3వ అధ్యాయం
యెహోవా మహా దినమే ఆ పుస్తకాల ముఖ్యాంశం
1, 2. (ఎ) ఆ 12 మంది ప్రవక్తలు ప్రస్తావించిన ముఖ్యాంశం ఏమిటి? (బి) ‘యెహోవా దినం’ అనే మాటను 12 మంది ప్రవక్తల్లో కొందరు నేరుగా ఉపయోగించారని ఎలా చెప్పవచ్చు?
“యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది.” (జెఫన్యా 1:14) దగ్గరపడుతున్న యెహోవా దినం గురించి దేవుని ప్రవక్తలు పదేపదే హెచ్చరించారు. దాన్ని మనసులో ఉంచుకొని ప్రజలు తమ రోజువారీ జీవితాల్లో, నైతిక విలువల్లో, ప్రవర్తనలో చేసుకోవాల్సిన మార్పుల గురించి ఆ ప్రవక్తలందరూ రాశారు. వాళ్లు ప్రకటించిన సందేశానికి ప్రజలు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరే గనుక ఆ కాలంలో జీవించివుంటే, ఆ సందేశాలకు ఎలా స్పందించి ఉండేవాళ్లు?
2 ఆ ప్రవక్తలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో యెహోవా దినం గురించి మాట్లాడారని ఆ 12 పుస్తకాలు చదివినప్పుడు అర్థమౌతుంది. a తర్వాతి అధ్యాయాల్లో, వాళ్లు ప్రకటించిన విలువైన సందేశాల్ని పరిశీలించే ముందు, వాటిలో పదేపదే కనిపించే ‘యెహోవా దినం’ అనే అంశం గురించి ఆలోచించండి. ఆ ప్రవక్తల్లో ఆరుగురు ఆ మాటను లేదా అలాంటి మాటల్ని నేరుగా ఉపయోగించారు. ‘యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినాన్ని’ యోవేలు ప్రవక్త భీతిగొల్పే రీతిలో వర్ణించాడు. (యోవేలు 1:15; 2:1, 2, 30-32) యెహోవా దినం అంధకార దినం కాబట్టి “దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి” అని ఆమోసు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (ఆమోసు 4:12; 5:18) తర్వాతి కాలంలో జెఫన్యా ప్రవక్త పై పేరాలోని మాటల్ని చెప్పాడు. యెరూషలేము నాశనమయ్యే సమయం దగ్గరపడినప్పుడు ఓబద్యా ఇలా హెచ్చరించాడు: “యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది.”—ఓబద్యా 15.
3. యూదులు చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత, ప్రవక్తలు యెహోవా దినం గురించి మాట్లాడారని మనం ఎందుకు చెప్పవచ్చు?
3 చెర నుండి తిరిగి వచ్చిన యూదుల దగ్గరకు దేవుడు పంపిన ఇద్దరు ప్రవక్తలు అలాంటి మాటల్నే ఉపయోగించారు. యెరూషలేము మీద దాడి చేసే జనాంగాలన్నీ సమూలంగా నాశనమయ్యే దినం గురించి జెకర్యా చెప్పాడు. యెహోవాకు చెందినదని గుర్తింపు పొందిన దినాన ఏమి జరుగుతుందో ఆయన వర్ణించాడు. (జెకర్యా 12:9; 14:7, 12-15) రానున్న ‘యెహోవా భయంకరమైన మహాదినము’ గురించి మలాకీ దేవుని ప్రజల్ని అప్రమత్తం చేశాడు.—మలాకీ 4:1-5.
4. ఆ 12 మంది ప్రవక్తల్లో కొందరు పరోక్షంగా యెహోవా దినం గురించి మాట్లాడారని ఎందుకు చెప్పవచ్చు?
