4వ అధ్యాయం
యెహోవా దేవుడు ప్రవచిస్తాడు, నెరవేరుస్తాడు
1, 2. (ఎ) జీవితం తమ చెప్పుచేతల్లో లేకుండా పోతోందని ప్రజలు ఎందుకు వాపోతున్నారు? (బి) యెహోవా వ్యక్తిత్వాన్ని ఆ 12 మంది ప్రవక్తలు ఎలా వర్ణించారు?
జీవితం తమ చెప్పుచేతల్లో లేకుండా పోతోందని చాలామంది వాపోతున్నారు. లోకంలో జరిగే సంఘటనలు విన్నప్పుడు, మానవాళి పరిస్థితి రోజురోజుకీ నిస్సహాయంగా తయారౌతోందని వాళ్లు ఆందోళనపడుతున్నారు. ఈ గడ్డు పరిస్థితిని రూపుమాపడానికి చేసే ప్రయత్నాలు బెడిసికొట్టి పరిస్థితులు ఇంకా విషమిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆ 12 మంది ప్రవక్తల్లో కొందరు జీవించిన కాలాల్లో కూడా అలాగే ఉండేవి. అయితే, భవిష్యత్తు మీద ఆశల్ని చిగురింపజేసే సందేశాలను ఆ ప్రవక్తలు ఇచ్చారు. వాటినుండి మనం ప్రయోజనం పొందవచ్చు. అంతేకాదు, ఇతరులకు ఊరటను ఇచ్చేందుకు వాటిని ఉపయోగించవచ్చు.—మీకా 3:1-3; హబక్కూకు 1:1-4.
2 ఈ ప్రవచన పుస్తకాల్లో ఓ ముఖ్యమైన విషయం మీకు తారసపడుతుంది. అదేమిటంటే, విశ్వ సర్వాధిపతి అయిన యెహోవాకు మానవ వ్యవహారాలపై పూర్తి పట్టు ఉంది, మన యోగక్షేమాల విషయంలో ఆయనకు శ్రద్ధ ఉంది. నిజానికి, ‘యెహోవాకు నా మీద శ్రద్ధ ఉంది’ అని మనలో ప్రతీ ఒక్కరం చెప్పగలం. ఆ 12 మంది ప్రవక్తలు “సైన్యములకు అధిపతియగు యెహోవా” గురించి మనసును హత్తుకునేలా వర్ణించారు. దేవుడు ముట్టుకుంటే చాలు ‘భూమి కరిగిపోతుంది.’ అంతటి దేవుడు, ‘మిమ్మును ముడితే, నా కనుగుడ్డును ముట్టినట్టే’ అని తన ప్రజలకు అభయమిచ్చాడు. (జెకర్యా 2:8; ఆమోసు 4:13; 9:5) దేవుని వ్యవహారాల్ని ప్రేమే నిర్దేశిస్తుందని, వాటిలో కనికరం, క్షమాగుణం కనిపిస్తాయని తెలిపే బైబిలు భాగాలను చదవడం మీకు ప్రోత్సాహాన్ని ఇవ్వదా? (హోషేయ 6:1-3; యోవేలు 2:12-14) ఈ ప్రవక్తలు రాసిన పుస్తకాలు దేవుని వ్యక్తిత్వం గురించిన ప్రతీ అంశాన్ని పూసగుచ్చినట్లు వివరించడం లేదు, దానికోసం బైబిల్లోని మొత్తం 66 పుస్తకాల్ని మనం తిరగేయాల్సిందే. అయితే, దేవుని ఆకర్షణీయమైన వ్యక్తిత్వంపై, ఆయన వ్యవహారాలపై ఆ 12 పుస్తకాలు అద్భుతమైన అవగాహనను కల్పిస్తాయి.
3. యెహోవా సంకల్పాన్ని నెరవేర్చే దేవుడని ఆ 12 మంది ప్రవక్తలు ఎలా తెలియజేశారు?
3 యెహోవాకు ప్రవచించే సామర్థ్యం, తన సంకల్పాన్ని నెరవేర్చే సత్తా ఉన్నాయని మనం నమ్ముతాం. అయితే ఈ నమ్మకాన్ని ఆ 12 పుస్తకాలు ఇంకా బలపరుస్తాయి. దేవుడు తన పరిపాలనలో భూమిని పరదైసుగా మారుస్తాడని అవి ధృవీకరిస్తున్నాయి. (మీకా 4:1-4) మెస్సీయ రాక కోసం, మనుషులను పాపమరణాల నుండి విడిపించే విమోచన క్రయధనం కోసం యెహోవా ఏమి చేశాడో ఆ ప్రవక్తల్లో కొందరు వివరించారు. (మలాకీ 3:1; 4:5) మనం ఆ విషయాలన్నీ తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
ప్రేమగల సర్వాధిపతికి పరిస్థితులపై పూర్తి పట్టు ఉంది
4, 5. (ఎ) దేవుని గురించిన ఏ ప్రాథమిక సత్యాన్ని 12 మంది ప్రవక్తలు నొక్కిచెప్పారు? (బి) యెహోవా సర్వశక్తిమంతుడనే విషయం మీపై ఎలాంటి ప్రభావం చూపించింది?
