7వ అధ్యాయం
యెహోవా ఉన్నత ప్రమాణాలకు తగ్గట్లు ఆయనను సేవించండి
1. జెఫన్యా కాలంలోని యెరూషలేము వాసులు యెహోవా ప్రమాణాల గురించి ఏమి అనుకున్నారు?
“యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడు.” జెఫన్యా కాలంలోని యెరూషలేము వాసుల ఆలోచన అది. తమ జీవితానికి యెహోవా దేవుడు ప్రమాణాలేమీ ఏర్పర్చలేదని వాళ్లు అనుకున్నారు. నిలవ ఉన్న ద్రాక్షారసం అడుగున పేరుకుపోయే ‘మడ్డిలా’ వాళ్లు తయారౌతున్నారని జెఫన్యా అన్నాడు. తమ వ్యవహారాల్లో యెహోవా జోక్యం చేసుకుంటాడని తెలిపే ప్రకటనలేవీ పట్టనట్లు వాళ్లు సౌకర్యవంతంగా జీవించాలనుకున్నారన్నది జెఫన్యా ఉద్దేశం. అయితే, “నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును” అని, తన ప్రమాణాలను పట్టించుకోని వాళ్లను “శిక్షింతును” అని యెహోవా ఆ యూదులతో చెప్పాడు. అవును, యెహోవా దేవుడు ప్రమాణాలను ఏర్పరుస్తాడు, తన ప్రజలు వాటిని ఎలా దృష్టిస్తారన్నది కూడా గమనిస్తాడు.—జెఫన్యా 1:12.
2. ప్రమాణాల ప్రకారం జీవించడం గురించి మీ ప్రాంతంలోని ప్రజలు ఏమనుకుంటున్నారు?
2 ఈ రోజుల్లో కూడా ప్రమాణాల ప్రకారం జీవించడం అన్న ఆలోచనే చాలామందికి గిట్టదు. అలాంటి వాళ్లు “నీకు నచ్చిందే చెయ్” అనడం మీరు వినేవుంటారు. కావాల్సినంత డబ్బు లేనప్పుడు లేదా కోరికలు తీర్చుకోలేనప్పుడు కొంతమంది ‘వాటికోసం నేనేం చేసినా ఫర్వాలేదు’ అనుకుంటారు. అంతేగానీ దేవునికి ఏమనిపిస్తుంది, మనం ఏమి చేయాలని ఆయన ఆశిస్తున్నాడు వంటివేవీ వాళ్లు పెద్దగా పట్టించుకోరు. మరి మీకు ఏమనిపిస్తుంది? మనల్ని సృష్టించినవాడు మనకోసం ప్రమాణాలను ఏర్పర్చడమనే ఆలోచన మీకు నచ్చుతుందా?
3, 4. ప్రమాణాలు ఉండడం మంచిదని మీరెందుకు అనుకుంటున్నారు?
3 దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడమనే ఆలోచనను ఇష్టపడని చాలామంది, జీవితంలోని వివిధ రంగాల్లో మనుషులు పెట్టిన ప్రమాణాలను అంగీకరించడానికి మాత్రం అస్సలు సంకోచించరు. ఉదాహరణకు, నీటి స్వచ్ఛతకు సంబంధించిన ప్రమాణాల విషయమే తీసుకోండి. తాగునీటి స్వచ్ఛతకు సంబంధించి చాలా ప్రభుత్వాలు ప్రమాణాలు ఏర్పరుస్తాయి. ఒకవేళ ఆ ప్రమాణాలు మరీ హీనంగా ఉంటే ఏమౌతుంది? అందరూ, ముఖ్యంగా పిల్లలు అతిసారం, తదితర నీటి సంక్రమిత వ్యాధుల బారినపడతారు. అయితే, తాగునీటికి సంబంధించి ఉన్నత ప్రమాణాలు ఉండడం వల్ల మీరు ప్రయోజనం పొందుతుండవచ్చు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డయిజేషన్ (ISO) ఇలా అంటోంది: “ప్రమాణాలే లేకపోతే, దుష్పరిణామాలు వెంటనే కనిపిస్తాయి. నాణ్యతను, భద్రతను, విశ్వసనీయతను, సమర్థతను, వస్తువుల మార్పిడి విలువను పెంచే విషయంలో, అలాంటి ప్రయోజనాల్ని తక్కువ ధరకు అందించే విషయంలో ప్రమాణాలు పోషించే పాత్ర గురించి మనకు అంత అవగాహన లేదు.”
4 జీవితంలోని వివిధ రంగాల్లో ప్రమాణాలు ఉండడం ప్రాముఖ్యమని మీకు అనిపిస్తుందా? అలాగైతే, దేవుడు తన నామం ధరించిన ప్రజల కోసం ఉన్నత ప్రమాణాలు ఏర్పరచాలని ఆశించడం సబబు కాదా?—అపొస్తలుల కార్యములు 15:14.