4 ఆ 12 మంది ప్రవక్తల్లో కొందరు “యెహోవా దినము” అనే మాటను నేరుగా వాడకపోయినా, దాని గురించి పరోక్షంగా మాట్లాడారు. ఇశ్రాయేలుతో, ఆ తర్వాత యూదాతో యెహోవా “వ్యాజ్యెము” తీర్చుకోవడం గురించి హోషేయ మాట్లాడాడు. (హోషేయ 8:13, 14; 9:9; 12:2) నాడు యెహోవా చేసినవాటికి సంబంధించినవే ఆ సందేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు, నీనెవె మీద దేవుని తీర్పును యోనా ప్రకటించాడు. తిరుగుబాటు చేసిన ప్రజల మీద యెహోవా చర్య తీసుకున్నప్పుడు ఏమి జరుగుతుందో మీకా వర్ణించాడు. (యోనా 3:4; మీకా 1:2-5) శత్రువులపై యెహోవా ప్రతీకారం తీర్చుకుంటాడని నహూము ప్రవచించాడు. (నహూము 1:2, 3) హబక్కూకు న్యాయం కోసం మొరపెట్టాడు, “శ్రమ దినము” గురించి వివరించాడు. (హబక్కూకు 1:1-4, 7; 3:16) ఈ పుస్తకాల్లోని కొన్ని సందేశాలు, నిజక్రైస్తవుల విషయంలో చోటుచేసుకునే పరిణామాల గురించి తెలియజేశాయి. ఉదాహరణకు, యూదులు చెర నుండి తిరిగివచ్చిన తర్వాత సేవచేసిన ప్రవక్తల్లో ఒకడైన హగ్గయి, యెహోవా ‘అన్యజనుల్ని కదిలించడం’ గురించి ప్రవచించాడు. (హగ్గయి 2:6, 7) దేవుడు సూచనార్థకమైన దుష్ట ఆకాశాన్ని నిర్మూలించే సమయానికి, క్రైస్తవులు దేవుని అనుగ్రహం పొందే స్థితిలో ఉండాలని ప్రోత్సహించేందుకు అపొస్తలుడైన పౌలు హగ్గయి 2:6లోని మాటల్ని ఉల్లేఖించాడు.—హెబ్రీయులు 12:25-29; ప్రకటన 21:1.
యెహోవా దినం ఎలా ఉంటుంది?
5, 6. ప్రవక్తలు చెప్పినట్లుగా యెహోవా దినం ఎలా ఉంటుంది?
5 యెహోవా దినం ఎలా ఉంటుందనే దాని గురించి ఆలోచించడం సరైనదే. బహుశా మీకు ఈ ప్రశ్న తలెత్తవచ్చు: ‘నా జీవన విధానం మీద, నా భవిష్యత్తు మీద యెహోవా దినం ఏమైనా ప్రభావం చూపిస్తుందా?’ ఆ ప్రవక్తలు సూచించినట్లు, యెహోవా దినమంటే దేవుడు శత్రువులపై తీర్పుల్ని అమలు చేసే సమయం. అది ఓ యుద్ధ దినం. భయంకరమైన ఆ దినాన బహుశా ఆకాశంలో కనీవినీ ఎరుగని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ‘సూర్య చంద్రులు తేజోహీనమౌతాయి, నక్షత్రముల కాంతి తప్పిపోతుంది.’ (యోవేలు 2:2, 11, 30, 31; 3:15; ఆమోసు 5:18; 8:9) మరి, మన భూమ్మీద ఏమి జరుగుతుంది? మీకా ఇలా రాశాడు: “ఆయన [యెహోవా] నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటముమీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును.” (మీకా 1:4) అది అలంకారిక వర్ణన కావచ్చు, కానీ దేవుడు చర్య తీసుకున్నప్పుడు భూమిని, దాని నివాసుల్ని కుదిపేసే వినాశనకర పరిస్థితులు చోటుచేసుకుంటాయనే నిర్ధారణకు మనం రావచ్చు. అలాగని, ప్రతి మనిషీ ఆ ధాటికి గురవ్వడు. ‘మేలును వెదికే’ ప్రజలు మెండైన దీవెనలు పొంది నిత్యం జీవిస్తారని కూడా ఆ ప్రవక్తలు తెలియజేశారు.—ఆమోసు 5:14; యోవేలు 3:17, 18; మీకా 4:3, 4.
6 ఆ 12 మంది ప్రవక్తల్లో ఇంకొందరు యెహోవా దినాన్ని మరింత అలంకారికంగా వివరించారు. శాశ్వతంగా నిలుస్తాయనిపించే మానవ సంస్థలను సూచిస్తున్న ‘ఆదికాల పర్వతాలను,’ ‘పురాతన గిరులను’ యెహోవా ఎలా నుజ్జునుజ్జు చేస్తాడో హబక్కూకు వివరించాడు. (హబక్కూకు 3:6-12) నిశ్చయంగా, యెహోవా దినం “ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములును గాఢాంధకారమును కమ్ము దినము.”—జెఫన్యా 1:14-17.
7. ఏ ఉపద్రవం గురించి బైబిలు ప్రవచించింది? అదెలా నెరవేరుతుంది?