4 మనం ముందటి అధ్యాయంలో చూసినట్లు, దేవుని పరిపాలనా హక్కును సాతాను సవాలు చేశాడని గుర్తుంచుకోండి. పరలోకంలో కొందరు దూతలు యెహోవా అధికారాన్ని ధిక్కరించి, ఆయన ఉద్దేశాల్ని తప్పుబట్టి ఆయనకు ఎదురుతిరిగారు, భూమ్మీద అల్లకల్లోలం సృష్టించారు. దాన్నిబట్టి ఓ విషయం ప్రాముఖ్యమని స్పష్టమౌతోంది. ఈ విశ్వంలో ప్రతీది పద్ధతిగా సాగాలన్నా, మనుషుల మధ్య శాంతి సామరస్యాలు నెలకొనాలన్నా యెహోవా సర్వాధిపత్యాన్ని గౌరవించాలి, దానికి లోబడాలి. అందుకే, యెహోవా తన సర్వాధిపత్యాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థంచేసుకోవడానికి ఆ 12 పుస్తకాలు మనకు ఎలా సహాయం చేస్తాయో పరిశీలిద్దాం.
5 యెహోవా సందేశకులుగా ఆ ప్రవక్తలు ఆయన ఉన్నత స్థానాన్ని నొక్కిచెప్పారు. ఉదాహరణకు, సర్వశక్తిగల దేవుని పేరును, ఆయన సర్వాధిపత్యాన్ని మహిమపరుస్తూ, ఆమోసు “సర్వాధిపతియైన ప్రభువు” అనే మాటను ఉపయోగించాడు. ఆ మాట మూల భాషలోని ఆమోసు పుస్తకంలో 21 సార్లు కనిపిస్తుంది. సత్య దేవుడు అత్యంత గొప్పవాడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని అది చూపిస్తోంది. (ఆమోసు 9:2-5; “యెహోవాయే సర్వశక్తిమంతుడు” అనే బాక్సు చూడండి.) ఈ విశ్వానికి సర్వాధిపతిగా ఉండే హక్కు యెహోవాకు మాత్రమే ఉంది, నిర్జీవ విగ్రహాలేవీ ఆయనకు సాటిరావు. (మీకా 1:7; హబక్కూకు 2:18-20; జెఫన్యా 2:11) సమస్తాన్ని సృష్టించిన దేవునిగా యెహోవాకే ఈ విశ్వంపై అధికారం చెలాయించే హక్కు ఉంది. (ఆమోసు 4:13; 5:8, 9; 9:6) ఆ విషయాన్ని మీరు ఎందుకు ప్రాముఖ్యమైనదిగా ఎంచాలి?
6. దేవుని సంకల్ప నెరవేర్పుతో అందరికీ సంబంధం ఉందని ఎందుకు చెప్పవచ్చు?
6 మీరు ఎప్పుడైనా అన్యాయానికి, వివక్షకు గురయ్యారా? అలాగైతే, ప్రేమగల సర్వాధిపతి అందరి మీద శ్రద్ధ చూపిస్తాడని తెలుసుకోవడం మీకు ఊరటనిస్తుంది. పూర్వం, యెహోవాకు ఓ జనాంగంతో ప్రత్యేక అనుబంధం ఉండేది, అయినా అన్ని జనాంగాల, భాషల ప్రజలకు మేలు చేయాలనే తన కృతనిశ్చయాన్ని యెహోవా తెలియజేశాడు. ఆయన “సర్వలోక ప్రభువు.” (మీకా 4:13, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) “అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును” అని దేవుడు ప్రమాణం చేశాడు. (మలాకీ 1:11) మన పరలోక తండ్రి తన గురించి తెలుసుకునే అవకాశాన్ని తరతమ భేదం లేకుండా అందరికీ ఇస్తున్నాడు. దేవుడు తన ఆరాధకులవ్వమని ఇస్తున్న ఆహ్వానానికి “ఆయా భాషలు మాటలాడు అన్యజనులు” ఉత్సాహంగా స్పందిస్తున్నారు.—జెకర్యా 8:23.
7. యెహోవా పేరుకున్న అర్థం ఎందుకు ప్రత్యేకమైనది?
