8వ అధ్యాయం
యెహోవా మిమ్మల్ని ఏమి అడుగుతున్నాడు?
1, 2. పూర్వం తన ప్రజలు నైతికంగా దిగజారిపోయినప్పుడు యెహోవా స్పందించిన తీరు మనకు ఎందుకు ఊరటనిస్తుంది?
ఈ సన్నివేశాన్ని ఒకసారి ఊహించుకోండి: ఎవరో తలుపులు దబదబా బాదుతున్న శబ్దం వినిపిస్తోంది, లోపలున్న పాప భయంతో నిలువునా వణికిపోతోంది. బయట ఉన్నది తమకు అప్పిచ్చిన దొంగవ్యాపారే అయ్యుంటాడు అనుకుంది. తప్పుడు తూకాలతో, అక్రమ వడ్డీతో ఆ వ్యాపారి ఎంతోమందిని నట్టేట ముంచేశాడు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, బాధితుల గోడును పట్టించుకోని గ్రామ పెద్దల్ని లంచాలతో కొనేశాడు. ఆ పాప పరిస్థితి నిస్సహాయంగా ఉంది. వాళ్ల నాన్న పరాయి అమ్మాయి మోజులో పడి, భార్యాపిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడు. బానిసలుగా అమ్ముడుపోవడం తప్ప వేరే దారిలేదన్నట్టుంది ఇప్పుడా తల్లీబిడ్డల పరిస్థితి.
2 ఆ 12 మంది ప్రవక్తలు తీవ్రంగా ఖండించిన పాపాలకు పై సన్నివేశం ఒక ఉదాహరణ. (ఆమోసు 5:12; 8:4-6; మీకా 6:10-12; జెఫన్యా 3:3; మలాకీ 2:13-16; 3:5) మీరే గనుక ఆ రోజుల్లో జీవించివుంటే మీకు ఎలా అనిపించివుండేది? పరిస్థితి మీకు నిరాశ కలిగించినా, ఆ కాలంలో యెహోవా తన ప్రజలతో వ్యవహరించిన తీరు మీకు ఊరటనిస్తుంది. నిజానికి, ఆ 12 పుస్తకాల్లో కొన్ని ఆకర్షణీయమైన లక్షణాలను, వైఖరులను దేవుడు నొక్కిచెప్పడం మీరు గమనిస్తారు. ఆయన ప్రోత్సాహంతో మీలో నైతిక విలువలు పెరుగుతాయి. అంతేకాదు మంచి చేయాలనే కోరిక, ఆయన్ని ఘనపర్చాలనే ప్రేరణ మీలో కలుగుతాయి. యెహోవా ఈ దుష్ట వ్యవస్థను నాశనం చేసే రోజు ముంచుకొస్తోంది. అందుకే ఆ పుస్తకాల్లోని ప్రోత్సాహాన్నిచ్చే సందేశం మీద మనసుపెడితే, దేవుడు మిమ్మల్ని ఏమి అడుగుతున్నాడో స్పష్టంగా తెలుస్తుంది. ముందుగా, మీకా కాలంలో అంటే, సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో జరిగిన సంఘటనలను పరిశీలిద్దాం.
యెహోవా మిమ్మల్ని ఏమి అడుగుతున్నాడు?
3, 4. (ఎ) మీకా పుస్తకంలో ఆకట్టుకునే ఏ విన్నపం ఉంది? (బి) మీకా 6:8లోని ప్రశ్న చదివినప్పుడు మీకు ఏమి అనిపించింది?
3 మీకా పుస్తకం, దారితప్పిన ఇశ్రాయేలీయుల మీద చేసిన ఆరోపణల చిట్టా అని మొదట్లో మనకు అనిపిస్తుంది. నిజమే, ‘మేలును అసహ్యించుకొని కీడు చేయడానికి ఇష్టపడే’ వాళ్లను, నైతికంగా దిగజారిన తన సమర్పిత ప్రజల్ని యెహోవా ఖండించాడు. (మీకా 3:2; 6:12) అయితే ఆరోపణలే కాదు, బాగా ఆకట్టుకునే, ప్రేరణనిచ్చే ఓ ఉపదేశం కూడా మీకా పుస్తకంలో ఉంది. నీతి ప్రమాణాలకు మూలమైన దేవుని మీద దృష్టి నిలుపుతూ మీకా ఆలోచింపజేసే ఈ ప్రశ్న అడిగాడు: ‘న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును [“దయను,” NW] ప్రేమించుటయు, దీనమనస్సు [“అణకువ,” NW] కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు?’—మీకా 6:8.
