12వ అధ్యాయం
‘దానికోసం కనిపెట్టుకొని ఉండండి’
1, 2. (ఎ) మీరు ఏ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు? (బి) 12 మంది ప్రవక్తల్లో కొందరు ఎలాంటి పరిస్థితుల్లో జీవించారు? మీకా ప్రవక్త ఎలాంటి వైఖరి చూపించాడు?
దుష్టత్వాన్ని తొలగించే యెహోవా దినం రావాలని మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్నారు? ఇంకా ఎంతకాలం ఎదురుచూడడానికి మీరు సుముఖంగా ఉన్నారు? ఈలోగా మీకు ఏ వైఖరి ఉండాలి? ఆ వైఖరి మీ జీవిత విధానంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వీటికి మీరిచ్చే జవాబులకు, ఇష్టారాజ్యంగా బతుకుతూ పరలోకానికి పోతామనుకునే చర్చివాళ్ల జవాబులకు ఎంతో తేడా ఉంటుంది.
2 ఆ మహాదినం కోసం ఎదురుచూస్తున్న ఈ తరుణంలో ఆ 12 పుస్తకాలు మీకు ఎంతో సహాయకరంగా ఉంటాయి. ఆ ప్రవక్తల్లో చాలామంది దేవుని తీర్పులు అమలయ్యే కాలంలో జీవించారు. ఉదాహరణకు మీకా ప్రవక్త, షోమ్రోనుకు నాశనం దగ్గరపడుతున్న రోజుల్లో జీవించాడు. షోమ్రోను అష్షూరు చేతిలో సా.శ.పూ. 740 లో నాశనమైంది. (20, 21 పేజీల్లోని కాలరేఖ చూడండి.) కొంతకాలానికి యూదా మీద కూడా యెహోవా తీర్పులు అమలయ్యాయి. అయితే, దేవుడు ఎప్పుడు చర్య తీసుకుంటాడో మీకాకు తెలియదు. అలాగని, దేవుడు త్వరలోనే చర్య తీసుకుంటాడులే అనుకుంటూ తీరిగ్గా చేతులు కట్టుకుని కూర్చుంటే సరిపోతుందని అతను అనుకున్నాడా? మీకా ఇలా చెప్పాడు: “యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.” (మీకా 7:7) జరగబోయేదానిమీద పూర్తి నమ్మకంతో మీకా, కావలిబురుజు మీద అప్రమత్తంగా ఉండే కావలివానిలా ఉన్నాడు.—2 సమూయేలు 18:24-27; మీకా 1:3, 4.
3. యెరూషలేము నాశనం దగ్గరపడుతున్న రోజుల్లో జెఫన్యా, హబక్కూకు భవిష్యత్తు విషయంలో ఎలాంటి దృక్పథాన్ని కనబర్చారు?
3 ఇప్పుడు కాలరేఖలో జెఫన్యా, హబక్కూకు ఎక్కడ ఉన్నారో చూడండి. సా.శ.పూ. 607 యెరూషలేము నాశనానికి ముందు కాలంలో వాళ్లు సేవచేశారని గమనించండి. అయినా, దేవుని తీర్పు కొన్ని రోజుల్లోనే అమలౌతుందో, కొన్ని దశాబ్దాల తర్వాత అమలౌతుందో వాళ్లకు అప్పుడు తెలియదు. (హబక్కూకు 1:2; జెఫన్యా 1:7, 14-18) జెఫన్యా ఇలా రాశాడు: ‘యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా—నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకు నేను నిశ్చయించుకొంటిని.’ (జెఫన్యా 3:8) జెఫన్యా సేవచేసిన కొంతకాలానికి ప్రవచించడం మొదలుపెట్టిన హబక్కూకు సంగతేంటి? ఆయన ఇలా రాశాడు: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.”—హబక్కూకు 2:3.
4. జెఫన్యా, హబక్కూకు ఎలాంటి పరిస్థితుల్లో ప్రవచించారు? ఏ వైఖరి చూపించారు?
