కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

13వ అధ్యాయం

‘అన్యజనులకు ఈ సమాచారం ప్రకటించండి’

‘అన్యజనులకు ఈ సమాచారం ప్రకటించండి’

సింహ గర్జన విన్నప్పుడు మీరు ఎలా స్పందిస్తారు?

1. యెహోవా తన ప్రవక్తతో మాట్లాడడాన్ని సింహ గర్జనతో ఎందుకు పోల్చవచ్చు?

 మీరు ఎప్పుడైనా సింహ గర్జన విన్నారా? అది భీకరంగా ఉంటుంది. ఆ శబ్దం ఎనిమిది కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వరకు వినబడుతుంది. నిశ్శబ్దంగా ఉన్న ఓ రాత్రి సింహ గర్జన మీకు వినబడితే మీరేం చేస్తారు? వెంటనే మీరు ఏదోకటి చేస్తారు. ఆ 12 మంది ప్రవక్తల్లో ఒకరైన ఆమోసు ఈ పోలికను వాడాడు: “సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు?” (ఆమోసు 3:3-8) ఏకంగా యెహోవా స్వరమే మీకు వినిపిస్తే మీరు కూడా ఆమోసులా స్పందించరా? ఆమోసు వెంటనే స్పందించాడు, పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యం మీద దేవుని తీర్పు సందేశాలను ప్రవచించాడు.

2. (ఎ) ప్రవచించే బాధ్యతను నిర్వర్తించే విషయంలో మీరు ఆమోసును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు? (బి) ఈ అధ్యాయంలో మనం ఏమి పరిశీలిస్తాం?

2 ‘నేను ప్రవక్తను కాదు కదా?’ అని మీకు అనిపించవచ్చు. ప్రవక్తగా శిక్షణ పొందలేదు కాబట్టి ప్రవచించే అర్హత లేదని మీరు అనుకుంటుండవచ్చు. అయితే ఒకసారి ఆమోసు ప్రవక్తను గుర్తుచేసుకోండి. దూడ ఆరాధనకు యాజకుడైన అమజ్యా ఎదురుపడినప్పుడు ఆమోసు అతనితో ఇలా అన్నాడు: “నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్తయొక్క శిష్యుడనైనను కాను, కాని పసులకాపరినై మేడిపండ్లు ఏరుకొనువాడను.” (ఆమోసు 7:14) ఆయన నేపథ్యం గొప్పదేమీ కాకపోయినా యెహోవా ప్రవక్తగా సేవచేయడానికి మనస్ఫూర్తిగా ముందుకొచ్చాడు. మరి మీ విషయమేమిటి? ఒక విధంగా, ఆ 12 మంది ప్రవక్తలకు ఇచ్చినటువంటి నియామకాన్నే దేవుడు మీకూ ఇచ్చాడని మీరు గ్రహించారా? నేటి ప్రజలకు దేవుడు ఇస్తున్న సందేశాన్ని మీరు ప్రకటించాలి, బోధించాలి, వాళ్లను శిష్యులుగా తయారుచేయాలి. మీరు ఆ ముఖ్యమైన నియామకాన్ని ఎలా ఎంచుతున్నారు? ఇంతకీ మీరు ప్రజలకు ప్రకటించాల్సిన సందేశం ఏమిటి? ఆ నియామకాన్ని మీరు ఎంత బాగా నిర్వర్తిస్తున్నారు? మీ పని సఫలమైందని దేన్నిబట్టి చెప్పవచ్చు? ఇప్పుడు వీటికి జవాబులు చూద్దాం.

‘మీ పెదవులను అర్పించండి’

3. ఒకవిధంగా మనం ఆ 12 మంది ప్రవక్తలు చేసిన పనే చేస్తున్నామని ఎలా చెప్పవచ్చు?

3 మీరు నిజంగా ప్రవక్తలు చేసిన పనే చేస్తున్నారా? మీరు బహుశా సింహగర్జన విని ఉండకపోవచ్చు అంటే, యెహోవా మీతో నేరుగా మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ, త్వరలో రానున్న యెహోవా దినానికి సంబంధించిన అత్యవసరమైన సందేశాన్ని మీరు ఆయన వాక్యమైన బైబిలు ద్వారా విన్నారు. ఈ పుస్తకం మొదటి అధ్యాయంలో చూసినట్టు “ప్రవక్త,” “ప్రవచనాలు” అనే పదాలకు నానార్థాలున్నాయి. మీరు ఆమోసు, మరితర ప్రాచీన ప్రవక్తల్లాంటి వాళ్లు కాకపోయినా మీరూ భవిష్యత్తు గురించి ప్రకటించవచ్చు. ఎలా? ఆ 12 పుస్తకాలతో సహా పరిశుద్ధ లేఖనాలన్నిటిలో మీరు అధ్యయనం చేసిన ప్రవచనాత్మక సందేశాల్ని మీరు ప్రకటించవచ్చు. దానికిదే సరైన సమయం.