4 ఆ లేఖనంలో మన సృష్టికర్త విన్నపం కనిపిస్తోందా? మన చుట్టూవున్న దుష్టత్వం వల్ల చెడిపోకుండా ఉంటూ, మనం అలవర్చుకోవాల్సిన మంచి లక్షణాల్ని దేవుడు ప్రేమగా గుర్తుచేస్తున్నాడు. విశ్వసనీయ సేవకులమైన మనం దైవిక లక్షణాలను అలవర్చుకోవాలని కోరుకుంటామని యెహోవాకు తెలుసు, ఆయన మనమీద ఆశ వదులుకోడు. ‘యెహోవా నిన్ను ఏమి అడుగుతున్నాడు?’ అనే ప్రశ్న మీకే గనుక వేస్తే, మీరు ఏమి చెబుతారు? దేవుని నైతిక ప్రమాణాలు మీ జీవితంలోని ఏ రంగాల్లో ప్రభావం చూపిస్తున్నాయి లేదా చూపించి ఉండాల్సింది? మీరు ఆ ప్రమాణాలకు తగ్గట్టు ప్రవర్తిస్తూ ఉంటే ఆయనతో మీకున్న బంధం, మీ జీవన విధానం చాలా మెరుగౌతాయి. పరదైసు అతి త్వరలో రానుంది కాబట్టి, ఈ ఉపదేశం నుండి ప్రోత్సాహం పొందండి: “నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి. ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.” (హోషేయ 10:12) మీకా 6:8లోని చక్కని సలహాలో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
‘అణకువ కలిగివుండండి’
5. దేవుని ఎదుట ‘అణకువగా’ ఉండడం ఎందుకు ముఖ్యం?
5 గమనించాల్సిన విషయమేమిటంటే, యెహోవా తన ఎదుట ‘అణకువ కలిగి ప్రవర్తించమని’ మనల్ని అడిగాడని మీకా చెప్పాడు. “వినయముగల [“అణకువగల,” NW] వారియొద్ద జ్ఞానమున్నది” కాబట్టి అణకువగా ఉంటే మనకే ప్రయోజనం. (సామెతలు 11:2) ఆదాము పాపం వల్ల ఏర్పడిన పరిమితుల్ని గుర్తించడం కూడా అణకువ చూపించడంలో భాగమే. కావాలని పాపం చేయకుండా ఉండడానికి మొట్టమొదటి మెట్టు, మనం పాపంలోనే పుట్టామని గుర్తించడం.—రోమీయులు 7:24, 25.
6. పాపం వల్ల వచ్చే పర్యవసానాలను మనం అణకువతో గుర్తిస్తే ఎలా ప్రయోజనం పొందుతాం?
6 తెలిసి పాపం చేయకుండా ఉండాలంటే వినయంతో కూడిన అణకువ ఎందుకంత ప్రాముఖ్యం? అణకువ ఉన్న వ్యక్తి పాపానికున్న శక్తిని గుర్తిస్తాడు. (కీర్తన 51:3) పాపం మోసకరమైనదని, ఎప్పుడూ నాశనకరమైన ఫలితాల్నే తీసుకొస్తుందని అర్థంచేసుకోవడానికి హోషేయ మనకు సహాయం చేస్తున్నాడు. ఉదాహరణకు, పూర్వం తన ప్రజలు అవిధేయత చూపించినందుకు వాళ్లను “శిక్షింతును” అని యెహోవా చెప్పాడు. అణకువ చూపించని పాపులు ఏ పర్యావసానాన్నీ తప్పించుకోలేరు. కానీ, ఆ పాపులు మాత్రం తప్పించుకుంటామని అనుకొనివుంటారు. ఎందుకంటే పాపం మనిషి కళ్లు కప్పుతుంది, అతణ్ణి దాసోహం చేసుకుంటుంది. అంతకన్నా ఘోరంగా, పాపం ఓ వ్యక్తిని దేవుని నుండి దూరం చేస్తుంది, ‘దేవునియొద్దకు తిరిగి రాలేని’ స్థాయికి దిగజారుస్తుంది. కావాలని చేసే పాపం ఓ వ్యక్తి నైతిక బలాన్ని నీరుగార్చి, అతన్ని ‘పాపాత్ముణ్ణి’ చేస్తుంది. అంతేకాదు, అతని జీవితాన్ని దుర్భరం చేస్తుంది. పశ్చాత్తాపం చూపించని పాపి మొదట్లో వర్ధిల్లుతున్నట్టు కనిపిస్తాడేమో కానీ దేవుని అనుగ్రహం మాత్రం పొందలేడు.—హోషేయ 1:4; 4:11-13; 5:4; 6:8.
7. యెహోవా నిర్దేశానికి అణకువగల ప్రజలు ఎలా స్పందిస్తారు?