7 దేవుడు ఎలా ఉంటాడో, ఏమి చేస్తాడో అర్థంచేసుకోవాలంటే ఆయన పేరు గురించి తెలుసుకోవాలి. (కీర్తన 9:10) మీకా కాలంలో, యెహోవా పేరు ధరించిన ప్రజలు ఆయనకు ఘోరంగా అవిధేయత చూపించి ఆయన పేరుకు మచ్చ తెచ్చారు. యెహోవా ప్రేరణతో మీకా ప్రవక్త “యెహోవా నామ మహాత్మ్యమును” నొక్కిచెప్పాడు, “జ్ఞానముగలవాడు [దేవుని] నామమును లక్ష్యపెట్టును” అని తెలియజేశాడు. (మీకా 5:4; 6:9) మీకా ఎందుకు ఆ సందేశాన్ని నొక్కిచెప్పాడు? ఈరోజు మనం నిరంతర భవిష్యత్తు కోసం నమ్మకంగా ఎదురుచూస్తున్నామంటే, దానికి కారణం దేవుని పేరుకున్న అర్థమే. ఆయన పేరుకు “తానే కర్త అవుతాడు” అని అర్థం. ఒకసారి మీ బైబిలు తెరిచి యోవేలు 2:25, 26 చదవండి. దేవుని పేరును ధరించడం ఎంత సంతోషాన్నిస్తుందో ఆలోచించండి. అంతేకాదు, తన సృష్టి ప్రాణుల శ్రేయస్సు కోసం ఎలా అవసరమైతే అలా అయ్యే సామర్థ్యం ఉన్న యెహోవా గురించి ప్రకటించడం ఎంత ఆనందాన్నిస్తుందో కూడా ఆలోచించండి. తాను అనుకున్నది ఏదైనా చేయగల అపరిమిత సామర్థ్యం తనకుందని యెహోవా నిరూపించుకున్నాడు. ఆ 12 మంది ప్రవక్తలు చెప్పిన ఎన్నో ప్రవచనాలు నెరవేరడమే అందుకు నిదర్శనం.
8. యెహోవా నామం మీకు ఏయే విధాలుగా ప్రేరణను ఇచ్చింది?
8 యెహోవా చెప్పింది చేయగలడని, అనుకున్నది సాధించగలడని తెలుసుకొని లక్షలమంది ప్రయోజనం పొందారు. ఆ విషయమే ప్రస్తావిస్తూ యోవేలు రాసిన ఈ మాటలు మనందరికీ సుపరిచితమే: “యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.” మొదటి శతాబ్దానికి చెందిన క్రైస్తవ రచయితలు కూడా ఆ మాటల్ని ఉల్లేఖించారు. (యోవేలు 2:32; అపొస్తలుల కార్యములు 2:21; రోమీయులు 10:13) మీకా ఇలా అన్నాడు: “మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.” మీకాలాగే మనమూ దృఢంగా అలా అనగలమా? (మీకా 4:5) అవును, హింసలు లేదా వ్యక్తిగత సమస్యలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు కూడా మనం కొండంత నమ్మకంతో ‘యెహోవా నామాన్ని ఆశ్రయించవచ్చు.’—జెఫన్యా 3:9, 12; నహూము 1:7.
9. మానవ పాలకుల మీద యెహోవాకు ఎంత నియంత్రణ ఉంది?
9 మీరు ఈ ప్రవచన పుస్తకాలను చదువుతుండగా మానవ పాలకులను, రాజకీయ వాణిజ్య రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే పెద్దమనుషులను యెహోవా నియంత్రించగలడనే మీ నమ్మకం ఇంకా పెరుగుతుంది. యెహోవా తన చిత్తానికి తగ్గట్టు వాళ్లను ‘తిప్పగలడు.’ (సామెతలు 21:1) పారసీక సామ్రాజ్య చక్రవర్తి దర్యావేషు విషయమే తీసుకోండి. యెరూషలేములో యెహోవా ఆలయ పునర్నిర్మాణాన్ని ఆపడానికి శత్రువులు ఆ చక్రవర్తి సహాయం కోరారు. కానీ, వాళ్ల ప్రయత్నం బెడిసికొట్టింది! సుమారు సా.శ.పూ. 520లో దర్యావేషు చక్రవర్తి అంతకుముందు కోరెషు రాజు ఇచ్చిన ఆజ్ఞను అమలుచేస్తూ యూదుల నిర్మాణ పనికి మద్దతిచ్చాడు. ఆ తర్వాత మరిన్ని అవరోధాలు ఎదురయ్యాయి. అప్పుడు, యూదా అధిపతియైన జెరుబ్బాబెలుకు యెహోవా ఈ సందేశాన్ని ఇచ్చాడు: “శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమివగుదువు.” (జెకర్యా 4:6, 7) యెహోవా ఈ దుష్ట వ్యవస్థను నాశనం చేస్తాడు, తన ఆరాధకుల కోసం భూమిని పరదైసుగా మారుస్తాడు. ఆయనను ఆపే శక్తి ఎవ్వరికీ లేదు.—యెషయా 65:21-23.
