కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

10వ అధ్యాయం

మీ కుటుంబం దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మీరు ఏమి చేయాలి?

మీ కుటుంబం దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మీరు ఏమి చేయాలి?

1. సాధారణంగా యెహోవాసాక్షుల కుటుంబాలు ఎందుకు సంతోషంగా ఉంటాయి?

 యెహోవాసాక్షుల కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయనే పేరుంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బ్రైయన్‌ విల్సన్‌ ఇలా రాశాడు: ‘వివాహ బాంధవ్యాలు, నైతిక విలువలు, పిల్లల పెంపకం తదితర విషయాల్లో సాక్షులు పాటించదగ్గ సలహాలిస్తారు. జీవితంలోని అన్ని రంగాలకు ఉపయోగపడే పరిశుద్ధ బైబిలు ఆధారిత సర్వోత్తమ సలహాలు వాళ్ల దగ్గర పుష్కలంగా ఉన్నాయి.’ కుటుంబ జీవితం ఆనందంగా, ఆహ్లాదంగా ఉండడానికి ఏమి చేయాలో తెలియజేసే చాలా విషయాలు దేవుని వాక్యం నుండి మీరు తప్పకుండా నేర్చుకొనివుంటారు.

2. (ఎ) నేటి లోకంలో కుటుంబాలు ఎలా ఉండడం మీరు గమనించారు? (బి) కుటుంబ జీవితం గురించిన కొన్ని సలహాల్ని మనం బైబిల్లోని ఏ పుస్తకాల్లో చూడబోతున్నాం?

2 యెహోవా దినం దగ్గరపడుతున్న తరుణంలో, సాతాను ప్రత్యేకంగా కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నాడు. కాబట్టి మీకా కాలంలోలాగే, చాలామందికి తమ సొంత కుటుంబీకుల మీద నమ్మకం పోయింది. అందుకే మీకా ఇలా రాశాడు: ‘స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచుచున్నారు, ఎవరి ఇంటివారు వారికే విరోధులగుచున్నారు.’ (మీకా 7:5, 6) కుటుంబ వ్యవస్థ మీద గౌరవం తగ్గిన లోకంలో జీవిస్తున్నా, దాని నీడ మీమీద పడకుండా ఉండడానికి మీరు గట్టి ప్రయత్నం చేశారు. అందుకే మీ కుటుంబ జీవితం మరింత ఆహ్లాదంగా, దేవుణ్ణి మరింత సంతోషపెట్టేదిగా ఉంది. బహుశా మీరు, ద్వితీయోపదేశకాండము 6:5-9; ఎఫెసీయులు 5:22–6:4; కొలొస్సయులు 3:18-21 వంటి లేఖనాలను పాటించివుంటారు. అయితే, కుటుంబ సంతోషానికి తోడ్పడే సలహాలు ఏమైనా 12 పుస్తకాల్లో ఉన్నాయా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సంబంధించి, ఆ పుస్తకాల్లోని కొన్ని సలహాలను ఈ అధ్యాయంలో పరిశీలిస్తాం. అయితే, ఆ కొన్నిటితోనే సరిపెట్టుకోకండి. అలా నేర్చుకోవడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నామో గమనించండి, అదే పద్ధతిని ఉపయోగించి ఆ పన్నెండు పుస్తకాల్లో నుండి మరిన్ని పాఠాలు ఎలా నేర్చుకోవచ్చో అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి ఈ అధ్యాయం చివర్లో కొన్ని లేఖనాలు ఉన్నాయి.

‘విడాకులంటే యెహోవాకు అసహ్యం’

3, 4. (ఎ) నేడు చాలామంది తమ వైవాహిక సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలని చూస్తున్నారు? (బి) మలాకీ కాలంలో వివాహ బంధం పట్ల ప్రజల్లో ఏ నీచమైన వైఖరి ఉండేది?

3 కుటుంబం అనగానే ముందు మనకు గుర్తొచ్చేది భార్యాభర్తల బంధమే. వైవాహిక సమస్యలకు సులువైన పరిష్కారం విడాకులేనన్న భావన ఇటీవల ఎక్కువైపోయింది. ఒకప్పుడు విడాకులు తీసుకోవడమంటే గగనం. 19వ శతాబ్దంలో, ఇంగ్లండ్‌ దేశ వాసులు విడాకులు కావాలనుకుంటే పార్లమెంటు ఆమోదం పొందాల్సి వచ్చేది. ఆ తలనొప్పి ఎందుకని జనాలు విడాకులు తీసుకునే పరిస్థితి రాకుండా జాగ్రత్తపడేవాళ్లు, అలా కుటుంబాలు నిలబడేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా పేర్కొంది: “రెండవ ప్రపంచయుద్ధం తర్వాత చాలా దేశాల్లో విడాకుల రేటు గమనార్హంగా పెరిగింది . . . విడాకుల విషయంలో ప్రజల వైఖరి ఎంతగా మారిందంటే, . . . విడాకులు తీసుకోవడం మామూలు విషయమైపోయింది.” కొన్నేళ్ల క్రితం వరకు విడాకులకు ఆమోదం లేని కొరియా వంటి దేశాల్లో కూడా ఇప్పుడు విడాకులు సర్వసాధారణమైపోయాయి. వైవాహిక సమస్యలకు విడాకులు ఓ సులువైన పరిష్కారమని నేడు చాలా దేశాల్లోని ప్రజలు భావిస్తున్నారు.