4 జెఫన్యా 3:8, హబక్కూకు 2:3 లేఖనాల్లోని ప్రవచనాలు రాసిననాటి పరిస్థితులు పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. “యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడు” అని కొంతమంది యూదులు చెప్పుకుంటున్న రోజుల్లో జెఫన్యా “యెహోవా ఉగ్రతదినము” గురించి ప్రకటించాడు. ఆ దినాన రెండు శత్రు రాజ్యాలు, దారితప్పిన యూదులు దేవుని కోపాన్ని చవిచూస్తారని ఆయన చెప్పాడు. (జెఫన్యా 1:4, 12; 2:2, 4, 13; 3:3, 4) దేవుని తీర్పుకు, కోపానికి జెఫన్యా భయపడిపోయాడని మీరు అనుకుంటున్నారా? లేదు, నిజానికి దానికోసం ‘కనిపెట్టుకొని’ ఉండమని దేవుడు ఆయనకు చెప్పాడు. ‘మరి హబక్కూకు సంగతేంటి’ అనుకుంటున్నారా? ఆయనను కూడా ‘కనిపెట్టుకొని’ ఉండమని దేవుడు చెప్పాడు. జెఫన్యా, హబక్కూకు ఇద్దరూ జరగబోయేది తమకు పట్టదు అన్నట్టుగానో, పరిస్థితులు ఎన్నడూ మారవు అనుకున్నట్టుగానో జీవించలేదు. (హబక్కూకు 3:16; 2 పేతురు 3:4) అయితే, ఆ ఇద్దరి విషయంలోనూ ముఖ్యంగా కనిపించేది ఒక్కటే, వాళ్లు ‘కనిపెట్టుకొని’ జీవించాలి. నిజంగానే వాళ్లు ఎదురుచూసిన సమయం సా.శ.పూ. 607లో రానేవచ్చింది. అంటే, వాళ్లు ‘కనిపెట్టుకొని’ ఉండి తెలివైన పనిచేశారు.
5, 6. కాలగమనంలో దేవుని సంకల్ప నెరవేర్పుకు సంబంధించి మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకున్నాం కాబట్టి మనం ఏ వైఖరి చూపించాలి?
5 మనం కూడా, ఈ దుష్ట వ్యవస్థ మీదికి “యెహోవా ఉగ్రతదినము” తప్పక వస్తుందనే నమ్మకంతో జీవించవచ్చు. అది వచ్చి తీరుతుంది, ఆ విషయంలో మనకు లేశమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఖచ్చితంగా ఆ దినం ఎప్పుడు వస్తుందో నాటి జెఫన్యా, హబక్కూకు ప్రవక్తలకు తెలియనట్టే మనకు కూడా తెలియదు. (మార్కు 13:32) ఏదేమైనా, ఆ దినం తప్పక వస్తుంది. మన కాలంలో నెరవేరుతున్న బైబిలు ప్రవచనాలు, ఆ దినం అతి త్వరలోనే వస్తుందని బలంగా రుజువు చేస్తున్నాయి. కాబట్టి, “కనిపెట్టుకొని” ఉండమని యెహోవా ఆ ఇద్దరు ప్రవక్తలకు నొక్కిచెప్పిన మాట మనకు కూడా వర్తిస్తుంది. ఈ అక్షర సత్యాన్ని గుర్తుంచుకోండి: మన దేవుడైన యెహోవా మాత్రమే ‘తన కోసం కనిపెట్టువారి’ పక్షాన చర్య తీసుకుంటాడు.—యెషయా 64:4.
6 “యెహోవా ఉగ్రతదినము” సరిగ్గా సమయానికే వస్తుందన్న బలమైన నమ్మకం మనకుందని మన పనుల్లో చూపించాలి. అలా చేస్తే కనిపెట్టుకొని ఉండే విషయంలో సరైన వైఖరి చూపించవచ్చు. యెహోవా దినం విషయంలో మనకున్న దృఢ నమ్మకం, దానికి తగిన పనులు యేసు మాటలకు తగ్గట్టు ఉన్నాయి. ఆయన తన అపొస్తలులతో, అభిషిక్త క్రైస్తవులందరితో ఇలా చెప్పాడు: “మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు . . . కొరకు ఎదురుచూచు మనుష్యులవలె ఉండుడి. ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (లూకా 12:35-37) కనిపెట్టుకొని ఉండే విషయంలో మనకు సరైన వైఖరి ఉంటే, యెహోవా మహాదినం యెహోవా అనుకున్న దానికన్నా ఒక్క క్షణం కూడా ఆలస్యం కాదని మనం నమ్ముతున్నట్టు లెక్క.
‘కనిపెట్టుకొని’ ఉంటూ ‘సిద్ధంగా’ ఉండండి
7, 8. (ఎ) దేవుడు సహనం చూపించినందువల్ల ఎలాంటి ఫలితం వచ్చింది? (బి) మనం ఏ వైఖరి చూపించాలని పేతురు ఉపదేశించాడు?