దేవుని ప్రమాణాలు పాటించలేనంత కష్టమైనవా?
5. యెహోవా తన ప్రమాణాల ప్రకారం జీవించాల్సిన ప్రాముఖ్యతను ఆమోసు ద్వారా ఎలా చూపించాడు?
5 ఇంటి నిర్మాణానికి ప్రమాణాలు తప్పనిసరి. ఒక్క గోడ నిటారుగా లేకపోయినా, ఇల్లంతా ఒకవైపుకు ఒరిగిపోయే ప్రమాదముంది. లేదా గోడల మూలల్లో ఖాళీలు ఉంటే ఆ ఇల్లు నివాసానికి పనికిరాదు. సా.శ.పూ. 9వ శతాబ్దంలో ప్రవక్తగా సేవచేసిన ఆమోసుకు పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యానికి సంబంధించి కలిగిన ఓ దర్శనంలోని విషయం అదే. యెహోవా “మట్టపుగుండు చేత పట్టుకుని” ఒక గోడ మీద నిలబడి ఉండడం ఆమోసు చూశాడు. “నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపుగుండు వేయబోవుచున్నాను. నేనికను వారిని దాటిపోను [“శిక్షించకుండా ఉండను,” పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం]” అని దేవుడు అన్నాడు. (ఆమోసు 7:7-9) మట్టపుగుండు అంటే తాడుకు వేలాడి ఉండే ఒకలాంటి బరువైన వస్తువు. గోడ నిట్టనిలువుగా ఉందో లేదో చూడడానికి దాన్ని ఉపయోగిస్తారు. ఆమోసు చూసిన దర్శనంలో యెహోవా నిలబడిన గోడ, ‘మట్టపుగుండు పెట్టి చక్కగా కట్టబడింది.’ ఆ గోడ ఎటూ ఒరిగిపోకుండా నిటారుగా ఉంది. అయితే, దేవుడు పరీక్షించినప్పుడు, ఆమోసు కాలంలోని ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మికత కూడా నిటారుగా లేని గోడలానే ఉంది. సాధారణంగా అలాంటి గోడను పడిపోకముందే కూల్చేయాలి.
6. (ఎ) ఆ 12 పుస్తకాల్లో పదేపదే తారసపడే ఒక అంశం ఏమిటి? (బి) యెహోవా ప్రమాణాలు పాటించలేనంత కష్టమైనవి కావని ఎలా చెప్పవచ్చు?
6 ‘దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడం చాలా ముఖ్యం’ అనే అంశం ఆ 12 పుస్తకాల్లో పదేపదే మీకు తారసపడుతుంది. ఆ పుస్తకాల్లోని సందేశాలన్నీ దేవుని ఉన్నత ప్రమాణాల ప్రకారం జీవించని ప్రజల మీద కురిపించిన విమర్శలే కాదు. యెహోవా తన ప్రజలను పరిశోధించినప్పుడు కొన్నిసార్లు వాళ్లు తన ప్రమాణాల ప్రకారం జీవిస్తుండడం చూశాడు. అంటే వాళ్లు యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించగలిగారు. దీన్నిబట్టి యెహోవా ప్రమాణాలు పాటించలేనంత కష్టమైనవి కావని, మనలాంటి అపరిపూర్ణ మనుషులు వాటి ప్రకారం జీవించడం సాధ్యమేనని అర్థమౌతోంది. ఒక ఉదాహరణ చూడండి.
7. అపరిపూర్ణ మనుషులు దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడం సాధ్యమేనని మనం అర్థం చేసుకోవడానికి జెకర్యా మనకు ఎలా సహాయం చేస్తున్నాడు?
7 బబులోను నుండి తిరిగివచ్చిన యూదులు ఆలయానికి పునాది వేసిన తర్వాత, పునర్నిర్మాణ పని ఆగిపోయింది. ఆ పని మళ్లీ ప్రారంభించమని ప్రజల్ని ప్రోత్సహించడానికి యెహోవా హగ్గయి, జెకర్యా ప్రవక్తలను పంపించాడు. యూదా అధిపతియైన జెరుబ్బాబెలు ఓ “గుండు నూలు” లేదా మట్టపుగుండు పట్టుకుని ఉన్నట్లు జెకర్యాకు కలిగిన ఒక దర్శనంలో యెహోవా వర్ణించాడు. జెరుబ్బాబెలు “పైరాయి” లేదా తలరాయి పెట్టడంతో ఆలయ నిర్మాణం పూర్తయింది. నిర్మాణమంతా దేవుని ప్రమాణాల ప్రకారమే జరిగింది. (జెకర్యా 4:10) పూర్తైన ఆలయం గురించి మాట్లాడుతున్న సందర్భంలో, “లోకమంతటను సంచారము చేయు యెహోవాయొక్క యేడు నేత్రముల” గురించి లేఖనాలు ప్రస్తావించడం ఆసక్తికరమైన విషయం. జెరుబ్బాబెలు తలరాయిని దాని స్థానంలో పెట్టడం దేవుడు చూశాడు. పునర్నిర్మిత ఆలయం తన ప్రమాణాలకు తగినట్లుగా ఉందో లేదో, సమస్తాన్ని చూడగల తన నేత్రాలతో యెహోవా పరిశోధించాడు. అప్పుడు అది అన్నివిధాలుగా సరిపోయిందని ఆయన నిర్ధారించాడు. దీన్నిబట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే యెహోవా ప్రమాణాలు ఉన్నతమైనవైనా, మనుషులు పాటించలేనంత కష్టమైనవి మాత్రం కాదు. హగ్గయి, జెకర్యాల ప్రోత్సాహంతో జెరుబ్బాబెలు, అతని ప్రజలు వాటిని పాటించారు. జెరుబ్బాబెలులాగే మీరు కూడా దేవుడు ఆశించినట్లు జీవించగలరు. అది తెలుసుకోవడం మనలో ఎంత ధైర్యాన్ని నింపుతుందో కదా!