10. దేవుడు వేటిని కూడా శాసించగలడు? అది ఎందుకు గమనించదగిన విషయం?
10 యెహోవా ప్రకృతి శక్తుల్ని కూడా శాసించగలడని గమనించండి. ఆయన తలచుకుంటే శత్రువుల్ని మట్టుబెట్టడానికి వాటిని వాడుకోగలడు. (నహూము 1:3-6) యెహోవా తన ప్రజల్ని ఎలా కాపాడతాడో నొక్కిచెబుతూ జెకర్యా ఈ అలంకారిక మాటల్ని ఉపయోగించాడు: “యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపువలె విడువబడును, ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణదిక్కునుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును.” (జెకర్యా 9:14) అంతటి దేవుడు, నేటి భక్తిహీన జనాంగాల మీద తన సర్వాధిపత్యాన్ని నిరూపించుకోలేడా? ఖచ్చితంగా నిరూపించుకోలడు!—ఆమోసు 1:3-5; 2:1-3.
ప్రవచనాలు నెరవేర్చే దేవుడు
11, 12. (ఎ) నీనెవె అజేయమైనదని ప్రజలు ఎందుకు అనుకునేవాళ్లు? (బి) దేవుడు చెప్పినట్టే నీనెవెకు ఎలాంటి గతి పట్టింది?
11 మీరు సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో, ఓ మధ్య ప్రాచ్య దేశంలో నివసిస్తున్నారనుకుందాం. ఏ గొప్ప పట్టణం గురించిన వార్తలు మీ చెవినబడతాయి? ఇంకదేనివి, నీనెవె పట్టణానివే. ఈ ప్రసిద్ధమైన అష్షూరు పాలిత పట్టణం టైగ్రిస్ నదికి తూర్పు తీరాన ఉంది. అది, యెరూషలేముకు ఈశాన్యాన దాదాపు 900 కి.మీ. దూరంలో ఉంది. సుమారు 100 కి.మీ. చుట్టుకొలతతో ఉన్న అబ్బురపర్చే ఆ పట్టణపు విస్తీర్ణం గురించిన వార్త మీదాకా చేరే ఉంటుంది. ఆ పట్టణంలోని రాజ భవనాలు, ఆలయాలు, విశాలమైన వీధులు, ఉద్యానవనాలు, అచ్చెరువొందించే గ్రంథాలయం అవన్నీ బబులోను దర్పానికి ఏమాత్రం తీసిపోవని నీనెవెను సందర్శించిన వాళ్లు చెప్పారు. అంతేనా, నీనెవె లోపలా బయటా ఉన్న దుర్భేద్యమైన, పటిష్ఠమైన ప్రహరి గోడల గురించి యుద్ధ నీతిజ్ఞులు వ్యాఖ్యానించారు.
12 అప్పట్లో చాలామంది నీనెవె ‘అజేయమైనది!’ అని అనేవుంటారు. అయితే చిన్న జనాంగమైన యూదాలోని కొందరు ప్రవక్తలు మాత్రం దాని గురించి మరోలా చెప్పారు. ‘నరహత్య చేసిన’ నీనెవె ‘పట్టణం’ నాశనమౌతుందనే యెహోవా సందేశాన్ని వాళ్లు దృఢంగా ప్రకటించారు. యోనా ప్రకటించినప్పుడు ప్రజలు చక్కగా స్పందించారు. అలా దానికి కొంతకాలం నాశనం తప్పింది. కానీ, తర్వాత ఆ ప్రజలు మళ్లీ పాతబాట పట్టారు. నీనెవె గురించి నహూము ఇలా ప్రవచించాడు: “ఖడ్గము నిన్ను నాశనముచేయును . . . నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు.” (నహూము 3:1, 7, 15, 19; యోనా 3:5-10) దాదాపు అదే సమయంలో జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు నీనెవె పాడైపోతుందని ప్రవచించాడు. (జెఫన్యా 2:13) మరి, ఆ కాలంలో అజేయంగా నిలిచిన ఆ రాజకీయ ఆధిపత్యం యెహోవా చెప్పినట్టే కూలిపోయిందా? సుమారు సా.శ.పూ. 632లో జరిగిన సంఘటనే దానికి జవాబు. ఆ సంవత్సరంలో బబులోనీయులు, సిథియన్లు, మాదీయులు నీనెవెను ముట్టడించారు. అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఆ పట్టణ గోడల్ని కూలదోశాయి, దాంతో సైన్యాలు ఆ రాజ్యంలోకి చొరబడ్డాయి. (నహూము 2:6-8) ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పట్టణం ఉన్నఫళంగా శిథిలాల కుప్పగా మారింది. నేటికీ అది శిథిలావస్థలోనే ఉంది. a “ఉత్సాహపడుచు” ఉన్న పట్టణం దేవుని ప్రవచన నెరవేర్పు ముందు తలవంచక తప్పలేదు.—జెఫన్యా 2:15.