7 ఆధునికకాల దేవుని సేవకులు 1914 లో పరలోకాన దేవుని రాజ్య స్థాపన కాకముందు నుంచే కనిపెట్టుకొని ఉంటున్నారు. అంటే దానర్థం వాళ్లు ఖాళీగా కూర్చొని ఉన్నారని కాదు. వాళ్లు దేవుడు అప్పగించిన సాక్ష్యపు పనిలో చురుగ్గా పాల్గొంటూనే ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 1:8) దీని గురించి ఆలోచించండి: ఒకవేళ 1914 లోనే యెహోవా మహాదినం వచ్చుంటే మీ పరిస్థితి ఎలా ఉండేది? లేదా ఓ 40 ఏళ్ల క్రితం వచ్చుంటే, ఆ సమయానికి మీరు “పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను” ఉండివుండేవాళ్లా? (2 పేతురు 3:11) సాక్షులైన మీ కుటుంబ సభ్యులు లేదా సంఘంలోని మీ ఆప్తమిత్రుల సంగతేంటి? వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే, దేవుని సేవకులు కనిపెట్టుకొని ఉన్న కాలం 2 పేతురు 3:9 చెబుతున్నట్టే మీకు, మీలాంటి ఎంతోమందికి రక్షణకు మార్గం తెరిచింది. పరలోకంలో రాజ్య స్థాపన అయిన వెంటనే యెహోవా భూమ్మీది దుష్టత్వాన్నంతటినీ నాశనం చేయనందువల్ల మంచే జరిగింది. నీనెవె వాసులకు దొరికినట్టే చాలామందికి పశ్చాత్తాపపడి నాశనాన్ని తప్పించుకునే అవకాశం దొరికింది. “ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి” అని అపొస్తలుడైన పేతురు అన్నాడు. ఆయన అన్న మాటలతో మనం నిరభ్యంతరంగా ఏకీభవించవచ్చు. (2 పేతురు 3:15) పశ్చాత్తాపపడడానికి లేదా జీవితంలో, ఆలోచనల్లో మార్పులు చేసుకోవడానికి నేటి ప్రజలకు కూడా ఒక అవకాశం దొరుకుతోంది.
8 మీకా, జెఫన్యా, హబక్కూకు జీవించిన కాలంనాటి పరిస్థితుల విషయంలో ఓ క్రైస్తవునికి పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు. “అయినా అదంతా ఎప్పుడో పూర్వం నాటి మాట!” అని అతను అనుకుంటుండవచ్చు. కానీ, ఆ కాలంనాటి పరిస్థితుల నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? క్రైస్తవులు “పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను” జీవించాలని పేతురు ఇచ్చిన ఉపదేశం గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. పేతురు ఆ మాట చెప్పిన వెంటనే మనం పాటించాల్సిన ఇంకో విషయాన్ని ప్రస్తావించాడు. అదేమిటంటే, మనం యెహోవా “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు” ఉండాలి. (2 పేతురు 3:11, 12) అందుకే, మనమంతా ఆ దినం కోసం ‘కనిపెట్టుకొని’ ఉంటూ దాన్ని మనసులో ఉంచుకొని జీవించాలి.
9. మనం ‘యెహోవా కొరకు ఎదురుచూస్తూ కనిపెట్టుకొని ఉండడం’ ఎందుకు సరైనది?
9 మనం యెహోవా సేవ మొదలుపెట్టి కొన్ని సంవత్సరాలే అయినా, దశాబ్దాలే గడిచిపోయినా మీకాలా ‘యెహోవా కొరకు ఎదురుచూస్తూ కనిపెట్టుకొని ఉండే’ వైఖరిని చూపిస్తున్నామా? (రోమీయులు 13:11) అంతం ఎప్పుడు వస్తుందో, ఇంకెంతకాలం ఎదురుచూడాలో తెలుసుకోవాలని కోరుకోవడం మానవ సహజం. కానీ అది తెలుసుకోవడం మన తరంకాదని ఒప్పుకోక తప్పదు. యేసు చెప్పిన ఈ మాటలు ఒకసారి గుర్తుచేసుకోండి: “ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.”—మత్తయి 24:43, 44.
10. అపొస్తలుడైన యోహాను జీవితం నుండి, భవిష్యత్తు విషయంలో ఆయన చూపించిన వైఖరి నుండి మీరు ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?
