2వ అధ్యాయం
శక్తిమంతమైన సందేశాల్ని ప్రకటించిన ప్రవక్తలు
1. హీబ్రూ లేఖనాల్లోని చివరి 12 పుస్తకాలను రాసిన ప్రవక్తల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?
హీబ్రూ లేఖనాల్లోని చివరి 12 పుస్తకాలను రాసిన ప్రవక్తల గురించి మీకు తెలుసుకోవాలనుందా? వాళ్లు క్రీస్తుకు పూర్వం జీవించారు కాబట్టి వాళ్లను కలిసే అవకాశం ఇప్పుడు లేదు. అయితే, ‘యెహోవా మహా దినాన్ని’ మనసులో ఉంచుకొని జీవించడానికి వాళ్లు ఏమి చేశారో పరిశీలించడం ద్వారా వాళ్ల గురించి తెలుసుకోవచ్చు. అలా చేస్తే, యెహోవా మహా దినాన్ని మనసులో ఉంచుకొని జీవించేందుకు కృషి చేస్తున్న ప్రతీ క్రైస్తవునికి ప్రయోజనం ఉంటుంది.—జెఫన్యా 1:14; 2 పేతురు 3:11, 12.
2, 3. నేటి పరిస్థితులకు, ఆ ప్రవక్తల కాలాల్లోని పరిస్థితులకు ఎలాంటి పోలికలు ఉన్నాయి?
2 లేఖనాల్లో ఎంతోమంది ప్రవక్తల గురించి ఉంది. బైబిల్లోని చాలా పుస్తకాలు ప్రవక్తల పేర్లతోనే ఉన్నాయి. మిగతా ప్రవక్తల్లాగే, మనం చూడబోయే 12 మంది ప్రవక్తలు కూడా విశ్వసనీయతకు, ధైర్యానికి ఆదర్శంగా నిలిచారు. ఆ ప్రవక్తల్లో కొందరు సందేశాల్ని ప్రకటించినప్పుడు ప్రజలు తమ హృదయాలను, మనసులను మార్చుకొని దేవుని దగ్గరకు తిరిగి వచ్చారు. అది చూసిన ఆ ప్రవక్తలకు ఎంతో ఆనందం కలిగింది. తప్పుదోవ పట్టిన ప్రజలు యెహోవా ప్రమాణాలను ఉల్లంఘించడం, ఆయన చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఇంకొంతమంది ప్రవక్తలకు తీవ్ర నిరాశను కలిగించింది. యెహోవా ఆరాధకులమని చెప్పుకుంటున్న ప్రజలు విలాసాలకు, సుఖభోగాలకు మరిగి స్వయంతృప్తితో జీవించడం మరికొంతమంది ప్రవక్తలకు విసుగు పుట్టించింది.
3 నేటిలాగే ఈ 12 మంది ప్రవక్తలు జీవించిన కాలాల్లో కూడా రాజకీయ సంక్షోభం, సమాజంలో అల్లకల్లోలం, సత్యారాధన పట్ల నిర్లక్ష్యం వంటివి ఉండేవి. వాళ్లు కూడా “మనవంటి స్వభావముగల” మనుషులే, వాళ్లకు కూడా భయాందోళనలను కలిగించే పరిస్థితులు, సవాళ్లు ఎదురైవుంటాయి. (యాకోబు 5:17) అయినా వాళ్లు మనకు మంచి ఆదర్శాన్ని ఉంచారు. వాళ్ల సందేశాలు “యుగాంతమందున్న మన” ప్రయోజనం కోసం ‘ప్రవక్తల లేఖనాల్లో’ నమోదై ఉన్నాయి, వీటిని మనం జాగ్రత్తగా పరిశీలించాలి.—రోమీయులు 15:4; 16:25-27; 1 కొరింథీయులు 10:11.
12 మంది ప్రవక్తలు జీవించిన కాలాలు
4. పన్నెండుమంది ప్రవక్తలు జీవించిన కాలాల గురించి ఏమి చెప్పవచ్చు? యెహోవా తన ప్రజల్ని హెచ్చరించడానికి, వాళ్లలో మార్పు తేవడానికి ముందుగా ఎవరిని పంపాడు?