7 యెహోవాతో పోరాడుతున్న వాళ్ల మీదకు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో ఒక్కసారి ఊహించండి! “వారు నిలిచియున్నపాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కనుతొఱ్ఱలలో ఉండియే కుళ్లిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును.” (జెకర్యా 14:12) ఆ దర్శనం అచ్చం అలాగే నెరవేరుతుందో లేదో కానీ చాలామంది మీదకు విపత్తు వస్తుందని మాత్రం అది సూచిస్తోంది. దేవుని శత్రువుల ‘నాలుకలు కుళ్లిపోతాయి’ అంటే, వాళ్లు ఆయనను ఎదిరించే మాటలు మాట్లాడలేరు. వాళ్ల కళ్లు కుళ్లిపోతాయి అంటే, తమ చేతుల్లో దేవుని ప్రజలు నాశనమౌతున్నట్టు వాళ్లు ఊహించుకున్న దృశ్యం మసకబారిపోతుంది.
ప్రేమామయుడైన దేవుడు శిక్షించడమా?
8, 9. (ఎ) యెహోవా దుష్టుల్ని ఎందుకు శిక్షిస్తాడో అర్థంచేసుకోవడానికి మనం ఏమి పరిశీలించాలి? (బి) మీరు యథార్థంగా జీవిస్తే, యెహోవా దుష్టుల్ని నాశనం చేసినప్పుడు మీతో ఎలా వ్యవహరిస్తాడు?
8 కొందరు ఇలా అడగడం మీరు వినేవుంటారు: ‘దేవుడు ప్రేమామయుడు కదా, మరి తన శత్రువుల్ని అంత దారుణంగా ఎందుకు శిక్షిస్తాడు? దేవుడు మరీ అంతలా చర్య తీసుకోవడం అవసరమా? శత్రువుల్ని సైతం ప్రేమించమని, అలా చేస్తే పరలోక తండ్రికి కుమారులౌతారని యేసు చెప్పలేదా?’ (మత్తయి 5:44, 45) ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే, మానవాళి సమస్యలు ఆరంభమైన సమయం గురించి ఒకసారి ఆలోచించాలి. మొదటి మానవ జంటను దేవుడు ‘తన స్వరూపంలో, తన పోలిక చొప్పున’ సృష్టించాడు. అప్పుడు వాళ్లు పరిపూర్ణులు. అయితే, వాళ్ల వల్ల మానవాళికి పాపమరణాలు సంక్రమించాయి. అందుకే మనం వాటి బారిన పడుతున్నాం. మనుషుల్ని పరిపాలించడానికి సర్వహక్కులు ఎవరికి ఉన్నాయనే వివాదాంశంలో వాళ్లు అపవాదియైన సాతాను పక్షాన చేరారు. (ఆదికాండము 1:26; 3:1-19) మనుషులకు ఏదైనా ఆశ చూపిస్తే, వాళ్లు యెహోవాను సేవించడం మానేస్తారని నిరూపించడానికి సాతాను గతించిన శతాబ్దాలన్నిటిలో తెగ ప్రయత్నించాడు. కానీ, అతను ఓడిపోయాడని మీకు తెలుసు. యేసుక్రీస్తుతో సహా ఎంతోమంది యెహోవా సేవకులు తమ విశ్వాసం చెక్కుచెదరకుండా చూసుకున్నారు, ఆయనను ప్రేమతోనే ఆరాధిస్తున్నామని నిరూపించారు. (హెబ్రీయులు 12:1-3) అలా విశ్వసనీయంగా యెహోవా సేవ చేస్తున్న ఎంతోమంది మీకు పేరుతో సహా తెలిసేవుంటారు.
9 ఈ దుష్ట వ్యవస్థ అంతమప్పుడు పరిష్కారం కానున్న వివాదాంశంలో మీరూ ఉన్నారు. ఉదాహరణకు, యెహోవా ఆరాధనను అటకెక్కించి విలాసాలకు మరిగిన ప్రజల జీవనశైలి గురించి కొందరు ప్రవక్తలు ప్రస్తావించారనే విషయం ఆ 12 పుస్తకాలను చదువుతున్నప్పుడు మీకు అర్థమౌతుంది. ‘తమ ప్రవర్తన గురించి ఆలోచించుకొని’ పరివర్తన చెందమని ప్రవక్తలు దేవుని ప్రజలకు ఉపదేశమిచ్చారు. (హగ్గయి 1:2-5; 2:15, 18; ఆమోసు 3:14, 15; 5:4-6) అవును, ప్రజల జీవితానికి ఉపయోగపడే నిర్దేశాల్ని ఆ ప్రవక్తలు ఇచ్చారు. వాటిని విని మార్పులు చేసుకున్నవాళ్లు యెహోవాయే తమ సర్వాధిపతి అనీ, సాతాను అబద్ధాలకోరు అనీ నిరూపించారు. యెహోవా తన శత్రువుల్ని నాశనం చేసిననాడు, యథార్థవంతుల్ని రక్షించి తాను వాళ్లపట్ల ‘యథార్థంగా’ ఉన్నానని నిరూపించుకుంటాడు.—2 సమూయేలు 22:26.
