కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

56వ అధ్యాయం

ఒక మనిషిని నిజంగా ఏవి అపవిత్రం చేస్తాయి?

ఒక మనిషిని నిజంగా ఏవి అపవిత్రం చేస్తాయి?

మత్తయి 15:1-20 మార్కు 7:1-23 యోహాను 7:1

  • యేసు మనుషుల ఆచారాల్ని బట్టబయలు చేశాడు

సా.శ. 32 పస్కా దగ్గరపడుతుండగా యేసు గలిలయలో విస్తృతంగా బోధిస్తున్నాడు. తర్వాత, ధర్మశాస్త్రం చెప్తున్నట్లు పస్కా పండుగ ఆచరించడానికి ఆయన యెరూషలేముకు వెళ్లివుంటాడు. అయితే యూదులు తనను చంపాలనుకుంటున్నారు కాబట్టి యేసు అక్కడికి చాలా జాగ్రత్తగా వెళ్లాడు. (యోహాను 7:1) తర్వాత ఆయన గలిలయకు తిరిగొచ్చాడు.

యెరూషలేము నుండి పరిసయ్యులు, శాస్త్రులు యేసు కోసం వచ్చారు. అప్పుడు యేసు బహుశా కపెర్నహూములో ఉండివుంటాడు. వాళ్లు ఎందుకు అంత దూరం ప్రయాణించి వచ్చారు? ఆయన మీద ఏదైనా మతపరమైన ఆరోపణ చేయాలని వాళ్లు చూస్తున్నారు. వాళ్లు ఆయన్ని ఇలా అడిగారు: “నీ శిష్యులు పూర్వీకుల ఆచారాన్ని ఎందుకు మీరుతున్నారు? ఉదాహరణకు, వాళ్లు భోంచేసే ముందు చేతులు కడుక్కోవట్లేదు.” (మత్తయి 15:2) నిజానికి, ఒక ఆచారంలా ‘మోచేతుల వరకు చేతులు కడుక్కోమని’ దేవుడు తన ప్రజలకు ఎప్పుడూ చెప్పలేదు. (మార్కు 7:3) కానీ అలా చేయకపోతే, పరిసయ్యులు దాన్ని ఒక పెద్ద నేరంగా చూసేవాళ్లు.

యేసు వాళ్ల ఆరోపణకు సూటిగా జవాబిచ్చే బదులు, పరిసయ్యులు కావాలనే దేవుని ధర్మశాస్త్రాన్ని ఎలా మీరుతున్నారో చెప్పాడు: “మీరు మీ ఆచారం కోసం దేవుని ఆజ్ఞను ఎందుకు మీరుతున్నారు? ఉదాహరణకు, ‘మీ అమ్మానాన్నల్ని గౌరవించు’ అని, ‘అమ్మనైనా, నాన్ననైనా తిట్టేవాడికి మరణశిక్ష విధించాలి’ అని దేవుడు చెప్పాడు. మీరేమో, ‘ఒక వ్యక్తి వాళ్ల అమ్మతో గానీ, నాన్నతో గానీ, “నా వల్ల మీరు పొందగలిగే సహాయాన్ని నేను ఇప్పటికే దేవునికి అర్పించేశాను” అని చెప్తే అతను వాళ్ల అమ్మానాన్నల్ని గౌరవించాల్సిన అవసరమే లేదు’ అని అంటారు.”—మత్తయి 15:3-6; నిర్గమకాండం 20:12; 21:17.

ఒక వ్యక్తి డబ్బును, ఆస్తిని, ఇంకా దేన్నైనా దేవునికి కానుకగా సమర్పిస్తే అవి ఆలయానికి చెందుతాయని, కాబట్టి వాటిని వేరే పనికి వాడకూడదని పరిసయ్యులు చెప్పేవాళ్లు. కానీ నిజానికి అవి ఇంకా ఆ వ్యక్తి దగ్గరే ఉండేవి. ఒక వ్యక్తి తన డబ్బు లేదా ఆస్తి “కొర్బాను” [దేవునికి లేదా ఆలయానికి సమర్పించిన కానుక] అని అంటే, దాన్ని తన తల్లిదండ్రుల కోసం కాకుండా ఆలయానికే ఉపయోగిస్తానని చెప్తున్నట్లు. ఆ డబ్బును లేదా ఆస్తిని అతను ఇంకా వాడుకుంటూనే ఉంటాడు కానీ, వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి మాత్రం ఉపయోగించడు. అలా అతను తల్లిదండ్రుల్ని చూసుకునే బాధ్యత నుండి తప్పించుకునేవాడు.—మార్కు 7:11.