20వ శతాబ్దం తొలినాళ్ల నుండి ఈనాటి వరకు దేవుని ప్రజలు ‘ప్రవచిస్తూనే’ ఉన్నారు

4. యోవేలు 2:28-32 లోని ప్రవచనం నేడు ఏవిధంగా నెరవేరుతోంది?

4 ఇప్పుడు ఆ విషయాన్ని మరో కోణంలో చూద్దాం. అన్ని జాతుల ప్రజలు ప్రవచించే సమయం గురించి చెబుతూ యెహోవా దేవుడు యోవేలు ప్రవక్తతో ఇలా అన్నాడు: “తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.” (యోవేలు 2:28-32) ఈ ప్రవచనాన్ని అపొస్తలుడైన పేతురు సా.శ. 33 పెంతెకొస్తు రోజున జరిగిన సంఘటనతో ముడిపెట్టాడు. ఆ రోజు యెరూషలేము మేడగదిలో సమకూడిన వాళ్లమీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది, ఫలితంగా వాళ్లు ‘దేవుని మహాత్కార్యాల’ గురించి ప్రకటించడం మొదలుపెట్టారు. (అపొస్తలుల కార్యములు 1:12-14; 2:1-4, 11, 14-21) ఇప్పుడు మన కాలానికి వద్దాం. 20వ శతాబ్దం తొలినాళ్ల నుండి యోవేలు ప్రవచనం విస్తృతంగా నెరవేరుతోంది. అభిషిక్త క్రైస్తవులైన పురుషులు, స్త్రీలు, వృద్ధులు, యౌవనులు అందరూ ‘ప్రవచించడం’ మొదలుపెట్టారు అంటే, ‘దేవుని మహాత్కార్యాలను’ ప్రకటించడం మొదలుపెట్టారు. ఆ సందేశంలో, ఇప్పటికే పరలోకంలో స్థాపితమైన దేవుని రాజ్యానికి సంబంధించిన సువార్త కూడా ఉంది.

5. (ఎ) మనందరికీ ఏ విశేషమైన అవకాశం ఉంది? (బి) ‘పెదవులను అర్పించడం’ అంటే ఏమిటి? అది ఎందుకు ఓ విశేషమైన అవకాశం?

5 ‘వేరే గొఱ్ఱెలకు’ చెందిన “గొప్పసమూహము” దేవుని కుమారులుగా ఉండేందుకు పరిశుద్ధాత్మతో అభిషేకించబడకపోయినా, వాళ్లు యేసుక్రీస్తు అభిషిక్త అనుచరులతో ఇలా అంటున్నారు: “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.” (ప్రకటన 7:9; యోహాను 10:16; జెకర్యా 8:23) మీకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా ‘మీ పెదవులను అర్పించే’ విశేషమైన అవకాశం మీకుంది. (హోషేయ 14:2) హోషేయ ప్రవచనంలోని ఆ మాటకు అర్థమేమిటి? హోషేయ 14:2⁠లోని మాటలను మనసులో ఉంచుకొని పౌలు ఇలా రాశాడు: “ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.” (హెబ్రీయులు 13:15) అవును, హోషేయ ప్రవచనంలోని మాట, మన పెదవులతో అత్యంత శ్రేష్ఠమైనది అర్పించడాన్ని అంటే మన మాటలతో యెహోవాను స్తుతించడాన్ని సూచిస్తోంది.

6. మన ‘స్తుతియాగాలు’ ఎలా ఉన్నాయో ఎందుకు పరిశీలించుకోవాలి?

6 యెహోవా ముందు మీ హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు, క్రైస్తవ కూటాల్లో ఆయన మీద మీ కృతజ్ఞత వ్యక్తమయ్యే వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు, బహిరంగ పరిచర్యలో ఉత్సాహంగా ఇతరులతో ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఆయనకు ‘స్తుతియాగాలు’ చేస్తారు. అయితే మనలో ప్రతీ ఒక్కరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఆ సందర్భాల్లో నా అర్పణలు ఎలా ఉంటున్నాయి?’ మలాకీ కాలంలో దేవుని బలిపీఠం దగ్గరకు సిగ్గులేకుండా లోపమున్న జంతువులను తీసుకువచ్చిన యాజకుల గురించి చదివినప్పుడు వాళ్ల మీద మీకు అసహ్యం పుట్టివుంటుంది. యెహోవా బల్లను అగౌరవపరుస్తున్నామని వాళ్లకు ఏ కోశానా అనిపించలేదు. అందుకే వాళ్ల అర్పణలు హీనమైనవని యెహోవా మలాకీ ద్వారా వాళ్ల దృష్టికి తీసుకురావాల్సి వచ్చింది. (మలాకీ 1:8) లోపంలేని వాటిని, అత్యంత శ్రేష్ఠమైన వాటిని మనం అర్పించాలంటే మన అర్పణలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవాలి.