10. మీకా కాలంనాటి పరిస్థితులను చూస్తే, యెహోవా దుష్టుల్ని శిక్షించడానికి గల మరో కారణం ఏమిటని అర్థమౌతోంది?
10 దుష్టుల మీద దేవుడు చర్య తీసుకోవడానికి మరో కారణం ఉంది. అదేంటో తెలుసుకోవడానికి, ఒకసారి సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో మీకా ప్రవక్త యూదాలో సేవచేసిన కాలానికి వెళ్దాం. మీకా తనను తాను యూదా జనాంగంతో పోల్చుకున్నాడు. దాని పరిస్థితి కోత ముగిశాక ఒక్క పండు కూడా మిగలని ద్రాక్షతోటలా లేదా అంజూరపు తోటలా ఉందని అన్నాడు. నిజంగానే, యూదా పట్టణంలో నీతిమంతులనేవాళ్లు దాదాపు లేని పరిస్థితి వచ్చింది. ఇశ్రాయేలీయులు తమ తోటి పౌరుల్ని వేటాడుతున్నారు, రక్తపాతం సృష్టించడానికి పొంచివుంటున్నారు. వాళ్ల అధిపతులు, న్యాయాధిపతులు స్వలాభం వేటలో పడ్డారు. (మీకా 7:1-4) ఒకవేళ మీరు అలాంటి పరిస్థితుల మధ్య జీవించివుంటే, మీకు ఎలా అనిపించివుండేది? బహుశా, వాళ్ల అఘాయిత్యాలకు బలౌతున్న అమాయకుల మీద జాలిపడి ఉండేవాళ్లు. మరి మీకే అలా అనిపిస్తే, యెహోవాకు ఎలా అనిపించాలి? నేడు, యెహోవా మానవాళిని పరిశీలిస్తున్నాడు. ఎలాంటివాళ్లు ఆయన కంటబడతారు? నిరంకుశులు ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు, ఎదుటివాళ్ల మీద క్రూరమైన దాడులకు పాల్పడుతున్నారు. మరి నీతిమంతుల మాటేమిటి? ప్రపంచ జనాభాతో పోలిస్తే వాళ్ల సంఖ్య చాలా తక్కువ. అలాగని, మనం నిరాశపడకూడదు. అన్యాయాలకు గురౌతున్న అమాయకుల మీద యెహోవాకు ప్రేమ ఉంది, ఆయన వాళ్లకు తప్పక న్యాయం చేస్తాడు.—యెహెజ్కేలు 9:4-7.
11. (ఎ) యెహోవా దినాన ఆయన భక్తులకు ఏమి జరుగుతుంది? (బి) యోనా ప్రకటించిన హెచ్చరికా సందేశం వల్ల నీనెవె ప్రజల జీవితాలు ఎలా మారాయి?
11 యెహోవా దినమంటే ఆయన శత్రువులకు నాశనమనీ, ఆయన భక్తులకు విడుదలనీ స్పష్టమౌతోంది. b యెహోవా మందిర పర్వతం మీదికి అన్యజనులు ప్రవాహంలా తరలి వస్తారని, దానివల్ల లోకవ్యాప్తంగా శాంతి, ఐక్యతలు నెలకొంటాయని మీకా ప్రవచించాడు. (మీకా 4:1-4) ఆనాడు, ప్రవక్తలు యెహోవా దినం గురించి ప్రవచించినందుకు ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? కొందరి జీవితాల్లో వచ్చింది. మీకు గుర్తుందా, యోనా నీనెవె పట్టణం మీద తీర్పును ప్రకటించినప్పుడు ఆ పట్టణంలోని క్రూరులు, దుష్టులు “దేవునియందు విశ్వాసముంచి,” “తమ చెడు నడతలను” మార్చుకున్నారు. అందుకే, ఆ సమయంలో యెహోవా వాళ్లను నాశనం చేయకుండా వదిలేశాడు. (యోనా 3:5, 10) ముంచుకురానున్న యెహోవా తీర్పు దినం గురించిన సందేశాన్ని ప్రకటించడం వల్ల నీనెవె వాసుల జీవితాలు మారాయి!