యెహోవా ప్రమాణాలను ఎందుకు స్వాగతించాలి?
8, 9. (ఎ) మనుషుల కోసం యెహోవా దేవుడు ప్రమాణాలను ఏర్పర్చడం ఎందుకు సరైనది? (బి) ఇశ్రాయేలీయులు తన ఆజ్ఞలను పాటించాలని యెహోవా ఆశించడం ఎందుకు సబబు?
8 యెహోవా మన సృష్టికర్త కాబట్టి, మన కోసం ప్రమాణాలను ఏర్పర్చి వాటి ప్రకారం మనం జీవించాలని ఆశించే హక్కు ఆయనకు ఉంది. (ప్రకటన 4:10, 11) అయితే మనకు ఆయన ప్రతీది పూసగుచ్చినట్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మంచి నిర్దేశం ఇవ్వగల మనస్సాక్షిని ఆయన మనకు వరంగా ఇచ్చాడు. (రోమీయులు 2:14, 15) “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను” తినవద్దని దేవుడు ఆదాముహవ్వలకు చెప్పాడు. ఆ చెట్టు, మంచి చెడులను నిర్ణయించే విషయంలో దేవునికున్న హక్కుకు ప్రాతినిధ్యం వహించింది. కానీ ఆ తర్వాత ఏంజరిగిందో మనకు తెలుసు. (ఆదికాండము 2:17; 3:1-19) ఆదాము తీసుకున్న తప్పుడు నిర్ణయం గురించి మాట్లాడుతూ హోషేయ ఇలా రాశాడు: “ఆదాము నిబంధన మీరినట్లు వారు [ఇశ్రాయేలీయులు] . . . నిబంధనను మీరియున్నారు.” (హోషేయ 6:7) ఇశ్రాయేలీయులు తెలిసే పాపం చేశారనే విషయాన్ని హోషేయ ఆ మాటల్లో తెలియజేశాడు.
9 ఏమిటా పాపం? ‘వాళ్లు [ధర్మశాస్త్ర] నిబంధనను మీరారు.’ దేవుడు వాళ్లను ఐగుప్తులోనుండి విడిపించడం వల్ల వాళ్లకు యజమాని అయ్యాడు. కాబట్టి, వాళ్ల కోసం ప్రమాణాలు ఏర్పర్చే హక్కు ఆయనకు ఖచ్చితంగా ఉంది. ఇశ్రాయేలీయులు యెహోవా తమతో చేసిన నిబంధనకు అంగీకారం తెలిపారు. అలా, అందులోని ప్రమాణాల ప్రకారం జీవించడానికి వాళ్లు ఒప్పుకున్నారు. (నిర్గమకాండము 24:3; యెషయా 54:5) అయినా వాళ్లలో చాలామంది ధర్మశాస్త్రాన్ని పాటించడంలో విఫలమయ్యారు. వాళ్లు రక్తపాతం, నరహత్య, వ్యభిచారం వంటి పాపాలకు ఒడిగట్టి దోషులయ్యారు.—హోషేయ 6:8-10.
10. యెహోవా తన ప్రమాణాల ప్రకారం జీవించడంలో విఫలమైనవాళ్లకు ఎలా సహాయం చేశాడు?
10 యెహోవా తన సమర్పిత ప్రజలకు సహాయం చేయడానికి హోషేయలాంటి ప్రవక్తలను పంపాడు. హోషేయ తన ప్రవచన పుస్తకం చివర్లో ఇలా ప్రకటించాడు: “జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.” (హోషేయ 14:9) ప్రజలు యెహోవా దగ్గరికి తిరిగి రావడం ఎంత అవసరమో హోషేయ ప్రవక్త దానిముందు వచనాల్లో నొక్కిచెప్పాడు. యెహోవా తన ప్రజలు నడవాల్సిన చక్కని మార్గాల్ని తెలియజేశాడని జ్ఞానవంతులు గ్రహిస్తారు. దేవునికి సమర్పించుకున్న సేవకులుగా మీరు యెహోవా మార్గాల్లో నడుస్తూ నీతిమంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.