ప్రకటించాల్సిన సందేశం

7. రెండు పార్శ్వాల సందేశాన్ని ప్రకటించడానికి మనకు ధైర్యం ఎందుకు కావాలి?

7 పరిచర్యలో ‘మన పెదవులను అర్పించాలంటే’ మనకు ధైర్యం కావాలి, అవునా? మనం ప్రకటించే సందేశానికి రెండు పార్శ్వాలు ఉన్నాయి, అందులో ఒకదాన్ని ప్రజలు అస్సలు స్వాగతించరు. యోవేలు ప్రవక్త దేవుని ప్రజలకు ఇలా చెప్పాడు: “యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరు సిద్ధపడి రావలెను.” (యోవేలు 3:9) మన కాలానికి కూడా వర్తించే ఆ మాట, నేటి దేశాలకు ఓ గొప్ప సవాల్‌! యెహోవా తనను ధిక్కరించేవాళ్లతో చేయనున్న నీతి యుద్ధం గురించిన చాటింపు అది. అయితే యెహోవా తన ప్రజలకు, ‘మీ ఖడ్గములను నాగటి నక్కులుగాను మీ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుడి’ అని చెప్పి, శత్రు రాజ్యాలకేమో, ‘మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి’ అని చెప్పాడు. (మీకా 4:3; యోవేలు 3:10) అవును, శత్రువులు విశ్వ సృష్టికర్తతో యుద్ధానికి సన్నద్ధులవ్వాలి. చాటింపు వేయడానికి ఇది తీపి వార్తేం కాదు.

8. “యాకోబు సంతతిలో శేషించిన” వాళ్లను మీకా సింహంతో ఎందుకు పోల్చాడు?

8 ‘తమ పెదవులను అర్పించేవాళ్లను’ మీకా తన సందేశంలో సింహంతో పోల్చాడు. ఆయనిలా రాశాడు: ‘యాకోబు సంతతిలో శేషించినవాళ్లు అన్యజనుల మధ్య అడవి మృగాల్లో సింహంలా, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చే కొదమసింహంలా ఉందురు.’ (మీకా 5:8) ఇది ఎందుకు సరైన పోలిక? మన కాలంలో అభిషిక్త శేషం ఆధ్వర్యంలో దేవుని ప్రజలు దేశాలకు హెచ్చరికా సందేశాన్ని ప్రకటించాలంటే సింహానికి ఉన్నంత ధైర్యం చూపించాలి. a

మీరు ధైర్యంగా యెహోవా దినాన్ని ప్రకటిస్తున్నారా?

9. (ఎ) సింహానికి ఉన్నంత ధైర్యం మీకు ఎప్పుడు అవసరమౌతుంది? (బి) ప్రజలు వ్యతిరేకించినప్పుడు లేదా మన సందేశాన్ని విననప్పుడు మీరు ధైర్యంగా ఎలా ఉండవచ్చు?

9 మన సందేశంలోని హెచ్చరికా పార్శ్వాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీరు సింహానికి ఉన్నంత ధైర్యాన్ని చూపిస్తారా? అధికారుల ముందు నిలబడాల్సి వచ్చినప్పుడే కాదు, స్కూల్లో, ఉద్యోగ స్థలంలో లేదా అవిశ్వాసులైన బంధువులకు ప్రకటిస్తున్న సందర్భంలో కూడా మీకు అలాంటి ధైర్యం అవసరం కావచ్చు. (మీకా 7:5-7; మత్తయి 10:17-21) ప్రజలు వ్యతిరేకించినప్పుడు లేదా మన సందేశాన్ని విననప్పుడు మీరు ధైర్యాన్ని ఎలా కూడగట్టుకోవచ్చు? షోమ్రోను, యెరూషలేముల నాశనం గురించి హెచ్చరించే కష్టమైన పనిని మీకా ఎలా చేయగలిగాడో గమనించండి: “నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనై యున్నాను.” (మీకా 1:1, 6; 3:8) బలాన్నిచ్చే దేవుని ఆత్మను మీరు కూడా పుష్కలంగా పొందగలరు కాబట్టి మీరు కూడా ‘శక్తిమంతులు’ కాగలరు. (జెకర్యా 4:6) దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన మీద ఆధారపడితే, మీరు ప్రజల చెవులు గింగురుమనిపించే వార్తను ప్రకటించగలరు.—2 రాజులు 21:10-15.