4 మలాకీ కాలంలో అంటే సా.శ.పూ. 5వ శతాబ్దంలో యూదుల మధ్య విడాకుల రేటు చాలా ఎక్కువగా ఉండేది. మలాకీ వాళ్లకిలా చెప్పాడు: “యౌవన కాలమందు నీవు పెండ్లిచేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను.” భర్తల మోసాలకు బలైన భార్యల ‘కన్నీళ్లతో, రోదనలతో’ యెహోవా బలిపీఠం తడిసిపోయింది. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే, అవినీతిపరులైన యాజకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు!—మలాకీ 2:13, 14.

5. (ఎ) విడాకులను యెహోవా ఎలా పరిగణిస్తున్నాడు? (బి) జీవిత భాగస్వామి విషయంలో మోసపూరితంగా ప్రవర్తించడం ఎందుకు పెద్ద తప్పు?

5 మలాకీ కాలంలో, వివాహ బంధం పట్ల ప్రజలకున్న నీచమైన వైఖరిని యెహోవా ఎలా పరిగణించాడు? “విడాకులు అంటే నాకు అసహ్యం . . . అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెపుతున్నాడు” అని మలాకీ రాశాడు. అంతేకాదు, యెహోవా ‘మార్పులేనివాడు’ అని కూడా ఆయన స్థిరంగా చెప్పాడు. (మలాకీ 2:16, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; మలాకీ 3:6) మీకు విషయం అర్థమైందా? దేవుని ఉద్దేశం ఆదిలోనే విడాకులకు వ్యతిరేకంగా ఉంది. (ఆదికాండము 2:18, 24) మలాకీ కాలంలో కూడా ఆయన ఉద్దేశం అలాగే ఉంది. నేటికీ ఆ ఉద్దేశం మారలేదు. జీవిత భాగస్వామితో సంతృప్తి లేదనే కారణంతో కొందరు తమ భాగస్వామిని విడిచిపెట్టాలనుకుంటారు. వాళ్లు మోసపూరితంగా ఆలోచిస్తుండవచ్చు కానీ యెహోవా వాళ్ల హృదయాన్ని పరిశోధిస్తాడు. (యిర్మీయా 17:9, 10) విడాకుల కోసం తాము చూపించే కారణాలు సరైనవేనని అలాంటి వాళ్లు ఎంత సమర్థించుకున్నా, వాటి వెనకున్న మోసం లేదా కపట పన్నాగం యెహోవాకు తెలుసు. “మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.”—హెబ్రీయులు 4:13.

6. (ఎ) విడాకుల విషయంలో యెహోవా అభిప్రాయమే మీకూ ఉంటే ఎలా ప్రయోజనం పొందవచ్చు? (బి) విడాకుల గురించి యేసు ఇచ్చిన ఉపదేశంలో ముఖ్యమైన విషయం ఏమిటి?

6 బహుశా మీ వివాహ బంధంలో విడాకుల సమస్య లేకపోవచ్చు. అయినా మీరు యెహోవా అభిప్రాయాన్ని మనసులో ఉంచుకోవాలి. ఎవ్వరూ పరిపూర్ణులు కారు కాబట్టి వైవాహిక జీవితంలో సమస్యలు, అభిప్రాయభేదాలు వస్తాయి. అప్పుడు వాటి నుండి బయటపడడానికి విడాకులే శరణ్యమని మీరు అనుకుంటారా? ఎప్పుడైనా గొడవ తీవ్రస్థాయికి చేరుకుంటే మీరు విడాకుల మాటెత్తుతారా? చాలామంది అలా చేశారు. కానీ మీరు వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి మరింత పట్టుదలగా కృషి చేయాలన్నదే దేవుని ఉద్దేశం. అయితే, ఒక కారణాన్ని బట్టి విడాకులు తీసుకోవచ్చని యేసు చెప్పాడన్న మాట నిజమే. వ్యభిచారాన్ని బట్టి అంటే, అన్నిరకాల వివాహేతర సంబంధాలను బట్టి మాత్రమే విడాకులు తీసుకోవచ్చని ఆయన చెప్పాడు. అయితే, యేసు ఇచ్చిన ఉపదేశంలో ముఖ్యమైన విషయం ఏమిటి? ఆయన తన శ్రోతలతో ఇలా అన్నాడు: “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” అవును, నాటికి దాదాపు 450 ఏళ్ల క్రితం మలాకీ పేర్కొన్న యెహోవా సుస్థిరమైన ప్రమాణాన్ని యేసు సమర్థించాడు.—మత్తయి 19:3-9.