ఆ దినం మీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
12, 13. (ఎ) ఎవరి గురించి ఆ 12 మంది ప్రవక్తలు ప్రవచించారు? (బి) వాళ్ల ప్రవచనాలకు ఇంకొన్ని నెరవేర్పులు కూడా ఉన్నాయని ఎలా చెప్పవచ్చు?
12 ‘ఆ ప్రవక్తలు పూర్వం ఎప్పుడో జీవించారు కదా, యెహోవా దినం గురించిన వాళ్ల సందేశాలు ఇప్పుడు జీవిస్తున్న నాకు ఎలా వర్తిస్తాయి?’ అని కొందరు అభ్యంతరం చెప్పవచ్చు. వాళ్లు ఎప్పుడో క్రీస్తు పూర్వం జీవించారన్న మాట నిజమే. అయినా, వాళ్లు చెప్పిన విషయాలు ఈ 21వ శతాబ్దానికి ఎలా వర్తిస్తాయో మనం ఆలోచించాలి. యెహోవా మహాదినం గురించి వాళ్లు చెప్పిన దాన్నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? వాళ్ల సందేశం ఎంత ప్రాముఖ్యమైనదో అర్థంచేసుకొని, ప్రయోజనం పొందాలంటే మనం ఓ ముఖ్యమైన పని చేయాలి. అదేంటంటే ఇశ్రాయేలు, యూదాలతోపాటు చుట్టుపక్కల దేశాల మీదకు, అలాగే నాటి ప్రపంచాధిపత్యాల మీదకు రానున్న యెహోవా దినం గురించి ఆ ప్రవక్తలు హెచ్చరించారనే విషయాన్ని మనం గుర్తించాలి. c వాళ్లు హెచ్చరించినట్టే జరిగింది! అష్షూరీయులు షోమ్రోను మీద యుద్ధానికి వచ్చారు. సా.శ.పూ. 607లో యూదా నాశనమైంది. ఆ తర్వాత కొద్దికాలానికే చుట్టుపక్కల శత్రు రాజ్యాలు కూడా పతనమయ్యాయి. చివరకు అష్షూరుకు, బబులోనుకు సంబంధించిన ప్రవచనాలు కూడా నెరవేరాయి, ఆ ప్రపంచాధిపత్యాలు కుప్పకూలిపోయాయి.
13 సా.శ. 33 పెంతెకొస్తుకు చాలా ఏళ్ల క్రితమే ఆ 12 మంది ప్రవచించిన ఎన్నో ప్రవచనాల మొదటి నెరవేర్పు జరిగింది. అయితే పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ కుమ్మరించబడడం అనేది యోవేలు ప్రవచన నెరవేర్పేనని అపొస్తలుడైన పేతురు తెలియజేశాడు. ఆ తర్వాత యోవేలు పుస్తకంలోని ఈ మాటల్ని ఆయన ప్రస్తావించాడు: “ప్రభువు [“యెహోవా,” NW] ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.” (అపొస్తలుల కార్యములు 2:20) యెహోవా దినం గురించిన ప్రవచనాలకు ఇంకొన్ని నెరవేర్పులు ఉంటాయని అది చూపిస్తోంది. సా.శ. 70లో రోమా సైన్యాలు వచ్చి యెరూషలేమును నాశనం చేసినప్పుడు యోవేలు ప్రవచనంలోని ఆ మాటల రెండవ నెరవేర్పు జరిగింది. అది నిజంగానే అంధకారమైన, రక్తసిక్తమైన సమయం.
14, 15. (ఎ) యెహోవా దినం గురించిన ప్రవచనాలు నేడు మన మీద ప్రభావం చూపిస్తాయని ఎందుకు చెప్పవచ్చు? (బి) యెహోవా దినం ఎప్పుడు వస్తుందని మనం ఎదురుచూడవచ్చు?