7 పాపం వల్ల వచ్చే పర్యవసానాలకు లోనవ్వకుండా ఉండడానికి దేవుని నిర్దేశం అవసరమని కూడా అణకువగల వ్యక్తులు ఒప్పుకుంటారు. లక్షలాదిమంది ‘యెహోవా మార్గాల విషయమై’ ఉపదేశం పొందేందుకు, ‘ఆయన త్రోవల్లో నడిచేందుకు’ ఆత్రంగా ఎదురుచూసే కాలం వస్తుందని మీకా ప్రవచించాడు. అది మన కాలమే. అలాంటి సాత్వికులు “ధర్మశాస్త్రము” కోసం, “యెహోవా వాక్కు” కోసం వెదుకుతారు. యెహోవా కోరుతున్నట్టు జీవించడం ద్వారా ‘ఆయన నామాన్ని స్మరిస్తూ నడుచుకోవాలని’ ఇష్టపడే వాళ్లలో మీరూ ఒకరిగా ఉన్నందుకు మీరు ఇప్పటికే సంతోషిస్తుండవచ్చు. అయినా, మీకాలా మీరు కూడా నైతిక ‘పవిత్రతను’ కాపాడుకోవడానికి ఇంకా ఏమేమి చేయాలో తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉండే ఉంటుంది. (మీకా 4:1-5; 6:11) యెహోవా మీ నుండి కోరుతున్న దాన్ని చేయడానికి అణకువగా ప్రయత్నిస్తే మీరు ఎంతో ప్రయోజనం పొందుతారు.
ఉన్నతమైన నైతిక ప్రమాణాల్ని అలవర్చుకోండి
8. నైతిక ప్రమాణాల విషయంలో నేటి లోకం ఎలా ఉంది?
8 యెహోవా మన ఆధ్యాత్మిక, శారీరక సంక్షేమాన్ని కోరుకుంటున్నాడు. అందుకే మన చుట్టూ ఉన్న లోకం నానాటికీ దిగజారుతున్నా, మనల్ని నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండమంటున్నాడు. (మలాకీ 2:15) ఈ లోకం సెక్స్ గురించిన మెస్సేజ్‌లతో మనల్ని ముంచెత్తుతోంది. అశ్లీల చిత్రాలూ దృశ్యాలూ సినిమాలూ చూడడం; అసభ్యకరమైన లైంగిక కార్యకలాపాల గురించి చదవడం; రెచ్చగొట్టే పదాలున్న పాటలు వినడం వంటివి తప్పుకాదని చాలామంది అనుకుంటున్నారు. అంతకన్నా ఘోరమైన విషయమేమిటంటే, స్త్రీలంటే కేవలం లైంగిక కోరికలు తీర్చే ఆటబొమ్మలని చాలామంది భావిస్తున్నారు, వాళ్లకు స్త్రీలంటే అసలు గౌరవమే లేదు. స్కూల్, కాలేజీ విద్యార్థుల సంభాషణల్లో అసభ్యకరమైన జోకులు, రెండర్థాల డైలాగులు షరామామూలైపోయాయి. అలాంటి చెడు ప్రభావాలకు దూరంగా ఎలా ఉండవచ్చు?
9. ఆ 12 మంది ప్రవక్తల కాలంలో చాలామంది యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించలేకపోయారని ఎలా చెప్పవచ్చు?
9 ఈ విషయంలో ఆ 12 మంది ప్రవక్తలు మనకు అమూల్యమైన ఉపదేశాన్ని ఇస్తున్నారు. వాళ్ల కాలంలో సినిమా థియేటర్లు, డీవీడీ షాపులు లేవు. కానీ, ఆ కాలంలోని ప్రజలు మర్మాంగాన్ని పోలిన విగ్రహాల్ని నిలిపేవాళ్లు, ఆరాధన పేరుతో వేశ్యావృత్తి జరిగించేవాళ్లు, సిగ్గులేకుండా అసభ్యకరమైన లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవాళ్లు. (1 రాజులు 14:24; యెషయా 57:3, 4; హబక్కూకు 2:15) ప్రవక్తలు రాసిన ఈ మాటల్లో దానికి రుజువు ఉంది: “జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులనర్పింతురు.” “తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు.” కొంతమంది సంతానం కోసం చేసే ఆచారాల్లో వేశ్యలకు డబ్బులు ఇస్తుండేవాళ్లు. a చాలామంది జీవిత భాగస్వామికి ద్రోహం చేసి, నచ్చిన వాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ విశృంఖలంగా వ్యభిచారానికి పాల్పడేవాళ్లు.—హోషేయ 2:13; 4:2, 13, 14; ఆమోసు 2:7; మీకా 1:7.
10. (ఎ) అనైతిక ప్రవర్తనకు ముఖ్య కారణం ఏమిటి? (బి) పూర్వం దేవుని ప్రజలు ఆధ్యాత్మిక వ్యభిచారానికి ఎలా పాల్పడ్డారు?
