కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

9వ అధ్యాయం

దేవుడు కోరినట్లు ఇతరులతో వ్యవహరించండి

దేవుడు కోరినట్లు ఇతరులతో వ్యవహరించండి

1-3. (ఎ) ప్రాచీన తూరు పట్టణం గురించి చాలామంది క్రైస్తవులకు ఏమి గుర్తుకురావచ్చు? (బి) హీరాము రాజుకు, ఇశ్రాయేలు రాజ్యానికి మధ్య జరిగిన కొన్ని వ్యవహారాలను తెలపండి. (సి) తూరుకు సంబంధించి మనం ఏమి నేర్చుకోనున్నాం?

 ప్రాచీన తూరు పట్టణం. ఆ పేరు వినగానే మీకు ఏమి గుర్తుకొస్తుంది? చాలామంది క్రైస్తవులకు ఓ ప్రవచన నెరవేర్పు గుర్తుకొస్తుంది. అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ తూరు పట్టణ శిథిలాలతో వంతెన నిర్మించి, కొత్తదైన తూరు ద్వీపనగరానికి వెళ్లి దాన్ని నాశనం చేసినప్పుడు ప్రవచనం నెరవేరింది. (యెహెజ్కేలు 26:4, 12; జెకర్యా 9:3, 4) అయితే మీరు సహోదరులతో, ఇతరులతో ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు అనే విషయంలో తూరు పట్టణం మీకు ఏమైనా గుర్తు చేస్తోందా?

2 తూరు ఎందుకు నాశనమైంది? “తూరు మూడు సార్లు . . . చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినవారి నందరిని ఎదోమీయులకు అప్పగించిరి. నేను తూరు ప్రాకారములమీద అగ్ని వేసెదను.” (ఆమోసు 1:9, 10) అంతకుముందు, తూరువాడైన హీరాము దావీదుతో స్నేహంగా ఉన్నాడు, ఆలయం కోసం సొలొమోనుకు సరుకులు సరఫరా చేశాడు. సొలొమోను హీరాముతో నిబంధన చేసి, గలిలయలోని పట్టణాలను ఇచ్చాడు. హీరాము సొలొమోనును “నా సహోదరుడా” అని సంబోధించాడు. (1 రాజులు 5:1-18; 9:10-13, 26-28; 2 సమూయేలు 5:11) “సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక” దేవుని ప్రజల్లో కొంతమందిని బానిసలుగా అమ్మేసినప్పుడు తూరు వ్యవహారాల్ని యెహోవా గమనించాడు.

3 తూరు పట్టణంలోని కనానీయులు తన ప్రజలతో కఠినంగా వ్యవహరించినందుకు దేవుడు వాళ్లను శిక్షించాడు. దాన్నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనం మన సహోదరులతో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. మనం ఇతరులతో వ్యాపార లావాదేవీలు నడిపేటప్పుడు న్యాయంగా ఉండడం, మన ప్రవర్తనలో పవిత్రంగా ఉండడం వంటి విషయాల్లో ఆ 12 పుస్తకాల్లోని కొన్ని సలహాలను ముందటి అధ్యాయాల్లో గమనించాం. అయితే మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలని దేవుడు కోరుతున్నాడనే దానికి సంబంధించి ఈ 12 పుస్తకాల్లో మరిన్ని సలహాలు ఉన్నాయి.

కష్టాల్లోవున్న ఇతరుల్ని చూసి సంతోషించకండి

4. ఎదోమీయులు ఇశ్రాయేలీయులకు “సహోదరులు” ఎలా అవుతారు? కానీ వాళ్ల “సహోదరుల” విషయంలో వాళ్లు ఎలా వ్యవహరించారు?

4 ఇశ్రాయేలుకు సమీపంలో ఉన్న ఎదోము దేశాన్ని ఖండిస్తూ దేవుడు చెప్పిన ఈ మాటల్లో మీరు ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు: “నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు.” (ఓబద్యా 12) ఇశ్రాయేలీయులకు తూరువాళ్లు వ్యాపారపరంగా “సహోదరులు” అయ్యుండొచ్చు కానీ ఈ ఎదోమీయులు మాత్రం నిజంగానే “సహోదరులు.” ఎలాగంటే, ఎదోమీయులు యాకోబు కవల సోదరుడైన ఏశావు సంతానం. అంతెందుకు, ఎదోమీయులు ఇశ్రాయేలీయులకు “సహోదరులు” అని స్వయంగా యెహోవాయే అన్నాడు. (ద్వితీయోపదేశకాండము 2:1-4) అలాంటిది, యూదులు బబులోనీయుల చేతుల్లో పతనమవడం చూసి ఎదోమీయులు సంతోషించడం చాలా దారుణమైన విషయం.—యెహెజ్కేలు 25:12-14.

5. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎదోమీయుల్లా ప్రవర్తించే అవకాశం ఉంది?

5 ఎదోమీయులు తమ యూదా సహోదరులతో వ్యవహరించిన తీరు యెహోవాకు నచ్చలేదన్నది స్పష్టం. అయితే మన మనసులో ఈ ప్రశ్న మెదలవచ్చు: ‘నేను సహోదరులతో వ్యవహరించే తీరును దేవుడు ఇష్టపడుతున్నాడా?’ ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మనం మన సహోదరుణ్ణి చూసే తీరు, మనం అతనితో వ్యవహరించే విధానం ఎలా ఉంటుందనేది ఆలోచించాల్సిన విషయం. ఉదాహరణకు, మీకు ఓ సహోదరుని వల్ల బాధ కలిగిందని లేదా మీ బంధువుల్లో ఒకరికి అతనితో సమస్య ఉందని అనుకోండి. ‘ఎవరైనా మీకు హాని చేశారని మీరు అనుకుంటే’ మీరు ఆ విషయాన్ని మర్చిపోయే బదులు లేదా సమస్యను పరిష్కరించుకునే బదులు మనసులో కోపాన్ని ఉంచుకుంటారా? (కొలొస్సయులు 3:13; యెహోషువ 22:9-30; మత్తయి 5:23, 24) అలా చేస్తే మీరు అతనితో వ్యవహరించే తీరులో మార్పు వస్తుంది; అతన్ని చూసికూడా చూడనట్లు ప్రవర్తిస్తారు, అతనికి దూరంగా ఉంటారు లేదా అతని గురించి చెడుగా మాట్లాడతారు. ఇంకొంచెం ముందుకెళ్లి ఆలోచిద్దాం: కొంతకాలానికి అతను ఒక తప్పు చేశాడు, పెద్దలు అతన్ని కూర్చోబెట్టి మాట్లాడాల్సివచ్చింది లేదా సరిదిద్దాల్సివచ్చింది. (గలతీయులు 6:1) అప్పుడు మీరెలా స్పందిస్తారు? మీరు కూడా ఎదోమీయుల్లా ఆ సహోదరుని పరిస్థితి చూసి నవ్వుకుంటారా? మీరెలా స్పందిస్తే దేవునికి నచ్చుతుంది?

6. జెకర్యా 7:10లో ఉన్న సలహా ప్రకారం మనం ఏమి చేయకూడదు?మీకా 7:18లోని సలహా ప్రకారం ఏమి చేయాలి?

6 యెహోవా తన ఉద్దేశాన్ని జెకర్యాతో ఇలా చెప్పించాడు: “మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచకుడి.” (జెకర్యా 7:9, 10; 8:17) ఒక సహోదరుడు మనల్ని బాధపెట్టాడని లేదా మన కుటుంబంలో ఎవరికైనా అన్యాయం చేశాడని మనకు అనిపించినప్పుడు ఈ సలహా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ‘మన హృదయంలో కీడు చేయాలనే తలంపు’ వచ్చేస్తుంది, ఆ తర్వాత మన ప్రవర్తనలో దాన్ని చూపించేస్తాం. కానీ మనం తనలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. యెహోవా “దోషమును పరిహరించి . . . అతిక్రమముల విషయమై క్షమించు దేవుడు” అని మీకా రాసిన విషయాన్ని గుర్తుతెచ్చుకోండి. a (మీకా 7:18) మరి మనం యెహోవాలా ఉండాలంటే ఏమి చేయాలి?

7. ఇతరుల తప్పుల్ని మర్చిపోవడం ఎందుకు మంచిది?