10 యేసు చెప్పిన ఆ మాటలూ మీకా, జెఫన్యా, హబక్కూకు రాసిన మాటలూ ఒకేలా ఉన్నాయి. అయినా, యేసు మాట్లాడింది ప్రాచీనకాలంలోని ప్రజల గురించి కాదు, తన అనుచరులమైన మన గురించే. అంకితభావంగల క్రైస్తవులు చాలామంది యేసు ఇచ్చిన ఉపదేశాన్ని నిజంగా పాటించారు, కనిపెట్టుకొని ఉంటూ సిద్ధంగా ఉన్నట్లు నిరూపించుకున్నారు. ఈ విషయంలో అపొస్తలుడైన యోహాను మనకు చక్కని ఆదర్శం. ఒలీవ కొండ మీద ఉన్నప్పుడు ఈ విధానాంతం గురించి యేసును అడిగిన నలుగురు శిష్యుల్లో ఆయన ఒకడు. (మత్తయి 24:3; మార్కు 13:3, 4) సా.శ. 33 లో వాళ్లు అలా అడిగారు. అప్పుడు యేసు చెప్పిన సంఘటనలు ఖచ్చితంగా ఎప్పుడు నెరవేరతాయో, ఆ సమయం ఎంత దగ్గర్లో ఉందో అంచనా వేసే అవకాశం యోహానుకు లేదు. ఓ 60 ఏళ్లు గడిచాక యోహాను వైఖరి ఎలా ఉందో గమనించండి. యోహాను వృద్ధుడయ్యాడు. అయినా ఆయన విసిగిపోలేదు, కనిపెట్టుకొని ఉండే వైఖరిని వదులుకోలేదు. “అవును, త్వరగా వచ్చుచున్నాను” అన్న యేసు మాట విన్నప్పుడు, “ఆమేన్; ప్రభువైన యేసూ, రమ్ము” అని యోహాను బదులిచ్చాడు. జీవితమంతా ఎదురుచూడడంలోనే పోయిందని యోహాను బాధపడలేదు. యెహోవా తన తీర్పును అమలుచేసినప్పుడు ప్రతీ ఒక్కరికి వాళ్లవాళ్ల క్రియలకు తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తాడని యోహాను బలంగా నమ్మాడు. (ప్రకటన 22:12, 20) ఆ తీర్పు ఎప్పుడు వచ్చినా, యేసు సలహామేరకు యోహాను ‘సిద్ధంగా’ ఉండాలనుకున్నాడు. మీరూ అలాగే ఉండాలనుకుంటున్నారా?
‘కనిపెట్టుకొని’ ఉంటున్నారా? లేక ప్రస్తుత జీవితంతో ‘తృప్తిచెందారా’?
11. మీకా, హోషేయ జీవించిన కాలంలో ప్రజల వైఖరి ఎలా ఉండేది?
11 ఇశ్రాయేలు మీద, తర్వాత యూదా మీద యెహోవా తీర్పులు అమలయ్యే కాలం దగ్గరపడిన రోజుల్లో జీవించిన ప్రవక్తల నుండి మరో పాఠం నేర్చుకోవచ్చు. మీకా ప్రవక్త ‘యెహోవా కొరకు ఎదురుచూస్తూ కనిపెట్టుకొని’ ఉన్నాడు కానీ, చుట్టూవున్న చాలామంది అలా చేయలేదు. ‘వాళ్లు మేలును అసహ్యించుకొని కీడు చేయడాన్ని ఇష్టపడే’ ప్రజలుగా తయారయ్యారు. వాళ్లలో మార్పు రాకపోతే, ‘యెహోవాకు మొఱ్ఱపెట్టినా ఆయన వాళ్ల మనవి అంగీకరింపడు’ అని మీకా హెచ్చరించాడు. (మీకా 3:2, 4; 7:7) మీకా సమకాలీనుడైన హోషేయ పది గోత్రాల ఉత్తర రాజ్య ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వ్యవసాయానికి సంబంధించిన పదాల్ని వాడాడు: “నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక . . . ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.” ఆయన అలా అభ్యర్థించినా, చాలామంది ఆయన మాటలు పట్టించుకోలేదు. వాళ్లు ‘చెడుతనాన్ని దున్నారు గనుక పాపమనే కోత కోశారు.’ (హోషేయ 10:12, 13) అక్రమాలు జరుగుతుంటే ఆ ప్రజలు చీమకుట్టనట్టు ఉన్నారు లేదా వాళ్లే అక్రమాలకు పాల్పడ్డారు, యెహోవా మార్గాన్ని పక్కనబెట్టి ‘తమ సొంత ప్రవర్తనను ఆధారం చేసుకున్నారు.’ నేడు కొంతమందికి ఈ సందేహం రావచ్చు: ‘వాగ్దాన దేశంలో నివసిస్తున్న సత్యారాధకులు అలా ఎలా చేశారు?’ సమస్య వాళ్ల వైఖరిలో ఉందని హోషేయ చూపించాడు. వాళ్లు విలాసవంతమైన జీవితంతో ‘తృప్తిచెందారు.’ మనం యెహోవా మహాదినం కోసం కనిపెట్టుకొని జీవించాలంటే, ఆ వైఖరి మన దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకోవాలి.