11. మీరు ఎందుకు దేవుని ఆజ్ఞలను పాటించాలని అనుకుంటున్నారు?
11 నీతిగా జీవించడంవల్ల వచ్చే ప్రయోజనాల గురించి కూడా హోషేయ 14:9 చెబుతోంది. మనం దేవుని ప్రమాణాల్ని పాటిస్తే ఎన్నో ప్రయోజనాలు, ఆశీర్వాదాలు పొందుతాం. మన సృష్టికర్తగా, మనం రూపొందిన రీతి ఆయనకు తెలుసు. ఆయన చేయమన్న ప్రతీది మన మంచికే. దేవునికి, మనకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థంచేసుకోవడానికి మనం ఒక కారు గురించి, దాని తయారీదారుడి గురించి ఆలోచిద్దాం. కారు నిర్మాణ తీరుతెన్నుల గురించి తయారీదారునికి తెలుసు. అప్పుడప్పుడు దాని ఇంజన్ ఆయిల్‌ను మార్చాలని ఆయనిచ్చే సూచనల్లో ఉంటుంది. కారు బాగానే నడుస్తోంది కదా అనుకొని మీరు ఆ ప్రమాణాన్ని పాటించకపోతే ఏమౌతుంది? ఇంజన్ త్వరగా పాడవుతుంది. మనుషుల విషయంలో కూడా అంతే. మన సృష్టికర్త మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. అవి పాటిస్తే మనకే మంచిది. (యెషయా 48:17, 18) ఈ విషయాన్ని అర్థంచేసుకుంటే ఆయన ప్రమాణాలను, ఆజ్ఞలను పాటించాలనే మన కోరిక మరింత బలపడుతుంది.—కీర్తన 112:1.
12. దేవుని నామాన్ని స్మరించుకుంటే ఆయనతో మన బంధం ఎలా పటిష్ఠమౌతుంది?
12 మనం దేవుని ఆజ్ఞల్ని పాటిస్తే, ఆయనతో విడదీయరాని బంధాన్ని ఏర్పర్చుకుంటాం. ఆ బంధం నిజంగా అద్భుతమైన బహుమానం! మనం దేవుని ప్రమాణాల ప్రకారం జీవిస్తే ఆ ప్రమాణాలు ఎంత సరైనవో, ఎంత ప్రయోజనకరమైనవో గ్రహిస్తాం. అప్పుడు వాటిని పెట్టిన దేవుని మీద మన ప్రేమ పెరుగుతుంది. ఆ దృఢమైన బంధాన్ని మీకా ప్రవక్త చక్కగా ఇలా వర్ణించాడు: “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.” (మీకా 4:5) యెహోవా గొప్పతనాన్ని సమర్థిస్తూ, జీవితంలో ఆయన అధికారానికి లోబడుతూ ఆయన నామాన్ని స్మరించుకోవడం నిజంగా మనకు దొరికిన అమూల్యమైన అవకాశం! అందుకే, ఆయన లక్షణాల్ని చూపించాలని మనకు సహజంగానే అనిపిస్తుంది. మనలో ప్రతీ ఒక్కరం దేవునితో మన బంధాన్ని పటిష్ఠపర్చుకోవడానికి పాటుపడదాం.—కీర్తన 9:10.
13. దేవుని నామం పట్ల ఉండే భయం గజగజ వణికించేది కాదని ఎందుకు చెప్పవచ్చు?
13 దేవుని ప్రమాణాల ప్రకారం జీవిస్తూ, ఆయన నామాన్ని స్మరించుకునేవాళ్లకు ఆయన నామమంటే భయం ఉంటుంది. అదేదో గజగజ వణికించే భయం కాదు. యెహోవా తన నామానికి భయపడేవాళ్లకు ఇలా భరోసా ఇస్తున్నాడు: “నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును [“ప్రకాశిస్తాడు,” NW]; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.” (మలాకీ 4:2) ఈ ప్రవచన నెరవేర్పులో, “నీతి సూర్యుడు” యేసుక్రీస్తే. (ప్రకటన 1:16) నేడు ఆయన, ఆధ్యాత్మికంగా స్వస్థపరుస్తూ ప్రకాశిస్తున్నాడు, కానీ త్వరలోనే మానవాళికి భౌతిక స్వస్థతను చేకూరుస్తూ ప్రకాశిస్తాడు. స్వస్థత పొందినవాళ్ల సంతోషాన్ని ఆ లేఖనం క్రొవ్విన దూడల సంతోషంతో పోలుస్తోంది. క్రొవ్విన దూడలు కట్టు విప్పగానే స్వేచ్ఛ దొరికిందనే ఆనందంతో, ఉత్సాహంతో ‘బయలుదేరి గంతులు వేస్తాయి.’ మనం ఇప్పటికే చాలావరకు అలాంటి స్వేచ్ఛను చవిచూస్తున్నాం!—యోహాను 8:32.