10 లైంగిక అనైతికత ఓ వ్యక్తి వైఖరిని, ఉద్దేశాల్ని వెల్లడి చేస్తుందని బహుశా మీరు గ్రహించివుంటారు. (మార్కు 7:20-22) లైంగిక అనైతికతకు పాల్పడిన తన ప్రజల గురించి యెహోవా ఇలా అన్నాడు: ‘వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పించింది,’ “వారు ఘోరమైన కాముకత్వము జరిగించువారై యున్నారు.” (హోషేయ 4:12; 6:9) b జెకర్యా అపవిత్రత గురించి ప్రస్తావించాడు. (జెకర్యా 13:2) ప్రజల ప్రవర్తనలో లెక్కలేనితనం కనిపించింది. అంతేకాదు యెహోవా ప్రమాణాల పట్ల, అధికారం పట్ల అగౌరవం, చివరకు ధిక్కార స్వభావం కూడా కనిపించింది. కాబట్టి, ఓ వ్యక్తి తన ఉద్దేశాల్ని సరిదిద్దుకోవాలంటే తన ఆలోచనా తీరును, హృదయ స్థితిని పూర్తిగా మార్చుకోవాలి. దీన్ని గుర్తిస్తే, క్రైస్తవులు అనైతికత బారిన, దాని ఘోరమైన పర్యవసానాల బారిన పడకుండా ఉండడానికి కావాల్సిన సహాయం పొందుతున్నందుకు మరింత కృతజ్ఞులుగా ఉండగలుగుతారు.
పవిత్రంగా ఉండేందుకు కృషి చేయండి
11. లైంగిక అనైతికతకు పాల్పడడం వల్ల వచ్చే కొన్ని పర్యవసానాలు ఏమిటి?
11 లైంగిక అనైతికత కుటుంబాల్ని ముక్కలు చేస్తుందని, పిల్లల్ని తల్లిదండ్రుల ఆలనాపాలనకు దూరం చేస్తుందని, అసహ్యకరమైన వ్యాధులకూ జీవాన్ని చంపే గర్భస్రావాలకూ దారితీస్తుందని మీరు గమనించే ఉంటారు. లైంగిక విషయాల్లో సృష్టికర్త ప్రమాణాల్ని పాటించని వాళ్లు చాలావరకు శారీరక, భావోద్వేగ సమస్యలకు గురౌతారు. మీకా ఇలా రాశాడు: “మీకు నాశనము, నిర్మూల నాశనము [“దుఃఖభరితమైన నాశనం,” NW] కలుగునంతగా మీరు అపవిత్రక్రియలు జరిగించితిరి.” (మీకా 2:10) ఈ విషయం తెలుసుకుంటే, దేవునికి స్వచ్ఛమైన ఆరాధన చెల్లించాలనుకునేవాళ్ల తీర్మానం ఇంకా బలపడుతుంది. అపవిత్రమైన విషయాల గురించి ఆలోచిస్తూ హృదయం, మనసు కలుషితమయ్యే పరిస్థితి రాకుండా వాళ్లు చూసుకుంటారు.—మత్తయి 12:34; 15:18.
12. లైంగిక విషయాల్లో యెహోవా దృక్కోణాన్ని అలవర్చుకుంటే మనం ఎలా ప్రయోజనం పొందుతాం?
12 క్రైస్తవులు లైంగిక అనైతికతకు దూరంగా ఉండేది కేవలం రోగాలు వస్తాయనో, అక్రమ సంతానం కలుగుతుందనే భయంతోనో కాదు. దేవుని నియమాల్ని ప్రేమించడం, లైంగిక విషయాల్లో ఆయన దృక్కోణాన్ని అలవర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో వాళ్లు గ్రహిస్తారు. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి యెహోవా మనుషుల్లో లైంగిక కోరికను పెట్టాడు. ఆదాముహవ్వలను సృష్టించినప్పుడు యెహోవా సంకల్పంలో అది కూడా ఓ భాగమే. లైంగిక సంబంధం కేవలం భార్యాభర్తల మధ్యే ఉండాలి, అప్పుడే అది ప్రయోజనకరంగా ఉంటుంది. అది భార్యాభర్తల్ని ఒకటి చేస్తుంది, ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది. అదే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే, ఆ ప్రవక్తలు చెప్పినట్టు ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. అక్రమ సంబంధాలు పెట్టుకున్నవాళ్లు దేవుని అనుగ్రహాన్ని కోల్పోయారు. అది ఆ కాలంలో ఘోరమైన పరిణామాలకు దారితీసింది. ఈ రోజుల్లో కూడా, ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే పర్యవసానాలు అంతే దారుణంగా ఉంటాయి.
13. మనం ఒకరకంగా ‘జారత్వాన్ని మన ఎదుట నుండి’ ఎలా ‘తొలగించుకోవచ్చు’? శోధనలో పడకుండా ఎలా చూసుకోవచ్చు?