7 ఒక సహోదరుడు మన విషయంలోనో మన బంధువు విషయంలోనో చేసిన ఒక పనికి మనం నొచ్చుకోవచ్చు, కానీ అది నిజంగా అంత నొచ్చుకోవాల్సిన విషయమేనా? ఒక సహోదరునితో మనస్పర్థలు వచ్చినప్పుడు లేదా అతను మన పట్ల పాపం చేసినప్పుడు పరిష్కారం కోసం మనం ఏమేం చేయాలో బైబిలు చెబుతోందన్నది నిజమే. అయినా చాలా సందర్భాల్లో ఆ తప్పును లేదా మనల్ని నొప్పించిన విషయాన్ని చూసీచూడనట్లు వదిలేయడం, ఆ ‘అతిక్రమాన్ని క్షమించడం’ మంచిది. మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘నేను అతన్ని క్షమించాల్సిన 77 సందర్భాల్లో ఇది ఒకటా? నేను దీన్ని ఇక్కడితో వదిలేస్తే పోదా?’ (మత్తయి 18:15-17, 21, 22) ఇప్పుడు పెద్దదిగా అనిపించే ఆ విషయం, ఓ వెయ్యేళ్ల తర్వాత కూడా అలాగే అనిపిస్తుందా? ఆహారపానీయాల్ని సంతోషంగా ఆస్వాదించే ఒక పనివాని గురించి ప్రసంగి 5:20 ఇలా అంటోంది: “అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసియున్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసికొనడు.” ఇందులో మనకు ఒక పాఠం ఉంది. ఆ వ్యక్తి తాను అనుభవిస్తున్న సంతోషం మీదే మనసుపెడతాడు కాబట్టి రోజువారీ సమస్యల్ని మర్చిపోతాడు. మనం కూడా అలా ఉండగలమా? మనం మన ప్రపంచవ్యాప్త క్రైస్తవ సహోదర బృందంలోని ఆనందాల మీద మనసుపెడితే, కలకాలం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేనివాటిని, నూతనలోకంలో గుర్తు చేసుకోనివాటిని మర్చిపోగలుగుతాం. కష్టాల్లో ఉన్న ఇతరుల్ని చూసి సంతోషించడానికి లేదా ఇతరుల తప్పులు గుర్తుపెట్టుకోవడానికి అదెంత భిన్నంగా ఉంది కదా.

మిమ్మల్ని ఎవరైనా బాధపెడితే, మీరేమి చేయకూడదు?

ఇతరులతో నిజమే మాట్లాడండి

8. నిజం మాట్లాడడానికి సంబంధించి మనకు ఏ సవాలు ఎదురౌతుంది?

8 ఇతరులతో వ్యవహరించేటప్పుడు మనం నిజమే మాట్లాడాలని యెహోవా ఎంతగా కోరుకుంటున్నాడో కూడా ఆ 12 పుస్తకాలను చూస్తే అర్థమవుతుంది. బయటివాళ్లతో “సువార్త సత్యము” మాట్లాడడానికి మనం ఎలాగూ కృషిచేస్తాం. (కొలొస్సయులు 1:5; 2 కొరింథీయులు 4:2; 1 తిమోతి 2:4, 7) కానీ, రోజూ ఇంట్లో వాళ్లతో లేదా సహోదరులతో రకరకాల విషయాల గురించీ పరిస్థితుల గురించీ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నిజమే మాట్లాడడం సవాలుగా అనిపించవచ్చు. ఎందుకని?

9. నిజాన్ని పూర్తిగా చెప్పకూడదనిపించే శోధనకు మనం ఎప్పుడు గురయ్యే అవకాశం ఉంది? కానీ మనం ఏ ప్రశ్న వేసుకోవాలి?

9 మన మాటలు లేదా పనులు ఇతరుల్ని నొప్పించాయని తెలిసిన సందర్భాలు మనలో ఎంతమందికి ఎదురుకాలేదు? ఆ సందర్భంలో మనకు ఇబ్బందిగా, కాస్త అవమానకరంగా అనిపించి ఉంటుంది. అలాంటి భావనలు కలిగినప్పుడు ఒక వ్యక్తి తన తప్పేం లేదనే అవకాశం ఉంది. చేసిన తప్పును సమర్థించుకోవడానికో, ఆ తప్పును ఒప్పు అని నిరూపించడానికో నిజాన్ని వక్రీకరిస్తూ ఏవో కబుర్లు చెప్పే ప్రమాదం ఉంది. లేదా, పరిస్థితి ఇబ్బందికరంగా అనిపించినప్పుడు నిజాలకు మసిపూసి కేవలం కొన్ని వివరాలే ఇచ్చేందుకు మొగ్గుచూపవచ్చు. ఆ విధంగా, ఆ వ్యక్తి చెప్పింది నిజంలాగే కనిపించవచ్చు, కానీ అది పూర్తిగా వేరే నిర్ధారణకు నడిపించవచ్చు. అలాంటి మాటలు, నేటి లోకంలో సామాన్యమైపోయిన పచ్చి అబద్ధాలైతే కాకపోవచ్చు. కానీ అవి చెబితే ‘పొరుగువానితో (లేదా సహోదరునితో) సత్యం మాట్లాడినట్లేనా’? (ఎఫెసీయులు 4:15, 25; 1 తిమోతి 4:1, 2) మాటల్ని చక్కగా కూర్చి చెప్పడం సహోదరుల్ని తప్పుదారి పట్టిస్తుందని; నిజంకాని దాన్ని, ఖచ్చితంకాని దాన్ని వాళ్లు నమ్మేలా చేస్తుందని తెలిసి కూడా ఒక క్రైస్తవుడు అలా చెబితే దేవునికి ఏమనిపిస్తుంది?