13. నెరవేరిన ప్రవచనాలకు సంబంధించిన ఏ రుజువులు 12 మంది ప్రవక్తల పుస్తకాల్లో కనిపిస్తాయి?
13 ప్రవచనాలు నెరవేరాయని చెప్పడానికి నీనెవె నాశనం మచ్చుకు ఒకటి మాత్రమే. మధ్య ప్రాచ్య దేశాల ఆధునిక మ్యాపు ఓసారి చూడండి. అమ్మోను, బబులోను, ఎదోము, మోయాబు ఇవేవైనా మీకు కనిపిస్తాయా? అస్సలు కనిపించవు! ఒకప్పుడు అవి ప్రముఖ దేశాలు. కానీ, ఆ 12 మంది ప్రవక్తలు అవి నాశనమౌతాయని ప్రకటించారు. (ఆమోసు 2:1-3; ఓబద్యా 1, 8; నహూము 3:18; జెఫన్యా 2:8-11; జెకర్యా 2:7-9) ఆ జనాంగాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాలగర్భంలో కలిసిపోయాయి. అవి తుడిచిపెట్టుకుపోతాయని యెహోవా చెప్పాడు. ఆయన చెప్పినట్టే జరిగింది! యూదా శేషం బబులోను చెర నుండి తిరిగి వస్తుందని కూడా ప్రవక్తలు ప్రవచించారు, అదీ నెరవేరింది!
14. యెహోవా వాగ్దానాలు తప్పక నెరవేరతాయనే నమ్మకంతో మనం ఎందుకు జీవించవచ్చు?
14 యెహోవాకున్న ప్రవచించే సామర్థ్యంపై మీ నమ్మకాన్ని ఆ రుజువులు బలపర్చాయా? యెహోవా, మాట నిలబెట్టుకునే దేవుడని మీరు నమ్మవచ్చు. ఆయన “అబద్ధమాడనేరని దేవుడు.” (తీతు 1:1-4) అంతేకాదు, మనం తెలుసుకోవాల్సిన విషయాల్ని తన వాక్యం ద్వారా మనకు చెబుతున్నాడు. యెహోవా ప్రవచనాలు తప్పక నెరవేరతాయనే నమ్మకంతో, ఆయన చిత్తం చేస్తూ జీవించండి. ఈ 12 పుస్తకాల్లోని ఎన్నో ప్రవచనాలు గతంలో నెరవేరాయి, కొన్ని ఇప్పుడు నెరవేరుతున్నాయి, ఇంకొన్ని త్వరలో నెరవేరతాయి. ఆ పుస్తకాల్లోని సమాచారాన్ని పరిశీలిస్తే ఈ కాలానికి, రాబోయే కాలానికి సంబంధించిన ప్రవచనాలు నెరవేరతాయనే నమ్మకం పెరుగుతుంది. కాబట్టి, వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేయండి.
శ్రద్ధగల తండ్రి
15. వ్యక్తిగత సమస్యలతో సతమతమౌతున్నప్పుడు, మీకా ప్రవక్త అనుభవాలు మీకు ఎలా సహాయం చేయగలవు?
15 ఇప్పటివరకు మనం చూసినట్టు, ఆయా జనాంగాలకు లేదా మొత్తం ప్రపంచానికి సంబంధించిన ప్రవచన నెరవేర్పులు యెహోవా మీద మన నమ్మకాన్ని పెంచుతాయి. అయితే మన నమ్మకాన్ని పెంచేవి అవి మాత్రమే కాదు. మనపై వ్యక్తిగతంగా ప్రభావం చూపించేలా యెహోవా ప్రవచిస్తాడు, ఆ ప్రవచనాలను నెరవేరుస్తాడు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? కొన్నిసార్లు మనం వ్యక్తిగత సమస్యలతో సతమతమౌతుంటాం. అలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది కేవలం సమస్యను అర్థం చేసుకునే వ్యక్తి కాదు, ఆ సమస్య పరిష్కారానికి సహకరిస్తాడని మనం నమ్మే వ్యక్తి. సా.శ.పూ. 8వ శతాబ్దంలో, అహంకారులైన యూదా ప్రజలకు ప్రకటిస్తున్నప్పుడు మీకా ఒంటరివాణ్ణని భావించివుంటాడు. ఈ భూమ్మీద నమ్మకమైన సేవకుల్లో మిగిలింది తనొక్కడేనని ఆయనకు అనిపించివుంటుంది. ఆఖరికి సొంత కుటుంబ సభ్యుల మీద కూడా ఆయనకు నమ్మకం పోయివుంటుంది. ఎటుచూసినా రక్తపిపాసులు, మోసగాళ్లు, అవినీతిపరులే. అయితే ఎవరు ఎలా ఉన్నా, తన నమ్మకమైన సేవకుల్ని కంటికిరెప్పలా చూసుకుంటానని యెహోవా చేసిన వాగ్దానాలు మీకాకు ఊరటనిచ్చాయి. మీరు కూడా మీకాలా ఊరట పొందవచ్చు. ముఖ్యంగా, భక్తిహీన ప్రజల మధ్య యెహోవాను సేవిస్తున్న గుంపులో మీరు ఒకరిగా ఉన్నా, లేక మీరొక్కరే ఆయన సేవ చేస్తున్నా ఆయన చేసిన వాగ్దానాలు మీకు ఊరటనిస్తాయి.—మీకా 7:2-9.