ఏదైనా తగాదా వచ్చినప్పుడు మీరు వెంటనే విడాకుల మాటెత్తుతారా?

7. మలాకీ పుస్తకంలోని ఉపదేశం ప్రకారం మీ వివాహ బంధాన్ని ఎలా పటిష్ఠంగా ఉంచుకోవచ్చు?

7 అయితే, క్రైస్తవ దంపతులు తమ బంధాన్ని ఎలా పటిష్ఠంగా ఉంచుకోవచ్చు? మలాకీ ఈ సలహా ఇచ్చాడు: “మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి.” (మలాకీ 2:16) అంటే, మన ప్రవర్తనను నిర్దేశించే మనోభావాలు సరైనవై ఉండేలా చూసుకోవాలి. మనం ‘మన మనసును కాచుకుంటే,’ పరాయి వ్యక్తి మీద తగని ఆసక్తి చూపించాలనే ప్రలోభానికి లోనుకాం. (మత్తయి 5:28) ఉదాహరణకు, పరాయి వ్యక్తి మనమీద చూపిస్తున్న ఆసక్తికి లేదా పొగొడ్తలకు మనసులో మురిసిపోతున్నామా? అదే గనుక జరిగితే, మన మనసును కాచుకునే విషయంలో నిద్రపోతున్నామని అర్థం. కాబట్టి, పటిష్ఠమైన వివాహ బంధాన్ని ఆస్వాదించే విషయంలో ఆ 12 పుస్తకాల నుండి మనం నేర్చుకోగల ఓ పాఠం ఏమిటంటే, మన ‘మనసును కాచుకోవాలి.’

హోషేయ గోమెరును వెనక్కి తెచ్చుకున్నాడు, ఇది యెహోవా గురించి మనకు ఏమి నేర్పిస్తోంది?

8, 9. హోషేయ, గోమెరుల వృత్తాంతం బైబిల్లో ఎందుకుంది?

8 మీ బంధం బీటలువారకుండా చూసుకోవాలని మీరు తప్పకుండా తీర్మానించుకొని ఉంటారు. అయినా, మీ మధ్య సమస్యలు రావచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ముఖ్యంగా తప్పంతా మీ జీవిత భాగస్వామిదే అని మీకు అనిపించినప్పుడు, దాన్ని మీరు సమర్థవంతంగా ఎలా పరిష్కరించుకోవచ్చు? ఈ పుస్తకంలోని 2వ, 4వ అధ్యాయాల్లో హోషేయ గురించి ఏమి ఉందో గుర్తుచేసుకోండి. హోషేయ భార్య గోమెరు “వ్యభిచారం చేయు స్త్రీ” అయ్యింది, ‘తన విటకాండ్ర వెంట’ వెళ్లిపోయింది. హోషేయ ఆమెను వదిలేశాడు, అప్పుడామె దిక్కులేక బానిసబతుకు బతకాల్సి వచ్చింది. హోషేయ డబ్బిచ్చి గోమెరును వెనక్కి తెచ్చుకున్నాడు, దేవుడు ఆమెను ప్రేమించమని హోషేయకు చెప్పాడు. ఎందుకని? యెహోవాకు, ఇశ్రాయేలుకు మధ్య జరుగుతున్న దాన్ని నాటకీయంగా వివరించడానికే అలా చేయమని చెప్పాడు. యెహోవా ‘భర్తగా’ ఉన్నాడు, ఆయన ప్రజలు ఆయనకు భార్య అయ్యారు.—హోషేయ 1:2-9; 2:5-7; 3:1-5; యెషయా 54:5; 62:4, 5.

9 వేరే దేవతలను పూజించి యెహోవా మనోభావాల్ని గాయపర్చడం ఇశ్రాయేలీయులకు కొత్తేమీ కాదు. (నిర్గమకాండము 32:7-10; న్యాయాధిపతులు 8:33; 10:6; కీర్తన 78:40, 41; యెషయా 63:10) పది గోత్రాల ఉత్తర రాజ్య ప్రజలు ప్రత్యేకించి దూడ ఆరాధన విషయంలో దోషులు. (1 రాజులు 12:28-30) దానికితోడు, ఇశ్రాయేలీయులు తమ భర్త అయిన యెహోవాపై ఆధారపడకుండా తమ రాజకీయ ప్రియులను ఆశ్రయించారు. ఒకానొక సమయంలో, మదమెక్కిన అడవి గాడిదలా ఇశ్రాయేలీయులు అష్షూరు వెంటబడి పోయారు. (హోషేయ 8:9) మీ జీవిత భాగస్వామి అలా ప్రవర్తిస్తే మీకెలా అనిపిస్తుంది?