14, 15. యెహోవా ప్రమాణాల ప్రకారం జీవిస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?
14 దేవుని ప్రమాణాల ప్రకారం జీవిస్తే సాటి మనుషులతో మన సంబంధాలు కూడా మెరుగౌతాయి. పరుల సొమ్మును ఆశించినవాళ్లు, అన్యాయంగా ఆర్జించినవాళ్లు, నరహంతకులు, లైంగిక నేరాలకు పాల్పడేందుకు పథకం వేసినవాళ్లు, విగ్రహారాధకులు వంటి ఐదు రకాల ప్రజలపై హబక్కూకు ప్రవక్త శ్రమల్ని ప్రకటించాడు. (హబక్కూకు 2:6-19) యెహోవా ఆ శ్రమల్ని ప్రకటింపజేశాడనే విషయాన్ని చూస్తే, ఆయన మన జీవితాలకు ప్రమాణాలను ఏర్పర్చి ఉంచాడని స్పష్టమౌతుంది. అయితే ఈ విషయం గమనించండి: పైన చెప్పుకున్న ఐదింటిలో నాలుగు పాపాలు మనం సాటి మనిషితో ఎలా వ్యవహరిస్తాం అనేదానికి సంబంధించినవే. మనం సాటి మనుషులను దేవుడు చూసినట్లే చూస్తే వాళ్లకు కీడు తలపెట్టం. మనం దేవుని ప్రమాణాల ప్రకారం జీవిస్తే, చాలామందితో మన సంబంధాలు మెరుగౌతాయి.
15 చివరిగా, మనం దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడం కుటుంబ సంతోషానికి కూడా తోడ్పడుతుంది. ఈ రోజుల్లో, ఆలుమగల మధ్య మనస్పర్థలు వస్తే విడాకులే అంతిమ పరిష్కారమని చాలామంది అనుకుంటున్నారు. అయితే యెహోవా మలాకీ ప్రవక్తతో ఇలా చెప్పించాడు: “విడాకులు అంటే నాకు అసహ్యం.” (మలాకీ 2:16, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) మనం మలాకీ 2:16ను మరింత క్షుణ్ణంగా తర్వాత పరిశీలిస్తాం. అయితే ప్రస్తుతానికి, కుటుంబ సభ్యులు పాటించాల్సిన ప్రమాణాల్ని దేవుడు ఎంతో జ్ఞానంతో ఏర్పర్చాడని ఆ లేఖనంలో గమనించండి. దేవుని ప్రమాణాలను పాటించినంత వరకు కుటుంబంలో శాంతి విలసిల్లుతుంది. (ఎఫెసీయులు 5:28, 33; 6:1-4) ఎంతైనా మనందరం అపరిపూర్ణులమే, కాబట్టి సమస్యలు రాక తప్పవు. అయితే, తీవ్రమైన వైవాహిక సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేసే పాఠాన్ని “పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి” నేర్పించాడు. అది హోషేయ పుస్తకంలో ఓ నిజ జీవిత సంఘటన రూపంలో ఉంది. దాన్ని కూడా మనం ఈ పుస్తకంలోని మరో అధ్యాయంలో పరిశీలిస్తాం. (ఎఫెసీయులు 3:14) దేవుని ప్రమాణాల ప్రకారం జీవించాలంటే ఇంకా ఏమేమి చేయాలో ఇప్పుడు చూద్దాం.
‘కీడును ద్వేషించి మేలును ప్రేమించండి’
16. దేవుని ప్రమాణాలకు సంబంధించి ఆమోసు 5:15 ఏమి చెబుతోంది?
16 మంచిచెడులకు సంబంధించి ఎవరి ప్రమాణాలు ఉత్తమమైనవో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు మొదటి మానవుడు తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నాడు. మరి మనం తెలివైన నిర్ణయం తీసుకుంటామా? ‘కీడును ద్వేషించి మేలును ప్రేమించాలనే’ బలమైన కోరిక మనలో ఉండాలని ఆమోసు ఉపదేశించాడు. (ఆమోసు 5:15) చికాగో విశ్వవిద్యాలయంలో సెమిటిక్ భాషా సాహిత్యాల (హీబ్రూ, అరామిక్, అరబిక్, అంహరిక్ తదితర భాషా సాహిత్యాల) ప్రొఫెసర్ విలియమ్ రేనీ హార్పర్ బ్రతికివున్నప్పుడు ఆ వచనం గురించి ఇలా అన్నాడు: “మంచిచెడుల విషయంలో యావే చిత్తానికి అనుగుణంగా ఉన్న ప్రమాణమే [ఆమోసు] మనసులో ఉంది.” 12 పుస్తకాల్లో మనం నేర్చుకునేవన్నీ ఆ ప్రమాణం చుట్టే తిరుగుతాయి. మంచిచెడుల విషయంలో యెహోవా ఏర్పరచిన ప్రమాణాలను స్వీకరించడానికి మనం సుముఖంగా ఉన్నామా? ఆ ఉన్నత ప్రమాణాల్ని బైబిలు మనకు వెల్లడిచేస్తోంది. ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసునిగా’ రూపొందిన పరిణతిగల, అనుభవజ్ఞులైన క్రైస్తవులు వాటిని మనకు వివరిస్తున్నారు.—మత్తయి 24:45-47.