10. “యెహోవా దినము” గురించి ప్రకటిస్తున్నప్పుడు జెఫన్యాను మనం ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

10 ప్రజలకు హెచ్చరికా సందేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి. అయితే ధైర్యంతో పాటు, నేర్పు కూడా అవసరమే. మీరు ప్రకటించేది త్వరలో రానున్న “యెహోవా దినము” గురించే అయినా ‘అందరితో సాధువుగా [“నేర్పుగా,” NW, అధస్సూచి]’ ఉండాలి. (2 తిమోతి 2:24; యోవేలు 2:1, 11; జెఫన్యా 1:14) ఈ విషయంలో కూడా మనం 12 మంది ప్రవక్తల నుండి నేర్చుకోవచ్చు. యెహోవా తీర్పు సందేశాల్ని వాళ్లు ధైర్యంగా ప్రకటించారు, అయితే సానుకూలంగా స్పందించేవాళ్లు కూడా ఉంటారన్న విషయాన్ని వాళ్లు మర్చిపోలేదు. ఉదాహరణకు, జెఫన్యా ప్రవక్త తన కాలంలోని మొండి అధిపతులను (లేదా ప్రధానులను) సూటిగా విమర్శించాడు కానీ, విశ్వాసంగల యోషీయా రాజును మాత్రం ముట్టుకోలేదు. (జెఫన్యా 1:8) హెచ్చరికా సందేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ‘ప్రజలు దాన్ని పట్టించుకోరులే’ అనుకోకుండా, వాళ్లు ‘గొర్రెలయ్యే’ అవకాశం ఉందనుకుంటూ వాళ్లకు సహాయం చేయగలమా?—మత్తయి 25:32-34.

11. (ఎ) మనం ప్రకటించే సందేశానికున్న రెండవ పార్శ్వం ఏమిటి? (బి) యెహోవా దినం గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆ 12 మంది ప్రవక్తలను మీరు ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

11 మనం ప్రకటించే సందేశానికున్న మరో పార్శ్వం ఏమిటి? మీకా 5వ అధ్యాయంలో దాని గురించి ఉంది. “యాకోబు సంతతిలో శేషించిన వారు మనుష్య ప్రయత్నములేకుండను నరులయోచన లేకుండను గడ్డిమీదపడు వర్షమువలెను ఆయా జనములమధ్యను నుందురు.” (మీకా 4:1; 5:7) నేడు ఆధ్యాత్మిక యాకోబు లేదా ఆధ్యాత్మిక ఇశ్రాయేలు “సంతతిలో శేషించిన వారు,” వాళ్ల సహచరులు కలిసి “ఆయా జనములమధ్య” సువార్త ప్రకటిస్తున్నారు. ఆ పనివల్ల వాళ్లు “యెహోవా కురిపించు మంచువలె,” “గడ్డిమీదపడు వర్షమువలె” కనిపిస్తున్నారు. ఆ 12 మంది ప్రవక్తలు నాశనం గురించే కాదు, పునరుద్ధరణ గురించి కూడా ప్రకటించారు. అందుకే హీబ్రూ లేఖనాల్లోని చివరి 12 పుస్తకాల్లో, మనం ప్రకటించే సందేశానికున్న రెండవ పార్శ్వం గురించి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. యెహోవా దినం గురించి మీరు ప్రకటిస్తున్న సందేశంలో ప్రోత్సాహకరమైన పార్శ్వాన్ని మీ పరిచర్యలో నొక్కిచెబుతున్నారా?

ఈ సందేశాన్ని మీరు ఎలా ప్రకటిస్తారు?

12, 13. (ఎ) దేవుని ప్రజల్ని పురుగుల దండ్లతో ఎందుకు పోల్చవచ్చు? (బి) యోవేలు 2:7, 8⁠లో ఉన్న మాటల్ని చూస్తే మీకు ఏమి అనిపిస్తోంది?