14 అయితే యోవేలు, మరితర పుస్తకాల్లోని యెహోవా దినం గురించిన ప్రవచనాల చివరి నెరవేర్పు జరగాల్సివుంది. వాళ్లు చెప్పిన ప్రవచనాలు ఈ 21వ శతాబ్దంలో జీవిస్తున్న మనకూ వర్తిస్తాయి. అలాగని ఎందుకు చెప్పవచ్చు? “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు” జీవించమని అపొస్తలుడైన పేతురు క్రైస్తవులకు ఉపదేశించాడు. ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు: “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:11-13) కొత్త ఆకాశాలు (దేవుని కొత్త ప్రభుత్వం), కొత్త భూమి (ఆ ప్రభుత్వ పాలనలో ఉండే నీతిమంతుల సమాజం) సా.శ. 70 లో యెరూషలేము నాశనమైన వెంటనే స్థాపితమవలేదు. కాబట్టి, యెహోవా దినం గురించి చెబుతున్న ప్రవచనాలకు ఇంకొక నెరవేర్పు ఉండివుండాలి. అవును, ఆ ప్రవచనాలు ఈ ‘అపాయకరమైన కాలాల్లో’ జీవిస్తున్న మన మీద ప్రభావం చూపిస్తాయి.—2 తిమోతి 3:1.
15 యెహోవా దినానికి సంబంధించి ఆ 12 పుస్తకాల్లో ఉన్న వివరాలు యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటల గురించి ఆలోచింపజేస్తాయి: “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.” మహాశ్రమలు మొదలైన “వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును” అని యేసు అన్నాడు. (మత్తయి 24:21, 29) యెహోవా దినం ఎప్పుడు వస్తుందో అర్థంచేసుకోవడానికి ఆ మాటలు మనకు సహాయం చేస్తాయి. అది ఎంతో దూరంలో లేదు. ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహా బబులోను” మహాశ్రమల్లో నాశనం అవుతుందని లేఖనాలు చూపిస్తున్నాయి. ఆ తర్వాత, యెహోవా దినం దేవుని శత్రువుల్ని ఈ భూమ్మీద నామరూపాల్లేకుండా చేస్తుంది, అదే మహాశ్రమల ముగింపు.—ప్రకటన 17:5, 12-18; 19:11-21.
16. యెహోవా దినం గురించిన ప్రవచనాలు విస్తృత స్థాయిలో ఎలా నెరవేరతాయి?
16 యెహోవా దినం గురించిన ప్రవచనాలు ఎప్పుడు, ఎలా నెరవేరతాయో యెహోవాసాక్షులు అర్థంచేసుకున్నారు. ఇప్పుడున్న అబద్ధమత సామ్రాజ్యపు అనేక పార్శ్వాలు వివిధ రూపాల్లో ఆనాటి మతభ్రష్ట యెరూషలేములో, భ్రష్ట షోమ్రోనులో, వైరీభావంగల ఎదోమీయుల మధ్య, క్రూరులైన అష్షూరీయుల మధ్య, బబులోనీయుల మధ్య ఉండేవి. మహాశ్రమల తొలి భాగంలో అబద్ధమత సామ్రాజ్యమంతా నాశనమౌతుంది. తర్వాత ‘యెహోవా యొక్క భయంకరమైన మహా దినాన’ అబద్ధమతంతో చెలిమి చేసిన రాజకీయ, వాణిజ్య వ్యవస్థలు కూడా మట్టికొట్టుకుపోతాయి.—యోవేలు 2:31.
సిద్ధంగా ఉండండి
17, 18. (ఎ) “యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకొనియున్న” వాళ్లకు శ్రమ అని ఆమోసు ఎందుకు అన్నాడు? (బి) యెహోవా దినం కోసం సిద్ధంగా లేని వాళ్లకు ఏమి జరుగుతుంది?
17 తీర్పు సందేశాలు ముఖ్యంగా అబద్ధమతానికే కాబట్టి, ఆ ప్రవచనాల నెరవేర్పు తమపై ప్రభావం చూపదని కొందరు క్రైస్తవులు అపోహపడుతుండవచ్చు. అయితే, ఇశ్రాయేలీయులకు ఆమోసు చెప్పిన ఈ మాటల్లో మనందరికీ ఎంతో ఉపయోగపడే విషయం ఉంది: “యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకొనియున్న వారలారా, మీకు శ్రమ.” యెహోవా దినమంటే దేవుడు తన ప్రజల పక్షాన పోరాడి తమ మీద దీవెనలు కుమ్మరించే దినమని ఆమోసు కాలంలోని కొందరు ఇశ్రాయేలీయులు అనుకున్నారు. వాళ్లు ఆ దినం కోసం తెగ ఎదురుచూశారు! అయితే, ‘నాకేం కాదు’ అని ధీమాగా ఉండేవాళ్ల పాలిట యెహోవా దినం “వెలుగుకాదు, అంధకారము” అని ఆమోసు అన్నాడు. అవును, ఆ ఇశ్రాయేలీయులు యెహోవా ఉగ్రతకు గురికాక తప్పదు.—ఆమోసు 5:18.