10. ప్రాచీన ఇశ్రాయేలు, యూదా రాజ్యాల్లో ఉన్న ఒక అలవాటును ప్రవక్తలు ఎలా వర్ణించారు?

10 యెహోవాకు సమర్పించుకున్న స్త్రీపురుషులు కూడా ఆయన కోరినదాన్ని కొన్నిసార్లు అలక్ష్యం చేశారని ప్రవక్తలు గ్రహించారు. హోషేయ ప్రవక్త తన కాలంలో జీవించిన కొంతమంది గురించి యెహోవా మనోభావాల్ని ఇలా తెలియజేశాడు: “వారికి నాశనము కలుగును; వారు నామీద తిరుగుబాటు చేసియున్నారు; వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్నను వారు నామీద అబద్ధములు చెప్పుదురు.” యెహోవా మీద దారుణమైన, పచ్చి అబద్ధాలు చెప్పడమే కాకుండా, ఇతరుల్ని తప్పుదారిపట్టించేలా బహుశా నిజాల్ని వక్రీకరిస్తూ “అబద్ధసాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు [“శపించుకోవడం, మోసపూరితంగా వ్యవహరించడం,” NW]” మొదలుపెట్టారు. (హోషేయ 4:1, 2; 7:1-3, 13; 10:4; 12:1) హోషేయ ఆ మాటల్ని ఉత్తర రాజ్యంలోని షోమ్రోనులో ఉండి రాశాడు. అంటే యూదాలో పరిస్థితి బాగుందనా? మీకా ఏమి చెబుతున్నాడో చూడండి: “వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును.” (మీకా 6:12) ‘మోసపూరితంగా వ్యవహరించడాన్ని,’ ‘నాలుకతో కపటంగా మాట్లాడేవాళ్లను’ ఆ ప్రవక్తలు ఎలా ఖండించారో మనం తెలుసుకోవడం మంచిది. కావాలని అబద్ధాలు ఆడని క్రైస్తవులు కూడా ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను కొన్నిసార్లు మోసపూరితంగా వ్యవహరించే ప్రమాదం ఉందా? నేను నాలుకతో కపటంగా మాట్లాడే అవకాశం ఉందా? ఈ విషయంలో యెహోవా నా నుండి ఏమి ఆశిస్తున్నాడు?’

11. మన మాటలకు సంబంధించి దేవుడు ఏమి ఆశిస్తున్నాడని ప్రవక్తలు చెప్పారు?

11 యెహోవా ఎంతసేపూ శిక్ష గురించే మాట్లాడలేదు. మనం అలవర్చుకోవాల్సిన మంచి ప్రవర్తన గురించి కూడా ఆయన తన ప్రవక్తల ద్వారా వివరించాడు. జెకర్యా 8:16 లో ఇలా ఉంది: “మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.” జెకర్యా కాలంలో ‘గుమ్మాలు’ అంటే, న్యాయపరమైన తీర్పులు తీర్చడానికి పెద్దలు కూడుకునే బహిరంగ ప్రదేశాలు. (రూతు 4:1; నెహెమ్యా 8:1) అయితే, కేవలం ఆ ఒక్కచోట మాత్రమే నిజం చెప్పాలని జెకర్యా అనలేదు. అలాంటి చోట్ల నిజమే చెప్పాలి. అయితే జెకర్యా ఇలా కూడా అన్నాడు: “ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.” అంటే ఇంట్లో కూడా నిజమే మాట్లాడాలి. అది జీవిత భాగస్వామితోనే కానివ్వండి, దగ్గరి బంధువులతోనే కానివ్వండి ఎవరితోనైనా నిజమే మాట్లాడాలి. మనం తోటి సహోదరసహోదరీలతో ముఖాముఖిగా గానీ, ఫోన్లో గానీ, ఇంకెలాగైనా గానీ జరిపే రోజువారీ సంభాషణలకు కూడా ఈ విషయం వర్తిస్తుంది. మనం వాళ్లతో నిజమే చెప్పాలని వాళ్లు ఆశించడం తప్పుకాదు. అబద్ధాలు చెప్పకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు నొక్కిచెప్పాలి. అలా చేస్తే, మనం కపటంగా మాట్లాడకుండా నిజమే మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడన్న విషయం ఎదుగుతున్న చిన్నారుల హృదయంలో నాటుకుపోతుంది.—జెఫన్యా 3:13.

