కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

48వ అధ్యాయం

అద్భుతాలు చేశాడు, నజరేతులో తిరస్కరించబడ్డాడు

అద్భుతాలు చేశాడు, నజరేతులో తిరస్కరించబడ్డాడు

మత్తయి 9:27-34 13:54-58 మార్కు 6:1-6

  • యేసు ఇద్దరు గుడ్డివాళ్లను, మాట్లాడలేని వ్యక్తిని బాగుచేశాడు

  • నజరేతు ప్రజలు ఆయన్ని తిరస్కరించారు

యేసుకు ఆ రోజంతా తీరిక లేదు. ఆయన దెకపొలి ప్రాంతం నుండి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత రక్తస్రావం ఉన్న స్త్రీని బాగుచేశాడు, యాయీరు కూతుర్ని బ్రతికించాడు. అయితే, ఆ రోజు ఆయన వేరే అద్భుతాలు కూడా చేశాడు. ఆయన యాయీరు ఇంటి నుండి వెళ్తున్నప్పుడు, ఇద్దరు గుడ్డివాళ్లు ఆయన వెనకాలే వెళ్తూ “దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు” అని అరుస్తూ ఉన్నారు.—మత్తయి 9:27.

వాళ్లు యేసును “దావీదు కుమారుడా” అని పిలవడం ద్వారా ఆయన దావీదు సింహాసనానికి వారసుడని, మెస్సీయ అని తాము నమ్ముతున్నట్లు చూపించారు. యేసు ఏమీ వినిపించనట్టు అక్కడి నుండి ముందుకు వెళ్లాడు. వాళ్లకు పట్టుదల ఉందో లేదో చూడడానికి ఆయన అలా చేసివుంటాడు. అయితే వాళ్లు పట్టువదల్లేదు. యేసు ఒక ఇంట్లోకి వెళ్లినప్పుడు, వాళ్లిద్దరు ఆయన వెనకే ఆ ఇంట్లోకి వెళ్లారు. అప్పుడు యేసు వాళ్లను, “నేను మీకు చూపు తెప్పించగలనని మీకు విశ్వాసం ఉందా?” అని అడిగాడు. వాళ్లు గట్టి నమ్మకంతో, “ఉంది ప్రభువా” అన్నారు. దాంతో యేసు వాళ్ల కళ్లు ముట్టుకొని, “మీ విశ్వాసం ప్రకారమే మీకు జరగాలి” అన్నాడు.—మత్తయి 9:28, 29.

వెంటనే వాళ్లకు చూపు వచ్చింది! జరిగింది ఇతరులకు చెప్పొద్దని ఆయన ఎప్పటిలాగే వాళ్లకు ఆజ్ఞాపించాడు. కానీ, వాళ్లు సంతోషం పట్టలేక అన్నిచోట్ల ఆయన గురించి చెప్పారు.

ఆ ఇద్దరు మనుషులు వెళ్లిపోతుండగా, ప్రజలు యేసు దగ్గరికి చెడ్డదూత పట్టడం వల్ల మాట్లాడలేకపోతున్న ఒకతన్ని తీసుకొచ్చారు. యేసు చెడ్డదూతను వెళ్లగొట్టిన వెంటనే అతనికి మాటలు వచ్చాయి. ప్రజలు ఆశ్చర్యంతో, “మనం ఇశ్రాయేలులో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదే” అన్నారు. ఆ సమయంలో పరిసయ్యులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్లు ఆ అద్భుతాల్ని కాదనలేక, సాతాను శక్తితోనే యేసు వాటిని చేస్తున్నాడని మళ్లీ నిందించారు. వాళ్లు ఇలా అన్నారు: “ఇతను చెడ్డదూతల నాయకుడి సహాయంతోనే చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నాడు.”—మత్తయి 9:33, 34.

తర్వాత, శిష్యులతో కలిసి యేసు తన సొంతూరు నజరేతుకు బయల్దేరాడు. దాదాపు ఒక సంవత్సరం క్రితం ఆయన అక్కడి సమాజమందిరంలో బోధించాడు. అక్కడి ప్రజలు ఆయన బోధలకు మొదట ఆశ్చర్యపోయినా, తర్వాత కోపంతో ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు. ఇప్పుడు యేసు తన సొంతూరి ప్రజలకు సహాయం చేయడానికి మరోసారి ప్రయత్నించాడు.

విశ్రాంతి రోజున, యేసు మళ్లీ సమాజమందిరానికి వెళ్లి బోధించాడు. అప్పుడు చాలామంది ఆశ్చర్యపోయి ఇలా అన్నారు: “ఇతనికి ఈ తెలివి, శక్తివంతమైన పనులు చేసే ఈ సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చాయి? ఇతను వడ్రంగి కుమారుడే కదా? ఇతని తల్లి పేరు మరియే కదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా ఇతని తమ్ముళ్లే కదా? ఇతని చెల్లెళ్లంతా మనతోనే ఉన్నారు కదా? మరి ఇతనికి ఈ సామర్థ్యమంతా ఎక్కడి నుండి వచ్చింది?”—మత్తయి 13:54-56.

వాళ్లు యేసును కేవలం తమ ఊరివాడిగానే చూశారు. ‘ఈయన మనముందే పెరిగాడు, ఈయన మెస్సీయ ఎలా అవ్వగలడు?’ అని వాళ్లు అనుకున్నారు. అందుకే, యేసు ఎంత తెలివిగా బోధిస్తున్నా, ఎన్ని అద్భుతాలు చేస్తున్నా వాళ్లు ఆ రుజువుల్ని పట్టించుకోలేదు, ఆయన్ని నమ్మలేదు. యేసు గురించి బాగా తెలిసిన బంధువులు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. అందుకే, యేసు ఇలా అన్నాడు: “ఒక ప్రవక్తను సొంత ఊరివాళ్లు, ఇంటివాళ్లు తప్ప అందరూ గౌరవిస్తారు.”—మత్తయి 13:57.

వాళ్లకు విశ్వాసం లేకపోవడం చూసి యేసు ఆశ్చర్యపోయాడు. కాబట్టి ఆయన, “కొందరు రోగుల మీద చేతులుంచి బాగుచేయడం తప్ప మరే శక్తివంతమైన పనీ” అక్కడ చేయలేదు.—మార్కు 6:5, 6.