4 బైబిల్లో హోషేయ నుండి మలాకీ వరకున్న పుస్తకాల వరుస క్రమాన్ని చూసి, ఆ ప్రవక్తలు జీవించిన కాలాల క్రమం కూడా అదేనని మీకు అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. ఉదాహరణకు యోనా, యోవేలు, ఆమోసు, హోషేయ, మీకా ప్రవక్తలు సా.శ.పూ. తొమ్మిది, ఎనిమిది శతాబ్దాల్లో జీవించారు. a ఆ కాలంలో దక్షిణ రాజ్యమైన యూదాను, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును పాలించే రాజుల్లో చాలామంది విశ్వాసఘాతకులయ్యారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా ప్రజలు కూడా వాళ్లలాగే తయారై దేవుని ఆగ్రహానికి గురయ్యారు. అష్షూరీయులు, ఆ తర్వాత బబులోనీయులు ప్రపంచాధిపత్యం కోసం ప్రయత్నించింది ఆ కాలంలోనే. యెహోవా తన తీర్పులు అమలుచేయడానికి ఈ రెండు ప్రపంచాధిపత్యాలను ఉపయోగిస్తాడని ఇశ్రాయేలీయులు ఊహించలేదు. అయితే దేవుడు నమ్మకమైన ప్రవక్తలను పంపి ఇశ్రాయేలు, యూదా రాజ్యాల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వచ్చాడు.
5. యూదా, యెరూషలేముల నాశనం దగ్గరపడిన రోజుల్లో యెహోవా తీర్పులను ప్రకటించిన ప్రవక్తలు ఎవరు?
5 యూదా, యెరూషలేములకు తీర్పు తీర్చాల్సిన సమయం దగ్గరపడినప్పుడు దృఢంగా మాట్లాడే ఇంకొంతమంది ప్రవక్తలను యెహోవా పంపించాడు. వాళ్లెవరు? జెఫన్యా, నహూము, హబక్కూకు, ఓబద్యా. వాళ్లంతా సా.శ.పూ. 7వ శతాబ్దంలో సేవచేశారు. ఆ శతాబ్దంలో అత్యంత విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి, సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసి, యూదులను బానిసలుగా తీసుకువెళ్లారు. ఎప్పటిలాగే యెహోవా దాని గురించి కూడా ముందే హెచ్చరించాడు. అందుకోసం ఆయన ఆ నలుగురిలో ఒకరిద్దరిని ఉపయోగించుకున్నాడు, ఆయన హెచ్చరించినట్టే జరిగింది. తాగుబోతుతనం, బలాత్కారం వంటివాటిని మానుకోమని ఆ ప్రవక్తలు ప్రజలకు చెప్పి చూశారు, కానీ ఫలితం శూన్యం.—హబక్కూకు 1:2, 5-7; 2:15-17; జెఫన్యా 1:12, 13.
6. బబులోను నుండి తిరిగి వచ్చిన తన ప్రజలను యెహోవా ఎలా ప్రోత్సహించాడు?
6 దేవుని ప్రజలు బబులోను నుండి తిరిగి వచ్చారు. ఇప్పుడు వాళ్లు సత్యారాధనలో నిలుకడగా ఉండాలంటే సమర్థమైన నాయకత్వం, మద్దతు, ఉపదేశం అవసరం. ఆ అవసరాన్ని హగ్గయి, జెకర్యా, మలాకీ ప్రవక్తలు తీర్చారు. వీళ్లు సా.శ.పూ. ఆరు, ఐదు శతాబ్దాల్లో సేవచేశారు. యెహోవా సర్వాధిపత్యాన్ని నమ్మకంగా సమర్థించిన ఈ 12 మంది ప్రవక్తల గురించి, వాళ్లు చేసిన పని గురించి మీరు తెలుసుకుంటుండగా, ఈ కష్ట కాలాల్లో మన పరిచర్యకు ఉపయోగపడే ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటారు. ఆ ప్రవక్తలు సేవచేసిన కాల క్రమంలోనే వాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొండి జనాంగాల్ని రక్షించే ప్రయత్నాలు
7, 8. మనకు దేవుని మీద నమ్మకం తగ్గుతున్నట్టు అనిపించినప్పుడు యోనా అనుభవం మనకెలా ప్రోత్సాహాన్నిస్తుంది?