17, 18. (ఎ) చెడును ద్వేషించడం ఎందుకు ముఖ్యం? (బి) చెడు పట్ల ద్వేషాన్ని ఎలా పెంచుకోవచ్చో ఉదహరించండి.
17 మనం చెడును ద్వేషిస్తే దేవుణ్ణి బాధపెట్టే వాటి జోలికి వెళ్లం. ఉదాహరణకు, ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు, దృశ్యాలు చూడడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఒక వ్యక్తికి తెలిసే ఉంటుంది, దాని జోలికి వెళ్లకుండా ఉండడానికి అతను ప్రయత్నిస్తుండవచ్చు. కానీ అలాంటి అశ్లీల వెబ్‌సైట్ల విషయంలో అతని “అంతరంగ పురుషుడు” ఏమనుకుంటున్నాడు? (ఎఫెసీయులు 3:15-18) ఆమోసు 5:15లోని దేవుని ఉపదేశాన్ని పాటిస్తే, చెడు పట్ల ద్వేషం పెంచుకోవడం అతనికి సులువౌతుంది. అలా అతను తన ఆధ్యాత్మిక పోరాటంలో గెలుపొందవచ్చు.
18 మరో ఉదాహరణ చూడండి. మీరు లైంగిక ఆరాధనకు సంబంధించిన విగ్రహాల ముందు సాష్టాంగపడినట్లు ఊహించుకోగలరా? ఆ ఆలోచనే మీకు చాలా కంపరంగా ఉంటుంది, కాదంటారా? కానీ, ఇశ్రాయేలీయుల పూర్వీకులైతే బయల్పెయోరు ముందు నీచమైన పనులు చేశారని హోషేయ అన్నాడు. (సంఖ్యాకాండము 25:1-3; హోషేయ 9:10) పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యం చేసిన అతిపెద్ద పాపం బయలు ఆరాధనే. బహుశా అందుకే హోషేయ ఆ సంఘటన గురించి ప్రస్తావించాడు. (2 రాజులు 17:16-18; హోషేయ 2:8, 13) లైంగిక కార్యకలాపాలతో విచ్చలవిడిగా సాగిన విందుల్లో ఇశ్రాయేలీయులు విగ్రహాలకు వంగి నమస్కరించిన అసహ్యకరమైన ఘట్టాన్ని ఒకసారి ఊహించుకోండి. దేవుడు దాన్ని తీవ్రంగా ఖండించాడనే విషయం అర్థం చేసుకుంటే, మనలో ప్రతీ ఒక్కరం ఇంటర్నెట్ ద్వారా సాతాను పన్నిన ఉచ్చుల్లో పడకుండా ఉండడానికి గట్టిగా పోరాడగలుగుతాం. ఈ రోజుల్లో చాలామంది సినిమాల్లో, టీవీల్లో కనిపించే అభిమాన హీరోల, అందమైన హీరోయిన్ల ఫోటోల్ని ఇంట్లో విగ్రహాల్లా పెట్టేసుకుంటున్నారు. విగ్రహారాధన గురించి ప్రవక్తలు ఇచ్చిన హెచ్చరికల నుండి నేర్చుకున్న మనం ఎంతమాత్రం అలా చేయం!
దేవుని వాక్యాన్ని మనసులో ఉంచుకోండి
19. చేప కడుపులో ఉండగా యోనా చేసినదాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
19 శోధనలు, కష్టాలు ఎదురౌతున్నా దేవుని ఉన్నత ప్రమాణాలను నిష్ఠగా పాటించడానికి మీరు ప్రయత్నిస్తుండవచ్చు. అయితే, ఒక్కోసారి వాటిని పాటించడం మీవల్ల కావట్లేదని మీకు అనిపించవచ్చు లేదా మీరు అయోమయంలో పడవచ్చు. మీరు మానసికంగా, భావోద్వేగపరంగా బాగా నీరసించిపోయారని అనిపించినప్పుడు ఓ క్లిష్టమైన పరిస్థితిని మీరు సమర్థంగా ఎలా ఎదుర్కోవచ్చు? (సామెతలు 24:10) అయితే దీనికి సంబంధించి యోనా నుండి మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. ఆయన కూడా మనలాగే అపరిపూర్ణుడని, పొరపాట్లు చేశాడని మనకు తెలుసు. ఆయన ఓ పెద్ద చేప కడుపులో ఉండగా ఏమి చేశాడో గుర్తుచేసుకోండి. ఆయన యెహోవాకు ప్రార్థన చేశాడు. ఇంతకీ, ఏమని చేశాడు?