13 ఆ కాలంలోని ప్రజలు తమ నైతిక విలువల్ని కాపాడుకోవడానికి గట్టి చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో, వాళ్లు ‘తమ ఎదుట నుండి జారత్వాన్ని తొలగించాలి’ అని హోషేయ అభ్యర్థించాడు. (హోషేయ 2:2, NW) ఇక మనమైతే, శోధనకు లొంగిపోయే పరిస్థితి రాకుండా చూసుకోవడం తెలివైన పని. ఉదాహరణకు, స్కూల్లో లేదా ఇరుగుపొరుగున మీకు పదేపదే శోధన ఎదురుకావచ్చు. అప్పుడు మీరు మరో స్కూలుకు లేదా ఇంకో ఇంటికి మారడం కుదరకపోవచ్చు. కానీ, శోధనకు గురిచేసే పరిస్థితులు రాకుండా చూసుకుంటూ, ‘మీ ఎదుట నుండి జారత్వాన్ని తొలగించడానికి’ వేరే మార్గాలు ఉండవచ్చు. ఎదుటివాళ్లకు మీరు యెహోవాసాక్షులని, నిజ క్రైస్తవులని చెప్పండి. మీ విలువల గురించి, నమ్మకాల గురించి స్పష్టంగా, గౌరవంగా వివరించండి. యెహోవా ఉన్నత ప్రమాణాలను అస్సలు మీరకూడదని మీరు తీర్మానించుకున్నారన్న విషయం వాళ్లకు తెలిసేలా చేయండి. (ఆమోసు 5:15) అశ్లీల దృశ్యాలకూ చిత్రాలకూ, ప్రశ్నార్థక వినోదానికి దూరంగా ఉండడం ద్వారా కూడా ‘జారత్వాన్ని మీ ఎదుట నుండి తొలగించుకోవచ్చు.’ అంతేకాదు, మీ ఇంట్లో అలాంటి పుస్తకాలు ఏవైనా ఉంటే వాటిని పారేయాల్సి ఉంటుంది లేదా యెహోవాను ప్రేమించే వాళ్లను, ఆయన ప్రమాణాల ప్రకారం మీరు జీవించాలని కోరుకునే వ్యక్తులను స్నేహితులుగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. (మీకా 7:5) అవును, నైతికంగా దిగజారిపోయిన లోకంలో యెహోవా సహాయంతో మీరు కలుషితం కాకుండా ఉండగలరు!
‘దయను ప్రేమించండి’
14, 15. (ఎ) ‘దయను ప్రేమించడం’ అంటే ఏమిటి? (బి) దయను ప్రేమిస్తే చెడ్డపేరు రాకుండా చూసుకోగలుగుతామని ఎందుకు చెప్పవచ్చు?
14 ‘దయను ప్రేమించండి’ అని యెహోవా మనతో అంటున్నాడని మీకా నొక్కిచెప్పాడు. దయ చూపించాలంటే, హాని తలపెట్టకుండా మంచి పనులు చేయాలి. దయకు మంచితనంతో, నైతిక పవిత్రతతో చాలా దగ్గరి సంబంధముంది. ఆ లక్షణం చూపించాలంటే మనం వ్యక్తిగత విషయాల్లో, ఇతరులతో జరిపే వ్యవహారాల్లో నిజాయితీగా, న్యాయంగా ఉండాలి. వ్యాపారం, డబ్బుకు సంబంధించిన వ్యవహారాల వంటి ముఖ్యమైన రంగాల్లో న్యాయంగా, నిజాయితీగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఈ పుస్తకంలోని 6వ అధ్యాయంలో పరిశీలించాం. న్యాయం, నిజాయితీ, దయ చూపించాల్సిన రంగాలు జీవితంలో అవి మాత్రమే కాదు.
15 దయను ప్రేమించేవాళ్లు, ఇతరులకు మేలు చేయాలని కోరుకునేవాళ్లు తమకు చెడ్డపేరు రాకుండా చూసుకుంటారు. స్వచ్ఛారాధన కోసం విధిగా ఇవ్వాల్సిన వాటిని ఇవ్వని ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా అన్నాడు: ‘మీరు నా యొద్ద దొంగిలిస్తున్నారు.’ (మలాకీ 3:8) ఇప్పుడు కూడా ఓ వ్యక్తి ఎలా దేవుని దగ్గర ‘దొంగతనం చేసే’ ప్రమాదం ఉంది? రాజ్య ప్రకటనా పని విస్తృతి కోసం స్థానిక సంఘంలో లేదా మరో చోట వచ్చిన విరాళాలను చూసుకునే బాధ్యత ఒక క్రైస్తవునికి ఉందనుకుందాం. ఆ డబ్బులు ఎవరివి? యెహోవా ఆరాధన వ్యాప్తి కోసం ఆ విరాళాలు వచ్చాయి కాబట్టి అవి యెహోవాకే చెందుతాయి. (2 కొరింథీయులు 9:7) అత్యవసర పరిస్థితిలో ఆ విరాళాలను “అప్పుగా” తీసుకోవచ్చని ఎవరైనా అనుకోవచ్చా? సరైన ఆమోదం లేకుండా ఆ డబ్బును ఖర్చుపెట్టవచ్చా? లేదు, అలా చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే దేవుని దగ్గర దొంగతనం చేసినట్లే! అలా చేస్తే, దేవుని పనికోసం ఆ విరాళాలు ఇచ్చిన వాళ్ల పట్ల దయ, న్యాయం చూపించినట్లు ఉండదు.—సామెతలు 6:30, 31; జెకర్యా 5:3.
16, 17. (ఎ) ఆమోసు, మీకా కాలాల్లో కొంతమంది దురాశను ఎలా చూపించారు? (బి) దురాశను దేవుడు ఎలా పరిగణిస్తాడు?