7 దేవుని మీద నమ్మకం తగ్గుతున్నట్లు, విశ్వాసం క్షీణిస్తున్నట్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలాగైతే, యోనా అనుభవాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఆయన సా.శ.పూ. 9వ శతాబ్దంలో జీవించాడు. అష్షూరు సామ్రాజ్యం అగ్రరాజ్యంగా అవతరిస్తున్న కాలమది. అష్షూరు రాజధాని నీనెవెకు వెళ్లమని దేవుడు యోనాకు చెప్పాడన్న విషయం మీకు తెలిసేవుంటుంది. నీనెవె వాసుల పాపం పండిందని యోనా ప్రకటించాలి. ఆ పట్టణానికి వెళ్లాలంటే యోనా యెరూషలేము నుండి ఈశాన్యం వైపుగా దాదాపు 900 కి.మీ. ప్రయాణించాలి, కానీ ఆయన మరో రేవుకు (బహుశా స్పెయిన్‌లోని ఒక రేవుకు) వెళ్లే ఓడ ఎక్కాడు. అంటే నీనెవెకు వ్యతిరేక దిశలో 3,500 కి.మీ. ప్రయాణానికి సిద్ధమయ్యాడన్నమాట! యోనా పారిపోవడానికి కారణమేమై ఉంటుంది? భయమా? విశ్వాస లోపమా? లేదా నీనెవె వాసులు పశ్చాత్తాపపడి నాశనాన్ని తప్పించేసుకుంటే, వాళ్లు ఇశ్రాయేలీయుల మీద దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి అసలు వాళ్లకు పశ్చాత్తాపపడే అవకాశమే ఇవ్వకూడదనే పంతమా? కారణం ఇదీ, అదీ అనైతే బైబిలు చెప్పడం లేదు. కానీ మన ఆలోచన తప్పుదారి పట్టకుండా ఎందుకు జాగ్రత్తపడాలో యోనా ఉదాహరణ మనకు చూపిస్తోంది.
8 దేవుడు మందలించినప్పుడు యోనా ఎలా స్పందించాడో మనకు తెలుసు. యోనా ఒక పెద్ద చేప కడుపులో ఉండగా ఇలా అన్నాడు: “యెహోవా యొద్దనే రక్షణ దొరుకును.” (యోనా 1:17; 2:1, 2, 9) దేవుడు ఆయనను అద్భుతరీతిలో కాపాడిన తర్వాత, యోనా దేవుడిచ్చిన పనిని పూర్తిచేశాడు. నీనెవె వాసులు యోనా సందేశం విని పశ్చాత్తాపపడడంతో యెహోవా వాళ్లను నాశనం చేయకుండా వదిలేశాడు. దానికి యోనా తీవ్రంగా నిరాశపడ్డాడు. తన పరువే ముఖ్యమనుకున్న యోనాను యెహోవా మళ్లీ ప్రేమతో సరిదిద్దాడు. కొంతమందికి యోనాలో లోపాలే కనబడతాయేమో, కానీ దేవునికి మాత్రం ఆయనలో ఓ విధేయుడు, నమ్మకస్థుడు అయిన సేవకుడు కనబడ్డాడు.—లూకా 11:29.
9. యోవేలు సందేశంలోని ప్రవచనాల నుండి మనం ఏ ప్రయోజనాల్ని పొందవచ్చు?
9 మన బైబిలు సందేశం ప్రజల్లో లేనిపోని భయాల్ని పుట్టిస్తోందని ఎవరైనా విమర్శించినప్పుడు మీకు కోపమొచ్చిందా? యోవేలు ప్రవక్త (ఆ పేరుకు అర్థం, “యెహోవాయే దేవుడు”) సందేశాన్ని కూడా నాటి ప్రజలు అలాగే విమర్శించారు. ఆయన తన ప్రవచనాల్ని రాజైన ఉజ్జియా కాలంలో అంటే దాదాపు సా.శ.పూ. 820లో యూదాలో రాసివుంటాడు. యోనా ప్రవక్త సేవాకాలం ముగుస్తుందనగా యోవేలు ప్రవచించడం ప్రారంభించివుంటాడు. వినాశకర మిడతల దండ్లు వచ్చి దేశాన్ని పాడుచేసే తెగులు గురించి యోవేలు మాట్లాడాడు. ఆ సమయానికి దేవుని భయంకరమైన మహా దినం దగ్గరపడింది. అయితే యోవేలు ప్రకటించిన సందేశం కేవలం నాశనానికి సంబంధించింది మాత్రమే కాదు. విశ్వాసం గలవాళ్లు ‘తప్పించుకుంటారు’ అనే ప్రోత్సాహకరమైన విషయం కూడా ఆయన సందేశంలో ఉంది. (యోవేలు 2:32) పశ్చాత్తాపపడిన వాళ్లు యెహోవా ఆశీర్వాదాన్ని, క్షమాపణను పొందుతామనే విషయం తెలుసుకొని ఆనందించవచ్చు. మన సందేశంలో కూడా ఆ విషయాలు ఉన్నాయని గుర్తుంచుకుంటే మనకెంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! దేవుడు తన చురుకైన శక్తిని, అంటే తన పరిశుద్ధాత్మను “సర్వజనుల మీద” కుమ్మరిస్తాడని యోవేలు ప్రవచించాడు. ఆ ప్రవచన నెరవేర్పులో మీ పాత్ర ఏమిటో అర్థంచేసుకున్నారా? రక్షణకు ఒకేఒక్క మార్గం ఉందని కూడా యోవేలు నొక్కిచెప్పాడు: “యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.”—యోవేలు 2:28, 32.
