికి తోటి క్రైస్తవులు చేసే గాయాలు ఏవైనాసరే, వాటివల్ల మనం ‘దేవుని ప్రేమ నుండి’ దూరం కాకుండా యెహోవా చూసుకుంటాడు. (రోమీయులు 8:35, 38, 39) అలాగే మనం కూడా దేనివల్ల లేదా ఎవరివల్ల యెహోవా నుండి దూరం కాకుండా చూసుకోవాలి.

క్షమించడం అంటే తప్పును చూసీచూడనట్లు ఉండడం కాదు. మనపట్ల తప్పుచేసిన వారిని క్షమించామంటే, మనం వాళ్లు చేసిన తప్పును చూసీ చూడనట్లు వదిలేసినట్లు కాదు, లేక వాళ్లు చేసింది చాలా చిన్న తప్పు అన్నట్లు లేక ఫర్లేదు సరైనదే చేశారని అన్నట్లు కాదు. యెహోవా పాపాన్ని ఎన్నడూ ఆమోదించడని గుర్తుంచుకోండి, అయితే సరైన కారణం ఉంటే ఆయన క్షమిస్తాడు. (కీర్తన 103:12, 13; హబక్కూకు 1:13) ఇతరులను క్షమించమని యెహోవా చెప్తున్నప్పుడు, ఆయన మనల్ని తన మార్గంలో నడవమని ప్రోత్సహిస్తున్నాడు. “ఆయన నిత్యము కోపించువాడు కాడు.”—కీర్తన 103:9; మత్తయి 6:14.

కోపాన్ని మనసులో పెట్టుకోకపోవడం మనకే మంచిది. ఎలా? ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. మీరు దాదాపు ఒకటి రెండు కిలోల బరువున్న రాయిని చేతితో ఎత్తి పట్టుకున్నారు అనుకోండి. కొద్దిసేపు వరకు ఆ రాయిని పట్టుకోవడం మీకు సులువుగానే ఉంటుంది. అయితే ఇంకాస్త ఎక్కువసేపు పట్టుకుంటే అప్పుడేంటి? దాన్ని ఎంతసేపు పట్టుకోగలరు? కొన్ని నిమిషాలా? ఒక గంటా? ఇంకా ఎక్కువసేపా? కొద్దిసేపటికి మీ చెయ్యి ఆ బరువును మోయలేకపోతుంది. అయితే రాయి బరువేమీ మారలేదు కానీ, సమయం గడుస్తున్న కొద్దీ బరువు పెరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. కోపాన్ని మనసులో పెట్టుకోవడం కూడా అలాంటిదే. కారణం ఎలాంటిదైనా, కోపాన్ని ఎంత ఎక్కువ కాలం మనసులో పెట్టుకుంటే దాని బరువు అంత ఎక్కువ పెరుగుతుంది. అందుకే యెహోవా కోపాన్ని తీసేసుకోమంటున్నాడు. అవును, క్షమించడం మనకే మంచిది.—సామెతలు 11:17.

కోపాన్ని మనసులో పెట్టుకోకపోవడం మనకే మంచిది

“స్వయంగా యెహోవానే నాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది”

తోటి క్రైస్తవురాలు చేసినదాన్ని మనసులో పెట్టుకోకుండా ఉండడానికి లిండాకు ఏది సహాయం చేసింది? ఆమె ముఖ్యంగా, క్షమించమని బైబిలు ఎందుకు చెప్తుందో ఆలోచించింది. (కీర్తన 130:3, 4) మనం ఇతరులను క్షమించినప్పుడు యెహోవా కూడా మనల్ని క్షమిస్తాడనే విషయాన్ని తెలుసుకోవడం లిండా మనసుపై ఎంతో ప్రభావం చూపించింది. (ఎఫెసీయులు 4:32–5:2) “స్వయంగా యెహోవానే నాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది” అని ఆమె చెప్పింది.

కొంతకాలానికి లిండా తన మనసులో ఉన్న కోపాన్ని, బాధను తీసేసుకుంది. ఆమె ఆ సహోదరిని క్షమించింది, ఇప్పుడు ఆ సహోదరి లిండాకి మంచి స్నేహితురాలు. లిండా యెహోవా సేవను మళ్లీ సంతోషంగా చేస్తుంది. మీ సేవను కొనసాగించేందుకు యెహోవా మీకు కూడా సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండండి.