కంటెంట్‌కు వెళ్లు

యెహోవా సాక్షులు ఏమి నమ్ముతారు?

యెహోవా సాక్షులు ఏమి నమ్ముతారు?

యెహోవా సాక్షులు ఏమి నమ్ముతారు?

“అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము; ఈ మత భేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు, ఇంతమట్టుకు మాకు తెలియును.” (అపొస్తలుల కార్యములు 28:22) రోమునందలి మొదటి శతాబ్దపు ఈ సమాజ నాయకులు ఒక మంచి మాదిరినుంచారు. బయటి విమర్శకుల నుండి మాత్రమేగాక, దానిని అభ్యసించేవారి నుండే వారు విషయాన్ని వినగోరారు.

అలాగే, ఈనాడు యెహోవాసాక్షులను గూర్చి తరచు వ్యతిరేకంగా మాట్లాడటం జరుగుతుంది. అందుచేత వారిని గూర్చిన నిజాన్ని తెలుసుకొనడానికి, ఇతర దురభిమాన మూలాలను ఆశ్రయించటం సబబు కాదు. అందువలన మా ప్రాథమిక నమ్మకాలను కొన్నింటిని మీకు వివరించడానికి మేము సంతోషిస్తున్నాము.

బైబిలు, యేసుక్రీస్తు, దేవుడు

లేఖనములన్ని “దైవావేశమువలన కలిగినవని . . . ప్రయోజనకరమైనవని” మేము నమ్ముతాము. (2 తిమోతి 3:16) మేము నిజంగా క్రైస్తవులము కామని కొందరు మమ్మల్ని గూర్చి అన్నను, ఒక్క మాటలో చెప్పాలంటే అది నిజం కాదు. అపొస్తలుడైన పేతురు యేసుక్రీస్తును గూర్చి ఇచ్చిన సాక్ష్యముతో మేము పూర్తిగా ఏకీభవిస్తాము. అదేమనగా: “ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.”—అపొస్తలుల కార్యములు 4:12.

అయినను, యేసుక్రీస్తే నేను “దేవుని కుమారుడను,” “తండ్రి నన్ను పంపెను” అని చెప్పినందున దేవుడు యేసుక్రీస్తుకంటె గొప్పవాడని యెహోవాసాక్షులు నమ్ముతారు. (యోహాను 10:35; 6:57) యేసుక్రీస్తే స్వయంగా “తండ్రి నాకంటె గొప్పవాడు” అని తెలియపరచాడు. (యోహాను 14:28; 8:28) అందుచేత త్రిత్వ సిద్ధాంతము చెప్పునట్లు, యేసు తండ్రితో సమానుడని మేము నమ్మము. బదులుగా ఈయన దేవునిచేత సృష్టించబడ్డాడని, ఆయనకంటె క్రిందివాడైయున్నాడని మేము నమ్ముతాము.—కొలొస్సయులు 1:15; 1 కొరింథీయులు 11:3.

తెలుగు భాషలో, దేవుని పేరు యెహోవా. బైబిలు ఇలా చెబుతుంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.” (కీర్తన 83:18, కింగ్‌ జేమ్సు వర్షన్‌) ఈ బావ ప్రకటనకు పొందికగా దేవుని నామమునకు గొప్ప ప్రాధాన్యతనిస్తూ, యేసు తన అనుచరులకు ఇలా ప్రార్థించమని బోధించెను: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” ఆయనమట్టుకు ఆయనే దేవునికి ఇలా ప్రార్థించెను: “లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని.”—మత్తయి 6:10; యోహాను 17:6.

యెహోవాసాక్షులు దేవుని నామమును ఆయన సంకల్పాలను యితరులకు తెలియజేయుటలో యేసుక్రీస్తువలె తామును ఉండాలని నమ్ముతారు. మేము “నమ్మకమైన సాక్షి” యగు యేసును అనుకరిస్తాము గనుకనే యెహోవాసాక్షులు అనే పేరు పెట్టుకున్నాము. (ప్రకటన 1:5; 3:14) అందుకు తగినట్లే దేవునికి ప్రతినిధులుగా ఉన్న ప్రజలతో యెషయా 43:10 ఇలా చెబుతుంది: “‘మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును, ‘నాకు సాక్షులు’ . . . ఇదే యెహోవా వాక్కు.’”

దేవుని రాజ్యము

యేసు తన అనుచరులతో, “నీ రాజ్యము వచ్చుగాక” అని ప్రార్థించమని బోధించి, ఆ రాజ్యాన్ని తన బోధయొక్క ప్రధానాంశంగా చేశాడు. (మత్తయి 6:10; లూకా 4:43) ఆ రాజ్యము పరలోకములో ఉండే నిజమైన ప్రభుత్వమని, అది భూమిని పరిపాలిస్తుందని, యేసుక్రీస్తు దాని నియమిత అదృశ్య రాజని యెహోవాసాక్షులు నమ్ముతారు. “ఆయన భుజముమీద ప్రభుత్వముండునని”, “ఇది మొదలుకొని మితిలేకుండ ఆయన ప్రభుత్వమునకు వృద్ధియు, క్షేమమును కలుగునని బైబిలు చెబుతుంది.”—యెషయా 9:6, 7, KJ.

అయినను, దేవుని ప్రభుత్వమునకు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే రాజు కాదు. పరలోకములో ఆయనకు అనేకమంది సహపరిపాలకులు ఉంటారు. “సహించినవారమైతే, ఆయనతో కూడ ఏలుదుము” అని అపొస్తలుడైన పౌలు వ్రాసెను. (2 తిమోతి 2:12) క్రీస్తుతోపాటు పరలోకములో పరిపాలించుటకు పునరుత్థానము చేయబడు మానవులు, “భూలోకములోనుండి కొనబడిన . . . నూట నలువది నాలుగువేలమంది” కే పరిమితమైయున్నారని బైబిలు చూపుతుంది.—ప్రకటన 14:1, 3.

అవును, ఏ ప్రభుత్వానికైనా పాలించబడే ప్రజలు ఉండి తీరాల్సిందే. ఈ పరలోక పరిపాలకులతోపాటు, ఇంకా కోట్లాదిమంది నిత్యజీవము పొందుతారని యెహోవాసాక్షులు నమ్ముతున్నారు. చివరకు ఈ భూమి అందమైన పరదైసుగా మారుతుంది, దేవుని రాజ్యములో ఉండే యోగ్యతగల పౌరులతో అది నిండిపోతుంది. వారంతా క్రీస్తుకు, ఆయన సహపరిపాలకులకు లోబడివుంటారు. కావున ఈ భూమి ఎన్నటికి నాశనము చేయబడదని, “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” అను బైబిలు ప్రమాణము నెరవేరుతుందని యెహోవాసాక్షులు దృఢంగా నమ్ముతారు.—కీర్తన 37:29; 104:5.

అయితే దేవుని రాజ్యము ఎలా వస్తుంది? ప్రజలంతా స్వచ్ఛందంగా దేవుని ప్రభుత్వానికి లోబడుట మూలంగా వస్తుందా? అందుకు భిన్నంగా, ఆ రాజ్యము రావాలంటే దేవుడు భూవ్యవహారాలల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవలసిన అవసరముందని బైబిలు వాస్తవ రూపంలో ఇలా చూపుతుంది: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, . . . అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయునుగాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.

దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నెరవేరుతున్న బైబిలు ప్రవచనాల ఆధారంగా అది అతి త్వరలో వస్తుందని యెహోవాసాక్షులు నమ్ముతున్నారు. ఈ దుష్టవిధానము యొక్క “అంత్యదినముల” వైఖరులను తెల్పుతున్న ప్రవచనాలను కొన్నింటిని పరిశీలించమని మేము మిమ్ముల నాహ్వానిస్తున్నాము. అవి మత్తయి 24:3-14; లూకా 21:7-13; 25-31; మరియు 2 తిమోతి 3:1-5 లందు వ్రాయబడినవి.