10. దేవుడు ఓ మామూలు కూలివాణ్ణి ఎలా ఉపయోగించుకున్నాడు?
10 మనం ప్రకటించాల్సిన సందేశం ఎంతో ప్రాముఖ్యమైనదని మనకు అనిపించవచ్చు, కానీ ప్రజలకు అలా అనిపించకపోవచ్చు. ఆమోసు కూడా సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆయన ప్రవక్తల కుటుంబంలో పుట్టలేదు, ప్రవక్తలతో సహవాసమూ చేయలేదు. నిజం చెప్పాలంటే, ఆయన ఓ మామూలు గొర్రెల కాపరి, కొన్ని కాలాల్లో కూలిపని చేసుకునే సాధారణ వ్యక్తి. యూదా రాజైన ఉజ్జియా పరిపాలనలో అంటే సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దం చివర్లో ఆయన ప్రవక్తగా సేవ చేశాడు. ఆమోసు (ఆ పేరుకు అర్థం, “బరువుగా ఉండడం; బరువు మోయడం”) సాదాసీదా కుటుంబం నుండి వచ్చినా యూదా, ఇశ్రాయేలు రాజ్యాలకు, వాటి చుట్టుపక్కల రాజ్యాలకు అతి ముఖ్యమైన సందేశాల్ని ప్రకటించాడు. యెహోవా ఒక సామాన్యుడితో అంత గొప్ప పని చేయించగలడని తెలుసుకోవడం ప్రోత్సాహాన్నిస్తోంది కదా.
11. యెహోవా చిత్తం చేసే విషయంలో హోషేయ ఏమి చేయడానికి సైతం వెనుకాడలేదు?
11 ‘యెహోవా చిత్తం చేయడానికి నేను ఎలాంటి త్యాగాలు చేయగలను?’ అని మీరెప్పుడైనా ఆలోచించారా? దాదాపు 60 ఏళ్లు ప్రవక్తగా సేవ చేసిన హోషేయ గురించి ఆలోచించండి. ఆయన యెషయా, మీకా ప్రవక్తల సమకాలీనుడు. ‘వ్యభిచారం చేసే స్త్రీ’ అయిన గోమెరును పెళ్లి చేసుకోమని యెహోవా హోషేయకు చెప్పాడు. (హోషేయ 1:2) తర్వాత గోమెరు కన్న ముగ్గురు పిల్లల్లో, ఒక్కరే హోషేయకు పుట్టివుంటారు. అంతటి ద్రోహాన్ని, అవమానాన్ని సహించమని యెహోవా హోషేయను ఎందుకు అడిగాడు? ఎందుకంటే నమ్మకత్వం, క్షమాగుణం గురించి యెహోవా ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. భార్య వ్యభిచరించి భర్తకు ద్రోహం చేసినట్లు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు యెహోవా దేవునికి ద్రోహం చేసింది. అయినాసరే, యెహోవా ప్రేమ చూపించాడు, పశ్చాత్తాపపడేలా వాళ్లకు సహాయం చేశాడు. ఆ విషయం మన హృదయాన్ని స్పృశిస్తుంది.
12. మీకా ఆదర్శాన్ని, ఆయన సందేశానికి వచ్చిన స్పందనను పరిశీలిస్తే మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?
12 అపాయకరమైన ఈ కాలాల్లో ధైర్యాన్ని, దేవుని మీద పూర్తి నమ్మకాన్ని పెంచుకోవడం ఓ సవాలే. అయినా ఆ లక్షణాలు చూపిస్తే మనం మీకా ప్రవక్తలా ఉన్నట్టే. ఈయన హోషేయ, యెషయా ప్రవక్తల సమకాలీనుడు. యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల పరిపాలనా కాలంలో అంటే సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో యూదా, ఇశ్రాయేలు రాజ్యాలకు దేవుని సందేశాల్ని మీకా ప్రకటించాడు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు విశృంఖలమైన అనైతికతతో, విగ్రహారాధనతో భ్రష్టుపట్టుకుపోయింది. సా.శ.పూ. 740లో అష్షూరీయులు షోమ్రోనుపై దాడిచేసినప్పుడు ఆ రాజ్యం నాశనమైంది. ఇక యూదా రాజ్యమైతే కొంతకాలం యెహోవాకు విధేయంగా, ఇంకొంతకాలం అవిధేయంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మీకా ప్రకటించిన సందేశం వల్ల, కొంతకాలంపాటు యూదా రాజ్యం ఆధ్యాత్మికంగా భ్రష్టుపట్టకుండా, నాశనమైపోకుండా ఉండగలిగింది. అది మీకాకు ఎంతో ఊరటను ఇచ్చివుంటుంది. మనం ప్రకటించే రక్షణ సందేశానికి కొందరు చక్కగా స్పందించడం చూసినప్పుడు మనకు కూడా ఎంత ఊరట కలుగుతుందో కదా!