12. ప్రవక్తల పుస్తకాల నుండి మనం ఏ విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు?

12 సత్య బాటలో నడిచే యువతీయువకులుగానీ పెద్దవాళ్లుగానీ జెకర్యా అన్న ఈ మాటలతో ఏకీభవిస్తారు: “సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి.” (జెకర్యా 8:19) యెహోవా తన కుమారుని ప్రవర్తనలో చూసినదాని గురించి మలాకీ ఇలా చెప్పాడు: “ఆయన నోట సత్యపు బోధ ఉంది, ఆయన పెదవుల మీద అవినీతి ఏమాత్రమూ కనబడలేదు. సమాధానంగా, యథార్థతంగా నాతో నడిచాడు.” (మలాకీ 2:6, NW) మరి మనం కూడా అలాగే ఉండాలని యెహోవా ఆశించడా? ఆ 12 పుస్తకాల్లో మనం నేర్చుకోగలిగే పాఠాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ 12 పుస్తకాలే కాదు, మన దగ్గర మొత్తం బైబిలు ఉందని గుర్తుంచుకోండి.

హింస జోలికి వెళ్లకండి

13. పూర్వం దేవుని ప్రజల్లో ఉన్న ఏ లోపాన్ని కూడా మీకా 6:12 ప్రస్తావిస్తోంది?

13 పూర్వం దేవుని ప్రజలు ‘అబద్ధమాడి, నాలుకతో కపటంగా మాట్లాడి’ ఇతరులతో చెడుగా వ్యవహరించారనే విషయాన్ని మీకా 6:12⁠లో గమనించాం. అయితే ఆ వచనం మరో ఘోరమైన లోపాన్ని కూడా ఎత్తి చూపుతోంది. “ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు.” అదెలా? దాన్నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

14, 15. హింస విషయంలో దేవుని ప్రజల చుట్టూవున్న జనాంగాలకు ఎలాంటి పేరు ఉంది?

14 దేవుని ప్రజల చుట్టూవున్న కొన్ని జనాంగాలకు ఎలాంటి పేరుండేదో ఆలోచించండి. ఈశాన్యంలో అష్షూరు ఉండేది, దీని ముఖ్యపట్టణం నీనెవె. దాని గురించి నహూము ఇలా రాశాడు: “నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడతెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది.” (నహూము 3:1) రక్తపాతాన్ని సృష్టించే యుద్ధాలకు, యుద్ధ ఖైదీల పట్ల పాశవిక హింసకు అష్షూరీయులు మారుపేరు. వాళ్లు కొంతమంది ఖైదీలను సజీవదహనం చేసేవాళ్లు లేదా బతికుండగానే చర్మం ఒలిచేసేవాళ్లు, ఇంకొంతమందికైతే కళ్లు పీకేసేవాళ్లు లేదా ముక్కో, చెవులో, వేళ్లో కోసేసేవాళ్లు. గాడ్స్‌, గ్రేవ్స్‌ అండ్‌ స్కాలర్స్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “నీనెవె అంటేనే హత్య, దోపిడి, అణచివేత, బలహీనుల పట్ల అన్యాయం, యుద్ధం, అన్నిరకాల పాశవిక హింస అని ప్రజల మనసుల్లో ముద్ర పడిపోయింది.” దీనికి ఓ ప్రత్యక్ష సాక్షి (బహుశా ఆ హింసలో పాల్గొన్న వ్యక్తి) ఉన్నాడు. ఆయనే నీనెవె రాజు. యోనా సందేశం విన్న నీనెవె రాజు తన ప్రజలతో ఇలా చెప్పాడు: “మనుష్యులందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను.”—యోనా 3:6-9. b

15 చిత్రహింసలు పెట్టడం అష్షూరీయులకు మాత్రమే పరిమితం కాలేదు. యూదాకు ఆగ్నేయంలో ఉన్న ఎదోము కూడా దేవుని శిక్షకు గురైంది. ఎందుకు? ‘ఎదోమీయులు యూదా వారిమీద బలాత్కారము చేసి తమతమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును.’ (యోవేలు 3:19) ఎదోమీయులు ఆ హెచ్చరికను లక్ష్యపెట్టి తమ హింసా ప్రవృత్తిని విడిచిపెట్టారా? దాదాపు రెండు శతాబ్దాల తర్వాత ఓబద్యా ఇలా రాశాడు: “తేమానూ [ఎదోములో ఒక పట్టణం], నీ బలాఢ్యులు విస్మయమొందుదురు, . . . నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమునుబట్టి . . . ఇక నెన్నటికిని లేకుండ నీవు నిర్మూలమగుదువు.” (ఓబద్యా 9, 10) మరి దేవుని ప్రజల సంగతేంటి?