వాళ్లు అలా దేవుని ధర్మశాస్త్రాన్ని వక్రీకరిస్తున్నందుకు యేసు కోపంతో ఇలా అన్నాడు: “మీరు మీ ఆచారంతో దేవుని వాక్యాన్ని నీరుగార్చారు. వేషధారులారా, మీ గురించి యెషయా సరిగ్గానే ఇలా చెప్పాడు: ‘ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ వీళ్ల హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. వీళ్లు మనుషుల ఆజ్ఞల్ని దేవుని బోధలన్నట్టు బోధిస్తారు కాబట్టి వీళ్లు నన్ను ఆరాధిస్తూ ఉండడం వృథా.’” యేసు తీవ్రంగా విమర్శించడంతో పరిసయ్యులు ఇంకేం మాట్లాడలేకపోయారు. అప్పుడు యేసు ప్రజల్ని తన దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు: “నేను చెప్పేది వినండి, అర్థంచేసుకోండి. నోట్లోకి వెళ్లేది మనిషిని అపవిత్రం చేయదు కానీ, నోటి నుండి వచ్చేదే మనిషిని అపవిత్రం చేస్తుంది.”—మత్తయి 15:6-11; యెషయా 29:13.

తర్వాత ఒక ఇంట్లో ఉన్నప్పుడు శిష్యులు యేసును, “నీ మాటలు పరిసయ్యులకు కోపం తెప్పించాయని నీకు తెలుసా?” అని అడిగారు. దానికి యేసు, “పరలోకంలో ఉన్న నా తండ్రి నాటని ప్రతీ మొక్క పెరికేయబడుతుంది. వాళ్లను పట్టించుకోకండి. వాళ్లే గుడ్డివాళ్లు, అలాంటిది వాళ్లు ఇతరులకు దారి చూపిస్తారు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే, వాళ్లిద్దరూ గుంటలో పడతారు” అన్నాడు.—మత్తయి 15:12-14.

తర్వాత, మనుషుల్ని అపవిత్రం చేసేవేంటో వివరించమని పేతురు శిష్యుల తరఫున యేసును అడిగాడు. పేతురు అలా అడిగినందుకు యేసు ఆశ్చర్యపోయి ఇలా వివరించాడు: “మీకు తెలీదా, నోట్లోకి వెళ్లే ప్రతీది కడుపులోకి వెళ్లి తర్వాత బయటికి వచ్చేస్తుంది. అయితే నోటి నుండి వచ్చే ప్రతీది హృదయంలో నుండి వస్తుంది, అదే మనిషిని అపవిత్రం చేస్తుంది. ఉదాహరణకు దుష్ట ఆలోచనలు, అంటే హత్యలు, అక్రమ సంబంధాలు, లైంగిక పాపాలు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు హృదయంలో నుండే వస్తాయి. ఇవే మనిషిని అపవిత్రం చేస్తాయి, అంతేగానీ చేతులు కడుక్కోకుండా భోంచేయడం మనిషిని అపవిత్రం చేయదు.”—మత్తయి 15:17-20.

శుభ్రంగా ఉండాల్సిన అవసరం లేదని గానీ, వంట చేసే ముందు, భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాల్సిన అవసరం లేదని గానీ యేసు చెప్పట్లేదు. బదులుగా, మనుషుల ఆచారాల కోసం దేవుని నీతి సూత్రాల్ని పక్కన పెడుతున్న మతనాయకుల వేషధారణను ఆయన ఖండిస్తున్నాడు. నిజానికి, ఒక వ్యక్తి హృదయంలో పుట్టే ఆలోచనలు, వాటివల్ల చేసే చెడ్డ పనులే అతన్ని అపవిత్రం చేస్తాయి.