16 దయ, మంచితనం అనే లక్షణాలు దురాశకు దూరంగా ఉండడానికి కూడా క్రైస్తవులకు ప్రేరణనిస్తాయి. ఆమోసు కాలంలోని ప్రజల్లో దురాశ విపరీతంగా ఉండేది. అత్యంత దురాశాపరులైన మనుషులు కేవలం ‘ద్రవ్యానికి నీతిమంతులను’ అంటే, తమ తోటి ఆరాధకులను ‘అమ్మేయడానికి’ కూడా వెనకాడలేదు. (ఆమోసు 2:6) మీకా కాలంలో కూడా అదే పరిస్థితి. యూదాలోని ధనికులు నిస్సహాయుల భూముల్ని ఆక్రమించుకునేవాళ్లు, ఎదిరిస్తే బలవంతంగా లాక్కునేవాళ్లు. (మీకా 2:2; 3:10) తోటివాళ్ల భూముల్ని కాజేసిన ఆ దురాశపరులు పదో ఆజ్ఞనూ, వారసత్వంగా వచ్చిన భూమిని శాశ్వతంగా విక్రయించకూడదనే నియమాల్నీ ఉల్లంఘించి యెహోవా ధర్మశాస్త్రాన్ని మీరారు.—నిర్గమకాండము 20:13, 15, 17; లేవీయకాండము 25:23-28.
17 మనుషుల్ని అమ్మడం గానీ బానిసలుగా చేసుకోవడం గానీ ఆ రోజుల్లో జరిగినంతగా ఇప్పుడు జరగకపోవచ్చు. అయితే ఆర్థిక ప్రయోజనాల కోసం ఇతరులను వాడుకోవడం, ఇతరుల కష్టాన్ని దోచుకోవడం మాటేమిటి? దయను ప్రేమించే క్రైస్తవులు తోటి ఆరాధకుల కష్టాన్ని అస్సలు దోచుకోరు. ఉదాహరణకు, తోటి విశ్వాసుల్ని కస్టమర్లుగా చేసుకోవచ్చనే ఉద్దేశంతో వ్యాపారం మొదలుపెట్టడం లేదా పెట్టుబడుల స్కీమ్‌లలో వాళ్లను చేరమని అడగడం సరికాదు, దయ చూపించినట్టు కూడా అవదు. తోటి క్రైస్తవుల్ని వాడుకొని తక్కువ సమయంలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తే దురాశను చూపించినట్టే. ఈ లక్షణం విషయంలో జాగ్రత్తగా ఉండమని బైబిలు క్రైస్తవులను హెచ్చరిస్తోంది. (ఎఫెసీయులు 5:3; కొలొస్సయులు 3:5; యాకోబు 4:1-5) డబ్బు పిచ్చి; అధికార దాహం; లాభాపేక్ష; ఆహారపానీయాల కోసం, సెక్స్ కోసం కక్కుర్తి ఇవన్నీ దురాశ లక్షణాలే. ఎంతసేపూ తమ గురించే ఆలోచించుకునే దురాశపరులకు ‘తృప్తి’ అనేదే ఉండదని మీకా రాశాడు. ఆ మాట నేటికీ నిజమే.—మీకా 6:14.
18, 19. (ఎ) ‘పరదేశుల’ మీద యెహోవాకున్న శ్రద్ధ గురించి ఆ 12 మంది ప్రవక్తల్లో కొందరు ఏమి చెప్పారు? (బి) ఇతరుల మీద ప్రేమతో కూడిన శ్రద్ధ చూపిస్తే సమాజంలో సత్సంబంధాలు నెలకొంటాయని ఎలా చెప్పవచ్చు?
18 ‘పరదేశులను బాధపెట్టకూడదు’ అని యెహోవా తన ప్రజలకు చెప్పాడు. ‘పరదేశులకు అన్యాయం చేసేవాళ్ల మీద తీర్పు తీర్చడానికి వస్తాను’ అని యెహోవా మలాకీ ద్వారా చెప్పాడు. (జెకర్యా 7:10; మలాకీ 3:5) వేరే దేశాల, తెగల, సంస్కృతుల ప్రజలు మీరున్న ప్రదేశానికి తండోపతండాలుగా వలస వస్తున్నారా? బహుశా వీళ్లంతా భద్రత కోసమో, ఉపాధి కోసమో లేదా మెరుగైన జీవితం కోసమో వచ్చివుంటారు. వేషభాషలు, ఆచారవ్యవహారాలు వేరుగా ఉండే ఆ ప్రజలను మీరెలా చూస్తారు? దయతో ఏమాత్రం పొసగని జాతివివక్ష భావాలు మీలో ఏమైనా ఉన్నాయని మీకనిపిస్తోందా?