10, 11. మీ సంసారంలో సమస్య వచ్చినప్పుడు తప్పంతా మీ జీవిత భాగస్వామిదేనని మీకనిపిస్తే మీరు ఎలా యెహోవాను అనుకరించవచ్చు?

10 హోషేయ కాలానికల్లా, యెహోవా ఇశ్రాయేలీయులతో నిబంధన చేసి 700 కన్నా ఎక్కువ ఏళ్లు గడిచిపోయాయి. అయితే యెహోవా వాళ్లను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఒక షరతు మీద. వాళ్లు ఆయన దగ్గరకు తిరిగి రావాలి. హోషేయ సా.శ.పూ. 803కు ముందే ప్రవచించడం మొదలుపెట్టాడని అంచనా. ఆ లెక్కన, యెహోవా ఇశ్రాయేలీయుల విషయంలో మరో 60 ఏళ్లు, యూదుల విషయంలోనైతే దాదాపు 200 ఏళ్లు సహనం చూపించాడన్నమాట! హోషేయ కుటుంబ పరిస్థితిని ఓ ఉపమానంగా చూపించి యెహోవా తన నిబంధనా ప్రజల్ని పశ్చాత్తాపపడమని అభ్యర్థిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయులతో భర్తలా తాను చేసిన నిబంధనను రద్దు చేసుకోవడానికి యెహోవాకు బలమైన కారణాలు ఉన్నాయి. అయితే, తనకు నష్టం వాటిల్లినా యెహోవా తన భార్యలాంటి ఇశ్రాయేలీయుల్ని తన దగ్గరికి తిరిగి రమ్మని ప్రోత్సహించడానికి తన ప్రవక్తల్ని పంపిస్తూ వచ్చాడు.—హోషేయ 14:1, 2; ఆమోసు 2:11.

11 మీ సంసారంలో ఏదైనా సమస్య వచ్చి, అందులో తప్పంతా మీ జీవిత భాగస్వామిదేనని మీకనిపిస్తే మీరు యెహోవాలా స్పందిస్తారా? మీ బంధం అంతకుముందులా కొనసాగడానికి మీరే ప్రయత్నిస్తారా? (కొలొస్సయులు 3:12, 13) అలా చేయడానికి వినయం కావాలి. ఇశ్రాయేలీయులతో వ్యవహరిస్తున్నప్పుడు యెహోవా ఎంత చక్కని ఆదర్శాన్ని ఉంచాడో కదా! (కీర్తన 18:35; 113:5-8) దేవుడు ‘ఇశ్రాయేలీయులతో ప్రేమగా మాట్లాడాడు,’ చివరికి బతిమాలాడు కూడా. అలాంటప్పుడు అపరిపూర్ణులమైన మనం సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, పొరపాట్లను చూసీచూడనట్టు వదిలేయడానికి, మన జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడడానికి ఇంకెంత కృషి చేయాలి? యెహోవా ప్రయత్నాల వల్ల కొన్ని మంచి ఫలితాలు వచ్చాయని గమనించండి. బబులోనులో బంధీలుగా ఉన్నప్పుడు కొందరు ఇశ్రాయేలీయులు యెహోవా వైపుకు తిరిగారు, తర్వాత యెహోవాను ‘తమ పురుషునిగా’ లేదా భర్తగా అంగీకరించి స్వదేశానికి తిరిగొచ్చారు.—హోషేయ 2:14-16. a

ఏ సమస్యలు వచ్చినా, వాటిని పరిష్కరించుకోవడానికి యెహోవాలా చొరవ తీసుకొని మాట్లాడండి

12. యెహోవా తన భార్యలాంటి ఇశ్రాయేలీయులతో వ్యవహరించిన తీరు గురించి ధ్యానించడం, మీ కాపురానికి ఎలా ఉపయోగపడుతుంది?

12 ఏదైనా పెద్ద సమస్య తలెత్తినప్పుడు, మీ కాపురాన్ని దిద్దుకోవడానికి మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు రావచ్చు. దేవుడు తన భార్యలాంటి ఇశ్రాయేలీయులు చేసిన ఆధ్యాత్మిక వ్యభిచారమనే ఘోరమైన పాపాన్ని కూడా క్షమించడానికి సిద్ధపడ్డాడు. క్రైస్తవుల కాపురంలో తలెత్తే చాలా సమస్యలు అంత దూరం వెళ్లకపోవచ్చు. కఠినమైన లేదా గాయపర్చే మాటలతోనే చాలా సమస్యలు మొదలౌతాయి. మీ భాగస్వామి మాట్లాడిన కత్తిపోటులాంటి మాటలు మిమ్మల్ని నొప్పిస్తే హోషేయకు, యెహోవాకు ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకోండి. (సామెతలు 12:18) మీ భాగస్వామిని క్షమించడానికి అది మీకు సహాయం చేయదంటారా?