16. ఆమోసు, హబక్కూకు ప్రవక్తలు తమ కాలంలో ఉన్న ఏ సమస్య గురించి రాశారు?

16 ఉత్తర రాజ్య రాజధాని షోమ్రోనులోని పరిస్థితిని ఆమోసు వెల్లడిచేశాడు: “అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి; అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడుచేతను సొమ్ము సమకూర్చుకొందురు.” (ఆమోసు 3:9, 10) అయితే యెహోవా ఆలయమున్న యూదా పట్టణంలో పరిస్థితి బాగుందనుకుంటున్నారేమో. యూదాలోనే జీవించిన హబక్కూకు దేవునితో ఇలా అన్నాడు: “యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి.”—హబక్కూకు 1:2, 3; 2:12.

17. దేవుని ప్రజల్లో హింసా ప్రవృత్తి ఎలా మొదలై ఉంటుంది?

17 హింస పట్ల అష్షూరు, ఎదోము మరితర రాజ్యాలకున్న వైఖరిని దేవుని ప్రజలు కూడా అంటించుకున్నారా? వాళ్ల మధ్య హింస సామాన్య విషయమైపోవడానికి కారణం అదేనా? అలాంటి ప్రమాదం గురించి సొలొమోను ఈ హెచ్చరిక ఇచ్చాడు: “బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయ గోరవద్దు.” (సామెతలు 3:31; 24:1) ఆ తర్వాత యిర్మీయా కూడా సూటిగా ఇలా చెప్పాడు: “యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా—అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి.”—యిర్మీయా 10:2; ద్వితీయోపదేశకాండము 18:9.

ఎన్నో కార్టూన్‌ కార్యక్రమాలు, వీడియో గేములు హింస తప్పుకాదని నమ్మేలా పిల్లల్ని మోసం చేస్తున్నాయి

18, 19. (ఎ) హబక్కూకు గనుక ఇప్పుడు ఉండివుంటే, నేటి హింసాపూరిత విషయాల్ని చూసి ఆయనకు ఏమి అనిపించివుండేది? (బి) మరి దాని గురించి మీకు ఏమనిపిస్తుంది?

18 హబక్కూకు గనుక ఇప్పుడు ఉండివుంటే, లోకంలో ఉన్న హింసను చూసి ఏమైపోయేవాడో? ప్రజలు చిన్నప్పటి నుండే హింసను చూసే వీలు కల్పిస్తుంది ఈ లోకం. హీరో విలన్‌ని కాల్చడం, పేల్చడం లేదా ఏదోలా చంపేయడం వంటి హింసాయుత అంశాలతో కార్టూన్‌ కార్యక్రమాలు చిన్నవయసు అబ్బాయిల్ని, అమ్మాయిల్ని కట్టిపడేస్తున్నాయి. వయసు కాస్త పెరిగేసరికే చాలామంది పిల్లలు వీడియో గేముల్లో తుపాకీతో కాలుస్తూ, బాంబులు పేలుస్తూ లేదా శత్రువుని సంహరిస్తూ గెలుపులోని మజాను ఆస్వాదించడం మొదలుపెడుతున్నారు. కొంతమంది “అది వట్టి ఆటే కదా” అని సమర్థించుకుంటారు. హింసాయుత వీడియో గేములు ఇంట్లో కంప్యూటర్‌లో ఆడినా, బయట షాపులో ఆడినా అవి ఆడేవాళ్లను హింసలో ముంచేస్తాయి, వాళ్ల వైఖరిని, ప్రవర్తనను మార్చేస్తాయి. బైబిల్లోని ఈ ప్రేరేపిత మాట ఎంత నిజమో కదా: “దౌర్జన్యపరుడు పొరుగువాణ్ణి ఆకర్షించి, అతణ్ణి పెడదారి పట్టిస్తాడు.”—సామెతలు 16:29, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