16. అక్రమాన్ని, అణచివేతను యెహోవా గమనిస్తున్నాడనీ, నీతిమంతులను ఆయన విడిపిస్తాడనీ మనం ఎందుకు నమ్మవచ్చు?
16 ఇప్పటిలాగే ప్రాచీన యూదా, ఇశ్రాయేలుల్లోని ధనికులు, అధిపతులు కూడా దురాశపరులుగా, అన్యాయస్థులుగా తయారయ్యారు. ప్రజల దగ్గర విపరీతంగా పన్ను వసూలు చేశారు, భూముల్ని ఆక్రమించుకున్నారు. ఎందరో ప్రజలు వాళ్ల అన్యాయాలకు బలై బానిసలయ్యారు. వాళ్లు పేదవాళ్లను చిన్నచూపు చూశారు. వాళ్లతో క్రూరంగా కూడా వ్యవహరించారు. (ఆమోసు 2:6; 5:11, 12; మీకా 2:1, 2; 3:9-12; హబక్కూకు 1:4) అయితే అలాంటి అక్రమాన్ని, అణచివేతను సహించబోనని, అదేపనిగా పాపం చేసేవాళ్లను శిక్షిస్తానని దేవుడు తన ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. (హబక్కూకు 2:3, 6-16) ‘అనేక జనములకు న్యాయం తీరుస్తాను’ అనీ, తన అనుగ్రహం పొందిన సేవకులు ‘ఎవరి భయములేకుండ తమ ద్రాక్షచెట్టు క్రిందను తమ అంజూరపు చెట్టు క్రిందను కూర్చుంటారు’ అనీ యెహోవా ప్రవచించాడు. (మీకా 4:3, 4) అప్పుడు కలిగే ఉపశమనం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి! దేవుడు ఇప్పటికే ఎన్నో ప్రవచించాడు, వాటిని నెరవేర్చాడు. అలాంటి దేవుడు, పై ప్రవచనాన్ని కూడా నెరవేరుస్తాడని మనం నమ్మలేమా?
17, 18. (ఎ) దేవుడు ప్రజలకు ఎందుకు ఓ అవకాశాన్ని ఇస్తున్నాడు? (బి) యెహోవా క్రమశిక్షణను మనం ఎలా పరిగణించాలి?
17 మనుషులకు తన సామర్థ్యం చూపించుకోవడానికి కాదు యెహోవా తన ప్రవచనాల్ని నెరవేర్చేది. “దేవుడు ప్రేమాస్వరూపి” కాబట్టి, సూత్రప్రాయమైన ప్రేమతోనే ఆయన అలా చేస్తున్నాడు. (1 యోహాను 4:8) సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో జీవించిన హోషేయ విషయాన్ని గుర్తుచేసుకోండి. ఆయన భార్య గోమెరు ఆయనకు నమ్మకద్రోహం చేసినట్లే, ఇశ్రాయేలీయులు యెహోవాకు నమ్మకద్రోహం చేశారు. వాళ్లు చేసిన విగ్రహారాధన వ్యభిచారంతో సమానం, వాళ్లు బయలు ఆరాధనను యెహోవా స్వచ్ఛారాధనతో మిళితం చేశారు. చెప్పాలంటే వాళ్లు కూడా ఒకరకంగా అష్షూరు, ఐగుప్తులతో “వేశ్యాత్వము” చేశారు. అప్పుడు యెహోవా ఎలా స్పందించాడు? నమ్మకద్రోహం చేసిన భార్యను ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయమని యెహోవా హోషేయకు చెప్పాడు. యెహోవా కూడా అదే చేశాడు. యెహోవా ప్రేమతో ప్రజల మనసును తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. “ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని . . . వారి యెదుట భోజనము పెట్టితిని.” (హోషేయ 2:5; 11:4) ఇశ్రాయేలీయులు నిజంగా పశ్చాత్తాపపడితే దేవుని క్షమాపణ వాళ్లకు దొరుకుతుంది, అప్పుడు వాళ్లు యెహోవాతో మళ్లీ సత్సంబంధాల్ని ఏర్పర్చుకోవచ్చు. (హోషేయ 1:3, 4; 2:16, 23; 6:1-3; 14:4) యెహోవా ప్రేమాప్యాయతలను చూసి మీ మనసు ఉప్పొంగిపోవడం లేదా? ఒకసారి మీరిలా ప్రశ్నించుకోండి: అంతటి ప్రేమాప్యాయతలు చూపించిన దేవుడు తన మృదువైన, విశ్వసనీయమైన, సుస్థిరమైన, అమరమైన ఆప్యాయతను నా మీద చూపించడా?—హోషేయ 11:8.