12. (ఎ) సా.శ.పూ. 740కి ముందు ఇశ్రాయేలీయుల మధ్య ఎలాంటి చెడు వాతావరణం నెలకొందని హోషేయ రాశాడు? (బి) ఆ ప్రజలు ‘తృప్తిచెందారు’ అని ఎందుకు చెప్పవచ్చు?
12 పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించాక దేవుని ప్రజలు ఓ మోస్తరు భోగభాగ్యాలతో తులతూగారు. అప్పుడు వాళ్ల వైఖరి ఎలా తయారైంది? హోషేయ ద్వారా యెహోవా ఇలా అన్నాడు: “వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.” (హోషేయ 13:6) శతాబ్దాల పూర్వం ఆ ప్రమాదం గురించే దేవుడు హెచ్చరించాడు. (ద్వితీయోపదేశకాండము 8:11-14; 32:15) అయినా హోషేయ, ఆమోసు ప్రవక్తల కాలానికల్లా ఇశ్రాయేలీయులు ఆ ఊబిలో పడిపోయారు, అంటే ‘తృప్తిచెందారు.’ వాళ్ల గురించి ఆమోసు కొన్ని నిర్దిష్టమైన వివరాలు ఇచ్చాడు. వాళ్ల ఇళ్లు విలాస వస్తువులతో కళకళలాడేవి, కొంతమందికైతే ఏకంగా రెండుమూడు ఇళ్లు ఉండేవి. వాళ్లు మంచిమంచి భోజన పదార్థాలను ఆరగించేవాళ్లు, ప్రత్యేకమైన పాత్రల్లో నాణ్యమైన ద్రాక్షారసాన్ని తాగేవాళ్లు, ఒంటికి అత్యుత్తమ ‘పరిమళ తైలము పూసుకునేవాళ్లు.’ (ఆమోసు 3:12, 15; 6:4-6) అయితే అవన్నీ తప్పని కాదు కానీ, వాటికోసం పడిచచ్చే వైఖరి తప్పని మీకు తెలిసేవుంటుంది.
13. ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న ధనవంతుల్లో గానీ, పేదవాళ్లలో గానీ ఏ లోపం కనిపించింది?
13 అలాగని, ఉత్తర రాజ్యంలోని ప్రతి ఒక్కరూ సంపన్నులై, ‘తృప్తి చెందారని’ కాదు. పేదలు కూడా కొంతమంది ఉన్నారు. బతుకుతెరువు చూసుకొని కుటుంబాల్ని పోషించుకోవడానికి వాళ్లు ప్రయాసపడేవాళ్లు. (ఆమోసు 2:6; 4:1; 8:4-6) నేడు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో పరిస్థితి అదే. మరి హోషేయ 13:6 లో దేవుడు ఇచ్చిన ఉపదేశం ప్రాచీన ఇశ్రాయేలులోని పేదలకు కూడా వర్తించిందా? నేడు మనకూ వర్తిస్తుందా? నిశ్చయంగా! సత్యారాధకులు ధనవంతులైనా, కాకపోయినా వాళ్లు ‘దేవుణ్ణి మర్చిపోయేంతగా’ వస్తుపరమైన విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వకూడదని యెహోవా ఆ మాటల్లో చూపించాడు.—లూకా 12:22-30.
14. కనిపెట్టుకొని ఉండే విషయంలో మన వైఖరి ఎలా ఉందో ఆలోచించుకోవడం ఎందుకు సరైనది?