18 యెహోవా దినం కోసం తెగ ఎదురుచూసే వాళ్లకు ఏమి జరుగుతుందో ఆమోసు వివరించాడు. ఒకసారి ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: ఒక సింహం ఓ మనిషిని తరుముతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్న అతనికి ఎలుగుబంటి ఎదురుపడింది. దాన్నుండి తప్పించుకొని ఓ ఇంట్లోకి పరుగెత్తి ఢబేల్న తలుపులు మూశాడు. ఆయాసంతో రొప్పుతూ గోడకు ఆనుకోగానే ఓ పాము అతణ్ణి కాటేసింది. యెహోవా దినం కోసం నిజంగా సిద్ధంగా లేని వాళ్ల పరిస్థితి అలాగే ఉంటుంది.—ఆమోసు 5:19.
19. మనం యెహోవా దినం కోసం ఎలా సిద్ధపడాలి?
19 ఆమోసు చెప్పిన దాంట్లో ఏ పాఠం ఉందో గమనించారా? ఆమోసు దేవుని సమర్పిత ప్రజల్ని ఉద్దేశించే మాట్లాడాడని గుర్తుచేసుకోండి. ఆ ప్రజలు తమ వైఖరిని, ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉంది. మీరు ఆ ప్రాముఖ్యమైన దినం కోసం సిద్ధంగా ఉన్నారా లేక ఇంకేమైనా మార్పులు చేసుకోవాలా అని ఆలోచించుకోవడం సబబు కాదంటారా? మీరు ఆ దినం కోసం నిజంగా సిద్ధంగా ఉన్నారని ఎలా చూపించవచ్చు? ప్రపంచంలో కొందరు ముందుజాగ్రత్తగా సురక్షిత స్థలాల్ని ఏర్పాటు చేసుకున్నారు, ఆహారపదార్థాల్ని తీసిపెట్టుకున్నారు, నీటిని పరిశుభ్రం చేయడం నేర్చుకున్నారు, బంగారాన్ని సమకూర్చుకున్నారు. కానీ సిద్ధంగా ఉండడం అంటే అది కాదు. జెఫన్యా ఇలా అన్నాడు: “యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు.” కాబట్టి వస్తుపరమైనవి సమకూర్చుకుంటే మనం సిద్ధపడినట్లు కాదు. (జెఫన్యా 1:18; సామెతలు 11:4; యెహెజ్కేలు 7:19) మనం ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉంటూ ప్రతీరోజు యెహోవా దినం కోసం సిద్ధంగా ఉన్నట్లు జీవించాలి. మన వైఖరి సరిగ్గా ఉండాలి, ప్రవర్తన దానికి తగ్గట్టు ఉండాలి. మీకా ఇలా అన్నాడు: “యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును.”—మీకా 7:7.
20. కనిపెట్టుకొని ఉండే వైఖరి వేటివల్ల నీరుగారకూడదు?
20 అలా కనిపెట్టుకొనివుండే వైఖరి మీకుంటే, మీరు యెహోవా దినం కోసం సిద్ధంగా ఉన్నట్టు చూపిస్తారు. అప్పుడిక, యెహోవా దినం వచ్చే తారీఖు గురించి, మీరు వేచివున్న కాలం గురించి అనవసరంగా ఆందోళనపడరు. ఆ దినం గురించిన ప్రవచనాలన్నీ యెహోవా అనుకున్న సమయంలో తప్పక నెరవేరతాయి, ఆలస్యమయ్యే ప్రసక్తే లేదు. హబక్కూకు ప్రవక్తకు యెహోవా ఇలా చెప్పాడు: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది [మనుషుల దృష్టిలో] ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, [యెహోవా దృష్టిలో] జాగుచేయక వచ్చును.”—హబక్కూకు 2:3.
21. ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయడం వల్ల ఏయే ప్రయోజనాలు పొందవచ్చు?