18 క్రమశిక్షణ కూడా దేవుని ప్రేమకు నిదర్శనమని ఆ 12 ప్రవచన పుస్తకాలు తెలియజేస్తున్నాయి. అవిశ్వాసులైన తన ప్రజలకు యెహోవా ఇలా హామీనిచ్చాడు: “సర్వనాశము చేయక విడిచిపెట్టుదును.” (ఆమోసు 9:8) వాళ్లు తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించాడు. అయితే ఆ శిక్ష కొంతకాలం వరకే ఉంటుందని తెలిసినప్పుడు వాళ్లకు ఎంత హాయిగా అనిపించివుంటుందో కదా! మలాకీ 1:6 యెహోవాను ఓ ప్రేమగల తండ్రితో పోలుస్తోంది. ప్రేమగల ఏ తండ్రైనా పిల్లల్ని దారిలో పెట్టడానికి కొన్నిసార్లు క్రమశిక్షణను ఇస్తాడని మనకు తెలుసు. (నహూము 1:3; హెబ్రీయులు 12:5, 6) మన పరలోక తండ్రి కూడా ప్రేమగలవాడు, అందుకే ఆయన వెంటనే కోప్పడడు. ఆయన తన సేవకులను మెండుగా దీవిస్తాడని మలాకీ 3:10, 16 చెబుతున్నాయి.
19. మీరు ఏ ప్రశ్నలు వేసుకోవాలి?
19 మలాకీ పుస్తకం ఈ హామీతో మొదలౌతుంది: “యెహోవా సెలవిచ్చునదేమనగా—నేను మీయెడల ప్రేమ చూపియున్నాను.” (మలాకీ 1:2) ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ఆ హామీ గురించి ఆలోచిస్తూ ఇలా ప్రశ్నించుకోండి: ‘దేవుని ప్రేమ పొందకుండా చేసే పనులు ఏమైనా నేను చేస్తున్నానా? దేవుని ప్రేమకున్న ఏ పార్శ్వం గురించి నేను ఎక్కువగా తెలుసుకొని, చవిచూడాలని కోరుకుంటున్నాను?’ దేవుని ప్రేమను మీరు పూర్తిగా అర్థంచేసుకుంటే, ఆయన మీమీద తన అమరమైన ప్రేమను చూపిస్తాడనే నమ్మకం మీలో ఇంకా బలపడుతుంది.
దేవుని క్షమాపణ వల్ల రక్షణ కలుగుతుంది
20. దేవుని క్షమాపణ వల్ల రక్షణ కలుగుతుందని ఎందుకు చెప్పవచ్చు?
20 యెహోవా కొన్నిసార్లు విపత్తుల గురించి ప్రవచించాడని మీరు ఆ పుస్తకాల్లో చూస్తారు. ఆయన ఎందుకలా ప్రవచించాడు? తన ప్రజలు పశ్చాత్తాపపడేలా కదిలించేందుకే ఎక్కువసార్లు అలా చేశాడు. అందుకోసం, సా.శ.పూ. 740లో షోమ్రోనును, సా.శ.పూ. 607లో యెరూషలేమును నాశనం చేయడానికి అన్య రాజ్యాలను ఆయన అనుమతించాడు. అదంతా దేవుడు ప్రవచించినట్లే జరిగింది. అయితే ఆ తర్వాత, పశ్చాత్తాపపడిన తన ప్రజల్ని యెహోవా మళ్లీ స్వదేశానికి రప్పించాడు. అవును, పాపపు మార్గాన్ని విడిచిపెట్టి తన దగ్గరకు వచ్చేవాళ్లను దేవుడు కనికరంతో క్షమిస్తాడని, మళ్లీ తనతో సత్సంబంధాన్ని ఏర్పర్చుకునే అవకాశం కల్పిస్తాడని ఆ పుస్తకాలు నొక్కిచెబుతున్నాయి. (హబక్కూకు 3:13; జెఫన్యా 2:2, 3) మీకా సంతోషంతో ఇలా అన్నాడు: “తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.” (మీకా 7:18; యోవేలు 2:13; జెకర్యా 1:4) ఆ మాటలు అక్షరాలా నిజమని ప్రవచన నెరవేర్పులను చూస్తే తెలుస్తుంది.