19 వేరే దేశం లేదా నేపథ్యం నుండి వచ్చినవాళ్లు కూడా అందరిలాగే బైబిలు సత్యం తెలుసుకోవడానికి అర్హులని మీరు చేతల్లో చూపిస్తే, వాళ్లు ఎంత చక్కగా స్పందిస్తారో ఆలోచించండి. మనకు దయ ఉంటే, అలాంటి కొత్తవాళ్లు రాజ్యమందిరాన్ని, మరితర వనరుల్ని వాడేసుకుంటున్నారన్న భావన మనలో మొలకెత్తదు. మొదటి శతాబ్దంలో కొంతమంది యూదా క్రైస్తవులు యూదులుకాని వాళ్లపట్ల ఒకింత వివక్ష చూపించారు. అప్పుడు అపొస్తలుడైన పౌలు వాళ్లకు ఈ విషయాన్ని గుర్తుచేశాడు: నిజానికి రక్షణకు ఎవ్వరూ అర్హులు కారు, దేవుని కృప వల్లే అందరికీ రక్షణ సాధ్యమైంది. (రోమీయులు 3:9-12, 23, 24) ఒకప్పుడు సువార్త వినే అవకాశం అంతగా లేని చాలామందికి, ఇప్పుడు దేవుని ప్రేమ గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతోంది. ఇతరుల మీద దయ ఉంటే ఆ విషయం మనకు ఎంతో సంతోషాన్నిస్తుంది. (1 తిమోతి 2:4) మన ప్రాంతంలో ఉంటున్న విదేశీయులకు లేదా వేరే సంస్కృతుల ప్రజలకు సాధారణంగా ఎక్కువ ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. కాబట్టి, వాళ్లను ‘మన మధ్య పుట్టిన వాళ్లలా ఎంచి’ వాళ్లను మనతో కలుపుకుంటూ వాళ్ల పట్ల దయను, శ్రద్ధను చూపించాల్సిన బాధ్యత మనకుంది.—లేవీయకాండము 19:34.
సత్య దేవునితో నడవండి
20. సహాయం కోసం ఇశ్రాయేలీయులు ఎవరిని ఆశ్రయించారు?
20 దేవుడు సత్యవంతుడనే నమ్మకంతో ఆయన నిర్దేశం కోసం చూస్తూ ఆయనతో నడవమని కూడా మీకా నొక్కిచెప్పాడు. (సామెతలు 3:5, 6; హోషేయ 7:10) చెర నుండి తిరిగి వచ్చాక, కొంతమంది యూదులు జ్యోతిష్యులను, సోదె చెప్పేవాళ్లను, అబద్ధ దేవుళ్లను ఆశ్రయించారు. బహుశా వాళ్లు కరువు వచ్చినప్పుడు సహాయం కోసం అలా చేసివుంటారు. యెహోవా అలాంటి వాటిని పూర్తిగా ఖండించాడని తెలిసి కూడా, వాళ్లు సహాయం కోసం దుష్టశక్తుల్ని ఆశ్రయించారు. (ద్వితీయోపదేశకాండము 18:9-14; మీకా 3:6, 11; 5:12; హగ్గయి 1:10, 11; జెకర్యా 10:1, 2) ఆ యూదులు అలా చేసి సత్యదేవునికి ప్రతిపక్షంగా ఉన్న దుష్టాత్మలతో పొత్తుపెట్టుకున్నారు!
21, 22. (ఎ) మీ ప్రాంతంలో మంత్రతంత్రాలకు సంబంధించి ఏవి ప్రాచుర్యంలో ఉన్నాయి? (బి) యెహోవా సత్యారాధకులు అలాంటివాటి జోలికి ఎందుకు వెళ్లరు?
21 లేఖనాల్లో దుష్టాత్మల గురించిన ప్రస్తావనలు కేవలం చెడును సూచించడానికే ఉపయోగించారని నేడు కొంతమంది అంటారు. అయితే, దయ్యాలు నిజంగానే ఉన్నాయనీ జ్యోతిష్యం, మంత్రతంత్రాలు, కొన్ని రకాల ఇంద్రజాలాల వెనకున్నవి కూడా అవేననీ బైబిలు వెల్లడిస్తోంది. (అపొస్తలుల కార్యములు 16:16-18; 2 పేతురు 2:4; యూదా 6) వాటివల్ల వచ్చే ప్రమాదాలు కూడా వాస్తవాలే. మానవాతీత శక్తులు ఉన్నాయని చెప్పుకునే మంత్రగాళ్ల దగ్గరకో భూతవైద్యుల దగ్గరకో వెళ్లే అలవాటు చాలా సంస్కృతుల్లో ఉంది. ఇంకొందరు నిర్దేశం కోసం రాశిచక్రం, జాతకం, చిలకజోష్యం వంటివాటిపై ఆధారపడతారు. చనిపోయినవాళ్ల ఆత్మలతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేయడం కూడా పరిపాటి. కొంతమంది రాజకీయ నాయకులు కూడా నిర్ణయాలు తీసుకోవడానికి జ్యోతిష్యంపై, అలాంటి మరితర వాటిపై ఆధారపడ్డారని నివేదికలు చూపిస్తున్నాయి. సత్యదేవుని నిర్దేశాన్ని పాటిస్తూ ఆయనతో నడవమని మీకా ఇచ్చిన సలహాకు అవన్నీ పూర్తి విరుద్ధం.