20. యోనా చేసినట్లే చేయడానికి మనం ఎలా సిద్ధపడవచ్చు?
20 యోనా “పాతాళ గర్భములో నుండి” దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు తనకు బాగా తెలిసిన కీర్తనల్లోని మాటల్ని వాడాడు. (యోనా 2:2) ఆయన తీవ్రంగా కృంగిపోయి, యెహోవా కనికరం కోసం ప్రాధేయపడ్డాడు. అయితే ఆ పరిస్థితుల్లో ఆయన నోటనుండి దావీదు మాటలు వచ్చాయి. ఉదాహరణకు, యోనా 2:3, 5లోని మాటల్ని కీర్తన 69:1, 2 లోని మాటలతో పోల్చి చూడండి. a అలా చేస్తే, నాడు అందుబాటులో ఉన్న దావీదు కీర్తనలు యోనాకు ఎంత బాగా తెలుసో అర్థమౌతుంది. ప్రేరేపిత కీర్తనల్లోని పదాలు, మాటలు ఆయనకు గుర్తుకువచ్చాయి. దేవుని వాక్యాన్ని యోనా తన “ఆంతర్యములో” ఉంచుకున్నాడు. (కీర్తన 40:8) భావోద్వేగపరంగా నీరసించిపోయేలా చేసే పరిస్థితి ఎదురైనప్పుడు, ఆ పరిస్థితికి సరిపోయే లేఖనాలు మనకు గుర్తుకొస్తాయా? దేవుని వాక్యంతో ఇప్పుడు మనం మరింత సుపరిచితులమైతే, రేపు దేవుని ప్రమాణాల ప్రకారం నిర్ణయాలు తీసుకోగలుగుతాం, సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాం.
మంచి దైవ భయం చూపించండి
21. దేవుని ప్రమాణాలకు కట్టుబడి ఉండాలంటే మీరు ఏమి చేయాలి?
21 యెహోవా ప్రమాణాలకు కట్టుబడి ఉండాలంటే, లేఖనాల్ని మనసులో ఉంచుకోవడం మాత్రమే సరిపోదు. దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టడానికి ఏమి చేయాలో చెబుతూ మీకా ప్రవక్త మరింత అవగాహన కల్పించాడు: “జ్ఞానముగలవాడు నీ నామమును లక్ష్యపెట్టును [“నీ నామానికి భయపడతాడు,” NW].” (మీకా 6:9) జ్ఞానవంతుడిగా అంటే, తెలిసిన విషయాల్ని ఆచరణలో పెట్టే వ్యక్తిగా ఉండాలంటే మీరు దేవుని నామానికి భయపడడం నేర్చుకోవాలి.
22, 23. (ఎ) స్వదేశానికి తిరిగి వచ్చిన యూదుల దగ్గరకు యెహోవా హగ్గయిని ఎందుకు పంపించాడు? (బి) దేవుని ప్రమాణాల ప్రకారం జీవించగలమనే నమ్మకాన్ని మనం ఎందుకు కలిగివుండవచ్చు?
22 దేవుని నామం పట్ల భయాన్ని ఎలా అలవర్చుకోవచ్చు? హగ్గయి రాసిన పుస్తకంలోని విషయాల్ని పరిశీలిస్తే దానికి జవాబు తెలుసుకోవచ్చు. ఆ ప్రవక్త యూదులు స్వదేశానికి వచ్చిన తర్వాత సేవచేశాడు. ఆయన రాసిన ఆ చిన్న పుస్తకంలో కేవలం 38 వచనాలే ఉన్నాయి. ఆయన తన పుస్తకాన్ని రాసినప్పుడు అందులో యెహోవా పేరును 35 సార్లు వాడాడు! సా.శ.పూ. 520లో యెహోవా హగ్గయికి ప్రవచించే పని అప్పగించేనాటికి, యెరూషలేములో ఆలయ పునర్నిర్మాణం మొదలై 16 ఏళ్లు గడిచిపోయాయి. కానీ పనైతే పెద్దగా ఏమీ జరగలేదు. శత్రువుల వ్యతిరేకత వల్ల దేవుని ప్రజల్ని నిరుత్సాహం అలుముకుంది. (ఎజ్రా 4:4, 5) ఆలయాన్ని పునర్నిర్మించాల్సిన సమయం ఇంకా రాలేదని ప్రజలు అనుకోసాగారు. అప్పుడు యెహోవా ఇలా ఉద్బోధించాడు: “మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి . . . మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందును.”—హగ్గయి 1:2-8.