14 మన కాలం గురించి ఆలోచిస్తే, ఇప్పటికే ఎన్నో బైబిలు ప్రవచనాలు నెరవేరాయి. అందుకే మనం అప్రమత్తంగా, సిద్ధంగా ఉంటూ కనిపెట్టుకొని ఉండేందుకు మనకు మరిన్ని కారణాలు ఉన్నాయి. అయితే, కొన్నేళ్లుగా లేదా దశాబ్దాలుగా మనం దేవుని దినం కోసం ఎదురుచూస్తుంటే అప్పుడేంటి? గతంలో మనం పరిచర్యను ఉత్సాహంగా చేశాం, యెహోవా దినం అతి త్వరలో రానుందనే నమ్మకం ఉట్టిపడే నిర్ణయాలు తీసుకున్నాం. కానీ, అదింకా రాలేదు. మరిప్పుడు మన వైఖరి ఎలా ఉంది? మనలో ప్రతీ ఒక్కరు ఇలా ప్రశ్నించుకోవాలి: ‘కనిపెట్టుకొని ఉండే విషయంలో నా వైఖరి ఇప్పటికీ ముందులానే ఉందా? లేక ఆ విషయంలో కాస్త దిగజారానా?’—ప్రకటన 2:4.
15. కనిపెట్టుకొని ఉండే వైఖరి నీరుగారిందనడానికి కొన్ని గుర్తులేమిటి?
15 కనిపెట్టుకొని ఉండే విషయంలో మన వైఖరి ఎలా ఉందో పరిశీలించుకోవడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అయితే, ఆ కాలంలోని ‘తృప్తి చెందిన’ ప్రజల గురించి ఆమోసు రాసిన విషయాల్నే కొలమానంగా తీసుకొని మనల్ని మనం పరిశీలించుకోగలమా? అలా చేస్తే, మనం ‘తృప్తిచెందే’ ప్రమాదం వైపు అడుగులు వేస్తున్నామేమో తెలుస్తుంది. కొందరు క్రైస్తవులు ఒకప్పుడు తమ ఆలోచనల్లో, పనుల్లో కనిపెట్టుకుని ఉండే వైఖరిని చూపించివుంటారు. కానీ, ఇప్పుడు వాళ్లు విలాసవంతమైన ఇళ్లూ వాహనాలూ, అధునాతన వస్త్రాలు, ఖరీదైన కాస్మెటిక్స్, నగానట్రా లేదా అత్యుత్తమ ఆహారపానీయాల వంటివాటి కోసం ప్రాకులాడడం మొదలుపెట్టే అవకాశం ఉంది. మనం మంచి జీవితాన్ని వద్దనుకొని సన్యాసిలా జీవించాలని బైబిలు చెప్పడం లేదు. కష్టపడి పనిచేసే వ్యక్తి “అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవిం[చాలి].” (ప్రసంగి 3:13) అయితే ఆహారపానీయాలు, కనిపించే తీరు వంటివాటి గురించి ఎప్పుడూ లేనంత విపరీతంగా ఆలోచించడం ప్రమాదకరం. (1 పేతురు 3:3) ఆసియా మైనరులోని కొందరు అభిషిక్తులు అలా తయారయ్యారని గమనించిన యేసు, అది క్రైస్తవులకు ప్రమాదకరమని హెచ్చరించాడు. (ప్రకటన 3:14-17) మనం కూడా అలా ఏమైనా తయారయ్యామా? బహుశా వస్తుపరమైన విషయాలకు ప్రాధాన్యతనిస్తూ మనం ‘తృప్తిచెందుతున్నామా?’ మన కనిపెట్టుకొని ఉండే వైఖరి నీరుగారిందా?—రోమీయులు 8:5-8.
16. ‘తృప్తికరమైన’ జీవితం కోసం పాటుపడమని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రోత్సహిస్తే, వాళ్లకు మేలు జరగదని ఎందుకు చెప్పవచ్చు?