22 యెహోవాను సేవించే సత్యారాధకులుగా మీరు అలాంటివాటిని ఖండించాలి. దేవుడు తన చిత్తాన్ని వెల్లడించడానికో, తన శక్తిని చూపించడానికో ఇంద్రజాలాన్ని, మంత్రతంత్రాలను ఎన్నడూ ఉపయోగించడని మీరు నమ్మవచ్చు. యెహోవా ‘తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ఏమియు చేయడు’ అని ఆమోసు 3:7 హామీ ఇస్తోంది. నిజానికి మంత్రతంత్రాలను ఆశ్రయించేవాళ్లు దయ్యాల అధిపతి సాతాను ప్రభావం కిందకు వచ్చే ప్రమాదముంది. ఆ సాతాను అబద్ధికుడు, ప్రజల్ని మోసం చేయడమే అతని లక్ష్యం. సాతాను, అతని అనుచరులు మనకు హాని చేయాలని కంకణం కట్టుకున్నారు, ఇప్పటి వరకు వాళ్లు ఎంతో క్రూరత్వం చూపించారు, మనుషులను చంపారు కూడా. (యోబు 1:7-19; 2:7; మార్కు 5:5) దేవునితో నడవమని ప్రోత్సహిస్తున్నప్పుడు జ్యోతిష్యాన్ని, మంత్రతంత్రాలను మీకా ఎందుకు ఖండించాడో అర్థంచేసుకోవచ్చు.
23. మన సరైన విన్నపాలకు ఎవరు మాత్రమే ప్రతిఫలమివ్వగలరు?
23 ఆధ్యాత్మిక విషయాల్లో అసలైన నిర్దేశం యెహోవా దగ్గరే, ఆయన స్వచ్ఛారాధనలోనే దొరుకుతుంది. (యోహాను 4:24) “యెహోవాను వేడుకొనుడి” అని జెకర్యా ప్రవక్త రాశాడు. (జెకర్యా 10:1) దుష్టాత్మలు మీమీద దాడులు జరిపినా లేదా మిమ్మల్ని శోధించినా, ‘యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయు వారందరును రక్షింపబడుదురు’ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. (యోవేలు 2:32) ఆయన మహా దినాన్ని మనసులో ఉంచుకొని జీవించడానికి ప్రయత్నిస్తుండగా ఆ హామీ మనకు ఎంతో బలాన్నిస్తుంది.
24. మీకా 6:8 నుండి మీరేమి నేర్చుకున్నారు?
24మీకా 6:8లోని మాటలు మనల్ని ఎంతో ఆలోచింపజేశాయి కదా. దృఢమైన నైతిక విలువలను అలవర్చుకోవాలంటే మనకు సరైన ఉద్దేశాలు, దైవిక లక్షణాలు ఉండాలి. ఈ అంత్యదినాల్లో జీవించే మనకు ప్రోత్సాహాన్నిచ్చే మాటలు హోషేయ రాశాడు. మన కాలంలో దైవభయం ఉన్నవాళ్లు యెహోవా మంచితనాన్ని వెదుకుతారని ఆయన రాశాడు. (హోషేయ 3:5) సరిగ్గా అదే చేయమని దేవుడు ఇస్తున్న ఆహ్వానాన్ని ఆమోసు ఈ మాటల్లో నిర్ధారించాడు: ‘మీరు బ్రతుకునట్లు మేలును వెదకండి.’ అంతేకాదు, ‘మేలును ప్రేమించండి’ అని కూడా ఆయన అభ్యర్థించాడు. (ఆమోసు 5:14, 15) మనమలా చేస్తే, యెహోవా కోరేవాటిని చేయడం వల్ల వచ్చే మనోల్లాసాన్ని పొందుతాం.
[అధస్సూచీలు]
a ఇశ్రాయేలీయుల ప్రవర్తన పాడవ్వడానికి కారణమైన కనాను దేశాల గురించి బైబిలు అనువాదకుడు జోసెఫ్ రోథర్‌హామ్ ఇలా అన్నాడు: “వాళ్ల ఆరాధనంటేనే విపరీతమైన లైంగిక దుర్నీతి, భయంకరమైన క్రూరత్వం. దేవతల గౌరవార్థం స్త్రీలు తమ శీలాన్ని సమర్పించేవాళ్లు. వ్యభిచార గృహాలే వాళ్ల పవిత్ర స్థలాలు. గోప్యాంగాలను తలపించే అసహ్యకరమైన విగ్రహాల్ని బహిరంగ ప్రదేశాల్లో నిలబెట్టేవాళ్లు. వాళ్లలో ఆడ, మగ ‘పవిత్ర (!)’ వేశ్యలు ఉండేవాళ్లు.”
b దేవుని ప్రజలు ఆధ్యాత్మిక వ్యభిచారానికి కూడా పాల్పడ్డారు. వాళ్లు అన్య జనాంగాలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని, బయలు ఆరాధనతో సత్యారాధనను కలుషితం చేశారు.