12 రెండు పార్శ్వాలున్న ఈ సందేశాన్ని మీరు ఎలా ప్రకటిస్తున్నారు? యోవేలు ప్రవక్త దేవుని ప్రజలు చేసే పనిని పురుగులు, మిడతలు తీసుకొచ్చే వరుస తెగుళ్లతో పోల్చాడు. (యోవేలు 1:4) అయితే, ఇంకేమీ లేనట్టు దేవుని ప్రజల్ని పురుగుల దండ్లతోనే ఎందుకు పోల్చాలి? ఎందుకంటే యోవేలు 2:11 లో దేవుడు ఈ పురుగులను “తన సైన్యము” అన్నాడు. (ప్రకటన పుస్తకం కూడా దేవుని ప్రజల్ని మిడతలతో పోలుస్తోంది. ప్రకటన 9:3, 4 చూడండి.) యోవేలు వర్ణించినట్టు, ఈ పురుగులు చేసే పని సమస్తాన్ని తగలబెట్టే అగ్నిలా ఉంది, అవి రాకముందు “ఏదెనువనమువలె” ఉన్న ప్రాంతం, వాటి రాకతో “యెడారివలె” అయ్యింది. (యోవేలు 2:2, 3) యోవేలు ప్రవచనానికున్న ప్రాముఖ్యత మీకు తెలుసని మీరు ఎలా చూపించవచ్చు?

13 ఈ చిన్ని ప్రాణుల పనితీరు గురించి ఆలోచించండి. యోవేలు ఇలా వర్ణించాడు: “బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవుచున్నవి ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు.” (యోవేలు 2:7, 8) వ్యతిరేకత అనే “ప్రాకారాలు” ఏవీ వాటిని ఆపలేవు, అవి తీసుకొచ్చే తెగులును అడ్డుకోలేవు. వాటిలో కొన్ని, ‘ఆయుధాలకు’ బలైనా మిగతావి ముందుకు దూసుకెళ్తూనే ఉంటాయి. అలాగే, అణచివేసే శత్రువుల చేతుల్లో కొందరు నమ్మకమైన క్రైస్తవులు మరణించినా, మిగతా క్రైస్తవులు యెహోవా తమకు అప్పగించిన పనిని కొనసాగిస్తూనే ఉన్నారు. ‘ఇక చాలు’ అని యెహోవా చెప్పేంతవరకు ఆయన మహాదినం గురించి ప్రకటిస్తూనే ఉండాలని మీరు తీర్మానించుకున్నారా? అలాగైతే, ఇప్పటికే చనిపోయిన కొంతమంది నమ్మకమైన క్రైస్తవుల స్థానంలో మీరు ఆ పనిని ముందుకు తీసుకువెళ్తారు.

ప్రజలు విన్నా వినకపోయినా మీరు దేవుని సందేశాన్ని ప్రకటించడంలో సఫలులవ్వగలరు

14. ప్రకటనా పని పూర్తి స్థాయిలో జరగడానికి మీరు ఏయే విధాలుగా తోడ్పడవచ్చు?

14 ఏ పనైనా పూర్తిగా చేయడానికి సంబంధించి ఆ పురుగులు మనకు చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ప్రవచనంలో యోవేలు వర్ణించినట్టు, మీరు ప్రకటనా పనిని పూర్తి స్థాయిలో ఎలా చేయవచ్చు? ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం ద్వారా, ఆసక్తి చూపించిన వాళ్ల దగ్గరకు మళ్లీ వెళ్లడం ద్వారా అలా చేయవచ్చు. తాళం వేసివున్న ఇళ్లకు మళ్లీ వెళ్లి వాళ్లను కలుసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా కూడా అలా చేయవచ్చు. అప్పుడు మీరు యోవేలు ప్రవచనంలోని వర్ణనను అర్థంచేసుకున్నారని చూపించవచ్చు. అలాగే, కొంతమందిని వీధి సాక్ష్యంలోనే కలుసుకోగలం. బహుశా మీరు మరో పద్ధతిని కూడా ప్రయత్నించవచ్చు. అదేమిటంటే, మీ ఇరుగుపొరుగున వేరే దేశం నుండి వలస వచ్చినవాళ్లు ఉంటే వాళ్లకు సాక్ష్యం ఇవ్వవచ్చు. b ప్రకటనా పని పూర్తి స్థాయిలో జరగడానికి తోడ్పడేలా మీరు అలాంటి అవకాశాల కోసం కనిపెట్టుకొని ఉంటున్నారా?

మీ పరిచర్య సఫలమైందని దేన్నిబట్టి చెప్పవచ్చు?

15. ఆ 12 మంది ప్రవక్తల సందేశానికి ప్రజలు స్పందించిన తీరు ఎందుకు గమనించదగినది?