16 యెహోవా మహాదినం కోసం కనిపెట్టుకొని ఉండే మన వైఖరి దెబ్బతిందన్న విషయం మనం మన పిల్లలకు, మరితరులకు ఇచ్చే సలహాల్లో కూడా వెల్లడౌతుంది. ఓ క్రైస్తవుడు ఇలా అనుకునే ప్రమాదం ఉంది: ‘అంతం చాలా దగ్గర్లో ఉందనుకొని నేను చదువును, ఉద్యోగావకాశాల్ని వదులుకున్నాను. కానీ ఇప్పుడు, నా పిల్లలు బాగా బతకడానికి మంచి చదువులు చదివించాలనుకుంటున్నాను.’ హోషేయ కాలంలో కూడా కొందరు అలాగే ఆలోచించివుంటారు. మరి, ‘తృప్తికరమైన’ జీవితం కోసం పాటుపడమని ఆ తల్లిదండ్రులు ఇచ్చిన సలహాలు పిల్లలకు మేలు చేసివుంటాయా? ఆ పిల్లలు కూడా వాళ్ల తల్లిదండ్రుల మాట విని ‘తృప్తికరమైన’ జీవితం కోసం పాటుపడి ఉంటారా? ఇదే గనుక నిజమైతే, సా.శ.పూ. 740 లో అష్షూరు చేతిలో షోమ్రోను నాశనమైనప్పుడు వాళ్ల పరిస్థితి ఏమైవుంటుంది?—హోషేయ 13:16; జెఫన్యా 1:12, 13.
గట్టి ఆధారాలున్న విషయాల కోసం కనిపెట్టుకొని ఉండండి
17. మనం ఏ విషయంలో మీకాను అనుకరించాలి?
17 యెహోవా వాగ్దానాలు సరిగ్గా ఆయన నిర్ణయించిన సమయానికే నెరవేరతాయని అప్పటి సత్యారాధకుల్లానే మనం కూడా నమ్మవచ్చు. (యెహోషువ 23:14) మీకా తన ‘రక్షణకర్తయగు దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటూ’ జ్ఞానయుక్తంగా ప్రవర్తించాడు. చరిత్ర మనకు అందుబాటులో ఉంది కాబట్టి కాలరేఖ చూసి, మీకా ప్రవక్త షోమ్రోను నాశనానికి ఎంత దగ్గర్లో జీవించాడో తెలుసుకోవచ్చు. మరి మన విషయమేంటి? మనం జీవిస్తున్న కాలం విషయమేంటి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఉద్యోగం, జీవనశైలి, పూర్తికాల పరిచర్య వంటి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకున్నామని మనం దృఢంగా చెప్పగలమా? నిజమే, ‘ఆ దినము గూర్చి, ఆ గడియ గూర్చి’ మనకు తెలియదు. (మత్తయి 24:36-42) అయితే మీకా చూపించిన వైఖరిని అలవర్చుకొని, దానికి తగ్గట్టు ప్రవర్తిస్తే మనం ఖచ్చితంగా జ్ఞానయుక్తంగా నడుచుకున్నట్టే. రేపు మీకా భూపరదైసు మీద నిత్యజీవ బహుమానాన్ని పొందినప్పుడు, మనం తన ప్రవచన సందేశం నుండి, తన నమ్మకమైన ఆదర్శం నుండి ప్రయోజనం పొందామని తెలుసుకొని ఆయన ఎంత సంతోషిస్తాడో కదా! యెహోవా “రక్షణకర్తయగు దేవుడు” అనడానికి మనం సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాం!
18, 19. (ఎ) రానున్న ఏ విపత్తు గురించి ఓబద్యా ప్రస్తావించాడు? (బి) ఓబద్యా ఇశ్రాయేలీయుల్లో ఏ ఆశను చిగురింపజేశాడు?
18 మన నమ్మకానికి బలమైన ఆధారం ఉంది. ఉదాహరణకు, ఓబద్యా రాసిన చిన్న ప్రవచన పుస్తకం గురించి ఆలోచించండి. అది ముఖ్యంగా ప్రాచీన ఎదోము గురించి మాట్లాడుతోంది. ఎదోమీయులు తమ ‘సహోదరులైన’ ఇశ్రాయేలీయులతో వ్యవహరించిన తీరుకు శిక్షగా యెహోవా వాళ్లకు ఎలాంటి తీర్పు విధించాడో అది ప్రస్తావిస్తోంది. (ఓబద్యా 12) మనం ఈ పుస్తకంలోని 10వ అధ్యాయంలో చూసినట్టు, యెహోవా చెప్పిన నాశనం ఎదోము మీదికి రానేవచ్చింది. సా.శ.పూ. 6వ శతాబ్దం మధ్యభాగంలో నెబోనైడస్ నేతృత్వాన బబులోనీయులు ఎదోమును జయించారు. తర్వాత ఎదోము కనుమరుగైపోయింది. అయితే ఓబద్యా రాసిన సందేశంలో మరో ప్రాముఖ్యమైన అంశం కూడా ఉంది. అది, యెహోవా మహాదినం కోసం మనం కనిపెట్టుకొని ఉండడానికి సంబంధించినది.