19 ప్రజలు ‘బాధలు’ అనుభవించడం, ‘బలాత్కారానికి’ గురవ్వడం వంటివి హబక్కూకు కళ్ల ముందే జరిగాయి. చూడకూడదనుకున్నా ఆయన వాటిని చూడాల్సివచ్చింది, అవన్నీ ఆయనను ఎంతో దుఃఖపెట్టాయి. ఇప్పుడు మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను రోజూ చూసే టీవీ కార్యక్రమాల్ని హబక్కూకు నా పక్కన కూర్చుని ఏమాత్రం ఇబ్బందిపడకుండా చూస్తాడా? క్రీడాకారులు పురాతన యోధుల్లా కవచాలు ధరించి మరీ పాల్గొనే హింసాయుత క్రీడల్ని వీక్షించడానికి ఆయన సమయం కేటాయిస్తాడా?’ కొన్ని ఆటల్లో క్రీడా ప్రాంగణం చిన్న కోర్టైనా, పెద్ద మైదానమైనా సరే ప్రత్యర్థుల మధ్య, ఒక్కోసారి వీరాభిమానుల మధ్య జరిగే కొట్లాటలే ప్రేక్షకుల ఉత్కంఠకు కారణమౌతాయి. కొన్ని సంస్కృతుల్లో చాలామంది యుద్ధాల చుట్టూ, యుద్ధ కళల (మార్షల్‌ ఆర్ట్స్‌) చుట్టూ అల్లుకున్న కథల సినిమాలు, వీడియోలు ఎక్కువగా చూస్తారు. అవి దేశ ప్రాచీన సంస్కృతికి అద్దం పడతాయి, చరిత్రను గుర్తుచేస్తాయి కాబట్టి అలాంటివి చూడడం తప్పుకాదనుకుంటారు. అంతమాత్రాన అది తప్పుకాకుండా పోతుందా?—సామెతలు 4:17.

20. మలాకీ ఏ రకమైన హింస విషయంలో యెహోవా దృక్కోణాన్ని తెలియజేశాడు?

20 కొంతమంది యూదులు తమ భార్యలకు చేసిన నమ్మకద్రోహాన్ని యెహోవా ఎలా పరిగణించాడో చెబుతున్నప్పుడు మలాకీ అలాంటి విషయాన్నే ప్రస్తావించాడు. ‘భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.’ (మలాకీ 2:16) “వస్త్రములను బలాత్కారముతో నింపుట” అని అనువాదమైన హీబ్రూ వాక్యాన్ని రకరకాలుగా వివరిస్తున్నారు. ఎదుటివ్యక్తి మీద దాడి చేసినప్పుడు బట్టల మీద రక్తం చిందడమనే అర్థంతో ఆ మాటను వాడారని కొంతమంది విద్వాంసులు అంటున్నారు. ఏదేమైనా జీవిత భాగస్వామిని హింసించడాన్ని మలాకీ స్పష్టంగా ఖండించాడు. మొత్తమ్మీద, గృహహింసకు సంబంధించిన అంశాన్ని ఆయన ప్రస్తావించాడు, దాన్ని దేవుడు సహించడని కూడా చెప్పాడు.

21. క్రైస్తవులు ఎక్కడ సహితం హింసకు దూరంగా ఉండాలి?

21 ఒక క్రైస్తవుడు ఇంట్లోవాళ్లను తన మాటలతో గానీ చేతలతో గానీ హింసించడం తప్పు, అది బయట జరిగే హింసతో సమానం. దేవుడు ఆ రెండిటినీ గమనిస్తాడు. (ప్రసంగి 5:8) ఓ వ్యక్తి తన భార్యను హింసించడం తప్పని మలాకీ రాశాడంటే దానర్థం ఆ వ్యక్తి తన పిల్లల్ని, వృద్ధ తల్లిదండ్రుల్ని హింసించడం అంత తప్పు కాదనా? అలాగని బైబిల్లో ఎక్కడా లేదు. అంతేకాదు ఓ ఇల్లాలు తన భర్తను, పిల్లల్ని లేదా తల్లిదండ్రుల్ని హింసించడం కూడా తప్పే. అందరూ అపరిపూర్ణులే కాబట్టి కుటుంబంలో ఆందోళనలు, చికాకులు, కొన్నిసార్లు కోపాలు మామూలే. అయినా బైబిలు మనకిలా సలహా ఇస్తోంది: “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.”—ఎఫెసీయులు 4:26; 6:4; కీర్తన 4:4; కొలొస్సయులు 3:19.

22. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎలా ఉన్నా మనం మాత్రం హింసకు దూరంగా ఉండడం సాధ్యమని ఎలా చెప్పవచ్చు?