15 భీతిగొలిపే యెహోవా దినం గురించిన సందేశానికి ప్రజలు ఎలా స్పందిస్తారు? ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తే, లేదా మీరు చెప్పింది పట్టించుకోకపోతే ఆశ్చర్యపోకండి. ఎందరో దేవుని ప్రవక్తలకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది, ఆ ప్రవక్తల్లో చాలామంది తీవ్రమైన హెచ్చరికా సందేశాలను ప్రకటించారు. (యిర్మీయా 1:17-19; 7:27; 29:19) అలాంటి పరిస్థితుల్లో కూడా మంచి ఫలితాలు రావడం కొంతమంది ప్రవక్తలు చూశారు! వాళ్లలో కనీసం ఐదుగురు అంటే యోనా, మీకా, జెఫన్యా, హగ్గయి, జెకర్యా వంటివాళ్లు కొందరి హృదయాల్ని కదిలించగలిగారు. ఫలితంగా ఆ ప్రజలు తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి, తమ నడవడిని మార్చుకున్నారు.

16. మీకా ప్రవక్త ప్రయత్నాల వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది?

16 జెఫన్యా ప్రవక్త ప్రకటించిన సందేశం వల్లే యోషీయా రాజు స్వచ్ఛారాధనను పునఃస్థాపించడం కోసం నడుంబిగించి ఉంటాడు. మీకా ప్రవక్త యూదా అధిపతులకు ఒక తీర్పు సందేశాన్ని ధైర్యంగా ప్రకటించాడు. రాజైన హిజ్కియా మీకా సందేశాన్ని విని చర్యలు తీసుకున్నాడు. (మీకా 3:1-3) ఆసక్తికరంగా, యిర్మీయా కాలంలోని కొందరు పెద్దలు హిజ్కియా స్పందనను ఓ మంచి ఉదాహరణగా పేర్కొంటూ “రాజు యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను” అన్నారు. (యిర్మీయా 26:18, 19; 2 రాజులు 18:1-4) హిజ్కియా పాలనలో యూదా ప్రజలు, అలాగే ఉత్తర రాజ్యం నుండి వచ్చిన కొందరు దైవభయంగల ప్రజలు పస్కా పండుగను జరుపుకున్నారు, పులియని రొట్టెల పండుగనైతే ఏకంగా రెండు వారాలు జరుపుకున్నారు. వాళ్లు సత్యారాధన మళ్లీ మొదలుపెట్టడం వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది? “యెరూషలేము కాపురస్థులకు మిక్కిలి ఆనందము కలిగెను.” (2 దినవృత్తాంతములు 30:23-26) ఆహాజు పరిపాలనలో ఉన్న భ్రష్ట రాజ్యానికి మీకా నాశన సందేశాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. అయితే, ఆహాజు కుమారుడైన హిజ్కియా చక్కగా స్పందించడంతో మీకా తన ప్రయత్నాలకు మంచి ఫలితాన్ని చూశాడు.

17. హగ్గయి, జెకర్యా ఏమి సాధించగలిగారు?

17 హగ్గయి, జెకర్యా ప్రవక్తల గురించి కూడా పరిశీలించండి. చెర నుండి తిరిగి వచ్చిన యూదులకు వాళ్లు ప్రకటించారు. ఆ యూదులు ఎవరి లోకంలో వాళ్లు మునిగిపోయి, నిమ్మకు నీరెత్తినట్టు తయారయ్యారు. (హగ్గయి 1:1, 2; జెకర్యా 1:1-3) ఆ ఇద్దరు ప్రవక్తలు సేవచేయడం మొదలుపెట్టే నాటికి, ఆలయ పునాది వేసి 16 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకపక్క యెహోవా మందిరం ‘పాడైయుంటే’ మరో పక్క ప్రజలు ‘ఇళ్లు కట్టుకొనుటకు త్వరపడ్డారు.’ హగ్గయి యూదులకు ఈ పిలుపునిచ్చాడు: ‘దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.’ ఆ తర్వాత ఏమి జరిగింది? యెహోవా యూదా దేశపు అధికారియైన జెరుబ్బాబెలు ‘మనస్సును,’ ప్రధాన యాజకుడైన యెహోషువ ‘మనస్సును,’ ‘శేషించిన జనులందరి మనస్సులను’ ప్రేరేపించాడు. దాంతో వాళ్లు ఆలయ పనిని పూర్తిచేయగలిగారు.—హగ్గయి 1:9, 12, 14; 2:4.

18, 19. (ఎ) యెహోవా దినం గురించిన సందేశానికి కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? (బి) ప్రజలందరికీ హెచ్చరికా సందేశాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?