21 రక్షణకర్తయిన దేవుని కోసం కనిపెట్టుకొని ఉండే వైఖరిని ఎలా చూపించవచ్చో మనం ఈ పుస్తకంలో నేర్చుకుంటాం. ఈ పుస్తకం చదవడం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయి? బైబిల్లో అంతగా పరిచయం లేని 12 పుస్తకాల్లో ఉన్న విషయాల్ని మనం ముఖ్యంగా పరిశీలిస్తాం. దానివల్ల హోషేయ నుండి మలాకీ వరకున్న పుస్తకాల్లోని ఎన్నో విషయాల మీద మంచి అవగాహన ఏర్పడుతుంది. ఉదాహరణకు, ఈ పుస్తకంలోని 2వ భాగంలో ‘యెహోవాను ఆశ్రయించి బ్రతికి ఉండడం’ ఎలాగో పరిశీలిస్తాం. (ఆమోసు 5:4, 6) ఆ 12 పుస్తకాల ఆధారంగా, యెహోవాను ఇంకా బాగా తెలుసుకోవడానికి ఏమి చేయాలో మనం గ్రహిస్తాం. ఆయన సేవ చేయడం, సేవను విస్తృతపర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో మరింత బాగా అర్థంచేసుకుంటాం. అంతేకాదు, యెహోవా వ్యక్తిత్వం మీద మన అవగాహన నిశ్చయంగా పెరుగుతుంది. ఈ పుస్తకంలోని 3వ భాగంలో, కుటుంబ సభ్యులతో, ఇతరులతో మన వ్యవహారాలు ఎలా ఉండాలని యెహోవా కోరుతున్నాడో వివరంగా తెలుసుకుంటాం. అలా యెహోవా మహా దినం కోసం సిద్ధంగా ఉండేందుకు సహాయాన్ని పొందుతాం. చివరిగా ఈ పుస్తకంలోని 4వ భాగంలో, యెహోవా దినం మరింత దగ్గరపడుతుండగా మన వైఖరి ఎలా ఉండాలని ఆ ప్రవక్తలు చెప్పారో, వాళ్లిచ్చిన సలహాలు మన క్రైస్తవ పరిచర్యకు ఎలా ఉపయోగపడతాయో మనం నేర్చుకుంటాం. మన ఉజ్వలమైన భవిష్యత్తు గురించి ఆ ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్ని పరిశీలిస్తుండగా మనలో తప్పక నూతనోత్తేజం కలుగుతుంది.
22. ఆ ప్రవక్తల పుస్తకాల్లోని సలహాలకు మీరు ఎలా స్పందిస్తారు?
22 ఈ అధ్యాయం ఆరంభంలో, జెఫన్యా చెప్పిన ప్రాముఖ్యమైన మాటలు మీకు గుర్తున్నాయా? (జెఫన్యా 1:14) ఆయన సందేశం యోషీయా రాజు జీవితం మీద మంచి ప్రభావం చూపించింది. యోషీయా 16 ఏళ్లకే ‘యెహోవా దగ్గర విచారించడం’ ప్రారంభించాడు. ఆయనకు 20 ఏళ్లు వచ్చేసరికి విగ్రహారాధనను నిర్మూలించడానికి నడుంబిగించాడు. యూదా, యెరూషలేము ప్రజలకు జెఫన్యా ప్రవక్త ఇచ్చిన ప్రోత్సాహానికి అనుగుణంగా యోషీయా ఆ పని చేశాడు. (2 దినవృత్తాంతములు 34:1-8; జెఫన్యా 1:3-6) యోషీయా విషయంలో జరిగినట్లుగా, యెహోవా దినం గురించిన హెచ్చరిక మీ రోజువారీ జీవితంపై కూడా ప్రభావం చూపిందా? ఆ ప్రవక్తల పుస్తకాలు మనలో ప్రతీ ఒక్కరికి ఎలా సహాయం చేస్తాయో చూద్దాం.
a ఈ 12 మంది ప్రవక్తల మొదటి గుంపుకు సమకాలీనుడైన యెషయా, రెండవ గుంపుకు సమకాలీనుడైన యెహెజ్కేలు వీళ్లిద్దరు కూడా యెహోవా దినం గురించి హెచ్చరించారు.—యెషయా 13:6, 9; యెహెజ్కేలు 7:19; 13:5; ఈ పుస్తకం 2వ అధ్యాయంలో 4-6 పేరాలు చూడండి.
b యెహోవాను సేవించే వాళ్లకు కలిగే విడుదల గురించిన మరిన్ని రుజువుల కోసం దయచేసి హోషేయ 6:1; యోవేలు 2:32; ఓబద్యా 17; నహూము 1:15; హబక్కూకు 3:18, 19; జెఫన్యా 2:2, 3; హగ్గయి 2:7; జెకర్యా 12:8, 9; మలాకీ 4:2 చదవండి.
c ఆ 12 మంది ప్రవక్తల్లో కొందరు కేవలం ఒక జనాంగం మీద మాత్రమే కాదుగానీ పలు జనాంగాల మీద యెహోవా తీర్పులను ప్రకటించారు.