13. దారితప్పిన తన ప్రజలు పశ్చాత్తాపం చూపించాలని యెహోవా కోరాడనే వాస్తవం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

13 ఈ చారిత్రక ఘట్టంలో గమనించదగ్గ అంశం మరొకటి ఉంది. ఇశ్రాయేలీయులు తమ వ్యభిచారాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటే దేవుడు వాళ్లతో సమాధానపడడానికి సుముఖంగా ఉంటాడా? వ్యభిచారంలో మునిగితేలుతున్న జనాంగం గురించి దేవుడు హోషేయతో ఇలా అన్నాడు: ‘ఆమె పోకిరి చూపు చూడకూడదు, తన స్తనములకు పురుషులను చేర్చుకోకూడదు.’ (హోషేయ 2:3) ప్రజలు పశ్చాత్తాపపడాలి, ‘మారుమనస్సుకు తగిన ఫలము ఫలించాలి.’ (మత్తయి 3:7) కాబట్టి, మీ జీవిత భాగస్వామి బలహీనతలపై కాకుండా మీ బలహీనతలపై దృష్టిపెట్టండి. తప్పు మీదైతే, మీరే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరి, మీ ప్రవర్తనను మార్చుకుని మీ బంధాన్ని బాగుచేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? అప్పుడు క్షమాపణ అనే చక్కని ఫలితం మీకు దక్కవచ్చు.

‘ప్రేమబంధాలే’ క్రమశిక్షణకు ఆధారం

14, 15. (ఎ) మలాకీ 4:1 లో ఉన్నదాని ప్రకారం మీ పిల్లలకు బోధించే బాధ్యతను మీరు ఎందుకు గంభీరంగా తీసుకోవాలి? (బి) మీ పిల్లలు యెహోవాను తెలుసుకోవడానికి మీరు ఎలా సహాయం చేయవచ్చు?

14 కుటుంబ జీవితానికి సంబంధించి, ఇశ్రాయేలీయులతో యెహోవా వ్యవహారాల నుండి మనం మరిన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అవి ఆ 12 పుస్తకాల్లో ఉన్నాయి. మీ పిల్లలకు ఎలా సహాయం చేయాలనే దాని గురించి వాటిలో కొన్ని సూచనలున్నాయి. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లిదండ్రులు తమ బాధ్యతను గంభీరంగా తీసుకోవాలి. లేఖనాల్లో ఇలా ఉంది: “వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండ, రాబోవుదినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకీ 4:1) చిన్నపిల్లల (చిగురు) బాధ్యత తల్లిదండ్రులదే (వేర్లదే) కాబట్టి, తీర్పుదినాన యెహోవా తల్లిదండ్రులకు తీర్చే న్యాయవంతమైన తీర్పు ప్రభావం చిన్నపిల్లల మీద పడుతుంది. (యెషయా 37:31) పిల్లల భవిష్యత్తు బాగుంటుందా, పాడౌతుందా అన్నది తల్లిదండ్రుల జీవన విధానం మీదే ఆధారపడివుంటుంది. (హోషేయ 13:16) మీరు (వేర్లు) యెహోవాతో మంచి సంబంధాన్ని కాపాడుకోలేకపోతుంటే, ఉగ్రత దినాన మీ చిన్నారులకు (చిగురుకు) ఏమి జరగవచ్చు? (జెఫన్యా 1:14-18; ఎఫెసీయులు 6:4; ఫిలిప్పీయులు 2:12) అదే మీరు దేవుని ఆమోదం కోసం నమ్మకంగా కృషి చేశారనుకోండి, అప్పుడు మీ పిల్లలకు ప్రయోజనాలు చేకూర్చినవాళ్లౌతారు.—1 కొరింథీయులు 7:14.

15 యెహోవా పేరున ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్న యోవేలు ప్రవచనాన్ని ఉల్లేఖించిన తర్వాత, అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?” (రోమీయులు 10:14-17; యోవేలు 2:32) బయటి వాళ్లకు ప్రకటించడం గురించే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నా, ఇందులోని సూత్రం మీ పిల్లలకు బోధించడానికి కూడా వర్తిస్తుంది. యెహోవా గురించి వినకుండా పిల్లలు ఆయన మీద ఎలా విశ్వాసం ఉంచగలరు? యెహోవా పట్ల, ఆయన మార్గనిర్దేశం పట్ల లోతైన ప్రేమను మీ పిల్లల్లో నాటుతూ ఆయన ఎంత మంచివాడో వాళ్లకు నేర్పించడానికి ప్రతీరోజు సమయం కేటాయిస్తున్నారా? ఇంట్లో పిల్లలు యెహోవా గురించి వింటూ ఉంటే, వాళ్లు ఆధ్యాత్మికంగా మంచి ప్రగతి సాధిస్తారు.—ద్వితీయోపదేశకాండము 6:7-9.