18 ఆ 12 మంది ప్రవక్తల్లో చాలామంది తమ సందేశాల్ని యెహోవా సమర్పిత జనాంగానికి ప్రకటించారు. కానీ మనమైతే సత్య దేవుని గురించి అసలేమీ తెలియని ప్రజలకు ప్రకటిస్తుండవచ్చు, అయినా ఆ ప్రవక్తలు చేసిన పనికి వచ్చిన ఫలితాల్ని చూసి ఎంతో నేర్చుకోవచ్చు. నేడు కూడా, యెహోవా దినం గురించిన అత్యవసర సందేశానికి చాలా ప్రాంతాల్లోని ప్రజలు స్పందిస్తున్నారు. మనకు వస్తున్న ఫలితాలు జెకర్యా ప్రవచించిన ఫలితాల్లానే ఉన్నాయి: “ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును.” (జెకర్యా 2:11) నేడు, “ప్రతిజనములోనుండి” వచ్చిన ప్రజలు చక్కగా స్పందించడం దేవుని సేవకులు కళ్లారా చూస్తున్నారు. (ప్రకటన 7:9) “అనేక జనములును బలముగల జనులును యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వత్తురు” అని జెకర్యా ప్రవచించాడు. “ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది,” “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని” అంటూ ఒక ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయుని చెంగు పట్టుకుంటారని జెకర్యా వర్ణించాడు.—జెకర్యా 8:20-23.

19 “ఆయా భాషలు మాటలాడు అన్యజనులు” అన్న వాక్యాన్ని గమనించండి. బైబిలు, బైబిలు సాహిత్యం ఎన్నో భాషల్లోకి అనువాదమౌతున్నాయి, “ఆయా భాషలు మాటలాడు” ప్రజలకు బోధించడానికి యెహోవాసాక్షులు తమ పరిచారకులకు శిక్షణ ఇస్తున్నారు. (మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యములు 1:8) మీ ప్రాంతంలో వేరే భాష మాట్లాడే ప్రజలకు సహాయం చేయడానికి మీరు వాళ్ల భాషను నేర్చుకొని ఉంటారు. ఇంకా చాలామంది సహోదరసహోదరీలు ఒకట్రెండు కొత్త భాషల్ని నేర్చుకొని, మంచి ఫలితాలు వచ్చే ప్రాంతాలకు వెళ్లడానికి సుముఖత చూపిస్తున్నారు. అలాంటి ప్రాంతాలకు వెళ్లి సువార్త ప్రకటించడం మీకు వీలౌతుందా? ఆ విషయం గురించి ప్రార్థించండి. మీకు పెళ్లయి పిల్లలుంటే, మరో ప్రాంతానికి తరలి వెళ్లడం గురించి మీ కుటుంబ సభ్యులతో పదేపదే చర్చించండి, ఎదిగే మీ పిల్లలకు దాన్ని ఒక లక్ష్యంగా పెట్టండి.

20. నీనెవె ప్రజల విషయంలో ఎలాంటి వైఖరి చూపించాల్సిన అవసరాన్ని యెహోవా నొక్కిచెప్పాడు?

20 ప్రజల సానుకూల స్పందనను చూరగొన్న ప్రవక్తల్లో ఇంకొకరు యోనా. నిజానికి, నీనెవె ప్రజలు అసలేమాత్రం వినరని ఆయన అనుకున్నాడు. కానీ, రాజుతో సహా నీనెవె వాసులంతా యోనా సందేశానికి చక్కగా స్పందించి, యెహోవా మీద విశ్వాసం ఉంచారు. స్వయంగా దేవుడే ఇలా అడిగాడు: “నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా?” (యోనా 4:11) ఆ మాటల్ని మనసులో ఉంచుకుంటూ, భీతిగొలిపే యెహోవా దినం గురించి ప్రకటించడానికి ఏది మిమ్మల్ని కదిలిస్తుందో ఆలోచించండి. విమోచన క్రయధనం ద్వారా యెహోవా మిమ్మల్ని కాపాడినందుకు ఆయనకు రుణపడి ఉన్నామని మీరు అనుకుంటున్నారా? యెహోవాకు సమర్పించుకున్న సేవకులుగా ప్రజలకు ప్రకటించాల్సిన బాధ్యత మీకుందని అనిపిస్తోందా? (1 కొరింథీయులు 9:16, 17) యెహోవా దినం గురించి ప్రకటించడానికి అవి బలమైన కారణాలు. అంతేకాదు, యెహోవా దినం గురించి తెలియని ప్రజల విషయంలో మీకు చింత ఉందా? యెహోవాలా కనికరం చూపిస్తూ ప్రజలతో యెహోవా దినం గురించి మాట్లాడినప్పుడు మీకు ఎంత సంతోషం కలుగుతుందో కదా!