ముంచుకురానున్న ముప్పు గురించి ముందే తెలిసింది
13, 14. (ఎ) ఆరాధన విషయంలో జెఫన్యా ఆదర్శం మీకు ఎలా సహాయం చేయగలదు? (బి) జెఫన్యా పని ఎలాంటి ఆధ్యాత్మిక సంస్కరణకు తోడ్పడింది?
13 ప్రపంచ వేదిక మీద నుండి ఐగుప్తు, అష్షూరు ప్రపంచాధిపత్యాలు నిష్క్రమిస్తూ, బబులోను రాజ్యం ప్రపంచాధిపత్యంగా తెరమీదకు వస్తున్న రోజులవి. దాని ఎదుగుదల త్వరలోనే యూదా పాలిట శాపంగా మారనుంది. ఆ సమయంలో యెహోవా తన ఆరాధకుల్ని హెచ్చరించడానికి, వాళ్లకు ఉపదేశించడానికి తన ప్రవక్తల్ని రంగంలోకి దించాడు. ఆ ప్రవక్తల్లాగే మనం కూడా ఓ హెచ్చరికా సందేశాన్ని ప్రకటిస్తున్నామని గుర్తుంచుకొని వాళ్లలో కొందరి గురించి పరిశీలిద్దాం.
14 మీరు యెహోవా చిత్తం చేయడం కోసం కుటుంబ సంప్రదాయాలను వదిలిపెట్టారా? అలాగైతే, మీరు జెఫన్యా పరిస్థితిని బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఈయన హిజ్కియా రాజు మనమడికి మనమడూ, యోషీయా రాజుకు బంధువూ అయ్యుంటాడు. దీన్నిబట్టి జెఫన్యా యూదా రాజ కుటుంబీకుడు అయ్యుండవచ్చు. అయినాసరే జెఫన్యా దేవునికి లోబడి, యూదాలోని అవినీతి పాలనను ఎండగట్టే సందేశాన్ని ప్రకటించాడు. ఆయన పేరుకు “యెహోవా భద్రపరిచాడు” అని అర్థం. కేవలం యెహోవా కనికరం వల్లే ఎవరైనా ‘ఆయన ఉగ్రత దినాన దాచబడతారు’ అని జెఫన్యా నొక్కిచెప్పాడు. (జెఫన్యా 2:3) సంతోషకరమైన విషయం ఏమిటంటే, జెఫన్యా ధైర్యంగా ప్రకటించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. యువ యోషీయా రాజు ఆధ్యాత్మిక సంస్కరణకు నడుం బిగించి విగ్రహాలను పడగొట్టించాడు, ఆలయాన్ని బాగు చేయించాడు, స్వచ్ఛారాధనను పునఃస్థాపించాడు. (2 రాజులు 22-23 అధ్యాయాలు) జెఫన్యా, ఆయన తోటి ప్రవక్తలు (నహూము, యిర్మీయా) రాజుకు తప్పక సహాయం చేసివుంటారు లేదా సలహాలు ఇచ్చివుంటారు. అయితే, చాలామంది యూదులు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడకపోవడం విచారకరమైన విషయం. యోషీయా యుద్ధంలో మరణించిన తర్వాత వాళ్లు మళ్లీ విగ్రహారాధన మొదలుపెట్టారు. కొన్నేళ్లకే, బబులోనీయులు వాళ్లను బందీలుగా తీసుకువెళ్లారు.