22 కొంతమంది, ‘నేను హింసాయుత కుటుంబంలో పెరిగాను, అందుకే ఇలా ఉన్నాను’ అనో, ‘మా ఊళ్లో అందరికీ కోపం ముక్కు మీదే ఉంటుంది’ అనో అంటుంటారు. అయితే, ‘ఎడతెగక బలాత్కారం చేసే ఐశ్వర్యవంతులు’ హింసాయుత పరిస్థితుల మధ్య పెరిగారు కాబట్టి వాళ్ల తప్పేమీ లేదన్నట్లు మీకా వాళ్లను ఖండించకుండా వదిలిపెట్టలేదు. (మీకా 6:12) “భూలోకము బలాత్కారముతో నిండి” ఉన్న కాలంలో నోవహు జీవించాడు, ఆయన కొడుకులు అలాంటి హింసాపూరిత వాతావరణంలో పెరిగారు. మరి, వాళ్లు కూడా అలాగే తయారయ్యారా? అస్సలు అవలేదు. “నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను,” ఆయన కొడుకులు కూడా ఆయనలానే జీవించారు, జలప్రళయాన్ని తప్పించుకున్నారు.—ఆదికాండము 6:8, 11-13; కీర్తన 11:5.

23, 24. (ఎ) హింసాపరులు అనే పేరు తెచ్చుకోకూడదంటే మనం ఏమి చేయాలి? (బి) యెహోవా తాను కోరినట్లు ఇతరులతో వ్యవహరించేవాళ్ల గురించి ఏమనుకుంటాడు?

23 ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులకు హింసాపరులని కాదుగానీ, శాంతికాముకులనే పేరు ఉంది. హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వం నియమించిన చట్టాల్ని వాళ్లు గౌరవిస్తారు, పాటిస్తారు. (రోమీయులు 13:1-4) వాళ్లు “తమ ఖడ్గములను నాగటి నక్కులుగా” మలచుకోవడానికి కృషి చేశారు. శాంతిని స్థాపించడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. (యెషయా 2:4) హింసకు దూరంగా ఉండగలిగేలా వాళ్లు ‘నవీన స్వభావాన్ని’ ధరించుకోవడానికి పాటుపడుతున్నారు. (ఎఫెసీయులు 4:22-26) మాటలతోగానీ, చేతలతోగానీ ‘కొట్టని’ క్రైస్తవ పెద్దలను వాళ్లు ఆదర్శంగా తీసుకుంటారు.—1 తిమోతి 3:2, 3; తీతు 1:7.

24 అవును, మనం ఇతరులతో దేవుడు కోరినట్లు వ్యవహరించగలం, వ్యవహరించాలి కూడా. “జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు.”—హోషేయ 14:9.

a ‘అతిక్రమముల విషయమై క్షమించడం’ అని అనువాదమైన హీబ్రూ రూపకాలంకారం, “పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపించిన దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయే బాటసారి ప్రవర్తనకు సంబంధించినది” అని ఓ విద్వాంసుడు చెబుతున్నాడు. ‘అంటే [దేవుడు పాపాన్ని గమనించడని కాదు] కానీ, కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి చేసిన పాపానికి అతన్ని శిక్షించాలనే ఉద్దేశంతో దానికి ప్రత్యేకమైన అవధానాన్ని ఇవ్వడు; అతన్ని శిక్షించకుండా క్షమించేస్తాడు.’

b నీనెవెకు నైరుతి దిశలో దాదాపు 35 కి.మీ. దూరంలో అషర్‌నసిర్‌పాల్‌ పునర్నిర్మించిన కాలహు (నిమ్రూద్‌) ఉంది. కాలహులో లభ్యమైన ఉబ్బెత్తు శిల్పాలు బ్రిటీష్‌ మ్యూజియంలో ఉన్నాయి, వాటి గురించి ఇలా ఉంది: “అషర్‌నసిర్‌పాల్‌ తన దండయాత్రలు ఎంత క్రూరంగా, అమానుషంగా ఉండేవో వివరంగా చెక్కించాడు. హస్తగతం చేసుకున్న పట్టణాల గోడల దగ్గర ఖైదీలను స్తంభాలకు వేలాడదీసేవాళ్లు లేదా మేకులతో మ్రానులకు దిగగొట్టేవాళ్లు . . . ; యువకులను, కన్యలను బతికుండగానే చర్మం ఒలిచేసేవాళ్లు.”—ఆర్కియాలజీ ఆఫ్‌ ద బైబిల్‌.