మేము ‘మా దేవుడైన యెహోవాను పూర్ణ హృదయము, ఆత్మ, మనస్సు, బలముతోను, మావలె మా పొరుగువారిని ప్రేమిస్తాము,’ గనుకనే మేము దేశపరంగా, జాతిపరంగా, సాంఘికంగా విభాగించబడకయున్నాము. (మార్కు 12:30, 31) అన్ని దేశాలలోనున్న మా క్రైస్తవ సహోదరుల మధ్య కనిపిస్తున్న ప్రేమనుబట్టి మేము స్పష్టంగా గుర్తించబడుతున్నాము. (యోహాను 13:35; 1 యోహాను 3:10-12) ఆవిధంగా మేము దేశ రాజకీయ వ్యవహారములయెడల తటస్థతను వహిస్తాము. “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు” అని యేసు తన తొలి శిష్యులనుగూర్చి చెప్పినట్లే మేమును ఉండ ప్రయత్నిస్తున్నాము. (యోహాను 17:16) లోకమునకు వేరైయుండటమంటే నేడు సర్వసాధారణమైయున్న అవినీతి ప్రవర్తనను, అనగా అబద్ధము, దొంగతనము, వ్యభిచారము, జారత్వము, సలింగ సంయోగము, రక్త దుర్వినియోగము, విగ్రహారాధన, మరియు బైబిలులో ఖండించబడిన అటువంటి ఇతర విషయాలను విసర్జించడం అని మేము నమ్ముతాము.—1 కొరింథీయులు 6:9-11; ఎఫెసీయులు 5:3-5; అపొస్తలుల కార్యములు 15:28, 29.

భవిష్యత్‌ నిరీక్షణ

ఈ లోకమందున్న ప్రస్తుత జీవితమే సర్వస్వం కాదని యెహోవాసాక్షులు నమ్ముతున్నారు. మానవులు దేవునియెదుట నీతియుక్తమైన స్థానమును సంపాదించుకొని, నూతన విధానములో నిత్యజీవమును పొందేలా క్రీస్తు తన ప్రాణరక్తాన్ని విమోచన క్రయధనముగా ధారపోయుటకే యెహోవా ఆయనను భూమిమీదికి పంపెనని మేము నమ్ముతాము. యేసు అపొస్తలుడొకరు చెప్పినట్లు: “ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి” ఉన్నాము. (రోమీయులు 5:9; మత్తయి 20:28) యెహోవాసాక్షులు భవిష్యత్తు జీవితమును సాధ్యపరచే ఈ విమోచన ఏర్పాటునుబట్టి దేవునికిని ఆయన కుమారునికిని ఎంతో కృతజ్ఞులైయున్నారు.

దేవుని రాజ్యములో కలుగబోవు మృతుల పునరుత్థానము ఆధారంగా యెహోవాసాక్షులకు భవిష్యత్‌ జీవితముపై పూర్తి నమ్మకమున్నది. బైబిలు బోధించునట్లు ఒకవ్యక్తి చనిపోయినప్పుడు తన ఉనికిని కోల్పోతాడని, “అతని సంకల్పములు నాడే నశించు”నని మేము నమ్ముతాము. (కీర్తన 146:3, 4; యెహెజ్కేలు 18:4; ప్రసంగి 9:5) అవును, మృతుల భవిష్యత్‌ జీవితము దేవుడు వారిని పునరుత్థానములో జ్ఞాపకంచేసుకొనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.—యోహాను 5:28, 29.

అయినా, దేవుని రాజ్యము ప్రస్తుత ప్రభుత్వములన్నిటిని నాశనము చేయునప్పుడు, నేడు జీవించు అనేకులు నోవహు ఆయన కుటుంబము జలప్రళయములో రక్షించబడినట్లే రక్షించబడి, శుభ్రపరచబడిన భూమిపై జీవితమును నిరంతరము అనుభవించుటకు జీవించుదురను దృఢనమ్మకాన్ని యెహోవాసాక్షులు కలిగియున్నారు. (మత్తయి 24:36-39; 2 పేతురు 3:5-7, 13) అయితే బైబిలు చెప్పునట్లు, రక్షించబడటం యెహోవా విధులను గైకొనే దానిపై ఆధారపడివుంటుందని మేము నమ్ముతాము. బైబిలిట్లు చెప్పుచున్నది: “లోకము. . . గతించిపోవుచున్నది గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 యోహాను 2:17; కీర్తన 37:11; ప్రకటన 7:9, 13-15; 21:1-5.

యెహోవాసాక్షుల నమ్మకాలన్నింటిని ఇక్కడ వివరించటం నిజంగా సాధ్యము కాదు. మిగతా సమాచారమును పొందమని మేము మిమ్ముల ఆహ్వానిస్తున్నాము.

ప్రత్యేకముగా సూచించబడని లేఖనములు బైబిలు సొసైటి ఆఫ్‌ ఇండియా బెంగుళూరు వారి తెలుగు బైబిలు నుండి వ్రాయబడినవి.

[4వ పేజీలోని చిత్రం]

మేము యేసును అనుకరిస్తాము గనుకనే యెహోవాసాక్షులు అనే పేరు పెట్టుకున్నాము