21. (ఎ) మెస్సీయ గురించి 12 మంది ప్రవక్తలు ఏ విషయాలు తెలియజేశారు? (బి) మెస్సీయకు సంబంధించిన ఏ ప్రవచనాలు మీకు ఆసక్తికరంగా అనిపించాయి?
21 ఇప్పుడు, మనుషులకు శాశ్వత క్షమాపణను అనుగ్రహించేందుకు యెహోవా చేసిన న్యాయబద్ధమైన ఏర్పాటు విషయానికి వద్దాం. పాపులైన మనుషుల కోసం ప్రాణాన్ని “విమోచన క్రయధనముగా” అర్పించే మెస్సీయ వస్తాడని యెహోవా ప్రవచించాడు. (1 తిమోతి 2:6) ఆమోసు ప్రవక్త, దావీదు కుమారుడైన మెస్సీయ చేయనున్న పునరుద్ధరణ గురించి ప్రవచించాడు. (ఆమోసు 9:11, 12; అపొస్తలుల కార్యములు 15:15-19) మీకా అయితే ఏకంగా, విమోచన క్రయధన బలిపై విశ్వాసముంచే వాళ్లకు జీవాన్నిచ్చే యేసు ఎక్కడ జన్మిస్తాడో కూడా సూచించాడు. (మీకా 5:2) జెకర్యా ప్రవక్త, ‘చిగురైన’ యేసు ‘సింహాసనాసీనుడై ఏలడం’ గురించి మాట్లాడాడు. (జెకర్యా 3:8; 6:12, 13; లూకా 1:32, 33) అలాంటి మరిన్ని ప్రవచనాలు పరిశీలిస్తే మీ విశ్వాసం నిశ్చయంగా దృఢమౌతుంది.—“ మెస్సీయ గురించిన ముఖ్యమైన ప్రవచనాలు” అనే బాక్సు చూడండి.
22. ఆ 12 మంది ప్రవక్తలు యెహోవా గురించి తెలియజేస్తున్న విషయాల్ని బట్టి ఆయన మీద మీకున్న నమ్మకం ఎలా బలపడింది?
22 దేవుని అంతిమ విజయంపై మీ నమ్మకాన్ని ఆ 12 పుస్తకాలు పెంచుతాయి. అజేయుడైన యెహోవా పూర్తి స్థాయిలో న్యాయాన్ని స్థాపిస్తాడు. దేవుని వాక్యం ఎల్లకాలం నిలుస్తుంది. ఆయన తన ప్రజలతో చేసిన ఒప్పందాల్ని గుర్తుంచుకుంటాడు, తన సేవకులను శ్రద్ధగా చూసుకుంటాడు, అణచివేసేవాళ్ల నుండి విడిపిస్తాడు. (మీకా 7:8-10; జెఫన్యా 2:6, 7) యెహోవా మారలేదు. (మలాకీ 3:6) సంకల్పాల్ని నెరవేర్చే విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి యెహోవాకు ఎప్పుడూ ఎదురవదనీ, వాటిని నెరవేర్చకుండా ఆయన్ను ఏదీ ఆపలేదనీ తెలుసుకోవడం మనకు ఎంత ఊరటనిస్తుంది! తీర్పుదినం వస్తుందని యెహోవా చెప్పాడంటే, అది వచ్చి తీరుతుంది. కాబట్టి, యెహోవా దినం కోసం కనిపెట్టుకొని ఉండండి. “యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.” (జెకర్యా 14:9) దాన్ని యెహోవా ప్రవచించాడు, తప్పక నెరవేరుస్తాడు.
a ఇరాక్‌లో యుద్ధం జరగక ముందు అంటే 2002 నవంబరులో ప్రొఫెసర్ డాన్ క్రుక్‌షాంక్ ఆ ప్రాంతాన్ని సందర్శించాడు. ఆయన బీబీసీ ఛానల్‌లో మాట్లాడుతూ ఇలా నివేదించాడు: “నీనెవె పట్టణం మోసుల్ నగర శివారున శిథిలావస్థలో దర్శనమిస్తుంది. 1840ల నుండి బ్రిటీష్ పురావస్తు శాస్త్రజ్ఞులు ఉత్సాహంగా జరిపిన తవ్వకాల్లో నిమ్రూదు పట్టణంతోపాటు నీనెవె కూడా బయటపడింది. . . . అష్షూరుకు చెందిన ఈ నగరాలను కనుక్కోవడమంటే అప్పుడెప్పుడో కనుమరుగైపోయిన, దాదాపు కట్టుకథలా మిగిలిన నాగరికతను వెలికితీయడమే. ఆ నాగరికత గురించి ఏవైనా కొన్ని వివరాలు తెలుసుకోగలిగామంటే, అది బైబిల్లో కనిపించే క్లుప్తమైన మాటలు, నిగూఢమైన వర్ణనలు, శాపాలు వంటివాటి వల్లే.”