16. మీ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టేటప్పుడు, మీకా 6:3-5 లో యెహోవా వ్యవహరించిన తీరును మీరెలా అనుకరించవచ్చు?

16 మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్లను కూటాలకు తీసుకెళ్లడం తేలికే. అయితే వాళ్లు ఎదుగుతుండగా వాళ్లకంటూ ఓ సొంత ఆలోచనా తీరు అలవడుతుంది. వాళ్లు అప్పుడప్పుడు మీ మాట వినకపోతే, వాళ్లను మీరు ఎలా దారిలో పెడతారు? ఆ 12 పుస్తకాలను పరిశీలిస్తూ యెహోవా ఇశ్రాయేలుతో, యూదాతో వ్యవహరించిన తీరు నుండి మీరు ఎంతో నేర్చుకోవచ్చు. (జెకర్యా 7:11, 12) ఉదాహరణకు, మీకా 6:3-5 చదువుతూ ఆ లేఖనంలో ఏ భావాలు ఉట్టిపడుతున్నాయో గమనించండి. ఇశ్రాయేలీయులు తప్పు చేశారు; అయినా దేవుడు వాళ్లను “నా జనులారా” అని సంబోధించాడు. ‘నా జనులారా, మనస్సునకు తెచ్చుకొనుడి’ అని బతిమాలాడు. వాళ్లను కఠినంగా నిందించకుండా, వాళ్ల హృదయాల్ని స్పృశించడానికి ప్రయత్నించాడు. మీ పిల్లలను క్రమశిక్షణలో పెట్టేటప్పుడు కూడా మీరు యెహోవాను అనుకరించగలరా? వాళ్లెంత పెద్ద తప్పు చేసినా, వాళ్లు ఇంట్లో ముఖ్యమైనవాళ్లు అన్నట్టుగా వ్యవహరించండి, వాళ్లను అవమానపర్చేలా మాట్లాడకండి. వాళ్లను తిట్టకుండా బుజ్జగిస్తూ మాట్లాడండి. వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రశ్నలు అడగండి. వాళ్లు మనసువిప్పి మాట్లాడేలా వాళ్ల హృదయాన్ని చేరుకోండి.—సామెతలు 20:5.

17, 18. (ఎ) మీ పిల్లలకు క్రమశిక్షణ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏదై ఉండాలి? (బి) మీ పిల్లలతో “ప్రేమబంధాలను” ఎలా కాపాడుకోవచ్చు?

17 మీరు మీ పిల్లలను ఎందుకు క్రమశిక్షణలో పెడతారు? కుటుంబ గౌరవానికి ఎక్కడ మచ్చ వస్తుందోననే భయంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెడతారు. యెహోవా తాను క్రమశిక్షణ ఇవ్వడానికి గల కారణమేంటో ఈ మాటల్లో చెప్పాడు: ‘ఎఫ్రాయిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; స్నేహబంధములతో [“ప్రేమబంధాలతో,” పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం] నేను వారిని బంధించి ఆకర్షించితిని.’ (హోషేయ 11:3, 4) యెహోవా, ఇశ్రాయేలుల బంధాన్ని తండ్రీకొడుకుల బంధంతో హోషేయ ఇక్కడ పోల్చాడు. ఓ ప్రేమగల తండ్రి, బుడిబుడి అడుగులు వేస్తున్న తన కొడుకును చేయి పట్టుకొని నడిపించడం ఒకసారి ఊహించుకోండి. పిల్లవాడు పడిపోకుండా, అటుఇటు వెళ్లిపోకుండా నాన్న చేయి వాడికి ఆసరాగా ఉంటుంది.—యిర్మీయా 31:1-3.

తల్లిదండ్రులారా, పిల్లలపై ప్రేమ చూపించే విషయంలో మీరు యెహోవాను అనుకరిస్తున్నారా?

18 దేవునికి ఇశ్రాయేలీయుల మీద ఉన్న ప్రేమను మీరు అనుకరిస్తారా? వాళ్లు పదేపదే ఆయన మీద తిరుగుబాటు చేశారు, కానీ ప్రేమబంధాలను ఆయన వెంటనే తెగిపోనివ్వలేదు. కొన్నిసార్లు పిల్లలు దారితప్పేందుకు మొగ్గుచూపుతుంటారు, చిన్నచిన్న వాటికే పడిపోతుంటారు. అయినాసరే మీకూ వాళ్లకూ మధ్య ఉన్న ప్రేమబంధాల ముడి ఊడిపోనివ్వకండి. తన ప్రజలు తప్పు చేసినప్పుడు ఆయన పక్షపాతం చూపించలేదని గుర్తుంచుకోండి. ఆయన వాళ్ల తప్పును తప్పని ఖండించాడు, ప్రేమగా క్రమశిక్షణ ఇచ్చాడు, కావాల్సిన సహాయం అందేలా ఏర్పాట్లు చేయడానికి సమయం వెచ్చించాడు. మీ అమ్మాయి గానీ అబ్బాయి గానీ సత్యం నుండి మెల్లిమెల్లిగా దూరమౌతున్నట్టు అనిపిస్తే, ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆ సమస్యాత్మక పరిస్థితిలో, చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా ఆప్యాయంగా సహకరిస్తూ వాళ్లను మళ్లీ దారిలోకి తెండి. వాళ్లతో సమయం గడపండి. దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

19. మీ పిల్లల విషయంలో మీరు ఎందుకు ఆశలు వదులుకోకూడదు?