19 ఎదోమును నాశనం చేసిన శత్రు రాజ్యమైన బబులోను, విశ్వాసఘాతకులైన దేవుని ప్రజల మీద కూడా దేవుని శిక్షను అమలుచేసిందని మీకు తెలుసు. సా.శ.పూ. 607 లో బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసి యూదులను చెరపట్టుకుపోయారు, దాంతో దేశం శిథిలమైపోయింది. కథ అక్కడితో ముగిసిందా? లేదు. ఇశ్రాయేలీయులు మళ్లీ తమ స్వదేశానికి తిరిగి వస్తారని ఓబద్యా ప్రవక్త ద్వారా యెహోవా ప్రవచించాడు.ఓబద్యా 17వ వచనంలో ప్రోత్సాహకరమైన ఈ వాగ్దానం ఉంది: “సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు, యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు.”
20, 21. ఓబద్యా 17వ వచనం మనకు ఎందుకు ఊరటను ఇస్తుంది?
20 ఓబద్యా ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరిందని చరిత్ర నిర్ధారిస్తోంది. దేవుడు ప్రవచించాడు, అది నెరవేరింది. వేలాది యూదులు, ఇశ్రాయేలీయులు సా.శ.పూ. 537 లో స్వదేశానికి తిరిగివచ్చారు. శిథిలమైపోయిన తమ దేశాన్ని యెహోవా దీవెనలతో వాళ్లు పచ్చని ప్రాంతంగా మార్చుకున్నారు. యెషయా 11:6-9; 35:1-7 లేఖనాల్లోని ప్రవచనాలు ఆ అద్భుతమైన మార్పు గురించి చెప్పాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, వాళ్లు యెహోవా ఆలయాన్ని తిరిగి నిర్మించి సత్యారాధనను మళ్లీ ప్రారంభించారు. దీనంతటిని బట్టి చూస్తే, యెహోవా వాగ్దానాలు నమ్మదగినవని అనేందుకు ఓబద్యా 17వ వచనం మరో రుజువని అర్థమౌతోంది. ఆయన వాగ్దానాలు ఎప్పుడూ విఫలం కాలేదు.
21 ఓబద్యా తన ప్రవచన సందేశాన్ని ఈ దృఢమైన మాటలతో ముగించాడు: “రాజ్యము యెహోవాది యగును.” (ఓబద్యా 21) ఆ మాట మీద నమ్మకంతో మనం, యేసుక్రీస్తు ద్వారా యెహోవా పరిపాలించే మహత్తర సమయం కోసం ఎదురుచూస్తున్నాం. అప్పుడు యెహోవాకు ఎదురు తిరిగేవాళ్లు మన భూగ్రహంలోనే కాదు ఈ విశ్వమంతటిలో ఎక్కడా ఉండరు. యెహోవా మహాదినం కోసం, ఆ తర్వాత వచ్చే దీవెనల కోసం మనం కొద్దికాలంగానే ఎదురుచూస్తున్నా, ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నా బైబిలు ఆధారంగా మనం పెట్టుకున్న ఆశలు అడియాశలు కావని గట్టిగా నమ్మవచ్చు.
22. హబక్కూకు 2:3, మీకా 4:5 లేఖనాల్లో స్ఫురిస్తున్న నమ్మకాన్ని మీరు ఎందుకు చూపించాలనుకుంటున్నారు?
22 మన కాలానికి నిశ్చయంగా వర్తించే హబక్కూకు మాటల్లోని అభయాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.” (హబక్కూకు 2:3) యెహోవా మహాదినం రావడం ఆలస్యమౌతోందని మనుషులకు అనిపించినా, ఆయన నిర్ణయించిన సమయానికి అది వచ్చితీరుతుంది, మాటిస్తున్నది ఎవరు? యెహోవా. అందుకే, ఎన్నో ఏళ్లుగా యెహోవాను సేవిస్తున్న వాళ్లు, ఈ మధ్యే యెహోవా ఆరాధనను మొదలుపెట్టినవాళ్లు అందరూ కలిసి మీకా 4:5లో స్ఫురిస్తున్న నమ్మకాన్ని చూపిస్తూ ముందుకు సాగిపోవాలి: “మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.”