15. (ఎ) నహూము ప్రకటించిన తీర్పు సందేశం నీనెవెకు తగినదేనని ఎందుకు చెప్పవచ్చు? (బి) నీనెవెకు జరిగినదాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
15 మీకు ఎలాంటి గుర్తింపూ రాలేదని, మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదని మీరు బాధపడుతుండవచ్చు. అయితే క్రైస్తవులందరికీ ‘దేవుని జతపనివాళ్లుగా’ ఉండే గొప్ప గౌరవం ఉంది. కానీ చాలామందికి నలుగురిలో గుర్తింపు లేదు. (1 కొరింథీయులు 3:9) నహూము విషయం కూడా అంతే, ఆయన ఎల్కోషు (ఇది యూదాలో ఉండివుండవచ్చు) అనే చిన్న పట్టణంలో ఉండేవాడన్న ఒక్క విషయం తప్ప ఆయన గురించి మనకు ఇంకేమీ తెలియదు. అయినా ఆయన సందేశం విలువైనది, ప్రాముఖ్యమైనది. అదెలా? అష్షూరు సామ్రాజ్య రాజధాని నీనెవెకు పట్టే గతి గురించి నహూము ప్రవచించాడు. యోనా ప్రకటించినప్పుడు ఆ పట్టణస్థులు మారినా, కొద్దికాలానికే మళ్లీ పాతబాట పట్టారు. నీనెవె “నరహత్య చేసిన పట్టణము” అని నహూము అన్నాడు, పురాతన నీనెవెలో దొరికిన శిలాఫలకాలు, రాతి శిల్పాలు కూడా ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. (నహూము 3:1) ఆ శిల్పాల్ని చూస్తే, యుద్ధ ఖైదీలను వాళ్లు ఎంత క్రూరంగా హింసించేవాళ్లో తెలుస్తుంది. నీనెవె సమూలంగా నాశనమౌతుందనే విషయాన్ని నహూము నాటకీయంగా వర్ణించాడు. ఆయన చెప్పింది జరిగింది, నేడు మనం ప్రకటించేది కూడా జరిగి తీరుతుంది.
16, 17. అంతం గురించి మనం ఊహించుకున్నవన్నీ ఇంకా జరగకపోతుంటే, హబక్కూకు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
16 శతాబ్దాలుగా, కొంతమంది బైబిలు పాఠకులు యెహోవా దినం గురించి ఎన్నో ఊహించుకున్నారు, అవన్నీ జరగలేదు. ఇంకొంతమందైతే దేవుని తీర్పు ఆలస్యమౌతున్నట్లు అనిపించడం వల్ల విసుగు చెందుతుండవచ్చు. మీకు ఏమనిపిస్తుంది? హబక్కూకు ప్రవక్తకైతే ఇలా అనిపించింది: ‘యెహోవా, నేను మొర్రపెట్టినా నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? ఎక్కడ చూసినా నాశనం, బలాత్కారం అగపడుతున్నాయే?’—హబక్కూకు 1:2, 3.
17 హబక్కూకు ప్రవక్త ఎలాంటి పరిస్థితుల్లో సేవ చేశాడో గమనించండి. మంచి రాజైన యోషీయా పరిపాలన ముగిసింది. సా.శ.పూ. 607 యెరూషలేము నాశనం దగ్గరపడుతోంది. యూదా రాజ్యంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అన్యాయం, బలాత్కారం ఉగ్రరూపం దాల్చాయి. యూదా రాజ్యం ఐగుప్తు పంచన చేరినంత మాత్రాన రక్తపిపాసియైన బబులోను చేతిలోనుండి తప్పించుకోలేదని హబక్కూకు హెచ్చరించాడు. ఆయన వర్ణనాత్మకమైన, శక్తివంతమైన శైలిలో రాస్తూ, ఊరటనిచ్చే ఈ సందేశాన్ని కూడా ఇచ్చాడు: “నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.” (హబక్కూకు 2:4) ఆ మాటలు మనకు చాలా ప్రాముఖ్యం, అందుకే అపొస్తలుడైన పౌలు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని మూడు పుస్తకాల్లో వాటిని ఉల్లేఖించాడు. (రోమీయులు 1:17; గలతీయులు 3:11; హెబ్రీయులు 10:38) అంతేకాదు, హబక్కూకు ద్వారా యెహోవా మనకు ఈ హామీనిస్తున్నాడు: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును . . . జాగుచేయక వచ్చును.”—హబక్కూకు 2:3.
18. ఎదోము మీద తీర్పును ప్రకటించమని యెహోవా ఓబద్యాకు ఎందుకు చెప్పాడు?