19 కొందరు ఇశ్రాయేలీయులు క్రమశిక్షణను స్వీకరిస్తారని హోషేయ ముందే ప్రవచించాడు. ఆయనిలా అన్నాడు: “ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.” (హోషేయ 3:5) అవును, దేవుడు ఇచ్చిన క్రమశిక్షణ వల్ల కొందరు ఇశ్రాయేలీయులు మారారు. మీ పిల్లలు కూడా మీరిచ్చే క్రమశిక్షణకు స్పందిస్తారనే నమ్మకంతో ఉండండి. వాళ్లలో మంచిని చూడడానికి ప్రయత్నించండి. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు దయగా ఉండండి, అలాగని బైబిలు సూత్రాల విషయంలో రాజీపడకండి, వాటికి స్థిరంగా కట్టుబడి ఉండండి. తిరుగుబాటు ధోరణి ఉన్న పిల్లలు ఇప్పుడు మారకపోయినా, ముందుముందు మారతారేమో ఎవరికి తెలుసు?

చెడు సహవాసాల విషయంలో జాగ్రత్త!

20. సహవాసాలకు సంబంధించిన ఏ ప్రశ్నకు జవాబు ఆ 12 పుస్తకాల్లో ఉంది?

20 పిల్లలారా, యువతీయువకులారా, మీరు ఆ 12 పుస్తకాల నుండి ఏమి నేర్చుకోవచ్చు? మీ అమ్మానాన్నలు లేఖనాల నుండి మీకు బోధిస్తున్నప్పుడు, చెడు సహవాసాలకు దూరంగా ఉండమని చెప్పే1 కొరింథీయులు 15:33ను చాలాసార్లు ప్రస్తావించివుంటారు. ‘కానీ యెహోవాను ఆరాధించని వాళ్లతో స్నేహం చేయడం నిజంగా అంత ప్రమాదకరమా?’ అనే సందేహం మీకు రావచ్చు. దీనికి సమాధానం ఆ 12 పుస్తకాల్లో ఉంది.

21-23. (ఎ) ఎదోమీయులు చేసిన స్నేహం నుండి యువత ఏ పాఠం నేర్చుకోవచ్చు? (బి) నిజానికి మీ స్నేహితులు ఎవరు?

21 ఆ 12 పుస్తకాలు ముఖ్యంగా దేవుని ప్రజలను ఉద్దేశించినవే అయినా, ఓబద్యా పుస్తకం ఎదోమీయులను ఉద్దేశించి రాయబడింది. ఆ ఎదోమీయులు ఇశ్రాయేలీయులకు సోదరులని లేఖనాలు చెబుతున్నాయి. b (ద్వితీయోపదేశకాండము 2:4) ఆ 12 పుస్తకాల్లో చాలావాటికి భిన్నంగా ఓబద్యా పుస్తకం ఎదోమీయుల జనాంగాన్ని “నీవు” అని సంబోధిస్తోంది. మనం కాసేపు ఆ ఎదోమీయుల గురించి ఆలోచిద్దాం. అది సుమారు సా.శ.పూ. 607, యెరూషలేము మీద దాడి జరుగుతున్న సమయం. ఎదోమీయులు ఇశ్రాయేలీయులకు రక్తసంబంధులే కానీ బబులోనీయులతో చేతులు కలిపారు! “దానిని నాశనముచేయుడి సమూలధ్వంసము చేయుడి” అని ఎదోమీయులు అరిచారు. (కీర్తన 137:7; ఓబద్యా 10, 12) వాళ్లు యూదా దేశాన్ని ఆక్రమించుకోవాలని పథకం వేశారు. వాళ్లు బబులోనీయులతో కలిసి భోజనం చేశారు. పూర్వం మధ్యప్రాచ్య దేశాల్లో, అలా రెండు రాజ్యాలు కలిసి భోజనం చేశాయంటే రెండు వర్గాల మధ్య సంధి కుదిరినట్టే.