23 అధిపతియైన జెరుబ్బాబెలు, ప్రధానయాజకుడైన యెహోషువ, “శేషించిన జనులందరును తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, . . . యెహోవాయందు భయభక్తులు పూనిరి.” అప్పుడు దేవుడు ఇలా ప్రకటించాడు: “నేను మీకు తోడుగా ఉన్నాను.” ఆ మాట ఎంత ధైర్యాన్నిస్తుందో కదా! దేవుని ఆత్మ సహాయంతో ప్రజలు “కూడివచ్చి . . . తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి.” (హగ్గయి 1:12-15) అప్పటివరకు నిరుత్సాహంతో ఉన్న ప్రజల్లో, దేవుణ్ణి బాధపెట్టకూడదనే మంచి భయం కలిగింది. దానివల్ల వాళ్లు వ్యతిరేకతల మధ్య కూడా దేవుని పనిని మళ్లీ చేపట్టారు.
24, 25. ఈ అధ్యాయంలో నేర్చుకున్న సూత్రాల్ని ఎలా అన్వయించుకోవచ్చో ఉదాహరణలు ఉపయోగించి చెప్పండి.
24 మీ సంగతేంటి? మీరున్న పరిస్థితుల్లో ఏ దైవిక ప్రమాణాలు పాటించాలో మీరు గ్రహిస్తే, మనుషులకు కాకుండా దేవునికి భయపడేంత ధైర్యం మీలో ఉండాలి. మరి మీకుందా? మీరు ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మాయి అనుకుందాం, మీరు పాటించే దైవిక సూత్రాలు తెలియని ఒకతను మీ సహోద్యోగి అనుకుందాం. అతను మీతో చాలా బాగా మాట్లాడుతూ, మీరంటే ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నాడు. అలాంటప్పుడు యెహోవా ప్రమాణాలను, వాటిని పాటించకపోతే వచ్చే ప్రమాదాలను గుర్తుచేసే లేఖనమేదైనా మీ మదిలో మెదులుతుందా? బహుశా హోషేయ 4:11లాంటి లేఖనం గుర్తుకొస్తుందా? అక్కడ ఇలా ఉంది: “వ్యభిచారక్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానముచేయుటచేతను మద్యపానముచేతను వారు మతిచెడిరి.” అతను మిమ్మల్ని ఓ పార్టీకి రమ్మని పిలిచాడు. దేవుని ప్రమాణాలకు కట్టుబడి ఉండేందుకు మీరు ఆ లేఖనాన్ని మనసులో ఉంచుకుని దైవభయంతో, రానని అతనికి చెప్పగలుగుతారా? అతను మీతో సరసాలాడడం మొదలుపెడితే, ప్రేమగల దేవుణ్ణి బాధపెట్టకూడదనే మంచి భయం మీకు ఉండడం వల్ల మీరు అక్కడ నుండి ‘పారిపోతారు.’—ఆదికాండము 39:12; యిర్మీయా 17:9.
25 ఇప్పుడు, ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు, దృశ్యాలు చూడాలనే శోధనతో పోరాడుతున్న వ్యక్తి ఉదాహరణకు మళ్లీ వద్దాం. అతను కీర్తన 119:37లో ప్రార్థన రూపంలోవున్న మాటల్ని గుర్తుచేసుకుంటాడా? అక్కడ ఇలా ఉంది: “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము.” కొండమీది ప్రసంగంలో యేసు చెప్పిన మాటల్ని అతను మననం చేసుకుంటాడా? ఆయన ఇలా అన్నాడు: “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (మత్తయి 5:28) యెహోవా పట్ల భయం, ఆయన ప్రమాణాల్ని పాటించాలనే కోరిక ఉంటే ఓ క్రైస్తవుడు, తనను కలుషితం చేసే వాటినుండి పారిపోతాడు. దేవుని ప్రమాణాలకు విరుద్ధంగా ఆలోచించాలనే ప్రలోభం, ప్రవర్తించాలనే శోధన ఎదురైన ప్రతీసారి మరింత దైవభయాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. హగ్గయి ద్వారా యెహోవా మీకు చెబుతున్న ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి: “నేను మీకు తోడుగా ఉన్నాను.”
26. తర్వాతి భాగంలో మనం ఏమి పరిశీలిస్తాం?
26 అవును, యెహోవా ఉన్నత ప్రమాణాల ప్రకారం జీవించడం, తద్వారా ప్రయోజనాలు పొందడం మనకు సాధ్యమే. మనం తర్వాతి అధ్యాయాల్లో కూడా ఆ 12 పుస్తకాల్ని పరిశీలిస్తున్నప్పుడు దేవుని ప్రమాణాల్ని, ఆయన మన నుండి కోరుతున్నవాటిని మరింత బాగా అర్థంచేసుకుంటాం. యెహోవా దేవుడు శ్రేష్ఠమైన ప్రమాణాల్ని విధించిన మూడు ప్రాముఖ్యమైన రంగాల్ని ఈ పుస్తకంలోని తర్వాతి భాగంలో పరిశీలిస్తాం. అవి: మన ప్రవర్తన, ఇతరులతో మన వ్యవహారాలు, మన కుటుంబ జీవితం.