18 ఓబద్యా ప్రవక్త రాసిన పుస్తకానికి ఓ ప్రత్యేకత ఉంది. హీబ్రూ లేఖనాల్లో అదే అతి చిన్న పుస్తకం. అందులో అక్షరాలా 21 వచనాలే ఉన్నాయి. ఎదోము మీద దేవుని తీర్పులను ఓబద్యా ప్రవచించాడు, ఆయన గురించి మనకు తెలిసింది అదొక్కటే. ఎదోమీయులు యాకోబు సహోదరుని సంతానం కాబట్టి వాళ్లు ఇశ్రాయేలీయులకు ‘సహోదరులు.’ (ద్వితీయోపదేశకాండము 23:7) కానీ ఎదోమీయులు దేవుని ప్రజలతో ఏనాడూ సోదరభావంతో మెలగలేదు. బహుశా ఓబద్యా తన పుస్తకాన్ని రాసిన సమయంలో అంటే సా.శ.పూ. 607లో శత్రువుల నుండి పారిపోతున్న యూదులను ఈ ఎదోమీయులు దారికాచి మరీ పట్టుకొని బబులోనీయులకు అప్పగించారు. ఎదోము సమూలంగా నాశనమౌతుందని యెహోవా చెప్పాడు, ఆ ప్రవచనం నెరవేరింది. నహూము గురించి మనకు ఎక్కువ వివరాలు తెలియనట్టే ఓబద్యా గురించి కూడా తెలియవు. అయితే అంతగా గుర్తింపులేని వాళ్లను కూడా యెహోవా తన సందేశకులుగా ఉపయోగించుకుంటాడని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహాన్నిస్తుందో కదా!—1 కొరింథీయులు 1:26-29.
చైతన్యవంతుల్ని చేసే, ఊరటనిచ్చే, హెచ్చరించే సందేశాలు
19. దేవుని ప్రజలను బలపర్చడానికి హగ్గయి సందేశం ఎలా తోడ్పడింది?
19 సా.శ.పూ. 537లో నమ్మకమైన యూదా శేషం బబులోను చెర నుండి వచ్చిన తర్వాత ప్రవక్తలుగా సేవచేసిన ముగ్గురిలో హగ్గయి మొదటివాడు. ఆయన బహుశా చెర నుండి వచ్చిన మొదటి గుంపులో ఉండివుంటాడు. పొరుగు రాజ్యాల నుండి వచ్చే వ్యతిరేకతను తట్టుకునేలా, వస్తుసంపదలమీద మోజు వల్ల అలవడిన నిర్లక్ష్య వైఖరిని మార్చుకునేలా యూదుల్లో చైతన్యం తేవడానికి హగ్గయి ప్రయత్నించాడు. తోటి ప్రవక్త జెకర్యా సహకారంతో, దేశాధికారి జెరుబ్బాబెలు, ప్రధానయాజకుడు యెహోషువలతో కలిసి ఆయన ఈ పనిని చేశాడు. యెహోవా ఆలయాన్ని మళ్లీ కట్టడానికే యూదులు తిరిగి వచ్చారు కాబట్టి వాళ్లు ఆ పనిని పూర్తి చేయాలి. సా.శ.పూ. 520లో హగ్గయి ప్రకటించిన నాలుగు సూటైన సందేశాలు యెహోవా నామాన్ని, సర్వాధిపత్యాన్ని ఉన్నతపర్చాయి. మూలభాషలోని హగ్గయి పుస్తకంలో “సైన్యములకు అధిపతియగు యెహోవా” అనే మాట 14 సార్లు ఉంది. హగ్గయి శక్తిమంతమైన సందేశాలు ఆలయ నిర్మాణాన్ని తిరిగి చేపట్టేలా ప్రజలకు ఊపునిచ్చాయి. సర్వోన్నత పాలకునిగా యెహోవాకు అంతులేని శక్తి ఉందని, కోట్లాది ఆత్మప్రాణులతో కూడిన సైన్యాలు ఆయన చేతి కింద ఉన్నాయని తెలుసుకోవడం మీకు బలాన్ని ఇవ్వడం లేదా?—యెషయా 1:24; యిర్మీయా 32:17, 18.
20. ప్రజల్లో ఉన్న ఏ వైఖరిని తీసివేయడానికి జెకర్యా కృషిచేశాడు?
20 దేవుని సేవకుల్లోని కొందరికి సేవచేయాలనే ఆసక్తి లేకపోవడం చూసి కొన్నిసార్లు మీకు నిరుత్సాహం కలగవచ్చు. అదే నిజమైతే మీరు జెకర్యా ప్రవక్త భావాలను బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఈయన కూడా తన సమకాలీనుడైన హగ్గయి చేసిన పనే చేశాడు, ఆలయ నిర్మాణపని పూర్తయ్యేవరకు ఆ పనిలో నిరాటంకంగా కొనసాగమని తోటి ఆరాధకులను ప్రోత్సహించే బరువైన బాధ్యతను చేపట్టాడు. ఆ బృహత్కార్యం ఆగకుండా సాగేలా వాళ్లను బలపర్చడానికి జెకర్యా ఎంతో శ్రమించాడు. సుఖభోగాల్లో మునిగితేలుతున్న ఆ ప్రజల్లో దృఢమైన విశ్వాసాన్ని రగిలించడానికి, దానికి తగ్గ పనులు చేసేలా వాళ్లను కదిలించడానికి ఆయన కృషిచేశాడు. ఆయన కృషి ఫలించింది. క్రీస్తుకు సంబంధించిన ఎన్నో ప్రవచనాలను కూడా జెకర్యా రాశాడు. “సైన్యములకు అధిపతియగు యెహోవా” తన అనుగ్రహం కోసం ప్రయత్నించేవాళ్లను మర్చిపోడనే సందేశం మనల్ని కూడా బలపరుస్తుంది.—జెకర్యా 1:3.