21. అమజ్యా బెదిరింపులకు ఆమోసు స్పందించిన తీరు నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

21 యోవేలు, ఓబద్యా, నహూము, హబక్కూకు, మలాకీ ప్రవక్తలు ప్రకటించిన సందేశాలకు ప్రజలు ఎలా స్పందించారో మనకు అంతగా తెలీదు. ఆమోసు సందేశానికి వచ్చిన ఓ స్పందన గురించి మాత్రం మనకు తెలుసు. ఆమోసు రాజ ద్రోహానికి పాల్పడుతున్నాడని నిందిస్తూ అమజ్యా ఆయనను తీవ్రంగా వ్యతిరేకించాడు, బేతేలులో ప్రకటించకుండా ఆమోసును ఆపాలని చూశాడు. (ఆమోసు 7:10-13) ఆమోసు ఆ వ్యతిరేకతను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. నేడు కూడా, యెహోవా ప్రజల మీదకు హింసలు తీసుకురావడానికి, లేదా ప్రజలకు మంచి చేసే ప్రకటనా పనిని నిషేధించడానికి మతవాదులు రాజకీయ నాయకులను ఉసిగొల్పే ప్రయత్నాలు చేయవచ్చు. వ్యతిరేకత ఉన్నా ధైర్యంగా సువార్త ప్రకటించే విషయంలో మీరు ఆమోసును ఆదర్శంగా తీసుకుంటారా?

22. మీ ప్రాంతంలో పరిచర్య సఫలమౌతోందని ఎందుకు చెప్పవచ్చు?

22 ఆ 12 మంది ప్రవక్తల సందేశానికి ప్రజలు రకరకాలుగా స్పందించినా వాళ్లు మాత్రం తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. మనం ప్రకటించే రెండు పార్శ్వాల సందేశానికి ప్రజల స్పందన ముఖ్యం కాదుగానీ మన ప్రకటనా పని ద్వారా యెహోవాకు ‘మన పెదవులను అర్పించడం’ ముఖ్యం, అంటే ఆయనకు మన శ్రేష్ఠమైన “స్తుతియాగము” చేయడమే ముఖ్యం. (హోషేయ 14:2; హెబ్రీయులు 13:15) కాబట్టి, మనం ఫలితాల్ని యెహోవాకే వదిలేస్తాం. నిజంగా గొర్రెలు కాగల వాళ్లను ఆయనే ఆకర్షిస్తాడు. (యోహాను 6:44) అంతేకాక, ప్రజలు విన్నా వినకపోయినా మీరు దేవుని సందేశాన్ని ప్రకటించడంలో సఫలులవ్వగలరు. సువార్తను మంచి మనస్సుతో స్వీకరించే వాళ్ల దృష్టికి, “సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు” అందంగా కనిపిస్తాయనే నమ్మకంతో మీరు ఉండవచ్చు. అంతకన్నా ముఖ్యంగా అవి యెహోవా దృష్టికి అందంగా కనిపిస్తాయి. (నహూము 1:15; యెషయా 52:7) యెహోవా మహా దినం చాలా దగ్గరపడింది కాబట్టి, మన కాలంలో జరుగుతుందని యోవేలు ప్రవచించిన ఈ పనిని చేస్తూ ముందుకు సాగిపోవాలని తీర్మానించుకోండి: “అన్యజనులకు ఈ సమాచారము ప్రకటనచేయుడి—యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరు సిద్ధపడి రావలెను.” దేశాలతో యెహోవా చేయనున్న యుద్ధమది.—యోవేలు 3:9.

a ఈ ప్రవచనం తొలి నెరవేర్పు మక్కబీయుల కాలంలో జరిగింది. మక్కబీయుల నేతృత్వంలో యూదులు శత్రువులను యూదా దేశం నుండి తరిమి, ఆలయాన్ని మళ్లీ ప్రతిష్ఠించినప్పుడు అది నెరవేరింది. మెస్సీయ వచ్చినప్పుడు ఆయనను స్వాగతించేందుకు యూదా శేషం మిగిలివుండడానికి అది తోడ్పడింది.—దానియేలు 9:25; లూకా 3:15-22.

b వేరే భాష మాట్లాడే వాళ్లకు సాక్ష్యమివ్వడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన అన్నిదేశాల ప్రజలకు సువార్త అనే చిన్న పుస్తకాన్ని ఉపయోగించడం వల్ల చక్కని ఫలితాలు వచ్చాయి.