22 ఓబద్యా ఎదోమీయుల గురించి ఏమి ప్రవచించాడో గమనించండి: “నీతో సంధి చేసినవారు [బబులోనీయులు] నిన్ను తమ సరిహద్దువరకు పంపివేయుదురు; నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు; వారు నీ యన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు; ఎదోమునకు వివేచన లేకపోయెను.” (ఓబద్యా 7) బబులోనీయులతో చేతులు కలిపి తమ సోదరులైన ఇశ్రాయేలీయులకు అన్యాయం చేసిన ఎదోమీయులకు చివరకు ఏమి జరిగింది? నెబోనైడస్‌ ఆధ్వర్యాన బబులోనీయులు ఎదోమీయులను నాశనం చేశారు. మలాకీ కాలానికల్లా, దేవుడు ఎదోము పర్వతాలను పాడు చేసి, వాళ్ల స్వాస్థ్యాన్ని నక్కలపాలు చేశాడు.—మలాకీ 1:3.

23 ఇప్పుడు, మీ స్నేహితుల్లో యెహోవాను ఆరాధించని వాళ్ల గురించి ఆలోచించండి. ‘సంధి చేసుకున్నవాళ్లు’ లేదా స్నేహితులు ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఒకరికొకరు ‘ఉరియొడ్డడం’ మీరు చూశారా? వాళ్ల భండారం బయటపడినప్పుడు వాళ్లు ఏ సంజాయిషీ ఇచ్చుకుంటారు? తమ చేతిలో మోసపోయినవాళ్లు మోసాలను పసిగట్టలేనంత చవటలని వాళ్లు అంటారు. బబులోనీయులు తమ స్నేహితులైన ఎదోమీయులతో వ్యవహరించిన తీరు కూడా అచ్చం అలాగే ఉంది కదా! మీ కష్టాల్లో అలాంటి “స్నేహితులు” మీకు నిజంగా అండగా ఉంటారా? (ఓబద్యా 13-16) ఇప్పుడు, యెహోవా గురించి, ఆయన్ను ఆరాధించేవాళ్ల గురించి ఆలోచించండి. యెహోవా మీకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కష్టాలను తట్టుకోవడానికి ఆయన మీకు చేయందిస్తాడు. ఆయన ప్రజలు కూడా ‘విడువక ప్రేమించే నిజమైన స్నేహితుల్లా,’ ‘దుర్దశలో’ తోడుగా ఉండే నమ్మకస్థుల్లా ఉంటారు.—సామెతలు 17:17.

మీ స్నేహితులమని చెప్పుకునేవాళ్లు మీకు ‘ఉరియొడ్డుతున్నారా’?

అత్యంత ప్రాముఖ్యమైన బంధానికి విలువివ్వండి

24, 25. మన జీవిత ధ్యేయం ఏమై ఉండాలి?

24 అవును, కుటుంబ బంధాలు చాలా ప్రాముఖ్యమైనవి, వాటిని పదిలంగా ఉంచుకోవడానికి మనం కృషి చేయాల్సిందే. ఆ 12 మంది ప్రవక్తలు రాసిన పుస్తకాల్లో కుటుంబ బంధాలకు సంబంధించి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మీరు ఆ పుస్తకాలను చదవండి. ఈ అధ్యాయంలో మనం ఉపయోగించిన పద్ధతిని పాటించండి. అలాచేస్తే, మీ కుటుంబ జీవితం మెరుగుపడేందుకు తోడ్పడే మరిన్ని పాఠాలు మీరు నేర్చుకోగలుగుతారు. ఇంతకీ, సంతోషకరమైన కుటుంబ జీవితం నేటి దేవుని ఆరాధకులకు అంత ప్రాముఖ్యమైన విషయమా?

25 ఆసక్తికరంగా, యెహోవా దినం రావడం గురించి మాట్లాడుతూ యోవేలు ఇలా ప్రవచించాడు: ‘జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు, పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.’ (యోవేలు 2:15, 16) అంటే, ఇంటిల్లిపాది యెహోవా ఆరాధనకు సమకూడాల్సిందే. కొత్తకొత్త ఊహల్లో తేలియాడే నవదంపతులకు కూడా మినహాయింపు లేదు! యెహోవా ఆరాధనకు సమకూడడం కన్నా ఏదీ ప్రాముఖ్యం కాదు. యెహోవా దినం చాలా వేగంగా దగ్గరపడుతోంది కాబట్టి, ఆయన దృష్టిలో మంచి స్థానాన్ని కలిగివుండడమే మన ధ్యేయమై ఉండాలి. అయితే ఈ పుస్తకంలోని ఆఖరి భాగంలో, నేడు మనం దేన్ని సంతోషంగా చేస్తూ ఉండాలో పరిశీలిస్తాం.

a క్రైస్తవ కుటుంబంలో భర్త లేదా భార్య వ్యభిచారానికి పాల్పడితే, ఆ వ్యక్తిని క్షమించాలో వద్దో నిరపరాధియైన భాగస్వామి నిర్ణయించుకోవాలి.—మత్తయి 19:9.

b ఆ 12 పుస్తకాల్లో వేరే ప్రజలను ఉద్దేశించి రాసిన పుస్తకం మరొకటి ఉంది. అది నహూము పుస్తకం, అది నీనెవె ప్రజల్ని ఉద్దేశించి రాయబడింది.