మెస్సీయ కోసం ఎదురుచూపు
21. (ఎ) మలాకీ యెహోవా సందేశాన్ని ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? (బి) మలాకీ రాసిన ఏ ప్రోత్సాహకరమైన హామీతో హీబ్రూ లేఖనాలు ముగుస్తాయి?
21 పన్నెండుమంది ప్రవక్తల్లో చివరివాడైన మలాకీ, పేరుకు తగ్గట్లు జీవించాడు. ఆయన పేరుకు, “నా సందేశకుడు” అని అర్థం. సా.శ.పూ. ఐదవ శతాబ్దం మధ్యభాగంలో జీవించిన ఈ ప్రవక్త గురించి మనకు తెలిసింది తక్కువే. అయినా, ఆయన రాసిన ప్రవచన పుస్తకం చదివితే దేవుని ప్రజల పాపాల్ని, వేషధారణను ధైర్యంగా ఖండించిన ఓ ప్రవక్త ఆయనలో మనకు కనిపిస్తాడు. మలాకీ వర్ణించిన పరిస్థితులకు, నెహెమ్యా ఇచ్చిన వివరాలకు చాలా పోలికలున్నాయి. బహుశా వీళ్లిద్దరూ సమకాలీనులు అయ్యుంటారు. ఇంతకీ, మలాకీ యెహోవా సందేశాన్ని ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కొన్ని దశాబ్దాల క్రితం జెకర్యా, హగ్గయి ప్రవక్తలు ప్రజల్లో నింపిన ఆసక్తి, ఉత్సాహం ఇప్పుడు కనుమరుగయ్యాయి. యూదుల ఆధ్యాత్మిక స్థితి అట్టడుగు స్థాయికి చేరుకుంది. వేషధారులైన పొగరుబోతు యాజకులను మలాకీ ధైర్యంగా ఖండించాడు. ప్రజలు అర్థ హృదయంతో చేస్తున్న ఆరాధనను, వాళ్లు అర్పిస్తున్న బలులను ఆయన తీవ్రంగా విమర్శించాడు. అంతేకాదు, భవిష్యత్తు కోసం ఆశగా ఎదురుచూడవచ్చని దేవుని వాక్యం మనకు భరోసా ఇస్తున్నట్లే, మలాకీ కూడా మెస్సీయకు మార్గం సిద్ధపర్చడానికి రానున్న బాప్తిస్మమిచ్చు యోహాను గురించి, ఆ తర్వాత క్రీస్తు రాక గురించి ప్రవచించాడు. యెహోవా నామమంటే భయభక్తులు ఉన్నవాళ్ల మీద “నీతి సూర్యుడు ఉదయించును” అని మలాకీ రాసిన ప్రోత్సాహకరమైన హామీతో హీబ్రూ లేఖనాలు ముగుస్తాయి.—మలాకీ 4:2, 5, 6.
22. ఆ 12 మంది ప్రవక్తల లక్షణాలు, సందేశాల గురించి మీరు ఏమి గమనించారు?
22 హీబ్రూ లేఖనాల్లోని చివరి 12 పుస్తకాలను రాసిన ప్రవక్తల్లో విశ్వాసం, దృఢనిశ్చయత ఉన్నాయని మీరు గమనించవచ్చు. (హెబ్రీయులు 11:32; 12:1, 2) మనం “ప్రభువు [యెహోవా, NW] దినము” కోసం ఆశగా ఎదురుచూస్తుండగా వాళ్ల ఆదర్శం నుండి, సందేశం నుండి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. (2 పేతురు 3:10) ఈ ప్రవచనాత్మక సందేశాలు మీ నిరంతర భవిష్యత్తు మీద ఎలా ప్రభావం చూపిస్తాయో పరిశీలించండి.
a ఈ విషయాన్ని 20, 21 పేజీల్లోని కాలరేఖలో చూడండి. ఉదాహరణకు, యెషయా యెరూషలేములో దేవుని ప్రవక్తగా ఉన్న రోజుల్లో మీకా, హోషేయలు ప్రవక్తలుగా సేవ చేశారని మీరు గమనిస్తారు.